Why Proddatur Famous For Gold: మన దేశంలో బంగారు వ్యాపారంలో ముంబైదే అగ్రస్థానం. ముంబై తర్వాత పసిడి వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతం ప్రొద్దుటూరు. అందుకే ప్రొద్దుటూరును సెకండ్ ముంబై, పసిడిపురిగా పిలుస్తారు. ప్రొద్దుటూరు బంగారమంటే ఇష్టపడని వారుండరు. ఇక్కడ కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండదు. నాణ్యత, తూకంలో తేడా కనిపించదు. ఖచ్చితమైన ధర ఉంటుంది. కోరిన డిజైన్‌లో నగలు తయారు చేసే అద్భుత ప్రతిభ కలిగిన స్వర్ణకారులు ఇక్కడ కోకొల్లలు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరుకు రావాల్సిందే. ఇక్కడి బంగారు వ్యాపారానికి వందేళ్ల చరిత్ర ఉంది.
చిన్న గ్రామంగా ఉన్న ప్రొద్దుటూరు అప్పట్లో నీలి మందు వ్యాపారానికి ప్రసిద్ధి. స్థానిక అమ్మవారిశాల వీధిలోని పలువురు వర్తకులు నీలిమందు వ్యాపారం చేస్తూ నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేసేవారు. కాలక్రమేనా నీలిమందుకు ఆదరణ తగ్గడంతో బంగారం వ్యాపారం వైపు వారి దృష్టి మళ్లింది. 100 ఏళ్ల నాడు కేవలం 20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. వీరు నమ్మకంతో బంగారు వ్యాపారం సాగించేవారు. నాడు పదుల సంఖ్యలో ఉన్న బంగారు దుకాణాలు నేడు వందల్లో ఉన్నాయి. స్వర్ణకారులు కూడా వేలల్లో ఉన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణా, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి బంగారు కొనుగోళ్ల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు.
రెండో ముంబైగా ఎలా పేరొచ్చిందంటే..
1968లో అప్పటి ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం దేశంలో లైసెన్సు లేకుండా బంగారు దుకాణాలు నిర్వహించం నేరం. అప్పట్లో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత బంగారు వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు. నాటి భారతప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది.
ఈ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90 శాతం బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. ఆ రోజు నుంచి రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తారు. టెండర్ల అనంతరం ప్రొద్దుటూరులో పలుమార్లు సీబీఐ దాడులు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో పెద్ద పరిశ్రమగా బంగారు వ్యాపారం
ఇక్కడి బంగారు వ్యాపారం రాష్ట్రంలోనే పెద్ద పరిశ్రమగా వెలుగొందుతోంది. ఒకప్పుడు మెయిన్‌బజార్ (అమ్మవారిశాల వీధి)లో మాత్రమే దుకాణాలు ఉండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్ షాపులు విస్తరించాయి. సుమారు 400కు పైగా బంగారు విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్ షాపులు ఉన్నాయి. 12 వేల మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు ధీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి.
వివాహ ముహుర్తాలు, పండుగలు, అందరూ సెంటిమెంట్‌గా భావించే అక్షయ తృతీయ రోజున బులియన్ మార్కెట్ నూతన శోభ సంతరించుకుంటుంది. ఆన్‌లైన్ ధరల ప్రకారం బంగారు విక్రయాలు నిర్వహిస్తారు. ముంబైలో లభించే ధరకే ప్రొద్దుటూరులో బంగారు లావాదేవీలు జరుగుతుంటాయి. వ్యాపారులు, స్వర్ణకారులు బ్యాంక్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసి నగలను తయారు చేస్తారు. 100 మిల్లీ గ్రాముల ముక్కు పుడక నుంచి 100–120 గ్రాముల వడ్డాణం వరకు విలువైన ఆభరణాలను స్వర్ణకారులు తయారు చేస్తారు. అంతేగాక రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల దేవతామూర్తుల కిరీటాలు, ఆభరణాలు కూడా ఇక్కడే తయారు అవుతుంటాయి. స్థానికులే గాక బెంగాల్, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది స్వర్ణకారులు ప్రొద్దుటూరులో పని చేస్తున్నారు.
లాక్‌డౌన్‌తో పడిపోయిన వ్యాపారాలు
లాక్‌డౌన్ కారణంగా బంగారు వ్యాపారాలు బాగా పడిపోయాయి. కరోనా భయంతో వినియోగదారులు బయటికి రాకపోవడంతో ఆసించినంత స్థాయిలో వ్యాపారాలు జరగడం లేదని వ్యాపారాలు చెబుతున్నారు. గతంలో రోజుకు రూ. 40–45 కోట్ల మేర క్రయ విక్రయాలు జరుగుతుండగా ప్రస్తుతం రూ. 15–20 కోట్లకు పడిపోయినట్లు వ్యాపార వర్గాల సమాచారం.
స్వచ్ఛమైన బంగారంతో నగలు
స్వచ్ఛమైన బంగారంతో నగలను తయారు చేయడం ఇక్కడి స్వర్ణకారులు, వ్యాపారుల ప్రతిభ. వినియోగదారులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నాం. ప్రొద్దుటూరుకు పసిడిపురిగా పేరు రావడానికి పూర్వీకుల శ్రమ ఉంది. నాటి స్వర్ణకారుల ప్రతిభ వల్లనే ఇంతటి పేరు వచ్చింది. ఆ పేరును కాపాడుకుంటూ వస్తున్నాం.
– ఉప్పర మురళి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు, ప్రొద్దుటూరు .
రెడిమేడ్ ఆభరణాలతో పని తగ్గింది
కొన్ని రోజుల క్రితం వరకు పని బాగా ఉండేది. స్వర్ణకారుల పనితనానికి విలువ, గుర్తింపు ఉండేది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి రెడిమేడ్ ఆభరణాలను వ్యాపారులు దిగుమతి చేసుకోవడంతో మాకు పనులు లేకుండా పోయాయి. పెళ్లి ముహుర్తాల్లోనే కొంత పని ఉంటుంది కానీ మిగతా రోజుల్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది.
– జిలానిబాషా, స్వర్ణకారుడు, ప్రొద్దుటూరు
Comments
Please login to add a commentAdd a comment