ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: పసిడిపురిలో సగటు మనిషికి మన శ్శాంతి, మానసిక ప్రశాంతత కరువైంది. జిల్లా ఆర్ధిక రాజధానిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణం రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతూ వస్తోంది. బంగారు వ్యాపారంలో రెండో ముంబైగా పేరు పొందిన ఈ గడ్డ నేడు అనేక ఆర్థిక నేరాలకు అడ్డాగా మారుతోంది. కొన్ని ఆరాచక శక్తులు పుట్టుకొచ్చి ఇక్కడి వారిలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మారుతున్న కాలంలో జల్సాలకు అలవాటు పడిన కొందరు యువకులు తమ కోరికలను తీర్చుకోవడానికి కిడ్నాప్‌లు చేయడమే గాక
హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అటు పట్టణ వాసులనే గాక పోలీసు అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. సంఘంలో బాగా పలుకుబడి కలిగి బయటికి రాకుండా తమ పని తాము చేసుకుపోయే వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు వారిలో భయాన్ని కలిగిస్తున్నాయి.
నాడు సునీల్.. నేడు ధనుంజయ గ్యాంగ్
ఈ ఏడాది ఏప్రిల్‌లో సునీల్ కిడ్నాపింగ్ గ్యాంగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతని కిడ్నాప్ ఉదంతాలు మూడు జిల్లాల్లో విస్తరించడంతో ఈ జిల్లాల పోలీసు అధికారులతో పాటు ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన సునీల్ ఆటో డ్రైవర్‌గా ఉంటూ కొందరు విద్యార్థులను పోగు చేసుకుని ఓ ముఠాను తయారు చేసుకున్నాడు. ముందుగా అతను ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ మెడికల్ షాపు నిర్వాహకుడిని కిడ్నాప్ చేసి తర్వాత హత్య చే శాడు. తర్వాత ప్రొద్దుటూరుకు చెందిన గ్యాస్‌డీలర్, ఆర్టీసి ఉద్యోగి, రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి వారి వద్ద నుంచి లక్షలు వసూలు చేశాడు.
అంతేగాక ప్రముఖ బంగారు వ్యాపారి కుటుంబ సభ్యులను కూడా కిడ్నాప్ చేయడానికి పథకం వేసిన సునీల్ గ్యాంగ్ సభ్యులు రెండు మూడు సార్లు వ్యాపారి ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారు. ఈలోగా అతని కిడ్నాప్‌ల వ్యవహారం బట్టబయలైంది. తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇందులో కొందరు పోలీసు అధికారులు, న్యాయవాదుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సంఘటనలు జరిగి ఆరు నెలలు గడువక ముందే ధనుంజయ గ్యాంగ్ వెలుగులోకి రావవడం పోలీసు అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.
మేము సరే.. మా పిల్లల రక్షణ ఎలా..
ప్రొద్దుటూరు పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులున్న పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. సంపన్న వర్గాలనే లక్ష్యంగా చేసుకొని కిడ్నాపింగ్ ముఠాలు ఇక్కడ వెలుస్తున్నాయి. ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఎలాగోలా తమ రక్షణ చూసుకోగలరు. అయితే ఇంటికి దూరంగా ఎక్కడో చదువుకుంటున్న పిల్లల రక్షణ ఎలా అని వారు ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే ఇలాంటి ముఠాలను అణచి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ వాసులు పోలీసులను కోరుతున్నారు.
ప్రొద్దుటూరు పట్టణంలోనే ఇలాంటి సంఘటనలు జరగడంపై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ సీరియస్‌గా ఉన్నట్లుగా తెలిసింది. అసాంఘిక కార్యకలాపాలతో పాటు కిడ్నాప్‌ల పేరుతో రెచ్చిపోయే గ్యాంగ్‌ల భరతం పట్టాలని ఆయన స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
ఇలాంటి ముఠాల పట్ల కఠినంగా వ్యవహరించాలి
ఇటీవల కాలంలో పట్టణంలో విపరీతంగా కిడ్నాప్ ముఠాలు వెలుస్తున్నాయి. యువత చెడు వ్యసనాలకు లోనై క్రికెట్ బెట్టింగ్, మట్కా, మద్యపానం లాంటి చెడువ్యసనాలతో పెడత్రోవ పడుతోంది. గతంలో కిడ్నాప్‌లకు పాల్పడ్డ సునీల్ గ్యాంగ్‌పై నామ మాత్రపు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ధనుంజయ గ్యాంగ్ విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి ముఠాల పట్ల పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలి. అందుకు ప్రజల సహకారం ఎప్పటికీ ఉంటుంది.
- ఇవి సుధాకర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది
కఠిన చర్యలు తీసుకుంటాం
కిడ్నాప్‌ల పేరుతో బెదిరిస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వారి పట్ట కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే రౌడీలను, దాదాగిరి చేసే వ్యక్తులను అణచివేశాం. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం. పదే పదే కేసుల్లో ఉన్న వారిపై షీట్లు కూడా తెరుస్తున్నాం. తమ పిల్లలు బయట ఏం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనిస్తుండాలి.
- శ్రీనివాసులరెడ్డి, ప్రొద్దుటూరు డీఎస్పీ
డబ్బున్న వారే టార్గెట్
Published Wed, Nov 20 2013 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement