నాకు ఎనిమిది వరకు ఆర్ధిక లక్ష్యాలు ఉన్నాయి. ప్రతీ లక్ష్యానికి విడిగా పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవాలా? అలా అయితే పర్యవేక్షణకు ఇబ్బంది కాదా?
– శివాని
లక్ష్యాలు, పోర్ట్‌ఫోలియో మధ్య సమతూకం ఉండాలి. ముందుగా సమీప కాలంలోని లక్ష్యాలను వేరు చేయండి. అలాగే, మధ్య కాలం, దీర్ఘకాల లక్ష్యాలను కూడా వేరు చేయండి. ఇప్పుడు స్వల్పకాల, మధ్యకాల లక్ష్యాలను సైతం.. రాజీ పడతగ్గ, రాజీపడలేని అనే రెండు విభాగాలుగా వేరు చేయండి. రాజీపడలేని అంటే రిస్క్ తీసుకోని పెట్టుబడులు. రిస్క్ తీసుకోలేని మధ్యకాలం లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (స్థిరాదాయ/డెట్) సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
వీటికోసం ఒక్కటే పోర్ట్‌ఫోలియో సరిపోతుంది. ఈ పెట్టుబడుల కోసం ఈక్విటీలపై ఆధారపడకూడదు. అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేందుకు అనుకూలంగా ఉండాలి. ఇక దీర్ఘకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడులను అంటే తదుపరి ఐదేళ్ల కాలం వరకు అవసరం లేని పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ప్రతీ లక్ష్యానికి విడిగా ఎంత చొప్పున కావాలి, ఎంత వ్యవధి ఉందనే దాని ఆధారంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ లక్ష్యానికి కావాల్సిన నగదు మీరు కోరుకున్న సమయంలో లభించేలా ప్రణాళిక ఉండాలి.
ఉదాహరణకు వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5 లక్షలు కావాలి, ఐదేళ్లలో రూ.5 లక్షల కావాలనుకుంటే లేదా 25–30 ఏళ్లలో రూ.కోటి రూపాయలు (రిటైర్మెంట్) కావాలనుకుంటే అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. వేర్వేరు పోర్ట్‌ఫోలియోలన్నవి కాలవ్యవధికి అనుగుణంగానే ఉండాలి. స్వల్పకాల లక్ష్యాల కోసం ఫిక్స్‌డ్ ఇన్‌కమ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్లకు మించిన ఏ లక్ష్యానికైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
అప్పుడు లక్ష్యాల వారీగా కాకుండా, కాలవ్యవధి ఆధారంగా ప్రత్యేక పోర్ట్‌ఫోలియోలు ఉంటాయి. ఇందుకోసం వ్యాల్యూరీసెర్చ్ ఆన్‌లైన్‌లో ‘మై ఇన్వెస్ట్‌మెంట్’ టూల్‌ను వినియోగించుకోవచ్చు. ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వివిధ లక్ష్యాలకు అనుగుణంగా ఈ టూల్‌తో వేరు చేసుకోవచ్చు.
నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్‌లో ఏది మంచిదనే విషయంలో సందేహం నెలకొంది. పథకం ఎంపిక చేసుకోవడం ఎలా? – స్వామినాథన్
ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్‌పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్‌పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక యాక్టివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇంతకంటే ఎక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో చెల్లించాల్సిన అవసరం లేదు.
రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందో చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూస్తే ఎస్‌బీఐ, యూటీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల పథకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment