
అగర్తల: త్రిపుర పశ్చిమ లోక్‌సభ స్థానంలో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 12న 168 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. కాగా త్రిపుర (పశ్చిమ) నియోజకవర్గంలో గతనెల ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, రీ పోలింగ్ నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
త్రిపురలో రెండే లోక్‌సభ స్థానాలున్నాయి. ఒకటి పశ్చిమ త్రిపుర కాగా, మరొకటి తూర్పు త్రిపుర. తూర్పు త్రిపురలో మూడో విడతలో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే శాంతి భద్రతలు అనుకూలించని కారణంగా ఆ ఎన్నికలను మే23 (ఏడో విడత)కి వాయిదా వేసిన విషయం విదితమే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ....త్రిపుర పశ్చిమ నియోజకవర్గంలో రీ పోలింగ్ జరపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది కూడా. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలతో సుమారు1000 మంది కాంగ్రెస్ ఏజెంట్లు పోలింగ్ స్టేషన్లలోకి వెళ్లలేకపోవడంతో, అధికార భాజపా పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపించింది.