
నా వయస్సు 19. ఎత్తు 5.6 బరువు 42. అయితే నాకూ 5 సంవత్సరాల నుండి రొమ్ములో కొంత బాగం గట్టిగా ఉంది కదులుతూ ఉంటుంది కూడా. నేను చాలా సన్నగా ఉంటాను. నాకు ఛాతీ చిన్నగా ఉంటుంది. పీరియడ్ రెగ్యులర్‌గానే వస్తుంది కానీ, కడుపు నొప్పి ఉంటుంది. తెలిసిన డాక్టర్‌ని అడిగితే పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులకు పోతుంది అన్నారు. కానీ కొన్ని నెలల నుండి నొప్పి ఎక్కువగా ఉంటుంది. మసాజ్ చేయడం వల్ల కొంతకాలం ఉపశమనం లభిస్తుంది. నేను హాస్టల్‌లో ఉండి చదువుతున్నా. అక్కడ ఫుడ్ బాగుండదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కడుపు నొప్పి కోసం హోమియోపతి మందులు 3 నెలలు వాడాను. నా సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ఏమయినా ట్యూమర్ అయ్యే అవకాశం ఉందా?? సమస్య ఏంటో దానికి కారణం, చికిత్స తెలియచేయాలని మనవి. – శ్రీ విద్య. కరీంనగర్.
నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, నీకు రొమ్ములో ఫైబ్రోఎడినోమా అనే ప్రమాదం లేని గడ్డ ఉన్నట్లు అనుమానంగా ఉంది. ఇందులో గడ్డ చేతికి తగులుతూ, రొమ్మును తాకినప్పుడు అటు ఇటూ కదులుతూ ఉంటుంది. అందులో నువ్వు సన్నగా ఉండి, ఛాతీ చిన్నగా ఉండడం వల్ల ఇది బాగా తెలుస్తున్నట్లుంది. దీని గురించి నువ్వు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఒకసారి రొమ్ము అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే గడ్డ పరిమాణం, లక్షణాలు తెలుస్తాయి. గడ్డ పరిమాణం బట్టి కొందరికి కొన్ని మందుల ద్వారా గడ్డ కరిగి దాని సైజు తగ్గుతుంది. అంతేకాని పూర్తిగా కరిగిపోతుందని చెప్పడం కష్టం. మరీ బాగా పెద్దగా ఉంటే ఆపరేషన్ ద్వారా తొలగించవలసి ఉంటుంది. పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్‌లో మార్పుల వల్ల బ్లీడింగ్ బయటకు వచ్చేటప్పుడు గర్భాశయ కండరాలు కుదించుకున్నట్లయి పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది.
దీని తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. కొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్ గడ్డలు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఇన్‌ఫెక్షన్‌లు వంటి ఎన్నో సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో, నడుములో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన స్కానింగ్ లాంటి పరీక్షలు చేయించుకొని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. సమస్య ఏమి లేకపోతే నొప్పి ఎక్కువగా ఉన్న రోజులు రోజుకు రెండు సార్లు నొప్పి నివారణ మాత్రలు వేసుకోవచ్చు. పొత్తి కడుపు మీద కొద్దిగా వేడినీటితో కాపడం పెట్టుకోవడం, కొద్దిగా మసాజ్, ప్రాణాయామం వంటి చిట్కాలు పాటించవచ్చు.
నా పెళ్లయి నాలుగేళ్లవుతోంది. నా వయసు 31, మా వారి వయసు 33. పిల్లల కోసం ప్లానింగ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతోంది. కన్సీవ్ కాకపోయే సరికి డాక్టర్‌ను సంప్రదించాం. పరీక్షల్లో నా ఎగ్ కౌంట్ తక్కువగా ఉందని తేలింది. మందులతో కౌంట్ పెరుగుతుందా? ఐవీఎఫ్‌కి వెళ్లాలా? ఆ ప్రాసెస్ చాలా పెయిన్‌ఫుల్ అని విన్నాను. పరిష్కారం సూచించగలరు. – ప్రతిభ, భువనేశ్వర్
సాధారణంగా తల్లి గర్భంతో ఉన్నప్పుడు పరిపక్వం కాని అండాలు 7 లక్షలు ఉంటాయి. అవి కొన్ని నశించిపోతూ బిడ్డ పుట్టేటప్పటికి 4 లక్షలు మిగులుతాయి. వీటిలో కూడా రజస్వల అయ్యేటప్పటికి ఒక్కొక్కరి శరీరతత్వం, జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల ప్రభావం వల్ల చాలా నశించిపోయి లక్ష నుంచి 1.5 లక్షలవరకు మిగులుతాయి. వీటిలో రజస్వల అయినప్పటి నుంచి ప్రతి నెలా ఒక అండం పరిపక్వత చెంది, అది విడుదల అవుతుంది. ఒక అండం పెరిగి లోపల అనేక అండాలు పెరగడానికి ప్రయత్నించి ప్రతినెలా అవి నశించిపోతూ ఉంటాయి. అలా అనేక అండాలు ఉన్నా, జీవితకాలంలో దాదాపు 400 అండాలు మాత్రమే పరిపక్వత చెంది పెరిగి విడుదలయ్యి, పిల్లలు పుట్టడానికి ఉపయోగపడతాయి. 35 సంవత్సరాలు దాటేకొద్దీ అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోవడం మొదలవుతుంది.
కొందరిలో శరీరతత్వం, ఇంకా అనేక కారణాల వల్ల 30 సంవత్సరాలకే, కొందరిలో ఇంకా చిన్న వయసుకే అండాల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. యోని నుంచి చేసే ట్రాన్స్ రీజియనల్ స్కానింగ్ ద్వారా గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాల్లో అండాల సంఖ్య ఎంత ఉంది (ఎంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్) అనేది నిర్ణయించడం జరుగుతుంది. అలాగే ఏఎమ్‌హెచ్ అనే రక్త పరీక్షద్వారా ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అనేది నిర్ణయిస్తారు. కొందరిలో ఎగ్‌కౌంట్ తక్కువ ఉన్నా, కొంత కాలం ప్రతి నెలా అండం విడుదలవుతుంది. కొందరిలో అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు హార్మోన్ మందులు, ఇంజెక్షన్‌ల ద్వారా ఉన్న ఎగ్‌కౌంట్‌లో అండం పెరుగుదలకు ప్రయత్నించడం జరుగుతుంది. 40–50 శాతం మందిలో ఈ మందుల ప్రభావం వల్ల అండాలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
అలా ప్రయత్నించినా కాని పరిస్థితిలో అండాలు పెరగడానికి చాలా ఎక్కువ మోతాదులో హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి, ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) పద్ధతి ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ పద్ధతిలో కూడా అండాలు ఎక్కువ పెరగకపోవచ్చు. అలాంటప్పుడు వేరే దాతల నుంచి అండాలను సేకరించి భర్త వీర్యకణాలను వాటిలోకి పంపి ఫలదీకరణ చేసి, తద్వారా వచ్చిన పిండాలను మీ గర్భాశయంలోకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు కంగారుపడకుండా మూడు నెలలు మందులు, ఇంజెక్షన్‌ల ద్వారా ప్రయత్నించి, కాకపోతే పైన చెప్పిన పద్ధతులను అనుసరించవలసి ఉంటుంది.
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment