చెన్నై : ఇప్పుడు సినీ నటీమణుల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీరు ఇప్పుడు ఒక వృత్తినే నమ్ముకోవడం లేదు. సినిమాలు, ప్రచార చిత్రాలు అంటూ చేతి నిండా సంపాదిస్తున్నారు. తమన్నా, త్రిష, కాజల్‌అగర్వాల్ ఇలా అగ్రహీరోయిన్లుగా రాణిస్తున్న వారంతా తమ క్రేజ్‌ను ఇతర రంగాల్లోనూ వాడుకుంటున్నారు. వీరిలో కొందరు సంపాదనను స్థిరాస్తులుగా మార్చుకుంటుంటే మరికొందరు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. నటి కాజల్‌అగర్వాల్ ఇదే పని చేస్తోంది. వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ సంపాదిస్తోంది. తాజాగా నిర్మాతగానూ అవతారమెత్తిన ఈ బ్యూటీ బంగారం వ్యాపారంలోనూ పెట్టుబడులను పెడుతోంది. ముంబాయిలో సొంతంగా నగల దుకాణాన్ని ప్రారంభించింది.
సినిమాల్లో సంపాదించిన డబ్బును ఆ నగల వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతోంది. కొందరు నటీమణులు హోటళ్ల లాంటి వ్యాపారాలతో లాభ నష్టాలను చవిచూస్తుంటే నటి కాజల్ మాత్రం తెలివిగా ఆదాయమే తప్ప నష్టం అనే మాటకు తావులేని లాభదాయకమైన బంగారం నగల వ్యాపారాన్ని ఎంచుకోవడం విశేషం. ఇక నటిగా ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో ఒక చిత్రం అంటూ బిజీగా నటిస్తున్న కాజల్ అగర్వాల్‌కు లోటు అన్నదేమైనా ఉంటే అది పెళ్లినే. కాజల్‌కు సరైన వరుడు సెట్ కావడం లేదు. ఈ అమ్మడికి 36 ఏళ్ల వయసు పైబడుతోంది. దీంతో ఎలాగైనా ఈ ఏడాదిలో కాజల్ అగర్వాల్ పెళ్లి చేయాలనే కృతనిశ్చయంతో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. అయితే నటిగా బిజీగా ఉన్న కాజల్‌అగర్వాల్ వారి నిర్ణయాన్ని ఎంత వరకు స్వాగతిస్తుందన్నది చూడాలి. కాజల్‌అగర్వాల్ చెల్లెలు నిషాఅగర్వాల్‌కు ఇప్పటికే పెళ్లి అయ్యి ఒక బిడ్డ కూడా ఉందన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment