How To Select The Best Index Fund For Your Portfolio? - Sakshi

ఇండెక్స్‌ ఫండ్‌ ఎంపిక ఎలా?

Published Mon, Jun 5 2023 7:13 AM | Last Updated on Mon, Jun 5 2023 8:35 AM

How To Select The Best Index Fund For Your Portfolio - Sakshi

ఇండెక్స్‌ ఫండ్‌ ఎంపిక ఎలా? మల్టీక్యాప్‌ పేరుతో కొత్తగా వస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా?  – ఆశిష్‌ 
  
ఈ తరహా పథకాల నుంచి సరైన రాబడులు అందుకోగలమా? అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ మధ్య వ్యత్యాసం ఉంది. నేడు ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ అనుసరిస్తున్న పెట్టుబడుల విధానాన్ని గతంలో మల్టీక్యాప్‌ ఫండ్స్‌ పాటించాయి. వాటిపై ఎటువంటి నియంత్రణలు లేవు. కనుక మార్కెట్‌ క్యాప్‌ పరిమితితో సంబంధం లేకుండా ఫండ్‌ మేనేజర్లు తమ స్వేచ్ఛ కొద్దీ అన్ని రకాల మార్కెట్‌ క్యాప్‌ ఆధారిత స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకునేవారు. దీంతో వాటి విధానం మార్చే దిశగా సెబీ మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

ఇప్పుడు మల్టీక్యాప్‌ ఫండ్స్‌ కచ్చితంగా కనీసం 25 శాతం లార్జ్‌క్యాప్, 25% మిడ్‌క్యాప్, 25% స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. చాలా వరకు మల్టీక్యాప్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తుల పెరంగా పెద్ద గా మారిపోయాయి. దీంతో 25% చొప్పున ప్రతీ విభాగంలో పెట్టుబడులు కచ్చితంగా ఇన్వెస్ట్‌ చేయాలన్నది వాటికి ప్రతిబంధకంగా మారింది. ఎందుకంటే భారీ పెట్టుబడులకు తగ్గ అవకాశాలు స్మాల్‌ క్యాప్, మిడ్‌క్యాప్‌ విభాగంలో అన్ని వేళలా ఉండాలని లేదు. పరిశ్రమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సెబీ మార్కెట్‌కు ఇది ప్రతికూలంగా మారుతుందని గుర్తించి.. ఫ్లెక్సీక్యాప్‌ పేరుతో కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టింది. 25 శాతం చొప్పున కచ్ఛితంగా ప్రతీ విభాగంలో ఇన్వెస్ట్‌ చేయడం వీలు కాకపోతే మల్టీక్యాప్‌ పథకాలు ఫ్లెక్సీక్యాప్‌ విభాగంలోకి మారిపోవచ్చంటూ వెసులుబాటునిచ్చింది.

దీంతో చాలా మల్టీక్యాప్‌ పథకాలు ఫ్లెక్సీక్యాప్‌ కిందకు మారిపోయాయి. కొత్త పథకం ఆవిష్కరించడం ద్వారా మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించొచ్చని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు భావించాయి. ఒక్కో విభాగంలో ఒక్క పథకమే ఉండాలన్నది సెబీ నిబంధన. దీంతో మల్టీక్యాప్‌ నుంచి ఫ్లెక్సీక్యాప్‌ కిందకు మారిపోయిన ఫండ్స్‌ సంస్థలు.. మల్టీక్యాప్‌ విభాగంలో కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) తీసుకొస్తున్నాయి. కనుక అవి తమకు అనుకూలమా? కాదా? అన్నది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల కాల వ్యవధి, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాలి.   

మంచి ఇండెక్స్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకునేందుకు ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?  – శశాంక్‌ 
ముందుగా పథకం ఎక్స్‌పెన్స్‌ రేషియో చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్‌ పోర్టల్‌లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది.

కొంత ట్రాకింగ్‌ లోపం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్‌ 2 శాతం పెరిగితే.. ఫండ్‌ పెట్టుబడుల విలువ అదే కాలంలో 2.01%, 1.99%గా చూపించొచ్చు. ముఖ్యంగా ఎక్స్‌పెన్స్‌ రేషియో ఇక్కడ కీలకం అవుతుంది. రెండు ఇండెక్స్‌ పథకాల్లో ఒకటి 10 బేసిస్‌ పాయింట్లు చార్జ్‌ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్‌ పాయింట్లు చార్జ్‌ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్‌ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడమే సరైనది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement