ప్రతీకాత్మక చిత్రం
అగర్తల : వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న కారణంగా ఓ మహిళను దారుణంగా హింసించి, ఘోరంగా అవమానించారు గ్రామస్తులు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. త్రిపుర హైకోర్టు ఈ ఘటనకు సంబంధించిన కేసును సమోటోగా తీసుకున్న మరుసటి రోజే బాధితురాలు ప్రాణాలు తీసుకోవటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. త్రిపురలోని బెతగ గ్రామానికి చెందిన ఓ మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని గ్రామస్తులకు తెలిసింది. మంగళవారం ఈ విషయమై పంచాయతీ జరిగింది. ఈ నేపథ్యంలో సదరు మహిళ వివాహేతర సంబంధానికి చెందిన వీడియోను పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించారు.
వీడియో బహిర్గతం కావటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని, ఇంటికి వెళ్లింది. ఇంటి వద్దకు కూడా వచ్చిన గ్రామస్తులు ఆమెను బయటకు లాగి చెప్పుల దండ మెడలో వేశారు. అంతటితో ఆగకుండా గుండు కొట్టించి, నగ్నంగా ఊరంతా తిప్పారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసును సమోటోగా స్వీకరించిన హైకోర్టు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఆ మరుసటి రోజే.. గ్రామస్తుల చర్యతో తీవ్ర మనోవేదనకు గురైన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
Comments
Please login to add a commentAdd a comment