చార్మినార్: బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు పాతబస్తీ ప్రధాన వ్యాపార కేంద్రం. నిజానికి నిజాం కాలం నుంచి ఇక్కడ బంగారు ఆభరణాల క్రయవిక్రయాలకు ఆదరణ ఉంది. అయితే కొంత కాలంగా ఇక్కడ వ్యాపారాలు తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు 2000 వరకు దుకాణాలున్న పాతబస్తీలో సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఒకప్పటి వ్యాపారాలు ఇప్పుడు కనిపించడం లేదు. దుకాణాల ముందు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి సరైన స్థలాలు లేకపోవడంతో అటు వ్యాపారులతో పాటు వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. అడ్దదిడ్డమైన ట్రాఫిక్‌కు తోడు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడ తమ బ్రాంచీలను నామమాత్రంగా కొనసాగిస్తునే... నగరంలో శాఖలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
పాతబస్తీకి వచ్చే పర్యాటకులు...
హెదరాబాద్ అంటే చార్మినార్ గుర్తుకు వస్తుంది. చార్మినార్‌కు వచ్చే పర్యాటకులకు చార్‌కమాన్‌లోని నగల దుకాణాలు ముందుగా దర్శనమిస్తాయి. పాతబస్తీ సంస్క ృతికి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా ఇక్కడి బంగారు, వెండి, ముత్యాల నగల దుకాణాలు ప్రసిద్ధి చెందాయి. నిజాం కాలం నుంచి ఇక్కడ బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కే సరైన పార్కింగ్ లేదని... ఇక కార్లు తదితర వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక వినియోగ దారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రానురాను తమ వ్యాపారాలు కుంటుపడుతున్నాయంటున్నారు. పాతబస్తీలోని చార్మినార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, శాలిబండ, కాలికమాన్, మిట్టికాషేర్, ఘాన్సీబజార్ తదితర ప్రాంతాల్లో బంగారం, వెండి, ముత్యాల ఆభరణాల షోరూంలున్నాయి. ప్రస్తుతం పాతబస్తీలో గిరాకీ తగ్గడంతో ఇక్కడి వ్యాపారస్తులు నగరంలోని అబిడ్స్, సిద్ధంబర్‌బజార్, గన్‌ఫౌండ్రి, బషీర్‌బాగ్, సికింద్రాబాద్, బేగంబజార్, మెహిదీపట్నం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారహిల్స్, చిక్కడపల్లి, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో తమ షోరూంలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. సాధ్యమైనంత వెంటనే పాతబస్తీలో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత క్లిష్టతరంగా మారుతాయని ఇMý్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్య రద్దీ... తప్పని ట్రాఫిక్ తిప్పలు..
నగరంలో ప్రథమంగా నగల దుకాణాలు చార్‌కమాన్‌లోనే ప్రారంభమయ్యాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. దాదాపు 2000కు పైగా ఉన్న ఇక్కడి దుకాణాలు ప్రతిరోజు కస్టమర్లకు తమ సేవలను అందజేస్తున్నాయి. పాతబస్తీని సందర్శించడానికి వచ్చే పర్యాటకులే కాకుండా నగర శివారు జిల్లాల వినియోగదారులు కూడా చార్‌కమాన్‌లోని బంగారు నగల దుకాణాలకు వచ్చి తమకు అవసరమైన ఆభరణాలను ఖరీదు చేస్తుండడంతో ప్రతిరోజూ వినియోగదారులతో ఇక్కడి నగల దుకాణాలు రద్దీగా మారతాయి. ప్రస్తుతం ఇక్కడి వ్యాపార పరిస్థితులు గతంలో కన్నా భిన్నంగా తయారయ్యాయి. వినియోగ దారులు రావడానికి సరైన మార్గాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఇక్కడ గిరాకీ పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి బంగారం, వెండి ఆభరణాల వ్యాపారాభివృద్దికి అటు ప్రజాప్రతినిధులు గానీ...ఇటు సంబందిత అధికారులు గానీ పట్టించుకోవడం లేదని వ్యాపారులు అంటున్నారు. తమ దుకాణాల ముందు వరకు వాహనాల రాకపోకలు అందుబాటులో లేకపోవడంతో పాటు చిరువ్యాపారులను సైతం తమ షో రూంల ముందు అక్రమంగా వ్యాపారాలు కొనసాగించుకోవడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమతించడంతో రోజురోజుకూ తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో వలస కార్మికులు
బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసిఇవ్వడానికి పని చేసే వలస కార్మికులు సరైన ఆర్డర్లు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పాతబస్తీలో నివాసం ఉంటున్న వలస కార్మికులు దుకాణాల యజమానుల నుంచి బంగారాన్ని ఆర్డర్లపై తీసుకుని ఆభరణాలు తయారు చేసి తిరిగి ఇస్తుంటారు. గ్రాముల వారిగా మేకింగ్ చార్జీలను తీసుకునే వలస కార్మికులకు ఆర్డర్లు కరువయ్యాయి. దీంతో వారంతా మానసిక వేదనకు గురవుతున్నారు. పాతబస్తీకే గుండెకాయగా నిలిచిన నగల వ్యాపారాలు ఎంతో మంది వలస కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఆభరణాలను తయారు చేయడానికి ఎంతో మంది యువకులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఆర్డర్లపై నగలను తయారు చేసి ఆయా దుకాణాలలోఅప్పగించి ఉపాధి పొందుతున్నారు. బెంగాళీలు గుల్జార్‌హౌజ్, కోకర్‌వాడీ, మామాజుమ్లా పాటక్, మూసాబౌలి, ఘాన్సీబజార్, జూలా, బండికా అడ్డా తదితర ప్రాంతాలలో చిన్న చిన్న ఖార్ఖానాలను ఏర్పాటుచేసుకొని బంగారు ఆభరణాలనుతయారు చేస్తున్నారు. ఇలా చార్‌కమాన్‌లోని నగల దుకాణాలు ఎంతో మందికి జీవనోపాధికల్పిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే... రాబోయే రోజుల్లోపాతబస్తీలో బంగారం, వెండి వ్యాపారాలుకనుమరుగయ్యే పరిస్థితలు ఎదురవుతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment