poddutoor
-
భారత్‌లో రెండో ముంబై ఎక్కడుందో తెలుసా..!!
Why Proddatur Famous For Gold: మన దేశంలో బంగారు వ్యాపారంలో ముంబైదే అగ్రస్థానం. ముంబై తర్వాత పసిడి వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతం ప్రొద్దుటూరు. అందుకే ప్రొద్దుటూరును సెకండ్ ముంబై, పసిడిపురిగా పిలుస్తారు. ప్రొద్దుటూరు బంగారమంటే ఇష్టపడని వారుండరు. ఇక్కడ కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండదు. నాణ్యత, తూకంలో తేడా కనిపించదు. ఖచ్చితమైన ధర ఉంటుంది. కోరిన డిజైన్‌లో నగలు తయారు చేసే అద్భుత ప్రతిభ కలిగిన స్వర్ణకారులు ఇక్కడ కోకొల్లలు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరుకు రావాల్సిందే. ఇక్కడి బంగారు వ్యాపారానికి వందేళ్ల చరిత్ర ఉంది. చిన్న గ్రామంగా ఉన్న ప్రొద్దుటూరు అప్పట్లో నీలి మందు వ్యాపారానికి ప్రసిద్ధి. స్థానిక అమ్మవారిశాల వీధిలోని పలువురు వర్తకులు నీలిమందు వ్యాపారం చేస్తూ నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేసేవారు. కాలక్రమేనా నీలిమందుకు ఆదరణ తగ్గడంతో బంగారం వ్యాపారం వైపు వారి దృష్టి మళ్లింది. 100 ఏళ్ల నాడు కేవలం 20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. వీరు నమ్మకంతో బంగారు వ్యాపారం సాగించేవారు. నాడు పదుల సంఖ్యలో ఉన్న బంగారు దుకాణాలు నేడు వందల్లో ఉన్నాయి. స్వర్ణకారులు కూడా వేలల్లో ఉన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణా, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి బంగారు కొనుగోళ్ల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. రెండో ముంబైగా ఎలా పేరొచ్చిందంటే.. 1968లో అప్పటి ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం దేశంలో లైసెన్సు లేకుండా బంగారు దుకాణాలు నిర్వహించం నేరం. అప్పట్లో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత బంగారు వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు. నాటి భారతప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. ఈ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90 శాతం బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. ఆ రోజు నుంచి రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తారు. టెండర్ల అనంతరం ప్రొద్దుటూరులో పలుమార్లు సీబీఐ దాడులు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పెద్ద పరిశ్రమగా బంగారు వ్యాపారం ఇక్కడి బంగారు వ్యాపారం రాష్ట్రంలోనే పెద్ద పరిశ్రమగా వెలుగొందుతోంది. ఒకప్పుడు మెయిన్‌బజార్ (అమ్మవారిశాల వీధి)లో మాత్రమే దుకాణాలు ఉండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్ షాపులు విస్తరించాయి. సుమారు 400కు పైగా బంగారు విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్ షాపులు ఉన్నాయి. 12 వేల మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు ధీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి. వివాహ ముహుర్తాలు, పండుగలు, అందరూ సెంటిమెంట్‌గా భావించే అక్షయ తృతీయ రోజున బులియన్ మార్కెట్ నూతన శోభ సంతరించుకుంటుంది. ఆన్లైన్ ధరల ప్రకారం బంగారు విక్రయాలు నిర్వహిస్తారు. ముంబైలో లభించే ధరకే ప్రొద్దుటూరులో బంగారు లావాదేవీలు జరుగుతుంటాయి. వ్యాపారులు, స్వర్ణకారులు బ్యాంక్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసి నగలను తయారు చేస్తారు. 100 మిల్లీ గ్రాముల ముక్కు పుడక నుంచి 100–120 గ్రాముల వడ్డాణం వరకు విలువైన ఆభరణాలను స్వర్ణకారులు తయారు చేస్తారు. అంతేగాక రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల దేవతామూర్తుల కిరీటాలు, ఆభరణాలు కూడా ఇక్కడే తయారు అవుతుంటాయి. స్థానికులే గాక బెంగాల్, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది స్వర్ణకారులు ప్రొద్దుటూరులో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో పడిపోయిన వ్యాపారాలు లాక్డౌన్ కారణంగా బంగారు వ్యాపారాలు బాగా పడిపోయాయి. కరోనా భయంతో వినియోగదారులు బయటికి రాకపోవడంతో ఆసించినంత స్థాయిలో వ్యాపారాలు జరగడం లేదని వ్యాపారాలు చెబుతున్నారు. గతంలో రోజుకు రూ. 40–45 కోట్ల మేర క్రయ విక్రయాలు జరుగుతుండగా ప్రస్తుతం రూ. 15–20 కోట్లకు పడిపోయినట్లు వ్యాపార వర్గాల సమాచారం. స్వచ్ఛమైన బంగారంతో నగలు స్వచ్ఛమైన బంగారంతో నగలను తయారు చేయడం ఇక్కడి స్వర్ణకారులు, వ్యాపారుల ప్రతిభ. వినియోగదారులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నాం. ప్రొద్దుటూరుకు పసిడిపురిగా పేరు రావడానికి పూర్వీకుల శ్రమ ఉంది. నాటి స్వర్ణకారుల ప్రతిభ వల్లనే ఇంతటి పేరు వచ్చింది. ఆ పేరును కాపాడుకుంటూ వస్తున్నాం. – ఉప్పర మురళి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు, ప్రొద్దుటూరు . రెడిమేడ్ ఆభరణాలతో పని తగ్గింది కొన్ని రోజుల క్రితం వరకు పని బాగా ఉండేది. స్వర్ణకారుల పనితనానికి విలువ, గుర్తింపు ఉండేది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి రెడిమేడ్ ఆభరణాలను వ్యాపారులు దిగుమతి చేసుకోవడంతో మాకు పనులు లేకుండా పోయాయి. పెళ్లి ముహుర్తాల్లోనే కొంత పని ఉంటుంది కానీ మిగతా రోజుల్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. – జిలానిబాషా, స్వర్ణకారుడు, ప్రొద్దుటూరు -
వాగులో గర్భిణి గల్లంతు
-
కరోనా పరీక్షలు చేస్తారనే భయంతో
ఉండవెల్లి (అలంపూర్): చెక్‌పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమోనని భయపడి అడ్డదారిలో వచ్చేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మార్గమధ్యలో ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతిలో కారు కొట్టుకుపోగా.. అందులో ప్రయాణిస్తున్న మహిళ గల్లంతైంది. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాగ సింధూరెడ్డి (28)కి హైదరాబాద్‌కు చెందిన శివశంకర్‌రెడ్డితో ఏడాది క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. శివశంకర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, భార్యాభర్తలతో పాటు శివశంకర్‌రెడ్డి స్నేహితుడు జిలానీ బాషా కలసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. జాతీయ రహదారి మీదుగా కర్నూలు దాటి తెలంగాణ రాష్ట్రంలోని పుల్లూరు చెక్‌పోస్టు సమీపం వరకు వచ్చారు. అయితే, చెక్‌పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమో అనే భయంతో పాటు ఆలస్యమవుతుందని భావించి డ్రైవింగ్ చేస్తున్న జిలానీబాషా జాతీయ రహదారి నుంచి కారును గ్రామాల మీదుగా మళ్లించాడు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతి తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి కలుగొట్ల మీదుగా కారుని పోనిచ్చాడు. జోరువాన.. పైగా చీకట్లో కలుగొట్ల వాగు ఉధృతిని అంచనా వేయలేక వేగంగా వాగు దాటించే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతికి కారు అదుపుతప్పి కొట్టుకుపోయింది. నిద్రలో ఉన్న సింధూరెడ్డి వాగులో పడి నీటిలో మునిగిపోగా.. శివశంకర్‌రెడ్డి, జిలానీబాషా డోర్ తెరుచుకొని ముళ్లకంప సాయంతో ఎలాగోలా బయటపడ్డారు. సింధూను పట్టుకునే ప్రయత్నం చేసినా.. చీకటి, మరోవైపు నీటి ఉధృతి అధికంగా ఉండటంతో ఆమె గల్లంతైంది. గాలింపు చర్యలు వేగవంతం సమాచారం అందుకున్న ఎస్పీ రంజన్‌రతన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ రాములు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి వివరాలు సేకరించారు. ప్రొక్లెయినర్ సాయంతో కారును బయటికి తీయించారు. మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఈ వాగు, మరో పెద్దవాగు అయిన బొంకూరు గుండా వాహనాలను రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఘటన చోటుచేసుకన్న కలుగొట్ల వాగు నుంచి తుంగభద్ర నది 500 మీటర్ల దూరం మాత్రమే ఉంది. కాగా, ఎమ్మెల్యే అబ్రహం బాధితులను పరామర్శించారు. నిత్యం వాహనాలు ఇదే రోడ్డులో తిరుగుతాయని, ఇంతవరకు ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. సింధూ గర్భవతి ఇదిలా ఉండగా, తన కూతురు నాగసింధు ప్రస్తుతం గర్భిణి అని ఆమె తండ్రి రామాంజనేయ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటున్న అత్తగారింటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. తుంగభద్ర నది అధికంగా ప్రవహిస్తుండటంతో గల్లంతైన మహిళ ఆచూకీ దొరకడం లేదని,, గాలింపు చర్యలు ముమ్మరం చేశామని సీఐ వెంకట్రామయ్య తెలిపారు. -
ప్రొద్దుటూరులో ఒక్కరోజే 16 పాజిటివ్..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రొద్దుటూరులో ఒకేరోజు 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరు నడింపల్లి వీధిలో ఇటీవల కరోనా బారినపడి వృద్ధుడు మృతి చెందగా, ఆయన అంత్యక్రియలకు హాజరైన 12 మంది బంధువులకు కరోనా సోకింది. దస్తగిరిపేటలో ఇద్దరికి, పెన్నానగర్లో ఒకరికి, వైఎంఆర్ కాలనీలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91కు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కరోనా నుంచి కోలుకుని బుధవారం 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. (టాయ్లెట్లో వారం రోజుల క్వారంటైన్) -
టీడీపీ నేతా.. మజాకా..!
► సీఐ బాధ్యతలు తీసుకోవద్దంటూ టీడీపీ నేత హుకుం జారీ ► ఎస్పీని కలిసినా ప్రయోజనం శూన్యం ► కర్నూలుకు తిరిగి పయనం ► సీఐ శ్రీనివాసులుకు చుక్కెదురు ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు అర్బన్ సీఐగా బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన శ్రీనివాసులుకు చుక్కెదురైంది. స్థానిక అధికార పార్టీ నేత ఒకరు పైస్థాయిలో ఒత్తిడి తెచ్చి సీఐని విధుల్లో చేరనీయలేదు. దీంతో బదిలీ ఉత్తర్వులతో వచ్చిన ఆ సీఐ వెనుతిరిగి పోయారు. వివరాల్లోకెళితే... ప్రొద్దుటూరు అర్బన్ సీఐ కుర్చీ మూడు నెలల నుంచి ఖాళీగా ఉంది. కర్నూలు వీఆర్‌లో ఉన్న జె.శ్రీనివాసులును అర్బన్ సీఐగా నియమిస్తూ గురువారం సాయంత్రం డీఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించడానికి ప్రొద్దుటూరు వచ్చారు. రాగానే అధికార పార్టీ సీనియర్ నాయకుడిని కలవడానికి ప్రయత్నించగా కుదరలేదు. చేసేదేమి లేక సీఐ ఫోన్లో మాట్లాడినట్టు విశ్వసనీయ సమాచారం. సీఐ ఎంతగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆ నేత వినిపించుకోలేదని తెలిసింది. అనంతరం పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డితో మాట్లాడారు. అనంతరం సీఐ శ్రీనివాసులు ఎస్పీని కలిసేందుకు కడప వెళ్లారు. ఆయన ఎస్పీని కలిసిన కొన్ని నిమిషాల్లోనే అర్బన్ సీఐగా చార్జ్ తీసుకోవద్దని అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. సీనియర్ నేత ఒత్తిడి మేరకే హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు కడప ఎస్పీ కార్యాలయానికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీఐ కర్నూలుకు వెళ్లిపోయారు. అర్బన్ సర్కిల్‌కు తమకు అనుకూలమైన సీఐని వేయించుకోవడానికి మూడు నెలల నుంచి అధికార పార్టీ సీనియర్ నేత విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.