పక్కదారి పడుతున్న పసిడి !
బాన్సువాడ : జిల్లాలో బంగారం దుకాణాల్లో క్రయ విక్రయాలు కనీస లెక్కలు లేకుండా సాగుతున్నాయి. సాధారణంగా మార్కెట్‌లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు ఇస్తారు. రూ.10తో కొనుగోలు చేసినా, రూ.10వేలతో కొనుగోలు చేసినా బిల్లు ఇస్తారు. కానీ వెండి, బంగారు వర్తకుల దుకాణాల్లో మాత్రం లక్షలాది రూపాయలు వెచ్చించి, బంగారాన్ని కొనుగోలు చేసినా, కనీస లెక్కా, పత్రాలు ఇవ్వకపోవడం గమనార్హం.
జిల్లాలో బిల్లులు లేకుండా జరుగుతున్న బంగారం వ్యాపారం ‘మూడు కాసులు... ఆరు క్యారెట్లు’గా సాగుతోంది. ఈ వ్యాపారం ఎక్కువగా నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడ, కా మారెడ్డి, బోధన్ పట్టణాల్లో జరుగుతోంది. పెళ్ళిళ్ళ సీజన్ రాకతో ప్రస్తు తం బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఇక్కడి వ్యాపారులు ముంబై, హైదరాబాద్‌లను కేంద్రంగా చేసుకొని బంగారాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకొని క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. అక్రమంగా తెస్తున్న బంగారం ఒక వేళ పోలీసుల కంటపడితే అప్పటికప్పుడే బిల్లులు తెప్పిస్తున్నారు.
ఆదాయ పన్నుల శాఖకు గండి
జిల్లాలో నిత్యం పది నుంచి 30 కిలోల బంగారు నగలు వస్తుంటాయని వ్యాపారుల ద్వారా తెలిసింది. సాధారణంగా నగలపై ఒక శాతం పన్ను, అదే రూ.5లక్షలు దాటితే రెండు శాతం పన్ను చెల్లించాలి. దీన్ని తప్పించుకొనేందుకే దొంగ వ్యాపారం చే స్తున్నట్లు తెలుస్తోంది. రవాణా చేసే బంగారంలో ఒకటి లేదా రెండు కిలోలకు మాత్రమే బిల్లులు ఉంటాయి. ఇలా పది కిలోల బంగారం బిల్లులు లేకుండా చేస్తే ప్రభుత్వానికి రూ.5లక్షల వరకు గండి పడుతుంది. అంటే మొత్తం మీద రూ.10 లక్షల వరకు హోల్‌సెల్ వ్యాపారులే ప్రతీ నెల ఆదాయ పన్నుల శాఖకు గండి కొడుతున్నట్లు తెలుస్తోంది.
ఇలా అక్రమంగా దిగుమతి చేసుకొంటున్న బంగారానికి లెక్కలు చూకపోవడంతో ప్రభుత్వానికి భారీ స్థాయిలోనే ఆదాయానికి గండి పడుతోంది. దిగుమతి చేసుకొంటున్న బంగారంలో సింహ భాగం లెక్కలు లేకపోవడంతో జిల్లాలో దొంగ బంగారం యథేచ్ఛగా చేతులు మారిపోతోంది. ఇటీవల బాన్సువాడలో అనేకమార్లు దొంగ బంగారం కొనుగోలు విషయమై పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. అక్రమంగా దిగుమతి చేసుకొంటున్న బంగారం, వజ్రాలను దుకాణాల్లో ఉంచి విక్రయాలు సాగిస్తుండగా, ఆదాయ పన్నుల శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.