దానివల్ల తక్కువ బరువుతో పుడతారా? | Doctors Advice On Health Problems | Sakshi
Sakshi News home page

దానివల్ల తక్కువ బరువుతో పుడతారా?

Published Sun, Aug 4 2019 12:19 PM | Last Updated on Sun, Aug 4 2019 12:19 PM

Doctors Advice On Health Problems - Sakshi

ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. కొన్ని సంవత్సరాలుగా మైగ్రెయిన్‌తో బాధ పడుతున్నాను. మైగ్రెయిన్‌ సమస్య ఉన్నవాళ్లకు పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడడంతో పాటు రకరకాల సమస్యలు వస్తాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? నివారణ మార్గాలు ఉన్నాయా?
– బి.సుష్మ, నిర్మల్‌

మైగ్రెయిన్‌ ఉన్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత మైగ్రెయిన్‌ తలనొప్పి తీవ్రత మరింతగా పెరుగుతుంది. కొందరిలో బాగా తగ్గిపోతుంది. కొందరిలో మైగ్రెయిన్‌ వల్ల బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. మైగ్రెయిన్‌ చాలాసార్లు రావడం వల్ల ఈ సమయంలో వాంతులు, వికారం, తలనొప్పి కారణంగా సరిగా తినలేకపోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మానసిక ఒత్తిడి లేకుండా సరిగా నిద్రపోవడం, ఆనందంగా ఉండటం, యోగా, నడక, ధ్యానం, మనసును వేరే పనుల మీదకు మళ్లించడం వంటివి చెయ్యడం వల్ల మైగ్రెయిన్‌ తీవ్రత కొంతవరకు తగ్గుతుంది. ఈ సమయంలో కాఫీ, టీ, కారాలు, మసాలాలు వంటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. మంచినీళ్లు ఎక్కువగా తాగడం, ఆహారం కొద్దికొద్దిగా తీసుకోవడం మంచిది. తలనొప్పికి పారాసెటిమాల్‌ మాత్రలు, వికారానికి, వాంతులకు ఓన్‌డన్‌సెట్రాన్‌ మాత్రలు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. తలనొప్పి మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్‌ పర్యవేక్షణలో కారణాలను విశ్లేషించుకుని, మందులను వాడుకోవడం మంచిది.

మా అమ్మాయి పదమూడు సంవత్సరాలకే పుష్పవతి అయింది. చిన్న వయసులో కావడం వల్ల భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతాయా? ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా?
– యంఎన్, హైదరాబాద్‌

సాధారణంగా పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల లోపల అమ్మాయిలు పుష్పవతులు అవుతారు. అంటే ఈ వయసులో వారికి పీరియడ్స్‌ మొదలవుతాయి. ఈ ఆధునిక కాలంలో జంక్‌ఫుడ్, ఎలక్ట్రానిక్‌ మీడియా, త్వరగా హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో మార్పులు జరిగి మరీ పది సంవత్సరాలకే కొందరిలో పీరియడ్స్‌ మొదలవుతున్నాయి. మీ అమ్మాయి పదమూడు సంవత్సరాలకు– సరైన వయసులోనే రజస్వల అయింది. ఇప్పుడు అమ్మాయిలు బాగా తెలివిగా, హుషారుగా ఉంటున్నారు. అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారు.

కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తను పీరియడ్స్‌కు అలవాటు పడేంత వరకు ప్యాడ్స్‌ వాడటం, వ్యక్తిగత శుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం వంటి వాటి ప్రాముఖ్యతను వివరించి చెప్పడం మంచిది. రజస్వల అయిన కొన్ని నెలలు పీరియడ్స్‌ సక్రమంగా ఉండవు. కొందరిలో త్వరత్వరగా పీరియడ్స్‌ రావడం, బ్లీడింగ్‌ ఎక్కువ కావడం, కడుపునొప్పి వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో వారికి మానసిక ధైర్యం ఇవ్వడం చాలా అవసరం. వారితో ప్రేమగా, ఓర్పుగా వ్యవహరించడం మంచిది.

మా స్నేహితురాలికి పొట్టలో నొప్పి వస్తే స్కానింగ్‌ చేయించుకుంది. గర్భాశయం వాచింది అని చెప్పారట. గర్భాశయం వాయడానికి కారణాలు ఏమిటి? చికిత్స విధానం ఎలా ఉంటుందో తెలియజేయగలరు.
– శిరీష, ఖమ్మం

అనేక రకాల సందర్భాలలో గర్భాశయంలో వచ్చే మార్పులను వాడుకభాషలో గర్భాశయం వాచింది అంటారు. ఇందులో సాధారణంగా గర్భాశయంలో ఇన్ఫెక్షన్‌ రావడం వల్ల వచ్చే పరిస్థితిని ‘పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌’ (పీఐడీ) అంటారు. కొంతమందిలో చాలా కాన్పుల తర్వాత గర్భాశయం సాగి పరిమాణం పెరుగుతుంది. దీనిని ‘బల్కీ యుటెరస్‌’ అంటారు. కొందరిలో ప్రతినెలా బ్లీడింగ్‌లో ఎండోమెట్రియమ్‌ పొర వచ్చినట్లే, కొందరిలో ఈ పొర గర్భాశయ కండరంలోకి అంటే ‘మయోమెట్రియమ్‌’ పొరలోకి చొచ్చుకుపోతుంది. ఈ పొరలో ప్రతినెలా బ్లీడింగ్‌ అవుతూ అవుతూ గర్భాశయ పరిమాణం పెరిగి గట్టిగా తయారవుతుంది. దీనిని ‘అడినోమయోసిస్‌’ అంటారు. ఇలా అనేక సందర్భాల్లో గర్భాశయ పరిమాణం పెరగడాన్ని గర్భాశయం వాచింది అంటారు.

పైన చెప్పిన కారణాలను బట్టి చికిత్స కూడా వేర్వేరుగా ఉంటుంది. పొట్ట పైనుంచి చేసే స్కానింగ్‌తో పాటు ట్రాన్స్‌వజైనల్‌ స్కానింగ్‌ కూడా చేయించుకుంటే గర్భాశయం వాపు ఏకోవకు చెందినదనేది చాలావరకు నిర్ధారణ అవుతుంది. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. ఇకవేళ ఇన్ఫెక్షన్‌ వల్ల అయితే దానికి తగిన యాంటీబయోటిక్స్‌ మందులతో చికిత్స తీసుకోవచ్చు. అడినోమయోసిస్‌ అయితే హార్మోన్ల చికిత్స తీసుకుని చూడవచ్చు. ఎక్కువ కాన్పుల వల్ల గర్భాశయం సాగితే, దాని వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి చికిత్స అవసరం ఉండదు. కొందరు భయపడి అవసరం లేకున్నా గర్భాశయాన్ని తొలగించుకుంటూ ఉంటారు. అది సరికాదు. అన్ని రకాల మందులు, ప్రత్యామ్నాయాలు వాడినా, బ్లీడింగ్‌ ఎక్కువగా ఉండటం, కడుపులో నొప్పి విపరీతంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నట్లయితే, ఇక తప్పదు అనుకున్నప్పుడే గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది. 
- డా. వేనాటి శోభ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో, హైదర్‌నగర్‌, హైదరాబాద్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement