న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ పథకాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్మాల్‌క్యాప్ పథకాలు నికరంగా రూ.11,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. లార్జ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడుల విషయంలో ఫండ్ మేనేజర్లు సవాళ్లను ఎదుర్కొంటుండడంతో, ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని అంచనా.
లార్జ్‌క్యాప్ పథకాలు జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కేవలం రూ.3,360 కోట్లను ఆకర్షించడం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలోనూ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.6,932 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘గడిచిన కొన్ని నెలలుగా మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు బలమైన ర్యాలీ చేస్తున్నాయి. దీంతో లార్జ్‌క్యాప్ విభాగంలో ఆల్ఫా నమోదు చేయడం అన్నది చాలా కష్టమైన పనే అవుతుంది. స్మాల్‌క్యాప్ పథకాల్లోకి భారీ పెట్టుబడులు రావడానికి ఇదే కారణం’’అని క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లీ తెలిపారు.
అసాధారణం..
స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులు వస్తుండడంతో, ఫండ్ మేనేజర్లు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్, టాటా స్మాల్‌క్యాప్ పథకాలు లంప్‌సమ్ (ఒకే విడత) పెట్టుబడుల స్వీకరణను నిలిపివేశాయి. కేవలం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులనే అనుమతిస్తున్నాయి. భారీ పెట్టుబడులను సర్దుబాటు చేసేంత లిక్విడిటీ స్మాల్‌క్యాప్ విభాగంలో ఉండదు. ఇది రాబడులపైనా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఫండ్ మేనేజర్లు ఈ వైఖరి తీసుకున్నట్టు కనిపిస్తోంది. ‘‘ఇటీవలి నెలల్లో స్మాల్‌క్యాప్ స్టాక్స్ పనితీరు ఎంతో అసాధారణంగా ఉంది. లార్జ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల మధ్య వ్యాల్యూషన్ పరంగా ఉన్న అంతరమే దీనికి కారణంగా తెలుస్తోంది. మార్కెట్ల వ్యాల్యూషన్ ఖరీదుగా మారినప్పుడు ఇలాంటి ధోరణి కనిపించడం సహజమే. దీంతో ఫండ్ మేనేజర్లు పెట్టుబడులకు ఆకర్షణీయమైన స్టాక్స్ కోసం అన్వేషిస్తుంటారు’’అని ఏయూఎం క్యాపిటల్ మార్కెట్ వెల్త్ హెడ్ ముకేశ్ కొచ్చర్ తెలిపారు. మిడ్‌క్యాప్ స్థాయి రిస్క్‌తో మెరుగైన రాబడులకు అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు మొగ్గు చూపిస్తున్నట్టు ఆనంద్ రాథి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫెరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు.
భారీ రాబడులు
మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్‌క్యాప్ విభాగం భారీ రాబడులు ఇస్తుండడం కూడా ఈ విభాగం వైపు ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా తెలుస్తోంది. ఏడాది కాలంలో ఇవి 30–37 శాతం, మూడేళ్ల కాలంలో 40–44 శాతం, ఐదేళ్లలో 18–21 శాతం చొప్పున వార్షిక కాంపౌండెడ్ వృద్ధితో రాబడులు అందించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ చివరికి స్మాల్‌క్యాప్ ఫండ్స్ అన్నింటి నిర్వహణలోని ఆస్తులు మార్చి నుంచి చూస్తే 28 శాతం వృద్ధితో రూ.1.7 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ పథకాలు ఆటో, ఆటో విడిభాగాలు, క్యాపిటల్ గూడ్స, ఐటీ కంపెనీలకు పెట్టుబడుల పరంగా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్ విభాగానికి గరిష్టంగా 30 శాతం వరకే కేటాయించుకుని, 50 శాతం లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవడం మంచిదని అజీజ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment