
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం కేవలం బాలీవుడ్‌కే పరిమితమైంది. తమన్నా చివరిసారిగా సికందర్ కా ముఖద్దర్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో తెరకెక్కుతోన్న ఓదెల-2 మూవీలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు నిర్మించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ట
అయితే తాజాగా మిల్కీ బ్యూటీపై క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో పాత్ర ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న కథనాలపై తమన్నా స్పందించింది. రూ. 2.4 కోట్ల క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది. తనకు ఎలాంటి మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం లేదని పేర్కొంది. తనపై వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ సమస్యను న్యాయపరంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపింది.
తమన్నా మాట్లాడుతూ.. 'క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో నా ప్రమేయం ఉందని వార్తలు రావడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి నకిలీ, తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రసారం చేయవద్దని మీడియాలోని నా స్నేహితులను అభ్యర్థించాలనుకుంటున్నా. అలా చేసిన వారిపై తగిన చర్య తీసుకోవడానికి నా టీమ్ పనిచేస్తుంది' అని తెలిపింది. తనపై వస్త్నున తప్పుడు ఆరోపణలపై తమన్నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా.. ఇవాళ ఉదయం నుంచి క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో విచారణ కోసం తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్‌లను పుదుచ్చేరి పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమన్నా స్పందించింది.
అసలేం జరిగిందంటే?
కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఓ కంపెనీ ప్రారంభించారు. దీనికి తమన్నా(Thamannah Bhatia) తదితరులు హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి, పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు.
ఈ క్రమంలోనే అత్యధిక లాభాల్ని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ.. పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి రూ.3.4 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను కూడా ఈ కేసులో భాగంగా ఇప్పుడు పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వార్తల్లో నిలిచింది.