రిస్క్‌కొద్దీ రాబడి.. | every risk has income | Sakshi
Sakshi News home page

రిస్క్‌కొద్దీ రాబడి..

Published Sun, Nov 16 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

రిస్క్‌కొద్దీ రాబడి..

రిస్క్‌కొద్దీ రాబడి..

సాధారణంగా స్టాక్ మార్కెట్ ర్యాలీలో అన్ని రంగాలు, అన్ని షేర్లు పాలు పంచుకోవు. కొన్ని రంగాలు ఎక్కువగా పెరిగితే మరికొన్ని తక్కువ పెరగడం లేదా నష్టాలను అందించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుత ర్యాలీ కూడా ఇందుకు భిన్నం కాదు. తాజాగా మొదలైన ఈ ర్యాలీలో ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఇండెక్స్‌ల కంటే అధికరాబడులను అందిస్తుంటే టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇండెక్స్‌ల కంటే తక్కువ రాబడులను అందించాయి.

గతేడాది కాలంలో నిఫ్టీ ఇండెక్స్ 39 శాతం లాభాలను అందించగా, ఇదే సమయంలో ఇన్‌ఫ్రా ఫండ్స్ 82నుంచి 98 శాతం లాభాలను సాధించాయి. అలాగే బ్యాంకింగ్ ఫండ్స్ 62 నుంచి 70 శాతం పెరిగితే, ఫార్మా ఫండ్స్ 52 నుంచి 62 శాతం శాతం వృద్ధి చెందాయి. కానీ థీమటిక్ కోవకు చెందిన గోల్డ్ ఫండ్స్ 10 నుంచి 13 శాతం నష్టాలను అందిస్తే, ఇంటర్నేషనల్ ఫండ్స్ 10 నుంచి 24 శాతం, అసెట్ అలకేషన్ ఫండ్స్ 22 నుంచి 47 శాతం, ఎఫ్‌ఎంసీజీ 32 నుంచి 36 శాతం లాభాలను అందించాయి.

 పనితీరు భిన్నం..
 సాధారణ ఈక్విటీ ఫండ్స్ విభిన్న రంగాలకు చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిని డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ అంటారు. కాని సెక్టోరల్/థీమటిక్ ఫండ్స్ పనితీరు దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇవి కేవలం ఒకే రంగానికి లేదా థీమ్‌కు చెందిన వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ ఫండ్స్‌నే తీసుకుంటే ఇవి కేవలం బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లలోనే ఇన్వెస్ట్‌చేస్తాయి. ఇలా ఒకే రంగానికి చెందిన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ రంగానికి సంబంధించి ఏదైనా ప్రతికూల వార్త లేదా సంఘటన జరిగినపుడు షేర్లు పడిపోయి నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

 ఎవరికి అనుకూలం..
 సాధారణంగా మార్కెట్ల ర్యాలీలకు అన్నీ కాకుండా కొన్ని రంగాలు మాత్రమే నేతృత్వం వహిస్తాయి. ఇండెక్స్‌లు కంటే ఎక్కువ రాబడి పొందాలనుకునే ఈ రంగాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఎక్కువ లాభాలు పొందొచ్చు.  ఉదాహరణకు ఏడాదిలో ఇండెక్స్‌లు సుమారు 39 శాతం లాభాలను అందిస్తే ఇదే సమయంలో ఇన్‌ఫ్రా ఫండ్స్ 90 శాతం వరకు లాభాలను అందించాయి. కానీ ఈ ఏడాది బంగారాన్ని నమ్ముకున్న వారికి మాత్రం నష్టాలు వచ్చాయి. ఎక్కువ రిస్క్ చేయగలవారికి థీమటిక్ ఫండ్స్ అనుకూలమైనవని చెప్పవచ్చు.

అలాగే మీ పోర్ట్‌ఫోలియోలో ఏదైనా ఒక సెక్టార్, థీమ్‌కు సరైన ప్రాధాన్యం లభించలేదని భావించి, అది రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉందనుకుంటే అప్పుడు వీటికేసి చూడొచ్చు. ఒక రంగంపై నమ్మకమున్నా.. అందులో ఏ షేర్లు కొనాలో తెలియని వారికి ఈ ఫండ్స్ అనువైనవని చెప్పొచ్చు. వీటిలో అధిక లాభాలు పొందడానికి ఎంత ఆస్కారం ఉందో అదే సమయంలో నష్టాలు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉండటంతో  ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ మొత్తం వీటికి కేటాయించకూడదని నిపుణులు చెపుతారు.

 పోర్ట్‌ఫోలియోలో సెక్టోరల్, థీమటిక్ ఫండ్స్ వాటా 20 శాతం మించకుండా చూసుకోవాలి. స్టాక్ మార్కెట్ థీమ్స్, సెక్టార్ పనితీరు వేగంగా మారిపోతుంటాయి. కాబట్టి థీమటిక్ ఫండ్స్ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువైనవి కావు. స్వల్పకాలంలో మార్కెట్లో నడిచే ట్రెండ్ నుంచి ప్రయోజనం పొందాలనుకునే వారికి ఇవి అనువైనవి.

 ఇండెక్స్ ఫండ్స్..
 వివిధ ఇండెక్స్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ జూనియర్, నిఫ్టీ 500, మిడ్‌క్యాప్, డివిడెండ్ ఇండెక్స్ ఇలా విభిన్న రకాల ఇండెక్స్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌నే తీసుకుంటే ఇవి నిఫ్టీ ఇండెక్స్‌లో ఉన్న 50 షేర్లలో ఇండెక్స్ వెయిటేజ్ ఆధారంగానే ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగే నిఫ్టీ 500, నిఫ్టీ మిడ్‌క్యాప్‌లు కూడా.. అంటే వీటి రాబడి దాదాపు ఆయా ఇండెక్స్‌లకు దగ్గరగా ఉంటుంది. చిన్న మొత్తంతో ఇండెక్స్‌లోని అన్ని షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి.
 ఇండెక్స్ ఫండ్‌లు: ఐసీఐసీఐ నిఫ్టీ జూనియర్ ( 48%), జీఎస్ నిఫ్టీ జూనియర్ (48%), రిలయన్స్ నిఫ్టీ 100 (38%), కోటక్ సెన్సెక్స్ ఈటీఎఫ్ (36%), ఎస్‌బీఐ సెన్సెక్స్ ఈటీఎఫ్ (36%).


 ఇండెక్స్ కంటే తక్కువ రాబడి...
 
 టెక్నాలజీ..
 ఇవి ప్రధానంగా కంప్యూటర్ రంగానికి చెందిన షేర్లతో పాటు ఇతర శాస్ట్రసాంకేతికరంగాలకు చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇండెక్స్ రాబడితో పోలిస్తే కొన్ని ఫండ్స్ సమాన రాబడిని అందించగా మరికొన్ని అంతకంటే కొద్దిగా తక్కువ రాబడిని అందించాయి

 టెక్నాలజీ ఫండ్స్: ఎస్‌బీఐ ఐటీ ఫండ్ ( 40%), ఐసీఐసీఐ టెక్నాలజీ ( 38%), బిర్లా సన్‌లైఫ్ న్యూ మిలీనియం (34%), డీఎస్‌పీ బ్లాక్‌రాక్ టెక్నాలజీడాట్‌కామ్ (33%), ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ (28%).

 ఎఫ్‌ఎంసీజీ
 గత కొంతకాలంగా బాగా పెరిగిన ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఇప్పుడు ఆ స్థాయిలో పెరగడం లేదు. ఈ ఏడాది కాలంలో ఎఫ్‌ఎంసీజీ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఇండెక్స్‌ల కంటే తక్కువ రాబడిని అందించాయి.
 ఎఫ్‌ఎంసీజీ ఫండ్స్: ఎస్‌బీఐ ఎఫ్‌ఎంసీజీ (36%), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎఫ్‌ఎంసీజీ (34%)

 అన్నింట్లో కొద్దికొద్దిగా..
 ఏ ఇన్వెస్ట్‌మెంట్ సాధనంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియని వారికోసం అసెట్ అలకేషన్ థీమ్‌తో మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొత్త తరహా థీమ్‌ను ప్రవేశపెట్టాయి. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని ఈక్విటీలు, డెట్ పథకాలు, బంగారానికి కేటాయిస్తాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ, డెట్ ఇన్వెస్ట్‌మెంట్ నిష్పత్తి మారుతుంటుంది. మూడు విభిన్న రంగాలకు చెందిన సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి రాబడిని ఈక్విటీ ఇండెక్స్‌లతో పోల్చలేము. కానీ గడిచిన ఏడాది కాలంలో ఈ ఫండ్స్ 22-47% రాబడిని అందిచాయి.

 అసెట్ అలకేషన్ ఫండ్స్: కోటక్ అసట్ అలకేటర్ (47%), బిర్లా సన్‌లైఫ్ అసెట్ అలకేటర్ (43%), ప్రిన్సిపల్ స్మార్ట్ ఈక్విటీ (50%), ఫ్రాంక్లిన్ డైనమిక్ పీఈ (29%), పారమెరికా అసెట్ అలకేషన్ (22%).

 గోల్డ్ ఫండ్స్
 ఇవి కేవలం బంగారంలో ఇన్వెస్ట్ చేస్తాయి. గత ఏడాది కాలంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో ఇన్వెస్టర్లకు నష్టాలను అందించాయి. పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే వారు కొద్ది మేర బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి.

 గోల్డ్ ఫండ్స్:  మోతిలాల్ ఓస్వాల్ గోల్డ్ ఈటీఎఫ్ (-11%), రెలిగేర్ గోల్డ్ ఈటీఎఫ్ (-12%), కెనరా గోల్డ్ సేవింగ్స్ (-12%), ఐడీబీఐ గోల్డ్ ఫండ్ (-12%), ఎస్‌బీఐ గోల్డ్ ఈటీఎఫ్ (1-12%), ఐసీఐసీఐ గోల్డ్ ఈటీఎఫ్ (-12%).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement