దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తూ, ఓపిక పట్టే ఇన్వెస్టర్లకు స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గణనీయమైన రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పథకాలు గడిచిన పదేళ్ల కాలంలో ఏటా 21 శాతం కాంపౌండ్ వార్షిక రాబడిని అందించాయి. మిడ్‌క్యాప్ (19 శాతం), లార్జ్ క్యాప్ (14 శాతం) పెట్టుబడులతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించాయి. అయితే స్మాల్‌క్యాప్ పథకాలు అందరికీ అనుకూలం అని చెప్పలేం. కేవలం అధిక రిస్క్ తీసుకునే వారు, కనీసం పదేళ్ల పాటు అయినా తమ పెట్టుబడులు కొనసాగించే అవకాశం ఉన్న వారే వీటిని పరిశీలించొచ్చు. ఈ విభాగంలో గొప్ప రాబడుల చరిత్ర ఉన్న కొద్ది పథకాల్లో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ కూడా ఒకటి కావడం గమనించొచ్చు.
పెట్టుబడుల విధానం
నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలను కూడా కొంత కేటాయింపులు చేస్తుంటుంది. తద్వారా ఫండ్‌లో అంతర్లీనంగా రిస్క్ తగ్గించే వ్యూహం ఉంది. ముఖ్యంగా టాప్ 250కి పైన ఉన్న (స్మాల్‌క్యాప్) వాటిల్లోంచి భవిష్యత్తులో పెద్ద కంపెనీలుగా అవతరించే సామర్థ్యాలున్న వాటిని గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. కాలానుగుణంగా ఒక్కో సైకిల్‌లో ఒక్కో రంగానికి చెందిన కంపెనీలు బుల్ ర్యాలీ చేస్తుంటాయి. అలాంటి అవకాశాలను కూడా ఈ పథకం ముందే గుర్తించి అధిక కేటాయింపులు చేస్తుంటుంది. ఈ పథకానికి 2017 నుంచి సమీర్ రాచ్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. తేజాస్ షేత్ అనే మరొక ఫండ్ మేనేజర్ కూడా ఈ బాధ్యతలను పంచుకుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీలు స్థూల ఆర్థికపరమైన మార్పులకు సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి. అందుకని స్వల్పకాలంలో వీటిల్లో ఎక్కువ అస్థిరతలు కనిపిస్తాయి. కానీ ఓ కంపెనీని వృద్ధి దశ ఆరంభంలోనే గుర్తించి పెట్టుబడులు పెట్టి, వాటిని కొన్నేళ్లపాటు నిలకడగా కొనసాగించడం ద్వారా మెరుగైన రాబడికి వీలుంటుందని చెప్పడానికి ఈ పథకం పనితీరు నిదర్శనం.
రాబడులు
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.31,945 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈ పథకం 2010 సెప్టెంబర్ 16న మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఏటా 20 శాతానికి పైనే ఇన్వెస్టర్లకు రాబడులను అందిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 37 శాతం ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. మూడేళ్ల కాలంలోనూ వార్షిక రాబడి 46 శాతంగా ఉంది. ఐదేళ్లలో 21.72 శాతం, ఏడేళ్లలోనూ ఇంతే మేర, పదేళ్ల కాలంలో ఏటా 28.21 శాతం చొప్పున రాబడి అందించింది. అంటే ఏ కాలంలో చూసుకున్నా వార్షిక రాబడుల రేటు 20 శాతానికి పైనే ఉండడం విస్మరించకూడని విషయం.
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 96.80 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్‌క్యాప్ విభాగంలోని కంపెనీలకు 17 శాతం మేర, మిడ్‌సైజు కంపెనీలకు 38 శాతం వరకు కేటాయింపులు చేయగా, 44.81 శాతం పెట్టుబడులను స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 179 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 17.14 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 13.44 శాతం చొప్పును కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కెమికల్ కంపెనీల్లో 8.7 శాతం, సేవల రంగ కంపెనీల్లో 8 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 7.48 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 6.44 శాతం, ఆటోమొబైల్ రంగ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment