బంగారానికి ఎన్నికల' సెగ
బంగారానికి ఎన్నికల' సెగ
Published Wed, Apr 23 2014 2:38 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM
నగదు తరలింపుపై ఈసీ నియంత్రణల ఎఫెక్ట్...
అమ్మకాలకు అడ్డుకట్టవేస్తున్నాయంటున్న ఆభరణాల పరిశ్రమ వర్గాలు...
ఏప్రిల్, మే నెలల్లో పసిడి దిగుమతులు సగానికి పడిపోవచ్చని అంచనా
ముంబై: దేశంలో ఒకపక్క సార్వత్రిక ఎన్నికలతో ఊరూవాడా పండుగ వాతావరణం నెలకొంటే... మరోపక్క పుత్తడి అమ్మకాలు మాత్రం వెలవెలబోయేలా చేస్తున్నాయట! ఈ రెండింటికీ లింకేంటి అనుకుంటున్నారా..? ఎన్నికల సంఘం(ఈసీ) విధించిన నియత్రణలే దీనికి కారణం. ఎలక్షన్ కోడ్ అమల్లోఉన్నంతవరకూ నగదు తరలింపుపై నియంత్రణలు... బంగారం క్రయవిక్రయాలను దెబ్బతీస్తున్నాయని, వినియోగదార్ల కొనుగోలు శక్తికి కళ్లెంవేస్తున్నాయని ఆభరణాల పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం పరిణామాలతో దేశంలోకి బంగారం దిగుమతులు ఘోరంగా పడిపోనున్నాయనేది వారి అంచనా. మార్చి నెలతో పోలిస్తే.. ఏప్రిల్, మే నెలల్లో పుత్తడి దిగుమతులు సగానికిపైగా దిగజారవచ్చని అంటున్నారు. గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో 28% పడిపోయిన బంగారం ధర రికవరీపై భారత్‌లో నెలకొన్న ఈ గడ్డుపరిస్థితుల కారణంగా తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.
డిమాండ్‌కు బ్రేక్...: ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసేవరకూ ప్రజలెవరైనాసరే వ్యక్తిగతంగా రూ.50,000కు మించి తమతోపాటు తీసుకెళ్లకూడదంటూ ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇక ఆభరణాల విక్రేతల(జువెలర్స్) విషయానికొస్తే ఈ పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. దీనికంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే సరైన ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. లేదంటే పోలీసులు సీజ్ చేసి ఆదాయపు పన్ను శాఖకు అప్పగించేలా ఈసీ ఆదేశాల్చింది. ఎలక్షన్లలో ధన ప్రవాహానికి అడ్డుకట్టవేయడం, రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచకుండా చెక్ చెప్పడమే లక్ష్యంగా ఈ నియంత్రణలు అమలు చేస్తున్నారు. అయినాసరే కోట్లాది రూపాయల లెక్కలుచూపని నగదును పోలీసులు దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలాఉంటే... ఈ ఆంక్షలు తమ అమ్మకాలకు గండికొడుతున్నాయంటూ జువెలర్లు వాపోతున్నారు. ‘ఇప్పటికే భారత్‌లో బంగారానికి డిమాండ్ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమతోపాటు తీసుకెళ్లే నగదు విషయంలో ఆంక్షలవల్ల బంగారం కొనుగోళ్ల విషయంలో వెనక్కితగ్గుతున్నారు’ అని ఆల్‌ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా వ్యాఖ్యానించారు. మార్చి నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు 50 టన్నులు కాగా, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరిమాణం 20 టన్నులకు పడిపోవచ్చనేది ఆయన అంచనా.
గ్రామీణ వినియోగదార్లపై అధిక ప్రభావం...
దేశంలో మొత్తం బంగారం డిమాండ్‌లో దాదాపు 70% గ్రామీణ కొనుగోలుదార్లదే. పుత్తడి ఆభరణాలను నగదు చెల్లింపుల రూపంలోనే కొనుగోలుచేస్తుంటారు. క్రెడిట్ కార్డులు, చెక్కుల వంటి బ్యాంకింగ్ లావాదేవీలతో పుత్తడి కొనుగోలు చేసే గ్రామీణులు చాలా తక్కువ. ఇప్పుడు ఎన్నికల కారణంగా ఈసీ ఆంక్షల ప్రభావం... ఈ గ్రామీణ అమ్మకాలపై ప్రభావం చూపుతోందనేది ఆభరణాల విక్రేతల వాదన. ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారన్న ఆందోళనతో కొనుగోళ్లకు వెనుకంజ వేస్తున్నారని... బంగారం/ నగదును తమతో తీసుకెళ్లాలంటే భయపడిపోతున్నారని ముంబై జువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ జైన్ పేర్కొన్నారు. దీనిలో 10,000 మంది జువెలర్స్ సభ్యులుగా ఉన్నారు. ఎన్నికలు మే 12తో ముగియనున్నాయి. మే 16న ఫలితాలు ప్రకటించనున్నారు. కాగా, అన్ని ధ్రువీకరణలు ఉన్నప్పటికీ ఐటీ అధికారులు పశ్చిమ మహారాష్ట్రలో 58 కేజీల బంగారాన్ని సీజ్ చేశారని, దీంతో జువెలర్లు భారీ మొత్తంలో బంగారం స్టాక్, నగదును ఒకచోటనుంచి మరోచోటికి తీసుకెళ్లేందుకు విముఖత వ్యక్తంచేస్తున్నారని బమల్వా పేర్కొన్నారు.
పెళ్లిళ్లు, అక్షయ తృతీయతో రేట్లు పెరిగే చాన్స్..
ఒకపక్క తగినంత సరఫరా లేకపోవడం... మే నెలలోనే పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో దేశంలో పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే ఎగబాకే అవకాశం ఉందని(ప్రీమియం పెరుగుదల) పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘పెళ్లిళ్లు, బంగారం కొనుగోళ్లకు భారతీయులు పవిత్రమైన రోజుగా పరిగణించే అక్షయ తృతీయ(మే 2న) కూడా ఉండటంతో మే నెలలో బంగారం రేట్లు పెరగవచ్చు. అయితే, ఆతర్వాత మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది’ అని బంగారం దిగుమతులు చేసుకునే ఒక ప్రైవేటు బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. నియంత్రణలకు ముందు దేశంలో నెలకు సగటున 80 టన్నుల చొప్పున బంగారం దిగుమతులు జరిగేవి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్(31.1 గ్రాములు) పుత్తడి 1,280 డాలర్ల దరిదాపుల్లో కదలాడుతోంది. దేశీయంగా 10 గ్రా. మేలిమి బంగారం ధర రూ.29,500-30,000 మధ్య ఉంది.
ఇప్పటికే భారీగా దిగొచ్చిన దిగుమతులు...
కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు అడ్డుకట్టవేయడంలో భాగంగా బంగారంపై ప్రభుత్వం గతేడాది భారీ నియంత్రణలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పసిడి దిగుమతులపై సుంకాన్ని 10 శాతానికి పెంచడంతోపాటు ఆభరణాల తయారీ సంస్థలకూ కఠిన ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే పుత్తడి దిగుమతులు భారీగా దిగొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో బంగారం-వెండి దిగుమతుల విలువ 40 శాతం మేర క్షీణించి 36.36 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక మార్చిలో ఈ విలువ 2.75 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. క్యాడ్ కూడా 2013-14లో జీడీపీతో పోలిస్తే 2 శాతానికి(35 బిలియన్ డాలర్లు) కట్టడికావచ్చిన అంచనావేస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా 0.9 శాతానికి తగ్గుముఖం పట్టింది కూడా. కాగా, 2012-13లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8%-88.2 బిలియన్ డాలర్లు) ఎగబాకిన విషయం విదితమే. కాగా, క్యాడ్ దిగొస్తున్న స్పష్టమైన సంకేతాల నేపథ్యంలో బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలించాలంటూ డిమాండ్‌లు జోరందుకుంటున్నాయి.
Advertisement
Advertisement