మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లో రిస్క్ అధికంగా ఉంటుంది. అదే సమయంలో రాబడులు కూడా మెరుగ్గా ఉంటాయి. అస్థిరతలు చూసి చలించకుండా, సహనంతో ఉండే వారికి స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక ప్రతిఫలాన్ని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు అందిస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక పిల్లల వివాహం, ఉన్నత విద్య, రిటైర్మెంట్ తదితర దీర్ఘకాల లక్ష్యాల కోసం స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు తమ పోర్ట్‌ఫోలియోలో తప్పకుండా చోటు కల్పించుకోవడం ఎంతైనా అవసరం. ఈ విభాగంలో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్ పథకం దీర్ఘకాలంలో మంచి పనితీరుతో ఆకట్టుకుంటోంది.
రాబడులు
ఏడాది, మూడేళ్ల కాలంలో సూచీలతో పోలిస్తే రాబడుల విషయంలో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ వెనుక బడింది. కానీ, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో సూచీలకు మించి అధిక రాబడిని ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం ఇన్వెస్టర్లకు 37 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 25 శాతం చొప్పున ఉంది. ఐదేళ్లలో 26 శాతం, ఏడేళ్లలో 21 శాతం, పదేళ్ల కాలంలో 27 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో కనిపిస్తుంది. దీర్ఘకాలంలో స్మాల్‌క్యాప్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే ఎక్కువగా ఉంది.
పెట్టుబడుల విధానం
2011, 2013, 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్ పథకం నష్టాలను తగ్గించింది. 2014, 2017, 2020–21 బుల్ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. పెట్టుబడుల్లో 65 శాతం వరకు స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంటుంది. అయితే, అన్ని సమయాల్లోనూ స్మాల్‌క్యాప్ కంపెనీలకు ఇదే స్థాయిలో కేటాయింపులు చేయదు. ఒకవేళ స్మాల్‌క్యాప్ కంపెనీల వ్యాల్యూషన్లు మరీ ఖరీదుగా మారాయని భావించినప్పుడు, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌నకు కేటాయింపులు పెంచుతుంది. అలాగే, డెట్‌కు కూడా కొంత కేటాయిస్తుంటుంది.
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.24,862 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో జనవరి చివరికి 93.13 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 6.87 శాతం నగదు, నగదు సమానాల్లో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించినట్టయితే, 59.23 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 40.77 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్‌క్యాప్ ఫండ్ అయినప్పటికీ, ప్రస్తుతం అధిక భాగం పెట్టుబడులు మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.
ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆయా స్మాల్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరుతో మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలుగా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎక్కువ పెట్టుబడులు మిడ్‌క్యాప్‌లో కనిపిస్తున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 55 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్‌లోనూ పెట్టుబడులు 28 శాతం మించలేదు. అంటే ఈ పథకంలో ఎక్కువ వైవిధ్యం కనిపిస్తోంది. సేవల రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, 18 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీలకు 12 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 12 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు 9.49 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీలకు 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment