ప్రతీకాత్మక చిత్రం
నెలరోజుల క్రితం భీంపూర్ మండలానికి చెందిన ఓ గర్భిణి ప్రసవం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రిలో చేరింది. కరోనా టెస్టులు చేయడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు ప్రసవం చేసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత డీఎంహెచ్‌వో, రిమ్స్ డైరెక్టర్ వైద్యులను ఒప్పించడంతో సిజేరియన్ చేశారు. రెండు నెలల క్రితం ఓ గర్భిణికి కూడా పాజిటివ్ రావడంతో ఆదిలాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు, రిమ్స్‌లో వైద్యం నిరాకరించారు. కుటుంబసభ్యులు మహారాష్ట్రలోని యావత్‌మాల్‌కు తీసుకెళ్లి ప్రసవం చేయించారు. వీరే కాదు. జిల్లాకు చెందిన మరికొందరికి పాజిటివ్ రావడం.. వైద్యులు నిరాకరించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించిన సంఘటనలు ఉన్నాయి.
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: కరోనా మహమ్మారి గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోవిడ్ కేసుల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో మారుమూల గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో గర్భిణులకు నెల వారీ పరీక్షలు కూడా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మంది కోవిడ్ భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో ప్రసవానికి ముందు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. జిల్లాలో దాదాపు వందకుపైగా గర్భిణులకు కోవిడ్ సోకింది. పాజిటివ్ వస్తే జిల్లా లోని ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయడం లేదు. దీంతో హైదరాబాద్, నాగాపూర్, యావత్‌మాల్, తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇబ్బందులు పడుతున్న గర్భిణులు
గర్భిణులు ప్రతీనెల పీహెచ్‌సీలు, ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈనెల 12 నుంచి లాక్‌డౌన్ విధించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు. మారుమూల గ్రామాలకు సైతం బస్సులు నడవడం లేదు. దీంతో ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లోని గైనకాలజిస్టులు గర్భిణులకు వైద్య పరీక్షలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. రిమ్స్‌లో కూడా వీరికి పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదని తెలుస్తోంది.
ఇద్దరు మృత్యువాత
జిల్లా వ్యాప్తంగా 5,282 మంది గర్భిణులు, 5,676 మంది బాలింతలు ఉన్నారు. దాదాపు 110 మందికి పైగా గర్భిణులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రులు, రిమ్స్‌లో చికిత్స పొందారు. మరొ కొంతమంది హోం ఐసోలేషన్‌లో ఉండి కరోనాను జయించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌కు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. పట్టణంలోని భుక్తాపూర్ ఏరియాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ప్రసవం జరిగిన తర్వాత మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఊపిరి ఆడకపోవడంతో ఆమె పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే చాలా మంది గర్భిణులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడంతో వైరస్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
అప్రమత్తంగా ఉండాలి
కోవిడ్ నేపథ్యంలో గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులు తొమ్మిది నెలల పాటు కంటికి రెప్పలా చూసుకోవాలి. తప్పని సరిగా నెలవారి పరీక్షలు చేయించాలి. కోవిడ్ సోకినప్పటికీ అధైర్య పడవద్దు.
– సాధన, గైనకాలజిస్ట్, డెప్యూటీ డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment