Gold business
-
ఆర్థిక శాఖ ఆదేశాలు: పసిడి రుణాలను సమీక్షించుకోండి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న పసిడి రుణాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుండటంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇలాంటి పలు ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, ఈ నేపథ్యంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియోను సమగ్రంగా సమీక్షించుకోవాలని పీఎస్‌యూ బ్యాంకులన్నింటికీ సూచించింది. ఈ మేరకు బ్యాంకుల చీఫ్‌లకు లేఖ రాసినట్లు ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. బంగారం రుణాలపై ఫీజులు.. వడ్డీల వసూళ్లు.. ఖాతాల మూసివేతలో అవకతవకలు జరుగుతుండటం, తగినంత విలువ గల బంగారాన్ని తనఖా పెట్టించుకోకుండానే రుణాలివ్వడం, నగదు రూపంలో రీపేమెంట్లు తీసుకోవడం తదితర ఉల్లంఘనలపై డీఎఫ్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 31 వరకు మంజూరైన రుణాలపై సమీక్ష జరగనుంది. ఇవి చదవండి: ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
బంగారం ధర గరిష్ఠానికి చేరనుందా..?
బంగారం ధరలు సమీప భవిష్యత్తులో మరింత పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీని ధర రికార్డు స్థాయిల్లోకి చేరుకుంటుంది. ఈ ఏడాది ఆల్‌టైమ్‌హైకి చేరనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరంలోనే 10 గ్రాములు రూ.72వేలు పలుకుందని అంచనాలు వస్తున్నాయి. దేశీయ, విదేశీ స్టాక్‌మార్కెట్లు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల విధానాలు, యూఎస్ డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్‌తోపాటు భారత్‌సహా పలు ప్రధాన దేశాల్లో ఎన్నికలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,050 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,600గా ఉంది దిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,880గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. -
బంగారం ధరలు మళ్ళీ పెరగడానికి కారణం ఇదే!
-
మట్టే బంగారమాయెనే.. 700 టన్నుల బంగారు నిక్షేపాలు
Gold Become a Major Occupation In Thailand: పర్యాటకానికి థాయిలాండ్ పెట్టింది పేరు. అందమైన నీలి మహాసముద్రాలు, వెచ్చని ఇసుక బీచ్‌లు, ఆసక్తికరమైన సంస్కృతి, ఆహ్లాదకరమైన వాతావరణం, స్పా సెంటర్లు, విదేశీయుల సాహస క్రీడలు, సినిమా షూటింగ్‌లు, పచ్చని ప్రకృతి అందాలతో కళకళలాడే థాయిలాండ్ కరోనా దెబ్బకి ఆ వైభవాన్ని కోల్పోయింది. నిత్యం విదేశీ పర్యాటకుల సేవలో తరించే స్థానిక ప్రజలు.. ఉపాధి కరువై నదులు, కాలువలు, చెలమల్లో నీటిలోని అవక్షేపాలను వడపోస్తూ కనిపిస్తున్నారు. తమ పూర్వీకుల బాటలో సాంప్రదాయ పద్ధతుల్లో బంగారు అన్వేషణను ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. గోల్డ్ మౌంటెన్.. థాయి దక్షిణ ప్రావిన్స్‌లో మలేసియా సరిహద్దులోని సుఖిరిన్ ప్రాంతాన్ని గోల్డ్ మౌంటెన్ (బంగారు పర్వతం)గా పిలుస్తారు. ఇక్కడి సై బురి నది పరీవాహక ప్రాంతం అపార బంగారు నిక్షేపాలతో మెరుస్తోంది. ఇంతకు ముందు టూరిస్ట్ గైడులుగా, పర్యాటకులకు స్థానిక వంటకాలను రూచి చూపిస్తూ ఆదాయాన్ని ఆర్జించిన స్థానికులు ఇప్పుడు గోల్డ్ ప్యానర్లుగా (బంగారు అన్వేషకులు) మారిపోతున్నారు. ఇందులో అధికంగా మహిళలు ఉండటం గమనార్హం. ఒకప్పుడు విదేశీ పర్యాటకుల రద్దీతో కయకింగ్ చేసే నదుల్లో ఇప్పుడు రోజుకు 300 మంది వరకు స్థానికులు బంగారాన్ని వెతుకుతున్నారు. చాలా ఏళ్లుగా బ్యాంగ్ సఫాన్ జిల్లా టాంబోన్ రాన్ థాంగ్ ప్రాంతం అత్యుత్తమ నాణ్యమైన బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. అక్కడ బంగారం కోసం పాన్ చేసే విధానాన్ని చూడటానికి వచ్చిన పర్యాటకులు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంతో భారీగా ఆదాయం వచ్చేది. సగటున గ్రాము బంగారం సేకరణ.. రోజుకి ఒక కుటుంబం గంటల కొద్దీ నీటిలో అన్వేషణ చేస్తే ఒక గ్రాము బంగారు దొరుకుతుంది. ఒక గ్రాము బంగారాన్ని 1,500 బాత్‌లకు (ఒక బాత్ భారత కరెన్సీలో రూ.2.23) స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ దక్షిణ గ్రామాల నుంచి సేకరించిన బంగారాన్ని బ్యాంకాక్‌లో ఆభరణాల తయారీకి వినియోగిస్తారు. చాలా మంది పానింగ్పై ఆధారపడి తమ పిల్లల వివాహాలు, చదువులు, ఇళ్లు, ఆదాయాన్ని కూడబెట్టుకున్నారు. సై బూరి నదిలో బంగారం కోసం పడిగాపులు కాసేవారిలో రైతులు కూడా ఉన్నారు. 700 టన్నుల బంగారం.. థాయిలోని 31 ప్రావిన్స్‌ల్లో 76 చోట్ల 700 టన్నుల బంగారు నిక్షేపాలను కనుగొన్నారు. వీటి విలువ 900 బిలియన్ల నుంచి ఒక ట్రిలియన్ బాత్ ఉంటుంది. థాయిలాండ్ అంతటా ప్రవహించే అనేక నదులు, ప్రవాహాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాంగ్ సఫాన్ జిల్లాలో మే నుంచి డిసెంబర్, సుఖిరన్లో డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ అన్వేషణ ఎక్కువగా జరుగుతుంది. నదుల్లో నీటి మట్టం పెరిగినప్పుడు, తగ్గినప్పుడు ఎక్కువగా బంగారం దొరుకుతుంది. ఇప్పటికీ థాయిలాండ్‌లోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు బంగారం కోసం వాంగ్ నదికి తరలిరావడం గమనార్హం. ఇక్కడి బంగారు అన్వేషణకు నిర్ణీత రుసుముతో స్థానిక ప్రభుత్వం అనుమతులిస్తోంది. అపార నిధులను వెలికి తీసేందుకు భారీ వృక్ష సంపద అడ్డురావడంతో అక్కడి ప్రభుత్వం సాంప్రదాయ పద్ధతుల వైపే మొగ్గు చూపుతోంది. పానింగ్ అంటే? నదుల్లోని అడుగు భాగం నుంచి కంకర, ఇసుకతో కూడిన ఒండ్రు పదార్థాలను పైకి తీస్తారు. వాటిని ఒక గమేళ వంటి పాత్రలో వేసి రాళ్లు, ఇసుకను వేరు చేస్తారు. మిగిలిన దానిని పాత్రతో నీటిపై స్విర్లింగ్ మోషన్ (కుడి, ఎడమకు తిప్పుతూ)లో కడుగుతారు. ఈ క్రమంలో తేలికైన పదార్థం పాన్ పైభాగానికి తేలుతుంది. బరువైన బంగారు రేణువులు దిగువకు మునిగిపోతాయి. వీటిని గోల్డ్ డస్ట్ అని పిలుస్తారు. మరికొంతమంది నీటి అడుగు భాగంగా డైవింగ్ చేస్తూ భారీగా బంగారాన్ని సేకరిస్తారు. -
భారత్‌లో రెండో ముంబై ఎక్కడుందో తెలుసా..!!
Why Proddatur Famous For Gold: మన దేశంలో బంగారు వ్యాపారంలో ముంబైదే అగ్రస్థానం. ముంబై తర్వాత పసిడి వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతం ప్రొద్దుటూరు. అందుకే ప్రొద్దుటూరును సెకండ్ ముంబై, పసిడిపురిగా పిలుస్తారు. ప్రొద్దుటూరు బంగారమంటే ఇష్టపడని వారుండరు. ఇక్కడ కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండదు. నాణ్యత, తూకంలో తేడా కనిపించదు. ఖచ్చితమైన ధర ఉంటుంది. కోరిన డిజైన్‌లో నగలు తయారు చేసే అద్భుత ప్రతిభ కలిగిన స్వర్ణకారులు ఇక్కడ కోకొల్లలు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరుకు రావాల్సిందే. ఇక్కడి బంగారు వ్యాపారానికి వందేళ్ల చరిత్ర ఉంది. చిన్న గ్రామంగా ఉన్న ప్రొద్దుటూరు అప్పట్లో నీలి మందు వ్యాపారానికి ప్రసిద్ధి. స్థానిక అమ్మవారిశాల వీధిలోని పలువురు వర్తకులు నీలిమందు వ్యాపారం చేస్తూ నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేసేవారు. కాలక్రమేనా నీలిమందుకు ఆదరణ తగ్గడంతో బంగారం వ్యాపారం వైపు వారి దృష్టి మళ్లింది. 100 ఏళ్ల నాడు కేవలం 20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. వీరు నమ్మకంతో బంగారు వ్యాపారం సాగించేవారు. నాడు పదుల సంఖ్యలో ఉన్న బంగారు దుకాణాలు నేడు వందల్లో ఉన్నాయి. స్వర్ణకారులు కూడా వేలల్లో ఉన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణా, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి బంగారు కొనుగోళ్ల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. రెండో ముంబైగా ఎలా పేరొచ్చిందంటే.. 1968లో అప్పటి ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం దేశంలో లైసెన్సు లేకుండా బంగారు దుకాణాలు నిర్వహించం నేరం. అప్పట్లో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత బంగారు వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు. నాటి భారతప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. ఈ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90 శాతం బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. ఆ రోజు నుంచి రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తారు. టెండర్ల అనంతరం ప్రొద్దుటూరులో పలుమార్లు సీబీఐ దాడులు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పెద్ద పరిశ్రమగా బంగారు వ్యాపారం ఇక్కడి బంగారు వ్యాపారం రాష్ట్రంలోనే పెద్ద పరిశ్రమగా వెలుగొందుతోంది. ఒకప్పుడు మెయిన్‌బజార్ (అమ్మవారిశాల వీధి)లో మాత్రమే దుకాణాలు ఉండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్ షాపులు విస్తరించాయి. సుమారు 400కు పైగా బంగారు విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్ షాపులు ఉన్నాయి. 12 వేల మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు ధీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి. వివాహ ముహుర్తాలు, పండుగలు, అందరూ సెంటిమెంట్‌గా భావించే అక్షయ తృతీయ రోజున బులియన్ మార్కెట్ నూతన శోభ సంతరించుకుంటుంది. ఆన్లైన్ ధరల ప్రకారం బంగారు విక్రయాలు నిర్వహిస్తారు. ముంబైలో లభించే ధరకే ప్రొద్దుటూరులో బంగారు లావాదేవీలు జరుగుతుంటాయి. వ్యాపారులు, స్వర్ణకారులు బ్యాంక్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసి నగలను తయారు చేస్తారు. 100 మిల్లీ గ్రాముల ముక్కు పుడక నుంచి 100–120 గ్రాముల వడ్డాణం వరకు విలువైన ఆభరణాలను స్వర్ణకారులు తయారు చేస్తారు. అంతేగాక రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల దేవతామూర్తుల కిరీటాలు, ఆభరణాలు కూడా ఇక్కడే తయారు అవుతుంటాయి. స్థానికులే గాక బెంగాల్, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది స్వర్ణకారులు ప్రొద్దుటూరులో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో పడిపోయిన వ్యాపారాలు లాక్డౌన్ కారణంగా బంగారు వ్యాపారాలు బాగా పడిపోయాయి. కరోనా భయంతో వినియోగదారులు బయటికి రాకపోవడంతో ఆసించినంత స్థాయిలో వ్యాపారాలు జరగడం లేదని వ్యాపారాలు చెబుతున్నారు. గతంలో రోజుకు రూ. 40–45 కోట్ల మేర క్రయ విక్రయాలు జరుగుతుండగా ప్రస్తుతం రూ. 15–20 కోట్లకు పడిపోయినట్లు వ్యాపార వర్గాల సమాచారం. స్వచ్ఛమైన బంగారంతో నగలు స్వచ్ఛమైన బంగారంతో నగలను తయారు చేయడం ఇక్కడి స్వర్ణకారులు, వ్యాపారుల ప్రతిభ. వినియోగదారులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నాం. ప్రొద్దుటూరుకు పసిడిపురిగా పేరు రావడానికి పూర్వీకుల శ్రమ ఉంది. నాటి స్వర్ణకారుల ప్రతిభ వల్లనే ఇంతటి పేరు వచ్చింది. ఆ పేరును కాపాడుకుంటూ వస్తున్నాం. – ఉప్పర మురళి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు, ప్రొద్దుటూరు . రెడిమేడ్ ఆభరణాలతో పని తగ్గింది కొన్ని రోజుల క్రితం వరకు పని బాగా ఉండేది. స్వర్ణకారుల పనితనానికి విలువ, గుర్తింపు ఉండేది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి రెడిమేడ్ ఆభరణాలను వ్యాపారులు దిగుమతి చేసుకోవడంతో మాకు పనులు లేకుండా పోయాయి. పెళ్లి ముహుర్తాల్లోనే కొంత పని ఉంటుంది కానీ మిగతా రోజుల్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. – జిలానిబాషా, స్వర్ణకారుడు, ప్రొద్దుటూరు -
పాతబస్తీ నుంచి తరలి వెళుతున్న వ్యాపారం..
చార్మినార్: బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు పాతబస్తీ ప్రధాన వ్యాపార కేంద్రం. నిజానికి నిజాం కాలం నుంచి ఇక్కడ బంగారు ఆభరణాల క్రయవిక్రయాలకు ఆదరణ ఉంది. అయితే కొంత కాలంగా ఇక్కడ వ్యాపారాలు తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు 2000 వరకు దుకాణాలున్న పాతబస్తీలో సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఒకప్పటి వ్యాపారాలు ఇప్పుడు కనిపించడం లేదు. దుకాణాల ముందు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి సరైన స్థలాలు లేకపోవడంతో అటు వ్యాపారులతో పాటు వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. అడ్దదిడ్డమైన ట్రాఫిక్‌కు తోడు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడ తమ బ్రాంచీలను నామమాత్రంగా కొనసాగిస్తునే... నగరంలో శాఖలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పాతబస్తీకి వచ్చే పర్యాటకులు... హెదరాబాద్ అంటే చార్మినార్ గుర్తుకు వస్తుంది. చార్మినార్‌కు వచ్చే పర్యాటకులకు చార్‌కమాన్‌లోని నగల దుకాణాలు ముందుగా దర్శనమిస్తాయి. పాతబస్తీ సంస్క ృతికి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా ఇక్కడి బంగారు, వెండి, ముత్యాల నగల దుకాణాలు ప్రసిద్ధి చెందాయి. నిజాం కాలం నుంచి ఇక్కడ బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కే సరైన పార్కింగ్ లేదని... ఇక కార్లు తదితర వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక వినియోగ దారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రానురాను తమ వ్యాపారాలు కుంటుపడుతున్నాయంటున్నారు. పాతబస్తీలోని చార్మినార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, శాలిబండ, కాలికమాన్, మిట్టికాషేర్, ఘాన్సీబజార్ తదితర ప్రాంతాల్లో బంగారం, వెండి, ముత్యాల ఆభరణాల షోరూంలున్నాయి. ప్రస్తుతం పాతబస్తీలో గిరాకీ తగ్గడంతో ఇక్కడి వ్యాపారస్తులు నగరంలోని అబిడ్స్, సిద్ధంబర్‌బజార్, గన్‌ఫౌండ్రి, బషీర్‌బాగ్, సికింద్రాబాద్, బేగంబజార్, మెహిదీపట్నం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారహిల్స్, చిక్కడపల్లి, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో తమ షోరూంలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. సాధ్యమైనంత వెంటనే పాతబస్తీలో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత క్లిష్టతరంగా మారుతాయని ఇMý్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్య రద్దీ... తప్పని ట్రాఫిక్ తిప్పలు.. నగరంలో ప్రథమంగా నగల దుకాణాలు చార్కమాన్లోనే ప్రారంభమయ్యాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. దాదాపు 2000కు పైగా ఉన్న ఇక్కడి దుకాణాలు ప్రతిరోజు కస్టమర్లకు తమ సేవలను అందజేస్తున్నాయి. పాతబస్తీని సందర్శించడానికి వచ్చే పర్యాటకులే కాకుండా నగర శివారు జిల్లాల వినియోగదారులు కూడా చార్‌కమాన్‌లోని బంగారు నగల దుకాణాలకు వచ్చి తమకు అవసరమైన ఆభరణాలను ఖరీదు చేస్తుండడంతో ప్రతిరోజూ వినియోగదారులతో ఇక్కడి నగల దుకాణాలు రద్దీగా మారతాయి. ప్రస్తుతం ఇక్కడి వ్యాపార పరిస్థితులు గతంలో కన్నా భిన్నంగా తయారయ్యాయి. వినియోగ దారులు రావడానికి సరైన మార్గాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఇక్కడ గిరాకీ పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి బంగారం, వెండి ఆభరణాల వ్యాపారాభివృద్దికి అటు ప్రజాప్రతినిధులు గానీ...ఇటు సంబందిత అధికారులు గానీ పట్టించుకోవడం లేదని వ్యాపారులు అంటున్నారు. తమ దుకాణాల ముందు వరకు వాహనాల రాకపోకలు అందుబాటులో లేకపోవడంతో పాటు చిరువ్యాపారులను సైతం తమ షో రూంల ముందు అక్రమంగా వ్యాపారాలు కొనసాగించుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు అనుమతించడంతో రోజురోజుకూ తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో వలస కార్మికులు బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసిఇవ్వడానికి పని చేసే వలస కార్మికులు సరైన ఆర్డర్లు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పాతబస్తీలో నివాసం ఉంటున్న వలస కార్మికులు దుకాణాల యజమానుల నుంచి బంగారాన్ని ఆర్డర్లపై తీసుకుని ఆభరణాలు తయారు చేసి తిరిగి ఇస్తుంటారు. గ్రాముల వారిగా మేకింగ్ చార్జీలను తీసుకునే వలస కార్మికులకు ఆర్డర్లు కరువయ్యాయి. దీంతో వారంతా మానసిక వేదనకు గురవుతున్నారు. పాతబస్తీకే గుండెకాయగా నిలిచిన నగల వ్యాపారాలు ఎంతో మంది వలస కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఆభరణాలను తయారు చేయడానికి ఎంతో మంది యువకులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఆర్డర్లపై నగలను తయారు చేసి ఆయా దుకాణాలలోఅప్పగించి ఉపాధి పొందుతున్నారు. బెంగాళీలు గుల్జార్‌హౌజ్, కోకర్‌వాడీ, మామాజుమ్లా పాటక్, మూసాబౌలి, ఘాన్సీబజార్, జూలా, బండికా అడ్డా తదితర ప్రాంతాలలో చిన్న చిన్న ఖార్ఖానాలను ఏర్పాటుచేసుకొని బంగారు ఆభరణాలనుతయారు చేస్తున్నారు. ఇలా చార్‌కమాన్‌లోని నగల దుకాణాలు ఎంతో మందికి జీవనోపాధికల్పిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే... రాబోయే రోజుల్లోపాతబస్తీలో బంగారం, వెండి వ్యాపారాలుకనుమరుగయ్యే పరిస్థితలు ఎదురవుతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కొత్త బిజినెస్ మొదలెట్టిన కాజల్
చెన్నై : ఇప్పుడు సినీ నటీమణుల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీరు ఇప్పుడు ఒక వృత్తినే నమ్ముకోవడం లేదు. సినిమాలు, ప్రచార చిత్రాలు అంటూ చేతి నిండా సంపాదిస్తున్నారు. తమన్నా, త్రిష, కాజల్‌అగర్వాల్ ఇలా అగ్రహీరోయిన్లుగా రాణిస్తున్న వారంతా తమ క్రేజ్‌ను ఇతర రంగాల్లోనూ వాడుకుంటున్నారు. వీరిలో కొందరు సంపాదనను స్థిరాస్తులుగా మార్చుకుంటుంటే మరికొందరు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. నటి కాజల్‌అగర్వాల్ ఇదే పని చేస్తోంది. వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ సంపాదిస్తోంది. తాజాగా నిర్మాతగానూ అవతారమెత్తిన ఈ బ్యూటీ బంగారం వ్యాపారంలోనూ పెట్టుబడులను పెడుతోంది. ముంబాయిలో సొంతంగా నగల దుకాణాన్ని ప్రారంభించింది. సినిమాల్లో సంపాదించిన డబ్బును ఆ నగల వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతోంది. కొందరు నటీమణులు హోటళ్ల లాంటి వ్యాపారాలతో లాభ నష్టాలను చవిచూస్తుంటే నటి కాజల్ మాత్రం తెలివిగా ఆదాయమే తప్ప నష్టం అనే మాటకు తావులేని లాభదాయకమైన బంగారం నగల వ్యాపారాన్ని ఎంచుకోవడం విశేషం. ఇక నటిగా ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో ఒక చిత్రం అంటూ బిజీగా నటిస్తున్న కాజల్ అగర్వాల్‌కు లోటు అన్నదేమైనా ఉంటే అది పెళ్లినే. కాజల్‌కు సరైన వరుడు సెట్ కావడం లేదు. ఈ అమ్మడికి 36 ఏళ్ల వయసు పైబడుతోంది. దీంతో ఎలాగైనా ఈ ఏడాదిలో కాజల్ అగర్వాల్ పెళ్లి చేయాలనే కృతనిశ్చయంతో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. అయితే నటిగా బిజీగా ఉన్న కాజల్‌అగర్వాల్ వారి నిర్ణయాన్ని ఎంత వరకు స్వాగతిస్తుందన్నది చూడాలి. కాజల్‌అగర్వాల్ చెల్లెలు నిషాఅగర్వాల్కు ఇప్పటికే పెళ్లి అయ్యి ఒక బిడ్డ కూడా ఉందన్నది గమనార్హం. -
జీరో దందా! దొంగా.. పోలీస్
జీరో గోల్డ్ దందా. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదనకు ఇది ప్రధాన వ్యాపారం. ఈ చీకటి దందాలో దొంగా పోలీసాటలో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన దోపిడీ నుంచి తాజాగా అదే రైలులో జరిగిన దోపిడీలో పోలీసులు కీలక పాత్రదారులుగా ఉండడం గమనార్హం. అంతా సినీ ఫక్కీలో జరిగే ఈ తంతులో బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలు అమ్మకాలు చేసి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. బిల్లులు లేని జీరో దందా బంగారం వ్యాపార వ్యవహారాల్లో జరుగుతున్న సంఘటనలు ఆసక్తిగా ఉన్నాయి. కావలి:కావలి పట్టణంలో చాలా మంది వ్యాపారస్తులు చెన్నై నుంచి బంగారం కొనుగోలు చేసి కావలికి తీసుకొస్తుంటారు. ఇందుకు నమ్మకస్తులైన వ్యక్తులను (సీజన్ బాయ్స్) ఏర్పాటు చేసుకొని వారికి నగదు ఇచ్చి, చెన్నైకు పంపి బంగారు బిస్కెట్లు కావలికి వచ్చేలా చేస్తుంటారు. 100 గ్రాముల బరువు ఉన్న బంగారు బిస్కెట్లను మాత్రమే తీసుకొచ్చి, వాటిని కావలి, నెల్లూరు, కందుకూరు, ఒంగోలు, చీరాల గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన పట్టణాలతో పాటు చిన్న పట్టణాలకు కూడా అమ్మకాలు చేస్తుంటారు. బిల్లులు లేకుండా 100 గ్రాముల బిస్కెట్ బంగారం రూ.3,27,000 ధర ఉంటుంది. బిల్లులతో కొనుగోలు చేయాలంటే అన్ని రకాల పన్నులతో కలిసి రూ. 3.50 లక్షల వరకు ఉంటుంది. ఒక్కసారి చెన్నై ట్రిప్ వేస్తే కనీసం కేజీకి తక్కువ కాకుండా ఐదు కేజీలు వరకు తీసుకొస్తుంటారు. అంటే ట్రిప్పుకు సుమారు ఆదాయం రూ.2.30 లక్షలు నుంచి రూ.11.50 లక్షలు వరకు ఆదాయం ఉంటుంది. కుదిరితే నెలకు నాలుగు, ఐదు చెన్నై ట్రిప్పులు వేస్తారు. ప్రతి నెల రూ.వందల కోట్లు విలువ చేసే బంగారం చెన్నై నుంచి కావలికి వస్తోంది. అనధికారికంగా పెద్ద మొత్తం తరలింపు చెన్నైకి వెళ్లే వ్యక్తి కనీసం రూ.10 లక్షలు నుంచి రూ.2 కోట్ల వరకు నగదును ఎటువంటి లెక్కలు లేకుండా సంచుల్లో, బ్యాగ్‌ల్లో పెట్టుకొని సాధారణ ప్రయాణికుడిగా రైళ్లల్లో, బస్సుల్లో, అవసరమైతే కారుల్లో ప్రయాణం చేస్తుంటారు. బంగారు వ్యాపారస్తులతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారానే ఈ ప్రయాణ వివరాలు బయటకు తెలుస్తుంటాయి. కొందరు వీరి బలహీనతనే అస్త్రంగా వాడుకొని నగదును కాజేయాలనే వ్యక్తులు తయారయ్యారు. పలు సందర్భాల్లో కావలి– చెన్నై మధ్య ప్రయాణంలో అధికారులు తనిఖీలు చేసి కొంత నగదు తీసుకున్నారని, కొంత బంగారం తీసుకొన్నారని బంగారం వ్యాపారులకు సీజన్ బాయ్స్ చెబుతుంటారు. ఇవన్నీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖలకు చెందిన అధికారులకు తనిఖీలు చేసే అధికారం ఉండడంతో వారితో తలనొప్పులు ఎందుకులే అని బంగారు వ్యాపారులు సైలెంట్‌గా ఉండిపోతారు. నిజంగా తనిఖీ అధికారులు తీసుకొన్నారా, సీజన్ బాయ్స్ నొక్కేశారా అనేది కూడా తెలియని విధంగా అంతా గప్‌చుప్ అయిపోతారు. దీనిని ఆసరాగా తీసుకున్న సీజన్ బాయ్స్ అడ్డదారులు తొక్కడం ప్రారంభించారు. జీరో దందాపై పోలీస్ కన్ను తొలుత జీరో దందాపై పోలీసుల కన్ను పడింది. సీజన్ బాయ్స్‌ను బెదిరించి వారి దగ్గర నుంచి బంగారం కానీ నగదును కానీ కాజేసేవారని ఆరోపణలు ఉన్నాయి. అవి చిన్న మొత్తంలో ఉండడంతో వ్యాపారస్తులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బులు నొక్కేయడం ఆరంభించారు. అందులో భాగంగానే 2015లో కావలికి సీజన్ బాయ్స్ కోటి రూపాయలను వెంట పెట్టుకొని రైల్లో ప్రయాణం చేస్తుండగా, నెల్లూరు–పడుగుపాడు రైల్వేస్టేషన్ మధ్యలో పోలీసులు తాము తనిఖీ అధికారులమని చెప్పి బెదిరించారు. వారిని నెల్లూరు రైల్వేస్టేషన్లో దింపి కారులో ఎక్కించుకొని, వారి వద్ద ఉన్న నగదును తీసుకొన్నారు. జాతీయ రహదారిపై కావలి సమీపంలో ఆ వ్యక్తిని దింపి కారులో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని పట్టణానికి చేరుకొన్న సీజన్ బాయ్స్ చెప్పడంతో కొందరు బంగారు వ్యాపారులు పోలీసులకు సమాచారాన్ని తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును, అందులోని వ్యక్తులను కందుకూరు–కనిగిరి మధ్య పట్టుకొన్నారు. నగదును కూడా స్వాధీనం చేసుకొన్నారు. ఈ దందాలో ఒక ఓఎస్డీతో పాటు, ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. తాజాగా బయట వ్యక్తుల ప్రాత్ర తాజాగా ఈ నెల 17 వతేదీ కావలికి చెందిన పొన్నూరు మల్లికార్జురావు (పీఎంఆర్ జువలరీస్)అనే బంగారు వ్యాపారి తనతో సంబంధం ఉన్న మహిళ, ఆమె స్నేహితురాలు, ఒక సీజన్ బాయ్‌కి నగదు ఇచ్చి చెన్నై నుంచి బంగారు బిస్కెట్లు కోసం పంపాడు. ఈ ఘటనలో కూడా టీడీపీ నాయకుడితో పాటు పోలీసులు సుమారు రూ. 50 లక్షలు అపహరించుకుపోయారు. దీనిపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీనిపై విచారణ చేయగా కావలి రూరల్ మండలం చెన్నాయపాళెంకు చెందిన టీడీపీ నేత మర్రి రవితో పాటు, మరికొంత మంది పోలీసులు వ్యాపారికి సంబంధించిన మహిళతో మిలాఖత్ అయి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో రూ. 50 లక్షలు అపహరించారని పోలీసుల విచారణలో వెల్లడయింది. అత్యంత గోప్యంగా జరుగుతున్న ఈ చీకటి వ్యాపారంలో ఒక్క పోలీస్ శాఖే కాదు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారుల పాత్ర కూడా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
డిజిటల్ గోల్డ్.. జిగేల్!
న్యూఢిల్లీ: బంగారం డిజిటల్ రూపంలోనూ తళుక్కుమంటోంది. ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరుగుదలే దీన్ని తెలియజేస్తోంది. 2012–13లో బంగారం డిజిటల్ ఖాతాల ఆరంభం నుంచి చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 8 కోట్లకు పైగా ఖాతాలు ఆరంభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ రూపంలో బంగారాన్ని ఆన్లైన్లో ఎన్నో వేదికలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి అగ్రగామి సంస్థలు ఉన్నాయి. కొనుగోలు చేసిన బంగారాన్ని ఆయా సంస్థల వద్దే స్టోర్ చేసుకునే అవకాశం లేదంటే భౌతిక రూపంలో డెలివరీ తీసుకునే సదుపాయాలు కూడా వినియోగదారులను ఆకర్షింపజేస్తున్నాయి. సేఫ్గోల్డ్, డిజిటల్ గోల్డ్ వంటి సంస్థలూ ఈ సేవలను అందిస్తున్నాయి. ఆగ్మంట్ అనే సంస్థ రిఫైనరీల వద్ద స్వచ్ఛమైన బంగారం నుంచి దాన్ని మార్కెటింగ్ వరకు సమగ్ర సేవల్లో ఉన్న కంపెనీ. ఈ సంస్థ ‘డిజిగోల్డ్’ పేరుతో 2012 నుంచి డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇక మోతీలాల్ ఓస్వాల్ సైతం ఈ సేవల్లోకి ప్రవేశించింది. ఇటీవలే ఈ సేవల్లోకి గూగుల్‌పే సైతం అడుగు పెట్టడం ఈ మార్కెట్ భారీగా విస్తరించేందుకు చేయూతనివ్వగలదని పరిశ్రమకు చెందిన ఓ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్... వివిధ రకాల వేదికలుగా వార్షికంగా తొమ్మిది టన్నుల వరకు డిజిటల్ గోల్డ్ విక్రయాలు జరుగుతున్నాయని పరిశ్రమ అంచనా. ఇందులో సుమారు మూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు దారులు ప్రత్యక్ష రూపంలో డెలివరీ తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఆన్లైన్ వేదికల్లో బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్ల విక్రయాలు కూడా జోరుగా కొనసాగుతుండడం గమనార్హం. డిజిటల్ గోల్డ్ కొనే వారు పెరిగిపోతుండడం, దీనికి తోడు ఆన్లైన్లోనే ఆభరణాలు కొనే ధోరణి విస్తరిస్తుండడం సంప్రదాయ జ్యుయలరీ వర్తకులను ఆందోళనకు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్‌కు ఆసక్తి చూపించడానికి నాణ్యమైన, పారదర్శక సేవల ప్రాముఖ్యాన్నీ అర్థం చేసుకోవాల్సి ఉంది. కొన్న డిజిటల్ బంగారాన్ని ఉచితంగా స్టోర్ చేసుకునే సదుపాయం, కోరినప్పుడు బంగారం రూపంలోనే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే సేవలను అవి ఆఫర్ చేస్తున్నాయి. దీనికితోడు డిజిటల్ గోల్డ్‌ను బంగారు ఆభరణాల కొనుగోలుతో మార్చుకునే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆభరణాలుగా డిజిటల్ గోల్డ్ ఆగ్మంట్ సంస్థకు సొంతంగా గోల్డ్ రిఫైనరీ (బంగారం శుద్ధి కర్మాగారం) కూడా ఉంది. డెలివరీ కోరుకుంటే బంగారాన్ని ఇంటికే తీసుకొచ్చి ఇస్తోంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలు కొనుగోలు చేసిన బంగారాన్ని తమ వేదికలుగానే స్టోర్ చేసుకునేందుకు గాను ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియాతో ఒప్పందం చేసుకుని ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. సేఫ్ గోల్డ్, ఆగ్మంట్ సంస్థలు ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్‌తో ఇందుకోసం టై అప్ అయ్యాయి. డిజిటల్ ఖాతాల్లోని బంగారాన్ని ఆభరణాలుగా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని క్యారట్‌లేన్, క్యాండిర్ (కల్యాణ్ జ్యుయలర్స్ ఆన్లైన్ సబ్సిడరీలు) సౌజన్యంతో అందిస్తున్నట్టు డిజిటల్ గోల్డ్ ఇండియా ఎండీ గౌరవ్ మాథుర్ తెలిపారు. సేఫ్గోల్డ్ మాతృ సంస్థే డిజిటల్‌గోల్డ్. వినియోగదారులకు మరిన్ని ఎంపికల అవకాశాలను అందించేందుకు జ్యుయలర్స్ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టినట్టు మాథుర్ చెప్పారు. పేటీఎం, గూగుల్ పే లేదా ఫోన్‌పే సంస్థల వేదికలపై కొనుగోలు చేసిన మొత్తాన్ని బంగారం రూపంలో ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియా సంస్థ తమ వోల్ట్‌లలో భద్రంగా ఉంచేస్తుంది. కోరితే డెలివరీ కూడా చేస్తుంది. గూగుల్ పే రాకతో డిజిటల్ ఖాతాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నామని ఓ కంపెనీ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం. ఆగ్మంట్ సంస్థ బంగారం కాయిన్లను సైతం డెలివరీ చేస్తోంది. ‘‘వేల సంఖ్యలో జ్యూయలర్లను మా ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలన్నది ప్రణాళిక. దీంతో ఆగ్మంట్ కస్టమర్లు తమ బంగారాన్ని ఆభరణాలతో మార్పిడి చేసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ ఈ కామర్స్, వ్యాలెట్ ప్లాట్‌ఫామ్‌లపై ఆగ్మంట్ గోల్డ్ కొనే అవకాశం కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం’’ అని ఆగ్మంట్ డైరెక్టర్ సచిన్ కొఠారి తెలిపారు. ► వ్యాలెట్ల నుంచి యాప్స్ నుంచి బంగారం కొనుగోలు చేసుకోవడాన్నే డిజిటల్ గోల్డ్‌గా పేర్కొంటారు. ► జరుగుతున్న కొనుగోళ్లలో 85 శాతం మంది డెలివరీ తీసుకోవడం లేదు. ► డెలివరీ తీసుకుంటున్న వారిలోనూ ఎక్కువ మంది కాయిన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ► ఈ ధోరణి కాస్తా భవిష్యత్తులో బంగారం ఆభరణాలను డెలివరీ తీసుకోవడానికి మారనుందని అంచనా. ► కనీసం రూ.100 నుంచి కూడా పేటీఎం, సేఫ్గోల్డ్ వేదికల్లో బంగారం కొనుక్కోవచ్చు. ► ప్రస్తుతం రోజువారీగా జరుగుతున్న డిజిటల్ గోల్డ్ లావాదేవీల పరిమాణం 8–9 కిలోలు. గూగుల్ పే ద్వారా పసిడి కొనుగోళ్లు ఎంఎంటీసీ–పీఏఎంపీతో జట్టు న్యూఢిల్లీ: చెల్లింపుల యాప్ గూగుల్ పే ద్వారా బంగారం కొనుగోలు, అమ్మకం లావాదేవీలు కూడా జరిపే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇందుకోసం బులియన్ రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ–పీఏఎంపీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. గూగుల్ పే ద్వారా కొనుగోలు చేసే బంగారాన్ని యూజర్ల సూచనల మేరకు ఎంఎంటీసీ–పీఏఎంపీ సురక్షితమైన వోల్ట్‌లలో భద్రపరుస్తుందని గూగుల్ తెలిపింది. ఈ బంగారాన్ని లేటెస్ట్ ధర ప్రకారం ఎప్పుడైనా యూజర్లు కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేయొచ్చని వివరించింది. గూగుల్ పే యాప్‌లో ఎప్పటికప్పుడు తాజా ధరలు చూసుకోవచ్చని గూగుల్ తెలిపింది. అసలు గూగుల్ పే యాప్.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు తగిన అనుమతులు తీసుకుందా, లేదా అన్న విషయంపై వివరణనివ్వాలంటూ నియంత్రణ సంస్థ ఆర్బీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గూగుల్ కొత్తగా మరో ఫీచర్ ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ సంస్థ కేవలం చెల్లింపులకు సంబంధించి టెక్నాలజీపరమైన సేవలు మాత్రమే అందిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా లైసెన్సు అవసరం లేదని గూగుల్ వివరణనిచ్చింది. -
సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ అయింది. గోల్డ్ వ్యాపారం చేసే వ్యక్తి అసిస్టెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఎత్తున బంగారం చోరీ చేశారు. ఈ సంఘటన మోండా మార్కెట్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. వరగంల్‌కు చెందిన గోల్డ్ బిజినెస్ మెన్ అసిస్టెంట్‌తో మాట కలిపిన దొంగలు అతని దృష్టిమరల్చి 2.5 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దాంతో బంగారం యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పక్కదారి పడుతున్న పసిడి !
బాన్సువాడ : జిల్లాలో బంగారం దుకాణాల్లో క్రయ విక్రయాలు కనీస లెక్కలు లేకుండా సాగుతున్నాయి. సాధారణంగా మార్కెట్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు ఇస్తారు. రూ.10తో కొనుగోలు చేసినా, రూ.10వేలతో కొనుగోలు చేసినా బిల్లు ఇస్తారు. కానీ వెండి, బంగారు వర్తకుల దుకాణాల్లో మాత్రం లక్షలాది రూపాయలు వెచ్చించి, బంగారాన్ని కొనుగోలు చేసినా, కనీస లెక్కా, పత్రాలు ఇవ్వకపోవడం గమనార్హం. జిల్లాలో బిల్లులు లేకుండా జరుగుతున్న బంగారం వ్యాపారం ‘మూడు కాసులు... ఆరు క్యారెట్లు’గా సాగుతోంది. ఈ వ్యాపారం ఎక్కువగా నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడ, కా మారెడ్డి, బోధన్ పట్టణాల్లో జరుగుతోంది. పెళ్ళిళ్ళ సీజన్ రాకతో ప్రస్తు తం బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఇక్కడి వ్యాపారులు ముంబై, హైదరాబాద్‌లను కేంద్రంగా చేసుకొని బంగారాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకొని క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. అక్రమంగా తెస్తున్న బంగారం ఒక వేళ పోలీసుల కంటపడితే అప్పటికప్పుడే బిల్లులు తెప్పిస్తున్నారు. ఆదాయ పన్నుల శాఖకు గండి జిల్లాలో నిత్యం పది నుంచి 30 కిలోల బంగారు నగలు వస్తుంటాయని వ్యాపారుల ద్వారా తెలిసింది. సాధారణంగా నగలపై ఒక శాతం పన్ను, అదే రూ.5లక్షలు దాటితే రెండు శాతం పన్ను చెల్లించాలి. దీన్ని తప్పించుకొనేందుకే దొంగ వ్యాపారం చే స్తున్నట్లు తెలుస్తోంది. రవాణా చేసే బంగారంలో ఒకటి లేదా రెండు కిలోలకు మాత్రమే బిల్లులు ఉంటాయి. ఇలా పది కిలోల బంగారం బిల్లులు లేకుండా చేస్తే ప్రభుత్వానికి రూ.5లక్షల వరకు గండి పడుతుంది. అంటే మొత్తం మీద రూ.10 లక్షల వరకు హోల్‌సెల్ వ్యాపారులే ప్రతీ నెల ఆదాయ పన్నుల శాఖకు గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా అక్రమంగా దిగుమతి చేసుకొంటున్న బంగారానికి లెక్కలు చూకపోవడంతో ప్రభుత్వానికి భారీ స్థాయిలోనే ఆదాయానికి గండి పడుతోంది. దిగుమతి చేసుకొంటున్న బంగారంలో సింహ భాగం లెక్కలు లేకపోవడంతో జిల్లాలో దొంగ బంగారం యథేచ్ఛగా చేతులు మారిపోతోంది. ఇటీవల బాన్సువాడలో అనేకమార్లు దొంగ బంగారం కొనుగోలు విషయమై పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. అక్రమంగా దిగుమతి చేసుకొంటున్న బంగారం, వజ్రాలను దుకాణాల్లో ఉంచి విక్రయాలు సాగిస్తుండగా, ఆదాయ పన్నుల శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
బంగారానికి ఎన్నికల' సెగ
నగదు తరలింపుపై ఈసీ నియంత్రణల ఎఫెక్ట్... అమ్మకాలకు అడ్డుకట్టవేస్తున్నాయంటున్న ఆభరణాల పరిశ్రమ వర్గాలు... ఏప్రిల్, మే నెలల్లో పసిడి దిగుమతులు సగానికి పడిపోవచ్చని అంచనా ముంబై: దేశంలో ఒకపక్క సార్వత్రిక ఎన్నికలతో ఊరూవాడా పండుగ వాతావరణం నెలకొంటే... మరోపక్క పుత్తడి అమ్మకాలు మాత్రం వెలవెలబోయేలా చేస్తున్నాయట! ఈ రెండింటికీ లింకేంటి అనుకుంటున్నారా..? ఎన్నికల సంఘం(ఈసీ) విధించిన నియత్రణలే దీనికి కారణం. ఎలక్షన్ కోడ్ అమల్లోఉన్నంతవరకూ నగదు తరలింపుపై నియంత్రణలు... బంగారం క్రయవిక్రయాలను దెబ్బతీస్తున్నాయని, వినియోగదార్ల కొనుగోలు శక్తికి కళ్లెంవేస్తున్నాయని ఆభరణాల పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం పరిణామాలతో దేశంలోకి బంగారం దిగుమతులు ఘోరంగా పడిపోనున్నాయనేది వారి అంచనా. మార్చి నెలతో పోలిస్తే.. ఏప్రిల్, మే నెలల్లో పుత్తడి దిగుమతులు సగానికిపైగా దిగజారవచ్చని అంటున్నారు. గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో 28% పడిపోయిన బంగారం ధర రికవరీపై భారత్‌లో నెలకొన్న ఈ గడ్డుపరిస్థితుల కారణంగా తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్‌కు బ్రేక్...: ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసేవరకూ ప్రజలెవరైనాసరే వ్యక్తిగతంగా రూ.50,000కు మించి తమతోపాటు తీసుకెళ్లకూడదంటూ ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇక ఆభరణాల విక్రేతల(జువెలర్స్) విషయానికొస్తే ఈ పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. దీనికంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే సరైన ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. లేదంటే పోలీసులు సీజ్ చేసి ఆదాయపు పన్ను శాఖకు అప్పగించేలా ఈసీ ఆదేశాల్చింది. ఎలక్షన్లలో ధన ప్రవాహానికి అడ్డుకట్టవేయడం, రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచకుండా చెక్ చెప్పడమే లక్ష్యంగా ఈ నియంత్రణలు అమలు చేస్తున్నారు. అయినాసరే కోట్లాది రూపాయల లెక్కలుచూపని నగదును పోలీసులు దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలాఉంటే... ఈ ఆంక్షలు తమ అమ్మకాలకు గండికొడుతున్నాయంటూ జువెలర్లు వాపోతున్నారు. ‘ఇప్పటికే భారత్‌లో బంగారానికి డిమాండ్ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమతోపాటు తీసుకెళ్లే నగదు విషయంలో ఆంక్షలవల్ల బంగారం కొనుగోళ్ల విషయంలో వెనక్కితగ్గుతున్నారు’ అని ఆల్ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా వ్యాఖ్యానించారు. మార్చి నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు 50 టన్నులు కాగా, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరిమాణం 20 టన్నులకు పడిపోవచ్చనేది ఆయన అంచనా. గ్రామీణ వినియోగదార్లపై అధిక ప్రభావం... దేశంలో మొత్తం బంగారం డిమాండ్‌లో దాదాపు 70% గ్రామీణ కొనుగోలుదార్లదే. పుత్తడి ఆభరణాలను నగదు చెల్లింపుల రూపంలోనే కొనుగోలుచేస్తుంటారు. క్రెడిట్ కార్డులు, చెక్కుల వంటి బ్యాంకింగ్ లావాదేవీలతో పుత్తడి కొనుగోలు చేసే గ్రామీణులు చాలా తక్కువ. ఇప్పుడు ఎన్నికల కారణంగా ఈసీ ఆంక్షల ప్రభావం... ఈ గ్రామీణ అమ్మకాలపై ప్రభావం చూపుతోందనేది ఆభరణాల విక్రేతల వాదన. ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారన్న ఆందోళనతో కొనుగోళ్లకు వెనుకంజ వేస్తున్నారని... బంగారం/ నగదును తమతో తీసుకెళ్లాలంటే భయపడిపోతున్నారని ముంబై జువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ జైన్ పేర్కొన్నారు. దీనిలో 10,000 మంది జువెలర్స్ సభ్యులుగా ఉన్నారు. ఎన్నికలు మే 12తో ముగియనున్నాయి. మే 16న ఫలితాలు ప్రకటించనున్నారు. కాగా, అన్ని ధ్రువీకరణలు ఉన్నప్పటికీ ఐటీ అధికారులు పశ్చిమ మహారాష్ట్రలో 58 కేజీల బంగారాన్ని సీజ్ చేశారని, దీంతో జువెలర్లు భారీ మొత్తంలో బంగారం స్టాక్, నగదును ఒకచోటనుంచి మరోచోటికి తీసుకెళ్లేందుకు విముఖత వ్యక్తంచేస్తున్నారని బమల్వా పేర్కొన్నారు. పెళ్లిళ్లు, అక్షయ తృతీయతో రేట్లు పెరిగే చాన్స్.. ఒకపక్క తగినంత సరఫరా లేకపోవడం... మే నెలలోనే పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో దేశంలో పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే ఎగబాకే అవకాశం ఉందని(ప్రీమియం పెరుగుదల) పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘పెళ్లిళ్లు, బంగారం కొనుగోళ్లకు భారతీయులు పవిత్రమైన రోజుగా పరిగణించే అక్షయ తృతీయ(మే 2న) కూడా ఉండటంతో మే నెలలో బంగారం రేట్లు పెరగవచ్చు. అయితే, ఆతర్వాత మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది’ అని బంగారం దిగుమతులు చేసుకునే ఒక ప్రైవేటు బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. నియంత్రణలకు ముందు దేశంలో నెలకు సగటున 80 టన్నుల చొప్పున బంగారం దిగుమతులు జరిగేవి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్(31.1 గ్రాములు) పుత్తడి 1,280 డాలర్ల దరిదాపుల్లో కదలాడుతోంది. దేశీయంగా 10 గ్రా. మేలిమి బంగారం ధర రూ.29,500-30,000 మధ్య ఉంది. ఇప్పటికే భారీగా దిగొచ్చిన దిగుమతులు... కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు అడ్డుకట్టవేయడంలో భాగంగా బంగారంపై ప్రభుత్వం గతేడాది భారీ నియంత్రణలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పసిడి దిగుమతులపై సుంకాన్ని 10 శాతానికి పెంచడంతోపాటు ఆభరణాల తయారీ సంస్థలకూ కఠిన ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే పుత్తడి దిగుమతులు భారీగా దిగొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో బంగారం-వెండి దిగుమతుల విలువ 40 శాతం మేర క్షీణించి 36.36 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక మార్చిలో ఈ విలువ 2.75 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. క్యాడ్ కూడా 2013-14లో జీడీపీతో పోలిస్తే 2 శాతానికి(35 బిలియన్ డాలర్లు) కట్టడికావచ్చిన అంచనావేస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా 0.9 శాతానికి తగ్గుముఖం పట్టింది కూడా. కాగా, 2012-13లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8%-88.2 బిలియన్ డాలర్లు) ఎగబాకిన విషయం విదితమే. కాగా, క్యాడ్ దిగొస్తున్న స్పష్టమైన సంకేతాల నేపథ్యంలో బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలించాలంటూ డిమాండ్లు జోరందుకుంటున్నాయి. -
డబ్బున్న వారే టార్గెట్
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: పసిడిపురిలో సగటు మనిషికి మన శ్శాంతి, మానసిక ప్రశాంతత కరువైంది. జిల్లా ఆర్ధిక రాజధానిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణం రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతూ వస్తోంది. బంగారు వ్యాపారంలో రెండో ముంబైగా పేరు పొందిన ఈ గడ్డ నేడు అనేక ఆర్థిక నేరాలకు అడ్డాగా మారుతోంది. కొన్ని ఆరాచక శక్తులు పుట్టుకొచ్చి ఇక్కడి వారిలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మారుతున్న కాలంలో జల్సాలకు అలవాటు పడిన కొందరు యువకులు తమ కోరికలను తీర్చుకోవడానికి కిడ్నాప్‌లు చేయడమే గాక హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అటు పట్టణ వాసులనే గాక పోలీసు అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. సంఘంలో బాగా పలుకుబడి కలిగి బయటికి రాకుండా తమ పని తాము చేసుకుపోయే వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు వారిలో భయాన్ని కలిగిస్తున్నాయి. నాడు సునీల్.. నేడు ధనుంజయ గ్యాంగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సునీల్ కిడ్నాపింగ్ గ్యాంగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతని కిడ్నాప్ ఉదంతాలు మూడు జిల్లాల్లో విస్తరించడంతో ఈ జిల్లాల పోలీసు అధికారులతో పాటు ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన సునీల్ ఆటో డ్రైవర్‌గా ఉంటూ కొందరు విద్యార్థులను పోగు చేసుకుని ఓ ముఠాను తయారు చేసుకున్నాడు. ముందుగా అతను ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ మెడికల్ షాపు నిర్వాహకుడిని కిడ్నాప్ చేసి తర్వాత హత్య చే శాడు. తర్వాత ప్రొద్దుటూరుకు చెందిన గ్యాస్‌డీలర్, ఆర్టీసి ఉద్యోగి, రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి వారి వద్ద నుంచి లక్షలు వసూలు చేశాడు. అంతేగాక ప్రముఖ బంగారు వ్యాపారి కుటుంబ సభ్యులను కూడా కిడ్నాప్ చేయడానికి పథకం వేసిన సునీల్ గ్యాంగ్ సభ్యులు రెండు మూడు సార్లు వ్యాపారి ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారు. ఈలోగా అతని కిడ్నాప్‌ల వ్యవహారం బట్టబయలైంది. తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇందులో కొందరు పోలీసు అధికారులు, న్యాయవాదుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సంఘటనలు జరిగి ఆరు నెలలు గడువక ముందే ధనుంజయ గ్యాంగ్ వెలుగులోకి రావవడం పోలీసు అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. మేము సరే.. మా పిల్లల రక్షణ ఎలా.. ప్రొద్దుటూరు పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులున్న పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. సంపన్న వర్గాలనే లక్ష్యంగా చేసుకొని కిడ్నాపింగ్ ముఠాలు ఇక్కడ వెలుస్తున్నాయి. ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఎలాగోలా తమ రక్షణ చూసుకోగలరు. అయితే ఇంటికి దూరంగా ఎక్కడో చదువుకుంటున్న పిల్లల రక్షణ ఎలా అని వారు ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే ఇలాంటి ముఠాలను అణచి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ వాసులు పోలీసులను కోరుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోనే ఇలాంటి సంఘటనలు జరగడంపై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ సీరియస్‌గా ఉన్నట్లుగా తెలిసింది. అసాంఘిక కార్యకలాపాలతో పాటు కిడ్నాప్‌ల పేరుతో రెచ్చిపోయే గ్యాంగ్‌ల భరతం పట్టాలని ఆయన స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇలాంటి ముఠాల పట్ల కఠినంగా వ్యవహరించాలి ఇటీవల కాలంలో పట్టణంలో విపరీతంగా కిడ్నాప్ ముఠాలు వెలుస్తున్నాయి. యువత చెడు వ్యసనాలకు లోనై క్రికెట్ బెట్టింగ్, మట్కా, మద్యపానం లాంటి చెడువ్యసనాలతో పెడత్రోవ పడుతోంది. గతంలో కిడ్నాప్‌లకు పాల్పడ్డ సునీల్ గ్యాంగ్‌పై నామ మాత్రపు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ధనుంజయ గ్యాంగ్ విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి ముఠాల పట్ల పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలి. అందుకు ప్రజల సహకారం ఎప్పటికీ ఉంటుంది. - ఇవి సుధాకర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది కఠిన చర్యలు తీసుకుంటాం కిడ్నాప్‌ల పేరుతో బెదిరిస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వారి పట్ట కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే రౌడీలను, దాదాగిరి చేసే వ్యక్తులను అణచివేశాం. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం. పదే పదే కేసుల్లో ఉన్న వారిపై షీట్లు కూడా తెరుస్తున్నాం. తమ పిల్లలు బయట ఏం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనిస్తుండాలి. - శ్రీనివాసులరెడ్డి, ప్రొద్దుటూరు డీఎస్పీ