తక్కువ ఫండ్స్... రాబడికి ఫ్రెండ్స్!
♦ ఫండ్ల సంఖ్య పెరిగినకొద్దీ పరిశీలన కష్టం
♦ పనితీరు బాగులేని పథకాలతో రాబడులపై ప్రభావం
♦ ప్రతి కొత్త పథకంలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు
♦ పోర్ట్‌ఫోలియో పటిష్టంగా ఉంటేనే రాబడులు
♦ అందుకోసం తక్కువ ఫండ్లే ఉండాలంటున్న నిపుణులు
స్టాక్ మార్కెట్లోనైనా, బాండ్లలోనైనా పెట్టుబడి పెట్టాలంటే అత్యధికులకు అనువైన మార్గం మ్యూచువల్ ఫండ్లే. చాలామంది ఎంచుకునేది ఈ మార్గాన్నే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేవారు తమ పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఎక్కువ ఫండ్లుంటే అంత మంచిదనుకుంటారు. ఎక్కువ ఫండ్లలో పెట్టుబడి పెడితే భద్రత ఉంటుందని, రాబడులు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. కాబట్టే చాలా మంది పోర్ట్‌ఫోలియోలలో పదుల సంఖ్యలో ఫండ్స్ పథకాలు కనిపిస్తుంటాయి.
మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త పథకంలో రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళితే కొన్నేళ్లకు పోర్ట్‌ఫోలియో చాంతాడంత అవుతుంది!!. మరి ఏ పథకం పనితీరు ఎలా ఉందో పరిశీలించే తీరిక, నైపుణ్యం ఎంత మందికి ఉంటాయి...? ఆలోచించండి!. భిన్న రకాల థీమ్‌లతో పనిచేసే రెండు మూడు పథకాల్లో మంచి ట్రాక్ రికార్డున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది కదా!? అలా కాకుండా ఒకదాన్ని పోలిన మరో పథకంలో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తే లాభమేంటి? దీనిపై నిపుణులేమంటున్నారో చూద్దాం...
లెక్క ఎక్కువ... రాబడి తక్కువ
ఓ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాటల్లో... ‘ఒక ఇన్వెస్టర్ తన పోర్ట్‌ఫోలియోలో 120 మ్యూచువల్ ఫండ్స్ పథకాలున్నాయని చెప్పాడు. వీటి మొత్తం విలువ రూ.10 లక్షలు.ఇది ఇన్వెస్టర్లలో అవగాహన లేమిని తెలియజేస్తుంది’’. నిజానికి ఫండ్స్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది ఇలాంటివారే. ‘‘కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫండ్ పథకం రూ.10 విలువకే లభిస్తుంది. అప్పటికే మార్కెట్లో ఉన్న పథకాల ఎన్‌ఏవీలు ఎక్కువ ధరలో ఉంటాయి. దాంతో వాటిల్లో పెట్టుబడిపై తక్కువ యూనిట్లు వస్తాయి. కాబట్టి కొత్త పథకాలు బెటర్’’ అన్న అభిప్రాయమే చాలామంది ఇన్వెస్టర్లలో ఉంది. అదే వారి పోర్ట్‌ఫోలియోని పెంచేస్తోంది. నిజానికి ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అదే పనిగా కొత్త పథకాలను తెస్తూ ఉండేవి. డిస్ట్రిబ్యూటర్లు కమిషన్ల కోసం కొత్త పథకాల్లో పెట్టుబడి పెట్టించేందుకు ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇన్వెస్టర్లతో పెట్టుబడులు పెట్టించేవారు. అందులో భాగంగా ఏర్పడిన దురభిప్రాయమే కొత్త పథకం ఎన్‌ఏవీ చౌక అనేది!!. నిజానికి కొత్త ఫండ్లు అప్పుడే ప్రారంభమవుతాయి కనక చౌకగా ఉంటాయని, పాత ఫండ్లు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాయి కనక వాటి ఆస్తుల విలువ వాటి ఎన్‌ఏవీ విలువలో ప్రతిఫలిస్తుంటుందని చాలామంది అర్థం చేసుకోరు.
కొత్తవి తగ్గుతున్నాయ్...
ఇప్పుడు పరిస్థితి చాలావరకూ మారింది. సెబీ నియంత్రణ చర్యలతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఒకే థీమ్‌తో పనిచేసే, ఒకే రకమైన పథకాల్లో పెట్టుబడి పెట్టే వివిధ పథకాలన్నింటినీ కలిపేస్తున్నాయి. స్థిరీకరిస్తున్నాయి. అంతేకాదు ఈ మధ్య కుప్పలు తెప్పలుగా కొత్త పథకాలు రావటం కూడా తగ్గిపోయింది. ఉన్నవాటిపైనే ఫోకస్ చేస్తూ పరిమిత సంఖ్యలో భిన్నమైన థీమ్‌లతో పనిచేసే పథకాలను తీసుకొస్తున్నాయి. ఎన్ని చేస్తున్నా ఇన్వెస్టర్లు మాత్రం అదే పనిగా ఒక పథకాన్ని పోలిన మరో కొత్త పథకాన్ని ఎంచుకోవడం జరుగుతూనే ఉంది.
ఎక్కువ పథకాలతో రిస్కే..
పదుల సంఖ్యలో పథకాల్లో పెట్టుబడులు విస్తరించినప్పుడు మొత్తం మీద రాబడులు కనిపించొచ్చు. కానీ, కొన్ని పేలవ పనితీరుతో కూడినవి తప్పకుండా ఉంటాయి. దీంతో మంచి పథకాలు ఇచ్చిన అధిక రాబడులను ఇవి తగ్గించేస్తాయి. పెట్టుబడులకు ఇదో క్రమబద్ధమైన విధానం కాదని, అన్ని పథకాల పనితీరును ట్రాక్ చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి కేసుల్లో ఓ కచ్చితమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం జరగదని మార్నింగ్‌స్టార్ ఇండియాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కౌస్తభ్ బేలపుర్కార్ పేర్కొన్నారు.
ఒకటికి మరొకటి నకలు
టాప్ లార్జ్‌క్యాప్ ఫండ్స్ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ఒకే తరహా స్టాక్స్‌లో ఉంటాయి. ఉదాహరణకు బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200, ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్... ఈ మూడు పథకాల్లోనూ ఒక్కోదానిలో నిర్వహణ ఆస్తులు రూ.15,000 కోట్లపైనే ఉన్నాయి. వీటన్నింటిలోనూ టాప్ 10 స్టాక్స్‌ను పరిశీలిస్తే నాలుగు స్టాక్స్ అన్ని స్కీముల్లోనూ కనిపిస్తాయి. అవి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్. ఈ తరహా ఇన్వెస్టర్లకు మంచిది కాదన్నది నిపుణుల అభిప్రాయం. మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ పథకాలున్నాయంటే పెట్టుబడుల పరంగా డూప్లికేషన్ (ఒకే స్టాక్ ఒకటికి మించిన పథకాల పోర్ట్‌ఫోలియోలో ఉండడం) సమస్య ఎదురవుతుంది. ఈ తరహా వ్యూహం కొన్ని మార్కెట్ పరిస్థితుల్లో ఫలించకపోతే అందుకు సంబంధించిన అన్ని పథకాల పనితీరు ప్రతికూలంగానే ఉంటుందని నిపుణులు పేర్కొం టున్నారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పనితీరులో టాప్‌లో ఉన్న ఫండ్స్‌ను ఎంచుకోవడం, తర్వాత మరో ఫండ్ పనితీరులో ముందుకు వస్తే అందులోకి మారిపోవడం జరుగుతుంటుందని, ఒక విధంగా ఇది మంచి ఫలితాలనే ఇస్తుందని వారి అభిప్రాయం.
కష్టమైనా కుదింపుతో లాభమే
లెక్కకు మిక్కిలి పథకాల్లో పెట్టుబడుల వల్ల మొత్తం మీద ఎన్నో ప్రతికూలతలున్నాయని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. కనుక భారీ పోర్ట్‌ఫోలియోతో ఉన్న వారు దాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం మేలు. ఈక్విటీ పథకాలైతే ఇది అంత సులభమేమీ కాదు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసి ఏడాది పూర్తి కాకుండా ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే ఎగ్జిట్ లోడ్ అంటూ చార్జీలు ఉంటాయి. పైగా పన్ను కూడా కట్టాల్సి వస్తుంది. అందుకని నిపుణులు పన్ను మినహాయింపు లభించే కాలం వరకూ, ఎగ్జిట్‌లోడ్ చార్జీలు తొలగిపోయే వరకూ ఆయా పథకాల్లో పెట్టుబడులను కొనసాగించి ఆ తర్వాతే పథకాలను కుదించుకోవాలని సూచిస్తున్నారు. అదే డెట్ ఫండ్స్ అయితే మూడేళ్లలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. కనుక డెట్ ఫండ్స్‌లో పోర్ట్‌ఫోలియో కత్తిరింపునకు మరింత సమయం పాటే వేచి ఉండాల్సి రావచ్చు. అయితే, పనితీరు బాగులేని పథకాలను కొంత మేర చార్జీలు భరించైనా సరే వాటి నుంచి బయటపడడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
పోర్ట్‌ఫోలియో ఇలా బెటర్..
పోర్ట్‌ఫోలియో నిర్మాణం సులభంగా ఉండాలి. మీ దగ్గర రూ.కోటి విలువైన పోర్ట్‌ఫోలియో ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లోకి విభజించి ఉంటే, మొత్తం మీద 10–12 ఫండ్స్ మించకుండా చూసుకోవాలి. స్వల్ప కాలిక, మధ్య కాలిక అవసరాల కోసం చేసే పెట్టుబడులు కూడా ఇందులో భాగంగానే ఉండాలి. ఒకే కేటగిరీలో ఒకటి లేదా రెండు ఫండ్స్‌కే పరిమితం కావాలి.
– సురేష్ సెడగోమన్, లాడర్ 7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ డైరెక్టర్