Funds Schemes
-
విదేశీ విద్య దరఖాస్తులకు మోక్షమెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం రెండు సీజన్ల నుంచి దరఖాస్తులకే పరిమితమవుతోంది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ... ధ్రువపత్రాల పరిశీలన చేపడుతున్నప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం విడుదల చేయట్లేదు. ఈ ఏడాది జనవరి, ఆగస్టులో దాదాపు 5 వేల మంది బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన యంత్రాంగం.. నెలలు గడుస్తున్నప్పటికీ అభ్యర్థుల అర్హతలను ఖరారు చేయడంలో తాత్సారం చేస్తోంది. దీంతో విదేశీ విద్యాభ్యాసంపై అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. కొందరు కోర్సును వాయిదా వేసుకోగా మరికొందరు పథకంపై ఆశలు వదులుకొని విదేశాల్లో చదువు కొనసాగించేందుకు వెళ్లిపోయారు.పెండింగ్... పెండింగ్... విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. వివిధ సంక్షేమ శాఖల ద్వారా వేర్వేరు పేర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా... ఎంపికైన అభ్యరి్థకి గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. పీజీ కోర్సు మొదటి సంవత్సరం పూర్తి కాగానే రూ. 10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేశాక మరో రూ. 10 లక్షల చొప్పున సాయాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. అలాగే ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ. 50 వేలు కూడా చెల్లిస్తోంది. ఈ క్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఏటా 300 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో దరఖాస్తులను ఆహా్వనించగా 2,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.జనవరి నెలాఖరులో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు... విద్యార్థుల మార్కులు, పోటీ పరీక్షలకు సంబంధించిన స్కోరు వివరాలతో జాబితాలను తయారు చేసుకున్నారు. చివరగా పథకానికి అర్హత సాధించిన వారి జాబితాను విడుదల చేయాల్సి ఉండగా... వివిధ కారణాలతో జాబితా ప్రకటన వెలువడలేదు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రావడం, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచి్చంది.ఇంతలో రెండో విడత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆగస్టులో ప్రారంభించిన అధికారులు... అదే నెలాఖరులో ధ్రువపత్రాల పరిశీలన సైతం పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు అర్హుల జాబితాను విడుదల చేయలేదు. రెండు విడతల్లో 300 మంది అర్హులను గుర్తించకుండా ఈ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు అర్హుల జాబితాలను విడుదల చేసినప్పటికీ బీసీ సంక్షేమ శాఖలో నిలిచిపోవడంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. -
తక్కువ ఫండ్స్... రాబడికి ఫ్రెండ్స్!
♦ ఫండ్ల సంఖ్య పెరిగినకొద్దీ పరిశీలన కష్టం ♦ పనితీరు బాగులేని పథకాలతో రాబడులపై ప్రభావం ♦ ప్రతి కొత్త పథకంలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు ♦ పోర్ట్‌ఫోలియో పటిష్టంగా ఉంటేనే రాబడులు ♦ అందుకోసం తక్కువ ఫండ్లే ఉండాలంటున్న నిపుణులు స్టాక్ మార్కెట్లోనైనా, బాండ్లలోనైనా పెట్టుబడి పెట్టాలంటే అత్యధికులకు అనువైన మార్గం మ్యూచువల్ ఫండ్లే. చాలామంది ఎంచుకునేది ఈ మార్గాన్నే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేవారు తమ పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఎక్కువ ఫండ్లుంటే అంత మంచిదనుకుంటారు. ఎక్కువ ఫండ్లలో పెట్టుబడి పెడితే భద్రత ఉంటుందని, రాబడులు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. కాబట్టే చాలా మంది పోర్ట్‌ఫోలియోలలో పదుల సంఖ్యలో ఫండ్స్ పథకాలు కనిపిస్తుంటాయి. మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త పథకంలో రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళితే కొన్నేళ్లకు పోర్ట్‌ఫోలియో చాంతాడంత అవుతుంది!!. మరి ఏ పథకం పనితీరు ఎలా ఉందో పరిశీలించే తీరిక, నైపుణ్యం ఎంత మందికి ఉంటాయి...? ఆలోచించండి!. భిన్న రకాల థీమ్‌లతో పనిచేసే రెండు మూడు పథకాల్లో మంచి ట్రాక్ రికార్డున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది కదా!? అలా కాకుండా ఒకదాన్ని పోలిన మరో పథకంలో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తే లాభమేంటి? దీనిపై నిపుణులేమంటున్నారో చూద్దాం... లెక్క ఎక్కువ... రాబడి తక్కువ ఓ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాటల్లో... ‘ఒక ఇన్వెస్టర్ తన పోర్ట్‌ఫోలియోలో 120 మ్యూచువల్ ఫండ్స్ పథకాలున్నాయని చెప్పాడు. వీటి మొత్తం విలువ రూ.10 లక్షలు.ఇది ఇన్వెస్టర్లలో అవగాహన లేమిని తెలియజేస్తుంది’’. నిజానికి ఫండ్స్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది ఇలాంటివారే. ‘‘కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫండ్ పథకం రూ.10 విలువకే లభిస్తుంది. అప్పటికే మార్కెట్లో ఉన్న పథకాల ఎన్ఏవీలు ఎక్కువ ధరలో ఉంటాయి. దాంతో వాటిల్లో పెట్టుబడిపై తక్కువ యూనిట్లు వస్తాయి. కాబట్టి కొత్త పథకాలు బెటర్’’ అన్న అభిప్రాయమే చాలామంది ఇన్వెస్టర్లలో ఉంది. అదే వారి పోర్ట్‌ఫోలియోని పెంచేస్తోంది. నిజానికి ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అదే పనిగా కొత్త పథకాలను తెస్తూ ఉండేవి. డిస్ట్రిబ్యూటర్లు కమిషన్ల కోసం కొత్త పథకాల్లో పెట్టుబడి పెట్టించేందుకు ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇన్వెస్టర్లతో పెట్టుబడులు పెట్టించేవారు. అందులో భాగంగా ఏర్పడిన దురభిప్రాయమే కొత్త పథకం ఎన్ఏవీ చౌక అనేది!!. నిజానికి కొత్త ఫండ్లు అప్పుడే ప్రారంభమవుతాయి కనక చౌకగా ఉంటాయని, పాత ఫండ్లు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాయి కనక వాటి ఆస్తుల విలువ వాటి ఎన్ఏవీ విలువలో ప్రతిఫలిస్తుంటుందని చాలామంది అర్థం చేసుకోరు. కొత్తవి తగ్గుతున్నాయ్... ఇప్పుడు పరిస్థితి చాలావరకూ మారింది. సెబీ నియంత్రణ చర్యలతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఒకే థీమ్‌తో పనిచేసే, ఒకే రకమైన పథకాల్లో పెట్టుబడి పెట్టే వివిధ పథకాలన్నింటినీ కలిపేస్తున్నాయి. స్థిరీకరిస్తున్నాయి. అంతేకాదు ఈ మధ్య కుప్పలు తెప్పలుగా కొత్త పథకాలు రావటం కూడా తగ్గిపోయింది. ఉన్నవాటిపైనే ఫోకస్ చేస్తూ పరిమిత సంఖ్యలో భిన్నమైన థీమ్‌లతో పనిచేసే పథకాలను తీసుకొస్తున్నాయి. ఎన్ని చేస్తున్నా ఇన్వెస్టర్లు మాత్రం అదే పనిగా ఒక పథకాన్ని పోలిన మరో కొత్త పథకాన్ని ఎంచుకోవడం జరుగుతూనే ఉంది. ఎక్కువ పథకాలతో రిస్కే.. పదుల సంఖ్యలో పథకాల్లో పెట్టుబడులు విస్తరించినప్పుడు మొత్తం మీద రాబడులు కనిపించొచ్చు. కానీ, కొన్ని పేలవ పనితీరుతో కూడినవి తప్పకుండా ఉంటాయి. దీంతో మంచి పథకాలు ఇచ్చిన అధిక రాబడులను ఇవి తగ్గించేస్తాయి. పెట్టుబడులకు ఇదో క్రమబద్ధమైన విధానం కాదని, అన్ని పథకాల పనితీరును ట్రాక్ చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి కేసుల్లో ఓ కచ్చితమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం జరగదని మార్నింగ్‌స్టార్ ఇండియాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కౌస్తభ్ బేలపుర్కార్ పేర్కొన్నారు. ఒకటికి మరొకటి నకలు టాప్ లార్జ్‌క్యాప్ ఫండ్స్ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ఒకే తరహా స్టాక్స్‌లో ఉంటాయి. ఉదాహరణకు బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్, హెచ్డీఎఫ్సీ టాప్ 200, ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్... ఈ మూడు పథకాల్లోనూ ఒక్కోదానిలో నిర్వహణ ఆస్తులు రూ.15,000 కోట్లపైనే ఉన్నాయి. వీటన్నింటిలోనూ టాప్ 10 స్టాక్స్‌ను పరిశీలిస్తే నాలుగు స్టాక్స్ అన్ని స్కీముల్లోనూ కనిపిస్తాయి. అవి హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్. ఈ తరహా ఇన్వెస్టర్లకు మంచిది కాదన్నది నిపుణుల అభిప్రాయం. మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ పథకాలున్నాయంటే పెట్టుబడుల పరంగా డూప్లికేషన్ (ఒకే స్టాక్ ఒకటికి మించిన పథకాల పోర్ట్‌ఫోలియోలో ఉండడం) సమస్య ఎదురవుతుంది. ఈ తరహా వ్యూహం కొన్ని మార్కెట్ పరిస్థితుల్లో ఫలించకపోతే అందుకు సంబంధించిన అన్ని పథకాల పనితీరు ప్రతికూలంగానే ఉంటుందని నిపుణులు పేర్కొం టున్నారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పనితీరులో టాప్‌లో ఉన్న ఫండ్స్‌ను ఎంచుకోవడం, తర్వాత మరో ఫండ్ పనితీరులో ముందుకు వస్తే అందులోకి మారిపోవడం జరుగుతుంటుందని, ఒక విధంగా ఇది మంచి ఫలితాలనే ఇస్తుందని వారి అభిప్రాయం. కష్టమైనా కుదింపుతో లాభమే లెక్కకు మిక్కిలి పథకాల్లో పెట్టుబడుల వల్ల మొత్తం మీద ఎన్నో ప్రతికూలతలున్నాయని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. కనుక భారీ పోర్ట్‌ఫోలియోతో ఉన్న వారు దాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం మేలు. ఈక్విటీ పథకాలైతే ఇది అంత సులభమేమీ కాదు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసి ఏడాది పూర్తి కాకుండా ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే ఎగ్జిట్ లోడ్ అంటూ చార్జీలు ఉంటాయి. పైగా పన్ను కూడా కట్టాల్సి వస్తుంది. అందుకని నిపుణులు పన్ను మినహాయింపు లభించే కాలం వరకూ, ఎగ్జిట్‌లోడ్ చార్జీలు తొలగిపోయే వరకూ ఆయా పథకాల్లో పెట్టుబడులను కొనసాగించి ఆ తర్వాతే పథకాలను కుదించుకోవాలని సూచిస్తున్నారు. అదే డెట్ ఫండ్స్ అయితే మూడేళ్లలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. కనుక డెట్ ఫండ్స్‌లో పోర్ట్‌ఫోలియో కత్తిరింపునకు మరింత సమయం పాటే వేచి ఉండాల్సి రావచ్చు. అయితే, పనితీరు బాగులేని పథకాలను కొంత మేర చార్జీలు భరించైనా సరే వాటి నుంచి బయటపడడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. పోర్ట్‌ఫోలియో ఇలా బెటర్.. పోర్ట్‌ఫోలియో నిర్మాణం సులభంగా ఉండాలి. మీ దగ్గర రూ.కోటి విలువైన పోర్ట్‌ఫోలియో ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లోకి విభజించి ఉంటే, మొత్తం మీద 10–12 ఫండ్స్ మించకుండా చూసుకోవాలి. స్వల్ప కాలిక, మధ్య కాలిక అవసరాల కోసం చేసే పెట్టుబడులు కూడా ఇందులో భాగంగానే ఉండాలి. ఒకే కేటగిరీలో ఒకటి లేదా రెండు ఫండ్స్‌కే పరిమితం కావాలి. – సురేష్ సెడగోమన్, లాడర్ 7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ డైరెక్టర్ -
అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌కు లాక్ ఇన్ పీరియడ్ ఉందా?
నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఇటీవలే పెళ్లి అయింది. భవిష్యత్తులో సొంత ఇల్లు సమకూర్చుకోవడం నా లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకే మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా? –వినోద్, హైదరాబాద్ సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ కోసం నిధి ఏర్పాటు చేసుకోవడం, పిల్లల ఉన్నత చదువులకు సొమ్ములు.. తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే ఒకే మ్యూచువల్ ఫండ్‌కు చెందిన వివిధ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా వివిధ మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయడమే మంచిది. ఒకే మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన వివిధ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ఫండ్ మేనేజ్మెంట్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఒకవేళ ఈ ఫండ్ మేనేజ్మెంట్ నిర్ణయాలు తప్పు అయితే, ఈ ఫండ్స్‌కు చెందిన స్కీమ్లన్నింటి పనితీరుపై ప్రభావం పడుతుంది. మరోవైపు ఈ ఫండ్ మేనేజ్మెంట్ నుంచి ఎవరైనా ఫండ్ మేనేజర్ వైదొలిగితే, ఈ అంశం కూడా సదరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముంది. అందుకని ఒకే మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన వివిధ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కన్నా వివిధ మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన సంస్థల వివిధ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. రెగ్యులర్ ప్లాన్ల కంటే డైరెక్ట్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయని మిత్రులంటున్నారు. నిజమేనా? –ప్రశాంతి, విజయవాడ రెగ్యులర్ ప్లాన్ల కన్నా డైరెక్ట్ ప్లాన్లు చౌకగా ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్‌ల్లో అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏజెంట్లకు, డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే, రెగ్యులర్ ప్లాన్‌ల్లో కన్నా డైరెక్ట్ ప్లాన్‌ల్లో వ్యయాలు ఏడాదికి 1 శాతం తక్కువగా ఉంటాయి. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అవగాహన ఉండి, స్వతంత్రంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వారికి డైరెక్ట్ ప్లాన్లు సరైనవి. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త కాబట్టి మీరు మొదటగా రెగ్యులర్ ప్లాన్‌ల్లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఒక ఏడాది తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్స్ తీరు తెన్నులపై ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు డైరెక్ట్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటే ఏమిటి? సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల కంటే వీటిల్లో ఎక్కువ రాబడి వస్తుందా ?వీటికేమైనా లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందా ? –అనిరుధ్, విశాఖపట్టణం ఏడాది కంటే తక్కువ మెచ్యురిటీ ఉన్న సెక్యూరిటీల్లో అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని నెలల నుంచి ఏడాది కాలవ్యవధికి ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఫండ్స్ సరైనవి. ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే, గ్యారంటీగా ఇంత మొత్తం వస్తోందనో, లేక ఈ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భద్రత ఉంటుందనో చెప్పలేము. అయితే ఈ నష్టభయాలు పెద్దగా పరిగణించదగ్గవి కాదని చెప్పవచ్చు. బ్యాంక్ సేవింగ్స్ ఖాతా కంటే కూడా ఓ మోస్తరు మెరుగైన రాబడులు అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌లో పొందవచ్చు. ఈ ఫండ్స్‌కు ఎలాంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. రిడంప్షన్ రిక్వెస్ట్ సమర్పించిన తర్వాత 1–2 పనిదినాల్లో మీ డబ్బులు మీరు పొందవచ్చు. డెట్ ఫండ్స్‌కు వర్తించే పన్ను నిబంధనలే అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌కు వర్తిస్తాయి. నా వార్షికాదాయం రూ.12 లక్షలు. నా తల్లిదండ్రులకు, అత్తమామలకు కొంత మొత్తాన్ని బహుమతులుగా ఇచ్చాను. ఇలా బహుమతులుగా వచ్చిన మొత్తాలపై ఏమైనా ఆదాయాలు వస్తే, నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు. –శ్రీధర్, బెంగళూరు మీరు మీ తల్లిదండ్రులకు, అత్తమామలకు బహుమతులుగా వచ్చిన మొత్తాలపై వారు ఏమీ పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఇలా బహుమతులుగా వచ్చిన మొత్తాలపై వారేమైనా ఆదాయాలు ఆర్జిస్తే మాత్రం వారు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. వారి ఆదాయానికి ఇలా ఆర్జించిన ఆదాయాన్ని కలిపి వారి ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. బ్యాంక్ అధికారులు నాకు డీమ్యాట్ ఖాతాను కూడా ఇచ్చారు. ఈ డీ మ్యాట్ ఖాతా ట్రేడింగ్ పోర్టల్ ద్వారా నేను మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేశాను. ఇప్పటివరకూ రెగ్యులర్ ప్లాన్లనే కొనుగోలు చేశాను. ఇక నుంచి డైరెక్ట్ ప్లాన్లను కొనుగోలు చేయాలనుకుంటున్నాను. అలా కొనుగోలు చేసే అవకాశముందా ? –శామ్యూల్, సికింద్రాబాద్ ప్రస్తుతానికైతే, డీ మ్యాట్ ఖాతా ద్వారా మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లను కొనుగోలు చేయడానికి వీలు లేదు. మ్యూచువల్ ఫండ్ కంపెనీ వెబ్సైట్ ద్వారా సదరు సంస్థ డైరెక్ట్ ప్లాన్లను కొనుగోలు చేయవచ్చు. లేదా ఆ సంస్థ ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్లలో దరఖాస్తు సమర్పించడం ద్వారా కూడా ఈ డైరెక్ట్ ప్లాన్లను కొనుగోలు చేయవచ్చు.