పసిడి.. వెండి- ఆకాశమే హద్దు | Gold prices jumps to new historical highs | Sakshi
Sakshi News home page

పసిడి.. వెండి- ఆకాశమే హద్దు

Published Thu, Aug 6 2020 9:43 AM | Last Updated on Thu, Aug 6 2020 10:02 AM

Gold prices jumps to new historical highs - Sakshi

ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. ఈటీఎఫ్‌ల వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలనూ భారీగా ఆకట్టుకుంటున్న బంగారం, వెండి ధరల ర్యాలీ కొనసాగుతూనే ఉంది.  బులియన్‌ చరిత్రలో బుధవారం మరోసారి  అటు ఫ్యూచర్స్‌,.. ఇటు స్పాట్‌ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులకు చేరాయి. ఈ బాటలో వెండి ధర 7ఏళ్ల గరిష్టాలకు చేరింది. నేటి ట్రేడింగ్‌లో సైతం లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.2 శాతం బలపడి 2056 డాలర్లకు ఎగువన కదులుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ స్వల్ప లాభంతో 2043 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. 2020లో ఇప్పటివరకూ పసిడి 500 డాలర్లు ఎగసింది. ఇది 34 శాతం వృద్ధికాగా.. గత రెండు వారాల్లోనే 200 డాలర్లు పెరగడం విశేషం! ఇక వెండి సైతం 0.6 శాతం బలపడి 27 డాలర్లకు ఎగువన ట్రేడవుతోంది. తద్వారా 2020లో ఏకంగా 48 శాతం ర్యాలీ చేసింది. వెరసి 2013 తదుపరి గరిష్ట స్థాయికి చేరింది! 

ర్యాలీ బాటలోనే
ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి(అక్టోబర్‌ ఫ్యూచర్స్‌) రూ. 202 పుంజుకుని రూ. 55,300 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ వెండి కేజీ ధర సైతం రూ. 691 బలపడి రూ. 72,584 వద్ద కదులుతోంది.

దేశీయంగానూ
దేశీయంగా ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల పసిడి రూ. 547(1 శాతం)  లాభపడి రూ. 55,098 వద్ద నిలిచింది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధరకాగా.. తొలుత గరిష్టంగా రూ. 55,597ను తాకింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ వెండి కేజీ ధర రూ. 2096(3 శాతం) దూసుకెళ్లి రూ. 71,893 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 72,980 వరకూ ఎగసింది. తద్వారా 2011 ఏప్రిల్‌ 25న సాధించిన రికార్డ్‌ గరిష్టం రూ. 75,000 మార్క్‌కు చేరువైంది! 

ఈటీఎఫ్‌ల జోరు
ఈ జనవరి-జూన్‌ కాలంలో పసిడి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ పేర్కొంది. గత ఆరు నెలల కాలంలో 734 టన్నుల పసిడిని ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. దీంతో జూన్‌చివరికల్లా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల మొత్తం విలువ 3,621 టన్నులకు చేరినట్లు వెల్లడించింది. ఇది సరికొత్త రికార్డ్‌ కావడం గమనార్హం! అంటే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఇన్వెస్టర్లు 47 బిలియన్‌ డాలర్లను గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేశారు. పసిడి ఈటీఎఫ్‌ల విలువ చరిత్రలో తొలిసారి 206 బిలియన్‌ డాలర్లను తాకింది. కాగా.. ప్రస్తుత ధరల ప్రకారం జులై చివరికల్లా 922 టన్నుల పసిడి జమకాగా.. 60 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసినట్లు డబ్ల్యూజీసీ తాజాగా తెలియజేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement