నేను బాలింతరాలిని. రెండున్నర నెలల బాబు ఉన్నాడు. నాకు కరోనా వచ్చింది. ఈ ఉత్తరం మీకు అందే సమయానికి నాకు కరోనా తగ్గిపోతుండొచ్చు. అయినా నాకు వచ్చిన సందేహం చాలా మంది తల్లులకూ ఉండి ఉంటుంది. కరోనా సమయంలో.. తగ్గిపోయాక కూడా బిడ్డకు పాలు పట్టొచ్చా?
– ఏ. రమ్యశ్రీ, డిచ్‌పల్లి
తల్లికి కరోనా వైరస్ సోకితే, వైరస్ తల్లిపాల వలన బిడ్డకు చేరే అవకాశాలు పెద్దగా లేవు. ఇప్పటి వరకు గమనించిన అంశాలను బట్టి కరోనా వైరస్ తల్లి పాలలో ఉన్నట్లు రుజువు కాలేదు. కరోనా వచ్చిన తొలి రోజులలో దాని గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి, తల్లిపాల వలన బిడ్డకు కరోనా సోకుతుందనే భయంతో బిడ్డను తల్లి నుంచి వేరు చేసి, డబ్బాపాలు పట్టడం జరిగింది. తర్వాత కేసులు పెరగడంతో, కరోనా బారినపడ్డవాళ్లలో జరిగే మార్పులు, వాటిలోని అనేక అంశాలను గమనించి తల్లిపాలను తాగడం వలన బిడ్డకు కరోనా సోకదు అని తేల్చారు శాస్త్రవేత్తలు, విశ్లేషకులు, డాక్టర్లు. కాకపోతే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ముక్కు, నోటి నుంచి బిడ్డకు కరోనా రావడం జరుగుతుంది.
అలాగే బిడ్డ ఆలనాపాలన చూసుకునే వారికి కరోనా ఉంటే వారి వలన కూడా బిడ్డకు కరోనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ చంటి పిల్లలకు సోకినా 80 -90 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండానే తల్లిపాలలోని యాంటీబాడీస్‌తో రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ అంతరించిపోతుంది. చాలా తక్కువ మంది పిల్లల్లో మాత్రమే 5-6 రోజులకు జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 0.5-1శాతం పిల్లలోనే న్యుమోనియా, శ్వాస సమస్యలు ఏర్పడి సరైన చికిత్స ఇప్పించకపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. తల్లిపాలల్లో అనేక రకాల విటమిన్స్, రోగనిరోధక శక్తిని పెంచే యాంటిబాడీస్ ఉంటాయి.
కాబట్టి తల్లిపాలు బిడ్డ తాగడం వలన ఇవి బిడ్డకు చేరి, బిడ్డలో చాలా వరకు కరోనాతోపాటు, ఇతర ఇన్‌ఫెక్షన్‌లు వచ్చినా రోగక్రిములకు వ్యతిరేకంగా పోరాడే శక్తి వంటి లాభాలు చేకూరి బిడ్డ ఆర్యోగ్యంగా ఉంటుంది. కాబట్టి తల్లికి కరోనా సోకినప్పటికీ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ బిడ్డకు పాలివ్వచ్చు. సబ్బుతో చేతులను శుభ్రంగా 20 సెకన్లపాటు కడుక్కోవాలి. లేదా కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉండే శానిటైజర్‌తో చేతులు పూర్తిగా తుడుచుకోవాలి. ముక్కు, మూతి పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలి. వీలయితే ఎన్95 లేదా సర్జికల్ మాస్క్, డబుల్ మాస్క్‌లు ధరించడం మంచిది. పాలిచ్చిన తర్వాత బిడ్డను కనీసం ఆరు అడుగులు (2 మీటర్లు) దూరంలో ఉంచడం మంచిది. తల్లి పాలు పట్టలేని స్థితిలో ఉంటే, ఎవరైనా శుభ్రంగా చేతులు కడుక్కొని తల్లి పాలు పిండి బిడ్డకు పట్టించవచ్చు.
చేతితో పాలు పిండడం కుదరకపోతే మాన్యుయల్ లేదా ఎలక్ట్రానిక్ బ్రెస్ట్ పంప్ ఉపయోగించొచ్చు. బిడ్డకు వాడే బాటిల్స్, బ్రెస్ట్ పంప్ వంటి వస్తువులు, అలాగే తల్లి ఉండే గదిలో కూడా తల్లి ముక్కు, మూతి నుంచి తుంపర్లు పడే అవకాశాలు ఉన్న టేబుల్, బెడ్ వంటి వాటినీ ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. కాన్పు తర్వాత వీలయినంత వరకు కొంతకాలం పాటు అతిథులను అనుమతించక పోవడం మంచిది. కావాలనుకుంటే వీడియోకాల్ ద్వారా తల్లి,బిడ్డను చూపించవచ్చు. తల్లికి కరోనా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తల్లిలో ఏర్పడే యాంటిబాడీస్, తల్లిపాల ద్వారా బిడ్డకూ చేరి బిడ్డనూ కరోనా వైరస్ బారి నుంచి కాపాడుతాయి.
కాబట్టి తగిన జాగ్రత్తలతో, పౌష్టికాహారం తీసుకుంటూ తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అరుదుగా వచ్చే దుష్ఫలితాల కంటే ప్రయోజనాలే ఎక్కువ. బిడ్డకు తన పాలు పట్టడం వలన తల్లిలో ఉన్న భయాందోళనలూ తగ్గి ఊరట, సంతృప్తి కలుగుతాయి. బిడ్డకు తన పాలు ఇవ్వకుండా దూరం పెట్టడం వలన తను మానసిక సంక్షోభంలోకి వేళ్లే అవకాశాలు ఉంటాయి.
మాకు ఈ మధ్యనే అంటే కరోనా కాలంలోనే పెళ్లయింది. నిజానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఏమీ అనుకోలేదు. కాని ఈ పాండమిక్ సిట్యుయేషన్‌లో గర్భం దాల్చలనీ లేదు. అయినా మీ సలహా కోసం ఈ ఉత్తరం రాస్తున్నాను. గర్భం దాల్చడం.. వైద్య పరీక్షల కోసం డాక్టర్స్ దగ్గరకు వెళ్లడం క్షేమమే అంటారా? లేక ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అవమంటారా?
– మాచిరాజు రాకేశ్, విఖాఖ పట్టణం
ఈ కరోనా పాండమిక్ సమయంలో గర్భం దాల్చడం గురించి, గర్భం దాలిస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయి వంటి ఎన్నో ప్రాక్టికల్ సందేహాలు చాలా మంది దంపతులను తికమక పెడుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. కోవిడ్ మొదలయిన ఒకటిన్నర సంవత్సర కాలంలో కరోనా వైరస్ ప్రభావం మనుషుల పైన ఎలా ఉంటోంది? అలాగే గర్భవతులు మీదా ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకోవడం జరిగింది. అలాగే దాని ప్రభావం, దుష్ఫలితాలు అంతుచిక్కని కొత్త కొత్త లక్షణాలు సమస్యలు కూడా బయటపడుతున్నాయి. ఈ సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ తొందరగా వ్యాప్తి చెందుతోంది.
అలాగే లక్షణాలు కూడా కొందరిలో తొందరగా తీవ్రమయి ఇబ్బంది పెడుతున్నాయి. కుటుంబ సభ్యులు అందరూ మానసికంగా , శారీరకంగా, ఆర్థికంగా వ్యథకు గురవుతున్నారు. అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో గర్భం దాలిస్తే తల్లి, లోపల శిశువు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ చెకప్స్‌కి ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకున్నా, కొన్నిసార్లు చెకప్స్‌కి ఆసుపత్రికి వెళ్లవలసి ఉంటుంది. దాని వలన కొందరిలో కరోనా వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ సెకండ్ వేవ్‌లో ఇంట్లో ఉన్నా, ఏదో ఒక విధంగా కొందరిలో వైరస్ వ్యాప్తి చెందుతుంది. కరోనా సోకినప్పుడు మాములు వారితో పోలిస్తే గర్భీణీలలో కొద్దిగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి, వీరిలో కాంప్లికేషన్స్ రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆస్తమా, డయాబెటీస్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారిలో ఈ రిస్క్ మరీ ఎక్కువ.
అదృష్టం కొద్ది 80–90 శాతం గర్భీణీలలో తొందరగా గుర్తించి, ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యలు లేకుండా బయటపడుతున్నారు. కొందరిలో మాత్రమే వారి శారీరక తత్వాన్ని బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి ఆలస్యంగా గుర్తించినా, నిర్లక్ష్యం చేసినా, ఆసుపత్రిలో ఆడ్మిట్ చేసి చికిత్స తీసుకోవలసి వస్తుంది. 3–5 శాతం మందిలో వ్యాధి లక్షణాలు ముదిరి, రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులు సరిగి పనిచేయకపోవటం, గుండెపై ప్రభావం, ఇతర అవయవాలు దెబ్బతినడంతో ప్రాణాంతకంగా మారవచ్చు. కొందరిలో మాత్రం అధిక జ్వరం వలన అబార్షన్లు, బిడ్డ బరువు సరిగా పెరగకపోవటం, నెలలు నిండకుండా కాన్పులు వంటి అవకాశాలుంటాయి కొద్దిగా. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గర్భం గురించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
వయసు, ఎత్తు, బరువు , పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా అనే విషయాలు తెలియవలసి ఉంటుంది. 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సుండి , ఇతర సమస్యలు లేకపోతే బిడ్డను కనే ఆలోచనను కొన్ని నెలల పాటు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ అధిక బరువుతోపాటు ఇతర హార్మోన్ సమస్యలు ఏమైనా ఉంటే, ఈ లోపల వాటిని సరిదిద్దుకుని, తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకోవటం మంచిది. ఒకవేళ అనుకోకుండా గర్భం వస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మానసికంగా, శారీరకంగా ఆనందంగా, ఆరోగ్యంగా, ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయాలి.
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
చదవండి: ఫాస్టెస్ట్ ఉమన్: ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళ
Comments
Please login to add a commentAdd a comment