అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌కు లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉందా? | Ultra Short Term Funds lock-in period | Sakshi
Sakshi News home page

అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌కు లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉందా?

Published Mon, Dec 19 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌కు లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉందా?

అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌కు లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉందా?

నేను ఒక సాఫ్ట్‌వేర్‌  కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఇటీవలే పెళ్లి అయింది. భవిష్యత్తులో సొంత ఇల్లు సమకూర్చుకోవడం నా లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం మ్యూచువల్‌  ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఒకే  మ్యూచువల్‌  ఫండ్‌ సంస్థకు చెందిన ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయమేనా?
–వినోద్, హైదరాబాద్‌

సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్‌ కోసం నిధి ఏర్పాటు చేసుకోవడం, పిల్లల ఉన్నత చదువులకు సొమ్ములు..  తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్‌  ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే ఒకే మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన వివిధ స్కీముల్లో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా వివిధ మ్యూచువల్‌  ఫండ్స్‌కు చెందిన స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడమే మంచిది. ఒకే మ్యూచువల్‌  ఫండ్‌ సంస్థకు చెందిన వివిధ మ్యూచువల్‌  ఫండ్స్‌ స్కీమ్స్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఒకవేళ ఈ ఫండ్‌  మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలు తప్పు అయితే, ఈ ఫండ్స్‌కు చెందిన స్కీమ్‌లన్నింటి పనితీరుపై ప్రభావం పడుతుంది. మరోవైపు  ఈ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఎవరైనా ఫండ్‌  మేనేజర్‌ వైదొలిగితే, ఈ అంశం కూడా సదరు మ్యూచువల్‌ ఫండ్‌  స్కీమ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముంది. అందుకని ఒకే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు చెందిన వివిధ మ్యూచువల్‌  ఫండ్స్‌ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా వివిధ మ్యూచువల్‌  ఫండ్స్‌కు చెందిన సంస్థల వివిధ మ్యూచువల్‌  ఫండ్స్‌ స్కీమ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

 
రెగ్యులర్‌  ప్లాన్‌ల కంటే డైరెక్ట్‌ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయని మిత్రులంటున్నారు. నిజమేనా?
–ప్రశాంతి, విజయవాడ

రెగ్యులర్‌  ప్లాన్‌ల కన్నా డైరెక్ట్‌ ప్లాన్‌లు చౌకగా ఉంటాయి. రెగ్యులర్‌  ప్లాన్‌ల్లో అయితే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఏజెంట్లకు, డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే, రెగ్యులర్‌ ప్లాన్‌ల్లో కన్నా డైరెక్ట్‌ ప్లాన్‌ల్లో వ్యయాలు ఏడాదికి 1 శాతం తక్కువగా ఉంటాయి. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అవగాహన ఉండి, స్వతంత్రంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వారికి డైరెక్ట్‌ ప్లాన్‌లు సరైనవి. మీరు మ్యూచువల్‌  ఫండ్‌  ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త కాబట్టి మీరు మొదటగా రెగ్యులర్‌  ప్లాన్‌ల్లోనే ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. ఒక ఏడాది తర్వాత మీకు ఇన్వెస్ట్‌మెంట్స్‌ తీరు తెన్నులపై ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు డైరెక్ట్‌ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.

అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ అంటే ఏమిటి? సేవింగ్స్‌  బ్యాంక్‌ డిపాజిట్ల కంటే వీటిల్లో ఎక్కువ రాబడి వస్తుందా ?వీటికేమైనా లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉంటుందా ?            
 –అనిరుధ్, విశాఖపట్టణం

ఏడాది కంటే తక్కువ మెచ్యురిటీ ఉన్న సెక్యూరిటీల్లో అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌  ఇన్వెస్ట్‌ చేస్తాయి. కొన్ని నెలల నుంచి ఏడాది కాలవ్యవధికి ఇన్వెస్ట్‌ చేయడానికి  ఈ ఫండ్స్‌  సరైనవి. ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే, గ్యారంటీగా ఇంత మొత్తం వస్తోందనో, లేక ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భద్రత ఉంటుందనో చెప్పలేము. అయితే  ఈ నష్టభయాలు పెద్దగా పరిగణించదగ్గవి కాదని చెప్పవచ్చు. బ్యాంక్‌  సేవింగ్స్‌ ఖాతా కంటే కూడా ఓ మోస్తరు మెరుగైన రాబడులు అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌లో పొందవచ్చు. ఈ ఫండ్స్‌కు ఎలాంటి లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉండదు. రిడంప్షన్‌ రిక్వెస్ట్‌ సమర్పించిన తర్వాత 1–2 పనిదినాల్లో మీ డబ్బులు మీరు పొందవచ్చు. డెట్‌ ఫండ్స్‌కు వర్తించే పన్ను నిబంధనలే అల్ట్రా షార్ట్‌ టర్మ్‌  ఫండ్స్‌కు వర్తిస్తాయి.

నా వార్షికాదాయం రూ.12 లక్షలు. నా తల్లిదండ్రులకు, అత్తమామలకు కొంత మొత్తాన్ని బహుమతులుగా ఇచ్చాను. ఇలా బహుమతులుగా వచ్చిన మొత్తాలపై ఏమైనా ఆదాయాలు వస్తే, నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి  ఉంటుందా? వివరించగలరు.
–శ్రీధర్, బెంగళూరు

మీరు మీ తల్లిదండ్రులకు, అత్తమామలకు బహుమతులుగా వచ్చిన మొత్తాలపై వారు  ఏమీ పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఇలా బహుమతులుగా వచ్చిన మొత్తాలపై వారేమైనా ఆదాయాలు ఆర్జిస్తే మాత్రం వారు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. వారి ఆదాయానికి  ఇలా ఆర్జించిన ఆదాయాన్ని కలిపి వారి ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు.

బ్యాంక్‌ అధికారులు నాకు డీమ్యాట్‌  ఖాతాను కూడా ఇచ్చారు. ఈ డీ మ్యాట్‌ ఖాతా ట్రేడింగ్‌ పోర్టల్‌ ద్వారా నేను మ్యూచువల్‌  ఫండ్స్‌ యూనిట్లను కొనుగోలు చేశాను. ఇప్పటివరకూ రెగ్యులర్‌ ప్లాన్‌లనే కొనుగోలు చేశాను. ఇక నుంచి డైరెక్ట్‌ ప్లాన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నాను. అలా కొనుగోలు చేసే అవకాశముందా ?
–శామ్యూల్, సికింద్రాబాద్‌

ప్రస్తుతానికైతే, డీ మ్యాట్‌ ఖాతా ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి వీలు లేదు. మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా సదరు సంస్థ డైరెక్ట్‌  ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. లేదా ఆ సంస్థ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సెంటర్లలో దరఖాస్తు సమర్పించడం ద్వారా కూడా  ఈ డైరెక్ట్‌ ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement