రెండు సీజన్ల నుంచి ముందుకు సాగని
పూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం
సుమారు 5 వేల దరఖాస్తులు స్వీకరించిన బీసీ సంక్షేమ శాఖ
పథకానికి ఎంపికైన జాబితాలు ఇప్పటికీ విడుదల చేయని యంత్రాంగం
విదేశీ విద్యను వాయిదా వేసుకున్న కొందరు.. పథకంపై ఆశలు వదులుకున్న మరికొందరు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం రెండు సీజన్ల నుంచి దరఖాస్తులకే పరిమితమవుతోంది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ... ధ్రువపత్రాల పరిశీలన చేపడుతున్నప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం విడుదల చేయట్లేదు. ఈ ఏడాది జనవరి, ఆగస్టులో దాదాపు 5 వేల మంది బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన యంత్రాంగం.. నెలలు గడుస్తున్నప్పటికీ అభ్యర్థుల అర్హతలను ఖరారు చేయడంలో తాత్సారం చేస్తోంది. దీంతో విదేశీ విద్యాభ్యాసంపై అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. కొందరు కోర్సును వాయిదా వేసుకోగా మరికొందరు పథకంపై ఆశలు వదులుకొని విదేశాల్లో చదువు కొనసాగించేందుకు వెళ్లిపోయారు.
పెండింగ్... పెండింగ్...
విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. వివిధ సంక్షేమ శాఖల ద్వారా వేర్వేరు పేర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా... ఎంపికైన అభ్యరి్థకి గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. పీజీ కోర్సు మొదటి సంవత్సరం పూర్తి కాగానే రూ. 10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేశాక మరో రూ. 10 లక్షల చొప్పున సాయాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. అలాగే ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ. 50 వేలు కూడా చెల్లిస్తోంది. ఈ క్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఏటా 300 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో దరఖాస్తులను ఆహా్వనించగా 2,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
జనవరి నెలాఖరులో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు... విద్యార్థుల మార్కులు, పోటీ పరీక్షలకు సంబంధించిన స్కోరు వివరాలతో జాబితాలను తయారు చేసుకున్నారు. చివరగా పథకానికి అర్హత సాధించిన వారి జాబితాను విడుదల చేయాల్సి ఉండగా... వివిధ కారణాలతో జాబితా ప్రకటన వెలువడలేదు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రావడం, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచి్చంది.
ఇంతలో రెండో విడత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆగస్టులో ప్రారంభించిన అధికారులు... అదే నెలాఖరులో ధ్రువపత్రాల పరిశీలన సైతం పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు అర్హుల జాబితాను విడుదల చేయలేదు. రెండు విడతల్లో 300 మంది అర్హులను గుర్తించకుండా ఈ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు అర్హుల జాబితాలను విడుదల చేసినప్పటికీ బీసీ సంక్షేమ శాఖలో నిలిచిపోవడంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment