Venati Shobha
-
నాకు పెళ్లి కాలేదు.. సర్జరీ చేయించుకుంటే ఏమైనా సమస్యా?
నా వయసు 31 సంవత్సరాలు. పెళ్లయి ఏడేళ్లయినా, ఇంతవరకు మాకు పిల్లల్లేరు. మాది మూడోతరం మేనరికం. ఇద్దరమూ పరీక్షలు చేయించుకుంటే, నార్మల్‌గానే ఉన్నట్లు తేలింది. డాక్టర్ల సలహాలపై ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. మాకు పిల్లలు పుట్టకపోవడానికి మేనరికమే కారణమా? మా సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందా? – నాగమణి, శ్రీకాకుళం మేనరికం వల్ల గర్భంరాకపోవడం అంటూ ఏమీ ఉండదు. మేనరికం వల్ల అబార్షన్లు అవ్వడం, పిల్లలలో అవయవ లోపాలు, జన్యుపరమైన లోపాలు, మామూలు వారితో పోలిస్తే రెట్టింపు అవుతాయి. అంతే కానీ గర్భం రాకపోవటానికి ఏమీ సంబంధం ఉండదు. మీ భార్యాభర్తలు ఇద్దరి పరీక్షల రిపోర్టులలో ఏమి సమస్యలు లేకపోయినా గర్భం రాకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుని ఉన్నయా?, తెరచుకుని ఉన్నాయా? అని తెలుసుకోవటానికి చేసే HSG test చేయించుకునే ఉంటారు. ఒకవేళ చేయించుకోకుండా ఉండి ఉంటే చేయించుకుని తెలుసుకోవటం మంచిది. రిపోర్ట్లు అన్నీ సాధారణంగానే ఉన్నా కానీ కొంతమందిలో వీర్యకణాలు గర్భాశయం లోపలికి వెళ్లలేకపోవడం, వెళ్లినా గర్భాశయం ముఖద్వారం దగ్గర ఉండే యాంటీస్పెర్మ్ యాంటీబాడీలు వీర్యకణాలను నిర్వీర్యం చెయ్యడం వల్ల అవి ఫెలోపియన్ ట్యూబ్ వరకు ప్రయాణించలేకపోవడం, అండంలోకి వెళ్లి ఫలదీకరణ చెయ్యలేకపోవడం(Fertilization)ఫలదీకరణ చెందినా పిండం, గర్భాశయంలోకి చేరి అక్కడ అతుక్కోకపోవడం (implantation)వంటి సమస్యల వల్ల గర్భం రాకపోవచ్చు. ఈ సమస్యలు తెలుసుకోవడానికి పెద్దగా నిర్ధారణ పరీక్షలు ఏమీ ఉండవు. దీనినే అన్ఎక్స్ప్లైన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటారు. మీరు మందులు వాడినా గర్భం రాలేదు కాబట్టి, వయసు కూడా 31 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి సమయం వృథా చేసుకోకుండా ఐయుఐ పద్ధతి ద్వారా మీ వారి వీర్యకణాలను శుద్ధి చేసి, మంచి నాణ్యత గల వీర్యకణాలను మీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా సాధారణంగా కంటే 10 నుంచి 20 శాతం వరకు గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీనిని 3 నుంచి 6 సార్ల వరకు ప్రయత్నించవచ్చు. అయినా గర్భం రాకుంటే ఐవిఎఫ్ పద్ధతి అంటే టెస్ట్‌ట్యూబ్ బేబి పద్ధతిని ప్రయత్నించవచ్చు. దీని ద్వారా 40 శాతం వరకు గర్భం నిలిచే అవకాశాలు ఉన్నాయి. నా వయసు 22 ఏళ్లు. ఎత్తు 4.9 అడుగులు, బరువు 73 కిలోలు. రెండువారాల కిందట కడుపులో కుడివైపు తీవ్రమైన నొప్పి వస్తే, డాక్టర్‌కి చూపించుకున్నాను. స్కానింగ్‌లో ఇంటర్నల్ టోర్షన్, ఎన్లార్జ్డ్ రైట్ ఓవరీ (69 x 33 ఎంఎం), స్మాల్ హేమరేజిక్ సిస్ట్ (7 ఎంఎం) అని వచ్చింది. యాంటీబయోటిక్స్ వాడితే నొప్పి తగ్గింది. ఇప్పుడు ఈ సమస్యకు సర్జరీ అంత అవసరమంటారా? నేను ఇంకా స్టూడెంట్‌ని. పెళ్లి కాలేదు. సర్జరీ చేయించుకుంటే భవిష్యత్తులో కాంప్లికేషన్స్ ఏవైనా వస్తాయా? వివరించగలరు. – అనూష, ఈ–మెయిల్ మీ ఎత్తుకి దగ్గర దగ్గర 20 కేజీల అధిక బరువు ఉన్నారు. మీ కుడి అండాశయం ఓవరీలో నీరు, రక్తం చేరడం వల్ల అది పెద్దగా అయి ఎన్లార్జ్డ్ ఓవరీ అవ్వడం, లేదా అండాశయం పెద్దగా ఉండటం వల్ల అండాశయం టోర్షన్ అవ్వడం అంటే అది మెలికపడి, అండాశయానికి రక్తప్రసరణ తగ్గి దాని వల్ల.. అండాశయంలో నీరు చేరడం, బ్లీడింగ్ అవ్వడం వల్ల అండాశయం పెద్దగా అయ్యి, విపరీతమైన నొప్పి, వాంతులు అవ్వడం జరుగుతుంది. మందులతో నొప్పి తగ్గినా, కొంతమందిలో మెలికపడిన అండాశయానికి పూర్తిగా రక్తప్రసరణ తగ్గిపోయి ఆలస్యం చేస్తే అండాశయం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అండాశయం ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. అది తొలగించవలసి ఉంటుంది. కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, మరలా ఒకసారి డాప్లర్ స్కానింగ్ చేయించుకుని, అండాశయం పరిమాణాన్ని బట్టి చూడవలసి ఉంటే, మెలికను తొలగించి (Detorsion) చూడవలసి ఉంటుంది. ఒకవేళ తర్వాత అండాశయం మామూలుగా ఉంటే, అండాశయాన్ని తొలగించనవసరం లేదు. ఒకవేళ సర్జరీ చేసి అండాశయం మొత్తం తొలగించవలసి ఉంటుందా, కొద్దిభాగం తొలగించవలసి ఉంటుందా అనేదాన్ని బట్టి తర్వాత ఏమి చెయ్యాలి అనేది ఉంటుంది. ఒక అండాశయం తొలగించినా, ఇంకొక అండాశయం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో పెద్దగా కాంప్లికేషన్స్ రాకపోవచ్చు. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఆహారపు అలవాట్లు మార్చుకుంటే హెచ్‌బీఏ1సీ నార్మల్‌కి వస్తుందా?
నా వయసు 24 ఏళ్లు. ఎత్తు 5.3, బరువు 52 కిలోలు. గత ఏడాది పెళ్లయింది. ప్రస్తుతం నాకు మూడో నెల. ఇటీవల డాక్టర్ సలహాపై హెచ్‌బీఏ1సీ టెస్ట్ చేయించుకుంటే, 7.7 ఉంది. తీపి పదార్థాలు పూర్తిగా మానేశాను. అన్నం కూడా తగ్గించాను. తరచు నీరసంగా ఉంటోంది. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే హెచ్‌బీఏ1సీ నార్మల్‌కి వస్తుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందో దయచేసి వివరించగలరు. – మాధురి, పర్లాకిమిడి హెచ్‌బీఏ1సీ లేదా గ్లైకోనేటెడ్ హీమోగ్లోబిన్ టెస్ట్ ద్వారా మన రక్తంలో మూడు నెలల ముందు నుంచి సగటు చక్కెర శాతం ఎంతవరకు ఉందనేది తెలుస్తుంది. సాధారణంగా రక్తంలోని ఎర్రకణాలలోని హీమోగ్లోబిన్‌కు చక్కెర అంటుకుంటుంది. సుగర్ ఉన్నవాళ్లలో చక్కెర ఎక్కువగా అంటుకుంటుంది కాబట్టి హెచ్‌బీఏ1సీ ఎక్కువగా ఉంటుంది. హెచ్‌బీఏ1సీ 5.7 శాతం కంటే తక్కువగా ఉంటే, సుగర్ నార్మల్‌గా ఉన్నట్లు. ఇది 5.7–6.4 శాతం మధ్య ఉన్నట్లయితే, ప్రీడయాబెటిక్ రేంజ్లో ఉన్నట్లు–అంటే, వీరికి త్వరలోనే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి నుంచే ఆహార నియమాలను పాటించేటట్లయితే, డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. హెచ్‌బీఏ1సీ 6.5 శాతం కంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్ ఉన్నట్లు. మీకు హెచ్‌బీఏ1సీ 7.7 ఉంది. గర్భం మూడోనెల. అంటే, గర్భం రాకముందు నుంచే మీకు డయాబెటిస్ ఉన్నట్లుంది. ఇంతకుముందు ఎప్పుడూ సుగర్ టెస్ట్ చేయించుకుని ఉండరు కాబట్టి సుగర్ ఉన్నట్లు తెలియలేదు. గర్భం లేకుండా ఉన్నట్లయితే, సుగర్ మందులతో పాటు, ఆహారపు అలవాట్లను కఠినంగా మార్చుకుని, ఆహార నియమాలను పాటించినట్లయితే హెచ్‌బీఏ1సీ మూడు నెలల్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాని, ఇప్పుడు మూడోనెల గర్భం కాబట్టి ఒకసారి ఎండోక్రైనాలజిస్టును సంప్రదిస్తే, వారు తినకముందు, తిన్న తర్వాత సుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించి, వాటిని బట్టి సుగర్ అదుపులోకి రావడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు, మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్భం కాబట్టి ఆహార నియమాలను డాక్టర్ చెప్పిన ప్రకారం, అవసరమైతే న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు సుగర్ నియంత్రణకు, బిడ్డ పెరుగుదలకు మధ్య సమన్వయం చేసుకుంటూ పాటించవలసి ఉంటుంది. ఆహారంలో తీపి పదార్థాలు, అన్నం, చపాతీ వంటివి తగ్గించేసి, రాగిజావ, తృణధాన్యాలు, జొన్నరొట్టె వంటివి తీసుకోవడం మంచిది. ఇవన్నీ పాటిస్తూ సుగర్ లెవల్స్‌ను తరచుగా పరీక్ష చేయించుకుంటూ, అదుపులో ఉన్నట్లయితే, అదే చికిత్స తీసుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణలో చిన్నగా నడక వంటి వ్యాయామాలు చేసుకోవచ్చు. సుగర్ లెవల్స్ అదుపులో లేకపోతే, ఇన్సులిన్ మోతాదును పెంచడం జరుగుతుంది. గర్భం వల్ల నీరసంగా ఉంటుంది. అలాగే సుగర్ లెవల్స్ మరీ తక్కువగా ఉన్నా, నీరసం వస్తుంది. ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు విభజించుకుని, ఆరుసార్లుగా, అంటే మూడుసార్లు ముఖ్యమైన ఆహారం, మూడుసార్లు స్నాక్స్‌లాగా తీసుకోవడం మంచిది. గర్భంతో ఉన్నప్పుడు సుగర్ లెవల్స్ ముందు నుంచే అధికంగా ఉంటే, దాని ప్రభావం వల్ల కొందరిలో అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం, కొందరిలో అధికంగా పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కంగారు పడకుండా, ఎండోక్రైనాలజిస్టును సంప్రదించి, వారి పర్యవేక్షణలో సక్రమంగా చికిత్స తీసుకోవడం మంచిది. నా వయసు 33 ఏళ్లు. రెండేళ్ల కిందట సిజేరియన్ ద్వారా కాన్పు జరిగింది. ఆ తర్వాతి నుంచి నడుము నొప్పి మొదలైంది. కొద్ది నెలలుగా సమస్య మరింత తీవ్రంగా మారింది. ఆసరా లేకుండా కూర్చోవడం కూడా కష్టంగా ఉంటోంది. ఇంతవరకు ఏ డాక్టర్‌కు చూపించుకోలేదు. నేను ఎలాంటి చికిత్స తీసుకోవలసి ఉంటుందో చెప్పగలరు. – ప్రసూన, కొవ్వూరు సిజేరియన్ తర్వాత నడుంనొప్పి రావటానికీ, ఆపరేషన్‌కూ ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే, కాన్పు ముందు తొమ్మిదినెలలు గర్భంలో బిడ్డ పెరగడం, తల్లి నుంచి క్యాల్షియం, విటమిన్లు తీసుకోవడం జరుగుతుంది. కాన్పు తర్వాత తల్లి పాల నుంచి బిడ్డకు క్యాల్షియం వెళ్లిపోవడం వల్ల తల్లి ఎముకలలో క్యాల్షియం తగ్గి, నడుంనొప్పి రావచ్చు. ఈ సమయంలో తల్లి క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పాలు పెరుగుతో పాటు క్యాల్షియం, విటమిన్–డి మాత్రలు తీసుకోవడం వల్ల నడుంనొప్పి లేకుండా, తల్లిలో ఎముకలు దృఢంగా ఉంటాయి. మీ సమస్య మరీ తీవ్రంగా అనిపిస్తోంది. మీ సమస్యకు కారణం వెన్నుపూసలో ఎముకలు బలహీనపడటమా లేక వెన్నుపూసలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది తేలవలసి ఉంది. కొందరిలో క్యాల్షియం, విటమిన్–డి లోపంతో పాటు థైరాయిడ్ సమస్య, వెన్నుపూసలో గుజ్జు తగ్గడం, డిస్క్ ప్రొలాప్స్ కావడం, వాటి మధ్య నరాలు ఒత్తుకోవడం వంటి అనేక కారణాల వల్ల అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇలా డాక్టర్‌కు చూపించుకోకుండా ఇబ్బందిపడటం సరికాదు. ఒకసారి ఆర్థోఫిజీషియన్ డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఎక్స్‌రే, రక్తపరీక్షలు చేయించుకుని, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని, సరైన చికిత్స తీసుకోవడం మంచిది. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
మూత్రానికి వెళ్లేటప్పుడు రక్తస్రావం.. ప్రమాదకర లక్షణమా?
నా వయసు 20 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 77 కిలోలు. పీసీఓడీ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. టాబ్లెట్లు వేసుకుంటే తప్ప పీరియడ్స్ రావడం లేదు. గడ్డంపై, పైపెదవి మీద వెంట్రుకలు వస్తున్నాయి. నా సమస్యకు తగిన చికిత్స సూచించగలరు. – మౌనిక, పిడుగురాళ్ల మీ ఎత్తు 5.4 అడుగులు. ఈ ఎత్తుకు గరిష్ఠంగా 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కానీ మీరు 77 కిలోలు ఉన్నారు. అంటే, 17 కిలోలు అధిక బరువుతో ఉన్నారు. అధిక బరువుతో పాటు పీసీఓడీ సమస్య కూడా ఉందంటున్నారు. పీసీఓడీ సమస్యలో గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాలలో నీటిబుడగలు ఏర్పడటం, మగవారిలో ఎక్కువగా ఉండే ఆండ్రోజన్ హార్మోన్లు వీరిలో ఎక్కువగా విడుదలవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడటం, వాటి ప్రభావం వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, ముఖంపై అవాంఛిత రోమాలు, జుట్టు అధికంగా ఊడిపోవడం, మొటిమలు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. మీ సమస్యకు చికిత్సలో ముఖ్యమైన భాగం బరువు తగ్గడమే! రోజూ కనీసం అరగంటైనా వాకింగ్, యోగా, ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేస్తూ, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, మితంగా పోషకాహారం తీసుకుంటూ బరువు తగ్గడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆండ్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, హార్మోన్లు సక్రమంగా పనిచేసి, పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరీ మందులు వాడితేనే పీరియడ్స్ వచ్చే పరిస్థితి కాకుండా, కనీసం రెండు నెలలకైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గడంతో పాటు డాక్టర్‌ను సంప్రదిస్తే, హార్మోన్ల అసమతుల్యతను బట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడం ద్వారా ఆండ్రోజన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గించడానికి అవసరమైన మందులతో పాటు అవసరమైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కలిసి ఉండే కొన్ని రకాల కాంట్రాసెప్టివ్ పిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బరువు తగ్గుతూ, మందులు వాడుతూ ఇప్పటికే ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి డెర్మటాలజిస్టును సంప్రదించి లేజర్ వంటి చికిత్సలు తీసుకోవచ్చు. కొందరిలో కేవలం బరువు తగ్గడం వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా వచ్చి, అవాంఛిత రోమాలు ఇంకా ఎక్కువగా పెరగకుండా ఉంటాయి. నా వయసు 60 ఏళ్లు. రుతుక్రమం ఆగిపోయి దాదాపు పదేళ్లవుతోంది. ఆరునెలలుగా మూత్రానికి వెళ్లేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తోంది. ఇదేమైనా ప్రమాదకర లక్షణమా? నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – ప్రభావతి, ఒంగోలు మూత్రానికి వెళ్లేటప్పుడు రక్తస్రావం మూత్రంలో పడుతోందా లేక యోనిభాగం నుంచి వస్తోందా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మూత్రాశయంలో కంతులు, రాళ్లు, కిడ్నీ సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల మూత్రంలో రక్తం పడవచ్చు. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మళ్లీ రక్తస్రావం అవడాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొందరిలో ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోయి, యోనిభాగం పూర్తిగా పొడిబారిపోయి, ఇన్ఫెక్షన్స్ ఏర్పడి కొద్దిగా బ్లీడింగ్ కనిపించవచ్చు. కొందరిలో గర్భాశయంలో కంతులు, గర్భాశయ పొర మందంగా ఏర్పడటం, గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వారం దగ్గర పుండ్లు, కండ పెరగడం (సర్వైకల్ పాలిప్స్), సర్వైకల్ క్యాన్సర్, అండాశయాలలో కంతులు వంటి అనేక కారణాల వల్ల పోస్ట్‌మెనోపాజల్ బ్లీడింగ్ రావచ్చు. మీకు రక్తస్రావం ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి, చికిత్సలు తీసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదిస్తే, వారు అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వజైనల్ స్కానింగ్, ప్యాప్‌స్మియర్ వంటి పరీక్షలు చేయించి, సమస్యను బట్టి గర్భాశయ పొర మందంగా ఉండటం లేదా పాలిప్ వంటివి ఉండటం గుర్తిస్తే, దానికి డీ అండ్ సీ చేసి, గర్భాశయాన్ని శుభ్రపరచి తీసిన ముక్కలను బయాప్సీకి పంపించి, ఆ రిపోర్టును బట్టి క్యాన్సరా కాదా అనేది నిర్ణయించి, గర్భాశయం తొలగించడం అవసరమా లేదా అనేది నిర్ణయించి, తగిన చికిత్స అందిస్తారు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం దగ్గర కండపెరగడం వల్ల బ్లీడింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు అదనంగా పెరిగిన కండను తొలగిస్తే సరిపోతుంది. కొందరిలో ఇన్ఫెక్షన్ల వల్ల, గర్భాశయంలో నీరు చేరడం వల్ల బ్లీడింగ్ కావచ్చు. వాటికి యాంటీబయోటిక్స్ ఇస్తే సరిపోతుంది. కొందరికి ఎండోమెట్రియమ్ పొరలో కండ పెరగడం వల్ల ఏర్పడే పాలిప్స్‌ను హిస్టరోస్కోపీ అనే పద్ధతి ద్వారా గర్భాశయం లోపలికి చూస్తూ, పాలిప్‌ను తొలగించి, బయాప్సీకి పంపడం జరుగుతుంది. అది సాధారణ పాలిప్ అని బయాప్సీలో తేలితే వేరే చికిత్స అవసరం ఉండదు. ఒకవేళ క్యాన్సర్‌కు సంబంధించినదని తేలితే, గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఇంకా రజస్వల కాలేదు... ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
Gynecologist Venati Sobha Counselling Suggestions Irregular Periods: మా అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. ఇంకా రజస్వల కాలేదు. పరీక్షలు జరిపిన డాక్టర్లు ‘టర్నర్ సిండ్రోమ్’ అని చెబుతున్నారు. దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో దయచేసి వివరించగలరు. – సుగుణ, మధిర ఆడపిల్లల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే 46 క్రోమోజోమ్స్. వీటిలో 22 జతల ఆటోసోమ్స్, ఒక జత ‘ఎక్స్ఎక్స్’ క్రోమోజోమ్స్ ఉంటాయి. దానిని 46 ఎక్స్ఎక్స్గా పరిగణించడం జరుగుతుంది. ఈ ‘ఎక్స్ఎక్స్’ క్రోమోజోమ్స్ జతలో ఒక ‘ఎక్స్’ తల్లి నుంచి, ఒక ‘ఎక్స్’ తండ్రి నుంచి పిండం ఏర్పడినప్పుడే బిడ్డకు సంక్రమించి, ఆడపిల్లగా పుట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల వల్ల ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ మాత్రమే బిడ్డకు సంక్రమిస్తుంది. దీనినే ‘45ఎక్స్జీరో’ అంటారు. దీనినే ‘టర్నర్స్ సిండ్రోమ్’ అంటారు. ఇలా పుట్టిన పిల్లలు పొట్టిగా ఉండటం, వారిలో మానసిక ఎదుగుదల కొద్దిగా తక్కువగా ఉండటం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, రజస్వల కాకపోవడం, రొమ్ములు సరిగా పెరగకపోవడం, అండాశయాలు చాలా చిన్నగా ఉండి, అవి పనిచేయకపోవడం వల్ల పీరియడ్స్ రాకపోవడం, ఎముకల సమస్యలు వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కొందరిలో అండాశయాలు కొన్నిరోజులు హార్మోన్లు విడుదల చేసి, తర్వాత అవి చిన్నగా అయిపోయి అండాలు తగ్గిపోవడం వల్ల కొంతకాలం పీరియడ్స్ వచ్చి తొందరగా ఆగిపోతాయి. ఇది జన్యుపరంగా ఏర్పడింది కాబట్టి, మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. మీరు ఎండోక్రైనాలజిస్టును సంప్రదిస్తే, అవసరమైన పరీక్షలు చేయించి, స్కానింగ్‌లో గర్భాశయం, అండాశయాల పరిమాణం బట్టి, పీరియడ్స్ కోసం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కొంతకాలం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇతర సమస్యలను బట్టి చికిత్స సూచించడం జరుగుతుంది. నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 48 కిలోలు. రెండేళ్లుగా నాకు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. ఒక్కోసారి పదిహేను రోజులకే అయిపోతే, ఒక్కోసారి నెల్లాళ్లు గడిచాక అవుతోంది. పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు నొప్పితో పాటు విపరీతమైన తలనొప్పి ఉంటోంది. ఆ సమయంలో ఏ పనీ చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – రమ్య, తగరపువలస మీ ఎత్తుకి మీరు కనీసం 54 కిలోల బరువు ఉండాలి. కాని, 48 కిలోలే ఉన్నారు. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల, థైరాయిడ్, పీసీఓడీ వంటి అనేక సమస్యల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్స్ సమయంలో కొందరిలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్లు ఎక్కువగా విడుదలవడం వల్ల పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి ఉండే అవకాశాలు ఉంటాయి. కొందరిలో రక్తహీనత వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సీబీపీ, ఎస్ఆర్. టీఎస్‌హెచ్, అల్ట్రాసౌండ్ పెల్విస్ వంటి పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పాలు, పెరుగుతో కూడిన మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, నడక, యోగా, ధ్యానం వంటివి కూడా చెయ్యడం వల్ల చాలావరకు హార్మోన్ల అసమతుల్యత తగ్గే అవకాశాలు ఉంటాయి. సమస్య ఏమీ లేకున్నా, పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే, డాక్టర్ సలహా మేరకు రెండురోజులు నొప్పి నివారణ మాత్రలు వాడుకోవచ్చు. ∙నా వయసు 46 ఏళ్లు. నాకు రుతుక్రమం రెండు మూడు నెలలకోసారి వస్తోంది. వచ్చినప్పుడు కూడా రుతుస్రావం రెండు రోజులే ఉంటోంది. ఇటీవల పరీక్షలు జరిపిస్తే, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెరిగినట్లు రిపోర్టు వచ్చింది. ఈ పరిస్థితిలో గర్భసంచి తీసేస్తేనే మంచిదని డాక్టర్లు అంటున్నారు. నాకైతే ఆపరేషన్ అంటే భయంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయ చికిత్స ఏమైనా ఉందా? – లక్ష్మి, రేణిగుంట మీకు 46 ఏళ్లు. పీరియడ్స్ రెండు మూడు నెలలకోసారి వచ్చి, బ్లీడింగ్ రెండురోజులే ఉంటుంది. అంటే మీకు ఫైబ్రాయిడ్స్ కారణంగా ప్రస్తుతానికి పెద్దగా లక్షణాలేమీ లేనట్లే! సాధారణంగా ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో పెరిగే కంతులు. ఇవి 99.9 శాతం క్యాన్సర్ గడ్డలు కావు. వాటి పరిమాణం, గర్భాశయంలో ఎక్కడ ఉన్నాయి అనేదాని బట్టి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ గర్భాశయం లోపలి పొరలో (సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్) ఉంటే, బ్లీడింగ్ ఎక్కువ కావడం, మధ్య మధ్యలో స్పాటింగ్ కనిపించడం వంటివి ఉంటాయి. మయోమెట్రియమ్ పొరలో (ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్) ఉంటే, వాటి పరిమాణం బట్టి బ్లీడింగ్ ఎక్కువ కావడం, చిన్నగా ఉంటే కొందరిలో ఏ సమస్యా లేకపోవడం జరగవచ్చు. గర్భాశయం బయటి పొరలో (సబ్ సిరీస్ ఫైబ్రాయిడ్స్) ఉంటే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. మరీ పెద్దగా ఉంటే చుట్టు పక్కల అవయవాల మీద ఒత్తిడి పడటం వల్ల నడుంనొప్పి, మూత్ర సమస్యలు, జీర్ణ సమస్యలు ఉండవచ్చు. మీరు చెప్పినదాని బట్టి చూస్తే, ప్రస్తుతానికి ఫైబ్రాయిడ్స్ వల్ల మీకు ఎటువంటి లక్షణాలూ కనిపించడం లేదు. బ్లీడింగ్ కూడా రెండు మూడు నెలలకోసారి రెండురోజులే అవుతుంది కాబట్టి మీకు త్వరలోనే పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశ రావచ్చు. పీరియడ్స్ ఆగిపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం అంతగా ఉండదు కాబట్టి ఫైబ్రాయిడ్స్ ఇంకా పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా, వాటి పరిమాణం మెల్లగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు లక్షణాలు లేనంత వరకు ఫైబ్రాయిడ్స్ గురించి కంగారు పడకుండా కొంతకాలం ఆగి చూడవచ్చు. ఆరునెలలకోసారి స్కానింగ్ చేయించుకుంటూ, వాటి పరిమాణం పెరుగుతోందా లేదా తెలుసుకోవచ్చు. వాటి పరిమాణం మరీ పెద్దగా అవుతూ, మీకు లక్షణాలు కనిపిస్తున్నట్లయితే, అప్పుడు ఆపరేషన్ గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆపరేషన్ బదులు ఫైబ్రాయిడ్స్ పరిమాణం తగ్గడానికి యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్, ఎంఆర్ఐ గైడెడ్ హైఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ వేవ్స్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించవచ్చు. డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరని విన్నాను. నిజమేనా?
నాకు పెళ్లయి మూడేళ్లయింది. నా వయసు 29 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 48 కిలోలు. గత ఏడాది నాకు తొలికాన్పు ఏడోనెలలోనే జరిగింది. పుట్టిన పది రోజులకే పాప పోయింది. ఇప్పుడు నాకు నాలుగో నెల. తొలికాన్పులో తలెత్తిన పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – సుమతి, టెక్కలి సాధారణంగా గర్భస్థ శిశువు తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక వారం వరకు పెరుగుతుంది. సక్రమంగా పీరియడ్స్ వచ్చేవారిలో చివరి పీరియడ్ అయిన మొదటి రోజు నుంచి లెక్కపెడితే, 280 రోజులు లేదా 40 వారాల సమయానికి డెలివరీ తేదీని (ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ–ఈడీడీ) నిర్ణయించడం జరుగుతుంది. దాదాపు 80 శాతం మందికి ఈడీడీ కంటే రెండు వారాల ముందే డెలివరీ జరుగుతుంది. కాన్పు నొప్పులు ఎవరికి ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టం. 36 వారాలకు ముందే కాన్పు కావడాన్ని ప్రీటెర్మ్ డెలివరీ అంటారు. సాధారణంగా 36–37 వారాల వరకు బిడ్డ ఊపిరితిత్తుల పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపడుతుంది. ఇంకా ముందే పుట్టడం వల్ల బిడ్డ ఊపిరితిత్తులు సరిగా ఎదగక బిడ్డ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు ఏర్పడి, సమయానికి సరైన వైద్య సహాయం అందకపోయినా, బిడ్డ చికిత్సకు సరిగా స్పందించకపోయినా బిడ్డకు ప్రాణాపాయం కలగవచ్చు. మీ పాప మరీ ఏడో నెలలోనే పుట్టడం వల్ల ఇబ్బంది అయినట్లుంది. గర్భాశయ ముఖద్వారమైన సర్విక్స్ చిన్నగా ఉన్నా, లూజ్‌గా ఉన్నా కొందరిలో బిడ్డ బరువు పెరిగే కొద్ది గర్భాశయం వదులై, నెలలు నిండకుండానే కాన్పు జరగవచ్చు. కొందరిలో యోనిలో ఇన్ఫెక్షన్లు, ఇంకా ఇతరేతరా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, గర్భాశయం ఆకారంలో తేడాలు ఉంటే బైకార్నుయేట్ యుటెరస్, సెప్టేట్ యుటెరస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కొందరిలో 7–8 నెలలో కాన్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదవండి: ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!! ఇప్పుడు మీకు నాలుగో నెల గర్భం కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ముందు జాగ్రత్తగా స్కానింగ్‌లో గర్భాశయ ముఖద్వారం– అంటే సర్విక్స్ లెంగ్త్ తెలుసుకుంటూ ఉండటం ముఖ్యం. ఒకవేళ సర్విక్స్ లూజ్‌గా ఉన్నా, చిన్నగా ఉన్నా గర్భాశయ ముఖద్వారానికి యోనిభాగం ద్వారా సర్‌క్లాజ్ కుట్లు వేయడం జరుగుతుంది. వజైనల్ ఇన్ఫెక్షన్లు, యూరినరీ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ, వాటికి సరైన చికిత్స తీసుకోవడం, అలాగే గర్భాశయ కండరాలు కుంచించుకోకుండా ఉండటానికి ప్రొజెస్టిరాన్ ఇంజెక్షన్లు, మాత్రలు అవసరాన్ని బట్టి వాడటం, శారీరక శ్రమ లేకుండా విశ్రాంతిగా ఉండటం వంటి జాగ్రత్తలు డాక్టర్ సలహా మేరకు తీసుకుంటూ ఉండటం వల్ల చాలా వరకు నెలలు నిండకుండా జరిగే కాన్పులను అరికట్టవచ్చు. కాని, కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, గర్భాశయం పనితీరు, శరీరం తీరును బట్టి కొందరిలో ముందుగానే కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు బిడ్డలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటానికి 7–8 నెలలో స్టిరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ సలహాను పాటిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, అన్ని సౌకర్యాలూ ఉన్న ఆస్పత్రిలో చెకప్ చేయించుకుంటూ ఉంటే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఒకవేళ ముందుగా పుట్టినా, సమయానికి ఇంక్యుబేటర్‌లో ఉంచి, సరైన చికిత్స ఇవ్వడం వల్ల, బిడ్డ చికిత్సకు స్పందించే తీరు బట్టి బిడ్డ ఆరోగ్యంగా బయటపడుతుంది. నేను థైరాయిడ్, పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్నాను. నా వయసు 30 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నా ఎత్తు 5.1, బరువు 75 కిలోలు. ఇంట్లోవాళ్లు త్వరలోనే నాకు పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. థైరాయిడ్, పీసీఓడీ రెండు సమస్యలూ ఉంటే పిల్లలు పుట్టరని విన్నాను. నిజమేనా? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? – సాయిలక్ష్మి, ధర్మవరం థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు తలెత్తినప్పుడు కొందరిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, సక్రమంగా వచ్చినా, కొందరిలో అండం సరిగా పెరగకపోవడం, అది విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల గర్భం రాకపోవడం, గర్భం వచ్చినా, అబార్షన్ జరగడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాకపోతే ఈ సమస్యలకు గైనకాలజిస్టులు చెప్పిన సలహాలను పాటిస్తూ, సరైన చికిత్స తీసుకుంటే, థైరాయిడ్ సమస్య అదుపులో ఉండి, పీసీఓడీ వల్ల ఉండే హార్మోన్ల అసమతుల్యత చక్కబడితే గర్భం తప్పకుండా వస్తుంది. ఇక మీ విషయానికి వస్తే, ఎత్తు 5.1 అడుగులకు గరిష్ఠంగా 55 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కాని, మీరు 75 కిలోలు ఉన్నారు. మీ సమస్యలకు సగం చికిత్స బరువు తగ్గడమే! క్రమం తప్పకుండా వాకింగ్, యోగా, ఏరోబిక్స్ వంటి వ్యాయామాలతో పాటు జంక్‌ఫుడ్ మానేసి, మితమైన పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం జరుగుతుంది. మీరు పెళ్లి కుదిరే లోపు బరువు తగ్గి, థైరాయిడ్ మాత్రలు సరైన మోతాదులో తీసుకుంటూ, థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకుంటే, పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు సహజంగానే పెరుగుతాయి. బరువు తగ్గితే పెళ్లయిన తర్వాత గర్భం రాకపోయినా, సరైన చికిత్సతో గర్భం త్వరగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బరువు తగ్గకుండానైతే, గర్భం కోసం చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే బరువు తగ్గడానికి పైన చెప్పిన జాగ్రత్తలు పాటించడం మంచిది. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్!! కానీ కారు ప్రమాదంలో.. -
అప్పుడే పిల్లలు వద్దనుకుని లూప్ వేయించుకున్నాను. ఎంతకాలం ఉంచుకోవచ్చు?
నా వయసు 19 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 48 కిలోలు. ఆరునెలల కిందట నాకు కోవిడ్ వచ్చి, నెల్లాళ్లకు పైగా చికిత్స తర్వాత నయమైంది. కోవిడ్ తగ్గినప్పటి నుంచి నాకు నెలసరి క్రమం తప్పింది. ఒక్కోసారి త్వరగా, ఒక్కోసారి ఆలస్యంగా అవుతోంది. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుజాత, యలమంచిలి నీ ఎత్తుకి నువ్వు బరువు తక్కువగానే ఉన్నావు. కోవిడ్ తర్వాత నువ్వు ఇంకా బలహీనపడి ఉండొచ్చు. మానసిక ఒత్తిడి ఉండొచ్చు. కొందరిలో ఈ మార్పుల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి నెలసరి క్రమం తప్పే అవకాశాలు కొద్దిగా ఉండొచ్చు. కొందరిలో వేరే కారణాల వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఒకసారి బరువు ఎంత ఉన్నావు. కోవిడ్ తర్వాత బరువు తగ్గావా లేదా పెరిగావా అనేది చూసుకుని, మరీ తక్కువగా ఉంటే సరైన పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించి చూడవచ్చు. అలాగే మానసిక ఒత్తిడి లేకుండా, బరువు ఎక్కువ ఉంటే తగ్గడానికి యోగా, నడక, ధ్యానం వంటివి చెయ్యడం వల్ల, హార్మోన్ల అసమతుల్యత ఏమైనా ఉంటే, అది సరిగా అయ్యి కొందరిలో పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్ట్‌ను అవసరమైన రక్తపరీక్షలు, థైరాయిడ్ వంటి హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ పెల్విస్ వంటివి చెయ్యించుకుని, పైన చెప్పిన జాగ్రత్తలతో పాటు కారణాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవచ్చు. నా వయసు 28 ఏళ్లు. నాకు పాప పుట్టి ఏడాదైంది. అప్పుడే మళ్లీ పిల్లలు వద్దనుకుని లూప్ వేయించుకున్నాను. రెండో కాన్పు కోసం మరికొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను. లూప్‌ను ఎంతకాలం ఉంచుకోవచ్చు? వేయించుకుని ఏడాది గడిచింది కాబట్టి, పాతది తీయించేసి, కొత్తది వేయించుకోవాల్సి ఉంటుందా? వివరించగలరు. – రాధిక, తాడేపల్లిగూడెం లూప్ లేదా కాపర్ ‘టీ’ (ఐయూసీడీ) అనేది పుల్లలాంటి సన్నటి ప్లాస్టిక్ పరికరంపైన కాపర్ తీగ చుట్టబడి ఉంటుంది. దీనిని గర్భం రాకుండా ఉండటానికి తాత్కాలికంగా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. వీటిలో 3 సంవత్సరాల వరకూ, 5 సంవత్సరాల వరకూ, 10 సంవత్సరాల వరకూ గర్భం రాకుండా చేసే లూప్‌లు ఉంటాయి. లూప్‌లలో ఇంకోరకం హార్మోన్ లూప్ ఉంటుంది. ఇందులో లెవనార్జెస్ట్రాల్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది 5 సంవత్సరాల పాటు గర్భం రాకుండా పని చేస్తుంది. అలాగే పీరియడ్స్ సమస్యలు ఉన్నవారికి కూడా దీనిని గర్భాశయంలోనికి వేయడం జరుగుతుంది. మీరు వేయించుకున్న లూప్ ఎలాంటిది? ఎన్ని సంవత్సరాల వరకు పని చేసేది? అనే విషయాలు తెలియవలసి ఉంది. ఒకసారి మీకు లూప్ వేసిన డాక్టర్ని సంప్రదించి, ఎన్ని సంవత్సరాల వరకు పని చేస్తుందో కనుక్కోవడం మంచిది. లూప్ వల్ల సమస్య ఏమీ లేకపోతే.. 6 నెలల కొకసారి లూప్ పొజిషన్లో ఉందా లేదా? ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని గైనకాలజిస్ట్ వద్ద చెకప్ చేయించుకుంటూ అన్నీ సరిగా ఉంటే కనీసం మూడు సంవత్సరాల వరకూ లూప్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు పెళ్లయి మూడేళ్లయింది. ఇంకా పిల్లల్లేరు. నా వయసు 27 ఏళ్లు. నేనూ మావారూ ఇద్దరమూ అన్ని పరీక్షలూ చేయించుకున్నాం. ఇద్దరికీ ఏ సమస్యా లేదనే డాక్టర్లు చెప్పారు. ఇంకా పిల్లలు కలగకపోవడానికి కారణమేంటో అర్థం కావడంలేదు. మా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – మౌనిక, మహబూబ్‌నగర్ గర్భం దాల్చాలి అంటే ఆడవారిలో గర్భాశయం, అండాశయాలు, హార్మోన్లు అన్నీ సక్రమంగా ఉండాలి. వాటి పనితీరు సరిగా ఉండాలి. నెలనెలా అండం సరిగా విడుదల కావాలి. ఫెలోపియన్ ట్యూబ్స్ తెరుచుకుని ఉండాలి. అలాగే మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత అన్నీ సరిగా ఉండాలి. మీకు చేసిన పరీక్షలలో అన్నీ సాధారణంగానే ఉన్నాయి, ఏ సమస్య లేవంటున్నారు. పిల్లలు కలగకపోవడానికి చేసే పరీక్షలలో 70 శాతం వరకే కారణాలు తెలుస్తాయి. 30 శాతం కారణాలు పరీక్షల్లో తెలియవు. అవి చాలా సూక్ష్మమైన కారణాలు. పరీక్షలలో సమస్యలు ఏమీ కనిపించక పోయినా కానీ కొందరిలో గర్భాశయద్వారం దగ్గర ఉండే యాంటీ స్పెర్మ్ యాంటీబాడిస్ వీర్యకణాలను నిర్వీర్యం చేసి, గర్భాశయంలోనికి వెళ్లనీయకుండా చేయడం, వాటి కదలికను తగ్గించడం వల్ల అండం వరకు చేరలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మరికొందరిలో శుక్రకణాలు.. అండంలో చొచ్చుకునిపోలేకపోవడం, దాని వల్ల ఫలదీకరణ అవ్వకపోవడం వల్ల పిండం ఏర్పడకపోవడం, పిండం ఏర్పడినా, గర్భాశయం పిండాన్ని స్వీకరించకపోవడం వల్ల పిండం గర్భాశయంలో అంటుకోకుండా ఉండడం వల్ల గర్భం రాకపోవచ్చు. సాధారణ పరీక్షల్లో ఈ సమస్యలు తెలియకపోవచ్చు. 3 సంవత్సరాలు అయినా సాధారణ పద్ధతిలో గర్భం రానప్పుడు, రిపోర్టులన్నీ మామూలుగానే ఉన్నప్పుడు.. కొన్ని నెలలు అండం నాణ్యత, వీర్యకణాలు నాణ్యత పెరగడానికి మందులు వాడి చూడవచ్చు. తర్వాత మూడునెలలు అండం విడుదల అయ్యే సమయంలో వీర్యకణాలను శుభ్రపరచి, మంచికణాలను నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం చేయొచ్చు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం బిగుతుగా ఉండొచ్చు. అలాంటప్పుడు డీ అండ్ సీ పద్ధతి ద్వారా గర్భాశయ ముఖద్వారాన్ని కొద్దిగా వెడల్పు చేసి, గర్భాశయపొరను శుభ్రపరచడం, ఆ పొరను బయాప్సీకి పంపించడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్లు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి. దాని బట్టి కూడా చికిత్స తీసుకోవచ్చు. కొంతమందికి డీ అండ్ సీ తర్వాత గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. కొందరిలో హిస్టెరోస్కోపీ పద్ధతి ద్వారా నేరుగా గర్భాశయం లోపల చూస్తూ, ఏదైనా పొరలు, వాటి సమస్యలు ఉంటే అప్పుడే తొలగించడం వల్ల కూడా గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. అన్నిరకాలుగా ప్రయత్నించినా గర్భం అందనప్పుడు, చివరిగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం.. -
ఆ మధ్యలో... అలా అవుతోంది...
ప్రశ్న: నా వయసు 33 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు, బరువు 55 కిలోలు. గత ఏడాది రెండో కాన్పు తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ తర్వాత పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తోంది. తరచుగా మూత్రం రావడమే కాకుండా, మూత్రం సమయంలో మంటగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – సువర్ణ, నిర్మల్ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపించడానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, కంతులు, ఎండోమెట్రియల్ పాలిప్స్(కండపట్టడం), ఎండోమెట్రియమ్ పొర మందంగా ఉండటం, గర్భాశయంలో వాపు అండాశయంలో నీటిబుడగలు, నీటి గడ్డలు, సిస్ట్లు, కంతులు, గర్భాశయ ముఖ ద్వారంలో పుండ్లు, హార్మోన్ల అసమతుల్యత, కొందరిలో పీరియడ్స్ మధ్యలో అండం విడుదలయ్యే సమయంలో బ్లీడింగ్ కనిపించవచ్చు. గైనకాలజిస్ట్‌కు సంప్రదించి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, స్పెక్యులమ్ పరీక్ష, ప్యాప్‌స్మియర్, వెజైనల్ పెల్విన్ అల్ట్రాసౌండ్, ఎస్ఆర్ టీఎస్‌హెచ్, సీబీపీ వంటి అవసరమైన రక్తపరీక్షలు వంటివి చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. మూత్రంలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రం తరచుగా రావడం, మంటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి సంబంధించి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ పరీక్షలు చేయించుకుని దానిని బట్టి సరైన యాంటీ బయాటిక్ కోర్స్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది. పీరియడ్స్ మధ్యలో అయ్యే బ్లీడింగ్‌కు పాలిప్, ఎండోమెట్రియమ్ పొర మందంగా ఉండటం వంటివి కారణం అయితే దానికి గర్భాశయంలో హిస్టెరోస్కోపీ ద్వారా చూస్తూ డీ అండ్ సీ చేయడం ద్వారా పొరను తొలగించి బయాప్సీకి పంపించడం, హార్మోన్స్ అసమతుల్యత చిన్న సిస్ట్లు ఉంటే హార్మోన్స్ ద్వారా చికిత్స చేయడం, పెద్ద సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్ వంటి ఇతర కారణాలు ఉంటే ల్యాపరోస్కోపీ ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించడం వంటి చికిత్స విధానాలను గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో చేయించుకోవలసి ఉంటుంది. ప్రశ్న: మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. ఎత్తు 5.4, బరువు 38 కిలోలు. ఇంకా మెచ్యూర్ కాలేదు. బరువు తక్కువగా ఉండటం వల్ల కొందరిలో ఆలస్యమవుతుందని విన్నాను. దీనికి ఇతర సమస్యలేవైనా కారణం కావచ్చా? పరిష్కారం వివరించగలరు. – అమ్మాజీ, యలమంచిలి మీ అమ్మాయి 5.4 ఎత్తుకి కనీసం బరువు 50 కేజీలు అయినా ఉండాలి. సాధారణంగా అమ్మాయి 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల మెచ్యూర్ అవుతారు. మెచ్యూర్ కావడానికి హార్మోన్స్ సక్రమంగా పనిచెయ్యాలి అంటే శరీరంలో కనీసం 20 శాతం అయినా కొవ్వు ఉండాలి. మీ అమ్మాయి మరీ సన్నగా ఉంది కాబట్టి రజస్వల కాకపోవడానికి అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. కొందరిలో పుట్టుకలోనే గర్భాశయం, అండాశయాలు లేకపోవడం, లేదా వాటి పరిమాణం చిన్నగా ఉండటం, జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల 16 ఏళ్లైనా మెచ్యూర్ కాకపోవచ్చు. మీ అమ్మాయికి 16 ఏళ్లు కాబట్టి.. మెచ్యూర్ కాకపోవడానికి వేరే కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్ పెల్విస్, సీబీపీ, ఎస్ఆర్. టీఎస్‌హెచ్, ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవాలి. ఈ లోపల మీ అమ్మాయికి పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు వంటి పౌష్టికాహారం ఇవ్వండి. కారణాన్ని బట్టి హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటే ఎండొక్రైనాలజిస్ట్‌ను కూడా సంప్రదించవలసి ఉంటుంది. డాక్టర్ వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
Gynecology:పీరియడ్స్ సరిగా రావడం లేదు.. రిష్కారం చెప్పగలరు..
నా వయసు 19 ఏళ్లు. నేను స్టూడెంట్‌ని. ఎత్తు 5.2, బరువు 40 కిలోలు. నాకు పీరియడ్స్ సరిగా రావడం లేదు. గత జూన్‌లో పీరియడ్స్ వచ్చాక, మళ్లీ ఇంతవరకు రాలేదు. పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ చాలా కొద్దిగా మాత్రమే ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. –వందన, మేడ్చల్ మీ ఎత్తు 5.2 అడుగులకు కనీసం 50 కేజీల బరువు ఉండాలి. మీరు కేవలం 40 కిలోల బరువే ఉన్నారు. తక్కువ బరువు ఉన్నారు కాబట్టి, మీలో పోషకాహార లోపం ఉండే అవకాశాలు ఎక్కువ. అలాగే రక్తహీనత, థైరాయిడ్ వంటి హార్మోన్ల అసమతుల్యత వంటి ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఉండవచ్చు. కొందరిలో సన్నగా ఉన్నా, జన్యుపరమైన కారణాల వల్ల, పీసీఓడీ సమస్య కూడా కొద్దిగా ఉండవచ్చు. దీనివల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సీబీపీ, థైరాయిడ్ ప్రొఫైల్ వంటి రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ పెల్విస్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. అలానే ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, డ్రైఫ్రూట్స్‌తో కూడిన పోషకాహారం తీసుకోవడం మంచిది. నాకు పెళ్లయి ఎనిమిది నెలలైంది. పెళ్లికి ముందు నాకు ఎలాంటి సమస్యలూ లేవు గాని, పెళ్లి తర్వాత నుంచి తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. మందులు వాడితే తగ్గినా, కొద్దిరోజుల్లోనే సమస్య మళ్లీ మొదలవుతోంది. నా సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా? – రాగిణి, మెంటాడ ఫంగల్ ఇన్ఫెక్షన్ కాండిడా వంటి ఫంగస్ రోగక్రిముల వల్ల వస్తుంది. ఇది సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా, రక్తహీనత వల్ల, సుగర్ వ్యాధి ఉన్నా తరచుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భర్త నుంచి భార్యకు, భార్య నుంచి భర్తకు కలయిక ద్వారా సంక్రమించవచ్చు. అలాంటప్పుడు మందులు ఒక్కరే కాకుండా, దంపతులు ఇద్దరూ సరైన కోర్సు యాంటీఫంగల్ మందులు ఒకేసారి వాడుతూ, ఆ సమయంలో దూరంగా ఉండటం మంచిది. చికిత్సలో భాగంగా నోటి ద్వారా మాత్రలతో పాటు దురద, తెల్లబట్ట వంటి లక్షణాలను బట్టి యాంటీ ఫంగల్ క్రీములు, పౌడర్, సోపు, యోనిలో పెట్టుకునే సపోసిటరీస్ ఇవ్వడం జరుగుతుంది. లక్షణాల తీవ్రతను బట్టి మందులు ఎంతకాలం వాడాలనేది డాక్టర్ సూచించడం జరుగుతుంది. సీబీపీ, ఆర్బీఎస్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, రక్తహీనత ఉంటే దానికి తగ్గ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, ఐరన్ మాత్రలు వాడుకోవాలి. అలాగే సుగర్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉంటే, దానిని అదుపులో ఉంచుకోవాలి. శారీరక, వ్యక్తిగత శుభ్రత పాటించడం ముఖ్యం. మీ వారికి సుగర్ ఉన్నా, లక్షణాలు ఏవీ లేకపోయినా కూడా తన నుంచి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీవారికి కూడా రక్తపరీక్షలు చేయించడం మంచిది. డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
తొలి కాన్పు సిజేరియన్ చేశారు.. రెండోసారి కూడా తప్పదా?
నా వయసు 28 ఏళ్లు. రెండేళ్ల కిందట తొలి కాన్పు జరిగింది. బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి, సిజేరియన్ చేశారు. ప్రస్తుతం నాకు ఆరో నెల. ఒకసారి సిజేరియన్ జరిగితే, రెండోసారి కూడా సిజేరియన్ తప్పదని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఒకసారి సిజేరియన్ జరిగితే నార్మల్ డెలివరీకి అవకాశం ఉండదా? రెండోసారి కూడా సిజేరియన్ జరిగితే ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఎలాంటి జగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించగలరు. – సాయిగీత, శ్రీకాకుళం మొదటి కాన్పు సిజేరియన్ అయితే తప్పనిసరిగా రెండో కాన్పు సిజేరియన్ ద్వారానే కావాలనేమీ లేదు. కాకపోతే అనేక అంశాలను పరిశీలించిన తర్వాతనే రెండోది నార్మల్ డెలివరీకి ప్రయత్నించవచ్చా, లేదా, రిస్క్ అనేది ఎంత మేరకు ఉంది అనే అంచనాకు వచ్చి సలహా ఇవ్వడం జరుగుతుంది. సాధారణ కాన్పు కావాలంటే బిడ్డ బరువు ఎక్కువగా లేకుండా ఉండాలి. బిడ్డ తల కిందకు ఉండి, పెల్విస్ దారిలోకి ఫిక్స్ అయి ఉండాలి. బిడ్డ బయటకు వచ్చే దారి బిడ్డకు సరిపడా వెడల్పుగా ఉండాలి. అంతేకాకుండా, ముందు సిజేరియన్ కాన్పుకి, మళ్లీ గర్భం దాల్చడానికి మధ్య కనీసం మూడు సంవత్సరాలకు పైగా గ్యాప్ ఉండాలి. ఇవన్నీ సరిగానే ఉన్నా, సిజేరియన్ సమయంలో గర్భాశయంపైన కోత పెట్టి బిడ్డను బయటకు తీసి, మళ్లీ కుట్టడం జరుగుతుంది. ఆ కుట్లు తొమ్మిది నెలలు బిడ్డ పెరిగే కొద్ది సాగి, అవి పల్చబడటం జరుగుతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుట్లు మానే తీరును బట్టి మరో కాన్పును సాధారణ కాన్పు కోసం ప్రయత్నించినప్పుడు, కొందరిలో గర్భాశయం కుట్లు విడిపోయి, గర్భాశయం పగిలి బిడ్డ కడుపులోకి రావడం, బిడ్డ ఊపిరి ఆగిపోవడం, తల్లికి విపరీతమైన బ్లీడింగ్ అవడం, షాక్‌లోకి వెళ్లడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులలోకి వెళ్లే అవకాశాలు చాలా ఉంటాయి. కొందరిలో పెద్దగా ఇబ్బంది లేకుండా, సాధారణ కాన్పు కావచ్చు. ఎవరిలో ఎలా జరుగుతుంది, కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది అంచనా వేయడం కాస్త కష్టం. ముందు కాన్పు ఆపరేషన్ ద్వారా జరిగి, మళ్లీ కాన్పును సాధారణంగా ప్రయత్నించడాన్ని ‘వీబీఏసీ’ (వజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్) అంటారు. వీబీఏసీకి ప్రయత్నించాలని అనుకున్నప్పుడు 24 గంటలు గైనకాలజిస్ట్, పిల్లల డాక్టర్, మత్తు డాక్టర్ అందుబాటులో ఉండి, అన్ని పరికరాలు, వసతులు ఉన్న హాస్పిటల్లోనే అడ్మిట్ అవడం మంచిది. లేకపోతే ఆఖరి నిమిషంలో ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండటాయి. మీకు మొదటి బిడ్డ అడ్డంగా ఉండటం వల్ల ఆపరేషన్ చేసి తీశారు. మళ్లీ ఇప్పుడు రెండు సంవత్సరాలకే గర్భం అందింది. తొమ్మిదో నెలలో బిడ్డ బరువు, పొజిషన్ని బట్టి, మీ డాక్టర్ చెప్పే సలహాను అనుసరించడం మంచిది. రెండోది కూడా సిజేరియన్ అయినప్పుడు పెద్దగా సమస్యలేవీ ఉండవు. కాకపోతే మళ్లీ మత్తు ఇవ్వాలి, పొట్ట కొయ్యాలి, కుట్లు వెయ్యాలి, కుట్లు సరిగా మానాలి కాబట్టి కొద్దిగా నొప్పి, అసౌకర్యం తప్పవు. నా వయసు 30 ఏళ్లు. మూడేళ్ల కిందట రీకానలైజేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే, ట్యూబులు బాగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఇంతవరకు మళ్లీ గర్భం రాలేదు. రీకానలైజేషన్ ఫెయిలై ఉంటుందా? ఒకవేళ ఫెయిలైతే ట్యూబులు బాగానే ఉండే అవకాశాలు ఉంటాయా? – సౌజన్య, ఉరవకొండ రీకానలైజేషన్ ఆపరేషన్‌లో కుటుంబ నియంత్రణ కోసం చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ ద్వారా ముడి వేసి కట్ చేసిన ఫెలోపియన్ ట్యూబ్‌లను మళ్లీ అతికించడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ చేసినంత మాత్రాన అది సక్సెస్ అయి, మళ్లీ గర్భం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఆపరేషన్ సమయంలో ట్యూబ్‌లు తెరుచుకున్నట్లు అనిపించినా, కొంతకాలానికి అవి కొద్దిగా లేదా పూర్తిగా మూసుకుపోవచ్చు. మూసుకుపోయిన ట్యూబ్లలో గర్భం వచ్చినా, అది ట్యూబ్‌లోనే ఉండిపోయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవొచ్చు. కొందరిలో ట్యూబ్‌లు బయటి నుంచి బాగానే ఉన్నా, లోపలి భాగంలో ఉండే సీలియా పాడై, దాని పనితీరు సరిగా లేకపోవచ్చు. అందువల్ల కూడా గర్భం అందకపోవచ్చు. ట్యూబ్స్ బాగానే ఉన్నా, కొన్నిసార్లు అండం విడుదల సరిగా లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, భర్తలో వీర్యకణాల లోపాలు వంటి ఇతరేతర సమస్యల వల్ల కూడా గర్భం రాకపోవచ్చు. కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. లేకపోతే టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
14 ఏళ్లకు మెచ్యూర్ అయ్యాను, పీరియడ్ వచ్చినప్పుడల్లా విపరీతమైన నొప్పి.. తగ్గేదెలా?
నా వయసు 22 సంవత్సరాలు. నేను 14 ఏళ్ల వయసులో మెచ్యూర్ అయ్యాను. నాకు రెగ్యులర్‌గా 45 రోజులకు పీరియడ్స్ వస్తాయి. వచ్చినప్పుడల్లా మొదటి రోజు విపరీతంగా కడుపునొప్పి ఉంటుంది. పీరియడ్స్‌లో కడుపు నొప్పి సాధారణమే అయినా, ఇలా విలవిలలాడేంతగా ఉండదని, ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? – శ్రుతి, విజయవాడ పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయ కండరాలు బాగా కుదించుకున్నట్లయి, అది పట్టి వదిలేస్తూ బ్లీడింగ్ బయటకు వస్తుంది. ఇది కొందరిలో పొత్తికడుపు నొప్పిగా అనిపిస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ప్రోస్టాగ్లాండిన్స్ విడుదలవ్వచ్చు. అవి విడుదలయ్యే మోతాదును బట్టి వాటి ప్రభావం వల్ల పీరియడ్స్‌లో నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కొందరిలో నొప్పి కొద్దిగా ఉంటుంది. కొందరిలో నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీని ప్రభావం వల్ల గర్భాశయం లోపలి ఎండోమెట్రియమ్ పొరకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కుంచించుకుపోయి, ఎండోమెట్రియమ్ పొర ఊడిపోయి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల కూడా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండే అవకాశాలు ఉంటాయి. పైన చెప్పిన కారణాల వల్ల వచ్చే పీరియడ్స్ నొప్పి వల్ల ఇబ్బందులేమీ ఉండవు. కాకపోతే నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అలాగే ఆ సమయంలో పొత్తికడుపు మీద వేడి కాపడం పెట్టవచ్చు. యోగా, ప్రాణాయామం వంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా ఉపశమనం దొరుకుతుంది. కాకపోతే కొందరిలో గర్భాశయంలో కంతులు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, ఇన్ఫెక్షన్స్, చాక్లెట్ సిస్ట్స్, అండాశయంలో సిస్ట్లు వంటి అనేక కారణాల వల్ల పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో విపరీతమైన నొప్పి, నడుం నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, పెల్విక్ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్య ఏదైనా ఉందా లేదా తెలుసుకోవడం మంచిది. సమస్య ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు. సమస్య ఏమీ కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. నా వయసు 28 ఏళ్లు. నాకు పీసీఓడీ సమస్య ఉంది. పెళ్లయి ఆరేళ్ళయినా ఇంతవరకు పిల్లలు లేరు. డాక్టర్‌ను సంప్రదిస్తే ఫోలిక్ యాసిడ్ మాత్రలు, ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు రాసిచ్చారు. నాలుగు నెలలు వాడినా ఫలితం ఏమీ కనిపించలేదు. నా సమస్యకు ఎలాంటి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది? – సౌజన్య, గుత్తి గర్భాశయం రెండువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అనేక చిన్న చిన్న అండాలు ఉండే ఫాలికిల్స్ పెరగకుండా నీటిబుడగల్లా ఏర్పడతాయి. వీటినే పీసీఓడీ (పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇందులో మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ వంటి ఆండ్రోజన్ హార్మోన్లు ఆడవారిలో విడుదలవుతాయి. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడి, దాని వల్ల పిల్లలు కలగడానికి ఇబ్బంది అవుతుంది. ఇందులో చికిత్సలో భాగంగా హార్మోన్ల అసమతుల్యత ఇంకా పెరగకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి వాడే సమయంలో గర్భం రాదు. అవి కొన్ని నెలలు వాడిన తర్వాతే అండం పెరగడానికి మందులు వాడుతూ గర్భం కోసం ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. మీ ఎత్తు, బరువు రాయలేదు. కొందరిలో కాంట్రాసెప్టివ్ మందులతో పాటు వాకింగ్, వ్యాయామాలు చేస్తూ, మితమైన ఆహార నియమాలు పాటిస్తూ, బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం వల్ల కూడా అవి ఆపేసిన కొన్ని నెలల తర్వాత హార్మోన్ల అసమతుల్యత తగ్గి, గర్భం అదే నిలుస్తుంది. ఒకవేళ ఆలస్యం అవుతుంటే అప్పుడు అండం పెరగడానికి, గర్భం నిలవడానికి మందులతో చికిత్స తీసుకోవచ్చు. బిడ్డలో కొన్ని అవయవ లోపాలు రాకుండా ఉండటానికి ఫోలిక్‌యాసిడ్ మాత్రలను గర్భం కోసం ప్రయత్నం చేసే మూడు నాలుగు నెలల ముందు నుంచే వాడమని సలహా ఇవ్వడం జరుగుతుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
మా ఆయనకు స్పెర్మ్‌కౌంట్ నిల్.. డోనర్ స్పెర్మ్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
►నా వయసు 26 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. ఇంతవరకు పిల్లల్లేరు. ఇటీవల పరీక్షలు చేయించుకుంటే, నాకు అంతా నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. మా ఆయనకు స్పెర్మ్‌కౌంట్ నిల్ అని వచ్చింది. డోనర్ స్పెర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందవచ్చని డాక్టర్ చెప్పారు. దీనివల్ల సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? – వందన, చోడవరం స్పెర్మ్‌కౌంట్ నిల్ అంటే వీర్యంలో వీర్యకణాలు అసలు లేవు అని అర్థం. దీనినే అజోస్పెర్మియా అంటారు. ఆయనకు అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డాక్టర్ కౌంట్ నిల్ అని నిర్థారించారని అనుకుంటున్నాను. కొందరిలో వృషణాలలో తయారయ్యే వీర్యకణాలు,అక్కడి నుంచి యురెత్రా ద్వారా బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా అడ్డంకులు ఉండటం వల్ల వీర్యంలో వీర్యకణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వృషణాల నుంచే వీర్యకణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వృషణాల నుంచే టీసా, మీసా వంటి పద్ధతి ద్వారా టెస్టిక్యులార్ బయాప్సీ చేసి అసలు వీర్యకణాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా అనేది నిర్ధారిస్తారు. ఒకవేళ కొన్ని అయినా వీర్యకణాలు ఉంటే, వాటిని ఐసీఎస్ఐ, ఐవీఎఫ్ టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. కానీ ఇది ఖర్చుతో కూడిన చికిత్స. అన్ని విధాల స్పెర్మ్‌కౌంట్ నిల్ ఉన్నప్పుడు, డోనర్ స్పెర్మ్ ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. ఇందులో స్పెర్మ్ బ్యాంక్ నుంచి డోనర్ నుంచి సేకరించిన వీర్యకణాలను శుభ్రపరచి, వేరుచేసి, భద్రపరచిన వాటిని తెప్పించుకుని, ఆడవారిలో అండం విడుదలయ్యే సమయంలో యోని భాగంలో నుంచి గర్భాశయంలోకి ఈ డోనర్ వీర్యకణాలను చిన్న ప్లాస్టిక్ కెన్యూలాలో ఐయూఐ పద్ధతి ద్వారా ప్రవేశింపబడుతాయి. అలా ప్రవేశించిన వీర్యకణాల ఫెలోషియన్ ట్యూబ్‌లోకి ఈదుకుంటూ వెళ్లి అక్కడ అండాశయం నుంచి విడుదలైన అండంలోకి చొచ్చుకుపోయి దానిని ఫలదీకరణ చెయ్యడం వల్ల పిండం ఏర్పడుతుంది. ఆ పిండం ట్యూబ్‌లో నుంచి గర్భాశయంలోకి చేరి అక్కడ అడ్డుకుని నిలబడటం ద్వారా గర్భం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు జరిగితే గర్భం రాదు. డోనర్ స్పెర్మ్‌ని తీసుకునేటప్పుడు, స్పెర్మ్ బ్యాంకులో డోనర్‌కు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని హెచ్ఐవీ, వీడీఎఫ్సీ, హెచ్‌సీవీ వంటి అనేక పరీక్షలు చేయడం జరుగుతుంది. కాబట్టి డోనర్ ఐయూఐ పద్ధతి ద్వారా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ►గత ఏడాది చివర్లో నాకు లెప్ట్ సైడ్ ట్యూబ్ ప్రెగ్నెన్సీ లాపరోటమీ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ జరిగిన మూడు నెలల తర్వాత ఎడమవైపు– అంటే ఎడమ కంటి నుంచి ఎడమ కాలి వరకు విపరీతంగా నొప్పి, మంట సెగలుగా వస్తే గైనకాలజిస్టుకి చూపించుకున్నాను. అన్ని పరీక్షలూ చేసి, ఇది గైనిక్ సమస్య కాదన్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా, తర్వాత పీరియడ్స్‌లో సమస్యలు మొదలయ్యాయి. పదిరోజులు వరుసగా బ్లీడింగ్, మళ్లీ పదిహేను రోజులకు పీరియడ్స్ రావడం జరుగుతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – రమణి, చిత్తూరు మీ లాపరోటమీ ఆపరేషన్‌కు మీ లక్షణాలకు ఏ సంబంధం లేదు. పదిరోజులు వరుసగా బ్లీడింగ్ అవ్వటానికీ అండాశయంలో నీటి కంతులు, నీటి బుడగలు, ఇన్ఫెక్షన్, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, థైరాయిడ్ వంటి హోర్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు కావచ్చు. పదిరోజుల బ్లీడింగ్ తర్వాత పదిహేను రోజులకు పీరియడ్స్ రావటం అంటే 25 రోజులకొకసారి పీరియడ్స్ వస్తున్నాయి అన్నమాట. మీ ఎత్తు, బరువు రాయలేదు. కొన్నిసార్లు ఆపరేషన్ తర్వాత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి కారణాల వల్ల బరువు పెరగవచ్చు. బరువు పెరగటం వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్‌లో సమస్యలు రావచ్చు. కాబట్టి బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి, యోగా, వాకింగ్, వ్యాయామాలు చేయడం, ఆహార నియమాలను పాటించడం మంచిది. అలాగే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, సలహా మేరకు థైరాయిడ్ వంటి రక్తపరీక్షలు, పెల్విక్ అల్ట్రాసౌండ్ చెయ్యించుకుని గర్భాశయంలో అండాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని.. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. ►నా వయసు 23ఏళ్లు. ఎత్తు 5.3 అడుగులు, బరువు 76 కిలోలు. నాకు థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు ఉన్నాయి. విపరీతంగా జుట్టు ఊడిపోతోంది. డాక్టర్ సలహా మేరకు థైరాయిడ్ మందులు వాడుతున్నాను. థైరాయిడ్ మందులతో పాటు హెయిర్‌ఫాల్ తగ్గడానికి మందులు వాడొచ్చా? హోమియో మందులు వాడొచ్చా? – అనుపమ, బలిజిపల్లి థైరాయిడ్ సమస్య వల్ల, పీసీఓడీ సమస్య వల్ల, ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల, రక్తహీనత వల్ల, పోషకాహార లోపాలు, మానసిక ఒత్తిడి, జన్యుసమస్యలు వంటి అనేక కారణాల వల్ల విపరీతంగా జుట్టు ఊడిపోవచ్చు. థైరాయిడ్ మాత్రలు వాడుతున్నారు కాబట్టి, దానివల్ల సమస్య లేదు. మీకు పీసీఓడీ ఉండటం వల్ల మగవారిలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ పీసీఓడీ ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక హార్మోన్ ప్రభావం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, మొటిమలు రావడం, అవాంఛిత రోమాలు ఉండటం జరుగుతుంది. మీ ఎత్తు 5.3 అడుగులకు గరిష్ఠంగా 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కానీ మీరు 76 కిలోల బరువు ఉన్నారు. పీసీఓడీ వల్ల జుట్టు ఊడుతుంటే, వాకింగ్, వ్యాయామాలతో పాటు మితమైన పోషకాహారం తీసుకుంటూ, జంక్‌ఫుడ్ తీసుకోకుండా, సరైన ఆహార నియమాలు పాటిస్తూ, బరువు తగ్గడం వల్ల పీసీఓడీ వల్ల జరిగే హార్మోన్ల అసమతుల్యత సరిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్య కూడా అదుపులో ఉంటుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. బరువు తగ్గడంతో పాటు గైనకాలజిస్టు, డెర్మటాలజిస్టుల పర్యవేక్షణలో మందులు వాడుకుంటూ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, అవసరమైతే బయోటిన్‌తో కూడిన మల్టీవిటమిన్ మాత్రలు వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మొదట బరువు తగ్గే ప్రయత్నం చేస్తూ, పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ , హోమియో మందులు వాడుకోవచ్చు. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్. చదవండి: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి.. -
ఒక ఓవరీ తీసేశారు.. నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా?
నా వయసు 36 ఏళ్లు. కొన్నాళ్లుగా కడుపు ఉబ్బరం, విపరీతమైన నడుము నొప్పితో పాటు బరువు కూడా తగ్గిపోయాను. డాక్టర్ సలహాపై పరీక్షలు జరిపించుకుంటే, ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఇది పూర్తిగా నయమవుతుందా? – వరలక్ష్మి, కర్నూలు Gynecologist Answers: అండాశయంలో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు కనిపించేటప్పటికే చాలామందిలో అది 2, 3, 4 దశలకు చేరి ఉంటుంది. మొదటి దశలో ఒవేరియన్ క్యాన్సర్‌లో పెద్దగా లక్షణాలేవీ కనిపించవు. మీ క్యాన్సర్ ఏ స్టేజిలో ఉందనే దాన్నిబట్టి పూర్తిగా నయమవుతుందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, క్యాన్సర్ ఇతర అవయవాలకు కూడా సోకినట్లు అనిపిస్తోంది. 36 సంవత్సరాలకే ఒవేరియన్ క్యాన్సర్ రావడం దురదృష్టకరం. క్యాన్సర్ స్టేజిని బట్టి మొదట ఆపరేషన్ చేసి, క్యాన్సర్ గడ్డను తొలగించి, తర్వాత కీమో థెరపీ ఇవ్వాలా లేక మొదట కీమో థెరపీ ఇచ్చి, తర్వాత ఆపరేషన్ చేయాలా అనేది క్యాన్సర్ డాక్టర్ (ఆంకాలజిస్ట్) నిర్ణయిస్తారు. చికిత్స తర్వాత స్టేజిని బట్టి కొందరు కొన్ని సంవత్సరాల వరకు బాగానే ఉంటారు. కొందరిలో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత డాక్టర్ పర్యవేక్షణలో క్రమంగా స్కానింగ్, రక్తపరీక్షలు వంటివి చేయించుకుంటూ, సమస్యను బట్టి చికిత్సలు తీసుకుంటూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఆనందంగా ఉండవలసి ఉంటుంది. ►నా వయసు 49 ఏళ్లు. ఎత్తు 5.1 అడుగులు, బరువు 72 కిలోలు. ఇటీవల నాకు నెలసరి క్రమం తప్పి వస్తోంది. వచ్చినప్పుడల్లా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటోంది. ఒంట్లోంచి వేడి ఆవిర్లు వచ్చినట్లుగా అవుతోంది. రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – సుమతి, కోదాడ ఆడవారిలో చాలావరకు 45 సంవత్సరాల నుంచి అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ మెల్లగా తగ్గిపోవడం మొదలవుతుంది. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకుండా, కొన్ని నెలలూ రాకుండా ఉండి అయినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవడం, కొందరిలో నెలకు రెండుసార్లు అవడం, లేకపోతే బ్లీడింగ్ కొద్దిగానే అవడం వంటి సమస్యలు ఏర్పడి, తర్వాత కొంతకాలానికి పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశకు చేరుకుంటారు. ఈ సమయంలో ఈస్ట్రోజన్ లోపం వల్ల ఒళ్లు వేడిగా జ్వరం వచ్చినట్లుగా ఉండి, వేడి ఆవిర్లులాగ వచ్చి అంతలోనే చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. వీటినే ‘హాట్ ఫ్లషెస్’ అంటారు. వీటి వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం, పగలంతా నీరసంగా అనిపించడం, డిప్రెషన్ వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. మీ బ్లీడింగ్ సమస్య చాలావరకు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఉండవచ్చు. అలాగని ఊరికే ఉండకూడదు. ఈ వయసులోనే గర్భాశయంలో, అండాశయంలో గడ్డలు, కంతులు, క్యాన్సర్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి అల్ట్రాసౌండ్ పెల్విస్ స్కానింగ్, ప్యాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకుని, ఏమైనా సమస్య ఉంటే దాన్నిబట్టి చికిత్స తీసుకోవచ్చు. సమస్య ఏమీ లేకపోతే బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు అది తగ్గడానికి మందులు వాడుకుంటూ కొంతకాలం ఓపిక పట్టవలసి ఉంటుంది. రక్తహీనత ఉంటే ఐరన్, విటమిన్ మాత్రలు వాడుకోవడం మంచిది. మీ ఎత్తు 5.1కి గరిష్ఠంగా 53–60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కాని, మీరు 72 కిలోలు ఉన్నారు. బరువు ఎక్కువ ఉండటం వల్ల కూడా హార్మోన్ సమస్యలు ఏర్పడి పీరియడ్స్‌లో బ్లీడింగ్ సమస్యలు ఏర్పడవచ్చు. నడక, యోగా, ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు వేడి ఆవిర్ల సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు ఈస్ట్రోజన్ హార్మోన్లా పనిచేసే ఐసోఫ్లోవోన్ పదార్థాలు ఎక్కువగా ఉండే సోయాబీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతవరకు వేడి ఆవిర్ల సమస్య తగ్గుతుంది. ఎక్కువ సమయం గాలి ఆడే ప్రదేశాలలో, ఫ్యాన్ కింద ఉండటం వల్ల కూడా వేడి ఆవిర్ల నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ►నాకు రెండేళ్ల కిందట పెళ్లయింది. ప్రస్తుతం నా వయసు 31ఏళ్లు. ఓవేరియన్ సిస్ట్ ఏర్పడటంతో పెళ్ళికి కొద్ది నెలల ముందు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఒక ఓవరీని తీసేశారు. ఇప్పటివరకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయా? – సత్యవతి, భీమవరం సాధారణంగా గర్భాశయం రెండు పక్కలా ఉండే ఒక్కొక్క అండాశయం నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లతో పాటు అండం విడుదలవుతూ ఉంటుంది. ఒకనెల ఒకవైపు అండాశయం నుంచి మరోనెల మరోవైపు అండాశయం నుంచి ప్రతినెలా అండం విడుదలవుతూ ఉంటుంది. మీకు ఒక అండాశయం తీసివేసినా, వేరే హార్మోన్ల సమస్యలేవీ లేకపోతే, ఉన్న ఇంకొక అండాశయం నుంచి ప్రతినెలా అండం విడుదలై, గర్భం వచ్చే అవకాశాలు బాగానే ఉంటాయి. ప్రెగ్నెన్సీ రావడానికి సరిగా అండం విడుదల కావడం, ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోకుండా తెరుచుకుని ఉండటం, భర్తలో వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత సరిగా ఉండటం అవసరం. మీకు పెళ్లయి రెండు సంవత్సరాలు అయినా గర్భం రావట్లేదు, వయసు కూడా 31. కాబట్టి, మీకు నెలసరి సరిగా వస్తుంటే, పీరియడ్ మొదలైన మొదటి రోజు నుంచి లెక్కబెట్టి 11వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదల ఏ రోజుల్లో అవుతుంది, అసలు అండం పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీ స్కానింగ్ చేయించుకోవాలి. అలాగే గర్భాశయం లోపలి ఎండోమెట్రియాసిస్ పొర సరిగా పెరుగుతుందా లేదా అని స్కానింగ్‌లో తెలుసుకోవాలి. అండాశయం ఉన్నవైపు ఉన్న ఫెలోపియన్ ట్యూబ్ తెరుచుకుని ఉందా లేదా తెలుసుకోవడానికి హెచ్ఎస్జీ అనే ఎక్స్‌రే తీసుకోవాలి. రక్తంలో హార్మోన్ సమస్యలు, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్బీఎస్, ఎస్ఆర్.టీఎస్‌హెచ్, ఎస్ఆర్.ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే మీ భర్తకు వీర్యకణాల పరీక్ష చేయించి, ఆయనకు వీర్యకణాలు సరిగా ఉన్నాయా, లేదా నిర్ధారణ చేసుకోవాలి. ఈ పరీక్షలలో సమస్య ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి. సమస్యను బట్టి చికిత్స తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి అధైర్యపడకుండా, గైనకాలజిస్టును సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్. చదవండి: Beauty Tips In Telugu: నల్లని కురులకు.. బ్లాక్ జీరా ప్యాక్! -
ప్రెగ్నెంట్ అయ్యాను.. వ్యాక్సిన్ తీసుకోవచ్చా?!
నా వయసు 23 ఏళ్లు. నాలుగు నెలల కిందట నాకు ‘కరోనా’ వచ్చి, చికిత్స తర్వాత తగ్గింది. ఇటీవలే ప్రెగ్నెంట్ అయ్యాను. ఇప్పుడు నేను ‘కరోనా’ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? – రాణి, చోడవరం భారతదేశంలో మూడు నెలల కిందటే గర్భవతులు ఎప్పుడైనా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనే మార్గదర్శకాలను భారత ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ప్రెగ్నెన్సీలో కరోనా రావడం వల్ల వచ్చే దుష్ప్రభావాలతో పోల్చుకుంటే, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే చిన్న ఇబ్బందుల కంటే ఉపయోగాలే ఎక్కువ కాబట్టి గర్భిణులు వ్యాక్సిన్ తీసుకోవడమే మంచిది. అందరిలోలాగానే వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఒకరోజు జ్వరం, ఒళ్లునొప్పులు, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి, వాపు కొందరిలో ఉండవచ్చు. దీనికి పారాసెటిమాల్ మాత్ర అవసరాన్ని బట్టి రోజుకు ఒకటి రెండు రోజులు రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవచ్చు. గర్భవతులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తంలో ఏర్పడే యాంటీబాడీస్ మాయ ద్వారా బిడ్డకు చేరి, పుట్టిన తర్వాత బిడ్డకు కరోనా రాకుండా ఉండేలా చేస్తాయి. కరోనా వచ్చిన తర్వాత శరీరంలో ఏర్పడే యాంటీబాడీస్ శరీరంలో ఎక్కువకాలం ఉండకపోవచ్చు. కాని వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తయారయ్యే యాంటీబాడీస్ ఎక్కువకాలం శరీరంలో ఉండి కరోనా రాకుండా కాపాడతాయి. ఒకవేళ వచ్చినా, ఎక్కువ కాంప్లికేషన్స్ రాకుండా రక్షిస్తాయి. నా వయసు 49 ఏళ్లు. ఇటీవల పరీక్షలు చేయించుకుంటే, యుటెరిన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లు తేలింది. వీలైనంత త్వరగా గర్భసంచి తొలగించుకోవడమే మంచిదని డాక్టర్ చెప్పారు. నాకు సర్జరీ అంటే చాలా భయం. దీనికి మరే పరిష్కారమార్గం లేదా? – వనజ, శృంగవరపుకోట గర్భాశయంలో ఎక్కడైనా ఫైబ్రస్ కణజాలం అధికంగా పెరిగి గడ్డలా ఏర్పడుతుంది. దీనినే ఫైబ్రాయిడ్ అంటారు. జన్యుకారణాలు, హార్మోన్ల ప్రభావం వంటి అనేక కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడతాయి. ఇవి కొందరిలో ఒకటే ఏర్పడవచ్చు, కొందరిలో రెండు, మూడు ఇంకా అనేకం 0.5 సెం.మీ నుంచి 10 సెం.మీ. పైన అనేక పరిమాణాలలో పెరిగి ఏర్పడవచ్చు. దీనినే మల్టిపుల్ ఫైబ్రాయిడ్ అంటారు. ఇవి గర్భాశయంపైన ఏర్పడితే సబ్సిరీస్ ఫైబ్రాయిడ్స్ అని, మొత్తం లోపలి ఎండోమెట్రియం పొరలో ఏర్పడితే సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్ అని అంటారు. ఫైబ్రాయిడ్స్ ఎక్కడ, ఎన్ని, ఎంత పరిమాణంలో ఉన్నాయనే దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. అధిక బ్లీడింగ్, కడుపునొప్పి వంటివి ఇంట్రామ్యూరల్, సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్‌లో ఉంటాయి. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉంటే పెద్ద లక్షణాలు ఉండవు. సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నా సరే కొందరిలో బ్లీడింగ్ ఎక్కువగా ఉండవచ్చు. సబ్సిరీస్ ఫైబ్రాయిడ్స్ వల్ల చాలావరకు సమస్యలు ఉండవు. కాని వాటి పరిమాణం పెరిగి, చుట్టుపక్కల అవయవాలపై ఒత్తిడి పడుతుంటే, మల మూత్ర విసర్జనకు ఇబ్బంది కలిగిస్తుంటే, అప్పుడు వాటిని తొలగించాల్సి ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే, మీకు ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బంది ఉన్నట్లు లేదా మామూలుగా స్కానింగ్ చేయించుకుంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లు నిర్ధారణ జరిగినట్లు అనిపిస్తుంది. అవి ఎంత సైజు, ఎక్కడ ఉన్నాయి అనేది వివరించి ఉంటే బాగుండేది. మీకు ఇప్పుడు 49 సంవత్సరాలు. వాటి వల్ల లక్షణాలు ఏమీ లేకుండా, వాటి పరిమాణం పెద్దగా లేకుండా ఉన్నట్లయితే కొంతకాలం ఆగి చూడవచ్చు. కొందరిలో పీరియడ్స్ ఆగిపోయి, మెనోపాజ్ దశకు చేరుకుంటే, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి, దాని ప్రభావం లేకపోవడం వల్ల అవి ఇంకా పెరగకుండా ఉండి, మెల్లగా పరిమాణం తగ్గే అవకాశాలు ఉంటాయి. క్రమంగా ఆరు నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించుకుంటూ కొంతకాలం ఆపరేషన్ లేకుండా ఆగవచ్చు. లేదా మీకు అధిక బ్లీడింగ్, పొత్తికడుపు నొప్పి, విపరీతమైన నడుము నొప్పి, వాటి ఒత్తిడి వల్ల మలమూత్ర విసర్జనలో సమస్యలు అధికంగా ఉంటే అప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచించవచ్చు. లేదంటే, పీరియడ్స్ ఆగిపోయే వయసు దగ్గరపడుతోంది కాబట్టి లక్షణాల తీవ్రత లేకపోతే కొంతకాలం గైనకాలజిస్టు పర్యవేక్షణలో ఫైబ్రాయిడ్స్ పెరుగుదల ఆపడానికి మందులు వాడవచ్చు. ఇవి వాడినన్ని రోజులు బ్లీడింగ్ తగ్గి, ఫైబ్రాయిడ్స్ పరిమాణం కొన్ని మిల్లీమీటర్లు తగ్గవచ్చు. కాబట్టి మీరు భయపడకుండా గైనకాలజిస్టును మళ్లీ ఒకసారి సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆపరేషన్ అవసరమా లేదా అనేది లక్షణాల తీవ్రత, ఫైబ్రాయిడ్స్ పరిమాణం, అవి ఉండే ప్రదేశం, ఏ రకానికి చెందినవి అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ పెరగకుండా, వాటికి రక్తప్రసరణను ఆపడానికి యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ పద్ధతి, లేదా ఫైబ్రాయిడ్స్ చాలా వరకు కరగడానికి ఎంఆర్ఐ ద్వారా హైఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ తరంగాలను పంపించడం జరుగుతుంది. ‘ఎంఆర్జీఎఫ్యూఎస్’ వంటి పద్ధతులు కూడా కొన్నిచోట్ల అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్ వద్దనుకుంటే, డాక్టర్‌ను సంప్రదించి, వాటి మంచిచెడులను బేరీజు వేసుకుని, వాటిని కూడా ప్రయత్నించవచ్చు. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్. హైదరాబాద్ -
పెళ్లయిన ఎన్నాళ్లకు గర్భం రావడం సాధారణం?
నా వయసు 30 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. గత నాలుగు నెలలుగా నాకు పీరియడ్స్‌లో బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతోంది. పొత్తికడుపులో నొప్పిగా ఉంటోంది. ఆ సమయంలో చాలా చిరాకుగా ఉంటోంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. – ప్రమీల, మచిలీపట్నం పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పితో పాటు బ్లీడింగ్ ఎక్కువగా అవడానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఫైబ్రాయిడ్ గడ్డలు, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, అండాశయంలో కంతులు, ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి గైనకాలజిస్టును సంప్రదించి, అల్ట్రాసౌండ్ పెల్విక్ స్కానింగ్ సహా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. కారణాలను బట్టి మందులతో చికిత్స సరిపోతుందా లేదా ఆపరేషన్ ద్వారా చికిత్స చేయాలా అనే విషయాలను డాక్టర్ మీతో చర్చించడం జరుగుతుంది. ఈ లోపల మూడు నాలుగు రోజులు అధిక బ్లీడింగ్, నొప్పి నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి ట్రైనక్సమిక్ యాసిడ్, మెఫినమిక్ యాసిడ్ కాంబినేషన్లో ఉన్న మాత్రలు రోజుకు రెండు లేదా మూడు చొప్పున రెండు మూడు రోజులు వేసుకోవచ్చు. అలాగే యోగా, మెడిటేషన్, వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం వల్ల కూడా ఈ లక్షణాల తీవ్రత నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. నా వయసు 52 ఏళ్లు. ఎడమ రొమ్ములో నొప్పిగా అనిపించడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. డాక్టర్ సలహాపై మామోగ్రాఫ్ పరీక్ష చేయించుకుంటే, బ్రెస్ట్ కేన్సర్ ఉందని, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు. కేన్సర్ అంటే భయంగా ఉంది. ఆపరేషన్ వల్ల ప్రాణాపాయం తొలగిపోతుందా? – సువర్చల, ఆదోని ఇప్పటి ఆధునిక కాలంలో క్యాన్సర్‌ను జయించడానికి అనేక రకాల అధునాతన యంత్రాంగం, మందులు, స్పెషలిస్టుల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈమధ్య కాలంలో అనేక కారణాల వల్ల, ముఖ్యంగా మారుతున్న జీవనశైలి కారణంగా క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది కాబట్టి, మొదట ఆపరేషన్ ద్వారా ఆ క్యాన్సర్ గడ్డను తొలగించి, దానిని బయాప్సీ పరీక్షకు పంపితే అది ఎలాంటి క్యాన్సర్, ఏ స్టేజిలో ఉంది, ఎంత పరిమాణం చుట్టూ వ్యాప్తిచెంది ఉంది, తర్వాతి కాలంలో తిరగబెట్టకుండా ఉండటానికి కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలేవైనా తీసుకోవాలా అనే అంశాలు తెలుస్తాయి. బయాప్సీ రిపోర్టు బట్టి అది మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఎంత శాతం మేరకు ఉన్నాయో కూడా తెలుస్తాయి. దానిబట్టి ఆపరేషన్ తర్వాత డాక్టర్ దగ్గరకు మళ్లీ చెకప్‌లకు ఎంతకాలానికి ఒకసారి వెళ్లాలి, మళ్లీ మామోగ్రఫీ వంటి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి వంటి విషయాలను క్యాన్సర్ స్పెషలిస్ట్ వివరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అధైర్యపడకుండా ఆపరేషన్ చేయించుకోండి. తర్వాత డాక్టర్ చెప్పిన ప్రకారం క్రమంగా చెకప్‌లకు వెళుతూ, సరైన పరీక్షలు చేయించుకుంటూ వారి పర్యవేక్షణలో ఉంటే ఎక్కువకాలం ప్రాణాపాయం లేకుండా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ క్యాన్సర్ ప్రారంభ దశలోనే ఉండి, చుట్టుపక్కల విస్తరించకుండా ఉండి, తక్కువ తీవ్రత ఉన్న రకం అయితే ఆపరేషన్ తర్వాత ఏ సమస్యా ఉండదు. మీరు భయపడుతూ ఆపరేషన్ చేయించుకోకుండా ఆలస్యం చేస్తూ ఉంటే క్యాన్సర్ మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాంతో సమస్యలు ఇంకా పెరిగి, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి గాని, భయపడుతూ ఉంటే అది ఇంకా పెద్దదవుతుంది. ఇప్పటికాలంలో ప్రాణాపాయం ఎవరికైనా ఏదో ఒక సమస్య తెలిసీ తెలియక ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి భయపడకుండా ఆపరేషన్ చేయించుకోండి. ఉన్నంతకాలం సంతోషంగా జీవితం గడపండి. నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.2, అడుగులు, బరువు 46 కిలోలు. ఏడాది కిందట పెళ్లయింది. ఇంతవరకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఏడాదైనా నెలతప్పకపోవడంపై మా అత్తవారింట్లో విపరీతంగా ఒత్తిడి తెస్తున్నారు. పెళ్లయిన ఎన్నాళ్లకు గర్భం రావడం సాధారణం? – వందన, జగిత్యాల ఎత్తు 5.2 అడుగులకు కనీసం 49 కిలోల బరువు ఉండాలి. నువ్వు కేవలం 46 కిలోలే ఉన్నావు. ఉండాల్సిన దానికన్నా బరువు తక్కువ ఉన్నవారిలో రక్తహీనత, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి గర్భం రావడానికి ఆలస్యం కావచ్చు. నీకు పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా అనేది రాయలేదు. సాధారణంగా భార్యాభార్తల్లో ఏ సమస్యా లేకుండా ఉంటే 80 శాతం మంది ఒక ఏడాదిలోనే గర్భం ధరించడం జరుగుతుంది. మిగిలిన 20 శాతం మందిలో 10–15 శాతం మందికి రెండేళ్లు పడుతుంది. దాదాపు 5–10 శాతం మందికి కొన్ని సమస్యలు ఉండి, గర్భధారణ కోసం చికిత్స అవసరం పడుతుంది. నీ వయసు 23 సంవత్సరాలే కాబట్టి, ఒత్తిడికి గురికాకుండా, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, గర్భంకోసం ప్రయత్నిస్తూ, ఇంకో సంవత్సరం ఆగి చూడవచ్చు. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే, ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, భార్యాభర్తలిద్దరిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి భర్తకు వీర్యపరీక్ష, నీకు అండం విడుదల సక్రమంగా అవుతుందా లేదా, అవుతుంటే ఏ రోజుల్లో అవుతోందో తెలుసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీ స్కానింగ్ చేయించుకోవాలి. ఇందులో గర్భాశయంలో, అండాశయంలో సమస్యలు ఉంటే తెలుసుకోవచ్చు. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి అవసరమైన సీబీపీ, ఎస్ఆర్. టీఎస్‌హెచ్ వంటి రక్తపరీక్షలు చేయించుకుని, సమస్య ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు. పరీక్షలలో సమస్యలేవీ లేకపోతే ఇంకో సంవత్సరం పాటు అండం విడుదలయ్యే రోజుల్లో తప్పకుండా కలయికలో పాల్గొంటూ గర్భం కోసం వేచి చూడవచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు అన్న తర్వాత వాళ్ల ఆతృత కొద్ది ఏదో ఒకటి అంటుంటారు. అవన్నీ పట్టించుకుని మనసు పాడు చేసుకోకుండా, భర్తతో ఆనందంగా ఉంటే, సమస్య ఏదీ లేకపోతే గర్భం అదే వస్తుంది. మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురైతే, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, గర్భం రావడం ఇంకా ఆలస్యమవుతుంది. డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
రెండుసార్లు అబార్షన్.. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో నెగెటివ్...పరిష్కారం ఏంటి!
నా వయసు 20 ఏళ్లు. ఎత్తు 5.7, బరువు 55 కేజీలు. పెళ్లయి పద్నాలుగు నెలలైంది. పెళ్లయిన ఐదు నెలలకు అబార్షన్ అయింది. మళ్లీ నాలుగు నెలలకు ఇంకోసారి అబార్షన్ అయింది. గత జూన్ 16న పీరియడ్స్ వచ్చాక మళ్లీ ఇప్పటి వరకు రాలేదు. గతనెల 29న బ్రౌన్ స్పాటింగ్ కనిపించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగెటివ్ వచ్చింది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – త్రివేణి, ఈమెయిల్ మీకు రెండుసార్లు– నాలుగో నెలలు, ఐదో నెలలో అబార్షన్లు జరిగాయి. ఆ సమయంలో అబార్షన్లు కావడానికి అనేక కారణాలు ఉంటాయి. పిండం సరిగా పెరగకపోయినా, పిండంలో జన్యుపరమైన కారణాల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల, ఇన్ఫెక్షన్స్, లేకపోతే గర్భాశయంలో లోపాలు, గర్భాశయ ముఖద్వారం (సెర్విక్స్) చిన్నదిగా ఉండటం లేదా లూజుగా ఉండటం వంటి అనేక కారణాల వల్ల నాలుగో నెల లేదా ఐదో నెలలో అబార్షన్లు జరగవచ్చు. ఇప్పుడు రెండు నెలలు దాటినా పీరియడ్స్ రాలేదు, ప్రెగ్నెన్సీ కూడా లేదు అంటే మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఉండవచ్చు. లేదా కొందరిలో అండాశయంలో నీటితిత్తులు లేదా సిస్ట్లు ఏర్పడటం వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. అరుదుగా కొన్నిసార్లు గర్భనిర్ధారణ కోసం వాడే ప్రెగ్నెన్సీ కిట్లు సరిగా పనిచేయకపోయినా వాస్తవానికి గర్భం ఉన్నా, కిట్‌లో లేదనే రావచ్చు. రెండు మూడు వేరే కంపెనీ కిట్లలో పరీక్షించుకుని చూడవచ్చు. చదవండి: నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి? కొందరిలో సీరమ్ హెచ్‌సీజీ రక్తపరీక్షలో తెలిసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, సమస్యలకు గల కారణాలను తెలుసుకోవడానికి సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్బీఎస్, ఎస్ఆర్. టీఎస్‌హెచ్, ఎస్ఆర్. ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు, హెచ్ఎస్జీ, వజైనల్ స్కానింగ్ ద్వారా గర్భాశయ ఆకారం, గర్భాశయంలో పొరలు, గడ్డలు, అండాశయంలో తిత్తులు వంటి సమస్యలను తెలుసుకోవచ్చు. సమస్య ఎక్కడ ఉందో నిర్ధారణ అయితే దానిని బట్టి చికిత్స తీసుకోవచ్చు. మీ ఎత్తుకి మీరు 60 కేజీల వరకు బరువు ఉండవచ్చు. గర్భం రాకముందు నుంచే 55 కేజీలు ఉన్నారు కాబట్టి, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం, మితమైన పౌష్టికాహారం తీసుకోవడం, థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే వాటికి ముందుగానే చికిత్స తీసుకుని, అదుపులో ఉంచుకోవడం, గర్భాశయంలో లోపాలు ఉంటే హిస్టరోస్కోపీ, ల్యాపరోస్కోపీ ఆపరేషన్ ద్వారా సరిచేసుకుని, తర్వాత గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. గర్భం వచ్చిన తర్వాత విటమిన్ మాత్రలతో పాటు అవసరమైతే ప్రొజెస్టిరాన్ మందులు వాడుతూ, బిడ్డ ఎదుగుదలను తెలుసుకోవడానికి క్రమంగా స్కానింగ్ చేయించుకుంటూ, 16 వారాలకు సెర్విక్స్ లెంగ్త్ ఎలా ఉందో చూసుకుని, ఒకవేళ సెర్విక్స్ చిన్నగా లేదా లూజుగా ఉంటే గర్భాశయ ముఖద్వారానికి కుట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి కంగారు పడకుండా, గైనకాలజిస్టుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది. నాకు రెండేళ్ల కిందట పెళ్లయింది. నా వయసు 26 ఏళ్లు, బరువు 59 కిలోలు, ఎత్తు 5.2. అత్తవారింటికి వచ్చాక తరచు పూజలు, వ్రతాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూజలు, వ్రతాలు ఉన్న రోజుల్లో కొన్నిసార్లు నెలసరిని వాయిదా వేసుకోవడానికి మాత్రలు వేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. దయచేసి పరిష్కారం చెప్పగలరు. – చందన, తగరపువలస సక్రమంగా వచ్చే పీరియడ్స్‌ను మన అవసరాల కోసం ఆపడానికి, వాయి దా వెయ్యడానికి, ఇష్టం వచ్చినట్లు ఎక్కువసార్లు హార్మోన్ మాత్రలు వాడటం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అండం విడుదల, పెరుగుదల సరిగా లేకపోవడం, ఎండోమెట్రియమ్ పొర సరిగా పెరగకపోవడం వంటి సమస్యల వల్ల కొంతకాలం ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు, ఆలస్యం ఏర్పడవచ్చు. మీకు వివాహమై రెండేళ్లయినా గర్భం రాలేదు కాబట్టి సమస్యలు ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ వంటి హార్మోన్ల అసమతుల్యత ఏదైనా ఉందా, అండం సరిగా పెరుగుతోందా లేదా, గర్భాశయంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి గైనకాలజిస్టును సంప్రదించి, అవసరమైన రక్తపరీక్షలు, పెల్విక్, ఫాలిక్యులర్ స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే గర్భం వస్తుంది. అలాగే మీ భర్తకు కూడా వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత వంటివి సరిగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సీమెన్ అనాలిసిస్ అనే వీర్యపరీక్ష చేయించుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే గర్భం దాల్చకపోవడానికి 35–40 శాతం మగవారిలో లోపాలు కూడా కారణం అవుతాయి. డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: కోవిడ్ వచ్చి తగ్గింది.. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా? -
ఇప్పటికి రెండుసార్లు గర్భం పోయింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నా వయసు 27 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లయింది. ఇప్పటికి రెండుసార్లు గర్భం పోయింది. ఇప్పుడు నాకు మూడో నెల. ఇటీవలే ‘కోవిడ్’ వచ్చింది. దానికి చికిత్స తీసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో గర్భం నిలుస్తుందా లేదా అని భయంగా ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పద్మజ, పొందూరు మీరు మొదట భయపడటం మానేసి, ఏమైతే అది కానీ అని ధైర్యంగా ఉండటం మంచిది. భయపడటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, హార్మోన్లలో మార్పులు తలెత్తి, దానివల్ల కూడా అబార్షన్లు అయ్యే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల అందరికీ అబార్షన్లు అవ్వాలని ఏమీ లేదు. గర్భంలోని పిండం నాణ్యత కలిగినదైతే అది ఎలాగైనా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ గర్భిణులలో తల్లి నుంచి బిడ్డకు వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ అని నిర్ధారణ అయింది. కాబట్టి కరోనా వైరస్ ప్రభావం బిడ్డపై నేరుగా అంత ఏమీ ఉండదు. తల్లి రోగనిరోధక శక్తి బాగా ఉంటే, డాక్టర్ సంరక్షణలో వారి సలహా మేరకు సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే తల్లి కూడా దీనిపై పోరాడి బయటకు రాగలుగుతుంది. చదవండి: కోవిడ్ వచ్చి తగ్గింది.. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా? ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో కోవిడ్ వల్ల అధికజ్వరం కారణంగా కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా పారాసెటమాల్ మాత్రలు వేసుకోవడం, తడి బట్టతో శరీరాన్ని చల్లగా ఉంచేలా తుడుచుకోవడం చేయాలి. జలుబు, దగ్గు ఉంటే దానికి మందులు వాడుకుంటూ, ఆయాసం లేకుండా ఊపిరి సరిగా ఆడేలా చూసుకోవాలి. గోరువెచ్చని ఉప్పునీటితో నోరు పుక్కిలించడం, ఆవిరి పట్టుకోవడం వంటివి చేసుకోవచ్చు. డాక్టర్ సలహా మేరకు కోవిడ్ వల్ల రక్తంలో జరిగే మార్పులను తెలుసుకోవడానికి సీబీపీ, సీఆర్పీ, డీ–డైమర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ, ఆయాసం ఎక్కువై, ఆక్సిజన్ తగ్గిపోయి మరీ తప్పదు అనుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఆక్సిజన్, మిగిలిన అవసరమైన మందులతో చికిత్స తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకుంటూ జాగ్రత్తగా ఉండవచ్చు. కోవిడ్ చికిత్సతో పాటు ప్రెగ్నెన్సీకి వాడే విటమిన్స్ వంటి మందులు కూడా తీసుకోవాలి. అలాగే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు, మాంసాహారులైతే గుడ్లు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకుంటూ, మంచినీళ్లు బాగా తాగుతూ, విశ్రాంతి తీసుకోవాలి. పదిహేను– ఇరవై రోజుల తర్వాత గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లి, బిడ్డ ఎలా ఉందో చెకప్ చేయించుకోవాలి. కరోనా లక్షణాలు మీకు తీవ్రంగా ఉండి, చాలా సమస్యలకు గురైతే తప్ప మామూలుగా కొంచెం లక్షణాలకు గర్భంలోని బిడ్డకు ఏమీ కాదు. కాబట్టి కంగారు పడకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నా వయసు 30 ఏళ్లు. నాలుగేళ్ల కిందట థైరాయిడ్ సమస్య వచ్చింది. దీనివల్ల 85 కిలోలకు బరువు పెరిగాను. ఇప్పుడు మా ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఈ సమస్య పెళ్లి తర్వాత సమస్యలేవైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? దయచేసి వివరించగలరు. – రాధిక, గుంతకల్ థైరాయిడ్ సమస్య ఉన్నా, దానికి తగిన మోతాదులో మందులు వాడుకుంటూ, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకుంటే, అందరూ బరువు పెరగాలనేమీ లేదు. థైరాయిడ్ అదుపులో లేకపోతేనే బరువు పెరుగుతారు. మీకు పెళ్లి తర్వాత థైరాయిడ్ లెవెల్స్ అదుపులో ఉంటే, థైరాయిడ్ వల్ల సమస్య ఉండదు. కాకపోతే మీ బరువు 85 కిలోలు. అంటే అధిక బరువు. దీనివల్ల హార్మోన్ అసమతుల్యతలు ఏర్పడి, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల సాధారణంగా గర్భం నిలవడానికి ఇబ్బంది, ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. చదవండి: నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి? అలాగే అధిక బరువు వల్ల గర్భం దాల్చిన తర్వాత బీపీ, సుగర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి ఎండోక్రైనాలజిస్టును సంప్రదించి, థైరాయిడ్ లెవెల్స్ అదుపులో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేయించుకుని, అదుపులో ఉంటే అదే మోతాదులో థైరాయిడ్ మందులు వాడుతూ, బరువు తగ్గడానికి ఆహార నియమాలను పాటిస్తూ, నడక, యోగా వంటి వ్యాయామాలను ఇప్పటి నుంచే చేస్తూ ఉన్నట్లయితే, పెళ్లి తర్వాత పెద్దగా సమస్యలు లేకుండా ఉంటాయి. ఒకవేళ థైరాయిడ్ అదుపులో లేకపోతే, ఎండోక్రైనాలజిస్టు సూచన మేరకు థైరాయిడ్ మాత్రల మోతాదును పెంచి వాడవలసి ఉంటుంది. చదవండి: అది ఫాలో అవ్వొచ్చా? అలాగే బరువు తగ్గవలసి ఉంటుంది. థైరాయిడ్ లెవెల్స్ అదుపులో లేకపోతే, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా పెరగకపోవడం, గర్భం వచ్చినా నిలవకుండా, అబార్షన్లు అయ్యే అవకాశాలు కొంతమేరకు ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే థైరాయిడ్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకుంటూ, బరువు తగ్గడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి, పెళ్లికి ముందే బరువు తగ్గడం మంచిది. డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి?
నా వయసు 25 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 6వ నెల. స్కానింగ్ రిపోర్ట్‌లో మాయ కిందకు ఉందని, సర్విక్స్ ఇంటర్నల్ ఆస్ 2.7 సెం.మీ దూరంలో ఉందని, అలాగే, ఉమ్మనీరు కొద్దిగా ఎక్కువగా ఉందని, బిడ్డ అవయవాలు సరిగానే ఉన్నాయని చెప్పారు. ఇలాంటప్పుడు నేను పూర్తిగా బెడ్‌రెస్ట్‌లోనే ఉండాలా? ఇంట్లో నుంచే ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చా? దయచేసి సలహా ఇవ్వండి? – సౌజన్య, తాడికొండ గర్భాశయంలో గర్భం మొదలయ్యేటప్పుడు పిండం అందులో గర్భాశయం పొరను అతుక్కుని, దాని నుంచి రక్తసరఫరా దక్కించుకునే ప్రయత్నంలో జెస్టేషనల్ స్యాక్, అందులో ఉమ్మనీరు, మాయ ఏర్పడుతుంది. మొదటి మూడు నెలల్లో మాయ మొత్తం పిండాన్ని కప్పి ఉంచి, తర్వాత కుదించుకుని ఒక ముద్దలాగా ఏర్పడుతుంది. ఇలా జరిగే క్రమంలో మొదట గర్భాశయంలో కిందకు ఉండి, బిడ్డ పెరిగే కొద్ది మాయ మెల్లగా పైకి జరుగుతుంది. కొందరిలో పిండం గర్భాశయం కిందభాగం అంటే గర్భాశయ ముఖద్వారం అయిన సర్విక్స్‌కు పైన లేదా దానికి దగ్గరలో ఉండిపోతుంది. దీనినే ‘ప్లాసెంటా ప్రీవియా’ అంటారు. అది సర్విక్స్ గర్భాశయంలోకి మొదలయ్యే ప్రాంతం అయిన ఇంటర్నల్ ఆస్కు ఎంత దగ్గరలో ఉంది అనే కొలతను బట్టి కంప్లీట్ ప్లాసెంటా ప్రీవియా, మార్జినల్ ప్లాసెంటా ప్రీవియా, లో లైయింగ్ ప్లాసెంటా వంటివిగా స్కానింగ్ రిపోర్టులో పేర్కొనడం జరుగుతుంది. సాధారణంగా సెకండ్ ట్రెమిస్టర్‌లో చాలామందికి మాయ కిందనే ఉన్నా, థర్డ్ ట్రెమిస్టర్లోకి వచ్చేటప్పటికి అది పైకి జరిగిపోతుంది. కొందరిలో మాత్రం కాన్పు సమయం వరకు కిందకే ఉండిపోతుంది. అది కిందకు ఉన్నంత వరకు ఎక్కువ శారీర ఒత్తిడి వంటి వాటి వల్ల అప్పుడప్పుడు కొద్దికొద్దిగా బ్లీడింగ్ అవడం, కొందరిలో ఆగకుండా అయ్యి తల్లికి బిడ్డకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ రిపోర్టులో మాయ సర్విక్స్ ఇంటర్నల్ ఆస్ నుంచి 2.7 సెం.మీ. దూరంలో ఉంది. కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్మనీరు కొద్దిగా ఎక్కువగా ఉంది. మీ పరిస్థితికి మొత్తం బెడ్‌రెస్ట్ అవసరం లేదు. కొందరిలో సుగర్ లెవల్స్ పెరిగే ముందు ఉమ్మనీరు ఎక్కువగా ఉండవచ్చు. ఒకసారి జీటీటీ సుగర్ టెస్ట్ చేయించుకోండి. ఇంట్లో నుంచి ఆఫీసు పని చేసుకోవచ్చు. దానికేమీ ఇబ్బంది లేదు. మా అమ్మాయి వయసు 20 ఏళ్లు. ఎత్తు 5.1 అడుగులు, బరువు 65 కిలోలు. ఆరునెలలుగా నెలసరి రావడం లేదు. ఇదివరకు నెలసరి సక్రమంగానే వచ్చేది. డాక్టర్‌కు చూపిస్తే పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉందని చెప్పారు. మా అమ్మాయికి నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి? – సరిత, గజపతినగరం ఎత్తు 5.1 అడుగులు ఉన్నప్పుడు బరువు గరిష్టంగా 55 కిలోల వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే దానిని అధిక బరువు కింద పరిగణించాల్సి ఉంటుంది. మీ అమ్మాయి 65 కిలోల బరువు ఉంది. అంటే 10 కిలోల అధిక బరువు ఉంది. అమ్మాయిలకు బరువు పెరిగే కొద్ది మొదట కొవ్వు పొట్ట చుట్టూ చేరి, పొట్ట లావు పెరగడం జరుగుతుంది. తర్వాత పిరుదుల దగ్గర, తర్వాత చేతులు లావు కావడం జరుగుతుంది. అధిక బరువు వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం జరగవచ్చు. కొందరిలో అధిక బరువు వల్ల అండాశయంలో నీటిబుడగల సమస్య (పీసీఓడీ) వంటివి ఏర్పడటం వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కొందరిలో థైరాయిడ్ సమస్య వల్ల కూడా బరువు పెరగడం, దానివల్ల పీరియడ్స్ సరిగా రాకపోవచ్చు. కాబట్టి మీ అమ్మాయికి పీరియడ్స్ సక్రమంగా రావాలంటే బరువు తగ్గడం ఒక్కటే మార్గం. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే తర్వాతికాలంలో వివాహం అయిన తర్వాత పిల్లలు కనడానికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువ. బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా ఆహార నియమాలతో పాటు వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆహారంలో జంక్‌ఫుడ్, నూనె వస్తువులు, తీపి పదార్థాలు, బేకరీ ఐటమ్స్, కొవ్వు పదార్థాలు తీసుకోకుండా, ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటివి తీసుకోవడం మంచిది. వాకింగ్, యోగా, స్కిప్పింగ్, ఏరోబిక్స్, డ్యాన్స్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
కోవిడ్ వచ్చి తగ్గింది.. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా?
నా వయసు 32 ఏళ్లు. ప్రస్తుతం నేను నాలుగో నెల గర్భిణిని. ఇటీవల చేయించిన రక్తపరీక్షలో డయాబెటిస్ ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితిలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది? దయచేసి చెప్పగలరు. – శ్రీలక్ష్మి, గూడూరు గర్భిణిగా ఉన్నప్పుడు డయాబెటిస్ రావడాన్ని ‘జెస్టేషనల్ డయాబెటిస్ మెలైటస్’ (జీడీఎం) అంటారు. సాధారణంగా చాలావరకు ప్రెగ్నెన్సీ 5–6 నెలల తర్వాత జీడీఎం రావడం జరుగుతుంది. మీకు నాలుగు నెలలకే నిర్ధారణ అయింది. అంటే ఇది గర్భంలోనే వచ్చిందా, లేక గర్భం రాకముందు నుంచే ఉందా, అంతకుముందు ఎప్పుడూ సుగర్ పరీక్ష చేయించుకోకపోవడం వల్ల తెలియలేదా అనే అనుమానం కూడా వస్తుంది. ‘హెచ్‌బీఏ1సీ’ రక్తపరీక్ష చేయించడం వల్ల సుగర్ లెవల్స్ గత మూడు నెలలుగా ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. కాబట్టి ఒక అవగాహనకు రావచ్చు. మీ వయసు రాశారు కాని, ఎంత బరువు ఉన్నారు, మీ అమ్మకు గాని, నాన్నకు గాని సుగర్ ఉందా అనే విషయాలు తెలియవలసి ఉంది. ఏది ఏమైనా మీరు గైనకాలజిస్టుతో పాటు డయాబెటిక్ డాక్టర్ పర్యవేక్షణలో కాన్పు అయ్యే వరకు ఉండవలసి ఉంటుంది. వారి సలహా మేరకు ఆహార నియమాలతో పాటు రక్తంలో సుగర్ లెవల్స్ అంటే చక్కెర శాతం పూర్తిగా అదుపులో ఉండేటట్లు వారు ఇచ్చే సుగర్మాత్రలు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా వారు సూచించిన మోతాదులో క్రమం తప్పకుండా తీసుకుంటూ, క్రమంగా సుగర్ టెస్టులు చేయించుకుంటూ ఉండటం వల్ల చాలావరకు ఇబ్బందులు లేకుండా కాన్పు జరిగి తల్లీబిడ్డా క్షేమంగా ఉండే అవకాశాలు బాగా ఉంటాయి. ఆహారంలో పిండి పదార్థాలు– అంటే అన్నం, చపాతీలు, తీపి పదార్థాలు వీలైనంత తక్కువగా తీసుకుంటూ రాగిజావ, జొన్నరొట్టెలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పాలు, పెరుగు, చక్కెర శాతం తక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిది. ఒకవేళ అధికబరువు ఉంటే, బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. గైనకాలజిస్టు సలహా మేరకు వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల బరువు ఎక్కువగా పెరగకుండా శరీరం ఫిట్‌గా ఉండటంతో పాటు సుగర్ అదుపులో ఉంటుంది. మీకు నాలుగో నెలలోనే సుగర్ నిర్ధారణ అయింది కాబట్టి, బిడ్డలో అవయవ లోపాలు ఉన్నాయా, గుండె సమస్యలు ఏవైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి 18 వారాలకు ‘టిఫా’ స్కానింగ్, 22 వారాలకు ఫీటల్ 2డీ ఎకో స్కానింగ్ చేయించుకోండి. అలాగే మీ వయసు 32 సంవత్సరాలు కాబట్టి మూడో నెలలో డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకుని ఉండకపోతే బిడ్డలో డౌన్ సిండ్రోమ్ వంటి జన్యు సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకోవడానికి ‘క్వాడ్రుపుల్ టెస్ట్’ అనే రక్తపరీక్ష చేయించుకోవడం మంచిది. గర్భంలో డయాబెటిస్తో ఉన్నప్పుడు కొందరిలో బిడ్డ పెరుగుదల మరీ ఎక్కువగా ఉండటం, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, కొందరిలో బిడ్డ సరిగా పెరగకపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం, నెలలు నిండకుండా కాన్పు జరగడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొందరిలో ఏడో నెల లేదా ఎనిమిదో నెలలో బీపీ పెరగవచ్చు. బిడ్డ పెరుగుదల తెలుసుకోవడానికి ఎనిమిదో నెలలో ‘గ్రోత్ స్కానింగ్’, బిడ్డకు రక్తప్రసరణ ఎలా ఉందో తెలుసుకోవడానికి తొమ్మిదో నెలలో డాప్లర్ స్కానింగ్ చేయించుకుని, గైనకాలజిస్టు సలహా మేరకు కాన్పును ప్లాన్ చేసుకోవచ్చు. నా వయసు 24ఏళ్లు. నాకు పెళ్లయి ఏడాదవుతోంది. నెల్లాళ్ల కిందట కోవిడ్ వచ్చి తగ్గింది. ప్రస్తుతం ఎలాంటి సమస్యలూ లేవు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా? – సుమతి నర్సీపట్నం కొంతమందిలో ‘కోవిడ్’ తగ్గిపోయిన తర్వాత కూడా రెండు నెలల వరకు నీరసం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి. మీకు ఎలాంటి సమస్యలూ లేవంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్ర రోజుకొకటి చొప్పున వేసుకుంటూ, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చు. మా అమ్మాయి వయసు 16ఏళ్లు. రెండేళ్ల కిందట రజస్వల అయింది. రజస్వల అయినప్పటి నుంచి కూడా ఆమెకు నెలసరి సక్రమంగా రావడం లేదు. మందులు వాడితేనే అవుతోంది. మందులు ఆపేస్తే కావడం లేదు. ఈ సమస్య తగ్గడానికి ఎన్నాళ్లు పడుతుంది? దీనికి ఏమైనా ప్రత్యేక చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందా? – శ్రావణి, కడియం సాధారణంగా రజస్వల అయిన తర్వాత మెదడు నుంచి జీఎన్ఆర్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్ హార్మోన్లు సక్రమంగా విడుదలై వాటి ప్రభావం థైరాయిడ్ గ్రంథి, అండాశయాల మీద సక్రమంగా పనిచేసి హార్మోన్లన్నీ ఒకే తాటిపైకి రావడానికి, ఇంకా వేరే సమస్యలేవీ లేకపోయినట్లయితే పీరియడ్స్ సక్రమంగా రావడానికి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి రెండు సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటి వరకు చాలామందిలో పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ అమ్మాయికి రెండు సంవత్సరాలు దాటినా పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. మీ అమ్మాయి ఎత్తు, బరువు ఎంత ఉందో తెలియలేదు. ఒకవేళ బరువు మరీ ఎక్కువగా ఉన్నా, మరీ తక్కువగా ఉన్నా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కొందరిలో థైరాయిడ్ సమస్య వల్ల, కొందరిలో అండాశయంలో నీటి బుడగలు (పీసీఓడీ) సమస్య వల్ల, అధిక మానసిక ఒత్తిడి, ఇంకా ఇతర హార్మోన్ల సమస్యల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కాబట్టి ఒకసారి గైనకాలజిస్టుకి చూపించి, వారి సలహా మేరకు స్కానింగ్, రక్త పరీక్షలు చేయించి, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకుంటూ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకుంటే, చాలామందిలో పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
నెలలు పెరిగేకొద్దీ.. తగ్గే అవకాశం ఉందా?
12 వారాలకు స్కానింగ్ చేస్తే సర్విక్స్ లెంగ్త్ 3.4 సెంటీమీటర్లు ఉంది. ఇప్పుడు 20 వారాలకు టిఫా స్కాన్‌లో అది 3.0 సెంటీమీటర్లు ఉంది.. ఇది నెలలు పెరిగే కొద్ది ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – లక్ష్మి, గుంటూరు గర్భాశయ ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు. ఇది యోని భాగంలోకి చొచ్చుకుని ఉంటుంది. సర్విక్స్ బయటి ద్వారాన్ని ‘ఎక్స్టర్నల్ ఆస్’, లోపలి ద్వారాన్ని ‘ఇంటర్నల్ ఆస్’ అంటారు. ఇంటర్నల్ ఆస్కి, ఎక్స్టర్నల్ ఆస్కి మధ్య ఉన్న భాగాన్ని కొలిస్తే సర్వైకల్ లెంగ్త్ వస్తుంది. సర్వికల్ లెంగ్త్ ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో 2.8 సెం.మీ–4.0 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. 2.8 సెం.మీ కంటే తక్కువ ఉన్నప్పుడు దానిని షార్ట్ సర్విక్స్ అంటారు. సాధారణంగా ఇంటర్నల్ ఆస్ మూసుకుని ఉంటుంది. కాన్పు సమయంలో అది మెల్లగా తెరుచుకోవడం జరుగుతుంది. కొందరిలో కాన్పు సమయం కాకముందే అది కొద్దిగా తెరుచుకోవడం జరుగుతుంది. దానిని సెర్వికల్ ఇన్‌కాంపిటెన్స్ అంటారు. కొందరిలో గర్భాశయంలో లోపాలు, ఇన్ఫెక్షన్లు, శారీరక ఒత్తిడి, ఇంకా తెలియని అనేక కారణాల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి సర్విక్స్ లెంగ్త్ తగ్గుతూ వచ్చి, గర్భాశయంలో బిడ్డ పెరిగే కొద్దీ బరువును పట్టుకోలేక, ఇంటర్నల్ ఆస్ తెరుచుకుపోయి నెలలు నిండకుండానే కాన్పు జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు మూడవ నెలలో సర్విక్స్ లెంగ్త్ 3.4 సెం.మీ. ఉంది. ఇప్పుడు ఐదవ నెలలో అది 3.0 సెం.మీ. ఉంది. ఇక్కడ సెర్విక్స్ లెంగ్త్ పొట్టపై నుంచి చేసే అబ్డామినల్ స్కానింగ్ ద్వారా కాకుండా, యోని ద్వారా చేసే వజైనల్ స్కానింగ్ ద్వారా చూడటం వల్ల సర్విక్స్ లెంగ్త్ సరిగా తెలుస్తుంది. కొందరిలో పొట్టపై కొవ్వు ఎక్కువగా ఉండటం వంటి సమస్యల వల్ల అబ్డామినల్ స్కానింగ్‌లో సర్విక్స్ లెంగ్త్ తక్కువగా కనిపించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ట్రాన్స్ వజైనల్ స్కానింగ్ ద్వారా నిర్ధారణ చేసుకోవడం మంచిది. ఒకవేళ అందులో కూడా 3.0 సెం.మీ ఉంటే, బిడ్డ బరువు పెరిగే కొద్ది గర్భాశయ కండరాల పటిష్టతను బట్టి కొందరిలో సమస్యేమీ ఉండదు. కొందరిలో మెల్లగా తగ్గి, నెలలు నిండకుండా కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి రెండు వారాల తర్వాత మళ్లీ సర్వైకల్ స్కానింగ్ చేయించుకుని, సర్వైకల్ లెంగ్త్ తగ్గకపోతే కంగారు పడాల్సిన పనిలేదు. కాకపోతే బరువు పనులు చేయకుండా, కూర్చుని చేసుకునే పనులు చేసుకుంటూ, పొత్తికడుపు మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవడం, మలబద్ధకం లేకుండా ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, కలయికకు దూరంగా ఉండటం, మూత్రంలో, యోనిలో ఏమైనా ఇన్ఫెక్షన్ కనిపిస్తే, డాక్టర్ సలహా మేరకు దానికి తగిన చికిత్స తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. సర్వైకల్ లెంగ్త్ ఇంకా తగ్గుతూ ఉంటే గైనకాలజిస్టు సలహా మేరకు బెడ్‌రెస్ట్, ప్రొజెస్టిరాన్ మాత్రలు, ఇంజెక్షన్లు, అవసరమైతే గర్భాశయ ముఖద్వారానికి కుట్లువెయ్యడం వంటి చికిత్సలు తీసుకోవచ్చు. నాకు తామర రింగ్‌వర్మ్ ఇన్ఫెక్షన్ ఉంది. మా పాపకు రెండు నెలలు. పాపకు నా పాలు పట్టవచ్చా? దానివల్ల పాపకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుందా? – లక్ష్మీశాంతి, విఖాఖపట్నం తామర లేదా రింగ్‌వర్మ్ అనేది శరీరంపై ట్రైకియాసిస్ అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది చర్మంపై ఎక్కడైనా గుండ్రంగా, కొంచెం ఎర్రగా కొంచెం కొంచెం పాకుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఉపయోగించే సబ్బులు, టవల్స్ వాడటం వల్ల, తాకడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఈ ఇన్ఫెక్షన్ పాకుతుంది. ఇది తల్లి పాల ద్వారా పాపకు సోకదు. కాబట్టి పాపకు పాలు ఇవ్వవచ్చు. దీనికి ఇంట్లో అందరూ యాంటీఫంగల్ సోప్, క్రీములు, మందులు వాడవలసి ఉంటుంది. ఇంట్లో ఎవరి టవల్స్ , వస్తువులు వారు విడి విడిగా పెట్టుకుని, వాడుకోవడం మంచిది. ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దీనికి సరైన మందుల కోర్సు వాడటం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, శారీరక శుభ్రత పాటించడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి. డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
పెళ్లయి ఏడు నెలలు అవుతోంది.. ప్రెగ్నెంట్ కాగలనా?
నా వయసు 23 సంవత్సరాలు. బరువు 47 కిలోలు. నాకు పెళ్లయి ఏడు నెలలు అవుతోంది. ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి విపరీతంగా వస్తోంది. ఈ మధ్య నెలసరి కూడా సరిగా సమయానికి రాకుండా, వారం లేదా పదిహేను రోజుల ముందుగానే వస్తోంది. నేను ప్రెగ్నెంట్ కాగలనా? నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – శిరీష, ఈ–మెయిల్ సాధారణంగా సమస్యలేవీ లేకపోతే పెళ్లయిన సంవత్సరంలో 80 శాతం మందికి గర్భధారణ జరుగుతుంది. మిగిలిన వారిలో 15 శాతం మందికి రెండేళ్లకు గర్భధారణ జరుగుతుంది. మిగిలిన ఐదు శాతం మందికి మాత్రమే గర్భధారణ కోసం చికిత్స అవసరమవుతుంది. కాబట్టి ఏడు నెలలైనా గర్భం రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ సమయంలో కొందరిలో ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్ ప్రభావం వల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుంది. కొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్ గడ్డలు, ఇన్ఫెక్షన్లు, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో విపరీతమైన నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ నెల కంటే ముందుగా వారం పదిహేను రోజులు ముందే రావడం జరుగుతుంది. కొందరిలో అండాశయంలో నీటిగడ్డలు, చాక్లెట్ సిస్ట్లు వంటి సమస్యలు, థైరాయిడ్ సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఈ సమస్యలు ఉన్నప్పుడు గర్భం రావడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి మీరు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి థైరాయిడ్ వంటి అవసరమైన రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ పెల్విక్ స్కానింగ్ వంటివి చేయిండం వల్ల సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుంది. దానిని బట్టి తగిన చికిత్స తీసుకోవచ్చు. నా వయసు ఇరవయ్యేళ్లు. ఇటీవల గైనకాలజిస్ట్ దగ్గరకు చెకప్‌కు వెళితే నాకు వజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. వజైల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ వజైనాసిస్ అంత డేంజరస్ కాదని విన్నాను. ఇది ఎంతవరకు నిజం. దీనికి పరిష్కారం ఏమిటి? చెప్పగలరు. – శ్రుతి, సోంపేట మీకు పెళ్లయినదీ కానిదీ రాయలేదు. సాధారణంగా యోని భాగంలో అనేక రకాల మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల మంచి బ్యాక్టీరియా అయిన ల్యాక్టో బాసిలై నుంచి విడుదలయ్యే ల్యాక్టిక్ యాసిడ్ వంటి పదార్థాలు యోని స్రావాలకు ఆసిడిక్ పీహెచ్ (ఆమ్లగుణం) ఉండేలా చేస్తాయి. ఈ ఆమ్లగుణం చెడు బ్యాక్టీరియా, ఇంకా ఇతర ఫంగల్, ప్రోటోజోవల్ రోగ క్రిములు ఎక్కువగా వృద్ధి చెందకుండా కాపాడతాయి. కొన్ని సందర్భాల్లో యోని స్రావాల్లోని పీహెచ్ బ్యాలెన్స్ మార్పు చెందిన ఆమ్లగుణం తగ్గిపోతే ఇతర రోగక్రిములు పెరిగి అభివృద్ధి చెంది యోనిలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లను అశ్రద్ధ చేసి, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే రోగ క్రిములు గర్భాశయంలోకి, దాని నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి పొత్తికడుపులోకి పాకి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (పీఐడీ) వంటి సమస్యలు తలెత్తి, పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, ట్యూబ్స్ మూసుకుపోవడం, దానివల్ల గర్భధారణలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. వజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ క్యాండిడ్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఇది రక్తహీనత, డయాబెటిస్ ఉన్నవారిలో, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువగా వాడే వారిలో, దీర్ఘకాలం యాంటీబయోటిక్స్, స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో కలయిక వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్లో తెల్లబట్ట చిక్కగా పెరుగులాగ ముక్కలు ముక్కలుగా రావడం, యోనిలో, జననేంద్రియాలలో మంట, దురద వంటి లక్షణాలు ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారణ అయిన తర్వాత గైనకాలజిస్ట్‌ని సంప్రదించి, వారి సలహా మేరకు ఫ్లుకనొజోల్, ఇట్రకెనజోల్ వంటి యాంటీ ఫంగల్ నోటి మాత్రలతో పాటు యోనిలో పెట్టుకునే యాంటీ ఫంగల్ క్రీములు వాడవలసి ఉంటుంది. అలాగే రక్తహీనత రాకుండా ఉండేందుకు సరైన పోషకాహారం తీసుకోవడం, పెరుగు ఎక్కువగా తీసుకోవడం, తగినన్ని మంచినీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ యోనిలోని ఆసిడిక్ పీహెచ్‌ను బ్యాలెన్స్ చేయడానికి దోహదపడుతాయి. దానివల్ల రోగ క్రిములు పెరగకుండా ఉంటాయి. అవసరమైతే ల్యాక్టిక్ యాసిడ్ కలిగిన ఇంటిమేట్ వాష్‌తో జననేంద్రియాలను శుభ్రపరచుకోవచ్చు. డెటాల్, సావలాన్ వంటి యాంటీసెప్టిక్ లోషన్లను జననేంద్రియాల వద్ద వాడకపోవడం మంచిది. వీటి వల్ల మంచి బ్యాక్టీరియా నశించి, వజైనల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనకవైపు శుభ్రపరచుకోవాలి. వెనుక నుంచి ముందుకు శుభ్రపరచుకుంటే మలద్వారం వద్ద ఉండే క్రిములు యోనిభాగంలోకి చేరి, అక్కడ ఇన్ఫెక్షన్లను కలిగించవచ్చు. యోనిలో ఆమ్లగుణం తగ్గినప్పుడు అక్కడ గార్డినెల్లా వంటి చెడు బ్యాక్టీరియా పెరిగి, తద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ను బ్యాక్టీరియల్ వజైనాసిస్ అంటారు. ఇందులో తెల్లబట్ట, బురద రంగులో పసుపు లేదా ఆకుపచ్చ రంగులో వచ్చి చేపవాసన, మురుగు వాసనతో ఉండి మూత్రం పోసేటప్పుడు మంట, దురద వంటి లక్షణాలు ఉండవచ్చు. దీనిపైన క్లామిడియా, గనేరియా వంటి ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉండి, పీఐడీ సమస్యలు ఎక్కువగా రావచ్చు. ఈ సమస్యకు గైనకాలజిస్ట్ సలహా మేరకు యాంటీబయోటిక్ కోర్సు దీర్ఘకాలం వాడవలసి ఉంటుంది. అవసరమైతే భార్యాభర్తలిద్దరూ వాడవలసి ఉంటుంది. బ్యాక్టీరియల్ వజైనాసిస్ కంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ పెద్ద ప్రమాదమేమీ కాదు. ఏదేమైనా పైన చెప్పిన చికిత్సతో పాటు జాగ్రత్తుల తీసుకుంటున్నట్లయితే తరచు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. -డా‘‘ వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
మందులు ఉండవా?నిజమేనా?
మేడం.. నాకు 33ఏళ్లు. పెళ్లయి మూడేళ్లవుతోంది. పిల్లలు కలగట్లేదని డాక్టర్ దగ్గరకి వెళ్లాం. స్పెర్మ్‌కౌంట్ తక్కువుందని రిపోర్ట్ వచ్చింది. స్పెర్మ్‌కౌంట్ పెరగడానికి మందులు ఉండవని విన్నాను. నిజమేనా? మాకు పిల్లలు పుట్టే చాన్స్ లేనట్టేనా? – ఎన్. విపుల్ కుమార్, చెన్నై ఆధునిక కాలంలో పిల్లలు కలగకపోవడానికి 35 శాతం ఆడవారిలో లోపాలు, 35 శాతం మగవారిలో లోపాలు, మిగిలిన 30 శాతం ఇద్దరిలో లోపాలు కారణం అవుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ధూమపానం, మద్యపానం, జంక్‌ఫుడ్‌తో కూడిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, డయాబెటిస్ వంటి వాటితో పాటు మరెన్నో తెలియని కారణాల వల్ల మగవారిలో స్పెర్మ్‌కౌంట్ తగ్గడం, వీర్యకణాల కదలిక, నాణ్యత బాగా తగ్గడం జరుగుతుంది. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా వీర్యకణాలలో లోపాలు ఉంటాయి. మెదడు నుంచి విడుదలయ్యే ఎఫ్హెచ్ఎస్, ఎల్ఎస్ హార్మోన్ల ప్రభావం, స్క్రోటమ్‌లో (బీజావయవం), రెండు టెస్టిస్లలో (వృషణాలు) ఉన్న సెమినీఫెరస్ ట్యూబుల్స్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్తేజపడి, దాని ప్రభావం వల్ల వీర్యకణాల ఉత్పత్తి మొదలవుతుంది. అలా ఉత్పత్తయిన వీర్యకణాలు టెస్టిస్‌లో నిలువ ఉండి, అక్కడ కొద్దిగా ఉత్తేజితమై, వ్యాస్ డిఫరెన్స్ గొట్టం ద్వారా ప్రయాణిస్తూ దారిలో సెమైనల్ వెసికిల్స్, ప్రొస్టేట్ గ్రంథి నుంచి వెలువడే సెమైనల్ ఫ్లూయిడ్‌లో అమినో యాసిడ్స్, ఫ్రక్టోస్ వంటి పోషకాలను అందుకుంటూ, వాటి వల్ల వీర్యకణాలు ఇంకా ఉత్తేజితమై యురెత్రా (మూత్రనాళం) ద్వారా బయటకు విడుదలవడం జరుగుతుంది. ఈ ప్రయాణంలో ఎక్కడ సమస్య వచ్చినా వీర్యకణాల ఉత్పత్తి సరిగా కాకపోవడం, అసలే ఉత్పత్తి కాకపోవడం, వాటి కదలికలో లోపాలు, నాణ్యతలో లోపాలు ఏర్పడతాయి. నాణ్యతలో లోపాలు ఉన్నప్పుడు అవి అండాన్ని ఫలదీకరణ జరపలేవు. కొందరిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇతర రోగ క్రిముల వల్ల కూడా వీర్యకణాల కదలిక, నాణ్యత తగ్గుతుంది. వృషణాలకు శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత కావాలి. ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. వేడి వల్ల కూడా వీర్యకణాలు సరిగా ఉత్పత్తి కాలేవు. కొందరిలో బీజకోశంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోవడం వల్ల రక్తం అక్కడ ఎక్కువసేపు ఉండి, అక్కడ ఉష్ణోగ్రతను పెంచడం వల్ల వీర్యకణాల నాణ్యత తగ్గుతుంది. దీనినే వేరికోసిల్ అంటారు. ఇక మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని కూడా వీర్యకణాల నాణ్యత తగ్గవచ్చు. మీకు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. దానికి కారణాలు తెలుసుకోవడానికి ఎస్ఆర్– ఎఫ్హెచ్ఎస్, ఎస్ఆర్–టెస్టోస్టిరాన్, ఎస్ఆర్–టీఎస్‌హెచ్, సీబీపీ వంటి రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు డాక్టర్ సలహా మేరకు చేయించి, సమస్య ఎక్కడుందో తెలుసుకుని, దానిని బట్టి చికిత్స చేయడం జరుగుతుంది. చికిత్సలో భాగంగా ఎఫ్హెచ్ఎస్, హెచ్ఎంజీ, హెచ్‌సీజీ ఇంజెక్షన్లు, యాంటీఆక్సిడెంట్, మల్టీవిటమిన్ మాత్రలు వంటివి ఇవ్వడం జరుగుతుంది. వీటి వల్ల 50 శాతం మేరకు వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలిక పెరిగే అవకాశాలు ఉంటాయి. వేరికోసిల్ సమస్య ఎక్కువగా ఉంటే, దానికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే యోగా, నడక, బరువు ఎక్కువగా ఉంటే తగ్గడం, ధూమపానం, మద్యపానం వంటివి మానేయడం వంటి జీవనశైలి మార్పులతో పాటు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల కూడా చాలామందిలో వీర్యకణాల సంఖ్య పెరగవచ్చు. మేడం, నమస్తే! నాకు నెల రోజుల పాప ఉంది. తనకు పుట్టుకతో పచ్చకామెర్లు వచ్చి, పదిహేను రోజులకు తగ్గాయి. అప్పటి నుంచి పాప ఒళ్లు బాగా వేడిగా ఉంటోంది. మూత్రం పోసే ముందు బాగా ఏడుస్తుంది. డాక్టర్‌కి చూపిస్తే, ఇవన్నీ నార్మల్ అన్నారు. తనకు వేడి తగ్గడానికి నేను ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చెప్పగలరు. – జ్యోత్స, ఆమన్‌గల్ మీ పాప సమస్యకు, మీ ఆహారపు అలవాట్లకు ఎటువంటి సంబంధం లేదు. ఒక్కొక్కరి శరీర ఉష్ణోగ్రత ఒక్కోలాగ ఉంటుంది. అది వారి మెటబాలిజమ్‌ను బట్టి, వారిలో హార్మోన్స్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. కొందరు పిల్లల్లో మూత్రం బయటకు వచ్చేటప్పుడు అక్కడ మూత్రరంధ్రం తెరుచుకునే క్రమంలో ఏడుస్తారు. కొందరిలో యూరినరీ ఇన్ఫెక్షన్లు ఉన్నా, ఆ రంధ్రం చిన్నగా ఉన్నా అలా జరగవచ్చు. మీ డాక్టర్ సమస్య ఏమీ లేదన్నారు కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు పాపకు పాలిస్తున్నారు కాబట్టి ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, కొద్దిగా డ్రైఫ్రూట్స్, మాంసాహారులైతే గుడ్డు, చేపలు, బాగా ఉడికించిన మాంసాహారం ఎక్కువగా నూనె, మసాలాలు లేకుండా తీసుకోవచ్చు. రోజుకు కనీసం 2–3 లీటర్ల మంచినీళ్లు తీసుకోవాలి. ఇలా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీరు, పాప ఆరోగ్యంగా ఉంటారు. -
Hemophilia: నా నిర్ణయం సరైనదేనా?
మేడం.. నాకు పెళ్లి సెటిలైంది. నిజానికి ఈ పాటికి పెళ్లి కూడా అయిపోవాల్సింది. కరోనా వల్ల వాయిదా వేసుకున్నాం. అదీ నా మంచికే అయిందేమో అనిపిస్తోంది. ఈ మధ్యనే తెలిసింది అబ్బాయి వైపు వాళ్లకు హీమోఫీలియా ఉందని. అది తెలిసినప్పటి నుంచి ఈ సంబంధం బ్రేక్ చేసుకోవాలనుకుంటు న్నాను. నా నిర్ణయం సరైనదేనా? ఆ విషయం తప్ప ఇంకే కారణం లేదు బ్రేక్ చేసుకోవడానికి. మీ రిప్లయ్ మీదే నా భవిష్యత్ ఆధారపడి ఉంది. – ఎల్. అక్షయ, బెంగళూరు కొందరిలో జన్యు లోపాల వల్ల రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ఫ్యాక్టర్–8, ఫ్యాక్టర్–9 వంటివి సరిగా తయారు కాకపోవడంతో వారిలో చిన్న దెబ్బ తగిలినా, ఏదైనా ఆపరేషన్ జరిగినా, కాన్పు సమయంలో బ్లీడింగ్ అయినప్పుడు రక్తం గడ్డకట్టకుండా బ్లీడింగ్ ఆగకుండా ఎక్కువైపోయి ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధిని హీమోఫీలియా అంటారు. ఈ ఫ్యాక్టర్లకు సంబంధించిన జన్యువులు ‘ఎక్స్’ క్రోమోజోమ్పైన ఉంటాయి. ఈ జన్యువులలో మార్పులు జరిగి, లోపాలు ఏర్పడినప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ఫ్యాక్టర్–8, ఫ్యాక్టర్–9 వంటి పదార్థాలు సరిగా తయారు కాకపోవడం వల్ల బ్లీడింగ్ సమస్యలు ఏర్పడతాయి. ఇది ‘ఎక్స్–లింక్డ్ రెసిసివ్ డిజార్డర్’. హీమోఫీలియా సమస్య ఉన్న కుటుంబంలో పెళ్లి జరిగినప్పుడు, వారికి పుట్టే పిల్లల్లో హీమోఫీలియా సంక్రమించే అవకాశాలు తల్లిదండ్రుల్లో వ్యాధి తీవ్రతను బట్టి, పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అనే అంశాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి మీ పెద్దవాళ్లను అబ్బాయి కుటుంబంలో ఎవరికైనా హీమోఫీలియా ఉందా, అబ్బాయికి కూడా ఉందా అనే వివరాలు సరిగా తెలుసుకోవలసి ఉంటుంది. ఒకవేళ అబ్బాయికి హీమోఫీలియా లేకపోతే, పుట్టబోయే పిల్లలకు హీమోఫీలియా వచ్చే అవకాశాలు దాదాపుగా ఉండవు. కాబట్టి సమస్య ఏమీ ఉండదు. ఒకవేళ అబ్బాయికి హీమోఫీలియా ఉంటే సంబంధం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అబ్బాయికి చిన్న దెబ్బ తగిలినా, ప్రమాదాలు జరిగినప్పుడు బ్లీడింగ్ సమస్యలు ఏర్పడి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి. పుట్టబోయే పిల్లల్లో మగపిల్లలు అయితే మామూలుగానే పుడతారు. వీరికి హీమోఫీలియా సంక్రమించదు. అమ్మాయిలకైతే, వారికి హీమోఫీలియా జన్యువు ఉండే ‘ఎక్స్’ క్రోమోజోమ్ తండ్రి నుంచి సంక్రమిస్తుంది. తల్లి నుంచి సాధారణంగా ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ సంక్రమిస్తుంది కాబట్టి అమ్మాయిలు హీమోఫీలియా క్యారియర్స్‌గా ఉంటారు. కాబట్టి వారి కుటుంబంలో హీమోఫీలియా ఎవరికి ఉంది, కచ్చితంగా అబ్బాయికి ఉందా లేదా అనే విషయం స్పష్టంగా తెలుసుకుని, సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. సరోగసీ ద్వారా బిడ్డను కంటే వూంబ్ అద్దెకిచ్చే వాళ్లకు ఏమైనా జబ్బులుంటే పుట్టబోయే బిడ్డకు సోకుతాయా? అంటే వాళ్లకు వంశపారంపర్యంగా వచ్చే జబ్బులేమైనా అని. నా అజ్ఞానానికి మన్నించి జవాబివ్వగలరు. – కూన మాధవరావు, బళ్లారి మానవ శరీరంలోని ప్రతి ఒక్క కణం, కణజాలం, అవయవాల పనితీరు వంటివి జన్యువులు, క్రోమోజోమ్స్పై ఆధారపడి ఉంటాయి. మన శరీరంలో ఉండే 46 క్రోమోజోమ్స్ (23 జతలు) పైన అనేక జన్యువులు ఉంటాయి. ఒక్కొక్క జన్యువు ఒక్కొక్క బాధ్యతను నిర్దేశిస్తుంది. ఉదాహరణకు: రంగు, రూపు, అవయవాల పనితీరు, హార్మోన్లు, ఎంజైమ్స్ ప్రక్రియలు వంటివి. తల్లి అండంతో తండ్రి శుక్రకణం ఫలదీకరణ చెందిన తర్వాత పిండం ఏర్పడుతుంది. ఈ పిండంలోకి తల్లి అండం నుంచి 23 క్రోమోజోమ్స్, తండ్రి శుక్రకణం నుంచి 23 క్రోమోజోమ్స్ సంక్రమిస్తాయి. అలా 46 క్రోమోజోమ్స్ (23 జతలు) పిండానికి చేరి, మెల్లగా తొమ్మిది నెలలు శిశువుగా రూపాంతరం చెందుతూ, బిడ్డ బయటకు వస్తుంది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 46 క్రోమోజోమ్స్ వల్ల వారిలోని లక్షణాలు పిల్లలకు వస్తాయి. అలాగే వారికి ఉండే వంశపారంపర్య జబ్బులు కూడా రావచ్చు. తల్లి గర్భాశయంలో సమస్యలు ఉండి, ఆమె తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసే పరిస్థితి లేనప్పుడు, ల్యాబ్‌లో తల్లి నుంచి తీసిన అండాన్ని, తండ్రి నుంచి సేకరించిన శుక్రకణాలతో ఫలదీకరణ చేయగా వచ్చిన పిండాన్ని వేరే మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం (ఎంబ్రియో ట్రాన్స్ఫర్) జరుగుతుంది. అలా చేరిన పిండం వారి గర్భంలో పెరిగి పెద్దదవుతుంది. దీనినే ‘సరోగసీ’ పద్ధతి అంటారు. బిడ్డను తన గర్భంలో పెంచే తల్లిని ‘సరోగేట్ మదర్’ అంటారు. ‘సరోగసీ’ పద్ధతిలో బిడ్డకు అసలు తల్లిదండ్రుల నుంచే జన్యువులు సంక్రమిస్తాయి కాబట్టి, వారి రంగు, రూపు, మిగతా జన్యుపరమైన లక్షణాలు బిడ్డకు సంక్రమిస్తాయి. కాని ‘సరోగేట్ మదర్’ లక్షణాలు ఏమీ సంక్రమించవు. అలాగే ‘సరోగేట్ మదర్’లో ఉండే వంశపారంపర్య వ్యాధులేవీ బిడ్డకు సంక్రమించవు. -డాక్టర్. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
Coronavirus: తగ్గిపోయాక పాలివ్వచ్చా?
నేను బాలింతరాలిని. రెండున్నర నెలల బాబు ఉన్నాడు. నాకు కరోనా వచ్చింది. ఈ ఉత్తరం మీకు అందే సమయానికి నాకు కరోనా తగ్గిపోతుండొచ్చు. అయినా నాకు వచ్చిన సందేహం చాలా మంది తల్లులకూ ఉండి ఉంటుంది. కరోనా సమయంలో.. తగ్గిపోయాక కూడా బిడ్డకు పాలు పట్టొచ్చా? – ఏ. రమ్యశ్రీ, డిచ్పల్లి తల్లికి కరోనా వైరస్ సోకితే, వైరస్ తల్లిపాల వలన బిడ్డకు చేరే అవకాశాలు పెద్దగా లేవు. ఇప్పటి వరకు గమనించిన అంశాలను బట్టి కరోనా వైరస్ తల్లి పాలలో ఉన్నట్లు రుజువు కాలేదు. కరోనా వచ్చిన తొలి రోజులలో దాని గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి, తల్లిపాల వలన బిడ్డకు కరోనా సోకుతుందనే భయంతో బిడ్డను తల్లి నుంచి వేరు చేసి, డబ్బాపాలు పట్టడం జరిగింది. తర్వాత కేసులు పెరగడంతో, కరోనా బారినపడ్డవాళ్లలో జరిగే మార్పులు, వాటిలోని అనేక అంశాలను గమనించి తల్లిపాలను తాగడం వలన బిడ్డకు కరోనా సోకదు అని తేల్చారు శాస్త్రవేత్తలు, విశ్లేషకులు, డాక్టర్లు. కాకపోతే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ముక్కు, నోటి నుంచి బిడ్డకు కరోనా రావడం జరుగుతుంది. అలాగే బిడ్డ ఆలనాపాలన చూసుకునే వారికి కరోనా ఉంటే వారి వలన కూడా బిడ్డకు కరోనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ చంటి పిల్లలకు సోకినా 80 -90 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండానే తల్లిపాలలోని యాంటీబాడీస్‌తో రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ అంతరించిపోతుంది. చాలా తక్కువ మంది పిల్లల్లో మాత్రమే 5-6 రోజులకు జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 0.5-1శాతం పిల్లలోనే న్యుమోనియా, శ్వాస సమస్యలు ఏర్పడి సరైన చికిత్స ఇప్పించకపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. తల్లిపాలల్లో అనేక రకాల విటమిన్స్, రోగనిరోధక శక్తిని పెంచే యాంటిబాడీస్ ఉంటాయి. కాబట్టి తల్లిపాలు బిడ్డ తాగడం వలన ఇవి బిడ్డకు చేరి, బిడ్డలో చాలా వరకు కరోనాతోపాటు, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినా రోగక్రిములకు వ్యతిరేకంగా పోరాడే శక్తి వంటి లాభాలు చేకూరి బిడ్డ ఆర్యోగ్యంగా ఉంటుంది. కాబట్టి తల్లికి కరోనా సోకినప్పటికీ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ బిడ్డకు పాలివ్వచ్చు. సబ్బుతో చేతులను శుభ్రంగా 20 సెకన్లపాటు కడుక్కోవాలి. లేదా కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉండే శానిటైజర్‌తో చేతులు పూర్తిగా తుడుచుకోవాలి. ముక్కు, మూతి పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలి. వీలయితే ఎన్95 లేదా సర్జికల్ మాస్క్, డబుల్ మాస్క్‌లు ధరించడం మంచిది. పాలిచ్చిన తర్వాత బిడ్డను కనీసం ఆరు అడుగులు (2 మీటర్లు) దూరంలో ఉంచడం మంచిది. తల్లి పాలు పట్టలేని స్థితిలో ఉంటే, ఎవరైనా శుభ్రంగా చేతులు కడుక్కొని తల్లి పాలు పిండి బిడ్డకు పట్టించవచ్చు. చేతితో పాలు పిండడం కుదరకపోతే మాన్యుయల్ లేదా ఎలక్ట్రానిక్ బ్రెస్ట్ పంప్ ఉపయోగించొచ్చు. బిడ్డకు వాడే బాటిల్స్, బ్రెస్ట్ పంప్ వంటి వస్తువులు, అలాగే తల్లి ఉండే గదిలో కూడా తల్లి ముక్కు, మూతి నుంచి తుంపర్లు పడే అవకాశాలు ఉన్న టేబుల్, బెడ్ వంటి వాటినీ ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. కాన్పు తర్వాత వీలయినంత వరకు కొంతకాలం పాటు అతిథులను అనుమతించక పోవడం మంచిది. కావాలనుకుంటే వీడియోకాల్ ద్వారా తల్లి,బిడ్డను చూపించవచ్చు. తల్లికి కరోనా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తల్లిలో ఏర్పడే యాంటిబాడీస్, తల్లిపాల ద్వారా బిడ్డకూ చేరి బిడ్డనూ కరోనా వైరస్ బారి నుంచి కాపాడుతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలతో, పౌష్టికాహారం తీసుకుంటూ తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అరుదుగా వచ్చే దుష్ఫలితాల కంటే ప్రయోజనాలే ఎక్కువ. బిడ్డకు తన పాలు పట్టడం వలన తల్లిలో ఉన్న భయాందోళనలూ తగ్గి ఊరట, సంతృప్తి కలుగుతాయి. బిడ్డకు తన పాలు ఇవ్వకుండా దూరం పెట్టడం వలన తను మానసిక సంక్షోభంలోకి వేళ్లే అవకాశాలు ఉంటాయి. మాకు ఈ మధ్యనే అంటే కరోనా కాలంలోనే పెళ్లయింది. నిజానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఏమీ అనుకోలేదు. కాని ఈ పాండమిక్ సిట్యుయేషన్లో గర్భం దాల్చలనీ లేదు. అయినా మీ సలహా కోసం ఈ ఉత్తరం రాస్తున్నాను. గర్భం దాల్చడం.. వైద్య పరీక్షల కోసం డాక్టర్స్ దగ్గరకు వెళ్లడం క్షేమమే అంటారా? లేక ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అవమంటారా? – మాచిరాజు రాకేశ్, విఖాఖ పట్టణం ఈ కరోనా పాండమిక్ సమయంలో గర్భం దాల్చడం గురించి, గర్భం దాలిస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయి వంటి ఎన్నో ప్రాక్టికల్ సందేహాలు చాలా మంది దంపతులను తికమక పెడుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. కోవిడ్ మొదలయిన ఒకటిన్నర సంవత్సర కాలంలో కరోనా వైరస్ ప్రభావం మనుషుల పైన ఎలా ఉంటోంది? అలాగే గర్భవతులు మీదా ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకోవడం జరిగింది. అలాగే దాని ప్రభావం, దుష్ఫలితాలు అంతుచిక్కని కొత్త కొత్త లక్షణాలు సమస్యలు కూడా బయటపడుతున్నాయి. ఈ సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ తొందరగా వ్యాప్తి చెందుతోంది. అలాగే లక్షణాలు కూడా కొందరిలో తొందరగా తీవ్రమయి ఇబ్బంది పెడుతున్నాయి. కుటుంబ సభ్యులు అందరూ మానసికంగా , శారీరకంగా, ఆర్థికంగా వ్యథకు గురవుతున్నారు. అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో గర్భం దాలిస్తే తల్లి, లోపల శిశువు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ చెకప్స్‌కి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నా, కొన్నిసార్లు చెకప్స్‌కి ఆసుపత్రికి వెళ్లవలసి ఉంటుంది. దాని వలన కొందరిలో కరోనా వైరస్‌కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ సెకండ్ వేవ్‌లో ఇంట్లో ఉన్నా, ఏదో ఒక విధంగా కొందరిలో వైరస్ వ్యాప్తి చెందుతుంది. కరోనా సోకినప్పుడు మాములు వారితో పోలిస్తే గర్భీణీలలో కొద్దిగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి, వీరిలో కాంప్లికేషన్స్ రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆస్తమా, డయాబెటీస్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారిలో ఈ రిస్క్ మరీ ఎక్కువ. అదృష్టం కొద్ది 80–90 శాతం గర్భీణీలలో తొందరగా గుర్తించి, ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యలు లేకుండా బయటపడుతున్నారు. కొందరిలో మాత్రమే వారి శారీరక తత్వాన్ని బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి ఆలస్యంగా గుర్తించినా, నిర్లక్ష్యం చేసినా, ఆసుపత్రిలో ఆడ్మిట్ చేసి చికిత్స తీసుకోవలసి వస్తుంది. 3–5 శాతం మందిలో వ్యాధి లక్షణాలు ముదిరి, రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులు సరిగి పనిచేయకపోవటం, గుండెపై ప్రభావం, ఇతర అవయవాలు దెబ్బతినడంతో ప్రాణాంతకంగా మారవచ్చు. కొందరిలో మాత్రం అధిక జ్వరం వలన అబార్షన్లు, బిడ్డ బరువు సరిగా పెరగకపోవటం, నెలలు నిండకుండా కాన్పులు వంటి అవకాశాలుంటాయి కొద్దిగా. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గర్భం గురించి నిర్ణయం తీసుకోవటం మంచిది. వయసు, ఎత్తు, బరువు , పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా అనే విషయాలు తెలియవలసి ఉంటుంది. 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సుండి , ఇతర సమస్యలు లేకపోతే బిడ్డను కనే ఆలోచనను కొన్ని నెలల పాటు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ అధిక బరువుతోపాటు ఇతర హార్మోన్ సమస్యలు ఏమైనా ఉంటే, ఈ లోపల వాటిని సరిదిద్దుకుని, తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకోవటం మంచిది. ఒకవేళ అనుకోకుండా గర్భం వస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మానసికంగా, శారీరకంగా ఆనందంగా, ఆరోగ్యంగా, ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: ఫాస్టెస్ట్ ఉమన్: ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళ -
Coronavirus: గర్భంతో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
నా వయసు 36 ఏళ్లు. పెళ్లయిన పన్నెండేళ్లకు గర్భం ధరించాను. ఇప్పుడు నాకు నాలుగో నెల. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్లంతా కరోనా వాక్సీన్ తీసుకోవాలంటున్నారు. గర్భంతో ఉన్నప్పుడు వాక్సీన్ తీసుకోవచ్చా? – ఎన్. ప్రసన్న (ఇ మెయిల్ ద్వారా అందిన ప్రశ్న) ఈ కొత్త కరోనా వైరస్ ప్రపంచానిఇ తెలిసి ఒకటిన్నర సంవత్సరాలు అవుతోంది. దీనికి వ్యతిరేకంగా యాంటిబాడీస్ తయారయ్యి దాని మీద దాడి చేసే వైరస్ శరీరంలో పెరగకుండా ఉండటానికి కరోనా వ్యా క్సిన్ తయారు చేయ్యడం జరిగింది. కానీ, మిగితా వ్యాక్సన్లాగా మెల్లగా అనేక మంది మీద అన్ని రకాలుగా ఎక్కువ సంవత్సరాలు పరిశోధనలు జరగకుండాకే అత్యవసరంగా ఎమర్జెన్సీగా ఇది కూడా ఒక ఫ్లూ వైరస్ జాతికి సంబంధించిదిగా పరిగణించి, తక్కువ కాంలో ట్రయల్స జరిపి తయారు చేశారు. అలాగే అత్యవసరంగా ప్రజలకు ఇవ్వడానికి ఆమెదింపబడినది. కానీ, ఈ పరిశోధనలు గర్భం దాల్చిన వారి మీద చేయ్యలేదు. కాబట్టి, దాని ఫలితాలు దుష్ఫలితాలు గర్భిణీల మీద కడుపులో ఉన్న బిడ్డపైన ఎలా ఉంటాయి అనేది కచ్చితంగా చెప్పటం కష్టం. కాబటి ఐసీఎమ్ఆర్ గర్భీణీలలో కరోనావైరస్ ఇవ్వవచ్చు అనే మార్గదర్శకాలను ఇంకా విడుదల చేయలేదు. ఇప్పటీ వరకూ చూసిన అనుభవాల మేరకు గర్భీణీలు వ్యాక్సిన్ తీసుకోవడటం వలన మంచి, చెడు, తీసుకోకపోవడం వలన వచ్చే సమస్యలతో పోలిస్తే మంచి జరిగేది ఎక్కువ అని, చెడు తక్కువ అని తెలుపుతున్నారు. సీడీసీ, ఎఫ్‌డీఏ, ఏ సీఓజీ, ఆర్‌సీఓజీ, ఎఫ్ఓజీఎస్ఐ వంటి సంస్థలు గర్భంతో ఉన్నప్పుడు కూడా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవడమే మంచిది అని సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే, కరోనా వైరస్సంక్రమించి దాని వలన ముప్పుకంటే, వ్యాక్సిన్ వలన వచ్చే దుష్ప్రభావాలు చాలా తక్కువ అని. ఇప్పటి దాకా వ్యాక్సిన్ తీసుకోవడం వలన వచ్చే చిన్నచిన్న ఇబ్బందులే అంటే, జర్వం, ఒళ్లునొప్పులు, వంటివే గర్భవతులకు కూడా రావచ్చు. దానికి పారసిటబాలు మాత్ర వేసుకోవచ్చు. ఎవరిలోనైనా అరుదుగా ఏ వ్యాక్సిన్‌కైనా వచ్చే తీవ్రమైన రియాక్షన్లు, దీనిలో కూడా ఉండవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన యాంటిబాడీస్ తయారయ్యి అవి పిండంలోని బిడ్డకు కూడా చేరతాయి. దీంతో తల్లిబిడ్డల క్షేమంగా ఉండేటట్లు చేయడం జరిగింది. మొదటి దశతో పోలిస్తే, ఈ సెకండ్ వేవ్‌లో 30 నుంచి 40 శాతం కంటే ఎక్కువ గర్భీణీలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అదృష్టం కొద్ది మొదట్లోనే దీనిని గుర్తించి పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకుంటే చాలా వరకు సురక్షితంగా బయట పడుతున్నారు. ఇక దీర్షకాల వ్యాధులు ఉన్న గర్భవతులు, అధిక వయసు, అధిక బరువు ఉన్న వారిలో కొంచెం వ్యాధి తీవ్రత ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి వీరు కొంచెం వ్యాధి తీవ్రతను బట్టి ఎక్కువగా జాగ్రత్తలు, ముందుగానే వ్యాక్సిన్‌ను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గర్భవతులైన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని భావిస్తున్నారు. మనదేశంలో గర్భీణీలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చుననే ఖచ్చితమైన మార్గదర్శకాలు వచ్చే వరకు ఆగి చూడాల్సి ఉంటుంది. ఈ లోపల ఒకవేళ వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి వస్తే గర్భీణీలు వారి డాక్టర్‌తో సంప్రదించి కొంత రిస్క్‌పైన వ్యాక్సిన్ తీసుకోవలసి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్ వేసుకోవటం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు మాత్రం కొనసాగించవలసిందే. ఎందుకంటే వ్యాక్సిన్ నూటికి నూరుశాతం కరోనా వైరస్‌ను అరికడుతుంది అని నిర్ధారణ కాలేదు. కాబట్టి, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మళ్లీ కరోనా వచ్చినా, వ్యాధి తీవ్రత ఎక్కువగా లేకుండా చాలా వరకు సురక్షితంగా బయటపడుతుండటం గమనించాలి. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ చదవండి: తల్లి ద్వారా కడుపులో బిడ్డకు కోవిడ్?.. నిరూపించిన హైదరాబాద్ డాక్టర్ -
కోవిడ్ తర్వాత గర్భం దాలిస్తే...
మేడం.... నాకు, నా భార్యకు కోవిడ్ వచ్చి తగ్గిపోయింది. ఈ ఉత్తరం మీకు రాసేటప్పటికి తగ్గిపోయి 20 రోజులైంది. దాంపత్య జీవితంలో మేం ఎప్పటి నుంచి కలుసుకోవచ్చు? మాకు ఇంకా పిల్లలు కాలేదు. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత గర్భం దాలిస్తే కోవిడ్ చికిత్సలో మేం వాడిన మందుల ప్రభావమేమైనా పుట్టబోయే శిశువు మీద ఉంటుందా? కోవిడ్ చికిత్సలో భాగంగా నా భార్యకు స్టెరాయిడ్స్ ఇచ్చారు. తనకు 32 ఏళ్లు. మా ఈ సందేహాలను దయచేసి నివృత్తి చేయగలరు. – వెల్లంకి మనోహర్, మధిర కోవిడ్ వైరస్ ప్రపంచానికి పరిచయమయి సంవత్సరంన్నర అవుతోంది. ఇప్పటికి వైరస్ అంతర్గతంగా మార్పిడి చేసుకుంటూ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోంది. అలాగే అది కలిగించే లక్షణాల్లో కూడా ఎన్నో మార్పులు ఉన్నాయి. కొందరు ఏ లక్షణాలు లేకుండా కూడా వైరస్ వ్యాప్తికి కారకులు అవుతున్నారు. ఇది శాస్త్రవేత్తలు, డాక్టర్లకు కూడా అంతుబట్టని అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం కరోనా వైరస్‌ను త్వరగా తెలుసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకున్నవారిలో దుష్పలితాలు పెద్దగా లేవు. అలాగని డాక్టర్స్ అందించే చికిత్స ద్వారా కూడా వందశాతం జబ్బు నయం అవుతుందనే గ్యారంటీ లేదు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి వైరస్ కాంప్లికేషన్స్ ఆధారపడి ఉంటాయి. ఇక మీ విషయానికి వస్తే, కోవిడ్ వచ్చి ఇరవై రోజులు దాటిపోయింది. కాబట్టి నీరసం, అలసట వంటివి ఏమీ లేకపోతే దాంపత్య జీవితం కొనసాగించవచ్చు. కోవిడ్‌లో వాడిన మందుల ప్రభావం నెల దాటిన తర్వాత గర్భంపైన ఏమి ఉండదు. కాకపోతే ఆమె వయసు 32, స్టెరాయిడ్స్ వల్ల కొందరి శరీరతత్వాన్ని బట్టి షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులకు తిరగి సాధారణ స్థాయికి చేరుకుంటాయి. బరువు, జన్యుపరమైన కారణాల వలన కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, మీరు గర్భం కోసం ప్రయత్నం చేసే ముందు తనకి షుగర్ పరీక్షలు చేయించి, సాధారణ స్థాయిలోనే ఉంటే, అప్పుడు ప్రెగ్నెన్సీకీ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉంటే మందులు ద్వారా అదుపులోకి తెచ్చుకొని తర్వాత గర్భం కోసం ప్రయత్నం చేయటం మంచిది. కోవిడ్ వచ్చిన రెండు నెలల తర్వాత గర్భం కోసం ప్నాల్ చేసుకోవడం మంచిది. ఈ లోపల మానసికంగా, శారీరకంగా గర్భం కోసం సన్నిధం అవుతుంది. ఈ రెండు నెలలో ముందు నుంచే ఫోలిక్ యాసిడ్, మట్లీ విటమిన్ మాత్రలు వాడటం మంచిది. అలాగే ఫోలిక్ యాసిడ్ గర్భం వచ్చే వరుకు వాడుతూ ఉండటం మంచిది. డాక్టర్ గారూ... సెర్విక్స్ క్యాన్సర్ రాకుండా పన్నెండేళ్లు నిండిన ఆడపిల్లలకు టీకా వేయించాలి అని తెలిసింది. ఆ టైమ్‌కి రజస్వల అయినా కాకపోయినా టీకా వేయించవచ్చా? అలాగే ఈ కరోనా సమయంలో ఆ టీకా వేయిస్తే ప్రమాదమేం కాదుకదా? – చందలూరి అచ్యుత కుమారి, తెనాలి 90 శాతం సర్వెకల్ క్యాన్సర్ హెచ్‌పీవీ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ కలయిక తర్వాత సంక్రమిస్తుంది. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను 11 సంవత్సరాల వయసు నుంచి 26 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. జెనైటిక్ వ్యాక్సిన్ మాత్రం 5 నుంచి 45 సంవత్సారాల వరకు తీసుకోవచ్చు. ఇది ఎంత త్వరగా తీసుకుంటే దాని ప్రభావం అంటే వైరస్ వలన వచ్చే సర్వెకల్ క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకునే అవకాశాలు బాగా ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలను హెచ్‌పీవీకి వ్యతిరేకంగా యాంటీబాడీస్ పుష్కలంగా ఏర్పడతాయి. ఇది రజస్వల అవ్వటానికి, ఈ ఇంజెక్షన్ తీసుకోవడానికి ఏ సంబంధం లేదు. రజస్వల కాకపోయినా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ వయసులో తీసుకోవడం కుదరకపోయినా కనీసం కలయికకు ఎక్స్పోజ్ లేదా పెళ్లికి ముందు అయినా తీసుకోవటం వలన చాలా వరకు క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. అయితే ఇతర కారణాల వలన వచ్చే క్యాన్సర్‌కు ఇది పనిచేయక పోవచ్చు. ఈ వ్యాక్సిన్ 15 సంవత్సరాల వయసులో తీసుకుంటే రెండు డోసలు తీసుకోవాలి. కరోనా సమయంలో ఈ వ్యాక్సిన్తీసుకోవడం వలన ఏ ఇబ్బంది ఉండదు. ఈ వాక్సిన్ వలన జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వంటివి చాలా వరకు ఉండవు. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: డేటింగ్ యాప్‌లో.. బ్లడ్ డోనార్స్! -
ఇంట్లోనే డెలివరీ ప్లాన్ చేద్దాం అంటున్నారు
మేడమ్.. నాకిప్పుడు ఎనిమిదో నెల. మే 23కి డ్యూ డేట్ ఇచ్చారు డాక్టర్. మే నెలలో కరోనా పీక్‌లో ఉంటుంది. జాగ్రత్త అని చెప్తున్నారు. నాకేమో అప్పుడే డెలివరీ డేస్ అన్నారు. చాలా భయంగా ఉంది. మా అమ్మా వాళ్లేమో పీహెచ్‌సీలోని నర్స్ సహాయంతో ఇంట్లోనే డెలివరీ ప్లాన్ చేద్దాం అంటున్నారు. కన్ఫ్యూజన్గా ఉంది. ఏం అర్థంకావట్లేదు. సలహా ఇవ్వగలరు. – ఎన్. దేవిక, దర్పల్లి, నిజామాబాద్ జిల్లా. ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్ వేవ్‌లో చాలామంది గర్భీణీలు కరోనా వ్యాధి బారిన పడుతున్నారు. దీని వలన వారిలో, వారి కుటుంబంలో తల్లి, బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటాయి అని ఆందోళన, దిగులుతో ఉంటున్నారు. కాకపోతే అదృష్టం కొద్ది చాలా వరకు ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి డాక్టర్ పర్యవేక్షణలో తగిన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే తీవ్రమైన సమస్య లేకుండా తల్లి, బిడ్డ బయటపడొచ్చు. డాక్టరు పర్యవేక్షణ అవసరమైన ర క్త పరీక్షలు చెయ్యించుకుంటూ, లక్షణాలను బట్టి సరైన మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోవాలి. ఆయసం వంటి ఇంకా ఇబ్బంది కరమైన లక్షణాలు ఉంటేనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వవలసి ఉంటుంది. ఇక డెలివరీ విషయానికి వస్తే, ఆందోళన చెందకుండా సరిగ్గా చెకప్‌కు వెళుతూ ప్లాన్ చేసుకోవడం మంచిది. నిర్మిత డెలివరీ సమయంలో 15–20 శాతం మందిలో బిడ్డకి పెల్విస్ మార్గంలో వచ్చి మధ్యలో ఆగిపోవడం, బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందక, గర్భంలోపలే మోషన్ చేయడం, గుండె కొట్టుకోవడం తగ్గిపోవటం, పుట్టగానే ఏడవకపోవటం, తల్లిలో ఆయాసం, బీపీ పెరగటం, తగ్గటం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్ అన్ని వసతులు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని తగ్గ చికిత్స, అవసరమైతే ఆపరేషన్ చేయ్యడం, ఆక్సిజన్ అందించడం, అధిక రక్తస్రావం అయితే, రక్తం ఎక్కించటానికి ఏర్పాటు చెయవచ్చు. ఒక్కొక్కసారి హాస్పిటల్లో అన్నీ ఉన్నా సమస్యను బట్టి కాంప్లికేషన్స్ ఏర్పడి, తల్లికాని, బిడ్డకాని ప్రాణ పాయ పరిస్థితిలోకి వెళ్లవచ్చు. మరి అలాంటప్పుడు బయటి పరిస్థితులకు భయపడి ఇంట్లోనే నర్సుతో కాన్పు చేయించుకోవటానికి ప్రయత్నం చేస్తే అంతా సజావుగా జరిగితే మంచిదే, కాని పైన చెప్పిన కాంప్లికేషన్స్ వస్తే అప్పుడు ఇబ్బంది, బాధ పడేది మీరే కదా. సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ ఇంట్లోనే ఉన్నా సోకదని గ్యారంటి ఏమి లేదు. కాబట్టి ఆసుపత్రిలో డెలివరీకి ప్లాన్ చేసుకోవడం మంచిది. భయపడకుండా సరైన నిర్ణయం తీసుకోండి. డాక్టర్‌గారూ.. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు కోవిడ్ టీకా వేయించుకోకూడదని అంటున్నారు. కొందరేమో అది తప్పు.. వేయించుకోవచ్చు ఏమీ కాదు అంటున్నారు. అంతా గందరగోళంగా ఉంది. వేయించుకోవచ్చో.. వేయించుకోకూడదో.. దయచేసి చెప్పగలరు. – సుప్రజ, ఇ మెయిల్ ద్వారా అందిన ప్రశ్న. కోవిడ్ టీకా తీసుకోవడానికి, పీరియడ్స్‌కు ఏ సంబంధంలేదు. ఈ టీకాను నెలలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. టీకా తీసుకున్న తర్వాత, దానిలో ఉండే నిర్వీణ్యం చేసిన వైరస్, వైరస్‌కి సంబంధించిన ప్రోటీన్, జన్యుపదార్థాలకు వ్యతిరేకంగా పోరడటానికి, వాటిని నశింప చెయటానికి ఉత్పన్నమవుతాయి. ఈ పోరాటంలో కొందరికి జర్వం, ఒళ్లు నొప్పులు, నీరసం, ఇంజెక్షన్ ఇచ్చిన ప్రదేశంలో కొద్దిగా వాపు, నొప్పి వంటి ఇబ్బందులు ఏర్పడతాయి. పీరియడ్స్ సమయంలో కొందరికి హార్మోన్ల మార్పుల వలన బ్లీడింగ్ ఎక్కువ అవడం, నీరసం, నడుంనొప్పి, పొత్తికడుపునొప్పి, వంటి లక్షణాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ ఇబ్బందలతో పాటు.. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వచ్చే ఇబ్బందులు తోడయి ఇంకా నీరసం, బలహీనపడటం, వంటి సమస్యలతో బాధపడటం జరుగుతుంది. కొందరిలో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి పీరియడ్స్ సమయంలో వ్యాక్సిన్‌ను వారి వారి లక్షణాలు, శరీర తత్వానికి బట్టి తీసుకోవటం మంచిది. అంతేకాని, పీరియడ్స్ సమయంలో వ్యాక్సిన్ తీసుకోకూడదని నిబంధన ఏమి లేదు. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
నెలసరి సమయంలో నొప్పి సమస్య.. డాక్టర్ పరిష్కారం
నా వయసు 33 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 77 కేజీలు. పెళ్లయి నాలుగేళ్లయినా, ఇంకా పిల్లలు కలగలేదు. నెలసరి సమయంలో బాగా నొప్పిగా ఉంటుండటంతో స్థానిక ప్రభుత్వాస్పత్రి డాక్టర్ సూచనపై పరీక్షలు చేయించుకున్నాను. యుటెరిన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లు చెప్పారు. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – చంచల, టెక్కలి మీ ఎత్తు 5.2 అంటే, ఈ ఎత్తుకి గరిష్ఠంగా 60 కేజీల బరువు ఉండవచ్చు. మీరు 17 కేజీలు అధికంగా బరువు ఉన్నారు. కొందరిలో కొద్దిగా కండరం లేదా ఫైబ్రస్ టిష్యూ అధికంగా ఎక్కడైనా పెరిగి గడ్డలాగా, కంతుల్లాగ తయారవుతాయి. వాటినే ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఏ భాగంలోనైనా పెరగవచ్చు. జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల సమతుల్యత లోపం, ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల, అధిక బరువు వంటి కారణాలతో పాటు ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడవచ్చు. ఇవి 0.5 మిల్లీమీటర్ల సైజు నుంచి 10 సెంటీమీటర్ల సైజు వరకు పెరగవచ్చు. ఇవి ఒకటి నుంచి రెండు మూడు కణితులు లేదా అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఇవి గర్భాశయం పైన ఉంటే సబ్సిరీస్ ఫైబ్రాయిడ్స్ అని, మయోమెట్రియమ్ పొరలో ఉంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అని అంటారు. మీకు ఉన్న ఫైబ్రాయిడ్స్ ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది వివరించలేదు. నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ వల్ల వస్తుంది. మీకు బ్లీడింగ్ బాగా ఎక్కువగా ఉందా లేక మామూలుగా ఉందా అనే విషయం కూడా తెలియవలసి ఉంది. సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే నొప్పితో పాటు బ్లీడింగ్ కూడా అధికంగా అవుతుంది. పీరియడ్స్ తొందరగా రావడం, మధ్య మధ్యలో బ్లీడింగ్ అవడం వంటి లక్షణాలు ఉంటాయి. సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే అవి చిన్నగా ఉన్నా, తప్పనిసరిగా వాటికి హిస్టరోస్కోపి మయోమెక్టమీ ద్వారా తొలగించవలసి ఉంటుంది. లేకపోతే అది ఎండోమెట్రియమ్ పొరలో బిడ్డను ఎదగనివ్వకుండా చెయ్యడం వల్ల గర్భధారణలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకవేళ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉంటే వాటి పరిమాణం 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండి, పీరియడ్స్‌లో ఇబ్బందులు ఉండి పిల్లలు కలగకపోతే వాటిని మయోమెక్టమీ ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు. ఒకవేళ వీటి వల్ల గర్భం రాకపోతే, ఇతరత్రా సమస్యలు లేకపోతే అవి తొలగించిన తర్వాత గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. సబ్సిరీస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే వాటి వల్ల గర్భం నిలవడానికి పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. అవి మరీ పెద్దగా ఉండి కడుపులో నొప్పి ఇతర ఒత్తిడి సమస్యలు ఉంటేనే తొలగించవలసి ఉంటుంది. మీకు ఇప్పటికే 33 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి, మళ్లీ ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, త్వరగా తగిన చికిత్స తీసుకుని గర్భం కోసం ప్రయత్నం చేయడం మంచిది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: ఇంకా ఎంత కాలం ఆగాలి? చదవండి: నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? -
పిల్లల కోసం మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది..
మేడం.. నాకు 32 సంవత్సారాలు. ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ. తొలి కాన్పులో బాబు. వాడికిప్పుడు ఏడేళ్లు. ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ఏదో ఇన్ఫెక్షన్ రావడం, మందులు వాడడంతో సెకండ్ ప్రెగ్నెన్సీ లేట్ అయింది. అయితే ఈ టైమ్‌లోనే నాకు హైపోథైరాయిడ్, డయాబెటీస్ కూడా వచ్చాయి. బీపీ నార్మల్‌గానే ఉంది ప్రస్తుతానికైతే. కాని కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీ కాదు అంటున్నారు డాక్టర్. పుట్టబోయే బిడ్డకు అవయవలోపాలు, మెదడు ఎదగకపోవడం వంటి సమస్యలైతే రావు కదా మేడం.. భయంగా ఉంది. – అనుపమ, నిర్మల్ ఈ మధ్యకాలంలో చాలా మంది 30–35 సంవత్సరాల మధ్యలోనే రెండోసారి గర్భం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంత మంది ఒక బిడ్డ చాలు అనుకొని, రెండో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయరు. వీరిలో ఆ బిడ్డ 6–7 సంవత్సరాల తర్వాత పెద్దగా అయ్యి ఒక తోడు కోసం తమ్ముడో, చెల్లెలో కావాలని మా ఫ్రెండ్స్‌కున్నారు, నాకు ఎందుకులేరు అని ఒంటరిగా బాధపడుతూ తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కొందరు బిడ్డకోసం 35 సంవత్సరాల తర్వాత గర్భం ప్లాన్ చేయడం మొదలుపెడతారు. ఈ వయసులో అండాల నాణ్యత తగ్గడం, తల్లిలో బీపీ, షుగర్ పెరగడం వంటి సమస్యల వల్ల ఈ బిడ్డలో మామూలు వారికంటే అవయవ లోపాలు, బుద్ధిమాంద్యంతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటివి ఏర్పడే అవకాశాలు రెట్టింపు అవుతాయి. ఈ సమస్యలు అందరిలో రావాలని ఏమి లేదు. మీకు 32 సంవత్సరాలు, హైపోథైరాయిడ్, డయాబెటిస్ ఉన్నాయి. వీటికి సక్రమంగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుతూ, అదుపులో ఉంచుకుంటే బిడ్డ మీద పెద్ద ప్రభావం పడదు. కాన్పు సమయం వరకు బీపీ పెరగకుండా థైరాయిడ్, షుగర్ కంట్రోల్లో ఉండి, బిడ్డ బరువు మరీ ఎక్కువ లేకుండా ఉంటే, మొదటి కాన్పు నార్మల్‌గా అయ్యి ఉంటే ఈసారి కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. దాని గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ థైరాయిడ్, షుగర్ సమస్యలు అదుపులో లేకపోతే బిడ్డ మెదడు ఎదుగుదలలో లోపాలు, అవయవ లోపాలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అలాగే వయస్సుని బట్టి బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు మామూలు వారికంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. మీరు 12 వారాల సమయంలో ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకోపోతే 5వ నెల మధ్యలో అంటే 18–20 వారాల సమయంలో టిఫా స్కానింగ్‌తోపాటు క్వాడ్రుపుల్ టెస్ట్ అనే రక్త పరీక్ష కూడా చేయించుకోవడం మంచిది. టిఫా స్కానింగ్‌లో బిడ్డ లోపల అవయవాలు అన్నీ ఉండవలసినట్లే ఉన్నాయా, లేదా అనేది 95 శాతం తెలుస్తుంది. గుండెలో రంధ్రాలు వంటివి సరిగా తెలియాలి అంటే ఫీటల్ 2డీ ఈకో స్కానింగ్ చేయించుకోవడం మంచిది. అలాగే క్వాడ్రుపుల్ రక్త పరీక్షలో బిడ్డలో డౌన్స్‌సిండ్రోమ్ వంటి కొన్ని జన్యుపరమైన సమస్యలు ఉండే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిస్తే, సమస్య కచ్చితంగా ఉందా లేదా అని నిర్ధారించుకొని దానికి ఆమినియోసెంటిసిస్ అనే ఉమ్మనీరుని తీసి పరీక్ష చేయడం జరుగుతుంది. లేదా 99 శాతం ఎన్ఐపీటీ అనే రక్తపరీక్ష చేయించుకోవచ్చు. కాబట్టి మీరు ఆందోళన పడకుండా పైన చెప్పిన మీ డాక్టర్ సలహామేరకు చేయించుకొని, సరైన మోతాదులో ఆహార నియమాలను పాటిస్తూ, మందులు వాడుకుంటూ, సక్రమంగా చెకప్‌లకు వెళుతూ ఉంటే ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. లేటు వయసులో పిల్లల్ని కంటే మానసిక లోపాలతో పుట్టే ప్రమాదం ఉన్నట్టే చిన్న వయసులో కంటే కూడా అలాంటి రిస్క్ ఉంటుందా? ఎందుకంటే నాకు పదహారేళ్లకే పెళ్లయింది. ఇప్పుడు నాకు పందొమ్మిదేళ్లు. పిల్లల కోసం మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. నేనేమో చదువు మీద దృష్టిపెట్టాను. మీ సమాధానం మీద నా భవిష్యత్ ఆధారపడి ఉంది. – దీపికా వత్సల, చెన్నూరు సాధారణంగా అమ్మాయి గర్భధారణకు శారీరకంగా మానసికంగా సిద్ధం అవ్వడానికి 21 సంవత్సరాలు నిండితే ప్రెగ్నెన్సీ సమయంలో కాంప్లికేషన్స్ ఎక్కువగా లేకుండా తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో అమ్మాయి తన కాళ్ల మీద తను నిలబడటానికి, లోకం జ్ఞానం తెలియడానికి చదువు కూడా చాలా ముఖ్యం. 21 సం.లకు డిగ్రీ పూర్తవుతుంది. పెళ్లి తర్వాత పిల్లలను కని, పెంచడానికి, చదివించుకోవడానికి, కుటుంబం సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ సామాజిక పరమైన ఉపయోగాలు. తల్లీ, బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే, అమ్మాయి శారీరకంగా పెరగడాని, పెల్విక్ ఎముకలు దృఢంగా తయారు కావడానికి, హర్మోన్స్ సక్రమంగా పనిచేయడానికి 20 సం.రాలు అవసరం. అంతకంటే ముందు గర్భధారణ వల్ల గర్భం సమయంలో రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, పెల్విక్ ఎముకలు ధృఢంగా లేకపోవడం వల్ల సాధారణ కాన్పుకి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి మామూలు వయసు వారి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. తల్లిలో పోషకాల లోపం వల్ల కూడా బిడ్డలో మానసిక శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఎలాగైతే 35 సం.రాలు దాటాక పుట్టబోయే పిల్లల్లో మానసిక లోపాలతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో, అలాగే మరీ చిన్న వయసులో గర్భం దాలిస్తే కూడా పుట్టబోయే పిల్లల్లో ఈ సమస్యలు ఉండే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. మీ ఇంట్లో వాళ్లకి పెళ్లయి మూడు నాలుగు సంవత్సరాలు దాటింది కనిపిస్తుంది కాని, నీ వయసు కనిపించట్లేదు. అందుకే వాళ్లు కంగారుపడుతున్నారు. ఇంతకు ముందు కాలంలో అయితే 15–20 సం.రాల లోపలే పిల్లలను కనేవాళ్లు. అప్పటి కాలం పరిస్థితులు, వారి శరీరతత్వాలు, ఆహారపు అలవాట్లు, పనులు చేయడం వంటివి ఇప్పటి పిల్లలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. కాబట్టి అప్పటి వారిలో, ఇప్పడు ఉన్నంత సమస్యలు ఉండేవి కావు. అలాగే తరాలు మారే కొద్దీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జన్యువులలో కూడా మెల్లగా మార్పులు వచ్చి, తద్వారా పుట్టబోయే పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు మీ వారికి అర్థం అయ్యేటట్లు వివరించి, నీ చదువు పూర్తి చేసుకొని 21 సం.రాలకు పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చు. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
అది ఫాలో అవ్వొచ్చా?
నాకు ఈ మధ్యే పెళ్లయింది. నేను కేరీర్ ఓరియెంటెడ్. కెరీర్ పరంగా ఎంతోకొంత ఎచీవ్ చేశాకే పిల్లలు అనుకుంటున్నాను. నా హజ్బెండ్ కూడా ఒప్పుకున్నాడు. ఫ్రోజెన్ ఎగ్ మెథడ్ చాలా వినపడుతోంది కదా.. అది ఫాలో అవ్వొచ్చా? అలా దాచుకున్న ఎగ్స్ వల్ల పిల్లలు ఆరోగ్యంగానే పుడతారా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం..– అశ్విని, బెంగళూరు అశ్విని నీ వయసు ఎంతో రాయలేదు. సాధారణంగా అయితే గరిష్టంగా 32, 33 సంవత్సరాల వరకు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అండాల సంఖ్య వాటి నాణ్యత చాలా వరకు బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. 34, 35 సంవత్సరాలు దాటే కొద్దీ అండాల సంఖ్య, వాటి నాణ్యత క్రమంగా తగ్గుతూ రావడం వల్ల, ఈ సమయంలో గర్భం కోసం ప్రయత్నం చేసినప్పుడు గర్భం వచ్చే అవకాశాలు తగ్గడం, వచ్చినా జన్యుపరమైన లోపాల వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం, బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నీకు నీ కెరీర్లో నిలదొక్కుకోవడానికి ఇంతకంటే ఎక్కువ సమయం పడుతుందనుకుంటే, నీ అండాలను ముందుగానే ఎగ్ ఫ్రోజన్ మెథడ్ ద్వారా దాచుకొని, గర్భానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఈ లోపల మీవారి వయసు కూడా పెరిగే కొద్దీ ఆయనకు కూడా వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు, అండాలను ఫ్రీజ్ చేసి భద్రపరుచుకునే బదులు, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా అండాల్లోకి వీర్యకణాలను పంపి, ఫలదీకరణ జరిపి, తద్వారా తయారైన పిండాలను ఫ్రీజ్ చేసి భద్రపరుచుకోవడం మంచిది. అండాలను ఫ్రీజ్ చేయడం అంటే oocyte cryopreservation పద్ధతి. ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం చెందుతుంది. ఈ పద్ధతిలో పీరియడ్స్ వచ్చిన రెండో రోజు నుంచి అనేక అండాలు తయారు కావడానికి హెచ్ఎమ్జీ, ఎఫ్ఎస్హెచ్ వంటి హార్మోన్ ఇంజెక్షన్లను ఎక్కువ మోతాదులో 8–10 రోజులపైన ఇవ్వడం జరుగుతుంది. అండాల పరిమాణం 18–20 మి.మీ. పెరిగిన తర్వాత వాటిని వెజైనా (యోని భాగం) నుంచి స్కానింగ్‌లో చూస్తూ బయటకు తీయడం జరుగుతుంది. అలా తీసిన అండాల్లో మంచి అండాలను (మంచి నాణ్యత) విట్రిఫికేషన్ పద్ధతి ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతలో ఫ్రీజ్ చేసి నైట్రోజన్ లిక్విడ్‌లో భద్రపరచడం జరుగుతుంది. వీటిని 10 సంవత్సరాలపైన నిల్వ చేయవచ్చు. వీటిని ఏ వయసులో బయటకు తీయడం జరిగిందో కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని వాడేటప్పుడు వాటి వయసు అలానే ఉంటుంది. కొన్ని సంవత్సరాల గర్భం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఫ్రీజ్ చేసిన అండాలను థాయింగ్ పద్ధతి ద్వారా సాధారణ పరిస్థితికి తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని అండాలు పాడయిపోవడం వల్ల 10 శాతం అండాలు నాణ్యత కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 90 శాతం అండాలు బాగానే ఉండవచ్చు. ఈ అండాల్లోకి వీర్యకణాలను ఐసీఎస్ఐ పద్ధతి ద్వారా ప్రవేశపెట్టి ఫలదీకరణ చేయడం జరుగుతుంది. వాటిని 3–5 రోజులు ఇంక్యుబేటర్‌లో పెట్టిన తర్వాత, ఎన్ని పిండాలు ఏర్పడ్డాయి, వాటి నాణ్యత ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అలా ఏర్పడిన అండాలను, అప్పటికే ఉన్న మహిళ గర్భాశయంలోకి సన్న కె«థడర్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మహిళ గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొర మందం సరిగా ఉండి, దానికి రక్తప్రసరణ సరిగా ఉండి, హార్మోన్స్ పనితీరు సరిపడా ఉండి, గర్భాశయంలోకి అండాలు సరిగా హత్తుకుంటే, అప్పుడు గర్భం నిలుస్తుంది. వీటిలో ఏ ప్రక్రియ సరిగా లేకపోయినా గర్భాశయం పిండాలను స్వీకరించదు. అప్పుడు గర్భం నిలబడకుండా పీరియడ్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు చేసిన పరిశోధనల్లో ఫ్రోజెన్ ఎగ్ మెథడ్ ద్వారా పుట్టిన పిల్లలు, మామూలుగా పుట్టిన పిల్లలు లేదా సాధారణ వయసులో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పుట్టిన పిల్లల లాగానే ఉంటారని, కాంప్లికేషన్స్ కూడా వారిలో లాగానే ఉంటాయని తేల్చడం జరిగింది. కాకపోతే తల్లి వయసు 35–40 సంవత్సరాలు దాటే కొద్దీ తల్లిలో బీపీ, షుగర్ వంటి ఇతర మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఫ్రోజెన్ ఎగ్ మెథడ్ వల్ల ప్రెగ్నెన్సీ కచ్చితంగా వస్తుందని కాని, సమస్యలు ఏమీ ఉండవు అని కాని చెప్పడం కష్టం. ఈ పద్ధతిని మొదట్లో చిన్న వయసులో క్యాన్సర్ వచ్చి వాటికి చికిత్స తీసుకొనే వాళ్లకోసం, దీర్ఘకాల మెడికల్ సమస్యలు ఉండి, వాటి చికిత్స తీసుకొనే సమయంలో అండాల నాణ్యత తగ్గిపోకుండా ఉండటాని కనుగొనడం, వాడటం జరిగింది. క్రమేణా దీనిని మీకు లాగా పిల్లలు ఇప్పుడే వద్దనుకొని కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉన్నవాళ్లు, పెళ్లి వాయిదా వేసేవాళ్లు, తగిన పార్టనర్ దొరకని వాళ్లు. వాడటం మొదలు పెట్టారు. ఈ కారణాల కోసం అండాలను క్రయోప్రిజర్వ్ చేయడాన్ని social freezing అంటారు. ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ ఉంది కదా అని, అదో ఫ్యాన్సీలాగా వాడేసుకోవడం మంచిది కాదు. అది ఎంతవరకు అవసరమో అంత వరకే వాడుకోవాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. కెరియర్ అని, ఇంకా అనేక కారణాల వల్ల లేటు వయసులో పిల్లలను కనడం వల్ల, వారిని పెంచి, చదివించి పెద్ద చేసే వరకు, మీ వయసు పెరిగి, మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఒకసారి ఆలోచించి చూసి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. కొద్దిగా ఓపికతోని, సరైన సమయంలో పిల్లలు కని, (పెద్దవాళ్ల సహాయ సహకారంతో) కష్టపడి కెరియర్ కూడా చూసుకుంటూ ఎన్నో సాధించిన మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి నువ్వు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వెజైనల్ స్కానింగ్ చేయించుకొని, అందులో అండాశయం పరిమాణం, అందులో అండాల సంఖ్య ఎలా ఉంది తెలుసుకొని, హార్మోన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఎఎమ్హెచ్ వంటి రక్త పరీక్షలు చేయించుకొని తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా?
పదిహేనేళ్లకే పెళ్లయి, ఇరవైఏళ్ల కల్లా బిడ్డలు పుట్టి, ట్యూబెక్టమీ అయిపోతే గర్భసంచి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – కె. రాధ, మంచిర్యాల్ మీరు చెప్పే గర్భసంచి కేన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అనేది 80 శాతం మందిలో హ్యూమన్ పాపిలోమాలోని కొన్ని రకాల వైరస్ జాతుల వల్ల వస్తుంది. హెచ్‌పీవీ వైరస్ కలయిక వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ హెచ్‌పీవీ లో కొన్ని హైరిస్క్ జాతులు (హెచ్‌పీవీ 16, 18 వంటివి) ఎక్కువ కాలం పాటు గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉన్నప్పుడు అవి సెర్విక్స్లోని కణాల్లో అనేక మార్పులను కలుగజేయడం వల్ల అధికంగా వృద్ధి చెందుతూ చాలా సంవత్సరాలకు (10 సం. పైన) క్యాన్సర్ కణాలుగా మారడం జరుగుతాయి. ఈ వైరస్ చాలా మందిలో ఉన్నా వారి రోగనిరోధక శక్తిని బట్టి, వారి జన్యువులను బట్టి కేవలం ఇన్ఫెక్షన్ లేదా కొద్దిపాటి మార్పులతో నశించిపోతాయి. కాని కొందరిలో అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో, 15 సంవత్సరాలకే కలయికలో పాల్గొనడం వల్ల, అలాగే చిన్న వయసుకే పిల్లలు పుట్టడం వల్ల, ఎక్కువ మంది పిల్లలను కనడం వల్ల, పొగతాగడం వంటి అనేక అంశాల వల్ల, వీరిలో సెర్వైకల్ కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో హైరిస్క్ హెచ్‌పీవీ వైరస్ సెర్వెకల్ కణాల్లో క్యాన్సర్ మార్పులను ఎక్కువగా కలుగజేయడం జరుగుతుంది. ఈ కణాల్లో మార్పులను ముందుగా తెలుసుకోవడానికి ప్యాప్‌స్మియర్ అనే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షను చేయించుకోవడం మంచిది. ఇందులో సెర్విక్స్ దగ్గర కణాలను (ద్రవాలను) చిన్న బ్రష్ ద్వారా తీయడం జరుగుతుంది. మొదటి కలయిక తర్వాత నుంచి ప్యాప్‌స్మియర్ పరీక్షను 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలో సెర్వైకల్ క్యాన్సర్ వచ్చే పది సంవత్సరాల ముందు నుంచే సర్వైకల్ కణాల్లో మార్పులను తెలుసుకోవచ్చు. నాకు ఇరవైరెండేళ్లు. రెండేళ్ల కిందట పెళ్లయింది. ఈ మధ్యే నెల తప్పాను. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకొని అబార్షన్ మాత్రలు వాడాను. దాదాపు నలభై రోజుల దాకా బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ ఆగిపోయే దశలో రక్తస్రావం నల్లగా అయింది. ఇప్పుడు అంతా మామూలైపోయి.. ఎప్పటిలాగే మళ్లీ పీరియడ్స్ కూడా వచ్చాయి. అయితే మేడం.. ఇప్పుడు నాకు పూర్తిగా అబార్షన్ అయిపోయినట్టే కదా? ప్రెగ్నెన్సీ నిలబడే చాన్స్ లేదు కదా? ఇంటర్‌కోర్స్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే చాన్స్ అయితే ఉండదు కదా? ఒకవేళ భవిష్యత్‌లో నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఈ అబార్షన్ వల్ల పుట్టబోయే బిడ్డకు, నాకు ఏమైనా సైడ్ ఎఫెక్టŠస్ ఉంటాయా? రక్తస్రావం నల్లగా ఎందుకైందంటారు? హిమోగ్లోబిన్ కూడా నాకు 10.5 వరకూ ఉంది మేడమ్.. దయచేసి నా సందేహాలకు జవాబు చెప్పగలరు. – ఇ– మెయిల్ ద్వారా అందిన ప్రశ్న. గర్భం దాల్చిన తర్వాత, గర్భం వద్దని అబార్షన్ అవ్వడం కోసం అనేక పద్ధతులు ఉంటాయి. మందుల ద్వారా లేదా డి అండ్ సి ద్వారా మత్తు ఇచ్చి గర్భాశయం నుంచి గర్భాన్ని తీసివేయడం. ఒకటి గర్భం 7 వారాల లోపల ఉంటే (చివరగా పీరియడ్ వచ్చినప్పటి నుంచి లెక్కపెట్టాలి) అబార్షన్ మందులయిన మిషిప్రిస్టోన్, మిసోప్రొస్టాల్ ద్వారా ప్రయత్నించడం. ఇందులో 95 శాతం బ్లీడింగ్ ద్వారా అబార్షన్, కొంచెం కడుపులో నొప్పితో అయిపోతుంది. 45 శాతం మందిలో కొన్ని ముక్కలు ఉండి పోవచ్చు. 1 శాతంలో బ్లీడింగ్ అయినా ప్రెగ్నెన్సీ (గర్భంలో శిశువు) పెరగవచ్చు. కాబట్టి గర్భ నిర్ధారణ అయిన తర్వాత గర్భం వద్దనుకుంటే మొదట గర్భం గర్భాశయంలో ఉందా లేదా, ట్యూబ్‌లో ఉందా, ఉంటే ఎన్ని వారాలు ఉంది అని డాక్టర్‌ను సంప్రదించి స్కానింగ్ ద్వారా నిర్ధారణ చేసుకొని గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో అబార్షన్ మందులు వాడటం అన్ని విధాలా మంచిది. మందులు వాడిన పది పదిహేను రోజులకు గర్భాశయంలో ముక్కలేవీ మిగలకుండా పూర్తిగా అబార్షన్ అయిపోయిందా లేదా అని మరలా స్కానింగ్ చేయించుకోవడం మంచిది. చాలా మంది సొంతంగా అబార్షన్ మందులు మెడికల్ షాపులో తీసుకొని వాడుకొని, ముందు, తర్వాత స్కానింగ్ చేయించుకోకుండా, ఎక్కువ నొప్పి, బ్లీడింగ్‌తో ఇబ్బంది పడటం, రక్తహీనత ఏర్పడటం, కొంత మందిలో ముక్కలు ఉండిపోయి ఇన్ఫెక్షన్లు రావడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ఇబ్బందికరమైన పరిస్థితులతో ప్రాణాలపైకి తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమందిలో బ్లీడింగ్ అయినా కాని అబార్షన్ సరిగా అవ్వకుండా శిశువు పెరిగే అవకాశం ఉంటుంది. మీకు 40 రోజులు బ్లీడింగ్ అయ్యింది. రక్తం లోపల చాలా రోజులు ఉండిపోయి చివరలో రంగు మారి నల్లగా రావుచ్చు. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి స్కానింగ్ చేయించుకొని గర్భాశయంలో ఏమైనా ముక్కలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. ఈ అబార్షన్ మొత్తంగా అయిపోయి, ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే, మళ్లీ పుట్టబోయే బిడ్డకు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఇంత చిన్న వయసులో...
మేడమ్.. మా పాప పదేళ్లు నిండగానే పెద్దమనిషి అయింది. మాకు షాకింగ్‌గా ఉంది. అంత చిన్న వయసులో ఏంటీ అని? నేను పదమూడేళ్లు నిండడంతో అయ్యాను. మా అక్కచెల్లెళ్లంతా ఇంచుమించు అదే వయసులో రజస్వల అయ్యారు. ఇప్పుడు మా అమ్మాయి, మా ఆడపడచు వాళ్ల అమ్మాయీ అంతే పదకొండేళ్లకు అయింది. ఎందుకలా? ఫుడ్ ప్రభావమా? – వి. సమీరజ, నిజామాబాద్ ఆధునిక కాలంలో మారుతున్న జీవన శైలి వల్ల, జంక్‌ఫుడ్, మారిన ఆహారపు అలవాట్లు, ఆహారంలో, పర్యావరణంలో మార్పులు, అధిక బరువు, వ్యాయామాలు లేక పోవడం, ఇంటర్నెట్, మీడియా, సెల్ఫోన్ల వల్ల అనేక విషయాలు లోతుగా తెలుసుకోవడం, హార్మోన్లు త్వరగా ఉత్తేజం చెందడం, వంటి అనేక కారణాల వల్ల ఇప్పుడు పిల్లలు 10–11 సంవత్సరాల నుంచే రజస్వల అవుతున్నారు. ఇంతకు ముందు కాలంలో 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల రజస్వల అయ్యేవారు. 10–11 సంవత్సరాల ఆడపిల్లలంటే అల్లారు ముద్దుగా పెరిగే వయస్సులో ఉన్నవారు. వీరికి ఈ పీరియడ్ సమయంలో న్యాప్కిన్స్ సరిగా పెట్టుకోవడం, వాటిని సరిగా పడవేయడం, జనేంద్రియాలు శుభ్రపరుచుకోవడం, శారీరక శుభ్రత వంటి పనులు చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉంటాయి. వీరితో తల్లిదండ్రులు చాలా సంయమనంతో ఉండవలసి ఉంటుంది. అన్ని విషయాలు చాలా ఓపికతో వివరించవలసి ఉంటుంది. కొందరు పిల్లల్లో మెదడులో కంతులు, ఇన్ఫెక్షన్స్, అండాశయాల్లో కంతులు, వంటి అనేక సమస్యల వల్ల 8–9 సంవత్సరాలకే రజస్వల అవ్వడం జరుగుతుంది. దీనిని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు. అలాంటప్పుడు ఒకసారి ఎండొక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు, సలహాలు తీసుకోవడం మంచిది. మేడమ్.. నాకు 22 ఏళ్లు. పెళ్లయి ఆరునెలలు అవుతోంది. నా సమస్య వల్ల నా వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడింది. నాకు కుడి బ్రెస్ట్ పెద్దదిగా, ఎడమ బ్రెస్ట్ చిన్నదిగా ఉంది. నేను మెచ్యూర్ అయినప్పుడే ఈ సమస్యను పసిగట్టి మా అమ్మ మా ఊరిలోని గైనకాలజిస్ట్ దగ్గరకు నన్ను తీసుకెళ్లింది. అదేం జబ్బు కాదని, ప్రమాదం అంతకంటే కాదని, చాలా సాధారణమైన విషయమని తేల్చారావిడ. ఏవో వ్యాయామాలు చెప్పి చేయమన్నారు. కొన్నాళ్లు చేశాను. కాని చదువు, ఇతరత్రా వ్యాపకాల్లో పడి ఎక్సర్సైజ్ మీద శ్రద్ధ పెట్టలేదు. నా సమస్యనూ పట్టించుకోలేదు. కాని ఇప్పుడదే నా కాపురాన్ని చెడగొడుతోంది. ఏం చేయమంటారు? – వినీత చీమకంటి ( ఈ మెయిల్ ద్వారా) తల్లి గర్భంలో బిడ్డ పిండంగా మొదలయ్యి అందులో అనేక అవయవాలు ఏర్పడుతూ శిశువుగా మారుతుంది. ఈ అవయవాలు ఏర్పడే సమయంలో, కొందరిలో జన్యుపరమైన కారణాలు, పర్యావరణ మార్పులు, తల్లిలో ఆహార లోపాలు, కొన్ని రకాల మందులు వాడటం వంటి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అవకతవకలు జరిగి, శిశువు శరీర నిర్మాణంలో లోపాలు జరిగి, ఒక్కొక్కరిలో ఒక్కోలాగా కొన్ని అవయవాలు సరిగా తయారు కాకపోవడం, పని తీరులో లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందులో మెదడు, గుండె లోపాలు, కాళ్లు చేతులు లేకపోవడం వంటి ఎన్నో పెద్దపెద్ద లోపాలతో పాటు చిన్న చిన్న లోపాలూ ఉండవచ్చు. అలాగే నీకు కూడా ఒక రొమ్ము పెద్దగా, ఒక రొమ్ము చిన్నగా ఏర్పడింది. వాటితో పోలిస్తే, డాక్టర్ చెప్పినట్లు నీది అసలు సమస్యే కాదు. రొమ్ముల పరిమాణంలో తేడా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి చేయగలిగింది కూడా ఏమీ లేదు (ప్లాస్టిక్ సర్జరీ తప్ప). ఇదేమీ కాపురాన్ని చెడగొట్టే సమస్య కాదు. అది అవతల మనిషి ఆలోచనా తీరులో ఉంటుంది. నీకు నువ్వు అది సమస్య అనుకుంటూ, అదేదో లోపం అని బాధపడుతుంటే, నీ భర్త దానిని నిజమే అనుకొని నిన్ను విసుక్కుంటూ, హేళన చేస్తూనే ఉంటాడు. కాబట్టి మొదట నిన్ను నువ్వు ఇదేం సమస్య కాదు, నా తప్పు కాదు అని సమర్థించుకొని తర్వాత నీ భర్తతో ప్రేమతో ఓపికతో నచ్చజెప్పడానికి ప్రయత్నించు. లేదు అంటే అతడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి డాక్టర్‌తో మాట్లాడించడం మంచిది. చిన్నగా ఉన్న రొమ్ముని, రోజూ మెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల, దానికి రక్త ప్రసరణ పెరిగి కొద్దిగా పరిమాణం పెరిగే అవకాశాలు ఉంటాయి. మాది కొత్త పెళ్లి జంట. కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు. సెక్సువల్ ఇంటిమసీ పట్ల చాలా భయపడ్తున్నాం. ఇంకా చెప్పాలంటే లిప్‌లాక్ అంటే కూడా భయంగా ఉంటోంది. కరోనా సమయంలో ఎలా ఉండాలో సలహా ఇవ్వండి ప్లీజ్... – పేరు రాయలేదు. కరోనా వైరస్ నోటి నుంచి, ముక్కు నుంచి వచ్చే ద్రవాలు. ఇంకొకరికి పాకడం వల్ల వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా కూడా ఈ వైరస్ ఒకే గదిలో ఎక్కువ సేపు ఉన్నా ఇద్దరు మనుషుల్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి చాలా వరకు వ్యాప్తి చెందుతుంది. అలాంటప్పుడు భార్యభర్తల్లో ఒకరికి కరోనా ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇంకొకరికి కచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇద్దరు బయట వాతావరణం నుంచి కరోనాకు గురికాకుండా చూసుకోడానికి ప్రయత్నాలు, జాగ్రత్తలు తీసుకోవాలి (మాస్క్, సానిటైజర్, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం వంటివి). ఈ వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టీ, మీరు ఇద్దరూ భయపడుతూ ఎంతకాలం ఉంటారు. ఒక వేళ ఒకరికి వచ్చి, లక్షణాలు తెలిసేటప్పటికే ఇంకొకరికి వైరస్ సోకి ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కలవడం అంటూ ఏమి ఉండదు, మొత్తానికే దూరంగా ఉండటం తప్ప, భయపడకుండా, ఒక వేళ కరోనా వచ్చినా, ఎక్కువగా కాంప్లికేషన్స్ లేకుండా, తగ్గిపోవడానికి మీ రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సరైన పోషక పదార్థాలు తీసుకుంటూ తగిన వ్యాయమాలు చేస్తూ సంతోషంగా ఉండండి. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
నా కాపురాన్ని నిలబెట్టండి మేడమ్
నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లవుతోంది. పెళ్లికి ఏడాది ముందు ఒవేరియన్ సిస్ట్ ఆపరేషన్ అయింది. ఈ విషయం బయటకు చెబితే పెళ్లి చెడిపోతుందేమోనని దాచిపెట్టి పెళ్లి చేశారు మావాళ్లు. పెళ్లయి ఆరేళ్లయినా పిల్లలు పుట్టకపోయేసరికి గైనకాలజిస్ట్‌కు చూపించుకోవాల్సి వచ్చింది. అక్కడ అసలు విషయం చెప్పాల్సి వచ్చింది. ఆ నిజం విన్న మా అత్తింటి వాళ్లు నాకు అందువల్లే పిల్లలు పుట్టట్లేదని, మేం వాళ్లను మోసం చేశామని నన్ను మా పుట్టింటికి పంపించేశారు. ఇది జరిగి ఎనిమిది నెలలవుతోంది. ఎంత చెప్పినా మా వారు కూడా వినట్లేదు. దయచేసి వాళ్ల సందేహానికి పత్రికాముఖంగా జవాబిచ్చి నా కాపురాన్ని నిలబెట్టండి మేడమ్. – సుచిత్ర ( ఈ మెయిల్ ద్వారా వచ్చిన ప్రశ్న). నీకు ఓవేరియన్ సిస్ట్కు ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం ఓవరీ (అండాశయం) తీసివేశారా లేదా కేవలం సిస్ట్ ఒక్కటే తొలగించి మిగతా అండాశయం ఉంచారా అనే విషయాలు తెలియవలసి ఉంది. గర్భాశయం రెండు వైపుల ఒకటి చొప్పున రెండు అండాశయాలు ఉంటాయి. ప్రతి నెలా 11–16వ రోజు లోపల ఒక అండాశయం నుంచి ఒక అండం విడుదల అవుతుంది. సాధారణంగా ఒక నెల కుడివైపు నుంచి ఒక నెల ఎడమవైపు నుంచి విడుదల అవుతాయి. ఈ అండం అండవాహికలోకి ప్రవేశిస్తుంది. ఈ అండం విడుదలయ్యే సమయంలో కలయిక వల్ల వీర్యకణాలు యోని నుంచి గర్భాశయంలోకి ప్రవేశించి దాని నుంచి ట్యూబ్‌లో ఉన్న అండంలోకి చొచ్చుకొని వెళ్లి దానిని ఫలదీకరణ చేయడం వల్ల పిండం ఏర్పడుతుంది. ఆ పిండం మరలా గర్భాశయంలోకి ప్రవేశించి, అక్కడ ఎండోమెట్రియమ్ పొరలో దానికి సరిపడా రక్త ప్రసరణ, హార్మోన్స్ ఉన్నప్పుడు, పిండం అంటుకొని గర్భం పెరగడం మొదలయ్యి మెల్లగా శిశువుగా మారుతుంది. ఇక్కడ గమనించవలసింది. అండాశయం నుంచి అండం విడుదల, ట్యూబ్స్ తెరుచుకొని ఉండటం, గర్బాశయం లోపలి పొర సరిగా పెరగడం, హార్మోన్స్ సక్రమంగా పనిచేయడం, అలాగే మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక నాణ్యత అన్నీ సరిగ్గా ఉంటేనే గర్భం వస్తుంది. నీకు ఓవేరియన్ సిస్ట్ వల్ల ఒక అండాశయం తొలగించి ఉంటే కూడా, ఇంకొక అండాశయం ఉంది కాబట్టి దాని నుంచి ప్రతి నెలా అండం విడుదలవుతుంది. మిగతా పైన చెప్పిన సమస్యలు ఏమీ లేకపోతే ఒక అండాశయం లేకపోవడం వల్ల గర్భం రాకపోవడం ఏమి ఉండదు. గర్భం రాకపోవడానికి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, ట్యూబ్ టెస్ట్ (హెచ్ఎస్జీ) అండం సాధారణంగా విడుదల అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, హార్మోన్స్ సక్రమంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయించుకొని సమస్యను బట్టి చికిత్స తీసుకుంటే గర్భం వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. అన్నింటికంటే ముందు, ఈ కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, తాగుడు, పొగ తాగుడు, వ్యసనాలు, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల మగవారిలో కూడా చాలా మందిలో శుక్రకణాల (వీర్య కణాలు) సంఖ్య బాగా తగ్గిపోవడం, కదలిక నాణ్యత సరిగా లేకపోవడం పరిశీలనకి వచ్చిన విషయం కాబట్టి ఒకసారి మీ వారికి కూడా సీమెన్ అనాలసిస్ పరీక్ష చేయించడం మంచిది. అందులో సమస్య ఉంటే దానికి తగ్గ చికిత్స తీసుకొని, గర్భం కోసం ప్రయత్నించడం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గర్భం సాధారణంగా రాకపోవడానికి ఆడవారిలో 50 శాతం కారణం అయితే, మగవారిలో లోపాలు కూడా 50 శాతం కారణం అవుతాయి. పెళ్లయిన తరువాత ఒవేరియన్ సిస్ట్ బయటపడుంటే అప్పుడైనా ఆపరేషన్ చేయించుకొని చికిత్స తీసుకునే వాళ్లు కదా. ఆరు సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు కాదంటే ఎలా? సమస్యను వాళ్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీ పెద్దవారిని, మీ అత్త తరపు వాళ్లని కూర్చోబెట్టి మాట్లాడుకొని, సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. డాక్టర్‌ను సంప్రదించి భార్య భర్త ఇద్దరు పరీక్షలు చేయించుకొని, సమస్యను బట్టి చికిత్స తీసుకొని మందుల ద్వారా, లేదా ఐయూఐ పద్ధతి, మరీ కాకుంటే ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఒకే నెలలో రెండుసార్లు!
మా అమ్మాయి వయసు పదిహేను సంవత్సరాలు. గత ఏడాది మెచ్యూర్ అయింది. పదహారు రోజుల తర్వాత రెండోసారి మెన్సస్ అయింది. అలా ఒకేనెలలో రెండుసార్లు పీరియడ్స్ వచ్చాయి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. తర్వాత మూడు నెలలకు వచ్చింది. ఆ తర్వాత బాగానే వచ్చేవి. మళ్లీ ఒకనెల రాలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాక, రెండు నెలలకు వచ్చింది. తర్వాత బాగానే వచ్చేవి. ఇప్పుడు అక్టోబర్‌లో రాలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లాలా లేదా? మా అమ్మాయి వెయిట్ 58 కేజీలు, ఎత్తు 5.3. పీరియడ్స్ సరిగా వచ్చేలా తగిన డైట్, వెయిట్ తగ్గాలా లేదా తెలియజేయండి. – ప్రసన్న పులిదిండి (ఈ మెయిల్ ద్వారా) సాధారణంగా అమ్మాయిలలో 11 నుంచి 16 సంవత్సరాల లోపల ఒక క్రమ పద్ధతిలో మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి ఊ ఏ, ఔఏ అనే హార్మోన్స్ విడుదలై అవి అండాశయాల మీద ప్రభావం చూపి, వాటి నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ విడుదలని ఉత్తేజపరచడం వల్ల గర్భాశయం నుంచి బ్లీడింగ్ అవ్వడం వల్ల పీరియడ్స్ మొదలవుతాయి. ఈ హార్మోన్స్ అన్నీ సక్రమంగా పని చేయడానికి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ఒకటి, రెండు సంవత్సరాలు పడుతుంది. అంతవరకు పీరియడ్స్ కొందరిలో సక్రమంగా రాకుండా, రెండు మూడు నెలలకొకసారి రావడం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, లేదా నెలలో రెండు సార్లు రావడం, తొందరగా రావడం వంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడున్న ఆధునిక కాలంలో మారిన ఆహారపు అలవాట్లు (జంక్ ఫుడ్), శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన మార్పుల వంటి వాటి వల్ల కూడా, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలు వంటివి ఏర్పడి హార్మోన్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా పీరియడ్స్ నెలనెలా రాకపోవచ్చు. మీ అమ్మాయి 5.3 ఎత్తుకి 47–57 కేజీల వరకు బరువు ఉండవచ్చు. తను 58 కేజీలు అంటే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి, ఆమెకు మితమైన పౌష్టికాహారం ఇవ్వవచ్చు. ఆహారంలో నూనె వస్తువులు, జంక్‌ఫుడ్ వంటివి నివారించండి. అలాగే బరువును అదుపులో ఉంచడానికి వాకింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, యోగా వంటి వ్యాయమాలు చేయించడం మంచిది. దీనివల్ల తనకి హార్మోన్లు సక్రమంగా పనిచేయడం మొదలవుతుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కొన్ని నెలలు ఆగి చూసి అయినా పీరియడ్స్ అలానే ఉంటే, తనకి ఒకసారి థైరాయిడ్ పరీక్ష, అల్ట్రాసౌండ్ పెల్విక్ స్కానింగ్ చేయించండి. వీటిలో ఏదైనా సమస్య ఉంటే దానిని బట్టి చికిత్స తీసుకోవచ్చు. డాక్టర్ గారూ మా పాపకు పదకొండేళ్లు. పాప పుట్టినప్పుడు క్లిటోరస్ బయటకు వచ్చి ఉండింది. తర్వాత అది మామూలు అయిపోతుంది అన్నారు. అయిపోయింది కూడా. కాని ఇప్పుడు మళ్లీ బయటకు పొడుచుకొచ్చింది. గైనకాలజిస్ట్‌కు చూపిస్తే సర్జరీ చేయాలన్నారు. మాకు భయంగా ఉంది. అసలు ఇదేం సమస్యో మాకు అర్థంకావట్లేదు. – పేరు, ఊరు వివరాలు ఇవ్వలేదు. జనేంద్రియాల బయట భాగంలో పైకి చిన్న బొడిపిలాగా ఉండే అవయవాన్ని క్లిటోరిస్ అంటారు. ఇందులో కండరంతో పాటు, స్పాంజ్ వంటి కణజాలం, నాడులు, రక్త నాళాలు ఎక్కువగా ఉంటాయి. దీని పెరుగుదల ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఆడవారిలో క్లిటోరిస్, మగవారిలో పెనిస్ (పురుషాంగం)లాంటి అవయవమే. అలాగే దాని పనితీరు ఉంటుంది. సాధారణంగా కూడా రజస్వల సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల పెరుగుతుంది. దాని ప్రభావం వల్ల క్లిటోరిస్ కొద్దిగా పెరిగి ముందుకు వస్తుంది. కాని మీరు చెప్పినదాన్ని బట్టి అది ఎక్కువగా పెరిగినట్లుంది. కొందరిలో పీసీఓడీ, అడ్రినల్ గ్రంథిలో ట్యూమర్లు, కుషింగ్ సిండ్రోమ్ వంటి అనేక కారణాల వల్ల టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్స్ వంటి మగవారిలో ఎక్కువగా ఉండే హార్మోన్లు, ఆడవారిలో ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల క్లిటోరిస్ పరిమాణం పెరుగుతుంది. దీనినే క్లిటోరోమెగాలి అంటారు. కొందరిలో అరుదుగా జన్యుపరమైన సమస్య వల్ల కూడా ఇలా ఉండవచ్చు. చాలా అరుదుగా బిడ్డలో ్ఠy క్రోమోజోమ్స్ ఉండి, వాటిలో జన్యుపరమైన లోపాలు ఉండి, టెస్టోస్టిరాన్ హార్మోన్ల తయారీ, పనితీరులో లోపాలు ఉంటే కూడా జనేంద్రియాలు సరిగా పెరగకుండా, బయటకు ఆడబిడ్డలాగా కనిపించి, వయసు పెరిగే కొద్ది హార్మోన్ల ప్రభావం వల్ల కూడా క్లిటోరిస్ పెద్దగా కనిపించవచ్చు. కాబట్టి మళ్లీ ఒకసారి ఎండొక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి వివరంగా అవసరమైన రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ అబ్టామిన్ స్కానింగ్, హార్మోన్ పరీక్షలు వంటి పరీక్షలు చేయించుకొని, పైన చెప్పుకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అని నిర్ధారించుకొని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. కారణాలు ఏమీ కనపడకపోతే, క్లిటోరిస్ పెద్దగా ఉండటం వల్ల, ఇబ్బంది చాలా అనిపిస్తే ఆపరేషన్‌కు వెళ్లడం మంచిది. ఈ వయసులో ఆపరేషన్ చేసినా వయసు పెరిగే కొద్ది హార్మోన్స్ ప్రభావం వల్ల మళ్లీ పెరగవచ్చు. ఇబ్బంది లేకపోతే ఇంకా కొంత కాలం ఆగి చూసి, తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
గర్భసంచి లేకుండా పిల్లలు పుడతారా?
మా అమ్మాయికి పదహేడేళ్లు. పదహారు నిండినా ఇంకా పెద్దమనిషి కాలేదని డాక్టర్ గారికి చూపిస్తే స్కానింగ్ చేయించమన్నారు. రిపోర్ట్‌లో మా అమ్మాయికి పుట్టుకతోనే గర్భసంచి లేదని వచ్చింది. మేం షాక్ అయ్యాం. మా కుటుంబంలో ఇలాంటి హెల్త్ హిస్టరీ లేదు. గర్భసంచి లేకుండా పుడ్తారా? మా పాప భవిష్యత్ తలచుకుంటే భయంగా ఉంది. పరిష్కారం చెప్పగలరు. – టి. లలిత, చెన్నై కొంత మందిలో జన్యుపరమైన సమస్యల వల్ల పుట్టుకతోనే గర్భాశయం లేకుండా జన్మిస్తారు. కొందరిలో గర్భాశయం లేకుండా, అండాశయాలు మాత్రం ఉంటాయి. అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వీరిలో 12 సంవత్సరాల సమయంలో రొమ్ములు పెరగడం, చంకల్లో, జనేంద్రియాల దగ్గర వెంట్రుకలు పెరగడం వంటి అమ్మాయి లక్షణాలు ఉంటాయి కాని గర్భాశయం ఉండదు కాబట్టి పీరియడ్స్ మాత్రం రావు. వీరిలో జన్యువులు అందరి అమ్మాయిలలానే 46్ఠ్ఠ ఉంటాయి. కొందరిలో అమ్మాయి లక్షణాలు ఉంటాయి కాని, గర్భాశయం, అండాశయం రెండూ ఉండవు. వారిలో జన్యువులు అబ్బాయిలలో లాగా 46xx ఉంటాయి. వీరిలో ఆండ్రోజన్ హార్మోన్ పనితీరులో లోపాల వల్ల మగలక్షణాలు లేకుండా ఉంటారు. మీ అమ్మాయికి క్వారియోటైపింగ్ చెయ్యించండి. అది 46xy అయితే, కొందరిలో యోని భాగం చిన్నగా ఉండవచ్చు. కొందరిలో ఉండకపోవచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో వేరొకరి గర్భాశయాన్ని తీసి, గర్భాశయం లేని వారికి అమర్చడం (యుటిరైన్ ట్రాన్స్‌ప్లాంట్ (మన దేశంలో కూడా)) జరుగుతుంది. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అని చెప్పడం కష్టం. ఆమె శరీరం దానిని రిజెక్ట్ చెయ్యకుండా తీసుకోగలుగుతుందా అనేది చెప్పలేము. అందులో నుంచి నెలనెలా పీరియడ్స్ వస్తాయా, పిల్లలు పుడుతారా అనేది కచ్చితంగా చెప్పలేము. ఖర్చుతో కూడుకున్నది. కొందరిలో పెళ్లి తర్వాత కేవలం వైవాహిక జీవితం కోసం, యోని భాగాన్ని వెజైనోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా వెడల్పు చేయడం జరుగుతుంది. వారిలో అండాశయాలు ఉంటే వాటి నుంచి అండాలను సేకరించి, సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలను కనవచ్చు. క్వారియో టైపింగ్‌లో 46xy అని వస్తే, వీరిలో పుట్టినప్పటి నుంచి అమ్మాయిలానే పెరిగి ఉంటారు కాబట్టి, వీరిలో పొత్తి కడుపులో ఉండే టెస్టిస్లను తొలగించి, యోని భాగాన్ని తయారు చెయ్యడానికి వెజైనోప్లాస్టీ ఆపరేషన్ చెయ్యడం జరుగుతుంది. సమస్య నిర్ధారణ అయిన తర్వాత, మొదట మీ పాపకు కౌన్సెలింగ్ ఇప్పించి, ఆమె మనో ధైర్యాన్ని పెంచాలి, అలాగే మీ సహకారం, మద్దతును ఆమెకు ఎల్లవేళలా ఉండేటట్లు చూసుకోవాలి. డాక్టర్‌గారూ... నాది చిత్రమైన సమస్య. డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గరకు వెళ్లలేక మీకు ఇలా రాస్తున్నాను. నాకు 52 ఏళ్లు. అయిదేళ్ల కిందటే మెనోపాజ్ వచ్చింది. అప్పటి నుంచి నా బ్రెస్ట్స్ చుట్టూ వెంట్రుకలు వచ్చాయి మొగవాళ్లలాగా. చాలా సిగ్గుగా ఉంది, కాన్సరేమోనని భయంగా ఉంది. నొప్పి దురద వంటివేమీ లేవు. – పేరు రాయలేదు, వినుకొండ. ఆడవారిలో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల వారిలో స్త్రీ లక్షణాలు ఉంటాయి. అలాగే అడ్రినల్ గ్రంథి నుంచి టెస్టోస్టిరాన్ అనే పురుష హార్మోన్ కొద్దిగా విడుదలవుతుంది. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. అప్పటి వరకు తగ్గి ఉన్న టెస్టోస్టిరాన్ హర్మోన్ ప్రభావం పెరుగుతుంది. దీని వల్ల మెనోపాజ్ దశలో 50 శాతం ఆడవారిలో ముఖం మీద, పై పెదవి పైన, గడ్డంపైన అలాగే రొమ్ముల మొన అంటే నిపుల్ చుట్టూ వెంట్రుకలు చిక్కగా, పొడవుగా పెరుగుతాయి. దాని వల్ల ఎలాంటి ప్రభావం లేదు. కాకపోతే ఈ సమస్యవల్ల సిగ్గు, మొహమాటం, ఆందోళన, ఇబ్బంది, ఆత్మనూన్యతా భావం వంటివి ఏర్పడవచ్చు. కావాలనుకుంటే రొమ్ముపైన వెంట్రుకలను ట్రిమ్మింగ్, షేవింగ్, కత్తిరించడం వంటి పద్ధతులను పాటించవచ్చు. ఈ వయసులో వెంట్రుకలు మరీ ఎక్కువగా, త్వరగా పెరుగుతుంటే, టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే సమస్యలు అంటే అడ్రినల్ గ్రంథి, ఓవేరియన్ ట్యూమర్లు, కుషింగ్స్ సిండ్రోమ్ వంటివి ఉన్నాయా అని డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయ్యించుకొని, సమస్య ఉంటే దానికి చికిత్స తీసుకోవడం మంచిది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఇలాంటి ప్రక్రియ ఉంటుందా?
మేడమ్.. మొన్న ఏదో హిందీ సినిమాలో ఓ మాట విన్నాను. ‘‘హైమన్’ రీ స్టిచ్ చేయించుకున్నప్పటి నుంచి అనుభూతిలేకుండా పోయింది’ అని. అసలు ఇలాంటి ఓ ప్రక్రియ ఉంటుందా? నా అజ్ఞానానికి మన్నించగలరు. – ప్రసన్న లక్ష్మి, సూరత్ యోనిని కప్పి ఉంచే హైమన్ పొర ఒక మెత్తని రబ్బర్ లాగా ఉండి అందులో చిన్న రంధ్రం ఉండి, దాని ద్వారా మ్యూకస్ స్రావాలు, బ్లీడింగ్ (పీరియడ్) బయటకు వస్తాయి. చాలా మందికి కలయిక తర్వాత, కొంత మందిలో అతిగా సైక్లింగ్, వ్యాయామాలు, హస్తప్రయోగం వంటి వాటివల్ల యోనిని కప్పి ఉంచే హైమన్ పొర చిరుగుతుంది. ఈ కాలంలో చాలా మంది లివింగ్ ఇన్ (సహజీవనం) రిలేషన్లో ఉంటున్నారు. తర్వాత వేరే వాళ్లను పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకొని మళ్లీ పెళ్లి చేసుకోవడం, కొంత మంది వింత కోరికలతో యోనిపైన మళ్లీ హైమన్ పొరను ఏర్పరచుకొని కొత్తదనాన్ని ఆస్వాదించాలని ఆశపడతారు. దీని కోసం వచ్చిందే హైమన్ రీస్టిచ్. ఈ మధ్య కాలంలో దీనికి బాగా ప్రాచుర్యం పెరిగింది. చాలా మంది దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పద్ధతిలో మత్తు ఇచ్చి, యోని భాగంలో చిరిగిన హైమన్ పొరని మరలా దగ్గరకు తీసి కుట్టడం జరుగుతుంది. అలా కుదరకపోతే, వారి శరీరంలో ఎక్కడ నుంచి అయినా మ్యూకస్ పొరను తీసుకొని, యోని భాగంలో అమర్చడం జరుగుతుంది. అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. (కొన్ని మతాల్లో, కొందరి సంప్రదాయాల్లో హైమన్ పొరను ఆడవారి కన్యత్వానికి ముడి పెట్టడం జరుగుతుంది.) చాలా మందికి సైక్లింగ్, ఎక్కువ వ్యాయామాలు, టాంపూన్స్ వాడకం వంటి వాటివల్ల హైమన్పొర చిరగడం జరుగుతుంది. అలాంటప్పుడు దానిని వేరేగా ఆలోచించడం, అనుమానించడం జరుగుతుంది. కొందరు ఈ సమస్య వల్ల కూడా భయంతో హైమన్ రీస్టిచ్ చేయించుకుంటారు. చాలా అరుదుగా కొందరిలో హైమన్ పొర ఉండకపోవచ్చు. మా అత్తమ్మ వయసు 60 ఏళ్లు. ఆమెకు 42వ ఏటనే మెనోపాజ్ వచ్చింది. తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు. అయితే ఎనిమిది నెలల కిందట హఠాత్తుగా వైట్ డిశ్చార్జ్ అవడం మొదలుపెట్టింది వాసన, దురదతో. హిస్ట్రెక్టమీ చేశారు. బయాప్సీ కూడా పంపారు. అంతా నార్మలే అని చెప్పారు. మెనోపాజ్ వచ్చాక పద్దెనిమిదేళ్లకు అలాంటి సమస్యలు తలెత్తుతాయా? మెనోపాజ్ అంటే అలాంటి వాటన్నిటి నుంచీ విముక్తి చెందినట్టే కదా? – సింధుజాత, మంత్రాలయం అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ఆడవారిలో 40 సంవత్సరాలు దాటిన తర్వాత మెల్లగా తగ్గిపోతూ వచ్చి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొన్ని సంవత్సరాలకు పూర్తిగా తగ్గిపోతుంది. ఆ సమయంలో పీరియడ్స్ రాకపోతే, ఆ దశను మెనోపాజ్ దశ అంటారు. మెనోపాజ్ వచ్చినంత మాత్రాన, తెల్లబట్ట అవ్వదు అని ఏమీలేదు. యోనిలో ఇన్ఫెక్షన్స్, గర్భాశయ ముఖద్వారంలో పాలిప్స్, పుండ్లు, అరుదుగా క్యాన్సర్ వంటి ఎన్నో కారణాల వల్ల మెనోపాజ్ తర్వాత ఏ వయసులోనైనా ఈ సమస్యలు రావచ్చు. ఈ దశలో యోని పొడిగా మారి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉంటే కూడా ఈ సమస్యలు రావచ్చు. కేవలం వాసన, దురదతో కూడిన వైట్ డిశ్చార్జ్ అయినంత మాత్రాన హిస్ట్రెక్టమీ అంటే గర్భాశయాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు, స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, ప్యాప్ స్మియర్ పరీక్ష ద్వారా, అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, ఇంకా ఏదైనా కారణముందా, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా అని పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకొని, కేవలం ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స తీసుకొని చూడవచ్చు. గర్భాశయంలో కంతులు, క్యాన్సర్ వంటివి నిర్ధారణ అయితేనే గర్భసంచి తొలగించవలసి ఉంటుంది. -
భయంతో వణికిపోతోంది...
మా చెల్లికి 26 ఏళ్లు. తొలి చూలులో ఎనిమిదినెలలకే బిడ్డ పుట్టి చనిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్. ఏడవ నెల. మునుపటి అనుభవానికి తోడు కరోనా కాలం.. భయంతో వణికిపోతోంది. చిన్నగా తలనొప్పి వచ్చినా, కాస్త దగ్గినా, తుమ్మినా ఏదో అయిపోతోందనే మానసిక స్థితిలో పడిపోయింది. కిందటి నెల చెకప్‌లో కూడా వెయిట్ పెరగలేదు. బిడ్డ గ్రోత్ కూడా అంతగా లేదని చెప్పారట డాక్టర్. ఇంకా కుంగిపోతోంది. డాక్టర్ గారూ.. ఏడో నెలలో పుట్టిన బిడ్డలు బతికిన దాఖలా ఉంది. కాని ఎనిమిదో నెలలో పుడితే ఎందుకు చనిపోతారు? మా చెల్లికి ధైర్యం, నా సందేహానికి జబాబు ఇవ్వగలరు. – కీర్తి చందన, పుణె 9 నెలల కంటే (36–37 వారాలు) ముందే కాన్పు అవ్వడాన్ని ప్రీటర్మ్ డెలివరీ అంటారు. గర్భాశయ ముఖద్వారం, చిన్నగా, లూజ్‌గా ఉండటం, గర్భాశయంలో పొరలు, లోపాలు, ఇన్ఫెక్షన్లు, రక్తహీనత వంటి అనేక కారణాల వల్ల ప్రీటర్మ్ డెలివరీ అవ్వవచ్చు. కొందరిలో బీపీ బాగా పెరగడం, ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం, బిడ్డకు రక్తసరఫరా సరిగా అందక, గర్భంలో బిడ్డ సరిగా పెరగకపోతే కూడా 7వ నెల, 8వ నెలలో బిడ్డను బయటకు తీయడం జరుగుతుంది. కాన్పు చేసి బిడ్డను ఎన్సీయూలోని ఇంక్యుబేటర్‌లో పెట్టి, కడుపులో ఉన్న వాతావరణం లాగా, అందులో బిడ్డకు ఆక్సిజన్, ఆహారం, అవసరాన్ని బట్టి ఇతర మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్న చికిత్స. బిడ్డ శరీరతత్వాన్ని బట్టి ఇంకా వేరే కారణాలను బట్టి, చికిత్స వారికి పనిచేసేదానిని బట్టి 7వ నెల అయినా, ఎనిమిదో నెల అయినా, బిడ్డ సరిగా పెరిగి, ఇన్ఫెక్షన్స్ని తట్టుకొని, పసిరికలను తట్టుకొని బయటపడాల్సి ఉంటుంది. అది ఏ బిడ్డలో ఎలా ఉంటుంది అనేది కచ్చితంగా ముందే చెప్పడం కష్టం. బిడ్డ తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత బిడ్డలో ఊపిరితిత్తులు, మిగతా అవయవాల పనితీరు మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే బిడ్డ బరువు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి 7వ నెలలో కాన్పు కంటే, 8వ నెలలో బిడ్డ పుడితేనే బిడ్డ బరువు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాల పనితీరు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆ బిడ్డ బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంక్యుబేటర్‌లో 7వ నెలలో పుట్టిన బిడ్డ కంటే తక్కువ రోజులు ఉంచితే సరిపోతుంది. ఖర్చు కొద్దిగా తగ్గుతుంది. చాలా మందిలో 7వ నెలలో పుట్టే బిడ్డ బతుకుతుంది, 8వ నెలలో అయితే బతకదు అనే ఆలోచనలో ఉంటారు. కాని ఇది సరికాదు, అపోహ మటుకే. ఒక సారి 7వ నెలలో కాన్పు అయితే, మళ్లీ కాన్పులో అలానే ముందుగా అవ్వాలని ఏమిలేదు. కాకపోతే ముందు కాన్పులో 7వ నెలలో ఎందుకు అయ్యింది అనే కారణాలను విశ్లేషించుకొని, వాటిని బట్టి ఆ అంశాలు ఈ గర్భంలో కూడా ఏమైనా కనిపిస్తున్నాయా అని చూసుకొని, దానిని బట్టి కొందరిలో 5వ నెలలో గర్భసంచి ముఖద్వారానికి కుట్లు వేయడం జరుగుతుంది. కొందరిలో వెజైనల్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ను పరీక్ష చేసుకుంటూ, దానికి తగ్గ మందులు వాడటం, విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం, గర్భసంచి కండరాలు వదులుగా ఉండటానికి ప్రొజస్టెరాన్ మాత్రలు, ఇంజెక్షన్లు ఇవ్వడం వంటివి చేయడం జరుగుతుంది. మీ చెల్లి మొదటి కాన్పు చేదు అనుభవాలతో భయపడి, మానసిక ఒత్తిడిలో ఉంది. మానసిక ఒత్తిడి వల్ల కూడా కడుపులో బిడ్డ సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి డాక్టర్ దగ్గరకి మామూలుగా కంటే తరచుగా చెకప్‌కు తీసుకువెళ్లండి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం ఆమెకు ఎంతో అవసరం . దీని వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. బిడ్డ పెరగడానికి ప్రోటీన్స్ ఉండే ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, గుడ్లు, మాంసాహారం, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా ఇవ్వండి. తనను ఆలోచనల నుంచి దూరంగా ఉంచడానికి, తనకు నచ్చిన పుస్తకాలను చదవడం, మ్యూజిక్ వినడం, కామెడీ సినిమాలు చూడటం, సరదాగా అందరూ కబుర్లు చెప్పుకోవడం లాంటివి చేయడం మంచిది. డాక్టర్ సలహా మేరకు అవసరమైతే బిడ్డ ఊపిరితిత్తులు పరిపక్వం చెందడానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. సమస్య వస్తుందని, దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉండటం వల్ల ఏమీ లాభం ఉండదు. పైగా డాక్టర్ చెప్పినట్లు తల్లి బరువు, బిడ్డ బరువు సరిగా పెరగక ఇంకా వేరే ఇబ్బందులను ఎదుర్కోనవలసి ఉంటుంది. దాని కంటే పాజిటివ్‌గా ఆలోచిస్తూ, డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ, పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే చాలా వరకు మంచే జరుగుతుంది. తీవ్రవమైన మానసిక ఒత్తడికి గురవడం వల్ల కూడా, హార్మోన్లలో మార్పులతో నొప్పులు వచ్చి ప్రీటర్మ్ డెలవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక వేళ సమస్య వచ్చి ముందుగా కాన్పు జరిగినా ఏమి చెయ్యాలి, దానిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలి కాని, సమస్యరాక ముందే, వస్తుందేమో అని భయపడి, తను సరిగా తినకుండా, బిడ్డ సరిగా పెరగకుండా, నెలలు నిండకుండా కాన్పు అయితే, అప్పుడు బిడ్డ బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే తను పైన చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే బిడ్డ బరువు కొద్దిగా పెరిగితే, నెలలు నిండకుండా పుట్టినా, ఇంక్యుబేటర్‌లో ఆ బిడ్డ సమస్యలను ఎదుర్కొనే శక్తి తెచ్చుకుంటుంది. దాని వల్ల బతికే అవకాశాలు చాలా పెరుగుతాయి. ఇప్పుడున్న అత్యాధునిక మెషిన్లు, చికిత్సల వల్ల పిల్లల ఆసుపత్రుల్లో 6వ నెలలో పుట్టిన బిడ్డ కూడా పెరిగి బయటపడే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
చాలా నొప్పిగా ఉంటోంది...
నాకు 25 ఏళ్లు. పెళ్లయి రెండేళ్లవుతోంది. ఇంకా పిల్లల్లేరు. ఈ మధ్య వెజైనా చాలా నొప్పిగా.. లాగినట్టుగా ఉంటోంది. సెక్స్ తర్వాత ఈ బాధ మరీ ఎక్కువగా ఉంటోంది. ఎందుకో అర్థం కావట్లేదు. పిల్లల కోసం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. నొప్పిగా ఉన్నప్పుడు కూర్చోలేను.. నడవలేను. అప్పుడెప్పుడో నెట్లో చదివాను.. వెజైనా క్యాన్సర్ కూడా ఉంటుందని. నాది క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే కాదు కదా? భయంగా ఉంది. నాకు వచ్చిన సమస్య ఏంటో వివరించండి. – ఎన్. పరిమళ, మందమర్రి, తెలంగాణ యోనిలో ఇన్ఫెక్షన్ వల్ల కాని, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ సమస్య ఉన్నప్పుడు గర్భాశయం కింద భాగంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నా, యోనిలో కంతులు, అరుదుగా క్యాన్సర్ ఇంకా ఎన్నో కారణాల వల్ల వెజైనాలో నొప్పి రావచ్చు. నెట్లో ఒక లక్షణం కోసం వెతికితే సవాలక్ష సమాధానాలు దొరుకుతాయి. అంతమాత్రాన అవన్నీ మనకే ఉన్నట్లు కాదు. నీకు నువ్వు అంత భయపడుతూ, ఇబ్బంది పడుతూ ఉండే దానికంటే ఒకసారి గైనకాలిజిస్ట్ను సంప్రదించి నీ సమస్యను వారికి వివరిస్తే, వారు నీకు స్పెక్యులమ్ పరీక్ష, బైమాన్యువల్ పెల్విక్ పరీక్ష చేసి, ఇంకా అవసరమనుకుంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్, ప్యాప్ స్మియర్ వంటి పరీక్షలు చేసి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని దానిని బట్టి చికిత్సను సూచిస్తారు. అలాగే పిల్లలు కలగకపోవడానికి గల కారణాలను కూడా తెలుసుకొని, దానికి కూడా సలహాలను అందజేస్తారు. సాధారణంగా యోనిలో క్యాన్సర్ ఉన్నప్పుడు తెల్లబట్ట ఎక్కువ అవ్వడం, అలానే కొద్దికొద్దిగా బ్లీడింగ్ కనిపించడంతో పాటు నువ్వు చెప్పిన లక్షణాలు కూడా కనిపిస్తాయి. కాని ఇది సాధారణంగా 50–60 సంవత్సరాలు పైబడ్డ వారిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంత చిన్న వయసులో చాలా చాలా అరుదుగా మాత్రమే వస్తుంది. కాబట్టి కంగారు పడకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించు. డాక్టర్ గారూ.. మా అబ్బాయికి పదకొండేళ్లు. ఇంటి పని పట్లే ధ్యాస ఎక్కువ. ఆడపిల్లలతోనే స్నేహం చేస్తున్నట్లూ గమనించాం. అయితే అమ్మాయిల్లా ముస్తాబు కావడం వంటివి లేవు కాని.. వాడి చెల్లెలికి జెడ వేయడం, బొట్టు కాటుక పెట్టడం వంటివి చాలా ఇష్టంగా, శ్రద్ధగా చేస్తూంటాడు. వాడి తీరుతో మా కంటి మీద కునుకుండట్లేదు. ఇప్పుడే డాక్టర్‌కు చూపించమంటారా? దీన్నెలా అర్థం చేసుకోవాలో సలహా ఇవ్వగలరు. – కొంగర భూపతి, ఆదోని మీ అబ్బాయికి ఆడపిల్లలలో ఉండే ఆలోచనా ధోరణి, ఆసక్తి వంటివి ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇంట్లో, బయట చుట్టుపక్కల ఉండే మనుషులు, వాతావరణం, పెరిగిన తీరు వంటి వాటి వల్ల కూడా ప్రభావం అయ్యి అలా ప్రవర్తిస్తుండవచ్చు. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, హార్మోన్లలో మార్పుల వల్ల కూడా ప్రవర్తనలో తేడా ఉండవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ముందుగానే ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదిస్తే, ఈ మార్పులు కేవలం మానసిక ఆలోచనలో తేడా వల్లనా లేదా ఏమైనా హార్మోన్లలో లోపాలు, జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు చేసి, అతడికి కౌన్సెలింగ్ చేసి, సమస్య ఎక్కడ ఉందో నిర్ధారణ చేసుకొని అవసరమైన చికిత్సను అందజేస్తారు. మేడమ్.. మా అమ్మాయికి పదమూడేళ్లు. నాలుగు నెలల కిందటనే మెచ్యూర్ అయింది. అయితే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఆ అమ్మాయి గొంతు కూడా మారిపోయింది. బొంగురుగా, కాస్త అబ్బాయిల గొంతులా వినిపిస్తోంది. ఎందుకో తెలియట్లేదు. ఇదేమైనా సమస్యా? టెస్ట్లేమైనా చేయించాలా? మాకు ఆందోళనగా ఉంది. దయచేసి చెప్పగలరు. – అనంతరామకృష్ణ, వేములవాడ కొందరు అమ్మాయిలలో హార్మోన్లలో తేడా వల్ల గొంతులో ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్ సమస్య, అసిడిటీ సమస్య వంటి అనేక కారణాల వల్ల గొంతు బొంగురుగా మారడం జరుగుతుంది. కొందరిలో అనేక కారణాల వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగడం వల్ల కూడా గొంతు బొంగురుపోయి మగ గొంతులాగా ఉండవచ్చు. మీ అమ్మాయి బరువు ఎంత ఉన్నది అనేది రాయలేదు. కొందరిలో అధిక బరువు వల్ల, అండాశయాల్లో నీటి బుడగలు ఉండటం, దాని వల్ల మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే ఆండ్రోజన్ హార్మోన్స్ ఆడవారిలో ఎక్కువగా విడుదలవ్వడం, వాటి ప్రభావం వల్ల అబ్బాయి గొంతులా వినిపించవచ్చు. ఒకసారి ఈఎన్టీ డాక్టర్‌ను కలసి గొంతులో సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. తర్వాత ఎండొక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి ఏ హార్మోన్ తేడా ఉందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేసి, సమస్యను బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
మూడు రోజుల్లో అయిదుసార్లు ఫిట్స్
మా పాపకు పన్నెండేళ్లు. మూడు వారాల కిందట మెచ్యూర్ అయింది. అయితే ఆ మూడు రోజుల్లో అయిదుసార్లు ఫిట్స్ వచ్చాయి అమ్మాయికి. అంతకు ముందెన్నడూ లేదు. ఈఈజీ తీస్తే కూడా నార్మలే వచ్చింది. ఎపిలెప్సీ అంటున్నారు. ఎపిలెప్సీ ఏ వయసులో అయినా బయటపడొచ్చా? పుట్టుకతో ఉండదా? మాది మేనరికం. దానివల్లేమైనా మా పాపకు ఈ సమస్య వచ్చిందంటారా? జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందా? భవిష్యత్‌లో మా పాప పెళ్లి, పిల్లలతో నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా.. దయచేసి చెప్పగలరు. – పి.లత, బళ్లారి పీరియడ్స్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కొంతమందిలో ఫిట్స్ రావచ్చు. దీనిని ఛ్చ్టి్చఝ్ఛnజ్చీ∙్ఛpజీ ్ఛpటy అంటారు. పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టరాన్ హార్మోన్ తగ్గడం వల్ల మెదడులో కొన్ని నాడులు ఉత్తేజం చెంది, ఫిట్స్ రావచ్చు. కొందరిలో పీరియడ్స్ మొదలైన 14 రోజులకు, అండం విడుదలయ్యే సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల ఈ సమయంలో ఫిట్స్ రావచ్చు. ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎపిలెప్సీ వస్తుందో చెప్పడం కష్టం. ఒక్కొక్కరిలో అనేక కారణాల వల్ల రావచ్చు. ఒకసారి మీ పాపకు న్యూరోఫిజీషియన్‌ను సంప్రదించి అవసరమైన ఎంఆర్ఐ స్కాన్, ఇతర రక్త పరీక్షలు చేయ్యించుకొని, ఫిట్స్ రావడానికి కల కారణాలు అంటే మెదడులో కంతులు, రక్తంలో షుగర్ లెవల్స్ తక్కువ ఉండటం, ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి వంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని దానిని బట్టి యాంటీ ఎపిలెప్టిక్ మందులతో పాటు, ఇతర చికిత్సా విధానాలను సూచిస్తారు. అవసరమైతే పీరియడ్స్ సమయంలో ఫిట్స్ మందుల మోతాదును పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎపిలెప్సీ మేనరికం వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది అనేది చెప్పడం కష్టం. మందులు జీవితాంతం వాడాలా, మూడు, నాలుగు సంవత్సరాలు వాడి ఆపవచ్చా అనేది, పరీక్షలు రిపోర్ట్‌లను బట్టి మందులు వాడినా, మళ్లీ ఫిట్స్ వస్తున్నాయా అనేదాన్ని బట్టి న్యూరాలజిస్ట్ డాక్టర్ నిర్ణయిస్తారు. మందులు సరిగా వాడుతూ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే పెళ్లి, పిల్లలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. మామూలు వాళ్లతో పోలిస్తే, వీరికి ఎక్కువ జాగ్రత్తలు, చెకప్‌లు అవసరం ఉంటుంది. మేడం.. నాకు 48 ఏళ్లు. బహిష్టు ఆగిపోయి రెండేడేళ్లయింది. కాని నెల రోజులుగా వైట్ డిశ్చార్జ్ అవుతోంది. దురద కాని, మంట కాని ఏమీలేదు. కాని చాలా చిరాగ్గా, నీరసంగా ఉంటోంది. క్యాన్సరేమోనని భయంగా ఉంది. పరీక్ష చేయించుకోవడం అవసరమంటారా? గైనకాలజిస్ట్‌కి చూపించుకోవాలా? క్యాన్సర్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలా? – గరిమెళ్ల సింధు, గణపవరం పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల యోనిలోని మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి ఆమ్లగుణం తగ్గిపోతుంది. దాని వల్ల యోనిలో ఇన్ఫెక్షన్స్ వచ్చి తెల్లబట్ట ఉండవచ్చు. కొందరిలో దురద, మంట వాసనతో ఉంటుంది. మీకు అయితే ఇవి ఏవీ లేవు అంటున్నారు. కొందరిలో గర్భాశయ ముఖద్వారంలో పుండు, చిన్న పాలిప్స్, అరుదుగా క్యాన్సర్ వంటివి ఉన్నా నీళ్లలాగా తెల్లబట్ట అవ్వవచ్చు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, వారు స్పెక్యులమ్ పరీక్ష ద్వారా కనిపించే సమస్యలు ఏమైనా ఉన్నాయా చూసి, అవసరమైతే ప్యాప్‌స్మియర్ పరీక్ష చేస్తారు. ఇందులో ఏమైనా సందేహం ఉంటే సర్వైకల్ బయాప్సీ చేసి క్యాన్సర్ ఏమైనా ఉంటే నిర్ధారణ చేస్తారు. సమస్యను బట్టి ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగ్గ యాంటీబయోటిక్, యాంటీఫంగల్ మందులు ఇస్తారు. అవసరమనుకుంటే ఈస్ట్రోజన్ క్రీమ్‌లను సూచిస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని ట్యూబ్స్‌లో వాపు, నీరు గర్భాశయంలో కంతులు వంటివి ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తుంది. మేడం.. మా పాపకు పధ్నాలుగేళ్లు. ఆ పిల్లకు కుడివైపు బ్రెస్ట్ పెద్దగా, ఎడమవైపు బ్రెస్ట్ చిన్నగా ఉంది. ఆ తేడా చాలా స్పష్టంగా కనపడుతోంది. దాంతో చున్నీ లేకుండా బయటకు వెళ్లట్లేదు. నలుగురిలో కలవడానికీ ఇబ్బంది పడ్తోంది పాప. ఆ సమస్యతో చదువు మీదా ధ్యాస పెట్టట్లేదు. ఏం చేయాలో సూచించగలరు. – లక్ష్మీప్రసన్న, వర్నీ అందరిలో అన్నీ అవయవాలు సరిగా ఉండకపోవచ్చు. కొందరిలో రెండు బ్రెస్ట్‌లు ఒకే సైజులో ఉండకపోవచ్చు. అవి పెరిగే క్రమంలో అలా ఒక బ్రెస్ట్ పెద్దగా, రెండోది చిన్నగా కొంతమందిలో అలా ఉండిపోతాయి. కొందరిలో కొద్దిగానే తేడా ఉంటుంది. కొందరిలో బయటకు కనిపించే అంత తేడా ఉంటుంది. ఇప్పుడు రెండు సమానంగా ఉండటానికి సహజంగా ఏమి చెయ్యలేం. చిన్నగా ఉన్న రొమ్మును రోజు గుండ్రంగా మసాజ్ చేస్తూ ఉండటం వల్ల రక్త ప్రసరణ పెరిగి కొద్దిగా పరిమాణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వయసులో పిల్లలలో చిన్న సమస్యను కూడా పెద్దగా ఊహించుకుంటారు. మీరు మీ పాపకు ధైర్యంగా చెప్పండి ఒక్కొక్కరిలో ఉండే పెద్ద పెద్ద లోపాలు వివరించండి. వాటితో పోలిస్తే ఇది అసలు ఏమి లేదు అని మనోధైర్యాన్ని పెంపొందించండి. ప్యాడెడ్ బ్రాస్ వేసుకోవడం వల్ల చాలా వరకు ఈ తేడా బయటకు తెలియదు. మరీ తప్పదు అంటే ఒకసారి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోండి. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఇదేమైనా ట్యూమారా?
నా వయస్సు 19. ఎత్తు 5.6 బరువు 42. అయితే నాకూ 5 సంవత్సరాల నుండి రొమ్ములో కొంత బాగం గట్టిగా ఉంది కదులుతూ ఉంటుంది కూడా. నేను చాలా సన్నగా ఉంటాను. నాకు ఛాతీ చిన్నగా ఉంటుంది. పీరియడ్ రెగ్యులర్‌గానే వస్తుంది కానీ, కడుపు నొప్పి ఉంటుంది. తెలిసిన డాక్టర్ని అడిగితే పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులకు పోతుంది అన్నారు. కానీ కొన్ని నెలల నుండి నొప్పి ఎక్కువగా ఉంటుంది. మసాజ్ చేయడం వల్ల కొంతకాలం ఉపశమనం లభిస్తుంది. నేను హాస్టల్లో ఉండి చదువుతున్నా. అక్కడ ఫుడ్ బాగుండదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కడుపు నొప్పి కోసం హోమియోపతి మందులు 3 నెలలు వాడాను. నా సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ఏమయినా ట్యూమర్ అయ్యే అవకాశం ఉందా?? సమస్య ఏంటో దానికి కారణం, చికిత్స తెలియచేయాలని మనవి. – శ్రీ విద్య. కరీంనగర్. నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, నీకు రొమ్ములో ఫైబ్రోఎడినోమా అనే ప్రమాదం లేని గడ్డ ఉన్నట్లు అనుమానంగా ఉంది. ఇందులో గడ్డ చేతికి తగులుతూ, రొమ్మును తాకినప్పుడు అటు ఇటూ కదులుతూ ఉంటుంది. అందులో నువ్వు సన్నగా ఉండి, ఛాతీ చిన్నగా ఉండడం వల్ల ఇది బాగా తెలుస్తున్నట్లుంది. దీని గురించి నువ్వు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఒకసారి రొమ్ము అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే గడ్డ పరిమాణం, లక్షణాలు తెలుస్తాయి. గడ్డ పరిమాణం బట్టి కొందరికి కొన్ని మందుల ద్వారా గడ్డ కరిగి దాని సైజు తగ్గుతుంది. అంతేకాని పూర్తిగా కరిగిపోతుందని చెప్పడం కష్టం. మరీ బాగా పెద్దగా ఉంటే ఆపరేషన్ ద్వారా తొలగించవలసి ఉంటుంది. పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్లో మార్పుల వల్ల బ్లీడింగ్ బయటకు వచ్చేటప్పుడు గర్భాశయ కండరాలు కుదించుకున్నట్లయి పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. దీని తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. కొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్ గడ్డలు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఇన్ఫెక్షన్లు వంటి ఎన్నో సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో, నడుములో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన స్కానింగ్ లాంటి పరీక్షలు చేయించుకొని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. సమస్య ఏమి లేకపోతే నొప్పి ఎక్కువగా ఉన్న రోజులు రోజుకు రెండు సార్లు నొప్పి నివారణ మాత్రలు వేసుకోవచ్చు. పొత్తి కడుపు మీద కొద్దిగా వేడినీటితో కాపడం పెట్టుకోవడం, కొద్దిగా మసాజ్, ప్రాణాయామం వంటి చిట్కాలు పాటించవచ్చు. నా పెళ్లయి నాలుగేళ్లవుతోంది. నా వయసు 31, మా వారి వయసు 33. పిల్లల కోసం ప్లానింగ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతోంది. కన్సీవ్ కాకపోయే సరికి డాక్టర్‌ను సంప్రదించాం. పరీక్షల్లో నా ఎగ్ కౌంట్ తక్కువగా ఉందని తేలింది. మందులతో కౌంట్ పెరుగుతుందా? ఐవీఎఫ్‌కి వెళ్లాలా? ఆ ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్ అని విన్నాను. పరిష్కారం సూచించగలరు. – ప్రతిభ, భువనేశ్వర్ సాధారణంగా తల్లి గర్భంతో ఉన్నప్పుడు పరిపక్వం కాని అండాలు 7 లక్షలు ఉంటాయి. అవి కొన్ని నశించిపోతూ బిడ్డ పుట్టేటప్పటికి 4 లక్షలు మిగులుతాయి. వీటిలో కూడా రజస్వల అయ్యేటప్పటికి ఒక్కొక్కరి శరీరతత్వం, జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల ప్రభావం వల్ల చాలా నశించిపోయి లక్ష నుంచి 1.5 లక్షలవరకు మిగులుతాయి. వీటిలో రజస్వల అయినప్పటి నుంచి ప్రతి నెలా ఒక అండం పరిపక్వత చెంది, అది విడుదల అవుతుంది. ఒక అండం పెరిగి లోపల అనేక అండాలు పెరగడానికి ప్రయత్నించి ప్రతినెలా అవి నశించిపోతూ ఉంటాయి. అలా అనేక అండాలు ఉన్నా, జీవితకాలంలో దాదాపు 400 అండాలు మాత్రమే పరిపక్వత చెంది పెరిగి విడుదలయ్యి, పిల్లలు పుట్టడానికి ఉపయోగపడతాయి. 35 సంవత్సరాలు దాటేకొద్దీ అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోవడం మొదలవుతుంది. కొందరిలో శరీరతత్వం, ఇంకా అనేక కారణాల వల్ల 30 సంవత్సరాలకే, కొందరిలో ఇంకా చిన్న వయసుకే అండాల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. యోని నుంచి చేసే ట్రాన్స్ రీజియనల్ స్కానింగ్ ద్వారా గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాల్లో అండాల సంఖ్య ఎంత ఉంది (ఎంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్) అనేది నిర్ణయించడం జరుగుతుంది. అలాగే ఏఎమ్‌హెచ్ అనే రక్త పరీక్షద్వారా ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అనేది నిర్ణయిస్తారు. కొందరిలో ఎగ్కౌంట్ తక్కువ ఉన్నా, కొంత కాలం ప్రతి నెలా అండం విడుదలవుతుంది. కొందరిలో అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు హార్మోన్ మందులు, ఇంజెక్షన్ల ద్వారా ఉన్న ఎగ్కౌంట్లో అండం పెరుగుదలకు ప్రయత్నించడం జరుగుతుంది. 40–50 శాతం మందిలో ఈ మందుల ప్రభావం వల్ల అండాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలా ప్రయత్నించినా కాని పరిస్థితిలో అండాలు పెరగడానికి చాలా ఎక్కువ మోతాదులో హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి, ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) పద్ధతి ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ పద్ధతిలో కూడా అండాలు ఎక్కువ పెరగకపోవచ్చు. అలాంటప్పుడు వేరే దాతల నుంచి అండాలను సేకరించి భర్త వీర్యకణాలను వాటిలోకి పంపి ఫలదీకరణ చేసి, తద్వారా వచ్చిన పిండాలను మీ గర్భాశయంలోకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు కంగారుపడకుండా మూడు నెలలు మందులు, ఇంజెక్షన్ల ద్వారా ప్రయత్నించి, కాకపోతే పైన చెప్పిన పద్ధతులను అనుసరించవలసి ఉంటుంది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
పాపకు వైట్డిశ్చార్జా?
నెల రోజుల కిందట ప్రసవించాను. పాప. అయితే పది రోజులగా పాపకు వైట్ డిశ్చార్జ్ అవుతోంది. కరోనా వల్ల ఆసుపత్రికి వెళ్లలేక ఫోన్లోనే డాక్టర్‌ను సంప్రదిస్తే స్కానింగ్ చేయాలంటున్నారు. మా అమ్మమ్మ ఏమో.. ఇది సర్వసాధారణం ఏంకాదు అంటోంది. కాని నాకు భయంగా ఉంది. అంత చిన్న పాపకు వైట్ డిశ్చార్జా? కారణమేమై ఉండొచ్చో చెప్పగలరు. – టి. సంధ్యా కిరణ్, తిరుపతి తల్లి కడుపులో ఉన్నంత కాలం పాపపైన తల్లిలోని ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం ఉంటుంది. పుట్టిన తర్వాత తల్లి యొక్క హార్మోన్ ప్రభావం ఉన్నట్లుండి ఆగిపోవడం వల్ల, కొందరిలో పుట్టిన పాపల్లో కొన్ని రోజులు తెల్లబట్ట అవ్వడం సహజం. కొందరిలో కొద్దిగా బ్లీడింగ్ కూడా అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. తెల్లబట్టలో వాసన వస్తుందా, జనేంద్రియాల చుట్టు పక్కలా ఎర్రగా ఉందా, మూత్రం వెళ్లేటప్పుడు పాప బాగా ఏడుస్తుందా గమనించుకోవాలి. కొన్ని సార్లు మోషన్ చేసిన తర్వాత చాలా సేపు డైపర్ మార్చకుండా ఉన్నప్పుడు, క్రిములు ముందుకు పాకి, యోని భాగం దగ్గరకు చేరి ఇన్ఫెక్షన్కు కారణం కావచ్చు. అలాంటప్పుడు తెల్లబట్టలో దురద, యోని చుట్టూ ఎర్రగా ఉండటం, వాయడం వంటివి జరగవచ్చు. డైపర్ మార్చేటప్పుడు శుభ్రమైన తడిబట్ట లేదా వెట్ వైప్స్‌తో ముందు నుంచి వెనకకి తుడవాలి. జనేంద్రియాల వద్ద కూడా మలం అంటుకొని ఉంటే, ఆల్కహాల్, వాసనలేని వెట్వైప్స్తో శుభ్రం చేయాలి. మా పెళ్లయి సెవెన్ మంత్స్ అవుతోంది. పెళ్లవగానే వన్ మంత్‌కే నేను కెనడా వచ్చేశాను. తను హైదరాబాద్‌లోనే ఉంటోంది. తనతో నా ప్రాబ్లం ఏంటంటే ఆమె బాడీ ఓడర్. కరోనా వల్ల ప్రస్తుతం దూరదూరంగా ఉన్నాం. తర్వాతైనా తను నా దగ్గరకు రావల్సిందే కదా. చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎలా డీల్ చేయాలో చెప్పగలరు ప్లీజ్... – సాయి ప్రణీత్, టొరొంటో ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి వారిలో జరిగే రసాయన క్రియలు, హర్మోన్స్‌లో మార్పులు లాంటి అనేక కారణాల వల్ల ఒక్కొక్కరి నుంచి వేరే వేరే వాసనలు వస్తుంటాయి. కొందరిలో ఎక్కువగ చెమట పట్టడం, అధిక బరువు, ఇన్ఫెక్షన్స్, చంకలలో, జనేంద్రియాల దగ్గర రోమాలు ఎక్కువగా ఉండి వాటిలో ఇన్ఫెక్షన్స్, నోటి దుర్వాసన, తలలో జిడ్డు, చుండ్రు, తినే ఆహారం వల్ల, నీరు సరిగా తీసుకోకపోవడం, ఇంకా అనేక కారణాల వల్ల బాడీ ఓడర్‌లో మార్పులు వచ్చి, పక్కన వాళ్లని ఇబ్బంది పెడుతుంది. కొందరిలో కిడ్నీ, మెటబాలిక్ డిజార్డర్ సమస్యలు, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా బాడీ ఓడర్‌లో తేడా ఉంటుంది. అందులో భార్యా భర్తల మధ్య బాగా ఇబ్బంది ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి దీనిని సెన్సిటివ్‌గానే డీల్ చేయాలి. వీలైనంతవరకు తనకి మెల్లగా, ఓర్పుగా, చెప్పడానికి ప్రయత్నించాలి. ఇందులో శారీరక శుభ్రత చాలా ముఖ్యం. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం, బ్రష్ చేయడం, సక్రమంగా రోమాలు తీసివేయడం, అవసరమైతే డియోడరెంట్ వాడటం, మంచినీళ్లు కనీసం రోజుకు 3 లీటర్లు తీసుకోవడం, మితమైన పోష్టికాహారం వంటి ప్రాథమిక చర్యలతో చాలా వరకు ఫలితం ఉంటుంది. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, ఇన్ఫెక్షన్లు ఉంటే వాటికి తగ్గ చికిత్స తీసుకోవడం, రక్తంలో, హార్మోన్స్‌లో సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి, అవసరమైన రక్త పరీక్షలు చేయించుకొని, తగిన మందులు వాడుకొని, సూచనలను పాటించడం మంచిది. నాకు మేన బావ ఉన్నాడు. నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని మా ఇరువైపు పెద్దల కోరిక. పుట్టబోయే పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ పెళ్లికి నేను ‘నో’ అంటున్నాను. ఒకవేళ నేను ఒప్పుకుంటే మా కుటుంబాల్లో ఇదే తొలి మేనరికం అవుతుంది. నన్నేం చేయమంటారు? – నేతి ప్రవల్లిక, ఆత్మకూరు సాధారణంగా మేనరికం కాని పెళ్లి చేసుకున్న దంపతులకు పుట్టే పిల్లలలో ఏమి కారణం లేకుండా, లేదా తెలియని ఎన్నో కారకాల వల్ల 2–3 శాతం పిల్లలలో అవయవ లోపాలు, జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మేనరికం దంపతుల పిల్లలలో ఇది రెట్టింపు అవుతుంది అంటే 4–6 శాతం పిల్లలో సమస్యలు ఉండవచ్చు. అందులో ముందు తరాల వారివి కూడా మేనరికపు పెళ్లిళ్లు అయితే, ఈ సమస్యలు ఉండే అవకాశాలు ఇంకా ఎక్కువ. సాధారణంగా జన్యువులు తల్లిదండ్రులు ఇద్దరి నుంచి పిల్లలకు చేరుతాయి. కొన్ని జన్యువులలో ఒక్కొక్కరిలో చిన్న లోపాలు ఉండవచ్చు. లోపం ఉన్న జన్యువులు తల్లిదండ్రులు ఇద్దరిలో ఉన్నప్పుడు, పిల్లలకు అవి సంక్రమించి, అవి వారి పిల్లలలో అవయవ లోపాలుగా, జన్యుపరమైన సమస్యలుగా బయటపడటం జరుగుతుంది. అలానే ముందు తరాలు కూడా మేనరికం అయితే, ఈ లోపాలు ఉండే అవకాశాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. మీదే మొదటి మేనరికం అంటున్నారు కాబట్టి, మీ ఇద్దరు ఒకసారి జెనిటిక్ కౌన్సిలింగ్‌కు వెళ్లడం మంచిది. అక్కడ డాక్టర్, మీ కుటుంబ చరిత్ర, వారి ఆరోగ్య వివరాలను తెలుసుకొని, మీ ఇద్దరిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవసరమనుకుంటే మీ ఇద్దరికి కారియోటైపింగ్ వంటి ఇతర రక్త పరీక్షలను సూచిస్తారు. వాటి వాటి వివరాలను బట్టి, మీ పిల్లలో సమస్యలు వచ్చే అవకాశాలు అంచనా వేయడం జరుగుతుంది. అంతేకాని సమస్యలు కచ్చితంగా రావు అనికాని వస్తాయని కాని చెప్పడం కష్టం. కాబట్టి భయపడకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మా అమ్మాయి తొలి చూలు ప్రెగ్నెంట్. మూడో నెల. కరోనా తగ్గే వరకు తన గురించి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పగలరు. నెల నెలా చెకప్‌కు సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా వివరించగలరు. – పి. సబిత, ఆర్మూరు మూడో నెల కదా! ఇప్పటి వరకు ఒక్కసారి అన్నా డాక్టర్ దగ్గరకు వెళ్లారా? వెళ్లకపోతే 3వ నెల చివరిలో తీసుకొని వెళ్లి చెకప్ చేయించండి. ఆ చెకప్‌లో డాక్టర్ అవసరమైన పరీక్షలు, బిడ్డ పెరుగుదలకు సంబంధించి ఎన్‌టి స్కాన్ లాంటివి చేయించడం జరుగుతుంది. ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్రలను వాడుకోమని చెప్పడం జరుగుతుంది. వీటిలో సమస్య ఏమీ లేకపోతే, ఈ కరోనా సమయంలో వీలైనంత వరకు అనవసరంగా బయటకు, హాస్పిటల్‌కు కూడా వెళ్లకపోవడం మంచిది. కాబట్టి నాలుగో నెల చెకప్‌ను తప్పించి, 5వ నెల వచ్చిన 15 రోజులకు చెకప్‌కు వెళ్లి బీపీ, బరువు, బిడ్డలో అవయవాలు అన్నీ సరిగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి టిఫా స్కానింగ్ లాటి పరీక్షలు చేయించుకొని, టెటనస్ (టీటీ) ఇంజెక్షన్ తీసుకొని, ఐరన్, కాల్షియం మాత్రలు వాడుకుంటూ, సమస్య ఏమీ లేకపోతే, 6వ నెల చెకప్ తప్పించి, 7వ నెలలో చెకప్‌కు వెళ్లవచ్చు. మధ్యలో సమస్య ఏమైనా అనిపిస్తే డాక్టర్‌తో ఆన్లైన్ కన్సల్టేషన్‌లో సంప్రదించి, తగిన సూచనలు తీసుకోవచ్చు. అవసరమనుకుంటే హాస్పిటల్‌కు వెళ్లవలసి ఉంటుంది. 7వ నెల చెకప్‌లో బీపీ, బరువు, హీమోగ్లోబిన్, షుగర్ పరీక్ష, టెటనస్ ఇంజెక్షన్ రెండో డోస్, బిడ్డ గుండె చప్పుడు లాంటివి చూడటం జరుగుతుంది. ఐరన్, కాల్షియం మాత్రలు డెలివరీ వరకు తప్పకుండా వాడవలసి ఉంటుంది. సమస్యలు ఏమీ లేకపోతే 8వ నెలలో చెకప్‌కు వెళ్లి, బీపీ, బరువు, అవసరమైతే, బిడ్డ బరువు, ఉమ్మనీరు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి స్కానింగ్ చేయించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి రెండు వారాలకొకసారి, లేదా డాక్టర్ సలహా మేరకు చెకప్‌కు వెళ్లవలసి ఉంటుంది. ఈ సమయంలో ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, పాలు, పెరుగు మాంసాహారులు అయితే గుడ్లు, మాంసం, చేపలు తీసుకోవాలి. మంచినీళ్లు కనీసం 2–3 లీటర్లు తీసుకోవాలి. మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి తీసుకోవడం మంచిది. రోజు కొంతసేపు చిన్నగా నడక, బ్రీతింగ్ వ్యాయమాలు చేయడం మంచిది. మానసిక ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం వంటివి చేయడం ఉత్తమం. చెకప్‌లకు వెళ్లినప్పుడు, మాస్క్‌లు, గ్లౌజులు వేసుకోవడం, శానిటైజర్ వాడటం, సామాజిక దూరం పాటించడం మంచిది. మా పాపకు పద్నాలుగేళ్లు. థైరాయిడ్ అని తేలింది నెల కింద. ఎత్తు 5.2 ఉంటుంది. బరువు 53 కిలోలు. ఈ వయసులో ఆ ఎత్తుకి తనెంత బరువు ఉండాలి? మా ఇంట్లో ధైరాయిడ్ హిస్టరీ లేదు. మా పాపకు రావడానికి కారణమేమై ఉండొచ్చు? బరువుతో థైరాయిడ్‌కు సంబంధం ఉంటుందా? ఇది సంతానలేమికి దారి తీస్తుందా? – సరళ ఏలేటి, నవీ ముంబై మీ పాప ఎత్తుకి తగ్గ బరువే ఉంది. థైరాయిడ్ సమస్య మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే థైరాయిడ్ హార్మోన్ సరిగా స్రవించకపోవడం వల్ల వస్తుంది. మెడలో, హైపోథాలమస్ నుంచి టీఆర్‌హెచ్ హార్మోన్ విడుదలయ్యే థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్) థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి టీ3, టీ4 హార్మోన్స్ విడుదల అయ్యేటట్లు ప్రభావం చేస్తుంది. మెదడులో సమస్యలు, కంతులు, తలకి దెబ్బ, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన సమస్యలు, థైరాయిడ్ గ్రంథిలో కంతులు, ఆటో ఇమ్యూన్ సమస్యలలో థైరాయిడ్ గ్రంథికి, హార్మోన్‌కి వ్యతిరేకంగా యాంటిబాడీస్ ఏర్పడటం వంటి అనేక కారణాల వల్ల థైరాయిడ్ సమస్య రావచ్చు. అంతేకాని తప్పనిసరిగా కుటుంబంలో థైరాయిడ్ ఉంటేనే మిగతావారికి వస్తుంది అని ఏమీ లేదు. హైపోథైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టి తప్పని సరిగా ఈ సమస్య ఉన్నప్పుడు థైరాయిడ్ మందులతో పాటు సక్రమంగా వ్యాయామాలు, మితమైన పౌష్టికాహారం తీసుకోవాలి. బరువు పెరిగే కొద్దీ థైరాయిడ్ డోస్ ఎక్కువ వాడవలసి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అన్ని అవయవాల పనితీరుపైన, రసాయన ప్రక్రియపైన ప్రభావం చూపుతుంది. ఇందులో సమస్య వచ్చినప్పుడు, అన్ని పనులూ మందగిస్తాయి. అలాగే అండాశయాల పనితీరు, సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్స్, అండం సరిగా విడుదల కాకపోవడం, దాని నాణ్యత సరిగా లేకపోవడం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అబార్షన్లు అవ్వడం లాంటి సమస్యలు, ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు భయపడకుండా డాక్టర్‌ను సంప్రదించి, థైరాయిడ్ టెస్ట్‌లు సక్రమంగా చేయించుకుంటూ, సరైన మోతాదులో సక్రమంగా థైరాయిడ్ మాత్రలు వాడుకోవడం వల్ల ఆరోగ్యం సరిగా ఉంటుంది. అలాగే సంతానం కలగడానికి కూడా ఏ సమస్యా ఉండదు. చాలా మంది థైరాయిడ్ సమస్య ఉంటే గర్భం రాదు అనే అపోహలో ఉండి బాగా మథన పడిపోతుంటారు. కుటుంబ సభ్యులు దానిని భూతద్దంలో పట్టి చూస్తూ వాళ్లని ఇబ్బంది పెడుతుంటారు. ఇది సరికాదు. బరువు అదుపులో ఉంచుకుంటూ, సరైన మోతాదులో మందులు వాడుతూ, థైరాయిడ్ హార్మోన్స్ అదుపులో ఉంటే దీని వల్ల గర్భం రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. - డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
మా అత్తగారి వైపు నుంచి ఒత్తిడి ఎక్కువైంది...
నాకు 38 ఏళ్లు. పెళ్లయి అయిదేళ్లవుతోంది. మా ఇంట్లో హీమోఫీలియా హిస్టరీ ఉంది. ఆ భయంతోనే ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నాం ఇన్నాళ్లు. కాని ఇప్పుడు మా అత్తగారి వైపు నుంచి ఒత్తిడి ఎక్కువైంది పిల్లల కోసం. ఈ వ్యాధి మా పిల్లలకూ వచ్చే అవకాశం ఉందా? ఎంత శాతం రిస్క్ ఉంటుందో చెప్పగలరు... – సుమన, జామ్ నగర్ మీ ఇంట్లో హీమోఫీలియా హిస్టరీ ఉంది అంటున్నారు కాని మీకు, మీ ఆయనకు హీమోఫీలియా ఉందా, లేక మీరు హీమోఫీలియా క్యారియరా అనేది రాయలేదు. మీ ఇంట్లో మీకు, మీ ఆయనకు హీమోఫిలియా లేకుండా వేరే వారికి ఉంటే మీ పిల్లలకు హీమోఫీలియా రాదు. హీమోఫీలియా అనేది జన్యుపరమైన కారణాల వల్ల X క్రోమోజ్మ్లోని ఒక జన్యు లోపం వల్ల, రక్తం గడ్డకట్టడానికి ఉపయోపడే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అయిన FVIII, FIX సరిగా ఉత్పత్తి కాకపోవడం, వాటి లోపం వల్ల ఏర్పడుతుంది. దీని వల్ల బ్లీడింగ్ అయితే అది గడ్డకట్టకుండా, రక్తస్రావం అధికంగా, ఆగకుండా అయి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఎక్కువ. దీనికి శాశ్వతమైన చికిత్స లేదు. దినదిన గండంగానే ఉంటుంది. మీ ఇంట్లో అంటున్నావు కాబట్టి, మీ అమ్మగారి తరఫు అనుకుంటున్నాను. సాధారాణంగా హీమోఫీలియా మగవారికి ఎక్కువగా ఉంటుంది. దీన్నే హీమోఫీలియా ఎఫెక్ట్ అంటారు. ఆడవారు ఎక్కువశాతం హీమోఫీలియా క్యారియర్స్‌గా ఉంటారు. ఆడవారిలోని XX సెక్స్ క్రోమోజోమ్‌లలో చాలా వరకు ఒక X క్రోమోజోమ్‌లో హీమోఫీలియా జన్యువు లోపం ఉంటుంది. అదే రెండు రెండు X క్రోమోజోమ్‌లలో ఈ జన్యువు లోపం ఉంటే అప్పుడు వారు హీమోఫీలియా ఎఫెక్ట్డ్ అవుతారు. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆడవారిలో ఒక Xలో జన్యులోపం ఉన్నా, ఇంకొక సాధారణ X క్రోమోజోమ్, లోపం ఉన్నదాన్ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అదే మగవారిలో XY సెక్స్ క్రోమోజోమ్‌లలో X క్రోమోజోమ్‌లో హీమోఫీలియా జన్యువు ఉంటే, వారిలో ఇంకొక Xలేదు కాబట్టి వారు కచ్చితంగా హీమోఫీలియా ఎఫెక్ట్లవుతారు. మీరు హీమోఫీలియా క్యారియర్ అయి మీ ఆయనకు ఏమీ లేకపోతే, అమ్మాయి పుడితే 50 శాతం హీమోఫీలియా క్యారియర్ అవ్వవచ్చు. 50 శాతం హీమోఫీలియా ఉండదు. అదే అబ్బాయి పుడితే 50 శాతం హీమోఫీలియా ఉంటుంది, 50 శాతం హీమోఫీలియా లేకుండా మామూలుగానే ఉంటారు. అదే మీరు హీమోఫిలియా ఎఫెక్ట్డ్ అయితే పుట్టే అమ్మాయిలందరూ హీమోఫీలియా క్యారియర్స్ అవుతారు. అబ్బాయిలైతే హీమోఫీలియా ఎఫెక్టెడ్ అవుతారు. ఒక వేళ మీ ఆయనకు హీమోఫీలియా ఉంటే, మీ హీమోఫీలియా స్టేటస్‌ను బట్టి పుట్టే పిల్లలకి హీమోఫీలియా సంక్రమించే అవకాశాల శాతం చెప్పవచ్చు. మీకు హీమోఫీలియా ఉందా లేక క్యారియరా అనేది చెప్పలేదు. లేదా కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉంటే సాధారణంగానే భయపడుతున్నారో అనేదీ సరిగా వివరించలేదు. ఒకసారి స్వయంగా డాక్టర్‌ను సంప్రదించి సలహాలు నివృత్తి చేసుకోవడం మంచింది. ఒక వేళ మీ ఇద్దరిలో ఎవరికైనా ఉండి, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూన్నట్టయి గనుక పైన చెప్పింది క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. రిస్క్ తీసుకోదలచుకుంటే, గర్భం దాల్చిన తర్వాత 11 నుంచి 13 వారాల సమయంలో కొరియానిక్ విల్లస్ బయాప్సీ అనే పరీక్షద్వారా స్కానింగ్‌లో చూస్తూ, బిడ్డ చుట్టూ ఉన్న మాయ నుంచి చిన్న ముక్క తీసి బిడ్డలో హీమోఫీలియా ఉందా, లేక క్యారియరా అని తెలసుకునేందుకు జన్యు పరీక్ష చేస్తారు. 16 వారాల నుంచి అయితే బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మనీరు తీసి ఎమ్మియోసింటిసిన్ ద్వారా దానిని జన్యు పరీక్షకు పంపి నిర్ధారణ చేస్తారు. ఈ రిపోర్ట్‌ను బట్టి హీమోఫీలియా ఉందా, లేదా క్యారియర్ అనే దాన్ని బట్టి, ఉంటే రిస్క్ తీసుకొని గర్భం ఉంచుకుంటారా లేదా అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీకు ఇప్పటికే 38 సంవత్సరాలు కాబట్టి, ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉన్న కొందరికి టెస్ట్‌ట్యూబ్ పద్ధతిలో ప్రీ ఇంప్లాంటేషన్ స్క్రీనింగ్ డయాగ్నసిస్ ద్వారా, పిండాల్లో ముందుగానే హీమోఫీలియా ఉందా లేదా తెలుసుకొని, హీమోఫీలియా లేని పిండాలు గర్భాశయంలోకి పంపించడం జరుగుతుంది. ఇది బాగా ఖర్చుతో కూడిన ప్రక్రియ. ఈ సమస్య ఉన్నప్పుడు కాన్పు సమయంలో బ్లీడింగ్ ఆగకుండా అవ్వడం, రక్తంతో పాటు అనేక రకాల మందులు, ఖరీదైన ఇంజక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. ఈ వసతులు అన్నీ ఉన్న ఆసుపత్రులకే వెళ్లవలసి ఉంటుంది. - డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
విపరీతమైన కడుపునొప్పి..
మా పాపకు పదమూడేళ్లు. ఏడాది కిందటే పెద్దమనిషి అయింది. నెలనెలా విపరీతమైన బ్లీడింగ్‌తోపాటు కడుపునొప్పితోనూ బాధపడుతోంది. మాకు దగ్గర్లో ఉన్న గైనకాలజిస్ట్‌కు చూపిస్తే నీటి తిత్తులున్నాయి, పాప బరువు కూడా తగ్గాలి అని చెప్పారు. మా అమ్మాయి అయిదు అడుగుల రెండు అంగుళాలుంటుంది. 55 కేజీల బరువుంది. ఓవర్ వెయిట్ కిందకే వస్తుందా? ఈ నీటితిత్తుల వల్ల ప్రమాదమా? దయచేసి వివరించగలరు. – పి. రేణుక, జన్నారం సాధారణంగా పెద్దమనిషి అయిన తర్వాత వారి మెదడు, అండాశయాల నుంచి విడుదలయ్యే హార్మోన్స్ సక్రమంగా పనిచేయడానికి కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. ఆ సమయం వరకు పీరియడ్స్ నెలనెలా సక్రమంగా రాకపోవడం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం లాంటి ఇబ్బందులను ఎదుర్కొవలసి ఉంటుంది. కొందరిలో పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి కూడా ఉంటుంది. అండాశయంలో నీటి తిత్తులు ఉండటాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. సాధారణంగా ఈ వయసులో కూడా కొందరిలో హార్మోన్ల ప్రభావం వల్ల అండాశయంలో నీటి బుడగలలాగా ఉండే ఫాలికల్స్ ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి స్కానింగ్‌లో అవి పాలిసిస్టిక్ ఓవరీస్ లాగా కనిపిస్తాయి. క్రమేణా కొందరిలో అవి మామూలు స్థాయికి వచ్చే అవకాశాలు ఉంటాయి. నీటి తిత్తులు ఎక్కువగా ఉన్నప్పుడు టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవ్వడం తద్వారా బ్లీడింగ్‌లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అలాగే వదలి వేస్తే, అవి ఇంకా పెరిగితే, అవాంచిత రోమాలు, మొటిమల లాంటి సమస్యలు వస్తాయి. వీటికి ఈ వయసులో హార్మోన్ మందులు ఇవ్వడం మంచిది కాదు. మరీ బ్లీడింగ్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే తప్పితే... సాధారణంగా సమస్యను అధిగమించి పరిస్థితిని గాడిలో పెట్టడానికి మితమైన ఆహారం తీసుకుంటూ వాకింగ్, వ్యాయమాలు, స్కిప్పింగ్, డాన్స్ లాంటివి చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల 70 శాతానికి పైగా హార్మోన్ల అసమతుల్యత తగ్గి, బ్లీడింగ్ సమస్యలు తగ్గుతాయి. మీ అమ్మాయి ఎత్తుకు తగ్గ బరువే ఉంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 22 వస్తుంది. కాకపోతే పైన∙చెప్పినట్లు వ్యాయామాలు చేయడం వల్ల ఇంకా బరువు పెరగకుండా ఉండటం, అలాగే దానివల్ల నీటి తిత్తులు ఉన్న వారిలో ఉండే హార్మోన్ అసమతుల్యత తగ్గుతుంది. పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. నేను రెండో కాన్పులో ఉన్నాను. ఆగస్ట్‌లో డ్యూ డేట్ ఉంది. తొలి కాన్పు నార్మలే. ఈ కాన్పులోనే ట్యూబెక్టమీ కూడా చేయించుకుందామను కుంటున్నాను. చేయించుకోవచ్చా? ఒకవేళ సీ సెక్షన్ చేయాల్సి వచ్చినా ట్యూబెక్టమీకి వెళ్లొచ్చా? సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందా? చెప్పగలరు. – సత్యవేణి, కనిగిరి తొలి కాన్పు నార్మలే కాబట్టి, ఈసారి కూడా 95 శాతం మందిలో సాధారణ కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. 5 శాతం మందిలో అనేక కారణాల వల్ల సిజేరియన్ ఆపరేషన్ అవసరం పడవచ్చు. ఒకవేళ ఈసారి కూడా సాధారణ కాన్పే అయితే, కాన్పు తర్వాత రోజు నుంచి ఎప్పుడైనా పొట్ట మీద చిన్నగా కోసి, పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. లేదా ఒక నెల తర్వాత అయితే ల్యాపరోస్కోపి ఆపరేషన్ ద్వారా పెద్ద కొత లేకుండా రెండు చిన్న రంధ్రాలు చేసి ల్యాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ చేయించుకోవచ్చు. ఒక వేళ ‘సీ’ సెక్షన్ చేయావలసి వస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే, ఆ ఆపరేషన్లోనే ట్యూబెక్టమీ కూడా చేయించుకోవచ్చు. ఒకేసారి పని అయిపోతుంది. కొన్నిసార్లు కాన్పు తర్వాత బిడ్డ అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా పిల్లల డాక్టర్ ఆ సమయంలో పరీక్ష చేసి చెప్పినా, 5 శాతం పిల్లల్లో ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, ఇంకా కొన్ని సమస్యలు కొన్ని రోజుల తర్వాత బయటపడే అవకాశాలు ఉంటయి. కాబట్టి రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే, ఆరు నెలలు ఆగి ట్యూబెక్టమీ చేయించుకోవడం మంచిది. మళ్లీ విడిగా ట్యూబెక్టమీ చేయించుకోవాలంటే, మళ్లీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, మళ్లీ ఖర్చు లాంటి ఇతర ఇబ్బందులు ఉంటాయి, కాని పొరపాటున 5 శాతం రిస్క్‌లో బిడ్డకు ప్రమాదం అయితే ఇది శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ కాబట్టి మళ్లీ పిల్లల కోసం ఇబ్బంది పడవలసి ఉంటుంది. బాగా ఆలోచించుకోని సరైన నిర్ణయం తీసుకోవండం మంచిది. చాలా మంది ట్యూబెక్టమీ మళ్లీ చేయించుకుందామని అనుకొని, తర్వాత అనేక కారణాల వల్ల సమయం కుదరక వాయిదా వేసుకుంటూ ఉంటారు, ఆ సమయంలో అనుకోకుండా మళ్లీ గర్భం దాల్చడం, మళ్లీ దాన్ని అబార్షన్ చేయించుకోవడం హాస్పిటల్‌కు రావడం జరుగుతుంది. కొంత మంది అబార్షన్ ఇష్టం లేక, కొంత మంది అబార్షన్‌కు భయపడి గర్భం ఉంచేసుకొని మూడో బిడ్డకు సంసిద్ధమయ్యి ఇబ్బంది పడుతుంటారు. - డా. వేనాటి శోభ హైదరాబాద్ -
వారికి ఎంత రిస్క్?
మా అమ్మ, పిన్ని ఇద్దరికీ బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. నాకొక కూతురు, మా చెల్లికి ఒక కూతురు ఉన్నారు. భవిష్యత్‌లో మా పిల్లలకు ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందా? ఉంటే నా కూతురికి ఎంత రిస్క్ , మా చెల్లి కూతురికి ఎంత రిస్క్ ఉందో చెప్పగలరా? – శ్రీకంఠి, సారంగపూర్ కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్లు జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయి. వీటిలో ఆఖఇఅ, ఆఖఇఅ2 అనే జన్యువుల్లో మార్పుల వల్ల వస్తాయి. కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్లు వేరే కారణాల వల్ల రావచ్చు. మీ అమ్మకి, పిన్నికి బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చాయి అంటున్నారు. వాళ్లకి చేసిన చికిత్సలో క్యాన్సర్ కారణాలను బయాప్సీ చేశారా, అవి ఎలాంటివి ఎందువల్ల వచ్చాయి అనేది నిర్ధారణ అయ్యిందా? ఈ క్యాన్సర్ ఏ రకానికి చెందింది అనేది తెలిస్తే దాన్ని బట్టి అది మళ్లీ మీకు, మీ చెల్లికి, మీ పిల్లలకు వచ్చే అవకాశాలు, రిస్క్ ఎంత ఉండవచ్చు అనేది అంచనా వేయవచ్చు. మీరు, మీ చెల్లెలు ఆఖఇఅ, ఆఖఇఅ2 జన్యువుల పరీక్ష చేయించు కోవడం మంచింది. ఒక వేళ అది పాజిటివ్ వస్తే ప్రతి సంవత్సరం రొమ్ము పరీక్ష, రొమ్ము స్కానింగ్, మమోగ్రామ్, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు చెయ్యించుకుంటూ వాటితో ఏదైనా సందేహం ఉంటే, ఊNఅఇ, బయాప్సీలాంటివి చేయించుకొని దానికి తగ్గ చికిత్స తీసుకోవాలి. ఒకసారి మీ వాళ్లకి చికిత్స చేసిన డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచింది. నాకు ఇప్పుడు 43 ఏళ్లు. ఆర్నెల్ల కిందట ఒకసారి స్నానం చేస్తూ ఒళ్లు రుద్దుకుంటూండగా కుడి బ్రెస్ట్ నుంచి పాలలాంటి తెల్లటి, చిక్కటి ద్రవం డిశ్చార్జ్ అయింది. ఎడమ బ్రెస్ట్ కూడా నొక్క చూస్తే అందులోంచీ అలాంటి ద్రవమే బయటకు వచ్చింది. భయమేసి వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లాను. క్యాన్సర్ కాదు అన్నారు. కాని ఇప్పటికీ బ్రెస్ట్ నొక్కి చూస్తే పాలలాంటి ద్రవం వస్తోంది. కారణం, పరిష్కారం చెప్పగలరు. – దుర్గ, నేరెడ్మెట్, హైదరాబాద్ అనేక కారణాల వల్ల బ్రెస్ట్ నుంచి నీరులాంటి లేదా పాలలాంటి ద్రవం ఏ వయసులోని ఆడవారికైనా రావచ్చు. దీనినే గ్యాలాక్టోరియా అంటారు. ఎక్కువ మటుకు హార్మోన్లలో తేడా వల్ల ఇలా వస్తుంది. కొందరిలో అనేక కారణాల వల్ల మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ విడుదలవుతుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల గ్యాలాక్టోరియా వస్తుంది. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, బాగా బిగుతుగా ఉన్న దుస్తులు వేసుకోవడం, నిపుల్ని (రొమ్ము మొనని) ఎక్కువగా ప్రేరేపించడం, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, మెదడులో కంతులు, తలకి దెబ్బతగలడం, యాంటాసిడ్ మాత్రలు, యాంటీ డిప్రెసెంట్ మందులు, ఇంకా కొన్ని మందులు దీర్ఘకాలం వాడటం వల్ల, దీర్ఘకాల వ్యాధులైన కిడ్నీ, లివర్, థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారిలో కొందరిలో, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల రొమ్ము నుంచి పాలలాంటి ద్రవం వస్తుంది. కాబట్టి మీరు కంగారు పడకుండా ఇఆ్క, ట.ఖీ ఏ. ట. pటౌ ్చఛ్టిజీn లాంటి పరీక్షలు, రొమ్ము పరీక్ష, ఏమైనా మందులు వాడుతుంటే వాటిని ఆపించడం, మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడం, ప్రొలాక్టిన్ మరీ ఎక్కువగా ఉంటే మెదడుకి స్కానింగ్లాంటి పరీక్షలు చేసుకొని, కారణాన్నిబట్టి చికిత్స తీసుకోవచ్చు. మేం నలుగురం అక్కచెల్లెళ్లం. నేనే చివర. నా పెళ్లి కుదిరింది. కరోనా వల్ల పోస్ట్‌పోన్ అయింది. విషయం ఏంటంటే మా ముగ్గురి అక్కలకూ పిల్లల్లేరు. నాకూ అలాంటి సమస్య ఎదురవుతోందేమోనని టెన్షన్‌గా ఉంది. దానికి ముందస్తు టెస్ట్‌లు, ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే ఈ పోస్ట్‌పోన్ టైమ్‌ను వినియోగించుకోవచ్చా? – చందన, సిద్ధిపేట నీ వయసు ఎంత, బరువు ఎంత ఉన్నావు, పీరియడ్స్ నెలనెలా సక్రమంగా వస్తున్నాయా లేదా, థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా అనే అనేక విషయాలను బట్టి నీకు పిల్లలు కలగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది అంచనా వేయడం జరుగుతుంది. మీ ముగ్గురు అక్కలకు పిల్లలు కలగకపోవడానికి సమస్య ఎక్కడ ఉంది అని పరీక్షలు చేశారా? వాళ్లు పిల్లలు కలగడానికి చికిత్సలు ఏమైనా తీసుకున్నారా అనే విషయాలను బట్టి కూడా, నీకూ అదే సమస్య ఉందా అనే పరీక్షలు చేసి చూడవచ్చు. వాళ్లకి పిల్లలు పుట్టనంత మాత్రానా, నీకు అదే సమస్య రావాలని ఏమీ లేదు. నీ సందేహం తీరడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి ఇఆ్క, ట. ఖీ ఏ, ట pటౌ ్చఛ్టిజీn లాంటి రక్తపరీక్షలు చేసి థైరాయిడ్‌లాంటి హార్మోన్ల సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని, ఒక వేళ ఉంటే చికిత్స తీసుకోవాలి. అల్ట్రాసౌండ్ పెల్విస్ చేయించుకొని గర్భాశయం, అండాశయాలు, వాటి పరిమాణం ఎంతలో ఉన్నాయి, వాటిలో గడ్డలు, సిస్ట్లులాంటి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం మంచింది. సమస్యలు ఏమైనా ఉంటే ఈ పోస్ట్‌పోన్ టైమ్‌లో వాటికి తగ్గ చికిత్సలు తీసుకుంటూ బరువు ఎక్కువగా ఉంటే, కొద్దిగా డైటింగ్, నడక లాంటివి చేస్తూ, ఈ లోపల బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. - డా.వేనాటి శోభ హైదరాబాద్ -
నా వైఫ్ ప్రాబ్లం అదేనా?
ఇష్టం లేని పెళ్లి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సరిగా ప్రేరణ లేకపోవడం, డిప్రెషన్, ఇంట్లో ఎక్కువ పని వల్ల అలసట, రక్త హీనత, హర్మోన్లు సరిగా లేకపోవటం లాంటి ఎన్నో కారణాల వల్ల కలయికపై ఆసక్తి చూపరు. ఆ సమయంలో బిగుసుకుపోయినట్లు అవుతారు. ఇందులో నుంచి బయటపడటానికి చాలా వరకు భర్త పాత్ర, నడవడిక చాలా ముఖ్యం. మా పెళ్లయి యేడాది అవుతోంది. సెక్స్ పట్ల నా వైఫ్ చాలా అనాసక్తంగా ఉంటోంది. నేను అంటే ఇష్టం లేక కాదు. మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. చాలా కోపరేటివ్. కాని ఈ ఒక్క విషయంలోనే. నెట్లో చదివాను.. అలా సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడాన్ని ఫ్రిజిడిటీ అంటారని. నా వైఫ్ ప్రాబ్లం అదేనా? సొల్యుషన్ చెప్పగలరు. – ప్రదీప్ ఆనంద్, నాందేండ్ ఆడవారిలో కాని మగవారిలో కాని ఎన్నో మానసిక శారీరక కారణాల వల్ల కలయికపై సరిగా ఆసక్తి చూపకపోవడాన్ని సెక్సువల్ ఫ్రిజిడిటీ అంటారు. కొందరిలో కలయికపైన అనేక అపోహలు ఉండటం, నొప్పి ఎక్కువగా ఉంటుందనే భయం, ప్రెగ్నెన్సీ వస్తుందనే భయం, ఇంతకు ముందు లైంగిక వేధింపులకు గురై ఉండటం, స్నేహితుల చెడ్డ అనుభవాలు విని, అందరికి అలానే ఉంటుందనే నిర్ణయంలో ఉండటం, ఇన్ఫెక్షన్స్ వస్తాయనే భయం, భార్య భర్తకి మధ్యలో సరైన అవగాహన లేకపోవడం, ఇష్టం లేని పెళ్లి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సరిగా ప్రేరణ లేకపోవడం, డిప్రెషన్, ఇంట్లో ఎక్కువ పని వల్ల అలసట, రక్త హీనత, హర్మోన్లు సరిగా లేకపోవటం లాంటి ఎన్నో కారణాల వల్ల కలయికపై ఆసక్తి చూపరు. ఆ సమయంలో బిగుసుకుపోయినట్లు అవుతారు. ఇందులో నుంచి బయటపడటానికి చాలా వరకు భర్త పాత్ర, నడవడిక చాలా ముఖ్యం. భర్త, భార్యతో ఒక స్నేహితుడిలాగా మెలుగుతూ, ఆమె పనులలో చేదోడు వాదోడుగా ఉండటం, నెగిటివ్‌గా మాట్లాడకుండా కొద్దిగా పొగడటం, ప్రేమగా ఉండటం, మనసు విప్పి మాట్లాడటం, కలిసి సినిమాలు చూడటంలాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల వారిలో చాలా మార్పులు వస్తాయి. తర్వాత మెల్లగా శారీరకంగా దగ్గరవడం వల్ల వారిలో చాలా వరకు ఫ్రిజిడిటీ నుంచి దూరంగా ఉంచవచ్చు. వారిని ప్రేమతో ప్రేరేపించడం వల్ల వారిలో ఆసక్తి కలుగుతుంది. ఇలా చేసినా ఉపయోగం లేనప్పుడు, డాక్టర్ దగ్గర కౌన్సెలింగ్ ఇప్పించడం మంచింది. డాక్టర్ కౌన్సెలింగ్‌లో వారి మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే శారీరకంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే, వాటికి దగ్గ పరిష్కారంతో పాటు, వారి సందేహాలను నివృత్తి చేసి, భయాలను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పౌష్టిక ఆహారం, కొద్దిగా వ్యాయామాలు చేయడం, శారీరక అలసట ఎక్కువగా లేకుండా చూసుకోవడంలాంటివి కూడా కొద్దిగా దోహదపడతాయి. మా అమ్మాయికిప్పుడు ఇరవై ఏళ్లు. ఆటిజం చైల్డ్. ఒక పెళ్లి సంబంధం వచ్చింది. చేయొచ్చా? ఒకవేళ పెళ్లి చేస్తే తనకూ అలాంటి సమస్యలున్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉందా? – కృష్ణకుమారి, నిర్మల్ ఆటిజం అనేది మానసిక వ్యాధి, పుట్టుకతోనే వస్తుంది. ఇందులో పిల్లలు చూడటాని మామూలుగానే ఉంటారు. కానీ వీరి మానసిక పెరుగుదల సరిగా ఉండదు. వినికిడి లోపాలు, మాట్లాడే విధానంలో లోపాలు, ఏకాగ్రత లేకపోవడంలాంటి అనేక సమస్యలు ఉండవచ్చు. కొందరిలో కొద్దిగా ఉంటాయి, కొందరిలో ఎక్కువగా ఉండొచ్చు. చాలా మందిలో జన్యుపరమైన కారణాల వల్ల, కొందరిలో కాన్పులో ఇబ్బందుల వల్ల, తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్, పౌష్టికాహారా లోపం, రక్త ప్రసరణలో లోపాల వల్ల ఆటిజమ్ సమస్య రావచ్చు. మీ అమ్మాయికి ఆటిజమ్ ఏ కారణాల వల్ల వచ్చింది అనేదానిపైన అంచనా వెయ్యవచ్చు. ఒక వేళ జన్యుపరమైన కారణాల వల్ల వచ్చి ఉంటే, పుట్టబోయే బిడ్డలో కూడా ఆటిజమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పనిసరిగా రావాలని ఏమీలేదు. ఒకసారి మీ అమ్మాయికి జెనిటిక్ కౌన్సిలింగ్ చేయించండి. వీరికి పెళ్లి చేయకూడదు అని ఏమీలేదు. పెళ్లి తర్వాత ఎక్కువ సమస్యలు రాకుండా ఉండాలంటే, చేసుకునేవారికి, వారి కుటుంబ సభ్యులకు ఆటిజమ్ ఉన్న విషయం దాచిపెట్టకుండా చెప్పాలి. వారు దానిని అర్థం చేసుకుని, ఓపికతో మీ అమ్మాయితో మెలగవలసి ఉంటుంది. డా.వేనాటి శోభ, హైదరాబాద్ -
సేఫ్ మెథడ్స్ ఏమిటి?
లాస్ట్ డిసెంబర్లో మా పెళ్లయింది. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. ఫ్యామిలీ ప్లానింగ్‌కి మా ఇద్దరికీ ఉన్న సేఫ్ మెథడ్స్ చెప్తారా? వాటి వల్ల ఏమైనా దుష్ప్రభావాలుంటే కూడా చెప్పండి ప్లీజ్.. – గ్రీష్మ, కదిరి కొత్తగా పెళ్లయ్యి ఇప్పుడే పిల్లలు వద్దనకున్నప్పుడు, అనేక పద్ధతులు ఉంటాయి. ఏ పద్ధతి పాటించినా కూడా అది వందశాంతం ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటుంది అని చెప్పలేం. ఒక్కొక్క పద్ధతిని బట్ట 5 శాతం నుంచి 30 శాతం వరకు ఫెయిలయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన పద్ధతిలో పాటిస్తే ఫెయిలయ్యే అవకాశాలు కొద్దిగా తగ్గుతాయి. కలయిక సమయంలో మగవారు కండోమ్స్ వాడటం ఒక గర్భ నిరోధక పద్ధతి. ఇవి వాడటం వల్ల గర్భం రాకుండా ఉండటంతో పాటు, కొన్ని లైంగిక వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరి రాకుండా చాలా వరకు అడ్డుకుంటుంది. కొన్నిసార్లు కండోమ్స్ జారిపోవడం, చిరగడం లాంటి సమస్యల వల్ల ప్నెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరిలో కండోమ్స్ తయారీలో వాడే ల్యాటెక్స్ పడకపోవడం అలర్జీ వల్ల జనేంద్రియాల దగ్గర మంట, రాష్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెల నెలా పీరియడ్స్ సక్రమంగా వచ్చే వారిలో పీరియడ్ మొదలయిన 10వ రోజు నుంచి 16 రోజుల లోపల అండం విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి 9వ రోజు నుంచి 18వ రోజు వరకు కలవకుండా ఉండాలి. లేదా ఈ రోజులలో జాగ్రత్తగా కండోమ్స్ వాడుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనినే సేఫ్ పీరియడ్ మెథడ్ అంటారు. ఈ పద్ధతిలో కూడా ఫెయిలయ్చే అవకాశాలు ఉంటాయి. పీరియడ్స్ సక్రమంగా రాని వారిలో ఈ పద్ధతిని అనుసరించడం కుదరదు. ఎందుకంటే వీరిలో అండం విడుదల ఎప్పుడు అవుతుందో చెప్పడం కష్టం. సాధారణంగా గర్భం రాకుండా ఉండటానికి గర్భనిరోధక మాత్రలు వాడుతూ ఉంటారు. వీటినే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారు. వీటిలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హర్మోన్లు అనేక మోతాదుల్లో ఉంటాయి. వీటిని ప్రతినెలా మూడోవ రోజు నుంచి మొదలు పెట్టి రోజుకు ఒకటి చొప్పున 21వ రోజు వరకు మింగవలసి ఉంటుంది. వీటిని సరిగా గుర్తుంచుకొని అదే పనిగా, రోజు ఒకే సమయానికి మర్చిపోకుండా వేసుకోవాలి. మొదలు పెట్టిన తర్వాత రోజు కలయిక ఉన్నా లేకపోయినా పూర్తిగా మాత్రల ప్యాకెట్ అయిపోయేవరకు వేసుకోవలసి ఉంటుంది. కొందరిలో వీటి వల్ల వికారంగా, తల తిరుగుడు, వాంతులు, తలనొప్పి, బరువు పెరగడం లాంటి సమస్యలు ఉండవచ్చు. అలాంటి వారు డాక్టర్ పర్యవేక్షణలో పిల్స్ వాడి చూడవచ్చు. అతి తక్కువ మందిలో వారి శరీరతత్వాన్ని బట్టి, ఫ్యామిలీ హిస్టరీని బట్టి దీర్ఘకాలం వాడటం వల్ల, రక్తం గడ్డకట్టడం, లివర్సమస్యల లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంక హార్మోన్ ఇంజెక్షన్లు, కాపర్టీ లాంటివి ఎక్కువ మటుకు ఒక కాన్పు తర్వాత ఇంకొక బిడ్డ ఇప్పుడే వద్దు అనుకున్నప్పుడు వాడమని సలహా ఇస్తారు. ఒకసారి మీరిద్దరూ గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే వారు మీ శరీరతత్వాన్ని బట్టి పీరియడ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని, సలహా ఇస్తారు. మా పెళ్లయి పదేళ్లవుతోంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ను. నాలగవ నెల. అయితే ఆర్థికంగా నిలదొక్కుకొనేదాకా పిల్లలు వద్దని ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నాం ఇన్నాళ్లు. కొన్నాళ్లు నేను కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడాను, కొన్నాళ్లు మావారు కండోమ్ వాడారు. నేను కన్సీవ్ అయ్యే వరకు కూడా నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు కూడా లోపల బిడ్డ బాగానే ఉందని చెప్పారు డాక్టర్. అయితే నెలలు పెరిగే కొద్ది ఏమైనా సమస్యలు రావచ్చా .. చెప్పండి ప్లీజ్.. – మైథిలి, హైదరాబాద్ మీ వయసు, బరువు ఎంత ఉందో రాయలేదు. ముందు కాంట్రాసెప్టివ్ పిల్స్, కండోమ్స్ వాడటం వల్ల బిడ్డకు, మీకు ఇప్పుడు సమస్యలేవీ రావు. మీ వయస్సు ఎక్కువగా ఉంటే, కొన్నిసార్లు బిడ్డలో అవయవ లోపాలు ఉండే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. గర్భం పెరిగేకొద్దీ 7 నెలల తర్వాత బీపీ, షుగర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఐదవ నెల చివరిలో టిఫా స్కాన్ చెయించుకోండి. అందులో బిడ్డలో ఏమైనా అవయలోపాలు ఉన్నాయా లేదా, బిడ్డ అంతా బాగానే ఉందా అనే విషయాలు తెలుస్తాయి. మీరు కూడా నెలనెలా డాక్టర్ దగ్గర చెకప్‌లకు వెళ్లండి. వారు రాసిన ఐరన్, కాల్షియం మందులు వాడుతూ, సరైన పోషకాహారం తీసుకుంటూ, డాక్టర్ సలహా మేరకు నడక లాంటి వ్యాయమాలు చేస్తూ ఉండటం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. నెలలు పెరిగే కొద్దీ, మీకే కాదు ఎవరికైనా కూడా కాన్పు అయ్యేవరకు వాళ్లవాళ్ల శరీరతత్వాన్ని బట్టి ఏదైనా సమస్య వస్తుందా రాదా అని ముందే కచ్చితంగా చెప్పడం కష్టం. - డా. వేనాటి శోభ హైదరాబాద్ -
అయినా తగ్గలేదు..
మా పాపకు పన్నెండేళ్లు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఉందంటున్నారు కదా. పన్నెండేళ్లు నిండాక వేయించాలా? పన్నెండేళ్లు పడగానే వెయించాలా? ఇంకో సందేహం కూడా.. మా పాప ఇంకా పెద్దమనిషి కాలేదు. అయినా ఈ వ్యాక్సిన్ వేయించవచ్చా? మా కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంది. అందుకే అడుగుతున్నాను. – సురేఖ, చిట్యాల ఇప్పటి వరకు 100 శాతం క్యాన్సర్ రాకుండా ఉండటానికి ఎటువంటి వ్యాక్సిన్లు రాలేదు. సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్) రావడానికి 70 శాతం మందిలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనేది కారణం. 30 శాతం మందిలో వేరే కారణాల వల్ల సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. 2006లో హెచ్‌పీవీ వల్ల వచ్చే క్యాన్సర్‌ను అరికట్టడానికి గార్డసిల్ అనే క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఎఫ్‌డీఏ వాళ్లు అనుమతించడం జరిగింది. ఇది హెచ్‌పీవీ 6, 11, 16, 18 అనే రకాలను అరికడుతుంది. 2007లో సెర్వారిక్స్ అనే వాక్సిన్ హెచ్‌పీవీ 16, 18 రకాలను అరికట్టేది విడుదలయింది. చాలా వరకు హెచ్‌పీవీ 16, 18 రకాల వల్లే ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఈ వైరస్ సెక్స్ ద్వారా గర్భాశయ ముఖద్వారంలోకి చేరి, సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. (ఫెయిర్‌లో ఏముంది?) కొందరిలో ఈ వైరస్ వల్ల వెజైనల్, వల్వల్ క్యాన్సర్లు, జనేంద్రియాల దగ్గర పులిపిరులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాక్సిన్లను 11 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. 9 సంవత్సరాల పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. కొందరిలో 45 సంవత్సరాల వరకు ఇవ్వవచ్చు. మీ పాప 12 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఇప్పించవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడానికి, పెద్దమనిషి అవ్వడానికి ఏమీ సంబంధం లేదు. ఈ వయసులో తీసుకోవడం వల్ల వీరికి హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవుతాయి. 15 సంవత్సరాలు రాకముందు వరకు అయితే 6 నెలల వ్యవధిలో రెండు సార్లు ఇంజెక్షన్ తీసుకోవచ్చు. 15 సంవత్సరాలు మొదలయిన తర్వాత అయితే 6 నెలల వ్యవధిలో 3 డోస్‌లు తీసుకోవలసి ఉంటుంది. నా వయసు ఇరవై రెండేళ్లు. లాస్ట్ మంత్ మెన్సెస్ టైమ్‌లో ప్యాడ్స్ పెట్టుకునే ప్రాంతంలో విపరీతమైన దురద, స్వెల్లింగ్ వచ్చింది. ప్యాడ్స్ వల్ల వచ్చిందేమోనని రెండో రోజు వేరే కంపెనీ ప్యాడ్స్ మార్చాను. అయినా తగ్గలేదు. వారం రోజులు చాలా సఫర్ అయ్యాను. తర్వాత స్వెల్లింగ్ తగ్గింది కాని దురద మాత్రం ఇంకా ఉంది. సమస్య ఏంటో చెప్పగలరు? – మల్లీశ్వరి, ఆదోని మెన్సెస్ టైమ్‌లో బ్లీడింగ్ అయినప్పుడు, రక్తాన్ని ప్యాడ్ పీల్చుకుంటుంది. ప్యాడ్‌ను చాలాసేపు మార్చకుండా అలానే ఉంచినప్పుడు వాసన వస్తుంది. జనేంద్రియాల వద్ద, తొడల దగ్గర, యోని భాగంలో ఉండే సాధారణ క్రిములకు అది అనుగుణంగా మారి, వాటి వృద్ధికి దోహదపడుతుంది. దాని వల్ల చాలా మందికి పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ అవ్వడం వల్ల, మూడు నుంచి ఐదు రోజుల పాటు వరుసగా ప్యాడ్ పెట్టుకొనే ఉండటం వల్ల, గాలి ఆడక, బ్యాక్టీరియా ఇతర క్రిములు పెరిగి, అక్కడ దురద, వాసన వచ్చి, గోకడం వల్ల వాపు కూడా వస్తుంది. ప్యాడ్‌లో బ్లడ్ వల్ల జనేయంద్రియాల దగ్గర ఒత్తుకొని, ఇరిటేషన్ వల్ల కూడా దురద వస్తుంది. ఈ లక్షణాలు, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఉండి తర్వాత తగ్గిపోతుంది. ఇవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి రోగ నిరోధక శక్తిని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలాగా లక్షణాలు ఉంటాయి. కొందరిలో ప్యాడ్స్ అలర్జీ వల్ల కూడా దురద ఉండవచ్చు. అలాంటప్పుడు నువ్వు చేసినట్లు న్యాప్కిన్ బ్రాండ్ మార్చి చూడవచ్చు. కొందరిలో ఏ న్యాప్కిన్ పడనప్పుడు, కాటన్ బట్ట న్యాప్కిన్స్ వాడి చూడవచ్చు. న్యాప్కిన్ తడిసినా, తడవకపోయినా ప్రతి ఆరుగంటలకొకసారి మార్చడం మంచిది. లేకపోతే బ్లీడింగ్లోని ప్యాడ్‌పై రక్తంలో మార్పుల వల్ల పైన చెప్పిన లక్షణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాటన్ ప్యాంటీలు వాడటం మంచిది. న్యాప్కిన్స్ మార్చుకునే ప్రతిసారి, జనేంద్రియాల దగ్గర శుభ్రంగా కడుక్కొని, వీలయితే ఇంటిమేట్ వాష్‌తో శుభ్రపరుచుకోవచ్చు. తర్వాత అక్కడ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ చల్లుకొని ప్యాడ్ మార్చుకోవడం మంచిది. ఈ పౌడర్ని బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత కూడా రెండు మూడు రోజులు వాడటం మంచిది. నీకు మరీ దురద తగ్గకపోతే, ఒక సారి డాక్టర్ని సంప్రదిస్తే, వేరే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని పరీక్ష చేసి దానికి తగ్గ మందులు ఇస్తారు. బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి ప్రయత్నించడం మంచిది. (యూఎన్ మెచ్చిన ఇండియన్) - డా.వేనాటి శోభ హైదరాబాద్ -
మొదటిసారి జాగ్రత్తలు?
మొదటి కాన్పు సమయంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేయగలరు. మొదటి కాన్పుకు, రెండో కాన్పుకు ఉండే తేడా ఏమిటి? ‘లేబర్ పెయిన్ మేనేజ్మెంట్ ప్లాన్’ అంటే ఏమిటి? – లత, బాపట్ల గర్భం దాల్చినప్పటి నుంచి డాక్టర్ సలహా మేరకు నెలనెలా చెకప్‌లు, అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగ్ చేయించుకుని, పరిమితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, ఐరన్, క్యాల్షియం మందులు వాడుకుంటూ ఆరోగ్య పరిస్థితిని బట్టి చిన్నగా నడక, వ్యాయామాలు వంటివి చేసుకుంటూ తొమ్మిది నెలల పాటు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే చాలావరకు కాన్పు సమయంలో ఎక్కువ ఇబ్బంది లేకుండా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. తొమ్మిదో నెల చివరకు బిడ్డ బరువు, బిడ్డ పొజిషన్, ఉమ్మనీరు, బిడ్డ బయటకు వచ్చే దారి ఎలా ఉంది, తల్లి ఆరోగ్యం ఎలా ఉంది అనే అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని, సాధారణ కాన్పుకు అవకాశాలు ఉన్నాయా లేదా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందా అనే దానిపై ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. కాన్పుకు ముందు నుంచే దంపతులు ఇద్దరూ డెలివరీ అంటే ఎలా ఉంటుంది, నొప్పులు ఎలా తియ్యాలి వంటి విషయాలను తెలుసుకోవాలి. మొదట గర్భిణి తన మనసులో భయాన్ని పోగొట్టుకుని కాన్పుకి సిద్ధపడాలి. కాన్పు సమయంలో నొప్పులను బ్రీతింగ్ వ్యాయామాల ద్వారా నియంత్రించుకుంటూ నొప్పులను తీస్తే కాన్పు సులభతరంగా అవుతుంది. మొదటి కాన్పులో నొప్పులు ప్రారంభమైన తర్వాత కాన్పు కావడానికి 12 గంటల నుంచి 24 గంటల సమయం పట్టవచ్చు. రెండో కాన్పు అయితే, ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే 6 నుంచి 12 గంటల లోపే కాన్పు కావచ్చు. లేబర్ పెయిన్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే సాధారణ కాన్పుకి ప్రయత్నం చేసేటప్పుడు గర్భిణి నొప్పులను తేలికగా భరించడానికి, ఎక్కువ నొప్పులు తెలియకుండా ఉండటం కోసం అనేక పద్ధతులు పాటించడం. ఇందులో భాగంగా కాన్పు సమయంలో అటూ ఇటూ తిరగడం, బాల్ ఎక్సర్సైజ్ వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, చిన్న చిన్న మసాజ్‌లు, గర్భాశయ ముఖద్వారం త్వరగా తెరుచుకోవడానికి మందులు ఇవ్వడం, కొందరిలో నడుం పైనుంచి వెన్నుపూసలోకి ‘ఎపిడ్యూరల్ ఎనాల్జెసియా’ ఇంజెక్షన్ ద్వారా నొప్పులు తెలియకుండా చేయడం జరుగుతుంది. నా వయసు 20 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు. బరువు 48 కిలోలు ఉండేదాన్ని. కాని గత ఎనిమిది తొమ్మిది నెలలలో 60కి పెరిగాను. ఏమీ అర్థం కావడం లేదు. ఒక సంవత్సరం నుండి కాలేజీ అయిపోయి ఇంట్లో ఉంటున్నాను. ఎక్కువ తినడం వల్ల అలా బరువు పెరిగాను కావచ్చు...అనుకుంటున్నాను. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు ఇలా ఒకేసారి బరువు పెరుగుతారని చదివాను. నాకు రక్తం కూడా తక్కువగా ఉంది. మంచి డైట్ సూచించగలరు. నేను ఎత్తు పెరుగుతానా? – పేరు రాయలేదు ఇరవై సంవత్సరాల తర్వాత అమ్మాయిలు ఎత్తు పెరగరు. థైరాయిడ్ సమస్యకు సరైన మోతాదులో మందులు వాడుతూ, థైరాయిడ్ హార్మోన్ లెవల్స్ అదుపులో ఉంచుకుంటే, పెద్దగా బరువు పెరగరు. కాకపోతే ‘హైపో’థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో వారి మెటబాలిక్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం తిన్నా కూడా అది కేలరీలుగా ఖర్చయ్యేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువ పని చెయ్యకుండా, వ్యాయామాలు చెయ్యకుండా తింటూ ఉంటే బరువు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కొందరిలో రక్తం తక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్ నియంత్రణలో లేకపోతే కూడా ఒంట్లో నీరు చేరడం వల్ల బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. మీకు రక్తం తక్కువగా ఉంటే, ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు, ఖర్జూరం, బీన్స్, క్యారెట్, బీట్రూట్, మాంసాహారం వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించి థైరాయిడ్ లెవల్స్ అదుపులో ఉన్నదీ లేనిదీ చెక్ చేయించుకుని, దానికి తగ్గ డోస్‌లో థైరాయిడ్ మాత్రలు వాడుకుంటూ పైన చెప్పిన ఆహారం తీసుకుంటూ, అవసరమైతే ఐరన్ మాత్రలు వాడుకోవచ్చు. అలాగే రోజూ గంటసేపు వాకింగ్, వ్యాయామాలు, యోగా వంటివి చెయ్యడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఆ నొప్పికి కారణం ఏమిటి?
నా వయసు పదిహేడు. సన్నగా ఉంటాను. పీరియడ్స్ టైమ్‌లో పొత్తికడుపులో బాగా నొప్పి వస్తుంది. ఇది సహజమేనా? లేక భవిష్యత్‌లో దీని వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? అసలు ఈ నొప్పికి కారణం ఏమిటి? నివారణ మందులు ఉన్నాయా? పీరియడ్స్ టైమ్‌లో నొప్పి లేని వారి కంటే, నొప్పి ఉన్నవారికి పెళ్ళి తరువాత గర్భదారణకు అవకాశాలు ఎక్కువ అని ఒక ఫ్రెండ్ చెప్పింది. ఇందులో నిజం ఎంత ఉంది? – జీఎన్, గుంటూరు పీరియడ్స్ సమయంలో నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ సమయంలో సాధారణంగా ప్రోస్టోగ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయం కుంచించుకుంటూ బ్లీడింగ్ బయటకు వస్తుంది. దానివల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుంది. అలాగే ఈ సమయంలో అండం ఫలదీకరణ జరగనప్పుడు ప్రొజెస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల రక్తనాళాలు ముడుచుకుపోయి, గర్భాశయం లోపలి పొరకు రక్తప్రసరణ తగ్గిపోయి, ఆ పొర బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది. ఈ క్రమంలో కూడా నొప్పి రావచ్చు. ఈ హార్మోన్ల మార్పులలో తీవ్రతను బట్టి నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. దీనివల్ల ఆ రెండు మూడు రోజులు నొప్పి వల్ల ఇబ్బంది తప్పితే వేరే సమస్యలేవీ ఉండవు. ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఒకటి రెండు రోజులు నొప్పి నివారణ మాత్రలు వేసుకోవచ్చు. పొత్తి కడుపు మీద వేడినీటి కాపడం పెట్టుకోవచ్చు. కొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, పెల్విక్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల వల్ల పీరియడ్స్ సమయంలో విపరీతమైన పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి ఉండవచ్చు. ఈ సమస్యలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా నిర్ధారించుకుని, సమస్యను బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. కొందరిలో నెలనెలా అండం విడుదలయ్యే వారిలో పొత్తికడుపు నొప్పి ఉండే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారిలో పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు ఎక్కువ అనేది నిజమే. కాకపోతే పైన చెప్పిన సమస్యల వల్ల నొప్పి వచ్చేవారిలో గర్భధారణకు కొందరిలో అవకాశాలు తక్కువగా ఉండవచ్చు. నా వయసు 23 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు, బరువు 65 కిలోలు. 2017లో నాకు పెళ్లి జరిగింది. 2018లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో బేబీ హార్ట్‌బీట్ లేదని అబార్షన్ అయింది. రీసెంట్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో అదే సమస్య వచ్చింది. అలా ఎందుకు వస్తుందో అర్ధం కావడం లేదు. నా భర్త హెల్త్ రిపోర్ట్ కూడా నార్మల్‌గానే ఉంది, నా హెల్త్ రిపోర్ట్స్ కూడా అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – మెహరున్నీసా ఖాన్ గర్భం దాల్చిన తర్వాత గర్భాశయంలో చివరి పీరియడ్ అయిన రోజు నుంచి ఆరు వారాలకు పిండం ఏర్పడి, దానిలో హార్ట్‌బీట్ మొదలవుతుంది. కొందరిలో కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల, కొన్ని తెలియని కారణాల వల్ల, అండం నాణ్యత లేదా వీర్యకణాల నాణ్యత సరిగా లేకపోయినా, పిండం సరిగా ఏర్పడకుండా, గర్భం ధరించినా హార్ట్‌బీట్ రాదు. కొందరిలో హార్ట్‌బీట్ మొదలైనా, కొన్ని వారాల తర్వాత హార్ట్‌బీట్ మళ్లీ ఆగిపోవచ్చు. దీనినే మిస్డ్ అబార్షన్ అంటారు. మీ ఇద్దరికీ రిపోర్ట్స్ నార్మల్‌గానే ఉన్నాయన్నారు. మీ వయసు కూడా చిన్నదే. కాని రెండుసార్లు పిండంలో హార్ట్‌బీట్ రాలేదు. కొన్నిసార్లు కనిపించే కారణాలేవీ లేకపోయినా అండం, వీర్యకణం ఫలదీకరణ చెందే క్రమంలో పిండంలో ఏమైనా అవకతవకలు జరిగినా కూడా పిండంలో హార్ట్‌బీట్ రాకపోవచ్చు. కాబట్టి ఈసారి మళ్లీ గర్భం కోసం ప్రయత్నించడానికి కనీసం మూడు నెలల వ్యవధి తీసుకోండి. ఈ సమయంలో వ్యాయామాలు, యోగా వంటివి చేసి కొద్దిగా బరువు తగ్గడం మంచిది. అలాగే మీ ఇద్దరూ ముందు నుంచే మంచి పౌష్టికాహారం మితంగా తీసుకుంటూ, ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున వేసుకోవడం మంచిది. రెండుసార్లు అబార్షన్ అయింది కాబట్టి, ఒకసారి మీ హెల్త్ రిపోర్ట్స్‌లో థైరాయిడ్ టెస్ట్, యాంటీ ఫాస్పాలిపిడ్ యాంటీబాడీస్, ఏపీటీటీ వంటి పరీక్షలు ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే డాక్టర్‌ను సంప్రదించి ఈ పరీక్షలు, ఇంకా అబార్షన్లు అవడానికి మీ ఇద్దరిలో జన్యుపరమైన సమస్యలు ఏవైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కారియోటైపింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, వాటి ఫలితాలను బట్టి, చికిత్స తీసుకొని గర్భం కోసం ప్రయత్నించి, గర్భం వచ్చిన తర్వాత కూడా గర్భం నిలవడానికి అవసరమైన మందులు వాడుకోవడం మంచిది. సాధారణంగా ఈ పరీక్షలు వరుసగా మూడు అబార్షన్లు అయిన తర్వాత చేయించుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇప్పటికి రెండుసార్లే అయ్యాయి. మరీ ఆతృతగా ఉంటే ఈ పరీక్షలన్నీ చేయించుకోవచ్చు. ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. కొన్నిసార్లు ఎన్ని పరీక్షలు చేసినా అన్నీ నార్మల్‌గానే ఉండవచ్చు కూడా. నా వయసు 29 సంవత్సరాలు. బరువు 63 కిలోలు. ప్రస్తుతం నేను 5 నెలల ప్రెగ్నెంట్. పెళ్లికి ముందు నుంచే నేను థైరాయిడ్ పేషెంట్‌ని. ప్రసుత్తం నేను ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయడం లేదు. నా బరువును ఎలా అదుపులో పెట్టుకోవాలో చెప్పగలరు. – అనూష మీ బరువు రాశారు గాని, ఎత్తు ఎంతో రాయలేదు. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు మామూలు బరువు ఉన్నవాళ్లు నెలకు ఒకటిన్నర నుంచి రెండు కిలోల వరకు బరువు పెరగవచ్చు. మీకు థైరాయిడ్ సమస్య ఉన్నందున ప్రెగ్నెన్సీలో రెండు నెలలకోసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటూ, ఎస్ఆర్ టీఎస్‌హెచ్ 3 ఎంఐయూ కంటే తక్కువగా ఉండేలా డాక్టర్ సలహాపై థైరాయిడ్ మాత్రలను సరైన మోతాదులో వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ ఎత్తుకు తగిన బరువు ఉంటే, మరీ ఎక్కువగా బరువు పెరగకుండా అన్నం తక్కువ తీసుకుంటూ, ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు వంటి పోషక పదార్థాలు తీసుకోవచ్చు. స్వీట్లు, అరటిపండ్లు, మామిడి పండ్లు, సపోటా పండ్లు వంటివి తక్కువగా తీసుకోవడం మంచిది. ముందు నుంచే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లలో కొందరిలో ఏడో నెల నుంచి సుగర్ శాతం పెరిగి జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. కాబట్టి నెలకు ఒకటిన్నర కిలోల కంటే ఎక్కువ బరువు పెరగకుండా మితమైన పోషకాహారం తీసుకుంటూ, చిన్నగా నడక, యోగా వంటి వ్యాయామాలను డాక్టర్ సలహాపై చేసుకోవచ్చు. డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఈ దశలో ఆగిపోతుందా?
నాలో మెనోపాజ్ లక్షణాలు కొద్దికొద్దిగా కనిపిస్తున్నాయి. మెనోపాజ్ దశలో హార్మోన్ల విడుదల ఆగిపోతుందని, ఇనుము శాతం తగ్గిపోతుందని, పోషకాల అవసరం పెరుగుతుందని విన్నాను. ఈ లోటు భర్తీ చేసుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏ పదార్థాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది? ఇది ఎంత పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది? ఏ దశలో చర్మం సూర్యరశ్మిని విటమిన్ ‘డి’గా మార్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది? దీనికి కారణం ఏమిటి? – బీఆర్, విజయనగరం మెనోపాజ్ దశలో అండాశయాల పరిమాణం తగ్గిపోయి, వాటి నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల శరీరంలోకి క్యాల్షియం, ఇతర విటమిన్స్ సరిగా చేరవు. ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల ఒంట్లోంచి వేడి ఆవిర్లు రావడం (హాట్ ఫ్లషెస్), క్యాల్షియం తగ్గిపోవడం వల్ల ఒంటినొప్పులు, కాళ్లు, నడుంనొప్పులు, మూత్ర సమస్యలు, మానసిక సమస్యలతో కూడిన మెనోపాజ్ లక్షణాలు మెల్లగా ఒకటొకటిగా మొదలవుతాయి. ఆహారంలో తాజా ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు వంటివి తీసుకోవడం వల్ల క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్ వంటివి పెరుగుతాయి. క్యాల్షియం లోపం బాగా ఉన్నప్పుడు ఆహారంతో పాటు క్యాల్షియం, విటమిన్–డి కలిగిన మాత్రలు రోజుకొకటి చొప్పున తీసుకోవడం మంచిది. మాంసాహారులైతే గుడ్లు, చేపలు, చికెన్, మటన్ వంటివి వారానికి రెండుసార్లు తీసుకోవచ్చు. వీటిలో క్యాల్షియం, విటమిన్–డి, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చర్మం సూర్యరశ్మిని విటమిన్–డిగా ఏ వయసులోనైనా మార్చుకోగలుగుతుంది. కాకపోతే చర్మం మరీ మందంగా ఉన్నా, బాగా నల్లగా ఉన్నా సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం వల్ల చర్మం సూర్యరశ్మిని విటమిన్–డిగా సరిగా మార్చుకోలేదు. ఇటీవల ఒక పత్రికలో ‘లెంగ్త్ ఆఫ్ ప్రెగ్నెన్సీ’ అనే వాక్యాన్ని చదివాను. ఇది ఆసక్తికరంగా అనిపించింది. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. naegele's rule అంటే ఏమిటి? – కె.జయశ్రీ, సిద్దంపల్లె, చిత్తూరు జిల్లా గర్భవతులలో ఆఖరు పీరియడ్ అయిన మొదటి రోజు నుంచి లెక్కబెడితే, తొమ్మిది నెలలు పూర్తయిన వారం రోజుల వరకు పూర్తిగా 280 రోజులు, అంటే 40 వారాల కాలాన్ని ‘లెంగ్త్ ఆఫ్ ప్రెగ్నెన్సీ’ అంటారు. చివరి పీరియడ్ మొదలైన మొదటి రోజును ‘లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్’ (ఎల్ఎంపీ) అంటారు. దీని నుంచి తొమ్మిది నెలల వారం రోజులు లెక్కకడితే, 280 రోజులు/40 వారాలు పూర్తయ్యే సమయాన్ని ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ (ఈడీడీ) అంటారు. దాదాపు 80 శాతం మంది ఈడీడీ కంటే 10–15 రోజుల ముందే కాన్పు అవుతారు. కేవలం 5 శాతం మంది మాత్రమే ఈడీడీ రోజున కాన్పు అవుతారు. ఇక 10–15 శాతం మందికి ఈడీడీ దాటినా నొప్పులు రావు. ఈ పరిస్థితినే ‘పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ’ అంటారు. naegele's rule అంటే ఎల్ఎంపీ డేట్ నుంచి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వరకు డెలివరీ ఎప్పుడు కావచ్చని లెక్కకట్టే పద్ధతి. ఇందులో చివరి పీరియడ్ మొదటి రోజు తారీఖుకు ఏడు రోజులు కూడటం, చివరి పీరియడ్ నెల నుంచి మూడు నెలలను తీసివేస్తే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ తారీఖు, నెల వస్తాయి. ఉదాహరణకు ఎల్ఎంపీ డేట్: 20.1.2020 అయితే, 20కి ఏడు రోజులు కూడటం, జనవరి నెల నుంచి మూడు నెలలు తీసివేయడం చేస్తే, ఈడీడీ 20.10.2020 వస్తుంది. ఇలా లెక్కకట్టే పద్ధతినే naegele's rule అంటారు. నార్మల్ డెలివరీ తర్వాత వచ్చే సమస్యల్లో ఇన్ఫెక్షన్ ఒకటని విన్నాను. ఇది ఎందుకు వస్తుంది? నివారణ ఏమిటి? అనేది వివరంగా తెలియజేయగలరు. ప్రసూతి సమయంలో గర్భాశయం దెబ్బతినడానికి కారణం ఏమిటి? ‘హేమరేజ్’ అంటే ఏమిటి? – కె.రాగసుధ, మచిలీపట్నం నార్మల్ డెలివరీ సమయంలో నొప్పుల వల్ల గర్భాశయ ముఖద్వారం తెరుచుకుని, బిడ్డ యోని ద్వారా బయటకు వస్తుంది. ఈ ప్రయత్నంలో యోని నుంచి తెరుచుకుని ఉన్న సెర్విక్స్ ద్వారా బ్యాక్టీరియా క్రిములు గర్భాశయం లోపలికి, తద్వారా పొత్తికడుపులోకి చేరి ఇన్ఫెక్షన్లు కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, రక్తహీనత ఉన్నా, కాన్పు జరిగే ప్రదేశం శుభ్రంగా లేకపోయినా, ఆ సమయంలో వాడే వస్తువులు శుభ్రంగా లేకపోయినా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాన్పు ముందు నుంచే మరీ ఎక్కువగా బరువు పెరగకుండా సరైన పోషకాహారం తీసుకోవడం, రక్తహీనత లేకుండా ఐరన్ మాత్రలు తీసుకోవడం, యోనిలో ఇన్ఫెక్షన్ ఉంటే ముందే చికిత్స తీసుకోవడం, జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవడం, కాన్పు జరిగే ప్రదేశం, వాడే వస్తువులు శుభ్రంగా ఉండటం, కాన్పు తర్వాత యాంటీబయోటిక్స్ కోర్సును సక్రమంగా వాడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ డెలివరీ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లను చాలావరకు రాకుండా చూసుకోవచ్చు. కాన్పు సమయంలో వచ్చే నొప్పుల తీవ్రత వల్ల కొందరిలో బిడ్డ పెద్దగా ఉండి గర్భాశయం నుంచి బయటకు వచ్చే సమయంలో గర్భాశయ ముఖద్వారం మీద ఒత్తిడి పడటం వల్ల అది చీలడం వంటి సమస్యల వల్ల గర్భాశయం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో గర్భాశయం నుంచి బ్లీడింగ్ అధికంగా అవుతుంది. దీనినే పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ అంటారు. డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఈ వయసులో ఏమిటి?
నా వయసు 18 సంత్సరాలు. నేను కొద్దికాలంగా రక్తహీనత (ఎనీమియా) సమస్యతో బాధపడుతున్నాను. ఈ వయసులో ఎనీమియా ఏమిటని తెలిసిన వాళ్లు ఆశ్చర్యపడుతున్నారు. అసలు ఇది ఏ వయసులో మొదలవుతుంది? ఖరీదైన పదార్థాలు తీసుకోలేని ఆర్థికపరిస్థితి మాది. మాకు అందుబాటులో ఉన్న పదార్థాలు ఏమైనా ఉన్నాయా? దీనికి చికిత్స ఏమైనా ఉంటుందా? పెళ్లి తరువాత సమస్యలు వస్తాయా? – సీఆర్, నాగారం, వరంగల్ జిల్లా రక్తంలో హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటాన్ని ఎనీమియా అంటారు. ఇది ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషక పదార్థాల లోపం వల్ల, హీమోగ్లోబిన్ తయారీలో లోపాల వల్ల, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, కడుపులో నులిపురుగులు ఉండటం, బ్లీడింగ్ ఎక్కువవడం వంటి అనేక కారణాల వల్ల ఆడవారిలో ఎనీమియా ఏర్పడవచ్చు. ఎనీమియా రావడానికి వయసుతో సంబంధం లేదు. ఇది ఏ వయసులో వారికైనా రావచ్చు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి కారణాలను తెలుసుకోవడం మంచిది. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. పోషక పదార్థాల లోపం వల్ల అయితే ఆహారంతో తాజా ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, బీన్స్, చిక్కుడు వంటి కూరగాయలు, పప్పులు, పండ్లు, ఖర్జూరం, వేరుశెనగపప్పు, బెల్లం వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల హీమోగ్లోబిన్ పెరిగి చాలావరకు ఎనీమియా తగ్గుతుంది. కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే అల్బెండాజోల్–400 మి.గ్రా మాత్ర ఒకటి నోటి ద్వారా వేసుకోవడం మంచిది. అవసరాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు కొన్ని నెలల వ్యవధిలో ఈ మాత్ర మళ్లీ ఒకటి వేసుకోవచ్చు. ఎనీమియా తీవ్రత ఎక్కువగా ఉంటే పోషకాహారంతో పాటు ఐరన్ మాత్రలు, విటమిన్ బి12, విటమిన్ సి మాత్రలు వాడి చూడవచ్చు. తీవ్రత మరీ ఎక్కువ ఉంటే ఐరన్ ఇంజెక్షన్లు క్రమంగా మూడు నాలుగు డోసులు చిన్న సెలైన్ బాటిల్ ద్వారా ఎక్కించుకోవచ్చు. అయినా మార్పు లేకపోతే, తప్పనిసరి అయితే రక్తం ఎక్కించుకోవలసి ఉంటుంది. పెళ్లయిన తర్వాత కూడా రక్తహీనత ఎక్కువగా ఉంటే పైన చెప్పిన చికిత్సలు తీసుకోవాలి. లేకపోతే నీరసం, ఒంటినొప్పులు, గర్భంలో ఇబ్బందులు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
వేటికి దూరంగా ఉండాలి?
నా వయసు 19 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇన్సైడర్ స్ట్రెస్‌కు గురవుతున్నాను. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అదనంగా విడుదల అవుతుందని చదివాను. దీని వల్ల ఇర్రెగ్యులర్, పెయిన్ సమస్యలు వస్తాయా? లాక్డౌన్ నేపథ్యంలో బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది కాబట్టి పీరియెడ్ ప్రొడక్ట్స్ విషయంలో ప్రత్యమ్నాయాలు చూసుకునే వీలుందా? – జె.కీర్తి, అంబాజీపేట ఇప్పుడున్న పరిస్థితుల వల్లే కాకుండా, చాలామంది సాధారణంగా కూడా లేదా అనేక పరిస్థితుల వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ స్ట్రెస్ వల్ల మెదడు నుంచి కొన్ని హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. నరాలు కూడా ఎక్కువ ప్రేరేపణ చెందుతాయి. వీటివల్ల అడ్రినల్ గ్రంథి నుంచి స్ట్రెస్ హార్మోన్స్ అయిన అడ్రినలిన్, కార్టిసాల్ ఎక్కువగా విడుదలవుతాయి. వీటి వల్ల తాత్కాలికంగా గుండెదడ, బీపీ, కోపం బాగా బలంగా అనిపించడం వంటి ప్రభావాలు ఉంటాయి. దీర్ఘకాలం స్ట్రెస్ ఉన్నవాళ్లలో ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, జీర్ణవ్యవస్థ మందగించడం, నిద్రాభంగం, డిప్రెషన్, ఆందోళన, తలనొప్పి వంటి సమస్యలు ఉంటాయి. అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవారిలో కొందరు బరువు పెరుగుతారు. కొందరు బరువు తగ్గుతారు. మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. అలాగే పీరియడ్స్ క్రమం తప్పి కొందరిలో పీరియడ్స్ నెలనెలా రాకపోవడం, ఆలస్యంగా రావడం, కొందరిలో బ్లీడింగ్ కొద్దిగానే అవడం, ఇంకొందరిలో బ్లీడింగ్ ఆగకుండా ఎక్కువ అవడం వంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరిలో ఒంటినొప్పులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కొద్దిగా ఉండవచ్చు. కాబట్టి మానసిక ఒత్తిడి వీలైనంత వరకు తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, వాకింగ్, వ్యాయామాలు, పాజిటివ్ దృక్పథం కలిగి ఉండి మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో నాప్కిన్స్ లేకపోతే పీరియడ్స్ సమయంలో కాటన్ బట్టలను బాగా శుభ్రంగా ఉతికి, ఎండలో ఎండబెట్టి వాడుకోవచ్చు. వీటిని రోజుకు రెండు మూడుసార్లు మార్చుకుంటూ ఉండాలి. గర్భిణి స్త్రీలు అరపటిపండ్లు తినవచ్చా? ఎలాంటి పండ్లకు దూరంగా ఉండాలి? గర్భిణులకు సంబంధించి మెనూ (బ్రెక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు) ఎలా ఉంటే బాగుంటుంది? ఇల్లు దాటి బయటికి వెళ్లేటప్పుడు గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాంటాసిడ్ టాబ్లెట్ల అవసరం ఏమిటి? – పి.వినుత, అనంతపురం గర్భిణి స్త్రీలు అరటిపండ్లు తినకూడదనే నియమం ఏమీ లేదు. అరటి పండ్లలో ఎక్కువ మోతాదులో పిండి పదార్థాలు, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలు వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటి వల్ల బలహీనంగా, నీరసంగా ఉంటే తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే అరటిపండ్లలో ఉన్న పోషకాలు బిడ్డ పెరుగుదలకు దోహదపడతాయి. అరటిపండ్లలో ఉండే పీచు పదార్థాల వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం లేకుండా ఉంటుంది. కాకపోతే అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో బరువు ఎక్కువగా ఉన్నవారిలో, ఫ్యామిలీలో సుగర్ వ్యాధి ఉన్నవారిలో అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు ఇంకా ఎక్కువగా పెరగడం, రక్తంలో సుగర్ శాతం పెరగడం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారిని వీలైనంత వరకు అరటిపండ్లను తక్కువగా తీసుకోమని చెబుతారు. లేదా అరటిపండు తీసుకున్నప్పుడు మిగతా ఆహారం తక్కువగా తీసుకోమని సూచిస్తారు. దానిమ్మ, నారింజ, కివి, ఆపిల్, ద్రాక్ష వంటి అన్ని పండ్లను గర్భిణులు మితంగా తీసుకోవచ్చు. గర్భిణులు ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. పొద్దున్న 8 గంటల లోపు పాలు, టిఫిన్, 11 గంటల లోపు పండ్లు, మధ్యాహ్నం 1 గంటకు పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగుతో కూడిన భోజనం, సాయంత్రం 4 గంటలకు పండ్లు, ఏవైనా స్నాక్స్, రాత్రి 7 గంటలకు భోజనం, పడుకునే ముందు పాలు తీసుకోవచ్చు. గర్భిణిలు వీలైనంత వరకు బయట రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. బయట ఆహారం తీసుకోకపోవడం మంచిది. ఎండాకాలంలోనైతే సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం, ఎండ తగలకుండా గొడుగు తీసుకుపోవడం, నీళ్లు బాగా తాగడం వంటివి చేయాలి. చలికాలంలోనైతే మాయిశ్చరైజర్లు ఉపయోగించాలి. బయటకు వెళ్లేటప్పుడు వులెన్ దుస్తులు వేసుకుని వెళ్లాలి. గర్భిణిలలో పొట్ట పెరిగే కొద్దీ తినేది గొంతులోకి వచ్చినట్లు ఉండటం, గొంతులో మంట, అజీర్తి, ఎసిడిటీ వంటివి ఉంటాయి. ఈ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చికిత్సలో భాగంగా యాంటాసిడ్ మాత్రలను వాడమని సూచించడం జరుగుతుంది. డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఎక్కువగా అదే అలవాటు?
గర్భిణులకు, బాలింతలకు ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం అని విన్నాను. ఇది ఏ పదార్థాలలో ఉంటాయి? వీటి వల్ల ఉపయోగం ఏమిటి? నాకు ఎక్కువగా కూర్చునే అలవాటు ఉంది. గర్భిణిగా ఉన్నప్పుడు అదేపనిగా కూర్చుంటే ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? – డి.నీరజ, రాజమండ్రి ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌లో ప్రధానంగా డీహెచ్ఏ, ఈపీఏ అనేవి గర్భంలో ఉండే బిడ్డ మెదడు ఎదుగుదలకు, మానసిక ఆరోగ్యానికి, కళ్లలో రెటీనా పొర సరిగా ఏర్పడటానికి ఉపయోగపడతాయి. ఇవి ఒకరకం కొవ్వు జాతికి సంబంధించినవి. ఇవి తల్లి తీసుకునే ఆహారం ద్వారా మాయ నుంచి గర్భంలోని బిడ్డకు చేరుతాయి. ఇవి ఎక్కువగా సీ ఫుడ్‌లో అంటే చేపలు వంటి వాటిలో ఎక్కువగా దొరుకుతాయి. మెర్క్యురీ తక్కువగా ఉండే చేపలు వారానికి రెండుసార్లు తీసుకోవచ్చు. ఇవి తీసుకోని వాళ్లకు ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి. అవి రోజుకొకటి చొప్పున తీసుకోవచ్చు. మాంసాహారం తినని వాళ్లకు ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు), వాల్నట్స్, చియా సీడ్స్, సోయాబీన్ ఆయిల్, ఫ్లాక్స్‌సీడ్ ఆయిల్ వంటి వాటిలో కొద్దిగా ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కొందరిలో వీటి వల్ల నెలలు నిండకుండా అయ్యే కాన్పులను తగ్గించడమే కాకుండా, శిశువు ఆరోగ్యకరమైన బరువు పెరిగేందుకు దోహదపడతాయని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది. గర్భిణులు అదేపనిగా కూర్చునే అలవాటు ఉండటం వల్ల బరువు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. తద్వారా గర్భంతో ఉన్నప్పుడు 8–9 నెలల్లో సుగర్, బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాళ్లలో వాపులు, రక్తనాళాల్లో రక్తం గూడుకట్టడం, కండరాలు పట్టెయ్యడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు కొన్ని రకాల పరిస్థితులు ఉంటే పూర్తిగా బెడ్‌రెస్ట్ చెప్పడం జరుగుతుంది. చాలావరకు అందరికీ కొద్దిగా వాకింగ్, విశ్రాంతితో పాటు మామూలు పనులు చేసుకోవాలని సలహా ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల శరీరం తేలికగా ఉంటుంది. కండరాలు, ఎముకలు మరీ బిగుసుకుపోకుండా ఉండి, సాధారణ కాన్పు తేలికవుతుంది. గర్భిణులలో కరోనా లక్షణాలు కనిపిస్తే, ఆ వైరస్ కడుపులో ఉన్న బిడ్డకు కూడా సోకుతుందా? కడుపులో ఉన్న బిడ్డకు సోకింది లేనిది తెలుసుకోవడానికి ప్రత్యేకమైన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో prenatal checkup లో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా? దురదృష్టవశాత్తు ఈ వైరస్ బాలింతలకు సోకితే, బిడ్డను తల్లికి దూరంగా ఉంచాల్సి వస్తుందా? అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? దయచేసి తెలియజేయగలరు. – ఎన్‌కె, హైదరాబాద్ కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలై ఐదు నెలలు కావస్తోంది. ఈ వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా చూసిన లెక్కల ప్రకారం కరోనా వైరస్ బారిన పడిన గర్భిణిలలో తల్లి నుంచి గర్భంలోని బిడ్డకు కరోనా వైరస్ సోకిన దాఖలాల్లేవు. దీని దుష్ప్రభావం గర్భస్థ శిశువులపై ఉంటుందా లేదా అనే దానిపై అదనపు సమాచారం తెలుసుకోవడానికి గర్భంలో బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు తీసి ల్యాబ్‌లో పరీక్షించాల్సి ఉంటుంది. ఇప్పుడు కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ సందర్భంగా గర్భిణులకు చేసే చెకప్స్‌లో కొత్తగా రూపొందించిన గైడ్‌లైన్స్ కొన్ని మార్పులను సూచించడం జరిగింది. గర్భ నిర్ధారణ తర్వాత ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతూ డాక్టర్‌ను ఒకసారి సంప్రదించడం, 12 వారాల సమయంలో, 20 వారాల సమయంలో అవసరమైన స్కానింగ్ చేయించుకుని, తర్వాత డాక్టర్ సలహా మేరకు ఐరన్, క్యాల్షియం మాత్రలు వాడుకుంటూ, బిడ్డ కదలికలు గమనించుకుంటూ, డాక్టర్‌తో వీడియో కన్సల్టేషన్తో ఉంటూ, వారు చెప్పిన సూచనలను పాటిస్తూ, సమస్యను బట్టి ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి చూపించుకుంటూ ఉండవలసి ఉంటుంది. కరోనా వైరస్ బాలింతకు సోకితే, ఇది తల్లి నుంచి బిడ్డకు సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు చూసిన కేసుల్లో, చేసిన పరీక్షల్లో తల్లి పాలల్లో కరోనా వైరస్ కనిపించలేదు. తల్లి పాలను బిడ్డకు తాగించడం వల్ల బిడ్డకు కరోనా వైరస్ సోకదు. బాలింతకు కరోనా సోకితే బిడ్డను తల్లికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉంచాల్సి ఉంటుంది. చేతులను శుభ్రంగా కడుక్కుని తల్లిపాలను రొమ్ముల నుంచి పిండి, బాటిల్లో పట్టి బిడ్డకు ఇవ్వవచ్చు. లేదా కొద్దిగా రిస్క్ తీసుకుని, తల్లి నోటికి, ముక్కుకు మాస్క్ సరిగా ధరించి, చేతులు శుభ్రంగా ఉంచుకుని బిడ్డకు పాలు ఇవ్వవచ్చు. పాలిచ్చిన తర్వాత బిడ్డను దూరంగా ఉంచడం మంచిది. నేను చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతుంటాను. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ఈ కరోనా పరిస్థితుల్లో ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఏవేవో ఊహించుకుంటున్నాను. ఇది మంచిది కాదు అని తెలిసి కూడా మానలేకపోతున్నాను. ఈ ఒత్తిడి నివారణకు మందులు ఏమైనా ఉన్నాయా? నాకు యోగా కొంచెం తెలుసు. ఎలాంటి యోగాసనాలు వేయాలి? – స్వర్ణ, కరీంనగర్ ప్రెగ్నెన్సీ సమయంలో మానసిక ప్రశాంతతో ఉండటం వల్ల తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం సరిగా ఉంటాయి. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురికావడం వల్ల ప్రెగ్నెన్సీలో బీపీ, సుగర్ వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే, బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పు కావడం వంటి సమస్యలు కూడా మామూలు వారితో పోల్చితే కాస్త ఎక్కువగా ఉండవచ్చు. పుట్టబోయే బిడ్డలో కూడా కొన్నిసార్లు మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు కొద్దిగా ఉండవచ్చు. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకుండా, ప్రశాంతంగా ఉండటం మంచిది. దీనికి సరైన నిద్ర, నడక, కొద్దిపాటి వ్యాయామాలు, ధ్యానం, యోగా వంటివి ఉపయోగపడతాయి. అలాగే కుటుంబ సభ్యుల సహకారం, అండదండలు కూడా చాలా వరకు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. ఈ సమయంలో మానసిక ఒత్తిడికి మందులు వాడటం అంత మంచిది కాదు. కొందరిలో వీటి వల్ల కొద్దిగా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే, పైన చెప్పిన చిట్కాలు ఏమీ ఉపయోగపడకపోతే, డాక్టర్ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ చేయించుకుని, అవసరమైతే అతి తక్కువ మోతాదులో కొన్నిరోజుల పాటు మందులు వేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మానసిక ఒత్తిడి తగ్గడానికి యోగాలో ప్రాణాయామం, పద్మాసనం, శుకాసనం, బాలాసనం వంటివి నిపుణుల సలహా మేరకు చేయడం మంచిది. డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఆ సమస్య ఎందుకు వస్తోంది?
నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. అయితే నేను ఉండేది చిన్న పల్లెటూరిలో. గర్భిణులు ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలని, మాంసం, చేపలు, బీన్స్ వంటివి తీసుకోవాలని చెబుతుంటారు. అయితే లాక్డౌన్ వల్ల ఇవేమీ తినలేకపోతున్నాను. దీనివల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? ఇప్పుడున్న పరిమితులలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఏమైనా టాబ్లెట్లు తీసుకోవాలా? – కె.పద్మ, ఉప్పరపల్లి, వరంగల్ జిల్లా ప్రెగ్నెన్సీ సమయంలో మాంసాహారం తప్పనిసరిగా తినాలని ఏమీ లేదు. దానికి బదులుగా తాజా ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు అన్నిరకాలు, ఖర్జూరం, పల్లి పట్టీలు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవచ్చు. పల్లెటూర్లలో కూడా ఆకుకూరలు, కూరగాయలు, వేరుశెనగ, కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పులు, పాలు, పెరుగు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి దొరుకుతాయి కదా! వీటన్నింటిలో కూడా గర్భిణి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు కావలసిన పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, విటమిన్స్, మినరల్స్ దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందకుండా, పైన చెప్పినవి ఏవి దొరికితే అవి ఆహారంలో తీసుకుంటే మీరు, మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఆహారంతో పాటు గర్భిణులు తప్పకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, క్యాల్షియం, విటమిన్–డి, మల్టీవిటమిన్ మాత్రలు రోజుకొకటి చొప్పున వేసుకోవాలి. నా వయసు 26 సంవత్సరాలు. నేను వైట్డిశ్చార్జీ సమస్యతో బాధపడుతున్నాను. అసలు ఇది ఎందుకు వస్తుంది? నివారణ ఏమిటి? ‘ఫిజియోలాజికల్ వైట్డిశ్చార్జీ’ అంటే ఏమిటి?– ఎన్ఆర్, ఒంగోలు ఆడవారిలో యోని భాగంలో, గర్భాశయ ముఖద్వారంలో మ్యూకస్ స్రవించే గ్రంథులు ఉంటాయి. వాటి నుంచి కొద్దిగా నీటిలాంటి జిగురుగా ఉండే ద్రవం వస్తుంది. దీనినే వైట్ డిశ్చార్జ్ అంటారు. ఇందులో చెడు వాసన, దురదలాంటివి ఉండవు. ఈ స్రావాలలో ఉండే ఆమ్లగుణం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వ్యాధికారక క్రిములు గర్భాశయం లోపలకు వెళ్లకుండా అక్కడే చనిపోతుంటాయి. ఈ వైట్ డిశ్చార్జినే ల్యుకేరియా అంటారు. హార్మోన్ల ప్రభావం వల్ల అనేక సమయాలలో వైట్ డిశ్చార్జి కొద్దిగా ఎక్కువగా విడుదలవుతుంది. పీరియడ్ వచ్చిన 11–16 రోజులలో అండం విడుదలయ్యే సమయంలోను, పీరియడ్స్‌కు ముందు, కలయిక సమయంలో, ప్రెగ్నెన్సీ సమయంలో వైట్ డిశ్చార్జి కొద్దిగా ఎక్కువ విడుదలవుతుంది. దీనినే ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జి అంటారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. కొందరిలో గనేరియా, క్లామిడియా, ప్రోటోజోవా, ట్రైకోమోనియా క్యాండిడా ఫంగస్, కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల వైట్ డిశ్చార్జి పసుపు రంగు, నురగతో కలిసి లేదా పెరుగులాగా ఉంటూ యోనిలో, యోని చుట్టూ దురద, మంటతో పాటు చెడు వాసనతో స్రవిస్తుంది. ఒకవేళ మీకు పైన చెప్పిన లక్షణాలతో వైట్ డిశ్చార్జి ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి యాంటీబయోటిక్స్ లేదా యాంటీఫంగల్ మందులు పూర్తి కోర్సు సరిగా వాడటం మంచిది. మీకు వివాహం అయిందా లేదా రాయలేదు. ఒకవేళ వివాహం అయి ఉంటే కలయిక ద్వారా కూడా ఇన్ఫెక్షన్లు దంపతులలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఇద్దరూ మందులు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా రక్తహీనత లేకుండా, రోగనిరోధక శక్తి సరిగా ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన పౌష్టికాహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేసుకుంటూ, కనీసం రోజుకు రెండు లీటర్ల మంచినీరు తాగడం, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే యోని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. - డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఈ వయసులో ట్రై చేయొచ్చా?
నా వయసు 34. నాకు ఇరవయ్యేళ్లు ఉన్నప్పుడు పెళ్లయ్యింది. కానీ పొరపొచ్చాలు వచ్చి భర్తతో విడిపోయాను. పిల్లలు లేరు. అప్పటి నుంచీ ఒంటరిగానే ఉన్నాను. అయితే కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తి పరిచయమయ్యారు. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన వయసు 38. ఇద్దరం సంతోషంగానే ఉన్నాం. అయితే నాకు పిల్లల్ని కనాలని ఉంది. కానీ ఇప్పటికే ముప్ఫై అయిదుకు చేరువలో ఉన్నాను కాబట్టి పుడతారో లేదోనని భయమేస్తోంది. ఈ వయసులో నేను పిల్లల కోసం ప్రయత్నించవచ్చా? దాని వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఒక్క బిడ్డ కలిగినా చాలు. సలహా ఇవ్వండి. – నవత, సంగారెడ్డి సాధారణంగా ఆడవాళ్లలో ముప్ఫయ్యేళ్లు దాటిన తర్వాత అండాశయాల నుంచి విడుదలయ్యే అండాల నాణ్యత తగ్గడం మొదలవుతుంది. 35 యేళ్లు దాటాక ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. దానివల్ల గర్భం దాల్చడానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. గర్భం దాల్చిన తర్వాత పిండం సరిగ్గా ఎదగక, అబార్షన్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఏర్పడి, అవయవ లోపాలు ఏర్పడవచ్చు. సాధారణ జనాభాలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలు 2 శాతం ఉంటే, 30–35 సంవత్సరాల లోపల 4 శాతం, ఆ వయసు దాటాక 6 శాతం ఉంటాయి. మీకు 34 సం‘‘లు కాబట్టి తప్పకుండా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. కాకపోతే సాధారణ గర్భం కోసం ఎక్కువ నెలలు ఎదురు చూడకుండా, ఆరు నెలలు ప్రయత్నించండి. ఆ సమయం దాటివుంటే ఓసారి గైనకాలజిస్టును కలిసి, అవసరమైన హార్మోన్ పరీక్షలు, స్కానింగ్ వంటివన్నీ చేయించుకోండి. ఆపైన త్వరగా గర్భం రావడానికి మందులు వాడితే మంచిది. ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతూ, గర్భం వచ్చిన తర్వాత బిడ్డలో ఏమైనా సమస్యలు ఉంటే ముందే తెలుసుకోవడానికి మూడో నెలలో ఎన్.టి.స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్, ఐదో నెలలో టిఫా స్కాన్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్, ఆరో నెలల 2 డి ఫీటల్ ఎకో వంటి పరీక్షలన్నీ చేయించుకోవాలి. ఏమాత్రం అధైర్య పడకుండా ప్రయత్నించండి. తప్పకుండా మీ ఆశ నెరవేరుతుంది. నా వయసు 22. ఎత్తు ఐదడుగుల మూడంగుళాలు. బరువు 80 కిలోలు. ఇంతకు ముందు ఇంత లావు ఉండేదాన్ని కాదు. ఈ మధ్యనే ఎందుకో బాగా పెరిగాను. అలా అని వ్యాయామం లేదని కాదు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. పిల్లల వెనుక పరుగులు తీస్తూనే ఉంటాను. వెజిటేరియన్స్మి కాబట్టి నాన్‌వెజ్ కూడా తినను. అయినా ఎందుకిలా బరువు పెరుగుతున్నాను? – కె.పద్మజ, గాజువాక మీ ఎత్తుకి 60–65 కిలోలు బరువు ఉంటే సరిపోతుంది. అంటే మీరు పదిహేను కిలోలు ఎక్కువ ఉన్నారు. అధిక బరువు తగ్గాలంటే తప్పకుండా శారీరక శ్రమ అవసరం. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఎన్ని పనులు చేసినా, దాని వల్ల పెద్దగా బరువు తగ్గరు. పొద్దున్న, సాయంకాలం నలభై అయిదు నిమిషాల నుంచి గంట పాటు వాకింగ్, యోగా వంటివి చేయండి. లేదంటే జిమ్‌కి వెళ్లండి. చెమట పట్టేంతగా శ్రమ చేసినప్పుడే ఒంట్లో కొవ్వు కరిగి, బరువు తగ్గుతారు. అలాగే ఆహార నియమాలు పాటించండి. అన్నం తక్కువగా కూరలు ఎక్కువగా తీసుకోండి. స్వీట్లు, కొవ్వుతో కూడిన పదార్థాలు, వేపుళ్లు, నూనె వస్తువులు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇవన్నీ చేస్తూ డాక్టర్ సలహాతో కొవ్వు తగ్గడానికి మందులు కూడా వాడవచ్చు. ఉన్నట్టుండి బరువు పెరిగానంటున్నారు కాబట్టి థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవడం మంచిది. థైరాయిడ్, సీబీపీ, ఆర్బీఎస్, లిపిడ్ ప్రొఫైల్ లాంటి రక్త పరీక్షలు చెయ్యించుకుని, ఫలితాలను బట్టి మందులు వాడాలి. నా వయసు 24. పెళ్లై ఏడు నెలలు అయ్యింది. ఈ మధ్య నెలసరి రాకపోవడంతో చెకప్ చేయించుకుంటే గర్భవతినని తేలింది. అయితే నేను చాలా పొట్టిగా ఉంటాను. నా గర్భసంచి కూడా చాలా చిన్నగా ఉందట. అందులో బిడ్డ సరిగ్గా ఎదగలేదు, బిడ్డను మోసే శక్తి కూడా నీ గర్భసంచికి లేదు, అబార్షన్ చేయించుకుంటే మంచిది అన్నారు డాక్టర్. నేను నా బిడ్డను చంపు కోలేను. దయచేసి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. – సునంద, నిడదవోలు గర్భాశయం చిన్నగా ఉన్నప్పుడు... కొందరి శరీర తత్వాన్ని బట్టి, గర్భం వచ్చాక వారిలో విడుదలయ్యే హార్మోన్లను బట్టి కొద్దిగా పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే లోపల పెరిగే బిడ్డ... గర్భాశయం విచ్చుకునేదాన్ని బట్టి బరువు పెరుగుతుంది. కొందరిలో అబార్షన్లు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ఏడెనిమిది నెలల్లో కాన్పు అయిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పుడు గర్భం వచ్చేసింది కాబట్టి ప్రొజెస్టరాన్ హార్మోన్ ట్యాబ్లెట్లు, హెచ్‌సీజీ ఇంజెక్షన్లు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, నెలనెలా అవసరాన్ని బట్టి స్కానింగ్ చేయించుకోండి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండి, 4, 5 నెలల్లో గర్భాశయానికి కుట్లు వేయించుకుని చూడండి. ఇంక వేరే అవకాశం లేదు కాబట్టి ముందే గర్భం తీయించుకునే బదులు, పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. కనీసం బిడ్డ ఏడో నెల దాకా ఎదిగి, ఒక కిలోకి పైన బరువు పెరిగినా మంచిదే. ఇప్పుడున్న ఆధునిక చికిత్సల్లో ఎన్.ఐ.సి.యు.లో పెట్టి బిడ్డను బతికించుకునే అవకాశాలు ఉన్నాయి. అలా చేసినా ఫలితం లేనప్పుడు... కాన్పు మీద కాన్పుకి గర్భాశయం కొద్దిగా విచ్చుకుని... ఆ తర్వాత కాన్పుకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. - డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఎందుకు వస్తాయి?
►నా స్నేహితురాలు ఒకరు గర్భసంచిలో గడ్డలతో బాధ పడుతోంది. ఈ గడ్డలు ఉన్నట్లు తెలుసుకోవడం కష్టమని తను చెప్పింది. ఎలాంటి లక్షణాల ద్వారా ఇవి ఉన్నట్లు కనిపెట్టవచ్చు? అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఇవి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకునే వీలుందా? – జి.స్వప్న, ఏలూరు గర్భసంచిలో వచ్చే గడ్డల్లో ఎక్కువ శాతం ఫైబ్రాయిడ్ అనే గడ్డలు ఉంటాయి. గర్భాశయంలోని కండరం, ఫైబ్రస్ కణజాలం ఎక్కువగా పెరిగి గర్భాశయంలో ఎక్కడైనా చేరి గడ్డలుగా మారుతాయి. ఇవి ఒక్కచోట ఒక్కటే ఏర్పడవచ్చు లేదా గర్భాశయంలో అనేక ప్రదేశాల్లో అనేకం పెరగవచ్చు. గర్భాశయం పైపొరలో ఏర్పడితే సబ్‌సీరస్ ఫైబ్రాయిడ్స్ అని, మధ్య పొరలో ఏర్పడితే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని, ఎండోమెట్రియల్ పొరలో ఏర్పడితే సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు. ఇవి ఎందుకు ఎవరికి వస్తాయనేందుకు కారణాలు చెప్పడం కష్టం. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, బరువు ఎక్కువగా ఉన్నవారిలో, ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నవారిలో ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక సైజుల్లో అంటే బఠాణీ సైజు నుంచి పుచ్చకాయ సైజు అంతవరకు పెరగవచ్చు. ఇవి 99.9 శాతం క్యాన్సర్ గడ్డలు కావు. ఫైబ్రాయిడ్స్ పెరిగే చోటు, సైజు బట్టి లక్షణాలు ఉంటాయి. ఇవి పెద్దసైజులో ఉన్నా సబ్‌సీరస్ ఫైబ్రాయిడ్స్ అయితే చాలావరకు లక్షణాలు ఉండవు. వేరే సమస్యలకు స్కానింగ్ చేయించినప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని గుర్తించడం జరుగుతుంది. అదే సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అయితే, చిన్నగా ఉన్నా బ్లీడింగ్ ఎక్కువ కావడం వంటి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ పెరిగే చోటును బట్టి, పరిమాణం బట్టి అనేక లక్షణాల్లో భాగంగా కొందరిలో అధిక రక్తస్రావం, త్వరగా పీరియడ్స్ వచ్చేయడం, పొత్తికడుపులో నొప్పి, బరువుగా ఉండటం, నడుమునొప్పి, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాలనిపించడం, పీరియడ్స్ తర్వాత కూడా మధ్యలో బ్లీడింగ్ అవడం వంటి లక్షణాలు ఉండవచ్చు. దాదాపు 70–80 శాతం ఆడవారిలో వారి జీవితకాలంలో ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి రాకుండా చూసుకోవడానికి మనం చేయగలిగిందేమీ లేదు. శరీర తత్వాన్ని బట్టి కొందరిలో ఇవి వచ్చే లక్షణాలు ఉంటాయి. జాగ్రత్తలలో భాగంగా ఎక్కువ బరువు పెరగకుండా ఉండటం, తగ్గడానికి క్రమంగా నడక, వ్యాయామాలు, మితమైన ఆహారం తీసుకోవడం మంచిది. లక్షణాలు ఏమీ లేకుండా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటే వాటిని తొలగించాల్సిన అవసరం ఏమీ లేదు. డాక్టర్ సలహా మేరకు క్రమంగా స్కానింగ్ చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్‌కు డాక్టర్ సలహాపై దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉండి, లక్షణాలు తీవ్రంగా ఉంటేనే ఆపరేషన్ అవసరం అవుతుంది. ►తల్లి ప్రసవించిన వెంటనే శిశువు బొడ్డు తాడు కత్తిరించొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన విషయాన్ని చదివాను. దీనికి కారణం ఏమిటి? ‘బొడ్డుతాడు సంరక్షణ’ వలన ప్రయోజనం ఏమిటి? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? దీనికి ఖర్చు ఎంత అవుతుంది? – ఆర్.దేవిక, హైదరాబాద్ కాన్పు తర్వాత తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి బొడ్డుతాడును కత్తిరిస్తారు. బొడ్డుతాడు తల్లి నుంచి అన్ని పోషక పదార్థాలను మాయ నుంచి బిడ్డకు చేరవేస్తుంది. బిడ్డను తల్లి నుంచి వేరు చేశాక బొడ్డు తాడును, మాయను పారవేయడం జరుగుతుంది. బొడ్డుతాడులో రక్తంతో పాటు అనేక రక్తకణాలు, మూల కణాలు (స్టెమ్‌సెల్స్) ఉంటాయి. కాన్పు సమయంలో బిడ్డను కడుపు నుంచి బయటకు తీసిన తర్వాత బొడ్డు తాడును వెంటనే కత్తిరించకుండా రెండు మూడు నిమిషాలు ఆగి కత్తిరించడం వల్ల లేదా దానిలోని రక్తనాళాల పల్సేషన్స్ ఆగిపోయిన తర్వాత కత్తిరించడం వల్ల బిడ్డకు కొద్దిగా ఎక్కువ రక్తం, పోషక పదార్థాలు చేరుతాయి. దీనినే డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అంటారు. ఈ పద్ధతి ద్వారా బరువు తక్కువగా పుట్టే పిల్లలకు, నెలలు నిండకుండా పుట్టే పిల్లలకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా అందుబాటులో ఉన్న ‘కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్’ పద్ధతిలో కాన్పు తర్వాత పారవేసే బొడ్డుతాడులోని రక్తాన్ని బిడ్డ బయటకు రాగానే తీసుకుని, దానిని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, ఫ్రీజ్ చేసి భద్రపరచడం జరుగుతుంది. దీనిని ప్రస్తుతానికి 20–25 సంవత్సరాల వరకు భద్రపరచే సౌకర్యాలు ఉన్నాయి. దీనిని అనేక సంస్థలు మార్కెటింగ్ చేస్తున్నాయి. దీనికి సంస్థను బట్టి అనేక ప్యాకేజీలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు భద్రపరుస్తారు అనే దాని బట్టి రూ.40 వేల నుంచి రూ.70 వరకు ఖర్చు ఉంటుంది. బొడ్డుతాడులోని రక్తంలో ఉండే స్టెమ్‌సెల్స్‌కు అనేక రకాల కణాలుగా విభజన చెందే గుణం ఉంటుంది. వీటిని ఉపయోగించి పుట్టిన బిడ్డకు తర్వాతి కాలంలో లేదా బిడ్డ రక్తసంబంధీకులకు ఏవైనా రక్తసంబంధిత వ్యాధులు అంటే– లుకీమియా, లింఫోమా, హీమోలైటిక్ అనీమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఉపయోగపడతాయి. బొడ్డుతాడులోని స్టెమ్‌సెల్స్‌ను ఇంకా ఏవిధంగా ఉపయోగించవచ్చనే దానిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనలు ఫలించిన రోజున భద్రపరచిన బొడ్డుతాడు రక్తాన్ని అనేక రకాల జబ్బులకు ఉపయోగించవచ్చు. -
ఆ సమయంలో .. ఇది ప్రమాదమా?
నేను ప్రెగ్నెంట్. అయితే ఈమధ్య కాలంలో విపరీతంగా ఆకలి వేస్తుంది. పరిమితికి మించి తింటున్నాను. మావారు ‘ఈటింగ్ డిజార్డర్ కావచ్చు’ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల microcephaly లాంటి సమస్యలు ఎదురు కావచ్చు అని విన్న తరువాత ఆందోళనగా ఉంది. ‘ఈటింగ్ డిజార్డర్’ అనేది వాస్తవమా? కాదా? అనేది నిర్ధారించుకోవడం ఎలా? – కె.సునీత, బాన్సువాడ ప్రెగ్నెన్సీలో అనేక కారణాల వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరిగా తీసుకోకపోవడాన్ని ఈటింగ్ డిజార్డర్ అంటారు. కొందరిలో అనారోగ్యకరమైన ఆహారం అతిగా తినడం కూడా ఉంటుంది. కొందరిలో ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే మార్పులకు భయపడటం, బరువు పెరగకుండా, బాడీ షేప్ పాడవకుండా ఉండాలని ఆహారం సరిగా తీసుకోకపోవడం, కొన్ని పూటలు ఆహారం అసలే తీసుకోక పోవడం, ఆహారం తీసుకున్నా బరువు తగ్గాలనే ఉద్దేశంతో తీసుకున్న ఆహారాన్ని బలవంతంగా కావాలని వాంతులు చేసుకోవడం, లూజ్ మోషన్స్ అవడానికి మందులు వాడటం, అతిగా వ్యాయామం చేయడం, అతిగా స్వీట్లు, కొవ్వు పదార్థాలు తినడం, డిప్రెషన్లో ఉండటం, అందరితో కలవకపోవడం వంటి అనేక లక్షణాలు ఉంటాయి. గర్భిణిలలో ఈ సమస్య ఉన్నప్పుడు అవసరమైన పోషక పదార్థాలు శరీరంలోకి చేరకపోవడం వల్ల కొందరిలో అబార్షన్లు, నెలలు నిండకుండానే కాన్పులు, బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం, అవయవ లోపాలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇందులో భాగంగానే బిడ్డ తల పరిమాణం సరిగా పెరగకుండా చిన్నగా ఉండి, తల లోపల మెదడు పెరుగుదల సరిగా ఉండదు. దీనినే ‘మైకోకెఫలీ’ అంటారు. ఇందులో ఇతర అవయవాలతో పోలిస్తే తల పరిమాణం ఉండాల్సిన దాని కంటే చిన్నగా ఉండి, బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయి. ప్రెగ్నెన్సీలో మరీ అతిగా తిని బరువు ఎక్కువగా పెరిగినా తల్లిలో బీపీ, సుగర్ వంటి సమస్యలు ఏర్పడి కాన్పులో సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించి, నెలనెలా ఎంత బరువు పెరుగుతున్నారో ట్రాక్ చేసుకోవాలి. వారి సలహా మేరకు మార్పులు చేసుకోవడం మంచిది. మా అమ్మాయి వయసు పదహారు సంవత్సరాలు. రుతుక్రమం సక్రమంగా లేకపోతే డాక్టర్ని సంప్రదించాం. ‘ప్రైమరీ అమినోరియా’ అని చెప్పారు. టర్నర్స్ సిండ్రోమ్, కుషింగ్ సిండ్రోమ్ వల్ల ఇలా జరుగుతుందన్నారు. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – బి.కృష్ణవేణి, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా అసలు అమ్మాయి పదహారు సంవత్సరాలు వచ్చినా రజస్వల కాకపోవడాన్ని ‘ప్రైమరీ అమినోరియా’ అంటారు. మీరు చెప్పినట్లు రుతుక్రమం సక్రమంగా లేకపోతే దానిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. మీ అమ్మాయికి ఒకసారైనా పీరియడ్స్ వచ్చాయా, లేదా, వస్తే ఎన్నిసార్లు వచ్చాయి అనే దాన్ని బట్టి అవసరమైన పరీక్షలు చేసి, చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అనేక హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, అండాశయంలో సిస్ట్లు, నీటిబుడగలు, కణితులు వంటి అనేక కారణాల వల్ల రుతుక్రమం సరిగా రాకపోవచ్చు. కొందరిలో పుట్టుకతోనే గర్భాశయం లేకపోవడం, జన్యుపరమైన కారణాలు, మెటబాలిక్ ఎంజైమ్స్‌లో లోపాల వల్ల కూడా కొందరు రజస్వల కాకుండా ఉంటారు. దానినే ‘ప్రైమరీ అమినోరియా’ అంటారు. ఆడవారిలో పుట్టుకతోనే 23 జతల ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్‌లు అంటే మొత్తం 46 ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్‌లు ఉంటాయి. వీటిలో ఒక జత ఎక్స్ఎక్స్ సెక్స్ క్రోమోజోమ్‌లు ఉంటాయి. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల పుట్టుకతోనే ఒకటే క్రోమోజోమ్ సంక్రమిస్తుంది. దీనివల్ల వీరిలో 45ఎక్స్ జీరో క్రోమోజోమ్‌లు ఉంటాయి. దీనినే టర్నర్స్ సిండ్రోమ్ అంటారు. వీరిలో అనేక అవయవ లోపాలతో పాటు అండాశయాలు సరిగా తయారు కాకపోవడం, దీనివల్ల రజస్వల కాకపోవడం, అయినా ఆలస్యంగా అవడం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, పీరియడ్స్ తొందరగా– అంటే 35–40 ఏళ్ల వయసులోనే ఆగిపోవడం (తొందరగా మెనోపాజ్ దశకు చేరడం) వంటి సమస్యలు ఉండవచ్చు. దీనికి చికిత్స అంటూ ఏమీ లేదు. కుషింగ్స్ సిండ్రోమ్ అంటే శరీరంలో అనేక కారణాల వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల అనేక మానసిక, శారీరక సమస్యలతో పాటు రుతుక్రమంలో సమస్యలు ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రావు. ఈ సమస్యకు కారణాలను విశ్లేషించుకుని, డాక్టర్ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటే పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. - డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఆస్టియోపొరాసిస్ అంటే..
మా అక్కయ్యను హాస్పిటల్ చెకప్‌కు తీసుకెళ్తే ‘ఆస్టియో పొరాసిస్’ అని చెప్పారు. దీని గురించి వినడం ఇదే మొదటిసారి. వివరంగా తెలియజేయగలరు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలు ఎలా ఉంటాయి? – పి. శ్యామల, హైదరాబాద్ మనిషి ఎముకలు క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు కొలాజెన్ అనే కణజాలంతో కలసి గట్టిగా ఉండటం జరుగుతుంది. వీటి లోపల ఎల్లప్పుడూ పాత కణాలతో పాటు కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. ఈ ఖనిజాలతో ఎముకలు గట్టిగా దృఢంగా ఉంటాయి. ఎముకల లోపలి గుజ్జు అరిగిపోయి, ఎముకలు పెళుసుగా బలహీనంగా తయారై, ఎముకలు అరిగిపోవడానికి ‘ఆస్టియోపొరాసిస్’ అంటారు. దీనివల్ల మనిషి కొద్దిగా పడినా, జారినా ఎముకలు విరిగి ఫ్రాక్చర్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ సాధారణంగా వయసు పైబడే కొద్దీ, అంటే 45 ఏళ్ల వయసు దాటిన తర్వాత మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ బలహీనంగా ఉన్నవారిలో, జన్యు కారణాల వల్ల, తొందరగా మెనోపాజ్ దశకు చేరేవారిలో, క్యాల్షియం, విటమిన్–డి లోపం ఉన్నవారిలో, స్టిరాయిడ్స్ వంటి మందులు దీర్ఘకాలం వాడే వారిలో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేనివారిలో, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉన్నవారిలో ఎక్కువగా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ ఉన్నవారిలో ఎముకలలో కణజాలం అరిగిపోవడం ఉంటుంది కాని కొత్త కణజాలం తయారు కావడం తక్కువగా ఉంటుంది. ఆడవారిలో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గిపోవడంతో ఎముకలలోకి క్యాల్షియం చేరడం తగ్గిపోతుంది. దీనివల్ల నడుంనొప్పి, వెన్నెముక అరిగి ఎత్తు తగ్గడం, ఒంగిపోయినట్లు అవ్వడం, తరచు ఫ్రాక్చర్లు కావడం వంటి సమస్యలు ఉంటాయి. లక్షణాలు కనిపించేటప్పటికే ఎముకలు బాగా బలహీనపడి ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ కంటే ముందు ఆస్టియో పినియా దశ ఉంటుంది. ఇది ఎముకలలో గుజ్జు తగ్గడం మొదలయ్యే దశ. ఈ సమస్యను బీఎండీ, డెక్సా వంటి పరీక్షల ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మార్పులను మార్చడం కష్టం గాని, ఆహారంలో క్యాల్షియం ఎక్కువగా ఉండే పాల పదార్థాలు, ఆకూకూరలు, మాంసాహారం వంటివి తీసుకోవడం, వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయడం, ఎండలో వారానికి మూడుసార్లు కనీసం పావుగంట సేపు ఉండటం వల్ల విటమిన్–డి తయారవుతుంది. ఇది క్యాల్షియంను ఎముకలలోకి చేరుస్తుంది. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి, క్యాల్షియం మాత్రలు వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆస్టియో పొరాసిస్ త్వరగా రాకుండా నివారించవచ్చు. ఒకసారి ఆస్టియో పొరాసిస్ నిర్ధారణ అయిన తర్వాత పైన జాగ్రత్తలతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, బైఫాస్ఫొనేట్స్, రెలాక్సోఫిన్, పారాథైరాయిడ్ హార్మోన్ వంటి మందులను క్రమం తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో Urinary Tract Infection (UTI) సాధారణం అని చెబుతుంటారు. దీనికి కారణం ఏమిటి? ఎలాంటి నివారణ చర్యలు ఉన్నాయి? – కమల, కరీంనగర్ ప్రెగ్నెన్సీ సమయంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మామూలు వారిలో కంటే కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మూత్రాశయం వెనుకకు ఆనుకొనే గర్భాశయం ఉంటుంది. బిడ్డ పెరిగే కొద్దీ గర్భాశయం పెరుగుతూ మూత్రాశయం పైన బరువు పడటం, ఒత్తిడి పడటం వల్ల మూత్రం పూర్తిగా మూత్రాశయం నుంచి బయటకు రాలేకపోవచ్చు. అందువల్ల మూత్రం కొద్దిగా మూత్రాశయంలో నిల్వ ఉండిపోయే అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల మూత్రాశయంలో ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియా పెరిగి, వ్యాప్తి చెంది మూత్రాశయం నుంచి యురెటర్స్కు, తద్వారా కిడ్నీలకు ఇన్ఫెక్షన్ పాకే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్ల మంచినీళ్లను తాగాలి. మూత్రం వస్తుంటే ఆపుకోకుండా మూత్ర విసర్జన చేస్తుండాలి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రం చేసుకోవాలి. మల, మూత్ర విసర్జన తర్వాత యోనిభాగం దగ్గర చెమ్మ లేకుండా శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. మితమైన పౌష్టికాహారం తీసుకోవాలి. దానివల్ల రక్తహీనత లేకుండా, రోగనిరోధకశక్తి తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ చేయించుకొని, అందులో ఇన్ఫెక్షన్స్ ఉంటే యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ యాంటీ బయోటిక్స్ కోర్సు వాడాల్సి ఉంటుంది. - డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదరాబాద్ -
అప్పటి నుండి భయం పట్టుకుంది
మెనోపాజ్ లక్షణాల గురించి రెండు, మూడు సార్లు వినడం జరిగింది. అప్పటి నుంచి నాకు తెలియకుండానే ఒకలాంటి భయం పట్టుకుంది. మెనోపాజ్ సమస్యలను తగ్గించడానికి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, మెనోపాజ్ దశలో బరువు పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సీయన్, నెల్లిమర్ల నలభై సంవత్సరాలు దాటిన తర్వాత పీరియడ్స్ ఒక సంవత్సరం పాటు రాకుండా ఆగిపోతే దానిని మెనోపాజ్ దశ అంటారు. ఈ సమయంలో అండాశయాల పనితీరు మందగించిపోయి వాటి నుంచి స్రవించే ఈస్ట్రోజన్ హార్మోన్ దాదాపుగా పూర్తిగా ఆగిపోవడం వల్ల మెనోపాజ్ లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమయంలో శరీరంలో నుంచి ఉన్నట్లుండి వేడిగా ఆవిర్లు రావడం, అంతలోనే చెమటలు పట్టడం (హాట్ ఫ్లషెస్), గుండె దడగా ఉండడం, ఒళ్లు నొప్పులు, అలసట, మతిమరుపు, డిప్రెషన్, మూత్రసమస్యలువంటి లక్షణాలు ఒకొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడవచ్చు. మెనోపాజ్ దశలో అందరూ బరువు పెరగాలని ఏమిలేదు. ఈ సమస్యలను పూర్తిగా రాకుండా నివారించలేము. కాకపోతే లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఆహారంలో సోయాబీన్స్ వాటి ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం, ఆకుకూరలు, పాలు, పెరుగువంటివి తీసుకోవడం, ఉండే పరిసరాలు చల్లగా ఉండేట్లు చూసుకోవడం, యోగా, నడక, ధ్యానం వంటివి తప్పనిసరిగా చేయడం వల్ల మెనోపాజ్ దశ నుంచి చాలావరకు ఉపశమనం పొందవచ్చు. అలాగే బరువు పెరగకుండా, ఎముకలు బలహీన పడకుండా ఉంటాయి. ఇంకా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో ఈస్ట్రోజన్ హార్మోన్‌ను మాత్రల రూపంలో లేదా స్ప్రేలాగా, జెల్లాగా తక్కువ మోతాదులో వాడుకోవచ్చు. మా అత్తగారికి పొత్తికడుపులో నొప్పి వస్తుంది. అపుడప్పుడూ కళ్లు తిరిగి పడిపోతుంది. దీని గురించి వైద్యం మీద కాస్త అవగాహన ఉన్నవారిని సంప్రదిస్తే ‘డిఫికేషన్ సింకప్ కావచ్చు’ అంటున్నారు. ఇది నిజమేనా? డిఫికేషన్ సింకోపి ఎందుకు వస్తుంది? చికిత్స పద్ధతుల గురించి తెలియజేయండి. – డి.మాలతి, సంగారెడ్డి పొత్తి కడుపులో నొప్పి రావటానికి, కళ్లు తిరిగిపడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీ అత్తగారి వయసు ఎంత? బీíపీ, షుగర్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది రాయలేదు. కొంతమందిలో కొన్నిరకాల ఒత్తిడులకు గురైనప్పుడు లేదా ఏదైనా ఉన్నట్లుండి తీవ్రమైన నొప్పికి గురైనప్పుడు రక్తంలో కొన్ని రకాల హార్మోన్స్ విడుదలయ్యి, కొన్ని నరాలను స్పందింపజేసి మెదడుకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సంకోచించడం జరుగుతుంది. అలాగే గుండె తక్కువగా కొట్టుకుంటుంది. దీనివల్ల మెదడుకి ఉన్నట్లుండి రక్తసరఫరా, ఆక్సిజన్ అందకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. దీనినే వేసోవేగల్ షాక్ అంటారు. అలాగే కొందరిలో మలవిసర్జన సమయంలో ఇబ్బంది పడటం వల్ల కళ్ళు తిరిగి పడుతుంటారు. దీనినే డిఫికేషన్ సింకప్ అంటారు. ఇది ఎందుకు, ఎవరికి వస్తుందనేది ఖచ్చితంగా చెప్పలేము. కారణాలను బట్టీ చికిత్స పద్ధతులు ఉంటాయి. మొదట మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మొదట మీ అత్తగారిని డాక్టర్‌కి చూపించి పొత్తికడుపు నొప్పికి, కళ్ళు తిరిగిపడటానికి గల కారణాలను విశ్లేషించుకొని, అవసరమైన పరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది. నేను చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ అవుతుంటాను. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ఈ సమయంలో ‘స్ట్రెస్’ పడితే ‘చైల్డ్ పర్సనాలిటీ డిజార్డర్’ సమస్య ఏర్పడుతుందని చదివాను. ఇది ఎంతవరకు నిజం? ‘ప్రెగ్నెన్సీ ఫిట్నెస్’ అంటే ఏమిటి? – ఆర్.శ్రావణి, జహీరాబాద్ సాధారణంగా గర్భంలో బిడ్డ తొమ్మిదినెలల పాటు పెరిగేటప్పుడు బిడ్డ శారీరక ఎదుగుదలే కాకుండా మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. తల్లి ఆరోగ్యపరిస్థితి, మానసిక పరిస్థితిని బట్టి బిడ్డ మానసిక ఎదుగుదల కొద్దిగా ఆధారపడి ఉంటుంది. తల్లిలో ఉండే స్ట్రెస్లెవెల్స్ను బట్టి, స్ట్రెస్ మరీ తీవ్రంగా ఉంటే కొన్నిసార్లు బిడ్డ మానసిక ఎదుగుదల మీద ప్రభావం పడే అవకాశాలు కొద్దిగా ఉండవచ్చు. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల, తల్లి సరిగా ఆహారం, మందులు తీసుకోకపోవడం వల్ల కూడా బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం పడవచ్చు. చైల్డ్ పర్సనాలిటీ డిజార్డర్ ఏర్పడటానికి తల్లి మానసిక ఒత్తిడి ఒక్కటే కారణం కాదు. దీనికి తల్లి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునే కొన్ని యాంటిడిప్రెసెంట్ మందుల వల్ల తల్లిలో స్మోకింగ్, ఆల్కహాల్...కొన్ని జన్యుపరమైన కారణాలు ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల రావచ్చు. కాబట్టి గర్భం దాల్చక ముందు నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చిన తర్వాత కొన్ని రకాల మందులు డాక్టర్ సంరక్షణలో తీసుకోవటం, గర్భిణి సమయంలో యోగా, నడక, ప్రాణాయామం, ధ్యానం వంటివి పాటిస్తూ, సరైన పౌష్ఠికాహారం తీసుకుంటూ, మానసిక ఒత్తిడికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. దీనినే ‘ప్రెగ్నెన్సీ ఫిట్నెస్’ అని అంటారు. ఇందులో మరీ ఎక్కువ బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ -
ఆ టైమ్‌లో చేయవచ్చా?
పీరియడ్స్‌లో టైమ్‌లో సెక్స్‌లో పాల్గొనవచ్చా? దీని గురించి భిన్నమైన అభిప్రాయాలు విన్నాను. ఏది కరెక్టో తెలియడం లేదు. ‘బాండింగ్ హార్మోన్’, ప్రసవ సమయంలో ఉపయోగపడే హార్మోన్లు అంటే ఏమిటి? – డీకే, హైదరాబాద్ పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయ ముఖద్వారమైన సెర్విక్స్ కొద్దిగా తెరుచుకుంటుంది. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి క్రిములు తెరుచుకున్న సెర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి, ట్యూబ్స్‌లోకి, ఇంకా పొత్తికడుపులోకి పాకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. బ్లీడింగ్ వల్ల తడితో కలయికలో ఇబ్బందిగా, చిరాకుగా ఉండవచ్చు. కొందరిలో ఈ సమయంలో కలవడం వల్ల పీరియడ్‌లో వచ్చే తీవ్రమైన నొప్పి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి స్రవించే ఆక్సిటోసిన్ హార్మోన్‌ను ‘బాండింగ్ హార్మోన్’ అంటారు. ఇది కలయిక సమయంలో, కాన్పు సమయంలో, పాలు ఇచ్చేటప్పుడు విడుదలవుతుంది. దీని ప్రభావం వల్ల కాన్పు సమయంలో నొప్పులు రావడం, కాన్పు తర్వాత పాల ఉత్పత్తికి, పాలు రొమ్ము నుంచి బయటకు రావడానికి దోహదపడుతుంది. దీని ప్రభావం వల్ల భార్యా భర్తల మధ్య అన్యోన్యత, అలాగే బిడ్డ తల్లి దగ్గర పాలు తాగే కొద్ది తల్లీబిడ్డల అనుబంధం గట్టిపడుతుంది. కాబట్టి దీనిని బాండింగ్ హార్మోన్ అంటారు. నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఈ సమయంలో ఖర్జురాలు తినడం వల్ల ఈజీ, హెల్తీ ప్రెగ్నెన్సీకి ఉపయోగపడుతుందని చదివాను. కొందరు మాత్రం ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. నాకు చిరుతిండ్లు తినే అలవాటు ఎక్కువ. జున్ను ఎక్కువగా తింటాను. హెల్తీ ప్రెగ్నెన్సీకి ఎలాంటి పదార్థాలు తింటే మంచిది? – ఆర్.శైలజ, కాకినాడ ఖర్జూరాలలో అతి త్వరగా శక్తి రావడానికి కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్–కె వంటి పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొదటి మూడు నెలల్లో వికారం, వాంతులు వల్ల వచ్చే నీరసానికి త్వరగా శక్తినిస్తాయి. నాలుగో నెల నుంచి తల్లి శరీరంలో మార్పులకు, బిడ్డ ఎముకలు, నాడీ వ్యవస్థ సరిగా తయారవడానికి కావలసిన ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్–కె వంటి విటమిన్లు, ఖనిజాలు బాగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ వల్ల అరుగుదల బాగుండి, మలబద్ధకం లేకుండా ఉంటుంది. కాన్పు సమయంలో శక్తికి, నొప్పులు సరిగా రావడానికి ఈ పోషకాలు ఉపయోగపడతాయి. ఏదైనా అతిగా కాకుండా మితంగా తీసుకోవాలి. ఖర్జూరాలు రోజుకు 5–6 వరకు తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో చిరుతిండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు ఎక్కువగా పెరగడం, దానివల్ల ప్రెగ్నెన్సీలో బీపీ, సుగర్ వంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. జున్నులో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాకపోతే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారంలో తాజా ఆకుకూరలు, అన్నిరకాల కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు వంటి పోషకాహారం, మాంసాహారులైతే గుడ్లు, చేపలు, మాంసం మితంగా తీసుకోవచ్చు. నా వయసు 26 సంవత్సరాలు. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. గతంలో మసాలా పదార్థాలు ఎక్కువగా తినేదాన్ని, అయితే గత కొన్ని రోజులుగా ఛాతిలో మంట వస్తోంది. ఇది గతంలో తీసుకున్న తిండి తాలూకు ప్రభావమా? లేక గర్భిణులలో ఈ మంట సహజమా? – జి.కీర్తి, అనకాపల్లి గర్భిణిలలో హార్మోన్ల ప్రభావం వల్ల కడుపులో నుంచి ఆహారనాళంలోకి తిన్న ఆహారం వెనుకకు రాకుండా ఉండే స్ఫింక్టర్ వదులవుతుంది. అలాగే గర్భాశయంలో పెరిగే బిడ్డ వల్ల కలిగే ఒత్తిడికి పేగులు పైకి జరిగి, కడుపులో విడుదలయ్యే యాసిడ్ గొంతులోకి వచ్చి ఛాతీలో మంట, గొంతులో మంట, అజీర్తి వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆహారంలో మసాలాలు, కారం తీసుకున్నట్లయితే, ఛాతీలో మంట ఇంకా ఎక్కువవుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా తేలికగా జీర్ణమయ్యే ఆహారం కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఎక్కువగా మజ్జిగ, పెరుగు వంటివి తీసుకోవాలి. -డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ -
ఆ సమస్య ఉంటే... గర్భం దాల్చవచ్చా?
నాకు ఈమధ్య కొత్తగా పెళ్లయింది. అయితే నాకు ఫిట్స్ సమస్య ఉంది. ఫిట్స్ సమస్య ఉన్నవాళ్లు గర్భం దాల్చవచ్చా? ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? – బి.సంగీత, రామగుండం ఫిట్స్ సమస్య ఉన్నవాళ్లు గర్భందాల్చక ముందే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వారు ఫిట్స్ మందులను, మోతాదును గర్భందాల్చాక బిడ్డ మీద అతి తక్కువ దుష్ఫలితాలు ఉండేలా మార్చి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు గర్భం దాల్చక ముందు నుంచే ఫోలిక్ యాసిడ్–5ఎంజీ మాత్ర రోజుకొకటి చొప్పున వేసుకోవడం తప్పనిసరి. ఫిట్స్‌కు వాడే చాలామందుల వల్ల పుట్టబోయే బిడ్డలో నాడీవ్యవస్థ, మెదడు, వెన్నుపూసకు సంబంధించిన అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చిన తర్వాత మందులు సక్రమంగా వాడుతూ మూడో నెలలో ఎన్టీ స్కాన్, ఐదో నెలలో టిఫ్ఫా స్కాన్ వంటి పరీక్షలు చేయించుకుని, అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం మంచిది. కొందరిలో గర్భందాల్చిన తర్వాత హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఫిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిట్స్ ఎక్కువసార్లు రావడం వల్ల బిడ్డకు ఆక్సిజన్ సరఫరా సరిగా అందకపోవడం, బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాన్పు సమయంలో మానసిక, శారీరక ఒత్తిడి వల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాన్పు సమయంలో ఫిట్స్ రాకుండా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. ఫిట్స్ సమస్య ఉన్నవాళ్లు అన్ని వసతులూ ఉన్న హాస్పిటల్లో కాన్పు చేయించుకోవడం మంచిది. ఈమధ్య ‘బేబీ మిల్క్ స్టోరేజీ బ్యాగు’ల గురించి విన్నాను. వీటి గురించి తెలియజేయగలరు. ఇలా స్టోరేజీ మిల్క్‌ను పిల్లలకు ఇవ్వడం మంచిదేనా? జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? తల్లికి జలుబు చేసినప్పుడు పిల్లలకు పాలు ఇవ్వవచ్చా? – ఆర్. సులోచన, హైదరాబాద్ ఆధునిక కాలంలో ఎక్కువగా తల్లులు ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల కాన్పు తర్వాత తిరిగి ఉద్యోగానికి వెళ్లవలసిన పరిస్థితుల్లో బిడ్డకు పాలు పట్టించలేని పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడు రోజూ ఉద్యోగానికి వెళ్లేటప్పుడు తల్లిపాలను పిండి బయటకు తీసి, జాగ్రత్తపరచి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే వరకు వాటిని బిడ్డకు పట్టవచ్చు. కాకపోతే ఈ పాలను సరైన విధానంలో భద్రపరచవలసి ఉంటుంది. దీనికి అనుగుణంగానే బేబీ మిల్క్ స్టోరేజీ బ్యాగులు తయారు చేయబడ్డాయి. ఇవి ‘బీపీఏ ఫ్రీ’ ఉండి, ఇన్ఫెక్షన్లు లేకుండా స్టెరైల్గా ఉండి, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడానికి వీలుగా, పగలకుండా, ఫ్రిజ్ నుంచి తియ్యగానే తొందరగా సాధారణ టెంపరేచర్‌లోకి రావడానికి వీలుగా, అలాగే కొద్దిగా వేడిని తట్టుకునేలా దృఢంగా ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డకు నేరుగా తల్లిపాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఫార్ములా పాల బదులు తగిన జాగ్రత్తలతో స్టోరేజీ బ్యాగులో నిల్వచేసిన రొమ్ముపాలను ఇవ్వవచ్చు. పాలను స్టోరేజీ బ్యాగు నుంచి బాటిల్లోకి తీసుకునేటప్పుడు, వాటిని సాధారణ టెంపరేచర్‌కు తీసుకొచ్చేటప్పుడు, వాటిని రీఫ్రీజ్ చేసేటప్పుడు శుభ్రమైన పరిస్థితుల్లో చెయ్యవలసి ఉంటుంది. కంపెనీని బట్టి కొన్ని బ్యాగులు ఒక్కసారి వాడటానికి మాత్రమే పనికొస్తాయి. మరికొన్ని జాగ్రత్తగా శుభ్రం చేసుకుని, తిరిగి వాడుకోవడానికి పనికొస్తాయి. వాటి మీద రాసిన సూచనలను చూసుకుని, జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. తల్లికి జలుబు చేసినప్పుడు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు జలుబు రాదు. తల్లిపాల వల్ల జలుబు వైరస్ బిడ్డకు సోకదు. తల్లి పాలలో బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అవి బిడ్డకు చాలా వరకు జలుబు, విరోచనాలు కలిగించే క్రిముల నుంచి దూరంగా ఉంచుతాయి. గాలి ద్వారా బ్యాక్టీరియా, వైరస్ క్రిములు చేరడం ద్వారా బిడ్డకు జలుబు వస్తుంది గాని, తల్లిపాల ద్వారా కాదు. తల్లికి జలుబు ఉంటే ముక్కుకు, నోటికి టిష్యూ లేదా కర్చీఫ్ అడ్డుపెట్టుకుని పాలు ఇవ్వవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ‘విటమిన్–డి’ అవసరమని చెబుతారు కదా... దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? నేను యోగా చేస్తుంటాను. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చేయవచ్చా? ఎలాంటి ఆసనాలకు దూరంగా ఉండాలి? – కె.రమ్య, కాజీపేట్ విటమిన్–డి ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికే కాకుండా, బిడ్డ ఎదుగుదలకు కూడా చాలా అవసరం. విటమిన్–డి వల్ల తీసుకునే ఆహారం నుంచి ఎక్కువగా క్యాల్షియం రక్తంలోకి, ఎముకల్లోకి చేరుతుంది. దీనివల్ల తల్లిలో క్యాల్షియం నిల్వలు పెరుగుతాయి. తద్వారా తల్లిలో జరిగే శారీరక మార్పులకు, రక్తంలో జరిగే మార్పులకు, అవయవాల పనితీరుకు దోహదపడుతుంది. తద్వారా తల్లిలో ఒంటినొప్పులు, నడుంనొప్పి, కీళ్లనొప్పులు ఎక్కువగా లేకుండా ఉంటాయి. అలాగే కాన్పు సమయంలో పెల్విక్ ఎముకలు, కండరాలు సాగడానికి ఉపయోగపడుతుంది. బిడ్డకు తల్లి నుంచి క్యాల్షియం అందుతుంది. తద్వారా బిడ్డలోని అవయవాలు ఏర్పడటానికి, ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన పాళ్లలో విటమిన్–డి తీసుకుంటే బిడ్డ, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు గర్భం సరిగా ఉండి, బిడ్డ, మాయ పొజిషన్ పైకి ఉండి, గర్భాశయ ముఖద్వారం లూజుగా లేకపోతే మూడు నెలల తర్వాతి నుంచి మెల్లగా యోగాసనాలు చేసుకోవచ్చు. ఐదో నెల పూర్తయినప్పటినుంచి సక్రమంగా యోగాసనాలు చేసుకోవచ్చు. అయితే పొట్టమీద బరువు పడకుండా, ఆయాసం లేకుండా ఉండే యోగాసనాలు చేసుకోవచ్చు. - డా.వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
ఈ టైమ్‌లో వాడితే సైడ్ఎఫెక్ట్సా?
నా శరీరంలో ఐరన్ తక్కువగా ఉంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. గర్భిణిగా ఉన్నప్పుడు మామూలు కంటే రెండింతలు ఎక్కువ ‘ఐరన్’ అవసరం అని విన్నాను. ఐరన్ పెరగడానికి ఏమైనా ప్రత్యేక మందులు ఉన్నాయా? ఈ టైమ్‌లో వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? – బి.నళిని, తాడేపల్లిగూడెం రక్తంలో హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఇది రక్తం నుంచి శరీరంలోని ప్రతి అవయవానికీ ఆక్సిజన్ అందిస్తుంది. దీని తయారీకి ఐరన్ చాలా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో రక్తం మామూలు వారి కంటే ఎక్కువ తయారవుతుంది. రక్తం పెరగడానికి, హీమోగ్లోబిన్ శాతం పెరగడానికి గర్భిణులకు రెట్టింపు ఐరన్ అవసరమవుతుంది. ఐరన్ తక్కువగా ఉన్నట్లయితే, హీమోగ్లోబిన్ శాతం తగ్గి, తల్లిలో రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల తల్లిలో ఆయాసం, నీరసం, ఇంకా ఇతర సమస్యలు ఏర్పడి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డకు కూడా రక్తసరఫరా సరిగా లేకుంటే, బిడ్డ బరువు తక్కువగా పుట్టడం, నెలలు నిండకుండానే కాన్పులు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భిణి సమయంలో ఐరన్ ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, బీన్స్, కూరగాయలు, పండ్లు, పప్పులు, మాంసాహారంలో మటన్, చికెన్, లివర్, బోన్‌సూప్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో ఐరన్ త్వరగా చేరడానికి విటమిన్–సి అవసరమవుతుంది. దీనికి టమాటాలు, ఉసిరి, ఆరెంజెస్ వంటివి కూడా ఆహారంలో తీసుకోవాలి. కాఫీ, టీ వంటివి ఐరన్ రక్తంలో చేరకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు పోషకాహారంతో పాటు డాక్టర్ సలహా మేరకు ఐరన్ టాబ్లెట్లు, సిరప్ లేదా ఇంజెక్షన్లు తీసుకోవాలి. గర్భిణి సమయంలో ఐరన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఐరన్ వల్ల కొందరిలో వికారం, వాంతులు, మలబద్ధకం, విరోచనాలు వంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరు వీటికి నెమ్మదిగా అలవాటు పడతారు. ఐరన్ వల్ల మలం నల్లగా వస్తుంది. దీనికి భయపడనవసరం లేదు. మా బంధువుల అమ్మాయి ఒకరు పద్దెనిమిది సంవత్సరాలకే ప్రెగ్నెంట్ అయింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడం ప్రమాదం అని అంటారు కదా! ప్రమాదం జరగకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? గర్భం దాల్చడానికి ఏ వయసు సరైనదో తెలియజేయగలరు. – కె.వైష్ణవి, గూడూరు సాధారణంగా ఇరవై సంవత్సరాలకు ఆడవాళ్లు శారీరకంగా, మానసికంగా ఎదగడం జరుగుతుంది. అలాగే వీరి పెల్విస్ వెడల్పు అవడం, ఎముకలు పటిష్టంగా ఉండటం జరుగుతుంది. అమ్మాయిలు పిల్లలను కనడానికి 21 నుంచి 28 సంవత్సరాలు అనువైన వయసు. 18 సంవత్సరాల కంటే చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ బయటకు వచ్చే ద్వారం బలహీనంగా ఉండటం వల్ల కాన్పులో ఇబ్బందులు ఏర్పడం వంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికాలంలోఅమ్మాయిలు 18 సంవత్సరాలకు పుట్టింట్లో చిన్నపిల్లలుగానే ముద్దుగా, మురిపెంగా పెరుగుతున్నారు. వీరు మానసికంగా, శారీరకంగా పిల్లలను కనడానికి సంసిద్ధంగా ఉండరు. దానివల్ల గర్భం దాలిస్తే మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. చిన్న వయసులో గర్భం దాల్చినప్పుడు డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్‌లకు వెళ్లడం, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, రక్తహీనత ఉంటే ఐరన్ మాత్రలు, సరైన పోషకాహారం తీసుకోవడం, ఎముకల పటిష్టత కోసం పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, కాల్షియం మాత్రలు తీసుకోవడం చేయాలి. బీపీ వంటి ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు డాక్టర్ సంరక్షణలో అది ముదరక ముందే చికిత్స తీసుకోవాలి. కాన్పును ఇళ్లలో కాకుండా, అన్ని వసతులూ ఉన్న ఆస్పత్రిలో జరిగేలా చూసుకోవాలి. ఈ సమయంలో వీరికి కుటుంబ సభ్యులు మానసిక ధైర్యం ఇవ్వడం మంచిది. చలికాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఈ కాలానికి సంబంధించి ముఖ్యమైన నూట్రిషియన్స్ టిప్స్ తెలియజేయగరు. – జి.త్రివేణి, సంగారెడ్డి సాధారణంగా గర్భిణి సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల రోగనిరోధక శక్తి చాలా తగ్గుతుంది. దీనివల్ల వానాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మంచినీళ్లు ఎక్కువగా తాగాలనిపించదు కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో చలికి ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఉండటం, అది కూడా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఉలెన్ డ్రెస్‌లు వేసుకుని పూర్తిగా కప్పుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. బయట చల్లగా ఉన్నా, తేమ ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో కూడా కనీసం 2–3 లీటర్ల (ఫిల్టర్ వాటర్ లేదా కాచి వడబోసిన నీళ్లు) మంచినీళ్లు తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. చిన్నగా నడక, తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. ప్రతిసారీ తినేముందు, మలమూత్రాలకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో చర్మం పగిలి పొడిగా ఉండటం వల్ల దురద, మంట ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఈ సమయంలో మాయిశ్చరైజర్ వాడుకోవడం మంచిది. వేడిగా పాలు, తాజా పండ్లు తీసుకోవడం మంచిది. డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్, హైదరాబాద్ -
దానివల్ల తక్కువ బరువుతో పుడతారా?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. కొన్ని సంవత్సరాలుగా మైగ్రెయిన్‌తో బాధ పడుతున్నాను. మైగ్రెయిన్ సమస్య ఉన్నవాళ్లకు పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడడంతో పాటు రకరకాల సమస్యలు వస్తాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? నివారణ మార్గాలు ఉన్నాయా? – బి.సుష్మ, నిర్మల్ మైగ్రెయిన్ ఉన్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత మైగ్రెయిన్ తలనొప్పి తీవ్రత మరింతగా పెరుగుతుంది. కొందరిలో బాగా తగ్గిపోతుంది. కొందరిలో మైగ్రెయిన్ వల్ల బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. మైగ్రెయిన్ చాలాసార్లు రావడం వల్ల ఈ సమయంలో వాంతులు, వికారం, తలనొప్పి కారణంగా సరిగా తినలేకపోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మానసిక ఒత్తిడి లేకుండా సరిగా నిద్రపోవడం, ఆనందంగా ఉండటం, యోగా, నడక, ధ్యానం, మనసును వేరే పనుల మీదకు మళ్లించడం వంటివి చెయ్యడం వల్ల మైగ్రెయిన్ తీవ్రత కొంతవరకు తగ్గుతుంది. ఈ సమయంలో కాఫీ, టీ, కారాలు, మసాలాలు వంటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. మంచినీళ్లు ఎక్కువగా తాగడం, ఆహారం కొద్దికొద్దిగా తీసుకోవడం మంచిది. తలనొప్పికి పారాసెటిమాల్ మాత్రలు, వికారానికి, వాంతులకు ఓన్‌డన్‌సెట్రాన్ మాత్రలు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. తలనొప్పి మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో కారణాలను విశ్లేషించుకుని, మందులను వాడుకోవడం మంచిది. మా అమ్మాయి పదమూడు సంవత్సరాలకే పుష్పవతి అయింది. చిన్న వయసులో కావడం వల్ల భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతాయా? ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా? – యంఎన్, హైదరాబాద్ సాధారణంగా పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల లోపల అమ్మాయిలు పుష్పవతులు అవుతారు. అంటే ఈ వయసులో వారికి పీరియడ్స్ మొదలవుతాయి. ఈ ఆధునిక కాలంలో జంక్‌ఫుడ్, ఎలక్ట్రానిక్ మీడియా, త్వరగా హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో మార్పులు జరిగి మరీ పది సంవత్సరాలకే కొందరిలో పీరియడ్స్ మొదలవుతున్నాయి. మీ అమ్మాయి పదమూడు సంవత్సరాలకు– సరైన వయసులోనే రజస్వల అయింది. ఇప్పుడు అమ్మాయిలు బాగా తెలివిగా, హుషారుగా ఉంటున్నారు. అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తను పీరియడ్స్‌కు అలవాటు పడేంత వరకు ప్యాడ్స్ వాడటం, వ్యక్తిగత శుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం వంటి వాటి ప్రాముఖ్యతను వివరించి చెప్పడం మంచిది. రజస్వల అయిన కొన్ని నెలలు పీరియడ్స్ సక్రమంగా ఉండవు. కొందరిలో త్వరత్వరగా పీరియడ్స్ రావడం, బ్లీడింగ్ ఎక్కువ కావడం, కడుపునొప్పి వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో వారికి మానసిక ధైర్యం ఇవ్వడం చాలా అవసరం. వారితో ప్రేమగా, ఓర్పుగా వ్యవహరించడం మంచిది. మా స్నేహితురాలికి పొట్టలో నొప్పి వస్తే స్కానింగ్ చేయించుకుంది. గర్భాశయం వాచింది అని చెప్పారట. గర్భాశయం వాయడానికి కారణాలు ఏమిటి? చికిత్స విధానం ఎలా ఉంటుందో తెలియజేయగలరు. – శిరీష, ఖమ్మం అనేక రకాల సందర్భాలలో గర్భాశయంలో వచ్చే మార్పులను వాడుకభాషలో గర్భాశయం వాచింది అంటారు. ఇందులో సాధారణంగా గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల వచ్చే పరిస్థితిని ‘పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్’ (పీఐడీ) అంటారు. కొంతమందిలో చాలా కాన్పుల తర్వాత గర్భాశయం సాగి పరిమాణం పెరుగుతుంది. దీనిని ‘బల్కీ యుటెరస్’ అంటారు. కొందరిలో ప్రతినెలా బ్లీడింగ్‌లో ఎండోమెట్రియమ్ పొర వచ్చినట్లే, కొందరిలో ఈ పొర గర్భాశయ కండరంలోకి అంటే ‘మయోమెట్రియమ్’ పొరలోకి చొచ్చుకుపోతుంది. ఈ పొరలో ప్రతినెలా బ్లీడింగ్ అవుతూ అవుతూ గర్భాశయ పరిమాణం పెరిగి గట్టిగా తయారవుతుంది. దీనిని ‘అడినోమయోసిస్’ అంటారు. ఇలా అనేక సందర్భాల్లో గర్భాశయ పరిమాణం పెరగడాన్ని గర్భాశయం వాచింది అంటారు. పైన చెప్పిన కారణాలను బట్టి చికిత్స కూడా వేర్వేరుగా ఉంటుంది. పొట్ట పైనుంచి చేసే స్కానింగ్‌తో పాటు ట్రాన్స్‌వజైనల్ స్కానింగ్ కూడా చేయించుకుంటే గర్భాశయం వాపు ఏకోవకు చెందినదనేది చాలావరకు నిర్ధారణ అవుతుంది. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. ఇకవేళ ఇన్ఫెక్షన్ వల్ల అయితే దానికి తగిన యాంటీబయోటిక్స్ మందులతో చికిత్స తీసుకోవచ్చు. అడినోమయోసిస్ అయితే హార్మోన్ల చికిత్స తీసుకుని చూడవచ్చు. ఎక్కువ కాన్పుల వల్ల గర్భాశయం సాగితే, దాని వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి చికిత్స అవసరం ఉండదు. కొందరు భయపడి అవసరం లేకున్నా గర్భాశయాన్ని తొలగించుకుంటూ ఉంటారు. అది సరికాదు. అన్ని రకాల మందులు, ప్రత్యామ్నాయాలు వాడినా, బ్లీడింగ్ ఎక్కువగా ఉండటం, కడుపులో నొప్పి విపరీతంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నట్లయితే, ఇక తప్పదు అనుకున్నప్పుడే గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది. - డా. వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందుల గురించి తెలియజేయగలరు. మావారు బాగా నలుపుగా ఉంటారు. నేను తెలుపు. పుట్టబోయే బేబీకి నా రంగు వస్తుందా? అది దేని మీద ఆధారపడి ఉంటుంది? – పిఆర్. కొత్తపేట తల్లి లేదా తండ్రిలో లేదా వారి రక్త సంబంధీకులలో ఎవరికైనా జన్యుపరమైన సమస్యలు ఉన్నా, లేకపోతే పిండం ఏర్పడే సమయంలో అండం నాణ్యత, శుక్రకణం నాణ్యత సరిగా లేకపోయినా, అండం–శుక్రకణంతో కలిసి ఫలదీకరణ చెందే సమయంలో ఏదైనా లోపాల వల్ల, లేక ఫలదీకరణ చెందిన అండంలోవి కణాల విభజన సరిగా జరగకపోయినా, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల, పుట్టే పిల్లలలో జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా జన్యుపరమైన సమస్యలు రాకుండా ఉండటానికి ఏం చెయ్యలేము. వాటికి మందులు ఏమి లేవు. కాకపోతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేముందు నుంచి భార్యభర్తలిద్దరూ ఫోలిక్ యాసిడ్ మాత్ర రోజుకొకటి చొప్పున తీసుకోవడం మంచిది. ఇద్దరిలో లేదా ఫ్యామిలీలో ఏవైనా జన్యుపరమైన సమస్యలు ఉంటే ఒకసారి జెనిటిక్ కౌన్సెలింగ్‌కు వెళితే, పుట్టబోయే బిడ్డకు, అవి వచ్చే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి అనేది నిపుణులు విశ్లేషించి చెప్పటం జరుగుతుంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు దంపతులు ఇద్దరూ దురలవాట్లకు దూరంగా ఉంటూ, మంచి పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. బిడ్డ రంగు తల్లి లేదా తండ్రి, లేదా ఇతర కుటుంబసభ్యుల మీద కొద్దిగా ఆధారపడి ఉంటుంది. ఎవరి రంగు వస్తుంది అని ముందే చెప్పలేం. ఎవరి జీన్స్ డామినేట్‌గా ఉంటే వారి రంగు రావచ్చు. ముందునుంచే ఫ్యామిలీలో జన్యుపరమైన సమస్యలు ఉంటే ఒకసారి జెనిటిక్ కౌన్సెలింగ్ చెయ్యించుకుని, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటే, టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతిలోని ప్రీజెనిటిక్ స్క్రీనింగ్ పద్ధతులను అనుసరించవచ్చు. నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. పుట్టబోయే బిడ్డకు సీసా పాలు కాకుండా నా పాలు పట్టించాలనేది నా కోరిక. ఏ హార్మోన్ల వల్ల పాల ఉత్పత్తి బాగుంటుంది? దీనికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు. –జి.పద్మ, విజయనగరం పుట్టిన బిడ్డకు మొదటి ఆరునెలలు కేవలం తల్లి పాలు పట్టించడం వల్ల బిడ్డకు అనేక పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల పిల్లల్లో ఆస్త్మా, విరోచనాలు, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బిడ్డకు మీ పాలు పట్టించాలన్న కోరిక చాలా మంచిది. పాలు సరిగా రావాలంటే మెదడు నుంచి ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ అనే హార్మోన్లు సక్రమంగా విడుదల కావాలి. దీనికోసం మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేసి ఈ హార్మోన్స్‌ను సక్రమంగా విడుదల చేస్తుంది. అలాగే బిడ్డకు పుట్టిన గంట నుంచే తల్లి రొమ్మును పటి చీకించడం ద్వారా ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలై త్వరగా పాలు పడతాయి. ఆహారంలో అన్నిరకాల ఆకు కూరలు, పప్పులు, పండ్లు, పాలు, పెరుగు వంటి వాటితో పాటు రోజుకు రెండు లీటర్ల నీరు తీసుకోవాలి. మాంసాహారులైతే గుడ్లు, చేపలు, మాంసం వంటివి ఎక్కువ కారం, మసాలాలు లేకుండా తీసుకోవచ్చు. కాబట్టి బాలింతలు కాన్పు తర్వాత సరైన పోషకాహారం తీసుకుంటూ, మానసిక ఒత్తిడి లేకుండా సరిగా నిద్రపోవాలి. అనవసరమైన ఆందోళనలకు గురికాకుండా సంతోషంగా ఉంటే పాలు సరిగా వస్తాయి. గ్రహణం సమయంలో గర్భిణి స్త్రీలు ఇంటి నుంచి బయటికి రావద్దని అంటారు. చంద్రగ్రహణ ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందా? గర్భిణి స్త్రీలకు ఏ సమయంలో ఉదయం ఎండ తగిలితే మంచిది? దీని వల్ల ఉపయోగాలు ఏమిటి? – సత్యశ్రీ, కర్నూలు సూర్యుని చుట్టు భూమి, భూమి చుట్టు చంద్రుడు ఇలా ఒకదాని చుట్టు ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఇవి మూడు ఒకే కక్ష్యలోకి వచ్చి ఒక దాని కిరణాలను సరిగా బయటకు రానివ్వకుండా అడ్డుపడటాన్ని గ్రహణం అంటారు. గ్రహణాల వల్ల వచ్చే కిరణాలు గర్భిణులకు తగిలితే కడుపులోని బిడ్డకు అవయవ లోపాలు ఏర్పడతాయని, గ్రహణం మొర్రి అంటే పెదవులపై చీలిక వంటి సమస్యలు వస్తాయని చాలామంది అనుకుంటుంటారు. అయితే, ఇవన్నీ అపోహలు మాత్రమే. గ్రహణాల వల్ల ఇలా జరుగుతాయని అనడానికి ఇంతవరకు జరిగిన వైద్య పరిశోధనల్లో ఏమీ తేలలేదు. కాబట్టి కంగారు పడనవసరం లేదు. అంతగా భయం ఉంటే గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా, ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తే సరిపోతుంది. పొద్దుట పూట వచ్చే ఎండలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మంలోని కొలెస్ట్రాల్‌ను ప్రేరేపించి, దాని నుంచి విటమిన్–డి తయారవడానికి దోహదపడుతుంది. తల్లిలో విటమిన్–డి సరైన మోతాదులో ఉంటే అది బిడ్డకు కూడా చేరి, బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే తల్లికి రక్తంలో క్యాల్షియం చేరడానికి ఉపకరిస్తుంది. తద్వారా తల్లికి ఎముకలు దృఢంగా ఉంటాయి. కాని దానికి ఎండలో ఉండటం ఒక్కటే మార్గం కాదు. గర్భిణులు ఆహారంలో తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసాహారం, క్యాల్షియం, విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల ముఖంపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు ఎండలో ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. దీనివల్ల శరీరం వేడెక్కడం, డీహైడ్రేషన్‌కు గురికావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పొద్దున్న పదకొండు గంటల నుంచి ఒంటగంట వరకు ఉండే ఎండలో అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల విటమిన్–డి ఎక్కువగా తయారవుతుంది. గర్భిణులు ఈ సమయంలో ఐదు నుంచి పది నిమిషాలు వారానికి మూడుసార్లు ఉండవచ్చు. ఈ కిరణాలు కాళ్లు, చేతులు, భుజాలకు, ముఖానికి పడేటట్లు చూసుకుని ఉండవచ్చు. - డా. వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
ఇది సహజమేనా?
ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్. బాగా చెమటలు పడుతున్నాయి. రాత్రి వేళల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఇంతకుముందు లేదు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇది సహజమేనా? లేక సీరియస్‌గా తీసుకోవాల్సిన సమస్యా? నివారణ చర్యల గురించి తెలియజేయగలరు. – పి.తులసి, భద్రాచలం ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దాని వల్ల ఒళ్లంతా వేడిగా ఉన్నట్లుండి, జ్వరం వచ్చినట్లు ఉండటం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తుంటాయి. సాయంకాలం, రాత్రి వేళల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కొందరిలో హైపర్ థైరాయిడిజమ్ సమస్య ఉన్నప్పుడు, సుగర్ మాత్రలు వాడుతున్నప్పుడు సుగర్ శాతం తగ్గడం వల్ల, జ్వరం మాత్రలు, బీపీ మాత్రలు వాడుతున్నప్పుడు చెమటలు ఎక్కువగా పట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కూడా జ్వరంతో పాటు చెమటలు పట్టవచ్చు. ఎక్కువ కారం, మసాలా ఆహారం, కాఫీ, టీ, కూల్డ్రింకులు ఎక్కువగా తీసుకున్నా, శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నా చెమటలు పట్టవచ్చు. మీరు చెప్పిన ప్రకారం చెమటలు రాత్రివేళలోనే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే సహజ లక్షణాలుగానే అనిపిస్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో అవసరాలకు ఎక్కువ శక్తి ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువగా చెమటలు పడతాయి. కాబట్టి కంగారు పడకుండా, ఈ సమయంలో ఎక్కువ ఎండలో లేకుండా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. లేతరంగు వదులు దుస్తులు ధరించడం, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం, పచ్చళ్లు, కారాలు, మసాలాలు, కాఫీ, టీ, కూల్డ్రింకులకు వీలైనంత దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. చెమటలు మరీ ఎక్కువగా ఉండి, గుండెదడ వంటి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించి, సమస్యను తెలుసుకోవడానికి తగిన పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవడం మంచిది. ∙నా భర్తకు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అసలు వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏమిటి? మందుల ద్వారా పెంచే అవకాశం ఉందా? ‘ఆలిగో అస్తినో స్పెర్మియా’ గురించి వివరంగా తెలియజేయగలరు. – కేఎన్, మామిడిపల్లి, నిజామాబాద్ జిల్లా సాధారణంగా గర్భం రావడానికి మగవారి వీర్యంలో ఒక మిల్లీలీటరుకు 15–20 మిలియన్లు ఉండాలి. వాటిలో మంచి కదలిక కలిగినవి కనీసం 42 శాతం ఉండాలి. మంచి నాణ్యత కలిగినవి 4 శాతం ఉండాలి. పైన చెప్పిన సంఖ్య కంటే తక్కువ సంఖ్యలో వీర్యకణాలు ఉండటం, కదలిక తక్కువ ఉంటే ఆ పరిస్థితిని ‘అలిగో అస్తినో స్పెర్మియా’ అంటారు. దీనివల్ల సాధారణంగా గర్భం రాదు. మగవారిలో ఎఫ్ఎస్హెచ్, సీహెచ్, ప్రోలాక్టిన్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ వంటి హార్మోన్ల ఉత్పత్తి, పనితీరు సరిగా లేనప్పుడు వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గుతుంది. కొందరిలో మానసిక ఒత్తిడి, పొగతాగడం, మద్యపానం, మధుమేహం, మంప్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, బీజకోశం మీద ఏదైనా ఆపరేషన్లు, కొన్ని రకాల వృత్తులలో వేడి వల్ల, రసాయనాల వల్ల, వెరికోసిల్, మెదడులో కణితులు వంటి అనేక కారణాల వల్ల వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం జరుగుతుంది. దీనికి చికిత్సలో భాగంగా కారణం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి యూరాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన రక్తపరీక్షలు, స్క్రోటమ్ డాప్లర్ స్కాన్ వంటివి చేయించుకుని, సమస్యను బట్టి చికిత్స తీసుకుని చూడవచ్చు. చికిత్స కనీసం మూడు నెలల పాటు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే వీర్యకణాలు టెస్టిస్ నుంచి ఉత్పత్తయి బయటకు రావడానికి కనీసం 70 రోజులు పడుతుంది. సాధారణ జాగ్రత్తల్లో భాగంగా పొగతాగడం, మద్యపానం మానేయాలి. వదులుగా ఉండే లోదుస్తులు ధరించాలి. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్, కారాలు, మసాలాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కువ మంచినీళ్లు, మజ్జిగ, డ్రైఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవడం మంచిది. నా వయసు 23 సంవత్సరాలు. కొంచెం బలహీనంగా ఉంటాను. ఈమధ్య మా బంధువుల అమ్మాయికి గర్భస్రావం అయింది. అప్పటి నుంచి నాలో భయం మొదలైంది. ఏయే కారణాల వల్ల గర్భస్రావం జరగడానికి అవకాశం ఉంది? అలా కాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి దయచేసి తెలియజేయగలరు. – కె.సుష్మ, నందిగామ గర్భ నిర్ధారణ తర్వాత ఏడు నెలల లోపే గర్భం పోవడాన్ని అబార్షన్లు అంటారు. మొదటి మూడు నెలల్లో గర్భం పోవడాన్ని ఫస్ట్ ట్రెమిస్టర్ అబార్షన్లంటారు. నాలుగు–ఆరు నెలల్లోపు గర్భం పోతే, సెకండ్ ట్రెమిస్టర్ అబార్షన్లంటారు. సాధారణంగా ఫస్ట్ ట్రెమిస్టర్ అబార్షన్లు జన్యుపరమైన కారణాల వల్ల, పిండంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన జన్యువుల్లో లోపాల వల్ల లేదా ఫలదీకరణ సమయంలో అపశ్రుతుల వల్ల, అండం, శుక్రకణం నాణ్యత సక్రమంగా లేకపోవడం వల్ల కావచ్చు. మిగిలిన కొన్ని అనేక రకాల హార్మోన్ల లోపాల వల్ల కావచ్చు. గర్భాశయంలో లోపాలు, గర్భాశయ ముఖద్వారం లూజుగా ఉండటం, ఇన్ఫెక్షన్లు వంటి ఇతర కారణాల వల్ల సెకండ్ ట్రెమిస్టర్ అబార్షన్లు అవుతుంటాయి. కొందరిలో దీర్ఘకాలిక వ్యాధులు, గుండె, కిడ్నీ సమస్యలు, రక్తహీనత, అదుపులోలేని మధుమేహం వంటి వాటి వల్ల కూడా అబార్షన్లు కావచ్చు. కొందరి శరీరంలో రక్తం గూడు కట్టే సమస్యలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా పిండం పెరగకుండా అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. బలహీనంగా ఉన్నంత మాత్రాన అబార్షన్లు అవాలనేమీ లేదు. క్రమంగా పౌష్టికాహారం తీసుకుంటూ, గర్భం కోసం ప్రయత్నించవచ్చు. పది శాతం మందిలో ఎన్నో తెలియని కారణాల వల్ల కూడా అబార్షన్లు కావచ్చు. వీటిలో అన్ని అబార్షన్లనూ నివారించలేము. డాక్టర్‌ను సంప్రదిస్తే, అబార్షన్లకు కారణాలను విశ్లేషించి, సమస్యను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. - డా.వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
నాకు ఆ సమస్య ఉంది
నాకు తరచుగా మైగ్రేన్ వస్తోంది. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్లకు మైగ్రేన్ సమస్య ఉంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుందని, లేదంటే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుడతారని విన్నాను. ఇది నిజమేనా? – కె.శైలజ, ఒంగోలు మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత, ఒక్కొక్కరి శరీతత్వాన్ని బట్టి, వారిలో విడుదలయ్యే హార్మోన్స్ మోతాదుని బట్టి... కొందరిలో మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. కొందరిలో అంతే ఉంటుంది. కొందరిలో పెరుగుతుంది. కొందరిలో దీని వల్ల అబార్షన్స్ కావు కానీ, ప్రెగ్నెన్సీకి బీపీ పెరగడం, బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పు కావడం, సిజేరియన్ డెలివరీలు ఎక్కువ అవ్వడం, పుట్టిన తర్వాత బిడ్డలో.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం, ఫిట్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో వికారం, వాంతులు, తలనొప్పి వల్ల సరిగా నిద్రలేకపోవడం, సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా పైన చెప్పిన సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ సమయంలో మైగ్రేన్ ఉన్నవాళ్లు, సరైన విరామం, నిద్ర, మానసిక ప్రశాంతత ఉండేటట్లు చూసుకోవడం మంచిది. అలాగే ధ్యానం, యోగా, నడక వంటివి పాటించడం మంచిది. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుకోవచ్చు. అలాగే మైగ్రేన్ అటాక్‌ను ప్రేరేపించే అంశాలు అంటే.. స్ట్రెస్ వంటి అంశాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. నా వయసు 29 సంవత్సరాలు. నెలసరి ఆలస్యం అవుతోంది. ఫ్రెండ్ ఒకరు ‘ఫైబ్రాయిడ్ సమస్య కావచ్చు’ అంటున్నారు. మరొకరేమో ‘మెనోపాజ్ టైమ్‌లో తప్ప ఈ వయసులో అలాంటిదేమీ ఉండదు’ అంటున్నారు. ఏది నిజం? – జి.గీత, ఆదిలాబాద్ హార్మోన్లలో అసమతుల్యత, బరువు పెరగటం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, థైరాయిడ్ సమస్య, అండాశయంలో నీటి బుడగలు, కణితులు వంటి అనేక సమస్యల వల్ల 29 సంవత్సరాల వయసులో నెలసరి ఆలస్యం అవుతుంది. ఫైబ్రాయిడ్ సమస్య ఉన్నప్పుడు పీరియడ్స్ త్వరగా రావటం, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, మధ్య మధ్యలో బ్లీడింగ్ కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ పీరియడ్స్ ఆలస్యం అవ్వవు. పీరియడ్స్ ఆలస్యం అవ్వడం అనేది మెనోపాజ్ సమయంలోనే కాకుండా.. పైన చెప్పిన సమస్యల వల్ల ఏ వయసులోనైనా ఉండవచ్చు. మీకు నెలసరి ఆలస్యం అంటే.. ఎన్ని రోజులు అని రాయలేదు. కొందరిలో శరీరతత్వాన్ని బట్టి ప్రతి నెలా వారం రోజులు ఆలస్యం అంటే.. 35 రోజులకొకసారి రావటం జరుగుతుంది. ఇది వారి శరీరంలో ఉండే హార్మోన్స్‌ను బట్టి ఉంటుంది. అది వాళ్లకి మామూలే అయ్యి ఉండవచ్చు. అదేం సమస్య కాదు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి పీరియడ్స్ ఎందుకు ఆలస్యం అవుతున్నాయోనని తెలుసుకోవటానికి అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగ్ వంటి పరీక్షలు చెయ్యించుకుని సమస్యకు తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది. నా వయసు 21 సంవత్సరాలు. పీరియడ్స్ టైమ్‌లో నొప్పి చాలా ఇబ్బందిగా ఉంటోంది. నొప్పిని అధిగమించడానికి, తగ్గించడానికి చిట్కాలు, మందులు ఏమైనా ఉన్నాయా? పోస్ట్ అబార్షన్ బ్లీడింగ్ అంటే ఏమిటి? – బీఆర్, నర్సంపేట సాధారణంగా పీరియడ్స్ సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ మోతాదుని బట్టి, కొందరిలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కొద్దిగా ఉంటుంది. కొందరిలో అసలు ఉండదు. కొందరిలో గర్భాశయంలో కణితులు, ఇన్ఫెక్షన్లు, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే.. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి స్కానింగ్ చేయించుకుని సమస్యను బట్టి చికిత్స తీసుకోవాలి. సమస్య ఏం లేకపోతే నొప్పి ఉన్న రోజులు, నొప్పి నివారణ నెలలో రెండు రోజులు నొప్పి నివారణ మందులు వేసుకోవడం వల్ల ప్రమాదం ఏం లేదు. మాత్రలు వాడుకోవచ్చు. ఆ సమయంలో పొత్తికడుపు మీద వేడి నీళ్లతో కాపడం పెట్టుకోవచ్చు. వేడి నీళ్లతో స్నానం చెయ్యవచ్చు. చిన్న చిన్న యోగాసనాలు, చిన్నగా నడవడం వంటివి చెయ్యడం వల్ల కూడా చాలా వరకూ నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. సాధారణంగా అబార్షన్ తర్వాత అయ్యే రక్తస్రావాన్ని పోస్ట్ అబార్షన్ బ్లీడింగ్ అంటారు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, ఇంకా అనేక అంశాలను బట్టి అబార్షన్ తర్వాత రెండు మూడు రోజుల నుంచి మూడు వారాల దాక అవ్వవచ్చు. కొందరిలో బ్లీడింగ్ కొద్దికొద్దిగా ఉంటుంది. కొందరిలో చాలా ఎక్కువగా ఉండవచ్చు. కొందరిలో ఇన్ఫెక్షన్స్ రక్తంలో క్లాటింగ్ సమస్యలు, ముక్కలు ఉండిపోవడం గర్భాశయానికి చిల్లు పడటం వంటి అనేక సమస్యలు వల్ల కూడా అబార్షన్స్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా అవ్వొచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన రక్తపరీక్షలు స్కానింగ్ చెయ్యించుకుని, సమస్యకు తగ్గ చికిత్స తీసుకోవచ్చు. - డా. వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
అవి ఉంటే ప్రమాదమా?
నాకు నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ అవుతోంది. తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది. గర్భసంచిలో గడ్డల వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అసలు గర్భసంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి? ఇది ప్రమాదకరమా? చికిత్స పద్ధతులు ఏమిటి? – ఆర్.ఎన్ నిజామబాద్ నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడానికి గర్భసంచిలో గడ్డలే కాకుండా, అండాశయాల్లో కణితులు, ఇన్ఫెక్షన్లు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. మూత్రంలో ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లవలసి వస్తుంది. మీరు డాక్టర్‌ను సంప్రదించకుండా, సమస్యకు కారణం తెలుసుకోకుండా గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని అనుమానించడం సరికాదు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, పెల్విక్ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్యను బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. సాధారణంగా గర్భసంచిలో గడ్డలను ఫైబ్రాయిడ్స్ అంటారు. ఒక్కొక్కసారి శరీరతత్వాన్ని బట్టి, హార్మోన్ల అసమతుల్యత వల్ల, జన్యుపరమైన మార్పుల వల్ల, తెలియని అనేక కారణాల వల్ల ఇవి ఏర్పడవచ్చు. వీటి పరిమాణం, ఇవి గర్భసంచిలో ఉండే పొజిషన్‌ను బట్టి లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రమాదకరం కాదు గాని, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే, నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ గర్భసంచి బయటి పొరలో ఉండి, పరిమాణం చిన్నగా ఉంటే లక్షణాలు ఏమీ ఉండవు. పరిమాణం పెద్దగా ఉంటే వాటిని తొలగించవలసి ఉంటుంది. వీటికి కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్, కొన్ని మందులు వాడటం వల్ల వీటి పరిమాణం కొంత తగ్గి, లక్షణాల తీవ్రత తగ్గుతుంది. కాని వాటిని ఆపేసిన తర్వాత ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి మళ్లీ పరిమాణం పెరగవచ్చు. కొందరిలో ఫైబ్రాయిడ్స్‌కు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలిజమ్’ పద్ధతి ద్వారా బ్లాక్ చేయడం ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణం తగ్గుతుంది. కొందరిలో ఎంఆర్ఐ గైడెడ్ వేడి అల్ట్రాసౌండ్ తరంగాలను పెల్విక్ భాగంలోకి పంపడం ద్వారా ఫైబ్రాయిడ్స్ చాలా వరకు కరుగుతాయి. ఫైబ్రాయిడ్ సైజు మరీ పెద్దగా ఉండి, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే, మయెమెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా తొలగించడం జరుగుతుంది. ఇది పొట్ట కోసి, లేదా పరిమాణాన్ని బట్టి ల్యాపరోస్కోపీ ద్వారా చేయవచ్చు. ఫైబ్రాయిడ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే గర్భసంచి తొలగించడం జరుగుతుంది. నా వయసు 28 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్. గర్భిణులు తప్పనిసరిగా హెపటైటిస్–సి టెస్ట్ చేయించేకోవాలని చదివాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. నేను సన్నగా ఉంటాను. పుట్టిన బిడ్డ బరువు తక్కువగా పుడితే, బరువును పెంచడం కోసం ఏమైనా విధానాలు ఉన్నాయా? – కె.నీరజ, హైదరాబాద్ హెపటైటిస్–సి అనేది హెపటైటిస్–సి వైరస్ వల్ల వచ్చే వ్యాధి. హెపటైటిస్–సి ఉన్నవారి రక్తాన్ని సరిగా పరీక్షించకుండా ఎక్కించడం వల్ల, ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి ఉపయోగించిన సిరంజ్‌లు వాడటం వల్ల, సెక్స్ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. గర్భిణులకు ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే, కొన్నిసార్లు బిడ్డకు సోకి నెలలు నిండకుండానే ప్రసవం కావడం, బిడ్డ బరువు తక్కువగా పుట్టడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. తల్లిలో ఇది లివర్‌పై ప్రభావం చూపి, నీరసం, వాంతులు, ఆకలి లేకపోవడం, వంటి సమస్యలు తలెత్తవచ్చు. గర్భిణులకు ఇప్పుడు హెచ్ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ వంటి రక్తపరీక్షలు చేస్తున్నామో, అలాగే హెపటైటిస్–సి వైరస్ టెస్ట్ కూడా చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలో వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే, ఆ ఇన్ఫెక్షన్ పాతదా కాదా, వైరస్ లోడ్ ఎంత ఉన్నదీ తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షలు చేయించుకుని, డాక్టర్ల పర్యవేక్షణలో తల్లికి బిడ్డకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, కాంప్లికేషన్స్ ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. మీరు సన్నగా ఉన్నంత మాత్రాన బిడ్డ కూడా సన్నగా పుట్టాలనేమీ లేదు. గర్భిణి సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలి. అలాగే డాక్టర్ దగ్గరకు సక్రమంగా చెకప్‌లకు వెళ్లాలి. గర్భంతో ఉన్నప్పుడు తల్లి నుంచి బిడ్డకు రక్తసరఫరా సరిగా లేకపోయినా, ఉమ్మనీరు తక్కువగా ఉన్నా, బీపీ పెరగడం, ఇన్ఫెక్షన్లు, తల్లిలో పోషకాహార లోపం వంటి ఎన్నో కారణాల వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టవచ్చు. పీరియడ్ సమయంలో తలకు షాంపు ఉపయోగించకూడదని, హెయిర్ స్పాకు వెళ్లకూడదని, వ్యాయామాలు చేయకూడదని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? ఈ టైమ్‌లో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు, ఆహారం గురించి తెలియజేయగలరు. పీరియడ్ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొనవచ్చా? – డీఆర్, ఒంగోలు పీరియడ్స్ అనేది ఆడవారి శరీరంలో నెలనెలా జరిగే మార్పులలో ఒకటి. ఈ సమయంలో తలకు షాంపూ ఉపయోగించకూడదు, హెయిర్ స్పాకు వెళ్లకూడదని ఏమీ లేదు. మామూలు సమయంలో ఎలా ఉంటారో ఈ సమయంలో కూడా అలాగే ఉండి అన్ని పనులూ చేసుకోవచ్చు. బ్లీడింగ్ మరీ ఎక్కువగా లేకుండా, ఇబ్బంది ఏమీ లేకపోతే చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు. ఈ సమయంలో వ్యాయామాలు చేయడం వల్ల శరీరం తేలికగా ఉండి, కడుపునొప్పి కూడా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బ్లీడింగ్ అవడం వల్ల కొందరిలో నీరసంగా ఉంటుంది. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, మంచినీళ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి. పీరియడ్స్ టైమ్‌లో బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయ ముఖద్వారం కొద్దిగా తెరుచుకుంటుంది. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భాశయానికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బ్లీడింగ్ వల్ల అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో శారీరక పరిశుభ్రత, జననేంద్రియాల పరిశుభ్రత చాలా ముఖ్యం. న్యాప్కిన్స్ తరచుగా మార్చుకుంటూ ఉండాలి. చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. -డా.వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదరాబాద్ -
ఎవరిది లోపం?
గర్భం రాకపోవడానికి స్త్రీ, పురుషులలో ఎక్కువ బాధ్యత లేదా లోపం ఎవరిదై ఉంటుంది? లోపాల విషయానికి వస్తే ఇద్దరిదీ సమానబాధ్యత ఉంటుందా? ఫెల్లోపియన్ ట్యూబుల్లో వచ్చే సమస్యలు కూడా గర్భం రాకపోవడానికి కారణం అంటుంటారు. దీని గురించి వివరించగలరు. – టి.ఎన్., గుంటూరు ఆడవారిలో సమస్యల వల్ల, 35% మగవారిలో సమస్యల వల్ల, 30% ఇరువురిలో సమస్యలు ఉండడం వల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మగవారిలో శుక్ర కణాలు తక్కువ ఉండటం, అసలు లేకపోవటం, వాటి నాణ్యత, కదలిక సరిగా లేకపోవటం, హార్మోన్ల లోపం, జన్యు లోపం, ఇన్ఫెక్షన్లు వంటి అనేక కారణాల వల్ల సంతానం కలగకపోవటానికి కారణాలు కావచ్చు. ఆడవారిలో హార్మోన్ల లోపం, అండం తయారు కాకపోవటం, అండం నాణ్యత సరిగా లేకపోవటం, గర్భాశయంలో లోపాలు, గడ్డలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు మూసుకొనిపోవటం, ఇన్ఫెక్షన్లు వంటివి... ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల సంతానం కలగడానికి ఇబ్బంది అవుతుంది. 30% మందిలో భార్య, భర్త ఇద్దరిలోను సమస్యలు, ఇంకా పరిశోధనలలో కూడా తెలియని ఎన్నో కారణాల వల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి సంతానం కలగనప్పుడు దంపతులు ఇద్దరూ కూడా తప్పనిసరిగా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆడవారిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల, ఇంకా కొన్ని కారణాల వల్ల గర్భాశయం ఇరువైపులా ఉండే ఫెలోపియన్ ట్యూబ్లలో వాపు, అడ్డంకులు ఏర్పడి, అవి మూసుకొనిపోవటం జరగవచ్చు. ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల అండం, వీర్యకణాలు ట్యూబ్‌లోకి ప్రవేశించలేకపోవటం, రెండూ ఒకటి కాలేకపోవటం వల్ల గర్భం ధరించటంలో ఇబ్బంది ఏర్పడుతుంది.ఫెలోపియన్ ట్యూబ్స్ తెరుచుకుని ఉన్నాయా, మూసుకొని ఉన్నాయా తెలుసుకోవటానికి హిస్టరోసాల్పింగో గ్రామ్ (హెచ్ఎస్జీ) అనే ఎక్స్–రే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ట్యూబ్స్ మూసుకొని ఉంటే, ల్యాపరోస్కోపి ద్వారా సరిచేయడానికి ప్రయత్నం చేయవచ్చు. నాకు నవ్వడం అంటే చాలా ఇష్టం. ఏ చిన్న జోక్ చెప్పినా విపరీతంగా నవ్వుతుంటాను. మావారు నన్ను రకరకాల జోక్స్ చెప్పి నవ్విస్తుంటారు. అయితే ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్‌ని. ఈ సమయంలో గట్టిగా నవ్వడం సరికాదని ఇంట్లో పెద్దలు చెబుతున్నారు. ఇది నిజమేనా? – ఆర్వి, కాజీపేట గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఎంతో ఆనందంగా సమయాన్ని గడిపితే అంతే ఆరోగ్యంగా బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదుగుతుంది. అలాగే తల్లి కూడా మానసిక ఆందోళన లేకుండా, తొమ్మిది నెలలు తేలికగా గడిచిపోతాయి. ప్రెగ్నెన్సీలో గట్టిగా నవ్వకూడదని ఎక్కడా లేదు. ఆరో నెల నుంచి కడుపులో బిడ్డ బయట శబ్దాలను వినగలుగుతుంది. అలాగే మీ మానసిక పరిస్థితి బిడ్డ ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుంది. గట్టిగా నవ్వడం వల్ల, కడుపులో బిడ్డ కూడా పైకి, కిందకి కదులుతుంది. గట్టిగా నవ్వడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దీనివల్ల మెదడు నుంచి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవి మనసుని, శరీరాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతాయి. అవయవాలకి రక్త సరఫరా పెరుగుతుంది. అలాగే బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకి దోహదపడుతుంది. కాబట్టి నువ్వు గట్టిగా నవ్వడాన్ని గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. నీకు ఎలా నవ్వాలనిపిస్తే అలా నవ్వుకోవచ్చు. దానివల్ల నీకు, పుట్టబోయే బిడ్డకి ఇద్దరికీ మంచిదే! నగరాల్లో నివసించే గర్భిణి స్త్రీలు gestational diabetes అనే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు ఈమధ్య చదివాను. దీని గురించి వివరించండి. ఇది రాకుండా ముందుజాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? – ఆర్.ఎన్., తాడిపత్రి గర్భిణీల రక్తంలో చక్కెర శాతం ఉండాల్సిన దాని కంటే పెరగడాన్ని gestational diabetes అంటారు. ప్రెగ్నెన్సీలో కొందరి శరీర తత్వాన్ని బట్టి, కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల, ముందు నుంచే బరువు అధికంగా ఉండటం, తల్లిదండ్రులలో షుగర్ వ్యాధి ఉండటం, ప్రెగ్నెన్సీ సమయంలో బరువు అధికంగా పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం... వంటి అనేక కారణాల వల్ల gestational diabetes వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. gestational diabetesనగరాల్లో ఉండే గర్భిణీలలోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాలలో ఉండే గర్భిణీలలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే నగరాలలో ఉండే కొంతమంది గర్భిణీలలో వారిలో ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల, ఎక్కువ శారీరక శ్రమ చెయ్యకపోవటం వల్ల, అధిక బరువు ఉండటం వల్ల నగరాలలో ఉండే గర్భిణీలలో gestational diabetesఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు ఉన్న మహిళలు, గర్భం రాకముందే బరువు తగ్గటం, గర్భం వచ్చిన తర్వాత ఆహారంలో స్వీట్స్, షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు, పండ్లలో అరటిపండు, సపోటా వంటివి తక్కువగా తీసుకోవటం, అధిక బరువు పెరగకుండా అన్నం తక్కువ తిని, కూరలు ఎక్కువ తీసుకోవటం, చిన్న చిన్న పనులు, కొద్దిగా వాకింగ్ వంటివి చేయడం వల్ల చాలావరకు gestational diabetesని కొందరిలో నివారించవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల వచ్చేgestational diabetesని నివారించలేక పోవచ్చు. కాకపోతే ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, తక్కువ మోతాదులో మందులతో gestational diabetes అదుపులో ఉంటుంది. అలాగే దానివల్ల వచ్చే సమస్యలు పెరగకుండా, కాంప్లికేషన్స్ ఎక్కువ కాకుండా బయటపడవచ్చు. -
బావను పెళ్లి చేసుకోవచ్చా?
సందేహం నేను డిగ్రీ పూర్తి చేశాను. నేను మా బావ లవ్‌లో ఉన్నాం. ఇద్దరికీ వయసులో మూడేళ్ల తేడా ఉంది. మా అమ్మానాన్నలది మేనరికం పెళ్లి. నేను, మా బావ పెళ్లి చేసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డలకు సమస్యలు తలెత్తుతాయని, మేనరికం మంచిది కాదని చాలామంది చెబుతున్నారు. నాకు మా బావ అంటే చాలా ఇష్టం. అతన్ని వదులుకోలేను. నా సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందా? - లావణ్య, హైదరాబాద్ మేనరికపు పెళ్లిళ్ల వల్ల, అంటే దగ్గరి రక్తసంబంధీకులు పెళ్లి చేసుకున్నప్పుడు వారి జన్యువులలో ఏ చిన్న సమస్య ఉన్నా, ఇద్దరి జన్యువులు బిడ్డకు సంక్రమించడం జరుగుతుంది కాబట్టి పుట్టే బిడ్డలో అది బయట పడుతుంది. ముందు తరాల వాళ్లవి కూడా మేనరికపు పెళ్లిళ్లే అయితే పుట్టే బిడ్డకు సమస్యలు తలెత్తే అవకాశం ఇంకా పెరుగుతుంది. మామూలుగా పెళ్లి చేసుకునేవారి పిల్లల్లో జన్యు సమస్యలు, అవయవ లోపాలు, ఇతర సమస్యలు 2-3 శాతం ఉంటే, మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లల్లో ఈ సమస్యలు 4-6 శాతం వరకు ఉండవచ్చు. అంటే రెట్టింపు అన్నమాట. అంతేకాని మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలందరికీ సమస్యలు ఉంటాయనేమీ లేదు. పెళ్లికి ముందుగా మీరిద్దరూ ఒకసారి జెనెటిక్ కౌన్సెలర్‌ను సంప్రదించండి. మీ కుటుంబంలోని అందరి వివరాలు, వారిలో ఉండే సమస్యలు వంటివి అన్నీ అడిగి తెలుసుకుని, వివరాలన్నింటినీ విశ్లేషించి మీకు పుట్టబోయే బిడ్డలకు సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో తెలిపే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే మీరిద్దరికీ రక్తపరీక్ష చేసి చూస్తారు. జెనెటిక్ కౌన్సెలర్లు కూడా మీకు పుట్టబోయే బిడ్డలకు జన్యు సమస్యలు వస్తాయని గాని, లేదని గాని నూటి నూరు శాతం ముందుగానే చెప్పలేరు. అయితే, వీలైనంత వరకు మేనరికపు పెళ్లిళ్లను నివారించడమే క్షేమం. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకున్నా, పుట్టబోయే బిడ్డలకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే, వాటిని నివారించడానికి ఎలాంటి మందులు, ఇంజెక్షన్లు లేవు. కాకపోతే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే కొన్ని రకాల జన్యు సమస్యలు, అవయవ లోపాలు గుర్తించడానికి మూడో నెల చివరలో ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్ లేదా క్వాడ్రుపుల్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఐదో నెల చివరలో 2డీ ఎకో స్కాన్ చేయించుకుంటే గుండెలో రంధ్రాలు వంటివి ఉన్నట్లయితే ముందుగానే తెలుసుకోవచ్చు. కొన్ని రకాల జన్యు సమస్యలు, అవయవ లోపాలు బయటపడినప్పుడు, వాటికి చికిత్స లేనప్పుడు పుట్టిన తర్వాత జీవితాంతం బాధపడే కంటే ముందుగా తెలుసుకోవడం వల్ల వద్దు అనుకుంటే ఐదో నెల లోపల అబార్షన్ చేయించుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే, కొన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా, పుట్టబోయే బిడ్డలో ఎటువంటి సమస్యలూ ఉండవని నూటికి నూరు శాతం చెప్పలేము. మూగ, చెవుడు, బుద్ధిమాంద్యం, మెటబాలిక్ డిజార్డర్, హార్మోన్ల లోపాలు వంటివి బిడ్డ పెరిగే కొద్దీ బయటపడతాయి. నా వయసు 24 ఏళ్లు, పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మాత్రలు రాసిచ్చారు. అవి వేసుకుంటే నొప్పి తగ్గుతోంది. ప్రతిసారీ నొప్పి ఉంటోంది. అలాగని మాత్రలను ఎక్కువగా వాడితే దుష్ఫలితాలు ఉంటాయేమోనని భయంగా ఉంది. నాకు బలపాలు, సుద్దముక్కలు తినే అలవాటు ఉంది. మంచిది కాదని తెలిసినా మానుకోలేకపోతున్నాను. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - శశి, నూజివీడు మెచ్యూరైన తరువాత కొందరిలో హార్మొన్స్ సక్రమంగా పనిచెయ్యడానికి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల సమయం పట్టవచ్చు. దానివల్ల ఆ సమయంలో పీరియడ్స్ సక్రమంగా ఉండకపోవచ్చు. వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు దాని వల్ల ఇబ్బంది ఏమీ లేదు. పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. అవి విడుదలయ్యే మోతాదును బట్టి గర్భాశయం కండరాలు కుదించుకుని బ్లీడింగ్ బయటకు రావడం వల్ల కొందరిలో కడుపు నొప్పి వస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి నొప్పి తీవ్రత ఉంటుంది. ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటే, నొప్పి ఉన్న రోజులలో రోజుకు రెండు చొప్పున నొప్పి నివారణ మాత్రలు వాడవచ్చు. నెలకి రెండు రోజులు నొప్పి మాత్రలు వాడడం వల్ల ప్రమాదం ఏమీలేదు. కొందరిలో గర్భాశయంలో గడ్డలు, అండాశయంలో సిస్ట్లు వంటి ఇతర సమస్యలు ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. అశ్రద్ధ చేయకుండా ఒకసారి స్కానింగ్ చేయించుకొని, గర్భాశయంలో కాని, అండాశయాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. రక్తం తక్కువ ఉన్నప్పుడు బలపాలు, చాక్‌పీస్‌లు, బియ్యం వంటివి తినాలని అనిపిస్తుంది. కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల, అవి శరీరం లోపల రక్తాన్ని పీల్చుకోవడం వల్ల రక్తం తగ్గి బలపాలు తినాలనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఒకసారి రక్తం ఎంత ఉందో complete blood picture (cbp) పరీక్ష చేయించుకొని రక్తం తక్కువ ఉంటే, పెరగడానికి ఆకుకూరలు, పప్పులు, పండ్లు, మాంసాహారంతో పాటు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. అలాగే నులి పురుగులకు కూడా ఆల్బెండజోల్ మాత్ర ఒక్కటి తీసుకోవచ్చు. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్