ఉండవెల్లి (అలంపూర్): చెక్‌పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమోనని భయపడి అడ్డదారిలో వచ్చేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మార్గమధ్యలో ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతిలో కారు కొట్టుకుపోగా.. అందులో ప్రయాణిస్తున్న మహిళ గల్లంతైంది. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాగ సింధూరెడ్డి (28)కి హైదరాబాద్‌కు చెందిన శివశంకర్‌రెడ్డితో ఏడాది క్రితం వివాహమైంది.
ప్రస్తుతం ఆమె గర్భవతి. శివశంకర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, భార్యాభర్తలతో పాటు శివశంకర్‌రెడ్డి స్నేహితుడు జిలానీ బాషా కలసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. జాతీయ రహదారి మీదుగా కర్నూలు దాటి తెలంగాణ రాష్ట్రంలోని పుల్లూరు చెక్‌పోస్టు సమీపం వరకు వచ్చారు. అయితే, చెక్‌పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమో అనే భయంతో పాటు ఆలస్యమవుతుందని భావించి డ్రైవింగ్ చేస్తున్న జిలానీబాషా జాతీయ రహదారి నుంచి కారును గ్రామాల మీదుగా మళ్లించాడు.
ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతి
తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి కలుగొట్ల మీదుగా కారుని పోనిచ్చాడు. జోరువాన.. పైగా చీకట్లో కలుగొట్ల వాగు ఉధృతిని అంచనా వేయలేక వేగంగా వాగు దాటించే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతికి కారు అదుపుతప్పి కొట్టుకుపోయింది. నిద్రలో ఉన్న సింధూరెడ్డి వాగులో పడి నీటిలో మునిగిపోగా.. శివశంకర్‌రెడ్డి, జిలానీబాషా డోర్ తెరుచుకొని ముళ్లకంప సాయంతో ఎలాగోలా బయటపడ్డారు. సింధూను పట్టుకునే ప్రయత్నం చేసినా.. చీకటి, మరోవైపు నీటి ఉధృతి అధికంగా ఉండటంతో ఆమె గల్లంతైంది.
గాలింపు చర్యలు వేగవంతం
సమాచారం అందుకున్న ఎస్పీ రంజన్‌రతన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ రాములు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి వివరాలు సేకరించారు. ప్రొక్లెయినర్ సాయంతో కారును బయటికి తీయించారు. మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఈ వాగు, మరో పెద్దవాగు అయిన బొంకూరు గుండా వాహనాలను రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఘటన చోటుచేసుకన్న కలుగొట్ల వాగు నుంచి తుంగభద్ర నది 500 మీటర్ల దూరం మాత్రమే ఉంది. కాగా, ఎమ్మెల్యే అబ్రహం బాధితులను పరామర్శించారు. నిత్యం వాహనాలు ఇదే రోడ్డులో తిరుగుతాయని, ఇంతవరకు ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని పేర్కొన్నారు.
సింధూ గర్భవతి
ఇదిలా ఉండగా, తన కూతురు నాగసింధు ప్రస్తుతం గర్భిణి అని ఆమె తండ్రి రామాంజనేయ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటున్న అత్తగారింటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. తుంగభద్ర నది అధికంగా ప్రవహిస్తుండటంతో గల్లంతైన మహిళ ఆచూకీ దొరకడం లేదని,, గాలింపు చర్యలు ముమ్మరం చేశామని సీఐ వెంకట్రామయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment