gynecology
-
Father of Gynecology: ప్రయోగాల వెనుక దారుణ నిజాలు..!
ప్రస్తుతం గైనకాలజీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గానీ పూర్వం రోజుల్లో ఇవి లేక మహిళలు చాలా ఇబ్బందిపడేవారు. తమ సమస్యలను మరొకరితో చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడేవారు. అలాంటి పరిస్థితుల్లో వారుపడే అంతర్గత గైనకాలజీ సమస్యలు చికిత్స లేనివిగా ఉండేవి. ఆ దిశగా ప్రయోగాలు చేసేవాళ్లు కూడా తక్కువే. అందులోనూ స్త్రీ శరీర ధర్మాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందుకు అనుగుణంగా చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిపై ధైర్యంగా ప్రయోగాలు చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి జేమ్స్ మారియన్ సిమ్స్. అతని వల్లే స్త్రీల ప్రసూతి సమస్యలకు నివారణోపాయాలు కనిపెట్టడానికి మార్గం సుగమమైంది. ఆ నేపథ్యంలో అతడు ఒడిగట్టిన దారుణలు తెలిస్తే వామ్మో అని విస్తుపోతారు. 'గైనాకాలజీ' అనే అంశం వస్తే అతడికే ధన్యవాదాలు చెప్పుకొవాలి. అంతేగాదు అతడిని "ఆధునిక గైనకాలజీ పితామహుడు"గా అభివర్ణిస్తారు కూడా. అయితే ఈ గైనకాలజీ సమస్యలను నివారించే క్రమంలో అతడు చేసిన దారుణ ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. గైనకాలజీ నిపుణులు జేమ్స్ మారియన్ సిమ్స్ 1813లో అమెరికా సౌత్ కరోలినాలోని లాంకాస్టర్ కౌంటీలో జన్మించాడు. అతడు జెఫెర్సన్ మెడికల్ కాలేజీలో మూడు నెలల కోర్సు పూర్తి చేసుకుని ఒక వైద్యుడి వద్ద ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాడు. ఆ తర్వాత సాధారణంగా కొన్నేళ్లు హౌస్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఆ కాలంలో సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేయకుండానే నేరుగా వైద్య వృత్తిని కొనసాగించేవారు. ఆ నేపథ్యంలోనే ఆయన వల్ల ఇద్దరు రోగులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత జేమ్స్ అలబామాలోని మోంట్‌గోమెరీకి మకాం మార్చాడు. అక్కడ జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో వైద్య మానవీయ శాస్త్రాల ప్రొఫెసర్ వెనెస్సా గాంబుల్ ఆధ్వర్యంలో డాక్టర్‌గా పనిచేసేవాడు. అక్కడ ఉండే ఎనిమిది మంది వ్యక్తుల ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందించేవాడు. కొందరిని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. అక్కడ వారిపై ప్రయోగాలు చేసేవాడు. అయితే ఆరోజుల్లో మహిళల ప్రసూతికి సబంధించిన సమస్యలను పరిశీలించడానకి సరైన పరికరాలు ఉండేవి కాదు. దీంతో వారి సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రత్యత్పత్తి అవయవాల్లోకి వేళ్లను చొప్పించి గానీ తెలుసుకోవడానికి వీలు ఉండేది కాదు. అలాగే వారికి చికిత్స చేసేందుకు అనువైన బెడ్ కూడా ఉండేది కాదు. అవమానీయ పద్ధతుల్లో మహిళలకు ట్రీట్మెంట్ చేయకతప్పని పరిస్థితి అంటూ జేమ్స్ తన ఆత్మకథకు సంబంధించిన పుస్తకంలో రాశారు. ఆ క్రమంలో కొందరి పేషెంట్ల పరిస్థితి రీత్యా తన వ్యక్తిగత కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ ఆ సమస్యకు పరిష్కారం కోసం ప్రయోగాలు చేసేవాడట. అందుకోసం అతడు నల్లజాతి పేషెంట్లనే వినయోగించానని ఆ పుస్తకంలో తెలిపాడు. అందరు అనుకున్నట్లు నల్లజాతీయల శరీరాలు మందంగా ఉంటాయి కాబట్టి బాధ తక్కువగా ఉంటుందనేది అపోహేనని పేర్కొన్నాడు. తాను వారిపై అనస్థీషియా ఇవ్వకుండానే ప్రయోగాలు చేసేవాడినని, ఎందుకంటే సమస్యను, స్త్రీ దేహ నిర్మాణాన్ని అర్థంచేసుకునేందుకు అలా చేయక తప్పేది కాదని పుస్తకంలో చెప్పుకొచ్చాడు. ఆ నేపథ్యంలో తన వద్దకు వచ్చిన ఒక రోగి కేసు గైనకాలజీ సమస్యను పరిష్కరించడానకి దారతీసిందని తెలిపాడు. ఒకామెకు ఫిస్టులా సమస్యతో బాధపడుతుంది. దీని కారణంగా ఆమెకు మూత్రం తెలియకుండానే వెళ్లిపోతుంది. అందుకు చికిత్స లేదని తెలిసి ఆమెపై పలు ప్రయోగాలు చేశానని, ఆ విధంగానే మహిళల ప్రసూతి సమస్యలకు నివారణ మార్గాలను కనిపెట్టగలిగానని తన తన ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్‌లో రాసుకొచ్చాడు. తాను చేసిన ప్రయోగాలు చాలామంది మహిళలను బాధపెట్టి ఉండొచ్చు గానీ, వాళ్లంతా ఎదుర్కొనే గైనకాలజీ సమస్యలను నివారించడానికి మార్గం సుగమమైందని ఆ పుస్తకంలో చెప్పుకొచ్చాడు. ఇక్కడ కేవలం నల్లజాతీయుల మహిళలపై ప్రయోగాలు చేయడం అనేది చూస్తే జేమ్స్‌కి ఉన్న జాత్యాహంకారం తేటతెల్లమవ్వగా, మరోవైపు ఆ నల్లజాతీయ మహిళలను యావత్తు స్త్రీల సమస్యలకు నివారించడంలో సహాయపడిన వారిగా కీర్తించవచ్చు కూడా కదూ..!. (చదవండి: మానసిక రుగ్మతలతో ఇంతమందా..? వెలుగులోకి 'మతి'పోయే విషయాలు) -
గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా?
‘ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సెస్, జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ’కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్ ద్వారా ఓ విషయాన్ని వెల్లడించారు. దేశంలోని 25 నుంచి 49 ఏళ్ల మధ్య వ్యవసాయ కూలీలుగా ఉన్న గ్రామీణ మహిళల్లో 32 శాతం గర్భసంచి తొలగింపు (హిస్టరెక్టమీ...Hysterectomy) శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారని, ఈ శస్త్ర చికిత్సలు ప్రభుత్వ బీమా పథకాల ద్వారానే జరుగు తున్నాయని వెల్లడైంది. గర్భసంచి(Uterus) తొలగింపు శస్త్ర చికిత్సలవైపు గ్రామీణ మహిళలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?! ఏ అంశాలు వీరిని ప్రేరేపిస్తున్నాయి?! గర్భసంచి తొలగిస్తే వచ్చే నష్టమేమిటి?! అవగాహన అవసరం...దేశంలో బిహార్, ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రాష్ట్రాల్లోని గ్రామాల్లో హిస్టరెక్టమీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అవగాహన లోపమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు స్త్రీ వైద్య నిపుణులు. వారు చెబుతున్న విషయాలేంటంటే..ఖర్చుకు భయపడి...వ్యవసాయ కూలీలుగా ఉన్న మహిళల్లో వ్యక్తిగత శుభ్రత తక్కువ. దీనివల్ల గర్భసంచికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పోషకాహార లోపం వల్ల రక్తహీనత, అధిక రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, రుతు సమయంలో వచ్చే నొప్పులను ఇంటిలో పనుల కారణంగా భరిస్తున్నారు. అయితే గర్భసంచి వాపు, సిస్టులు అనగానే క్యాన్సర్ అని భయపడుతున్నారు.సమస్య తీవ్రం అయినప్పుడు హాస్పిటల్‌కు రావడం, త్వరగా నయం కాకపోవడంతో పదే పదే డాక్టర్ దగ్గరకు వెళ్లవలసి వస్తుందని, దీనివల్ల ఇంటి పనులు, కూలి పనులకు ఇబ్బందులు వస్తాయని, తమ వెంట వచ్చేవారి పని కూడా పోతుందని, టెస్టులకు, మందులకు అదనపు ఖర్చు అని.. ‘గర్భసంచి తొలగించు కుంటే’ ఈ చికాకులన్నీ పోతాయనే ఆలోచనకు వస్తున్నారు. శస్త్ర చికిత్సకు ప్రభుత్వం అందించే ఉచిత పథకాల కోసం వెతుకుతున్నారు.గర్భసంచి సమస్యలను వాయిదా వేసుకుంటూ కూలి పనులు ఎక్కువ ఉండని వేసవి కాలాన్ని ఆపరేషన్‌కు కేటాయించుకుంటున్నారు. త్వరగా పెళ్ళిళ్లు అవడం, పిల్లలు పుట్టడం, త్వరగా గర్భసంచి తొలగించుకోవడం అనేది గ్రామాల్లో కూలి పనులకు వెళ్లే వారిలో తరచూ కనిపిస్తోంది.అత్యవసర అవగాహనశుభ్రతకు సంబంధించిన అవగాహన అత్యవసరం. అధిక రక్తస్రావం సమస్యలకు కూడా పరిష్కారాలు ఉన్నాయి. హార్మోన్లకు, బలానికి వాడే మందులను అందజేయాలి.తప్పనిసరై గర్భసంచి తొలగించుకున్నా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల ఇతర సమస్యలు తలెత్తుతాయి. దీంతో మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మధుమేహం, బలహీనత, ఎముకల సమస్యలు... వీటన్నింటి పైనా అవగాహన కల్పించాలి.ఆర్థికంగానే కాదు ఆరోగ్యంగా ఉండటమూ దేశ భవిష్యత్తుకు కొలమానమే. వ్యవసాయ కార్మికులుగా ఉన్న మహిళలు తరచూ పురుగు మందులకు గురి కావడం వల్ల కూడా అధిక రుతుస్రావాలు, ఫైబ్రాయిడ్లు, గర్భాసంచి లోపాలు, జననేంద్రియ సమస్యలకు కూడా గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఏడాదికోసారి పాప్‌స్మియర్ టెస్ట్గర్భసంచి తొలగించడం వల్ల అండాలు విడుదల కాక హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల ఎముకలపై ప్రభావం పడి, త్వరగా కీళ్ల సమస్యలు వస్తాయి. చాలా మందిలో రకరకాల ఇన్ఫెక్షన్ల వల్ల గర్భసంచి వాపు వస్తుంది. ఫైబ్రాయిడ్స్, సిస్టులు వస్తుంటాయి. అయితే అవగాహన లేక క్యాన్సర్ వస్తుందేమో అనే భయంతో గర్భసంచి తీసేయమని కోరుతున్నారు.పాప్‌స్మియర్ స్క్రీనింగ్‌తో గర్భసంచి సమస్య ఏంటో ముందే తెలుసుకోవచ్చు. దానికి తగిన మందులు వాడితే సరిపోతుంది. 40 ఏళ్ల లోపు మహిళలకు గర్భసంచి తొలగించకపోవడమే మంచిది. హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్, ఏడాదికోసారి పాప్‌స్మియర్ టెస్టులు, కుటుంబం మొత్తానికి స్త్రీ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. – డాక్టర్ భానుప్రియ, గైనకాలజిస్ట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్, నిజామాబాద్అడ్డంకిగా భావిస్తున్నారుగ్రామీణ మహిళలు ఓవర్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో మా దగ్గరకు వస్తుంటారు. ఇలాంటప్పుడు టెస్టులు చేయించుకోవడం మందులు వాడటం, పదే పదే వైద్యులను సంప్రదించడం వారికి కష్టంగా మారుతుంది. అందుకు గర్భసంచి తొలగించుకోవడం మేలేమో అనే ఆలోచన చేస్తున్నారు. సాధారణంగా 50 ఏళ్లలో మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తాయి. సర్జికల్‌గా వచ్చే మెనోపాజ్ వల్ల చెమటలు పట్టడం, అలసిపోవడం, చిరాకు, హాట్ ప్లషెస్.. అన్నీ ముప్పైల్లోనే కనిపిస్తాయి. – డాక్టర్ మనోరమ, మధిర, ఖమ్మం జిల్లా – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు వైకల్యంతో పుడతారా?
నాకిప్పుడు 30 ఏళ్లు. పెళ్లై ఏడాది అవుతోంది. ఈ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే చాన్స్ ఎక్కువ అంటున్నారు. నాకు భయంగా ఉంది. పిల్లల కోసం మందులు వాడాలా? నిజంగానే మానసిక వైకల్యంతో పిల్లలు పుడతారా? – మాదిరాజు శ్యామల, కొల్లాపూర్ మీకు పెళ్లై ఏడాది అవుతోంది అంటున్నారు. మీరిప్పటికిప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినా పరవాలేదు. 35 ఏళ్లు దాటిన తరువాత జన్యులోపాలు, మెదడులోపాలు.. ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్‌తో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. లేట్ మ్యారెజెస్ వల్ల ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటిన తర్వాతే తొలిచూలు కాన్పులను చూస్తున్నాం. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఫోలిక్ యాసిడ్ 5ఎమ్జీ మాత్రలు, బి– కాంప్లెక్స్ మాత్రలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డలో స్పైన్, నర్వ్ ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి. మీది మేనరికం అయితే.. ఒకసారి జెనెటిక్ కౌన్సెలర్స్‌ని కలవాలి. కేవలం వయసు ఎక్కువ ఉండటం వల్ల మాత్రమే అంగవైకల్యం వస్తుందనే భయాన్ని పెట్టుకోకండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత హైరిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని చూసే ఆసుపత్రిలోని డాక్టర్ని సంప్రదించండి. 3వ నెల, 5వ నెలల్లో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌తో స్కాన్స్ చేయించుకుంటే చాలావరకు కంజెనిటల్ అబ్నార్మలిటీస్ని కనిపెడతారు. 30 ఏళ్ల వయసు దాటిన గర్భిణీలకు.. 11–12 వారాల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అని స్కాన్, రక్త పరీక్ష తప్పకుండా చేస్తారు. దీనిద్వారా మూడు రకాల క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్‌ని కనిపెట్టవచ్చు. ఒకవేళ వాటి ఫలితం పాజిటివ్‌గా వస్తే అడ్వాన్స్డ్ టెస్ట్స్ లాంటివి హైరిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని చూసే ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ఇప్పటికే ఏమైనా ప్రయత్నించారా? ఒకవేళ ప్రయత్నించినా రాకపోతే .. భార్య, భర్తకు కొన్ని పరీక్షలను చేయించుకోమని సూచిస్తారు. ఆ పరీక్షల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లు తేలితే అవి సరిచేసి.. ప్రెగ్నెన్సీ రావడానికి మందులు ఇస్తారు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని కలసి రొటీన్ చెకప్ చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి ప్లాన్చేసే వాళ్లు ప్రెగ్నెన్సీకి ముందే ప్రికాన్సెప్షనల్ కౌన్సెలింగ్‌కి వెళితే మంచిది. ప్రాపర్ మెడికేషన్స్, సమస్యల నివారణ గురించి చర్చిస్తారు. -డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
''పీరియడ్స్ ప్రాబ్లమ్..పిల్లలు పుట్టే అవకాశం ఉందా?''
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా సమస్య వల్ల రేపు పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? – పి.రజిత, మామిడిపల్లి నెలసరి రెగ్యులర్‌గా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో గర్భందాల్చే అవకాశాలు కూడా తగ్గవు. ఇరవై ఏళ్ల వయసులో టీనేజ్లోలా కాకుండా శరీరంలోని హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇర్రెగ్యులర్గా రెండు మూడు నెలలకోసారి రావడం లేదా మందులు వాడితేనే గాని రాకపోవడం కనుక ఉంటే, వెంటనే డీటెయిల్డ్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. కొందరిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, గడ్డంపైన, పైపెదవిపైన వెంట్రుకలు రావడం, తలమీద జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటాం. కొందరికి షుగర్, బీపీ కూడా ఉండవచ్చు. అధిక బరువు ఉంటే శరీరంలో కొవ్వులు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు స్కానింగ్, రక్తపరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి తగిన మందులు వాడితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గకుండా ఉంటాయి. దీనికి మొదటి చికిత్స ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అనే చెబుతాం. థైరాయిడ్ సమస్య ఏదైనా ఉందా అని పరీక్షలు చేస్తాం. అలాగే టీబీ వంటి ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా పరీక్షిస్తాం. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, యోగా, నడక, డాన్సింగ్, సైక్లింగ్ వంటివి కచ్చితంగా చేయాలి. డైట్ కౌన్సెలర్‌ను సంప్రదించి, ఆహార విషయంలో వారి సలహాలను పాటించాలి. రక్తపరీక్షల రిపోర్ట్స్ బట్టి హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా లేదా నాన్‌హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా అని గైనకాలజిస్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఈ సమస్యకు మూడు నుంచి ఆరునెలల ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. -డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో షుగర్.. తల్లీ, బిడ్డకు ప్రమాదం, ఆ ట్యాబ్లెట్‌తో..
నాకిప్పుడు ఏడో నెల. షుగర్ ఉందని చెప్పారు. Metformin 100mg అనే మాత్రలు వేసుకోమన్నారు. ఇది ప్రెగ్నెన్సీలో వేసుకోవచ్చా? మాత్రలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి? – పి. కృష్ణశ్రీ, భీమవరం Metformin అనే మాత్రలను ప్రెగ్నెన్సీలో వాడవచ్చు. డయాబెటిస్‌కి ఇది మంచి మెడిసిన్. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్‌ని 80 శాతం స్ట్రిక్ట్ డైట్‌తో మేనేజ్‌చేస్తారు. కానీ షుగర్ పెరిగినప్పుడు మాత్రలు లేదా ఇన్సులిన్‌ను సజెస్ట్ చేస్తారు. షుగర్ నియంత్రణలో లేకపోతే తల్లికి, బిడ్డకు ప్రమాదం ఉంటుంది. ఈ జెస్టేషనల్ డయాబెటిస్‌ని సులభంగా గుర్తించి .. స్ట్రిక్ట్‌గా హోమ్ మానిటరింగ్ చేసి నియంత్రణలోకి తెస్తే షుగర్ వల్ల తలెత్తే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉండదు. బిడ్డ అధిక బరువుతో పుట్టడం, ప్రసవమప్పుడు ఇబ్బందులు, అధిక రక్తస్రావం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి రావడం వంటి చాన్సెస్ తగ్గుతాయి. Metformin .. .. షుగర్ మరీ డౌన్ కాకుండా.. hypoglycemia episodes రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇన్సులిన్‌తో ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఈ మాత్రతో ఉండే ఏకైక ఇబ్బంది.. కడుపు ఉబ్బరం. అందుకే మాత్రలను ఎప్పుడూ తిన్న వెంటనే వేసుకోవాలి. తక్కువ మోతాదులో మొదలుపెట్టి.. నాలుగు రోజులకు మోతాదు పెంచి కావలసిన మోతాదుకు అడ్జస్ట్ చేస్తారు. షుగర్ రీడింగ్స్ నార్మల్ అయితే అదే మోతాదును కొనసాగిస్తారు. రెండు వారాల్లో కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు. మాత్రల విషయానికి వస్తే.. రోజూ ఇంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మానిటరింగ్ చేస్తూ మాత్రల మోతాదును నిర్ధారిస్తారు. -
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
జిమ్ చేస్తున్నా బరువు తగ్గడం లేదు.. సర్జరీ చేయించుకోవచ్చా?
కొందరు ఎంత తిన్నా శరీరానికి కొవ్వు పట్టదు. జీరో సైజ్‌లోనే కనిపిస్తుంటారు. మరికొందరికేమో కొంచెం తిన్నా లావెక్కిపోతారు. ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది అన్ని వయసుల వారికి పెద్ద సమస్యలా మారింది. బరువు అదుపులో ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా ఏ మాత్రం రిజల్ట్ ఉండటం లేదు. ''నాకు 24 ఏళ్లు. నా హైట్ 5.2. బరువు 92 కిలోలు ఉన్నాను. యోగా, రెగ్యులర్‌గా జిమ్‌కి వెళుతున్నా, డైటింగ్ కూడా చేస్తున్నా. అయినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా? భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?'' మీ వయసు 24 కాబట్టి డైటింగ్, ఎక్సర్సైజెస్ కొంతవరకు బరువు తగ్గడానికి దోహద పడతాయి. మీరు చెప్పిన మీ ఎత్తు, బరువు వివరాలను బట్టి మీ బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 పైనే వస్తుంది. అంటే అధిక బరువు ఉన్నారని అర్థం. మార్బిడ్ ఒబేసిటీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్‌గా తీసుకోకండి. ప్రొఫెషనల్ జిమ్ ఇన్స్ట్రక్టర్, డైట్ కౌన్సెలర్‌ని కలవండి. ఒకసారి హార్మోన్స్, థైరాయిడ్, సుగర్ టెస్ట్‌లు చేసుకోండి. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే వీలు ఉంటుంది. బీఎమ్ఐ 40 దాటిన వారికి బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తాం. బీఎమ్ఐ 35 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా స్పెషలిస్ట్‌ని సంప్రదించిన తరువాతే మీకు ఏది సరిపోతుందో అంచనా వేస్తాను. మామూలుగా బేరియాట్రిక్ సర్జరీ అయిన 12– 18 నెలల తరువాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యాలి. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో మొదట్లో పోషకాల లోపం తలెత్తుతుంది. వాటిని మల్టీ విటమిన్స్‌తో కవర్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా డైట్‌ని సూచించాల్సి ఉంటుంది. బీపీ, సుగర్ సమస్యలు తలెత్తకుండా టెస్ట్ చెయ్యాలి. బేరియాట్రిక్ సర్జరీ తరువాత ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏ సమస్యలూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్‌లో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, నెలలు నిండకుండానే ప్రసవమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఒబేసిటీతో ఉన్నప్పటి రిస్క్ కంటే ఈ రిస్క్ చాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మంచి స్పెషలిస్ట్‌ని కలిసిన తరువాత అన్ని విషయాలు అసెస్ చేసుకుని అప్పుడు బేరియాట్రిక్ సర్జన్‌ని కలిస్తే మంచిది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
పిజ్జాలు, బర్గర్ల వల్ల మహిళల్లో పీసీఓడీ సమస్యా? అసలెందుకు వస్తుంది?
మాతృత్వం.. మహిళలకు దేవుడిచ్చిన వరం. మరోజీవికి ప్రాణం పోసే అపూర్వమైన అవకాశం. అయితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా పలువురు స్త్రీలు ఈ అపురూప భాగ్యానికి దూరమవుతున్నారు. పీసీఓడీ (నీటి బుడగలు) సమస్యలతో నెలసరి గాడి తప్పి గర్భధారణకు నోచుకోలేకపోతున్నారు. అమ్మా అనే పిలుపు కోసం అలమటిస్తున్నారు. పల్లె సీమల్లో కంటే పట్టణా ప్రాంతాల్లోనే బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పిల్లలపై ప్రేమను చంపుకోలేక నిత్యం వందల మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు ముట్టజెప్పి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నెలల తరబడి చికిత్సలు పొందుతున్నారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మందులను క్రమం తప్పకుండా వాడడంతోపాటు ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తే ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వాస్పత్రులోనే ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు ఉందని వెల్లడిస్తున్నారు. ►తిరుపతి ఎమ్మార్పల్లెకు చెందిన కోమల అనే మహిళకు 36ఏళ్లు. ఇంతవరకు సంతానం కలగలేదు. టీవీలో ప్రకటనలు చూసి రెండేళ్ల క్రితం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. రూ.30 వేలు చెల్లించి భార్యభర్తలు అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ వారి ఫలితాలను పరిశీలించి గర్భధారణ కలగాలంటే ఫీజుగా రూ.5 లక్షలు అడిగారు. ఆ దంపతులు ఖర్చుకు వెనకాడకుండా అడిగినంతా ముట్టజెప్పారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టారు. ► చిత్తూరు మండలానికి చెందిన సుమనప్రియ (28)కు 9ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ సంతానం కలగలేదు. తీరా ఆస్పత్రిలో పరీక్షిస్తే.. పీసీఓడీ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె ఓ నాటు వైద్యుడిని ఆశ్రయించారు. ఆరు నెలల పాటు ఆకు మందు తీసుకున్నారు. ఇందుకోసం ప్రతి నెల రూ. 2వేలు చెల్లించారు. అయినప్పటికీ గర్భం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నార. ► చిత్తూరు నగరం తోటపాళ్యానికి చెందిన దంపతులకు పిల్లలు లేరు. వివాహమై రెండేళ్లు గడుస్తున్నా గర్భం దాల్చకపోవడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు పీసీఓడీ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో 8నెలల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మందులు వాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 10వ నెలలో ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పీసీఓడీ ఎందుకొస్తుందంటే... ప్రతి స్త్రీలోనూ రుతు క్రమం వచ్చినప్పుడు అండాశయంలో అండం పరిపక్వత చెంది విడుదల అవుతంంది. నెలసరి తర్వాత 11–18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు ఈస్ట్రోజన్ హార్మోన్ అవసరమవుతుంది. ఈ హార్మోన్ లోపం తలెత్తినప్పుడు క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారిలో విడుదలయ్యే అండం పూర్తి ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. అలాగే జీవనశైలిలో వచ్చిన మార్పులు, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడం, పని ఒత్తిడి, బయట తిండికి అలవాటు పడడం వంటి కారణాలతో కూడా పీసీఓడీ బారినపడుతుంటారని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. లక్షణాలు ఇలా ఉంటాయి నెలసరి సక్రమంగా రాదు ఎక్కువగా బ్లీడింగ్, రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి ఉంటుంది అధిక బరువు, ఆకారణంగా జుట్టు రాలడం నెలసరి రాకపోవడంతో ముఖం, కాళ్ల మీద అవాంఛిత రోమాలు పుట్టుకొస్తాయి. బరువు పెరిగిపోతారు. శరరీంలో ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగిపోతుంది. వ్యాధులు ఇలా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కొలెస్ట్రాల్ పెరుగుదల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు గర్భస్రావాలు, సంతాన లేమి మధుమేహం మానసిక జబ్బులు అసాధారణ గర్భాశయ రక్తస్రావం క్రమ రహిత రుతుక్రమం పీసీఓడీని నిర్థారించడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. వారి సూచనల మేరకు హార్మోన్ల స్థాయిని లెక్కించడానికి రక్త పరీక్షలు చేస్తారు. అండాశయం, గర్భాశయం రూపాన్ని తెలుసుకోవడానికి అ్రల్టాసౌండ్ స్కానింగ్ చేసి నిర్థారిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే... జీవనశైలిలోని మార్పులు కూడా పీసీఓడీకి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్లు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ –బి లోపం రాకుండా చేపలు, గుడ్డు, ఆకుకూరలు, క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలాచేస్తే నెలసరి క్రమంగా వచ్చి సమస్య నుంచి బయటపడుతారు. దీనికి తగట్టు వ్యాయమం అవసరం. ఫీజులు గుంజేస్తున్నారు.. గతంలో పిల్లలు పుట్టకుంటే వ్రతాలు, నోములు నోచేవాళ్లు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ప్రస్తుతం కార్పొరేట్ మాయాజాలంలో పలువురు దంపతులు కొట్టుకుపోతున్నారు. మాతృత్వం పొందేందుకు రూ.లక్షల్లో ఫీజులు ముట్టుజెబుతున్నారు. పీసీఓడీ సమస్యతో బాధపడేవారిని కార్పొరేట్ ఆస్పత్రుల వారు సైతం యథేచ్ఛగా దోచుకుంటున్నారు. దంపతుల బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.3 నుంచి రూ.10లక్షల వరకు ఫీజులు గుంజేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి వంటి నగరాల్లో సైతం రూ.లక్షలు వసూలు చేసేస్తున్నారు. మరికొందరు నాటువైద్యం అంటూ అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. పీసీఓడీ నివారణకు ప్రభుత్వాస్పత్రిలోనే పూర్తి స్థాయిలో సేవలు ఉన్నాయని వైద్యులు గుర్తు చేస్తున్నారు. వైద్యులను సంప్రదించాలి మహిళలను ఇటీవల కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య పీసీఓడీ. దీని బారిన పడితే నెలసరి తప్పడం, అవాంఛిత రోమాలు రావడం ఉంటుంది. గర్బధారణ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలతో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. గర్బధారణకు చికిత్స పేరుతో మోసపోకండి. నాటు మందుల జోలికి వెళ్లొద్దు. సంబంధిత డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. – డాక్టర్ ప్రభావతిదేవి, డీఎంహెచ్ఓ, చిత్తూరు నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పీసీఓడీ అనేది 14–45 ఏళ్ల లోపు ఉన్న మహిళల్లో అధికంగా వస్తోంది. ఈ మధ్య కాలంలో పీసీఓడీ కేసులు పెరిగాయి. చాలా మందికి పని ఒత్తిడి, టీవీలు, మొబైల్ ఫోన్లు గంటల తరబడి చూడడం. పిజ్జాలు, బర్గర్లు తినడం. బరువు పెరగడం కారణంగా పీసీఓడీ సమస్య తలెత్తుతోంది. లక్షణాలు బట్టి లేదా..వివాహమై ఏడాది గడిచినా గర్భధారణ జరగకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే సమస్యలు తప్పవు. – డాక్టర్ ఉషశ్రీ, గైనకాలజిస్ట్, చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి -
నాకు మా బావ అంటే చాలా ఇష్టం.. కానీ
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్‌కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్‌తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్‌గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్‌లో.. భవిష్యత్‌లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్‌ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. నాకు 43 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడంలేదు. స్కానింగ్ ద్వారా ఇంకెన్ని రోజుల్లో నాకు పీరియడ్స్ ఆగిపోవచ్చనేది తెలుసుకోవచ్చా? – జి. ప్రసన్నకుమారి, కోటగిరి మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. మామూలుగా నెలలు ఆగి.. ఏడాది వరకూ రాకపోతే దాన్ని మెనోపాజ్‌గా పరిగణిస్తాం. పెరీమెనోపాజ్.. అంటే మెనోపాజ్ కంటే రెండుమూడేళ్లు ముందు.. వెనుక టైమ్ అన్నమాట. అండాశయాల్లో అండాలు తయారుకానప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. మెనోపాజ్‌కి సగటు వయసు 51 ఏళ్లు. నలభై అయిదేళ్లలోపు ఆగిపోతే ఎర్లీ మెనోపాజ్ అంటారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో గర్భసంచి లైనింగ్ పలుచగా ఉండడం, అండాశయాల్లో అండాలు లేదా ఫాలికిల్స్ లేకపోవడం.. మెనోపాజ్ అని చెప్పడానికి కొన్ని మార్గాలు.. సూచనలు. నిర్ధారించడానికి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అనే రక్తపరీక్ష చేసినప్పుడు అది 35 కన్నా ఎక్కువ ఉంటే మెనోపాజ్ అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ఒంట్లోంచి వేడివేడి ఆవిర్లు, ఆ వెంటనే చెమటలు, మూడ్‌స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నెలలు ఆగిపోయిన తర్వాత కూడా గర్భసంచి లైనింగ్ పలుచగా కాకుండా దళసరిగా అంటే 5ఎమ్ఎమ్ కన్నా ఎక్కువగా ఉంటే తర్వాత పరీక్షల కోసం సూచిస్తాం. దీనిని ఎండోమెట్రియల్ హైపర్ప్లాజియా అంటారు. అందుకే 40 నుంచి 45 ఏళ్లలోపు నెలసరి ఆగిపోతే టీఎస్‌హెచ్, థైరాయిడ్ పరీక్షలను కచ్చితంగా చేయించాలి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
Health Tips: ఏడాదిగా అక్కడ సెగ గడ్డలు.. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి?
నా వయసు 25 సంవత్సరాలు. నాకు ఏడాదిగా వజైనా దగ్గర బయట భాగంలో సెగ్గడ్డలు వస్తున్నాయి. డాక్టర్ని సంప్రదిస్తే యాంటీబయోటిక్స్ ఇచ్చారు. కానీ మూడు నెలల్లోనే మళ్లీ వస్తున్నాయి. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో చెప్పగలరు. చాలా నొప్పిగా, ఇబ్బందిగా ఉంటోంది. – స్వర్ణ, కర్నూలు దీనిని ‘బార్తోలిన్ అబ్సెస్’ అంటారు. చాలామందికి మీ ఏజ్ గ్రూప్‌లో వస్తుంది. ‘బార్తోలిన్ సిస్ట్స్’ అని వజైనా ఎంట్రన్స్‌లో రెండువైపులా ఉంటాయి. ఇవి కొంత డిశ్చార్జ్ చేసి, వజైనాని తేమగా ఉంచుతాయి. ఈ సిస్ట్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్తో బ్లాక్ అయితే, చీము పట్టి, వాపు వచ్చి, నొప్పిగా ఉంటాయి. మూత్రవిసర్జన కూడా కష్టంగా ఉంటుంది. చాలామందికి ఏ కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందో చెప్పడం కూడా కష్టమే! బ్యాక్టీరియా, క్లామిడియా, గనేరియా వంటి ఇన్ఫెక్షన్లు వజైనాలో ఉంటే, ఈ సిస్ట్స్ బ్లాక్ అయి, గడ్డలు కడతాయి. వజైనల్ స్వాబ్ టెస్ట్ చేసి, ఏ బ్యాక్టీరియా ఉందో పరీక్షించాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్తో సిస్ట్స్ పగిలి, చీము బయటకు వచ్చి విపరీతమైన నొప్పి ఉంటుంది. మళ్లీ గడ్డ వచ్చే అవకాశం ఉంటుంది. యాంటీబయోటిక్స్ ఇచ్చినా మళ్లీ గడ్డలు వస్తున్నాయంటే, సిస్ట్స్‌ని ఆపరేషన్ థియేటర్లో పూర్తిగా డ్రెయిన్ చేయాల్సి ఉంటుంది. అబ్జార్బబుల్ మత్తు ఇచ్చి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సిస్ట్స్ డ్రెయిన్ చేశాక, కుట్లు వేస్తారు. వారం రోజుల పాటు పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ డాక్టర్ సూచన మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. దీనికి డాక్టర్‌తో రెగ్యులర్ ఫాలోఅప్‌తో ఉండాలి. ఈ మైనర్ ప్రొసీజర్ మీకు డేకేర్‌లో అవుతుంది. ఆపరేషన్ తర్వాత మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా, వజైనా భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పొడిగా ఉంచుకోవాలి. కొన్ని రోజులు బరువులు ఎత్తడం, వ్యాయామాలు మానుకోవాలి. దీనికి ముందు డయాబెటిస్, రక్తహీనత ఉంటే వాటిని పరీక్షించి, తగిన మందులు సూచిస్తారు. యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎక్కువ నీరు తాగాలి. జ్వరం, బ్లీడింగ్, చీము ఉన్నట్లయితే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా? -
Health: నార్మల్ డెలివరీ.. దగ్గితే... తుమ్మితే... యూరిన్ లీక్ అవుతోంది? ఎందుకిలా?
నాకు 30 ఏళ్లు. ఏడాదిన్నర కిందట డెలివరీ అయింది. నార్మల్ డెలివరీనే. ఇప్పుడు దగ్గినా.. తుమ్మినా కొంచెం యూరిన్ లీక్ అవుతోంది. ఇదేమైనా పెద్ద సమస్యా? దీనికి ట్రీట్మెంట్ ఉందా? – బి. ప్రసూన, నందిగామ చాలా మంది ఆడవాళ్లకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్ ఉంటుంది. ఈ కండరాలు కింది భాగంలో ఉంటాయి. ఇవి ఒక స్లిప్లాగా ఉండి, పైన ఉన్న బ్లాడర్, గర్భసంచి, రెక్టమ్ (మలవిసర్జన పైప్)ను సపోర్ట్ చేస్తాయి. వయసు పెరిగేకొద్దీ సహజంగానే ఇవి కొంత వీక్ అవుతాయి. ఇవి నడుము కింద టైల్బోన్ నుంచి ముందు వైపున్న ప్యూబిక్ బోన్‌కు అటాచ్ అవుతాయి. ఈ కండరాలనూ శరీరంలోని అన్ని కండరాల్లాగే శక్తిమంతం చేసుకోవాలి. దానికోసం కొన్ని వ్యాయామాలు చేయాలి. దాంతో కండరాలు పటుత్వం కోల్పోవు. దగ్గినప్పుడు.. తుమ్మినప్పుడు యూరిన్ లీక్ కాదు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ కండరాలు ఆటోమేటిగ్గా టైట్ అయి ఆ ఓపెనింగ్స్‌ను క్లోజ్ చేసి లీక్ అవకుండా చేస్తాయి. కానీ ఈ కండరాలు ఆల్రెడీ వదులైపోతే లీకేజ్ తప్పదు. ప్రసవం తర్వాత ఎక్కువగా దగ్గు, ఎక్కవ కాలం శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అధిక బరువుతో బాధపడుతున్నా, ఎక్కువ కాలం బరువు పనులు చేస్తున్నా.. రుతుక్రమం ఆగిన తరువాత వీక్ అవుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఈ సమస్యను నియంత్రించవచ్చు. ప్రసవం తరువాత వెజైనా స్ట్రెచ్ అయి ఈ కండరాలు వదులవుతాయి. వ్యాయామాల ద్వారా ఈ కండరాలను టైట్ చేయవచ్చు. బరువు తగ్గడం, పోషకాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ యూరిన్ లీక్ ప్రాబ్లమ్ 80 శాతం కేసెస్‌లో తగ్గుతుంది. ఏ రిజల్ట్ లేనప్పుడు యూరో గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ప్రతిరోజు కనీసం మూడుసార్లయినా ఈ వ్యాయామాలు చేయాలి. ప్రతిసారి 8 కాంట్రాక్షన్స్ చేయాలి. ఇలా మూడు నెలలు చేస్తే చాలా ఫలితం కనిపిస్తుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే వాళ్లు ఈ వ్యాయామాలు ఎలా చేయాలో వివరిస్తారు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా? Gynecology: 60 ఏళ్ల వయసులో ఎందుకిలా? ఏదైనా ప్రమాదమా? -
Health: గర్భసంచి వదులుగా ఉంది.. ! ఏమైనా ప్రమాదమా?
నాకిప్పుడు మూడో నెల. గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి అంటున్నారు. దీనివల్ల ఏమైనా ప్రమాదమా? అందరికీ ఇలాగే ఉంటుందా? – ముంజుష కొండపాక, జహీరాబాద్ గర్భసంచి ముఖ ద్వారం చిన్నగా ఉన్నా, ముందుగానే తెరుచుకుంటున్నా (అంటే 34 వారాలకు ముందు) సర్వైకల్ స్టిచ్ వేస్తారు. ఈ పరిస్థితిని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గుర్తిస్తారు. గర్భస్రావం అవకుండా, సమయానికి ముందే కాన్పు కాకుండా ఈ సర్వైకల్ స్టిచ్ ఆపుతుంది. కొంతమందిలో ముందు ప్రెగ్నెన్సీలో సమస్యలు తలెత్తినా, సెర్విక్స్ చిన్నదైపోయి సమయానికి ముందే కాన్పు అయినా, లేదా సెర్విక్స్ పైన ఏదైనా ఆపరేషన్ చేసినా తర్వాత ప్రెగ్నెన్సీలో మూడవ నెలలోనే ఇలా కుట్లు వేస్తారు. సర్వైకల్ స్టిచ్‌ను 12 – 24 వారాల్లోపు వేస్తారు. అవసరమైన కేసెస్‌లో మాత్రమే నెలలు నిండిన తరువాత అంటే 37 – 38 వారంలో ఓపీలోనే ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి ఈ కుట్లను విడిచి.. నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయొచ్చు. నొప్పులు వస్తే ఈ కుట్లను ముందుగానే తీసేస్తారు. ట్రాన్స్‌వెజైనల్ స్కాన్‌లో సెర్విక్స్ 25ఎమ్ఎమ్ కన్నా తక్కువ వస్తే స్టిచ్ వేస్తారు. లో రిస్క్ కేసెస్‌లో కేవలం కొన్ని హార్మోన్ మాత్రలతో లేదా ఇంజెక్షన్స్‌తో సర్వైకల్ స్టిచ్ వేయకుండానే అబ్జర్వ్ చేయవచ్చు. దీనికి సంబంధించి సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టిచ్ వేసే ముందు యూరిన్, వెజైనాలో ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవని టెస్టుల ద్వారా నిర్ధారిస్తారు. ఉమ్మనీరు పోయినా, బ్లీడింగ్ అవుతున్నా నొప్పులు వస్తున్నా ఈ సర్వైకల్ స్టిచ్ వేయకూడదు. అంటే డెలవరీ ప్రాసెస్ స్టార్ట్ అయిన తరువాత ఇలాంటి ప్రక్రియతో దాన్ని ఆపలేం. అందుకే హై రిస్క్ కేసెస్‌లో సెర్విక్స్ లెంగ్త్ ఎలా ఉంది అని 12వ వారం నుంచి 24వ వారం వరకు రెండు వారాలకొకసారి అల్ట్రాసౌండ్‌లో చెక్ చేసి సెర్విక్స్ చిన్నదవుతుంటే స్టిచ్ వేయడం జరుగుతుంది. తొలిచూలు కాన్పులో కొంతమందికి ఏవిధమైన స్పాటింగ్, బ్లీడింగ్ లేకున్నా కూడా హఠాత్తుగా గర్భసంచి ముఖద్వారం చిన్నదైపోవడం, తెరుచుకొని, సమయానికి కన్నా ముందే కాన్పు అవడం సంభవిస్తాయి. దీనిని సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ అంటారు. కొన్ని కేసెస్‌లో రెస్క్యూ స్టిచ్ వేసి కాన్పును తాత్కాలికంగా ఆపే ప్రయత్నం చేయగలం. కానీ నొప్పులు, బ్లీడింగ్ ఉంటే ఏమీ చేయలేం. ఇలాంటి కేసెస్‌లో తర్వాత ప్రెగ్నెన్సీలో మూడవ నెలలోనే స్టిచ్ వేసేస్తారు. సర్వైకల్ స్టిచ్ అనేది ఆసుపత్రిలో చేర్చుకుని, ఎనస్తీషియా ఇచ్చి చేసే ప్రక్రియ. ఇందులో కొంత రిస్క్ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియకు ముందు డాక్టర్ అన్నీ వివరిస్తారు. మీకు కచ్చితంగా సర్వైకల్ స్టిచ్ అవసరమైతేనే డాక్టర్ ఆ నిర్ణయం తీసుకుంటారు. ఈ స్టిచ్ వేసిన తరువాత అవసరమైనవారికి మాత్రమే బెడ్ రెస్ట్ సూచిస్తాం. చాలా మంది మామూలుగానే రోజూవారి పనులు చేసుకోవచ్చు. డాక్టర్ ఫాలో అప్‌లో మాత్రం ఉండాలి. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. -
Health: 60 ఏళ్ల వయసులో ఎందుకిలా? ఏదైనా ప్రమాదమా?
నాకిప్పుడు 60 ఏళ్లు. వెజైనా దగ్గర చర్మం కలర్ చేంజ్ అయింది. చిన్న గడ్డలాగా కూడా తెలుస్తోంది. ఏమైనా ప్రమాదమా? డాక్టర్‌ను సంప్రదించాలా? – సీహెచ్. సుజాత, కరీంనగర్ మీ వయసును బట్టి చూస్తే మీ సమస్యను ఫాలో అప్ కేస్‌గా పరిగణించాలి. డాక్టర్‌ను సంప్రదిస్తే.. ముందుగా బయట నుంచే చెక్ చేస్తారు. కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఇలా కలర్ మార్పు కనపడుతుంది. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ద్వారా లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తారు. యూరిన్ టెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు పులిపిర్లు కూడా ఇలానే ఉంటాయి. అవేం ప్రమాదకరం కావు. కానీ కొంతమందిలో vulval lesions(వల్వల్ లీజన్స్) అని ఉంటాయి. ఇవి కొంతవరకు ఇన్వెస్టిగేషన్స్, ఫాలో అప్స్లోనే తెలుస్తాయి ప్రమాదకరమా .. కాదా అని. స్కిన్ బయాప్సీ చేయవలసి రావచ్చు. కొన్ని ప్రత్యేకమైన క్రీమ్స్ వాడమని చెప్తారు. రోగనిరోధక శక్తి పెరగడానికి కొన్ని మల్టీవిటమిన్ మాత్రలను సూచిస్తారు. ఫాలో అప్ ట్రీట్మెంట్లో లేకపోతే వంద మందిలో అయిదుగురికి ఇవి క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. వల్వల్ హైజీన్ అంటే మంచి నీటితో శుభ్రం చేసుకోవడం. ఏ మార్పు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం వల్ల ప్రమాదాన్ని అరికట్టవచ్చు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల.. -
Health: పెళ్లయి ఆరునెలలవుతోంది.. ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి?
మాకు పెళ్లయి ఆరునెలలవుతోంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏవైనా టెస్ట్‌లు చేయించుకోవాలా? ఏవైనా వ్యాక్సిన్స్ అవసరమా? – పి. సుమీల, విజయవాడ బిడ్డను కనాలనే ప్లానింగ్‌కు కనీసం మూడు నెలల ముందు గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఇది మీ ఇద్దరి శారీరక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షలు, మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి అవసరమైన జెనెటిక్ టెస్ట్స్ చేయడానికి సహాయపడుతుంది. ఈ పరీక్షల వల్ల ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తాయి. ఇవి ప్రెగ్నెన్సీ కంటే ముందుగానే తెలియడం వల్ల ట్రీట్మెంట్ సులువవుతుంది. కొన్ని రకాల అలర్జీలకు ముందుగానే చికిత్సను అందించే వీలుంటుంది. ఫ్యామిలీలో ఏవైనా జన్యుపరమైన లోపాలు ఉంటే జెనెటిక్ కౌన్సెలర్‌ను సంప్రదిస్తే.. రిస్క్ ఎంతో తెలుసుకుని.. ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి పరీక్షలు చేసి సమస్యలను కనిపెట్టవచ్చో చెప్తారు. అమ్మాయిల్లో రక్తహీనత అనేది సర్వసాధారణమైన సమస్య. పోషకా హారం, తగిన మందులతో ముందుగానే దాన్ని అరికట్టవచ్చు. ప్రెగ్నెన్సీకి మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలను వేసుకుంటే బిడ్డకు స్పైన్, నెర్వ్ ప్రాబ్లమ్స్ వచ్చే చాన్సెస్ తగ్గుతాయి. రుబెల్లా వ్యాక్సిన్, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్స్ ముందే తీసుకోవాలి. థైరాయిడ్, సుగర్ టెస్ట్స్ చేసి .. ట్రీట్మెంట్ అవసరమైతే చేస్తారు. యూరిన్, వెజైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో చెక్ చేసి.. అవసరమైన యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇలా ప్రెగ్నెన్సీకి మూడు నెలల ముందే కౌన్సెలింగ్‌కి వెళితే పండంటి బిడ్డను కనొచ్చు. -- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Health Tips: నెలసరి మొదలయ్యే ముందు కూడా ఇలా జరగొచ్చు! ఇరిటేటింగ్‌గా ఉంటే.. -
Health: అయిదేళ్లుగా తీవ్ర వేదన.. హెవీ పీరియడ్స్.. పరిష్కారం?
Gynaecology Counselling: నాకు 40 సంవత్సరాలు. అయిదేళ్లుగా హెవీ పీరియడ్స్ అవుతున్నాయి. చాలా మందులు వాడాను. యుటెరస్‌లో ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పారు. ఈ మధ్యే ఒక సీనియర్ డాక్టర్ Mirena Coil సజెస్ట్ చేశారు. ఇది సురక్షితమైనదేనా? వేయించుకోవచ్చా? గర్భసంచి తీయించుకోవడమొక్కటే బెస్ట్ ట్రీట్మెంట్ అని కొంతమంది చెప్పారు. నా సమస్యను అర్థం చేసుకొని సలహా ఇవ్వగలరు. – కె. నీలిమ, మిర్యాలగూడ Mirena అనేది లూప్ లాంటిది. ఈ మధ్య చాలామందికి వేస్తున్నాం. హెవీ పీరియడ్స్‌కి బాగా పనిచేస్తుంది. ఇది కాపర్టీ డివైస్ లాంటిది. కాకపోతే దీనిలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ పూత ఉంటుంది. అది రోజూ కొంచెం కొంచెంగా హార్మోన్‌ను విడుదల చేసి గర్భసంచి పొరను పల్చగా ఉంచుతుంది. దీంతో అధిక రక్తస్రావం తగ్గుతుంది. ఈ Mirena వేసిన 3–6 నెలల తర్వాత నెలసరి పెయిన్, రక్తస్రావం చాలా వరకు తగ్గుతాయి. దీన్ని గర్భసంచిలో అమర్చిన తర్వాత అయిదేళ్ల వరకు పనిచేస్తుంది. ఇది మీకు సరిపడుతుంతో లేదో అనేది వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్ధారిస్తారు. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. అయిదేళ్ల తర్వాత తీసేసి.. మళ్లీ కొత్తది వేస్తారు. మామూలు గైనిక్ అవుట్ పేషంట్ వార్డ్‌లోనే ఈ ప్రొసీజర్ చేస్తారు. దీనికి మత్తు అవసరం లేదు. అల్ట్రాసౌండ్‌లో గర్భసంచి ఎలా ఉందో చెక్ చేసి.. నెలసరి అయిపోయిన మొదటివారంలో వేస్తారు. దీనితో ఇంకో ఉపయోగం కూడా ఉంది. ఇది కాంట్రాసెప్టివ్లా కూడా పనిచేస్తుంది. ఇంటర్‌కోర్స్‌లో ఏ ఇబ్బందీ కలిగించదు. హార్మోన్స్ లోపం వల్ల హెవీ పీరియడ్స్ అవుతుంటే ఈ Mirena చాలా బాగా పనిచేస్తుంది. 35 – 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి ఇది మంచి ఆప్షన్. గర్భసంచి తీసేయడాన్ని నివారించొచ్చు. హిస్టెరెక్టమీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్‌ను ఈ Mirena మూలంగా తప్పించవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Pregnancy Tips: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి? -
Health Tips: నార్మల్ డెలివరీ అవ్వాలంటే!
నాకు తొమ్మిదో నెల. నార్మల్ డెలివరీ అవ్వాలని చాలా కోరికగా ఉంది. కానీ నొప్పులు ఎలా భరించాలనీ భయంగా ఉంది. ఈ మధ్య చాలామంది ‘ఎపిడ్యూరాల్’ తీసుకుంటున్నారు. దాని గురించి చెప్పగలరా? వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? – రాధ, వరంగల్ నొప్పులు డెలివరీలో భాగమే. నొప్పిని పూర్తిగా తగ్గించి, తేలికగా డెలివరీ చేయడం కష్టం. ‘లేబర్ ఎనాల్జినా’ అంటే డెలివరీ టైమ్‌లో తీసుకునే నొప్పి తెలియనివ్వని మందులు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఎన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నా, పాజిటివ్ థింకింగ్, రిలాక్సేషన్ టెక్నిక్స్, ప్రసవ సమయంలో కుటుంబ సభ్యుల ఆసరా అనేవి అత్యవసరం. ఇవి ఉంటే చాలా వరకు మందులు లేకుండా లేబర్ పెయిన్‌ను మేనేజ్ చేయవచ్చు. డెలివరీ టైమ్‌లో గర్భసంచి కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఆ నొప్పులు కింద సెర్విక్స్‌ను ఓపెన్ చేసి, బిడ్డ డెలివరీ కావడానికి దోహదపడతాయి. ఈ నొప్పులు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. మీ గైనకాలజిస్ట్, అనెస్థటిస్ట్లతో మీ భయాల గురించి ముందే మాట్లాడుకునే అవకాశాన్ని చాలా ఆస్పత్రులు కల్పిస్తున్నాయి. యాంటీనేటల్ క్లాసెస్‌లో ఇవి కూలంకషంగా చర్చిస్తారు. మీకు పర్టిక్యులర్‌గా ఎలాంటి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ సరైనవో విశ్లేషించి, వివరిస్తారు. ఈ రోజుల్లో పెయిన్ రిలీఫ్ కోసం సహజ మార్గాల వైపే చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఇందులో సహజ మార్గాలంటే ప్రత్యేకమైన బ్రీతింగ్ టెక్నిక్స్‌ను బర్తింగ్ క్లాసెస్‌లో నేర్పిస్తారు. వీటిలో మీ శరీరం, మనసు రిలాక్స్ అయ్యే పద్ధతులను చెబుతారు. నొప్పిని తగ్గించే కొన్నిరకాల మసాజ్ పద్ధతులను వివరిస్తారు. కొంతమంది ఈ టెక్నిక్స్‌తో పాటు కొన్ని మందులు కూడా తీసుకుంటారు. కాబట్టి మిక్స్డ్ మెథడ్స్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ టెక్నిక్స్‌ను ఒక స్పెషల్ కోచ్‌తో గాని, మీ ఫ్యామిలీ మెంబర్‌తో గాని లేదా మీ భర్తతో గాని కలసి చేయవచ్చు. వాటర్ బర్త్ అనేది కూడా ఒక ఆప్షన్. మీ ప్రెగ్నెన్సీ స్టేటస్ ఎలా ఉంది, హైరిస్క్ ఏదైనా ఉందా, కడుపులోని బిడ్డకు నిరంతర పర్యవేక్షణ అవసరమా అనేదానిపై మీ డాక్టర్ వాటర్ బర్త్ ఆప్షన్ తీసుకోవచ్చా లేదా చెబుతారు. లేబర్‌లో పొజిషన్ చేంజ్ చేయడం, వాకింగ్, యోగా, స్ట్రెచింగ్, హీటింగ్ ప్యాడ్, మ్యూజిక్, మెడిటేషన్ వంటివి కూడా బాగా పనిచేస్తాయి. ఈ మెథడ్స్‌తో నొప్పి తగ్గనప్పుడు మెడికల్ మెథడ్స్ సూచిస్తారు. వీటిలో కొన్నిరకాల ఐవీ ఇంజెక్షన్స్, ‘ఎంటనాక్స్’ అనే నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ పీల్చుకోవడం, వెన్నులోకి ఇచ్చే ‘ఎపిడ్యూరాల్’ ఇంజెక్షన్ వంటివి ఉంటాయి. వీటిలో ఐవీ ఇంజెక్షన్స్ వల్ల కొంచెం ఎసిడిటీ, కళ్లుతిరగడం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. నైట్రస్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్‌తో కలిపి ఇచ్చే గ్యాస్. దీనిని ఒక హ్యాండ్‌హెల్డ్ మాస్క్ ద్వారా పీల్చుకోవడం జరుగుతుంది. నొప్పులు పడుతున్నప్పుడు ఒకటి రెండు నిమిషాలు తీసుకుంటే నొప్పి తెలియదు. ఎక్కువమంది దీనినే ఎంపిక చేసుకుంటారు. ‘ఎపిడ్యూరాల్’ అనేది లేబర్ టైమ్‌లో అనుభవజ్ఞులైన అనెస్థటిస్ట్ వెన్నులోకి చేసే ఇంజెక్షన్. ఇది లేబర్ టైమ్ అంతా పనిచేస్తుంది. చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఇంజెక్షన్‌లోని మందు నొప్పిని తెలిపే నరాలను బ్లాక్ చేస్తుంది. ఇది చేసినప్పుడు బిడ్డ గుండె కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. ఇది నొప్పిని పూర్తిగా తగ్గించదు. కొంచెం తెలుస్తూనే ఉంటుంది. మీరు ప్రసవానికి సిద్ధంగా ఉన్నప్పుడు లేబర్ ప్రెజర్ సెన్సేషన్ తెలియటానికి కొన్నిసార్లు ఎపిడ్యూరాల్ను నిలిపివేస్తారు. దీనిని తీసుకోవడం వల్ల కాన్పు కోసం కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే నొప్పి అంటే భయం ఉండి, నార్మల్ డెలివరీ కోరుకునే వారికి ఈ ఇంజెక్షన్‌తో కొంత పెయిన్ రిలీఫ్ కల్పించి, నార్మల్ డెలివరీకి ప్రయత్నించ వచ్చు. అనెస్థీషియా ఇచ్చే ముందు దీని లాభనష్టాలను వివరంగా చెబుతారు. అంతకంటే ముందుగా జరిగే బర్తింగ్ క్లాసెస్‌లో మీ సందేహాలన్నింటినీ తీర్చుకోవచ్చు. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ చదవండి: Gynaecology- Chronic Pelvic Pain: 8 నెలలుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి.. గర్భసంచి తీసేయించాలా?! -
Health Tips: 8 నెలలుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి.. గర్భసంచి తీసేయించాలా?!
మేడం.. మా సిస్టర్కిప్పుడు తొమ్మిదవ నెల. హెచ్బి (హిమోగ్లోబిన్) 6 గ్రాములే ఉంది. వాంతుల వల్ల అసలు ఏమీ తినలేకపోయింది. బ్లడ్ ఎక్కించాలంటున్నారు డాక్టర్స్. మాకేమో బయట నుంచి బ్లడ్ తీసుకోవడం ఇష్టం లేదు. బ్లడ్ ఎక్కించడం నిజంగా అవసరమా? – సీహెచ్‌వీ ప్రజ్వల, కందుకూరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో బ్లడ్‌తోపాటు బ్లడ్ కాంపొనెంట్స్నూ ఎక్కిస్తారు. దీన్ని అత్యవసర పరిస్థితుల్లోనే చేస్తారు. మీ సిస్టర్‌కు రక్తహీనత సివియర్‌గా ఉంది. బ్లడ్‌లో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. శరీరానికి కావల్సిన హిమోగ్లోబిన్‌ను తయారు చేయడంలో, ఆక్సిజన్, పోషకాలను సమకూర్చడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో వీటిదే ప్రధాన పాత్ర. అంతేకాదు రక్తం గడ్డకట్టడానికీ పనిచేస్తాయి. హిమోగ్లోబిన్ 8 కన్నా తగ్గితే అదే రక్తహీనత. దీనివల్ల అలసట, ఆయాసం, నీరసం, తలనొప్పి, కళ్లు తిరగడం, గుండెకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తవచ్చు. తల్లికి రక్తహీనత ఉంటే దాని ప్రభావం పొట్టలోని బిడ్డ ఎదుగుదల మీదా పడుతుంది. ప్రసవమప్పుడు కూడా రక్తస్రావం వల్ల ఇబ్బందులు ఎదురై ప్రాణానికే ప్రమాదం కావచ్చు. తొమ్మిదవ నెలలో రక్తాన్ని పెంచడానికి ఎక్కువ సమయం, అవకాశం ఉండదు. వాంతులు, ఎసిడిటీ వల్ల చాలా మంది మాత్రలు, ఐరన్ ఇంజెక్షన్లను తట్టుకోలేరు. సుఖ ప్రసవమైనా, సిజేరియన్ అయినా కొంచెం రక్తస్రావం ఉంటుంది. దాన్ని తట్టుకునే శక్తి రక్తహీనతతో బాధపడుతున్న తల్లులకు ఉండదు. అందుకే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ త్వరగా పెరగడానికి రక్తం ఎక్కించక తప్పదు. తలసీమియా, సికిల్ సెల్ అనీమియా వంటి అరుదైన కండిషన్స్ ఉన్న వారికి కొన్నిసార్లు మాత్రలు, ఇంజెక్షన్స్ పనిచేయవు. వాళ్లకు 8 కన్నా హిమోగ్లోబిన్ తగ్గితే తప్పకుండా రక్తం ఎక్కించాల్సిందే. బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్‌ను క్రాస్ మ్యాచ్ చేస్తారు. రక్తం ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్స్ వగైరాను చెక్ చేస్తారు. దీన్ని చాలా స్ట్రిక్ట్‌గా చూస్తారు.. పర్యవేక్షిస్తారు. బ్లడ్ ఎక్కించే పరిస్థితి ఉంటే.. ఆసుపత్రిలో చేర్చుకుని.. రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ రాకుండా.. సోకుండా చూసుకుంటూ.. చాలా స్లోగా బ్లడ్ ఎక్కిస్తారు. 24 గంటలు అబ్జర్వేషన్లో పెడతారు. ప్రసూతి వైద్య నిపుణులు, మత్తు డాక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. బ్లడ్ ఎక్కించాక ఐరన్ మాత్రలు, ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అసలు ఈ సమస్య అంటే హిమోగ్లోబిన్ తగ్గకుండా గర్భధారణ తొలి నుంచే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని .. అంటే ఆకు కూరలు, మాంసం, గుడ్లు, పళ్లు వంటివి తీసుకుంటే మంచిది. వాంతులను కంట్రోల్ చేయడానికి మందులు వాడాలి. నారింజ, నిమ్మ రసాలతో ఐరన్ మాత్రలు వేసుకుంటే శరీరానికి ఐరన్ త్వరగా పడుతుంది. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి. హెచ్బి శాతం తక్కువుందని తేలిన వెంటనే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది గర్భిణీలకు 7వ నెలలోపు హిమోగ్లోబిన్ తగ్గితే.. ఐవీ ఐరన్ ఇన్ఫ్యూజన్తో హిమోగ్లోబిన్ పెంచొచ్చు. 9వ నెలలో అనీమియా రిస్క్ ఎక్కువ. అందుకే హిమోగ్లోబిన్ 6 శాతం ఉంటే ముందుగానే రక్తం ఎక్కించే ఆప్షన్‌ను సూచిస్తారు డాక్టర్లు. బ్లడ్ డొనేషన్‌ను సామాజిక బాధ్యతగా గుర్తించాలి అందరూ. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు, పిల్లలకు ఫ్రెష్ బ్లడ్ అవసరమవుతుంది. దగ్గర్లోని బ్లడ్ బ్యాంక్స్‌లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో పాల్గొనేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. ఆరోగ్యంగా ఉన్న యువత బ్లడ్ డొనేషన్లో పాల్గొంటే ఎంతో మంది జీవితాలను కాపాడిన వాళ్లవుతారు. నాకు 35 ఏళ్లు. ఎనిమిది నెలలుగా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి. ఇప్పుడు ఆ నొప్పితోపాటు లూజ్ మోషన్స్ కూడా అవుతున్నాయి. డాక్టర్‌కు చూపించుకుంటూ గర్భసంచి తీసేయాలని అంటున్నారు. దయచేసి నా సమస్య తగ్గే మార్గం చెప్పండి.. – డి. వసుధ, నిర్మల్ ఆరునెలల కన్నా ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి కొనసాగుతుంటే దాన్ని క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటారు. దీనికి గర్భసంచి తీసేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన లక్షణాలున్న వాళ్లను క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఆపరేషన్ వల్ల ఏ ఉపయోగం ఉండదు. డాక్టర్‌ను సంప్రదించి.. పొత్తి కడుపులో నొప్పి ఎక్కడ.. ఎప్పుడు వస్తుంది.. ఏ పని వల్ల పెరుగుతుంది.. అని పెయిన్ మ్యాపింగ్ చేస్తారు. ఇప్పటి వరకు ఏ మందులు వాడారు, ఈ నొప్పితో యూరిన్, మోషన్లో ఎలాంటి మార్పులు వచ్చాయి.. మానసిక ప్రభావం వంటివన్నీ కనుక్కుంటారు. మీ రోజూవారీ జీవనశైలి,ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ చెక్ చేస్తారు. పొట్ట, వెజైనా, యూరినరీ ఏరియా, నర్వ్స్ చెక్ చేస్తారు. అబ్డామిన్, పెల్విస్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. వెజైనల్ స్వాబ్, యూరినరీ స్వాబ్ తీస్తారు. కొంతమందికి అప్పర్/ లోయర్ జీటీ రేడియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటారు. ఈ నొప్పి వల్ల పీరియడ్స్ టైమ్‌లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో కరెక్ట్‌గా చెప్పాలి. పొట్టకు సంబంధించి ఇంతకు ముందు ఏవైనా ఆపరేషన్స్ అయినట్టయితే నర్వ్ ఎన్‌ట్రాప్‌మెంట్ అనే కండిషన్ వల్ల నొప్పి వస్తుంది. దానికి సరైన చికిత్స తీసుకుంటే పొత్తి కడుపులో నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. పీరియడ్స్‌లో కూడా చేంజ్ వచ్చినట్టయితే మాత్రలను సూచిస్తారు. 3–6 నెలలు ట్రీట్మెంట్ తర్వాత మీకు నొప్పి ఎలా ఉంది? ట్రీట్మెంట్కు రెస్పాండ్ అయిందో లేదో.. మళ్లీ కన్సల్టేషన్‌లో చెక్ చేస్తారు. పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ ఇస్తారు. ఏవీ ఫలితాన్నివ్వకపోతే డయాగ్నస్టిక్ లాపరోస్కోపీ చేస్తారు. ఈ విధానంలో పొట్ట మీద రంధ్రంలాంటి చిన్న కోత పెట్టి టెలిస్కోపిక్ కెమెరా ద్వారా ఆర్గాన్స్ అన్నిటినీ చెక్ చేస్తారు. దీనివల్ల ఎండోమెట్రియాసిస్, పెల్విస్ ఇన్ఫెక్షన్ వంటివి కనిపెట్టవచ్చు. వాటికి సరైన చికిత్స అందించవచ్చు. కొన్నిసార్లు నొప్పికి ఎలాంటి కారణం ఉండకపోవచ్చు. అదీ మంచిదే. అయితే నొప్పి తగ్గడానికి పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్‌కి రిఫర్ చేస్తారు. ఐబీఎస్(ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ )అనే కండిషన్లో డైట్ మార్పులతో పొట్ట నొప్పి తగ్గించవచ్చు. ఇన్ఫెక్షన్ను యాంటీబయాటిక్స్‌తో ట్రీట్ చేస్తారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Gynecology: నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్.. ఇదేమైనా ప్రమాదమా? -
Health Tips: మెనుస్ట్రువల్ క్రాంప్స్.. ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ వల్ల..
What Is Menstrual Cramps: యువతులకు నెలసరి ఎంతోకొంత ఇబ్బందికరమైనదే. ఒకవేళ దాంతోపాటు మెనుస్ట్రువల్ క్రాంప్స్ గనక తోడైతే మరెంతో బాధకారం. ఉన్న ఇబ్బందికి తోడు, బాధ, వీపు, పొత్తికడుపు భాగాల్లో కండరాలు బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పితో చెప్పుకోలేని విధంగా వేదనకు గురవుతుంటారు. ఇటీవలే చైనాకు చెందిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ జెంగ్ క్విన్వెన్, న్యూజీలాండ్‌కు చెందిన గోల్ఫ్ ప్లేయర్ లైడియా కో వంటి క్రీడాకారిణులు ఈ సమస్యతో బాగా ఇబ్బంది పడ్డారు. జెంగ్ క్విన్వెన్ అయితే... ‘‘నేనో యువకుణ్ణయితే బాగుండేదేమో’’ అని కూడా వ్యాఖ్యానించింది. చాలామంది యువతులను బాధపెట్టే ఈ ‘మెనుస్ట్రువల్ క్రాంప్స్’పై అవగాహన కోసం ఈ కథనం. ఓ బాలిక యుక్తవయస్కురాలయ్యాక దాదాపు మొదటి ఏడాదీ, రెండేళ్లు లేదా ఒక్కోసారి మొదటిబిడ్డ పుట్టే వరకు ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. వైద్యపరిభాషలో డిస్మెనూరియా అని పిలిచే ఈ సమస్య వల్ల... నొప్పితో పాటు పొత్తికడుపు, వీపు కింది భాగం కండరాలు కదలనివ్వనంతగా బిగుసుకుపోయి ఇబ్బంది పెడతాయి. ఈ ఇబ్బంది ఎంతగా ఉంటుందంటే... ఆ రోజుల్లో వారి జీవననాణ్యత పూర్తిగా దెబ్బతినడంతో... ప్రతినెలా వారి అమూల్యమైన రోజుల్లో కొన్ని ఈ బాధల వల్లనే పూర్తిగా వృథా అవుతాయి. ఎందుకిలా జరుగుతుంది...? ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం తెలుసుకోవాలంటే... ముందుగా నెలసరి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. మహిళల్లో ప్రతినెలా ఒక అండం విడుదలవుతుంది. ఒకవేళ అది ఫలదీకరణ చెందితే... దాని ఎదుగుదలకు తోడ్పడేందుకు గర్భసంచిలో ఎండోమెట్రియమ్ అనే పొర మందంగా మారుతుంది. ఒకవేళ అండం ఫలదీకరణ చెంది పిండంగా మారితే... మందంగా మారిన ఈ ఎండోమెట్రియమ్ పొరలోనే అది ఎదుగుతుంది. ఫలదీకరణం జరగనప్పుడు... ఈ పొర రాలిపోతుంది. అలా ఇది ఊడి బయటకు వచ్చే సమయంలో రక్తస్రావం జరుగుతుంది. కొందరిలో ఈ పొర ఊడిపోయేందుకు వీలుగా బిగుసుకుపోయేందుకు ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ లాంటి జీవరసాయనం కారణమవుతుంది. ఇదే యువతుల్లో తీవ్రమైన నొప్పి, బాధతో పాటు కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ పుట్టేలా (ట్రిగర్) చేస్తుంది. ఫలితంగా చుట్టుపక్కల కండరాలూ బిగుసుకుపోయి తీవ్రమైన బాధకు గురిచేస్తాయి. అందుకే రుతుస్రావం సమయంలో ఈ బాధ, నొప్పి, కండరాల బిగుతు అన్నమాట. పై సమస్యతో మాత్రమే కాకుండా మెనుస్ట్రువల్ క్రాంప్స్‌కు మరికొన్ని కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు... ►ఎండోమెట్రియాసిస్ : ఎండోమెట్రియమ్ అనే పొరకు కలిగే ఇన్ఫ్లమేషన్ వల్ల. ►యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ : యుటెరస్‌లో పుట్టే కొన్ని క్యాన్సర్ రకానికి చెందని (నాన్క్యాన్సరస్) గడ్డల వంటి వాటి వల్ల. ►అడెనోమయోసిస్ : యుటెరస్ చుట్టూ న్న పొర పొరుగున ఉన్న ఇతర కండరాల్లోకి చొచ్చుకుపోవడం వల్ల. ►పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ : ఏవైనా కారణాల వల్ల మహిళల్లో పునరుత్పత్తికి చెందిన అవయవాలకు హానికరమైన బ్యాక్టీరియా సోకడం వల్ల వచ్చే జబ్బుల కారణంగా. ►సర్వైకల్ స్టెనోసిస్ : కొంతమంది మహిళల్లో వారి గర్భాశయ ముఖద్వారం ఎంత సన్నగా ఉంటుందంటే... అది రుతుస్రావాలను, రక్తస్రావాలను సాఫీగా పోనివ్వదు. దాంతో వ్యర్థాలు అక్కడ పేరుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి రావచ్చు. ఎప్పుడు సాధారణం... ఎప్పుడెప్పుడు హానికరం... ►సాధారణంగా మెనుస్ట్రువల్ క్రాంప్స్ వల్ల ఆరోగ్యానికీ లేదా ఇతరత్రా ఎలాంటి హానీ, ముప్పూ ఉండవు. తీవ్రమైన బాధ మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వీటిపై సీరియస్‌గా దృష్టిసారించాల్సి ఉంటుంది. అదెప్పుడంటే... ►30 ఏళ్లు పైబడ్డాకా ఈ సమస్య వస్తుంటే. ►పదకొండు లేదా అంతకంటే చిన్న వయసులోనే యుక్తవయస్కురాలైతే. ∙ïపీరియడ్స్ సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటే (మెనొరేజియా) ►రక్తస్రావం/రుతుస్రావం ఒక క్రమపద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా అవుతుంటే (మెట్రోరేజియా) ∙కుటుంబంలో మెనుస్ట్రువల్ క్రాంప్స్ (డిస్మెనూరియా) ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ఉంటే. ఏదైనా ప్రమాదమా : ఈ నొప్పి వల్ల ఎలాంటి పనులూ చేయలేకపోవడం, యుక్తవయసులోని పిల్లలు స్కూల్/కాలేజీకి వెళ్లలేకపోవడం, యువతులు ఆఫీసుకు వెళ్లడం కష్టమై... వారి పనులకు అంతరాయం కలగడం వంటి సాధారణ సమస్యలే తప్ప ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ►అయితే కొన్ని సందర్భాల్లో అంటే... అధికరక్తస్రావం లేదా సంతానలేమి వంటి సమస్యలతో పాటు ఈ కండిషన్ కూడా ఉన్నప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ►ఉదాహరణకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కారణంగా ఫెలోపియన్ ట్యూబ్స్ దెబ్బతినడం, ఫలదీకరణం చెందిన అండం గర్భసంచి (యుటెరస్)లో చక్కగా ఒదగలేకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అవి మినహా మరే రకమైన ఇబ్బందీ ఉండదు. చాలా సందర్భాల్లో వయసు పెరగుతుండటంతోనూ, బిడ్డ పుట్టిన తర్వాతనో ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. ఇవీ లక్షణాలు ►నెలసరి సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, బాధ. ►పొత్తికడుపులో ఎంతో ఒత్తిడి ఉన్న ఫీలింగ్. ►వీపు వెనక, నడుము, తొడ భాగంలో తీవ్రమైన నొప్పి (పొత్తికడుపు నుంచి బయలుదేరే ఇదే నొప్పి రేడియేటింగ్ పెయిన్ రూపంలో ఈ భాగాలకు విస్తరిస్తుంటుంది. ►కడుపులో వికారంగా ఉండటం. ఒక్కోసారి వాంతులు కావడం. ►కొంతమందిలో నీళ్లవిరేచనాలు, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. చికిత్స : అయితే చికిత్సలోనూ నేరుగా మందులు వాడకుండా కొన్ని ప్రత్యామ్నాయ ప్రక్రియలు అవలంబిస్తారు. ఉదాహరణకు తొలుత... ►వ్యాయామం (ఎక్సర్సైజ్) హీట్ థెరపీ వార్మ్ బాత్ మసాజ్ కంటినిండా తగినంత నిద్ర ద్యానం, యోగా వంటి ప్రక్రియలతో చాలావరకు ఉపశమనం ఉంటుంది. వీటితోనూ తగినంత ఫలితం లేనప్పుడు కొన్ని నొప్పి నివారణ మందులు, హార్మోన్ ట్యాబ్లెట్లు, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటం వంటివి. ►ఒకవేళ ఈ సమస్యతో పాటు ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, ఎడినోమయోసిస్ (గర్భసంచి పొర దాని తాలుకు కండరాల్లోకి లోపలికి పెరగడం) వంటి సమస్యలు ఉంటే నొప్పికి వాడే మందులతో పాటు అరుదుగా ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. పరీక్షలు : సాధారణ నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి, క్రాంప్స్ సమస్యకు ఉపశమనం దొరకకపోతే అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్స్ పరీక్ష అవసరం కావచ్చు. ఈ సమస్యకు అరుదుగా లాపరోస్కోపీ అవసరం కావచ్చు. సూచన... నిర్దిష్టంగా నివారణ పూర్తిగా సాధ్యం కాకపోయినప్పటికీ... యువతులు రుతుస్రావం సమయంలో తాము కోల్పోయే ఐరన్ భర్తీ అయ్యేందుకు ఐరన్ పుష్కలంగా ఉండే ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, ఖర్జూరాలు, పల్టీపట్టి (చిక్కీ) వంటి తినే పదార్థాలు తింటూ, ఖనిజలవణాలు భర్తీ అయ్యేందుకు ఆరోగ్యకరమైన ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం చాలావరకు మేలు చేస్తుంది. -డాక్టర్ శిరీష ప్రమథ, సీనియర్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
Health: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్మెంట్ ఉందా?
Pregnancy Tips: మేడమ్.. నాకిప్పుడు రెండో నెల. తొలి చూలప్పుడు అయిదో నెల వరకు వేవిళ్లతో బాధపడ్డాను. నాలుగు సార్లు ఆసుపత్రిలో జాయిన్ కావాల్సివచ్చింది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా? చాలా భయంగా ఉంది. – ఎస్. మధులిక, బళ్లారి ప్రెగ్నెన్సీలో మూడవ నెలలోపు వాంతులుండడం సర్వసాధారణం. కానీ వందలో ఒకరికి మాత్రం వాంతులు ఎక్కువై ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. దీనిని హైపర్మెసిస్ అంటారు. ఇది గర్భం దాల్చినప్పుడల్లా రిపీట్ అవ్వాలని ఏమీ లేదు. కొంచెం వాంతులు ఉన్నప్పుడే సరైన చికిత్స తీసుకుంటే ఇబ్బంది ఉండదు. డీహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కొంతమందిలో 20వ వారం వరకూ వాంతులు అవుతుంటాయి ఎక్కువగా. మందులు వేసుకునే మందు, ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకుంటూండడం, వాంతి వచ్చేట్టుగా అనిపించే, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం, వాసనలకు దూరంగా ఉండడం, ఎండు ఉసిరి, శొంఠి ముక్కలను చప్పరించడం వంటివాటి వల్ల వాంతుల నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు. మీరు డాక్టర్‌ను కలసినప్పుడు మీకు థైరాయిడ్ , ఎలక్ట్రోలైట్స్, లివర్ టెస్ట్‌లు, హీమోగ్లోబిన్ పరీక్షలు చేస్తారు. వీటిలో ఏదైనా అబ్నార్మల్గా ఉంటే ఆసుపత్రిలో చేరాల్సివస్తుంది. లేదంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్, మాత్రలతో మేనేజ్ చేయవచ్చు. ఐరన్, కాల్షియం మాత్రలను అయిదవ నెలలో మొదలుపెడతారు. వాటితో ఎసిడిటీ, వాంతులు ఎక్కువవుతాయి. చాలామందికి మాత్రలతోనే కంట్రోల్ అవుతుంది. నాకు 65 ఏళ్లండి. దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది. చాలా అసౌకర్యంగా ఉంటోంది. పదిమంది మాట దేవుడెరుగు.. కుటుంబ సభ్యులతో కలసి కూర్చొని సరదాగా గడపాలన్నా ఇబ్బందిపడుతున్నాను. దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? దయచేసి చెప్పగలరు. – శ్రీదేవి కొప్పుల, అవిడి, తూర్పుగోదావరి జిల్లా మీ సమస్యను యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటారు. వందలో యాభైమంది సిగ్గుగా ఫీలై డాక్టర్‌కు చూపించుకోవడానికి వెనకాడుతారు. కానీ త్వరగా చికిత్స తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఈ సమస్యలో పొట్ట మీద కొంచెం ఒత్తిడి పడితే చాలు మూత్రం పడుతుంది. దగ్గినా, తుమ్మినా, మలబద్ధకం ఉన్నా, వ్యాయామం చేసినా, వేగంగా నడిచినా నియంత్రణ తప్పి మూత్రం పడుతుంది. పెల్విక్ ఫ్లోర్‌లోని కండరాలు వదులైపోయి నప్పుడు ఇలా అవుతూంటుంది. చాలా మందికి సుఖ ప్రసవం తర్వాత ఈ సమస్య వస్తుంది. కెజెల్స్ ఎక్సర్సైజెస్ అని పొత్తి కడుపులో, పెల్విక్ ఫ్లోర్‌లోని కండరాలను బిగుతు చేసే వ్యాయామాన్ని ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే.. మిమ్మల్ని పరీక్షించి.. తన పర్యవేక్షణలో ఆ వ్యాయామాలను మీకు నేర్పిస్తారు. వెజైనల్ పెసరీ అనే రింగ్‌ను యోనిలో పెడతారు. దీనితో అలా నియంత్రణ లేకుండా మూత్రం పడడం తగ్గుతుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. పైన చెప్పినవేవీ పనిచేయనప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. యూరిన్ కల్చర్, సుగర్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలి. యూరోడైనమిక్ స్టడీస్ అని యూరినరీ ఫ్లో ఎలా ఉందని చెప్పే అడ్వాన్స్డ్ టెస్ట్స్ కొంతమందికి అసవరం పడొచ్చు. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే యోనిలో అల్సర్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కనుక ఆసల్యం చేయకుండా మీరు డాక్టర్‌ను సంప్రదించండి. నాకు పెళ్లయి సంవత్సరం అవుతోంది. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయాలనుకుంటున్నాం. దీనికి ముందుగా ఏమైనా టెస్ట్స్ చేయించుకోవాలా? – సీహెచ్‌వీకే సత్య, మచిలీపట్టణం ప్రికన్సెప్షన్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే కొన్ని నెలల ముందు నుంచి తీసుకునే జాగ్రత్తలని అర్థం. ఈరోజుల్లో పెళ్లయిన వెంటనే చాలామంది గైనకాలజిస్ట్‌ను సంప్రదించి ప్రెగ్నెన్సీని వాళ్లు ఎప్పుడు, ఎలా ప్లాన్ చేయాలో కనుక్కుంటున్నారు. తగిన జాగ్రత్తలను ముందే తీసుకుంటే ఆరోగ్యకరమైన గర్భధారణ, పండంటి బిడ్డను కనే అవకాశాలు పెరుగుతాయి. ఫోలిక్ యాసిడ్ 5ఎమ్జీ డోస్‌ను కనీసం గర్భధారణకు నెల ముందు నుంచి తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు స్పైన్, బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. మీకు కానీ, మీ కుటుంబంలో ఎవరికయినా బీపీ, సుగర్, థైరాయిడ్, ఆస్తమా, ఫిట్స్ వంటివి ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పరీక్షలు మీకు చేస్తారు. అవి సరిగ్గా నియంత్రణలో ఉండేట్టు మందులు ఇస్తారు. కొన్ని వ్యాక్సిన్స్‌ను ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు. ముందే తీసుకోవాలి. రుబెల్లా, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్స్‌ను ప్రెగ్నెన్సీకి కనీసం ఒకటి నుంచి మూడు నెలల ముందు తీసుకుంటే.. ఈ కండిషన్ వల్ల పొట్టలో బిడ్డ మీద దుష్ప్రభావం ఉండదు. మీరు ఏవైనా పెయిన్ కిల్లర్స్, హెర్బల్ మెడిసిన్స్ తీసుకుంటున్నట్లయితే డాక్టర్‌కు ముందే చెప్పాలి. కొన్నిటిని ప్రెగ్నెన్సీ కన్నా ముందే ఆపేయాల్సి ఉంటుంది. ఆహారంలో కొన్ని రకాల చేపలను తీసుకోకూడదు. ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో డాక్టర్ సూచిస్తారు. మీ బరువును బీఎమ్ఐ ద్వారా గణించి ఎక్కువ బరువు ఉంటే దానికి అనుగుణమైన డైట్‌ను, వ్యాయామాన్ని సూచిస్తారు. అధిక బరువు వల్ల ప్రెగ్నెన్సీ సమస్యలు, పుట్టబోయే బిడ్డకూ సమస్యలు ఎక్కువ. బీఎమ్ఐ 25లోపు ఉంటే మంచిది. మీ భర్త తరపు కుటుంబంలో, మీ కుటుంబంలో ఏవైనా జన్యుపరమైన సమస్యలు ఉంటే జెనెటిక్ కౌన్సెలర్‌ను తప్పకుండా సంప్రదించాలి. ప్రెగ్నెన్సీలో రిస్క్ కేటగరీ గురించి కౌన్సెలింగ్ చేస్తారు. మీరు ఏమైనా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నట్టయితే వాటిని ఎప్పుడు ఆపేయాలో చెప్తారు. ఇంతకు ముందు మీకు ఏమైనా యూరిన్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ విషయాన్ని డాక్టర్‌తో చెప్పాలి. అవసరమైతే స్కానింగ్ చేస్తారు. మీరు, మీ భర్త ప్రికన్సెప్షన్ కేర్ కౌన్సెలింగ్ అటెండ్ అయితే ఈ విధమైన జాగ్రత్తలు చెప్తారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Gynecology: నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్.. ఇదేమైనా ప్రమాదమా? -
Gynecology: పిల్లలు కాకుండా ఆపరేషన్.. అప్పుడే మళ్లీ మునుపటిలా భర్తతో..
నాకిప్పుడు 35 ఏళ్లు. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. సుకన్య, ఆమ్రబాద్ లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ అనే డే కేర్ ఆపరేషన్ ద్వారా కుటుంబ నియంత్రణకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ చికిత్సలో గర్భం రాకుండా ఫాలోపియన్ ట్యూబ్స్‌ను బ్లాక్ చేసేస్తారు. జనరల్ ఎనస్తీషియా ఇచ్చి, పొట్ట మీద పెద్ద గాట్లేమీ లేకుండా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ చికిత్స చేస్తారు. ఆపరేషన్ తర్వాత కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. పొట్ట మీద ఆపరేషన్ తాలూకు మచ్చలు కూడా చాలా చిన్నగా చర్మంలో కలిసిపోయేలా ఉంటాయి. ఈ చికిత్సకు అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పడుతుందంతే! ఎనస్తీషియా ప్రభావం తగ్గాక కాస్త నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్, వాంతి రాకుండా మందులు ఇస్తారు. ఆపరేషన్ అయిన కాసేపటి తర్వాత మంచి నీళ్లు, తేలికపాటి ఆహారాన్ని ఇస్తారు. బొడ్డు దగ్గర ఒకటి, పొట్ట సైడ్‌లో ఒకటి కట్స్ ఉంటాయి. వీటిని బ్యాండ్ ఎయిడ్‌తో కవర్ చేసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కట్స్ దగ్గర శుభ్రంగా తుడుచుకొని, డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఆపరేషన్ అయిన వారానికి అంతా మానిపోయి చక్కగా కోలుకుంటారు. కుట్లు తీయాల్సిన అవసరం లేదు. వారం వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఈ కట్స్ దగ్గర చీము పట్టినా, జ్వరం వచ్చినా, బాడీ రాష్ ఉన్నా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొంతమందికి ఒకటి రెండు రోజులు కొంచెం స్పాటింగ్ అవచ్చు. కంగారు పడొద్దు. మీ శరీర తత్వాన్ని బట్టి రెండు రోజుల్లో తేలికపాటి రోజూవారీ పనులు చేసుకోవచ్చు. కానీ బరువులు ఎత్తడం, దూర ప్రయాణాలు వంటివి చేయకూడదు. బోర్లా పడుకోవద్దు. వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం వంటివి నెల రోజుల తరువాతే మొదలుపెట్టాలి. శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకున్నాక భర్తతో కాపురం చేయొచ్చు. మేడమ్.. మా మేనత్తకు ఈ మధ్యే పాప్ టెస్ట్ చేశారు. పాప్ టెస్ట్ అంటే ఏంటో చెప్పగలరు? – కె. సబిత, కంచిలి గర్భాశయ ముఖ ద్వారాన్ని సెర్విక్స్ అంటారు. ఇక్కడ అంటే ఈ సెర్విక్స్ లేదా సర్వైకల్ సెల్లో ఏవైనా మార్పులు ఉంటే పాప్ టెస్ట్ చేస్తారు. సాధారణంగా సర్వైకల్ సెల్లో కనిపించే మార్పులు క్యాన్సర్‌గా మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు అవి నార్మల్ అవచ్చు కూడా. కాబట్టి ఈ టెస్ట్‌లో అబ్నార్మల్ రిజల్ట్ వస్తే అడ్వాన్స్డ్ టెస్ట్‌ని సూచిస్తారు డాక్టర్లు. ఆ పరీక్షల్లో కూడా మార్పులు కనిపిస్తే అప్పుడు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. పాప్ టెస్ట్‌ను నెలసరి అయిన వారంలోపు చేయాలి. అదీ గైనిక్ అవుట్ పేషంట్ వార్డ్‌లోనే చేస్తారు. పది నిమిషాలు పడుతుంది. వారంలో టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. ఈ వైద్య పరీక్ష వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ టెస్ట్ వల్ల సెర్విక్స్ క్యాన్సర్‌ను తొందరగా పసిగట్టవచ్చు. దాంతో వెంటనే చికిత్స అంది, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. పాప్ టెస్ట్‌ను పాతికేళ్లు వచ్చినప్పటి నుంచి ప్రతి మూడేళ్లకొకసారి చేయించుకోవాలి. యాభై నుంచి అరవై అయిదేళ్ల మధ్య వయస్కులు ప్రతి అయిదేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ఈ టెస్ట్‌లో హెచ్‌పీవీ టెస్ట్‌ను కూడా కలిపి చేయించుకోవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ పొందవచ్చు. ∙మేడమ్.. నాకు డెలివరీ అయ్యి నెలవుతోంది. బేబీకి నా పాలే ఇస్తున్నాను. కానీ రెండు రోజుల (ఈ ఉత్తరం రాస్తున్నప్పటికి) నుంచి బ్రెస్ట్‌లో ఒకటే నొప్పి, చలి జ్వరం. ఈ టైమ్‌లో బేబీకి నా పాలు పట్టొచ్చా? – పి. సుధారాణి, తిరుపతి తల్లి పాలు ఇచ్చేప్పుడు బ్రెస్ట్‌లో నొప్పి, మంట ఉంటాయి కొంచెం. వేడినీళ్లతో కాపడం పెడితే తగ్గుతుంది. కానీ జ్వరం కూడా ఉంది అంటున్నారు కాబట్టి.. బ్రెస్ట్‌లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చెక్ చేయించుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించాలి. దీనిని Mastitis అంటారు. బేబీ నోటిలో, ముక్కులో ఉండే సాధారణమైన బ్యాక్టీరియా తల్లి బ్రెస్ట్ ఇన్ఫెక్షన్కు కారణం కావచ్చు. త్వరగా గమనించి చికిత్స చేస్తే జ్వరం రాదు. దీనివల్ల బ్రెస్ట్‌లో విపరీతమైన నొప్పి, జ్వరం, తలనొప్పి కూడా వస్తాయి. బ్యాక్టీరియా బ్రెస్ట్ నిపిల్ మీది పగుళ్ల ద్వారా లోపలికి వెళ్లి మిల్క్ డక్ట్‌ను ఇన్ఫెక్షన్తో బ్లాక్ చేస్తుంది. మీకు డయాబెటిస్ లేదా నిపిల్ మీద పగుళ్లు ఉంటే బ్రెస్ట్‌లో గడ్డ అయ్యే చాన్స్ పెరుగుతుంది. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చూసి, కొన్ని రక్త పరీక్షలు చేసి యాంటిబయాటిక్ మందులు ఇస్తారు. అవీ పాలు తాగే బిడ్డకు సురక్షితంగా ఉండేవే. ఈ టైమ్‌లో కూడా మీరు మీ బిడ్డకు డైరెక్ట్గానైనా లేదా పాలను పిండైనా పట్టవచ్చు. నిపిల్ పగుళ్లకు క్రీమ్ ఇస్తారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండానికి చనుమొనలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే రెండు రొమ్ముల నుంచి సమంగా పాలు పట్టాలి. పోషకాహారం, మంచి నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి. త్వరగా Mastitisకు చికిత్సను అందిస్తే అది గడ్డలా మారదు. ఇన్ఫెక్షన్ ఎక్కువై, రొమ్ములో వాపు వస్తే చిన్న ఆపరేషన్ చేసి పాలగడ్డలను, చీమును తీయవలసి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పాలిస్తూ ఉండాలి. జ్వరం ఉన్నా బిడ్డకు తల్లిపాలు పట్టొచ్చు. పాలిచ్చే సమయంలో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇలాంటి ఇన్ఫెక్షన్ తగ్గిన తరువాత కూడా బ్రెస్ట్ పంప్‌తో ఎక్కువైన పాలను తీసేస్తూ జాగ్రత్తగా ఉండాలి. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
పెయిన్ 'కిల్లర్స్'.. 30 నుంచి 80 శాతం గర్భిణులు ప్రిస్క్రిప్షన్ లేకుండానే..
సాక్షి, అమరావతి: గర్భధారణ సమయంలో.. వైద్యులను సంప్రదించకుండా మహిళలు వాడుతున్న పెయిన్ కిల్లర్ మాత్రలు.. పుట్టబోయే బిడ్డపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే అంశాన్ని యూకేకు చెందిన అబెర్డీన్ విశ్వవిద్యాలయం ఓ నివేదికలో ధ్రువీకరించింది. 1985 నుంచి 2015 మధ్య 1.51 లక్షల మందికి పైగా గర్భిణులపై జరిగిన అధ్యయనం ఆధారంగా పలు అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 80 శాతం మంది మహిళలు గర్భవతులుగా ఉన్న సమయంలో వైద్యులను సంప్రదించకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్ మాత్రలు వినియోగిస్తున్నట్లుస్పష్టం అయ్యింది. శిశువుపై తీవ్ర ప్రభావం గర్భవతులు పారాసిటమాల్, డైక్లోఫెనాక్, ఆస్పిరిన్, నాప్రోక్సెన్, ఇబుప్రోఫెన్ వంటి ఐదు రకాల మందులను వైద్యులను సంప్రదించకుండా ఎక్కువగా వినియోగిస్తున్నారు. 30 ఏళ్ల అధ్యయన కాలంలో గత ఏడేళ్లలో ఈ మాత్రల వినియోగం 60 శాతం మేర పెరిగింది. తొలి యాంటినేటల్ చెకప్‌కు వచ్చిన మహిళలను ప్రత్యేకంగా ఆరా తీయగా ప్రతి ఐదుగురిలో నలుగురు గర్భిణులు 12 వారాల్లోపు పెయిన్ కిల్లర్ మాత్రలు వినియోగించినట్లు తెలిసింది. మూడు నెలల్లోపు వాడకూడదు.. ఆస్పిరిన్, ఇబుప్రొఫెన్ సహా పలు పెయిన్ కిల్లర్ మందులు నాన్–స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ రకానికి చెందినవి. వీటిని గర్భం దాల్చిన సమయంలో వినియోగించడం శ్రేయస్కరం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో పారాసిటమాల్ వాడితే పర్వాలేదు. ఇక మిగిలిన పెయిన్ కిల్లర్స్ వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం. – ప్రొఫెసర్ డాక్టర్ హిమబిందు, గైనకాలజీ, విజయవాడ జీజీహెచ్ -
Health Tips: విపరీతంగా వైట్ డిశ్చార్జ్.. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
నాకు 25 ఏళ్లు. విపరీతంగా వైట్ డిశ్చార్జ్ అవుతోంది. దురద, మంట కూడా ఉన్నాయి. ఎన్ని మందులు వాడినా గుణం కనిపించట్లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి? – ఈ మెయిల్ ద్వారా అందిన ప్రశ్న. వైట్ డిశ్చార్జ్ అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనివల్ల ఓ పది శాతం మంది ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉంటారు. కొంతమందికి మాత్రం విపరీతమైన దురద, మంట, మూత్రనాళంలో మంట, తెల్లగా పెరుగులా వైట్ డిశ్చార్జ్ అవడం వంటి సమస్యలు ఉంటాయి. ఈ పరిస్థితిని కాండిడియాసిస్ (ఫంగల్ వెజైనల్ ఇన్ఫెక్షన్) అంటారు. దీనికి చికిత్స చేసినా అయిదు శాతం మందిలో మాత్రం ఈ సమస్య మళ్లీ వస్తుంది. కొంతమందిలో అల్సర్స్లా కూడా మారుతుంది. మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లలో , యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వాళ్లలో, గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్న వాళ్లలో ఈ సమస్య ఎక్కువ. డాక్టర్‌ను సంప్రదిస్తే వెజైనల్ పరీక్ష చేసి వైట్ డిశ్చార్జ్ (హై వెజైనల్ స్వాబ్)ను ల్యాబ్‌కు పంపిస్తారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ను నిర్ధారణ చేయడానికి. అసలు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా.. వెజైనా దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం, శుభ్రమైన కాటన్ ఇన్నర్ వేర్‌నే వాడడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ జోలికి వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యను సరిగ్గా నిర్ధారించి.. దానికి తగిన చికిత్సను అందిస్తే ఈ సమస్య తొంభై శాతం నయమవుతుంది. ఇన్ఫెక్షన్ మరీ తీవ్రంగా ఉంటే fluconazole మాత్రలను వారానికి ఒకటి చొప్పున రెండు– మూడు వారాలు వాడాలి. కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తలెత్తుతుంది. డాక్టర్‌ను సంప్రదించి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్లీ ఈ ఇన్ఫెక్షన్ రావడాన్ని రికరెంట్ కాండిడియాసిస్ అంటారు. అలాంటప్పుడు ట్రీట్మెంట్ను ఎక్కువ వారాలు కొనసాగించాల్సి ఉంటుంది. మేడమ్.. నాకు పందొమ్మిదేళ్లు. పీరియడ్స్ టైమ్‌లో బ్రెస్ట్ చాలా నొప్పిగా ఉంటోంది. ఇదేమైనా క్యాన్సర్‌గా మారుతుందా? నాకు చాలా భయంగా ఉంది. దయచేసి ఆన్సర్ ఇవ్వగలరు. – ఇ. నైమిష, బెంగళూరు పీరియడ్స్ సమయంలో బ్రెస్ట్ నొప్పిగా ఉండడం అనేది సర్వసాధారణమైన సమస్య. ఇది చాలా వరకు పాతికేళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రెండు వైపులా లేదా ఒక బ్రెస్ట్‌లో మాత్రమే నొప్పి రావచ్చు. కొంతమందికి ప్రతి నెలా వస్తుంది. కొందరికి ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఇది చాలా వరకు పీరియడ్స్ సమయంలో జరిగే హార్మోన్స్ చేంజ్ వల్ల వస్తుంది. బహిష్టు సమయంలో చాలా మందికి వాటర్ రిటెన్షన్ (నీరు పట్టడం) జరుగుతుంది. దానివల్ల బ్రెస్ట్ పరిమాణం పెరిగి నొప్పి కలగొచ్చు. లేదంటే బ్రెస్ట్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా నొప్పి రావచ్చు. మీ వయసులో క్యాన్సర్ వచ్చే చాన్సెన్స్ చాలా అరుదు. అయినా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. పరీక్ష చేస్తారు. బ్రెస్ట్ పరిమాణం, గడ్డలు ఏమైనా ఉన్నాయా? నిపుల్ నుంచి పస్ గానీ, బ్లీడింగ్ గానీ, గ్రీన్ డిశ్చార్జ్ కానీ ఉందా? అని చెక్ చేస్తారు. 35 ఏళ్లలోపు వారికి బ్రెస్ట్ పెయిన్‌కి కొన్ని సార్లు ఏ పరీక్షలూ అవసరం ఉండవు. మీకు బ్రెస్ట్‌లో ఏదైనా గడ్డలాంటిది ఉన్నా.. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నా.. బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ లేదా బయాప్సీ సూచిస్తారు. బహిష్టు సమయంలోనే వచ్చే బ్రెస్ట్ నొప్పికి చాలా వరకు బ్రెస్ట్ సపోర్ట్ బ్రా, వదులుగా ఉండే లోదుస్తులు వేసుకోవాలి. కొన్నిసార్లు పారాసిటమాల్ వంటి సింపుల్ పెయిన్ కిల్లర్స్‌ను వాడొచ్చు. కాఫీ, టీల జోలికి వెళ్లొద్దు. విటమిన్ ఇ మాత్రలు వాడొచ్చు. నొప్పి నివారణలో ఇవీ సహాయపడనప్పుడు డాక్టర్‌ను సంప్రదించి.. వైద్యులు సూచించిన మాత్రలు తీసుకోవడం మంచిది. నాకిప్పుడు ఎనిమిదో నెల. బేబీ ఎదుగుదల సరిగాలేదని చెప్పారు డాక్టర్. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పరిమళ, ఖనాపూర్, తెలంగాణ కొంతమంది గర్భిణీలకు ప్రెగ్నెన్సీ చివరి మూడు నెలల్లో కొంతమందికి స్కానింగ్‌లో బిడ్డ ఎదుగుదల సరిగ్గాలేనట్టు తెలుస్తుంది. దీనిని స్మాల్ ఆఫ్ జెస్టేషనల్ ఏజ్ అంటారు. ఇది అంత ప్రమాదకరం కాదు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. మీరు, మీ భర్త ఇద్దరూ అంతగా హైట్ లేకపోవడం, బరువు కూడా తక్కువగా ఉండడం, కొన్ని ప్లెసెంటా సరిగ్గా పనిచెయ్యక బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉండడం, మీకు హై బీపీ ఉండడం, కొన్ని మందులు, రక్తహీనత, కొన్ని జన్యుపరమైన సమస్యలు, ప్రెగ్నెన్సీలో తలెత్తే ఇన్ఫెక్షన్స్ వంటివి ఆ కారణాల్లో ఉండొచ్చు. ఇలా సమస్యలకు మూలం తెలిసినప్పుడు దానికి తగిన చికిత్సను అందజేస్తారు వైద్యులు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. పోషకాహారం.. ముఖ్యంగా మాంసకృత్తులు ఎక్కువగా (హై ప్రొటీన్ డైట్) ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. బిడ్డ ఎదుగుదలను రెండు లేదా మూడు వారాలకు ఒకసారి చెక్ చేస్తారు డాక్టర్. బిడ్డకు రక్తప్రసరణ ఎలా ఉందనేదీ వారానికి ఒకసారి చెక్ చేస్తారు. రక్తప్రసరణ, ఉమ్మనీరు సరిగ్గా ఉంటే, తొమ్మిదవ నెల నిండిన తర్వాత ప్రసవానికి ప్లాన్ చేస్తారు. సాధారణ కాన్పుకి ప్రయత్నించవచ్చు. బిడ్డకు రక్తప్రసరణ సరిగా లేకపోతే కొన్నిసార్లు ముందస్తు ప్రసవానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు బిడ్డకు శ్వాస సమస్యలు తలెత్తకుండా ఒక కోర్స్ కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణ కాన్పు కాకుండా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. బిడ్డకు ప్రత్యేకమైన కేర్ అవసరం ఉండొచ్చు. ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు, పోషకాహారం తీసుకోవాలి. తగినంత వ్యామాయం అవసరం. నిరంతరం పొట్టలో బిడ్డ కదలికలను కనిపెట్టుకుంటుండడం, ఏదైనా ఇబ్బంది అనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం లేదంటారా?
►నాకిప్పుడు ఎనిదవ నెల. బిడ్డ ఎదురు కాళ్లతో ఉందని స్కానింగ్‌లో తేలింది. దీనివల్ల నాకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం లేదంటారా? – నిరుపమ, కదిరి చాలా మంది గర్భిణీల్లో ఎదురు కాళ్లతో బిడ్డ ఉండడం చూస్తాం. అయితే తొమ్మిదవ నెలలో అంటే 36– 37వ వారానికీ బిడ్డ అదే పొజిషన్లో ఉంటే అప్పుడు చర్చించాలి. బిడ్డ కదలికలు ఎక్కువగా ఉన్నప్పుడు స్కానింగ్‌లో పొజిషన్ మారుతుంది. ప్రసవమప్పుడు అంటే తొమ్మిదవ నెల నిండినప్పుడు కూడా బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటే అప్పుడు ప్రసవం కష్టమవుతుంది. అలా 36–37వ వారంలో కూడా బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటే మీ డాక్టర్ చెక్ చేసి కొన్ని పరీక్షలు చేసి, ECV (ఎక్స్టర్నల్ సెఫాలిక్ వెర్షన్) అనే ప్రక్రియ ద్వారా బిడ్డ తల కిందకు వచ్చేటట్టు చేయగలుగుతారు. అలా చేయలేని పక్షంలో సిజేరియన్ చేయడమే మేలు. కొంత మంది గర్భిణీల్లో 36– 37వ వారం వచ్చేసరికి బిడ్డ తనంతట తానే హెడ్ పొజిషన్‌కు మారుతుంది. అప్పుడు నార్మల్ డెలివరీ చేయొచ్చు. వందలో ముగ్గురికి మాత్రమే 36–37వ వారానికి కూడా బిడ్డ ఎదురు కాళ్లతోనే ఉండిపోయి హెడ్ పొజిషన్‌కు రాదు. బిడ్డ ఎదురుకాళ్లతో ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్లెసెంటా కిందకు ఉన్నప్పుడు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు, కవలలు ఉన్నప్పుడు, తొలి చూలులో గర్భసంచిలో ఓ అడ్డుగోడలాంటిది ఏర్పడినప్పుడు బిడ్డ ఎదురు కాళ్లతో ఉండే స్థితి చూస్తాం. బిడ్డ ఎదురు కాళ్లతో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించడం వల్ల ఇటు తల్లికి, అటు బిడ్డకూ రిస్కే. ప్రసవమప్పుడు బిడ్డకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం, తల బయటకు రావడంలో సమస్య ఎదురవడం, నొప్పులతో ఎక్కువ సేపు కష్టపడ్డం, అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి రావడం జరుగుతాయి. అందుకే తొమ్మిదవ నెల చివరిలో కూడా బిడ్డ ఎదురు కాళ్లతోనే ఉంటే సిజేరియన్ గురించి డాక్టర్.. పేషెంట్‌తో చర్చిస్తారు. ►నాకిప్పుడు ఎనిమిదవ నెల. ఒళ్లంతా దురదలు. మందులు వాడినా తగ్గడం లేదు. ఇది పొట్టలో బిడ్డ మీదేమైనా ప్రభావం చూపుతుందా? – శ్రీలక్ష్మి పెండ్యాల, వరంగల్ గర్భంతో ఉన్నప్పుడు చాలామందికి ఒంటి మీద దురద వస్తుంది. ఇది నెలలు నిండే కొద్దీ చర్మం సాగడం వల్ల, వేడి వల్ల కూడా వస్తుంది. కొన్ని రకాల మాయిశ్చరైజర్ క్రీమ్స్‌తో ఇది తగ్గుతుంది. కానీ వందలో ఒకరికి అబ్స్టెట్రిక్ కొలెస్టాసిస్ అనే కండిషన్ ఉన్నప్పుడు ఎన్ని క్రీములు రాసినా దురద తగ్గదు. గర్భంతో ఉన్నప్పుడు కాలేయం ప్రభావితమై శరీరంలోకి బైల్ యాసిడ్స్ విడుదలవుతాయి. అందువల్ల దురద వస్తుంది. ఇది ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో దీనికి కారణం తెలియదు. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవటం, జన్యు కారణాలూ కావచ్చు. ఇది తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు. చాలామందికి 28 వారాలు (ఏడవ నెల)లో వస్తుంది. అరి చేతులు, అరి కాళ్లు, పొట్ట మీద ఎక్కువ దురద వస్తుంది. దద్దుర్లు ఉండవు. రాత్రివేళ ఎక్కువవుతుంది. దీనితో కొంతమందికి జాండీస్ రావచ్చు. ఆకలి తగ్గిపోతుంది. నీరసంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పొట్టలో బిడ్డకు కొంచెం రిస్క్ తలెత్తొచ్చు. బైల్ యాసిడ్స్ ఎక్కువ అవడంతో పొట్టలో బిడ్డ మల విసర్జన చేయడం, నెలలు నిండకుండా ప్రసవమవడం, ఊపిరాడకపోవడం వంటివి సంభవిస్తాయి. అందుకే దురద తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్, బైల్ యాసిడ్స్ టెస్ట్ చేసి.. సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన మందులు ఉంటాయి. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి తగిన మందులు వాడితే దురద తగ్గుతుంది. ►నాకిప్పుడు అయిదవ నెల. ఆస్తమా ఉంది. ఇన్హేలర్స్ వాడాల్సి వస్తోంది. దీని వల్ల నాకు కానీ, నా బిడ్డకు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటుందా? – టి. అనూష, నిర్మల్ ఆస్తమా ఉన్నవాళ్లకు ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఏ విధమయిన ఇబ్బందీ ఉండదు. మూడింట ఒకింత మందికి మాత్రం ఆస్తమా ఎక్కవై ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఉండే ఎసిడిటీ వల్ల ఆస్తమా ఎక్కువ ఇబ్బంది పెట్టవచ్చు. ఆస్తమా ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీలో ఆపకూడదు. మీ డాక్టర్ పర్యవేక్షణలో ప్రెగ్నెన్సీలో సేఫ్‌గా ఉండే మందులు, ఇన్హేలర్స్ కొనసాగించాలి. ఆస్తమా నియంత్రణలో ఉంటే మీకు, బేబీకి ఏ సమస్యా రాదు. అకస్మాత్తుగా మందులు ఆపేస్తే మీకు ఆస్తమా అటాక్ కావచ్చు. బిడ్డ కూడా తక్కువ బరువుతో అంటే లో బర్త్ వెయిట్‌తో పుడుతుంది. అందుకే మందులు ఆపకుండా కొనసాగించాలి డాక్టర్ పర్యవేక్షణలో. మందులతో పాటు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పోషకాహారం తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఎలర్జీ వచ్చే ఆహారం, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుకి వెంటనే చికిత్స తీసుకోవాలి. అవసరమైతే స్టెరాయిడ్ ఇన్హేలర్ కూడా వాడాలి. ఆస్తమా ఉన్నా నార్మల్ డెలివరీకి ప్రయత్నించొచ్చు. ఇన్హేలర్ తీసుకుంటున్నా బిడ్డకు తల్లి పాలు పట్టొచ్చు. మీకు రాత్రి పూట ఆయాసం ఎక్కువ అయినా, ఇన్హేలర్ ఎక్కువసార్లు వాడవలసి వచ్చినా, ఊపిరాడకపోవడం వంటి సమస్య ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌ని సంప్రదించాలి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఏడో నెల ప్రెగ్నెన్సీ.. విపరీతమైన నొప్పి.. ఏం చేయాలి డాక్టర్?
Gynecology Problems Solutions And Tips In Telugu: ప్రెగ్నెన్సీలో వ్యాయామాలు చేసినందువల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? – యామిని, వైజాగ్ ఆరోగ్యవంతమైన తల్లి–బిడ్డకి వ్యాయామాలు ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో చాలా అవసరం. వారంలో కనీసం 150 నిమిషాలు ఒక మోస్తరు వ్యాయామాలు చేసినందువల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ వ్యాయామాలు చేయకపోతే, ప్రెగ్నెన్సీలో కొంచెం నెమ్మదిగా, చిన్నచిన్న వ్యాయామాలతో మొదలుపెట్టాలి. మీకు యోగా, ఆసనాలు, నడవడం వంటివి ముందే అలవాటు ఉంటే అవి కంటిన్యూ చేయొచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేసినందువల్ల.. 1) ప్రెగ్నెన్సీలో కరెక్ట్ వెయిట్ గెయిన్ ఉంటుంది. 2) సుగర్, రక్తపోటు(బీపీ) వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 3) నిద్ర బాగా పడుతుంది. 4) ఉల్లాసంగా యాక్టివ్‌గా ఉండొచ్చు. ∙మీరు వ్యాయామాలు/యోగా వంటివి ఆన్లైన్లో మంచి ట్రైనర్ దగ్గర క్లాసులు అటెండ్ అవ్వచ్చు. దానిలో కనీసం వారానికి రెండు సార్లు మజిల్ స్ట్రెంగ్తెనింగ్ యాక్టివిటీస్ (కండరాలు బలపరుచుకునేందుకు) చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. ∙ప్రతి చిన్న వ్యాయామం, బాడీ మూమెంట్ మీకు లాభం చేస్తుంది. ప్రతి నిమిషం కౌంట్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో వ్యాయామం చేసినందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ∙మీ శరీరానికి సరిపడే వ్యాయామాలను అడాప్ట్ చేసుకోవాలి. ఇంట్లో మెట్లు ఎక్కి దిగడంతో పాటు యోగా చేసుకోవచ్చు. ∙బయటకు వెళ్లే అవకాశం ఉంటే.. లాంగ్ వాకింగ్ చేయడం, సైక్లింగ్కి వెళ్లడం మంచిదే. మీకు ఇష్టమయితే స్విమ్మింగ్, డాన్సింగ్ వంటివి కూడా చేయొచ్చు. ∙కొన్ని ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఉన్నవారికి మీ డాక్టర్ 3వ నెలలోనే ఎలాంటి వ్యాయామాలు చేయొచ్చో చెప్తారు. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ట్రైనర్‌ను సంప్రదిస్తే, ఎలాంటి వ్యాయామాలు సురక్షితమో వివరిస్తారు. మెనోపాజ్ అంటే ఏంటి? నాకు ఇప్పుడు యాభై ఏళ్లు. గత 6 నెలలుగా నెలసరి రావడం లేదు. చాలా చిరాకుగా ఉంటోంది. పరిష్కారం చెప్పగలరు? – లలిత, ఖమ్మం మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోవటం. చాలా మందికి 45–55 సంవత్సరాల మధ్యలో నెలసరి ఆగిపోతుంది. దీనికి కారణం అండాలు విడుదల కాకపోవడమే. ఈ పరిస్థితిని కొంతమందిలో నలభై ఏళ్లలోపే చూస్తాం. నెలసరి ఆగినప్పుడు, శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చాలామందికి ఒంట్లో వేడిగా ఉండటం, చెమటలు ఎక్కువగా పట్టడం, యోని దగ్గర పొడిబారి ఉండటం, మూడ్ డిస్టర్బ్ కావడం, మజిల్స్, జాయింట్స్ పెయిన్ వస్తాయి. నెలసరి ఆగినప్పుడు ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ టెస్ట్‌తో మెనోపాజ్ వచ్చిందా? లేదా? అని తెలుసుకోవచ్చు. ఈ టైమ్‌లో ఆహారంలో ఎక్కువ శాతం పళ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, సోయాబీన్స్, పాలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవాలి. కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. రొటీన్ పాప్‌స్మియర్ టెస్ట్, థైరాయిడ్, సీబీపీ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఒకవేళ మీకు పైన చెప్పిన లక్షణాలు ఎక్కువగా ఉంటే.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ)ని డాక్టర్ సూచిస్తారు. తక్కువ మోతాదులో ఈస్ట్రోజెన్ జెల్స్‌తో యోని డ్రైనెస్ తగ్గుతుంది. ఇబ్బందిగా ఉంటే మీ డాక్టర్ని సంప్రదించాలి. నాకు ఏడవ నెల ప్రెగ్నెన్సీ. నాకు విపరీతమైన నడుము, కాళ్ల నొప్పులు ఉన్నాయి. డాక్టర్ ఏ మందులు ఇచ్చినా, నొప్పి మాత్రం తగ్గడంలేదు. ఏం చేయాలి? – స్వరూప, మెహిదీపట్నం నడుము భాగం మూడు జాయింట్స్‌తో ఏర్పడుతుంది. ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ ఆ బరువు ఈ జాయింట్స్ మీద పడి, బాగా స్ట్రెస్ అవుతుంది. ఇది ఐదుగురిలో ఒకరికి వస్తుంది. నడుము నొప్పి నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, పక్కకు తిరిగి పడుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా రావచ్చు. దీనికి నిలబడే, కూర్చునే భంగిమ ప్రధానమైన కారణం. నిజానికి ఈ నొప్పి వల్ల బేబీకి ఏ ఇబ్బంది ఉండదు. కొన్ని చిన్న చిన్న మార్పులతో మీరు ఈ నొప్పి తగ్గించుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం వల్ల, ప్రెగ్నెన్సీలో బాడీ అడాప్ట్ అవుతుంది. ∙నిటారుగా నిలబడాలి, వంగి నడవకూడదు. ∙ 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకూడదు. మధ్యలో లేచి నడవాలి. ∙రెండు కాళ్ల మీద సరిగ్గా బరువు పెట్టి నడవాలి. ∙తలగడని కాళ్ల మధ్యలో, నడుము వెనక పెట్టుకొని పడుకోవాలి. ∙ప్రెగ్నెన్సీ సపోర్ట్ బెల్ట్ వాడవచ్చు. ∙వంగి బరువులు ఎత్తకూడదు. ∙ఎక్కువసార్లు మెట్లు ఎక్కి దిగకూడదు. ∙పేరాసిటమల్ లాంటి తక్కువ డోస్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు. లైఫ్‌స్టయిల్ చేంజెస్ చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి నడుము నొప్పి ఉన్నా నార్మల్ డెలివరీ చేయొచ్చు. అందుకు లేబర్ వార్డ్‌లో కొన్ని మార్పులు చేస్తాము. ఎక్కువసేపు బెడ్ మీద పడుకోకుండా, కొంచెం సపోర్ట్‌తో నడిపిస్తాము. ఈ నొప్పి డెలివరీ తర్వాత చాలామందికి తగ్గిపోతుంది. పదిమందిలో ఒకరికి మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్ ఫిజియోథెరపీతో నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ నొప్పి మళ్లీ తరువాత ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు. అందుకే సరైన బరువుతో నెక్ట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. కాన్పు తర్వాత ట్రైనర్ ద్వారా పొట్ట, నడుము భాగంలోని మజిల్ టైటెనింగ్ ఎక్స్‌సర్‌సైజ్ చేస్తే మళ్లీ ఈ నొప్పి వచ్చే అవకాశాలు చాలా అరుదు. పోషకాహారం తీసుకోవాలి. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ -
నేను గర్భవతిని.. మూర్ఛ వల్ల ఏమైనా సమస్యలు తలెత్తుతాయా?
Pregnant Ladies Epilepsy Health Tips In Telugu: నాకు ఫిట్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను గర్భవతిని. మూర్ఛ వల్ల నా ప్రెగ్నెన్సీలో ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మీదేమైనా ప్రభావం ఉండొచ్చా? – విరిజ, ఆదిలాబాద్ ఫిట్స్ (ఎపిలెప్సీ, మూర్ఛ) చాలామందికి ఉంటుంది. అది చాలావరకు ప్రెగ్నెన్సీలో ఇబ్బంది కలగచేయకపోవచ్చు. కానీ మందులు కచ్చితంగా వేసుకోనప్పుడు, డాక్టర్ పర్యవేక్షణలో నెలనెలా సరైన జాగ్రత్తలు తీసుకోనప్పుడు చాలామందికి ప్రెగ్నెన్సీలో రిస్క్ ఉండే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి మూడు నెలల ముందే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌ను కలిసి.. వాళ్లు సూచించిన మందులు వాడితే ప్రెగ్నెన్సీలో ఉండే రిస్క్‌ను తగ్గించవచ్చు. ఫిట్స్ ఉన్న కొంతమందిలో ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సార్లు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. గర్భం ధరించగానే అంతకుముందు వాడుతున్న ఫిట్స్ మందులను తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడమే దానికి కారణం. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు నీరసం, సరైన నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల ఫిట్స్ పెరుగుతాయి. ఫిట్స్ మందులు ఆపేస్తే పుట్టబోయే బిడ్డకూ రిస్క్ ఉంటుంది. ఈ ఫిట్స్ నియంత్రణలో లేకపోతే SUDEP (సడెన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ విత్ ఎపిలెప్సీ) అనే రిస్క్ పెరుగుతుంది. ఫిట్స్ ఉన్న తల్లులకు అవయవలోపాలతో బిడ్డ పుట్టే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రిస్క్ వాళ్లు తీసుకునే మందులు, వాటి మోతాదుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ బిడ్డల్లో వెన్నుపూస, గుండె, మొహానికి సంబంధించిన సమస్యలను చూస్తాం. గర్భధారణ కంటే ముందు మూడు నెలలు ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకున్నవారిలో ఈ రిస్క్ చాలా తగ్గుతుంది. కొన్ని ఫిట్స్ మందులు ఉదాహరణకు సోడియమ్ వాల్‌ప్రోయేట్ వంటివాటిని గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు ప్రమాదావకాశం ఎక్కువ. ఈ మాత్రలను తీసుకునేవారు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు న్యూరాలజిస్ట్‌ను కలిస్తే.. ఆ మాత్రలకు బదులు సురక్షితమైన మరోరకం మాత్రలను సూచిస్తారు. అయితే ఫిట్స్ మందులను హఠాత్తుగా ఎప్పుడూ ఆపకూడదు. మందులు వేసుకున్న దానికన్నా ఇలా హఠాత్తుగా ఆపినప్పుడే తల్లికి, బిడ్డకు ప్రమాదావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటన్నిటి నేపథ్యంలో ఫిట్స్‌కి వాడే మందులు, వాటి మోతాదు గురించి గర్భధారణ కన్నా ముందే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌తో చర్చించడం మంచిది. ఫోలిక్‌యాసిడ్, ఫిట్స్‌ను నియంత్రణలో ఉంచాకే గర్భధారణకు ప్లాన్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా చెకప్స్‌కి వెళుతూ.. మందులు సరిగ్గా వేసుకుంటే ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకూ రిస్క్ తక్కువగా ఉంటుంది. గర్భధారణ కంటే ముందు లేదా గర్భం ఉన్నట్టు నిర్ధారణ అయిన వెంటనే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌ను కలవాలి. ప్రెగ్నెన్సీలోనూ క్రమం తప్పకుండా ఫిట్స్‌కు మందులు వాడాలి. ఒత్తిడి, ఆందోళనలకు గురికాకూడదు. తగినంత విశ్రాంతి, నిద్ర ఉండేట్టు చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. రోజూ కొంతసేపు వ్యాయామం చేయాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో ఫిట్స్ వస్తే.. వెంటనే ఆసుపత్రిలో జాయిన్ కావాలి. న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మందులు, మోతాదులను అడ్జెస్ట్ చేస్తారు. ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్కు చెందిన నిపుణులతో స్కానింగ్ చేయించుకోవాలి. సాధారణ గర్భవతుల్లాగే మీరూ నార్మల్ డెలివరీకి ప్లాన్ చేసుకోవచ్చు. కాన్పు సమయంలో, ఆ తరువాత ఫిట్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది కాబట్టి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. నొప్పి తెలియకుండా ప్రసవం అయ్యే పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి మత్తమందు డాక్టర్ (ఎనస్తటిస్ట్) పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ఇస్తారు. ఇది తీసుకోవచ్చు. కాన్పు తరువాత.. బిడ్డకు మీ పాలు పట్టొచ్చు. మీకు తగినంత నిద్ర, విశ్రాంతి ఉండాలి. సపోర్ట్‌గా కుటుంబ సభ్యులు ఉంటే మంచిది. పళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. అలాగే బిడ్డ సంరక్షణ విషయంలో మీ మీద ఒత్తిడి పడకుండా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాలి. బిడ్డకు పాలిచ్చేప్పుడు మీరు నేల మీద కూర్చోవడం, బిడ్డకు నేల మీదే పక్కవేసి.. దాని మీద పడుకోబెట్టే బట్టలు మార్చడం వంటివి చేయాలి. ఎందుకంటే హఠాత్తుగా మీకు ఫిట్స్ వచ్చినా బిడ్డకు ఇబ్బంది లేకుండా .. ప్రమాదవశాత్తు కిందపడకుండా ఉంటుంది. ఇక తరువాత కాన్పు విషయానికి వస్తే.. తగినంత సమయం తీసుకుంటేనే మంచిది. దానికోసం వాడాల్సిన గర్భనిరోధక పద్ధతుల గురించి డాక్టర్‌ను సంప్రదించాలి. ఫిట్స్ మందులు కొనసాగించాలి. ప్రసవం అయ్యాక రెండు వారాలకు మీ న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. బిడ్డకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
మూడో నెలలో గర్భస్రావం అయింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మేడం! నాకిప్పుడు రెండో నెల. తొలి చూలు. వారం రోజులుగా స్పాటింగ్ అవుతోంది. గర్భధారణ సమయంలో ఇది సహజమా? లేక ప్రమాదకరమా? – నిహారిక, గుంటూరు గర్భధారణ మొదటి మూడు నెలల్లో కొంచెం స్పాటింగ్, నడుం నొప్పి ఉండవచ్చు. ప్రతిసారీ అది ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మాత్రం గర్భస్రావానికి సూచన కావచ్చు. అందుకే స్పాటింగ్ కానీ, నొప్పి, బ్లీడింగ్ కానీ అవుతుంటే వెంటెనే డాక్టర్ని సంప్రదించి, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. మీ ఆఖరి నెలసరి తేదీని బట్టి అది ఎన్నివారాల గర్భమో చూస్తారు. దానికి తగ్గట్టుగానే స్కానింగ్‌లో గర్భస్థ పిండం ఎదుగుదల కనిపిస్తే ఇబ్బందేమీ ఉండదు. కొన్ని సార్లు వెజైనా నుంచి కానీ, గర్భసంచి నుంచి కానీ రక్తస్రావం అవుతుంటే డాక్టర్ చేసే పరీక్షలో తెలుస్తుంది. కొన్ని మందులతో దానిని తగ్గించవచ్చు. వెజైనల్ ఇన్ఫెక్షన్ కూడా కొన్నిసార్లు స్పాటింగ్కి కారణం కావచ్చు. దీన్నీ మందులతో తగ్గించవచ్చు. మీ బ్లడ్ గ్రూప్, థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అయిదుగురిలో ఒకరికి ఈ స్పాటింగ్ అనేది గర్భస్రావానికి దారితీస్తుంది. అందుకే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచింది. స్పాటింగ్‌తో పాటు కళ్లు తిరగటం, కడుపులో విపరీతమైన నొప్పి, భుజాల్లో నొప్పి వంటి లక్షణాలూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్లాలి. నాకు మూడవనెలలో గర్భస్రావం అయింది. రెండు వారాల కిందట డీ అండ్ సీ చేశారు. ఇప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రత్యూష, అరసవిల్లి గర్భస్రావం అనేది చాలా బాధాకరమైంది. దానికి కారణాలు తెలుసుకోవడం ఆవశ్యకమే కానీ ముందు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. డీ అండ్ సీ ప్రొసీజర్ తర్వాత కొన్ని పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇస్తారు. డాక్టర్ సూచించిన విధంగానే వాటిని వేసుకోవాలి. పాలు, బ్రెడ్, పళ్లు, ఆకు కూరలు, కాయగూరలు, పప్పు దినుసులు, డ్రైఫ్రూట్స్‌తో మంచి ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మంచి నీళ్లు తాగాలి. మీకు సపోర్ట్‌గా ఉన్న కుటుంబసభ్యులతో అన్ని విషయాలూ పంచుకోవాలి. అధిక రక్తస్రావం అవుతున్నా, అది దుర్వాసన వేస్తున్నా, భరించలేని కడుపు నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్ని కలవాలి. మీరు తగినన్ని నీళ్లు తాగుతున్నప్పటికీ మూత్రంలో మంటగా ఉన్నా, ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తున్నా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. గర్భస్రావం అయిన రెండు వారాలకు మీరు మామూలుగా ఇంటి పనులు, వ్యాయామం, యోగా మొదలుపెట్టవచ్చు. వ్యాయామం వల్ల కాళ్లల్లో రక్తం గడ్డకట్టడం (డీవీటీ) వంటి సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు మీరు ఆఫీస్‌కు వెళ్లవచ్చు. కారు, బైక్ వంటివీ నడపొచ్చు. గర్భస్రావం తరువాత మళ్లీ నెలసరి కొంచెం ఆలస్యం కావచ్చు. బలానికి మూడు నెలలపాటు మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా మీరు పూర్తిగా కోలుకున్న తరువాతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాలి. అప్పటివరకు గర్భనిరోధక మాత్రలు లేదా కండోమ్స్‌ను ఉపయోగించాలి. కొన్ని రక్త పరీక్షలు చేసిన తరువాత గర్భస్రావానికి గల కారణాన్ని డాక్టర్ చెప్పగలుగుతారు. నాకిప్పుడు అయిదవ నెల. అమెరికా వెళ్లాల్సిన అవసరం పడింది. నేనిప్పుడు విమాన ప్రయాణం చేయొచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ టైమ్‌లో అసలు ఎప్పటి వరకు ఫ్లయిట్ జర్నీ చేయొచ్చు? – వర్షిణి, హైదరాబాద్ ప్రెగ్నెన్సీ సమయంలో విమానయానం చేయొచ్చు భద్రంగా. ఎయిర్ ప్రెజర్ మూలంగా కడుపులో బిడ్డ మీద ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గర్భధారణప్పుడు ముప్పై వారాల లోపు వరకు విమాన ప్రయాణం చేయొచ్చు. చాలా విమానయాన సంస్థలు 37 వారాలు దాటిన తర్వాత అనుమతి కూడా ఇవ్వరు. గర్భంలో కవలలు ఉన్నట్లయితే 32 వారాల (ఎనిమిదవ నెల) లోపు ప్రయాణం చెయ్యాలి. మీరు ప్రయాణం చేయాలనుకున్న విమానయాన సంస్థల నియమ నింబంధనలను ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమంది గర్భవతులకు కాళ్ల వాపు, తల తిరగడం, వాంతులు, తలనొప్పి ఉండవచ్చు. దానికి తగిన మందులకు ముందుగానే డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. కొంతమందికి కాళ్లల్లో రక్తం గడ్డకడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కొన్ని వైద్యపరమైన సమస్యలున్న గర్భవతులకు ఈ రిస్క్ ఎక్కువ. కాబట్టి మీ డాక్టర్‌ను సంప్రదించి ముందుగా కొన్ని మందులు వాడటం మంచిది. నాలుగు గంటల కన్నా ఎక్కువ విమానయానం చేస్తే కూడా ఈ రిస్క్ ఉంటుంది. అందుకే ‘టీఈడీ స్టాకింగ్స్’ అనే సాక్స్ వేసుకోమని చెప్తాం. ఫ్లయిట్లో ముప్పై నిమిషాలకు ఒకసారి సీట్ ఎక్సర్సైజెస్ చేయమనీ చెప్తాం. నీళ్లు ఎక్కువగా తాగాలి. కుదిరితే కొంచెం సేపు నడవాలి. హైరిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్లు ‘హెపారిన్’ ఇంజెక్షన్ చేయించుకోవలసి వస్తుంది. రక్త హీనత ఉన్నా, ఇంతకు ముందు నెలలు నిండకుండా డెలివరీ అయినా, బ్లీడింగ్ అవుతున్నా, ఊపిరితిత్తులు, గుండెకి సంబంధించి జబ్బు ఉన్నా ఫ్లయిట్లో సుదూర ప్రయాణం చేయకూడదు. విమానయానానికి ముందే పైన చెప్పిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఏ ప్రమాదమూ ఉండదు. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
అదుపు చేసుకోలేకపోతున్నాను.. నాకేమైనా సమస్య ఉందంటారా?
నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్‌లో కూడా ఏ పనిమీదా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – పల్లవి, మచిలీపట్నం మీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందికి నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి. పీఎంఎస్‌కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి. చదవండి: (వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులు...) ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్‌ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది. అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నా వయసు 67 సంవత్సరాలు. పదిహేను రోజులుగా నాకు మళ్లీ నెలసరి కనిపిస్తోంది. దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా? నేను హాస్పిటల్‌కి వెళ్లి, డాక్టర్‌కు చూపించుకోవలసి ఉంటుందా? – శ్యామల, భీమవరం నెలసరి నిలిచిపోయిన తర్వాత మళ్లీ స్పాటింగ్, బ్లీడింగ్ కనిపించడం ప్రమాదకరం. మీరు వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి. దీనిని ‘పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. నెలసరి ఆగిపోయిన తర్వాత యోని లోపలిపొర పల్చగా మారడం వల్ల బ్లీడింగ్ కావచ్చు. చాలా అరుదుగా పదిమందిలో ఒకరికి క్యాన్సర్ మార్పులు చోటు చేసుకోవచ్చు. మీరు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదిస్తే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, పాప్‌స్మియర్, బయాప్సీ వంటి అవసరమైన పరీక్షలు చేసి, సమస్యకు గల కారణాన్ని కనిపెడతారు. ఈ పరీక్షలన్నీ ఔట్‌పేషెంట్‌గానే చేయించుకోవచ్చు. చాలాసందర్భాల్లో ‘ఈస్ట్రోజన్ వజైనల్ క్రీమ్’లాంటివి సూచిస్తారు. అంతకుమించి చికిత్స అవసరం ఉండదు. అరుదుగా మాత్రమే, క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలు ఉంటే, పరిస్థితిని బట్టి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. డా. భావన కాసు గైనకాలజిస్ట్ & అబ్‌స్టెట్రీషియన్ హైదరాబాద్ -
నాకు పెళ్లి కాలేదు.. సర్జరీ చేయించుకుంటే ఏమైనా సమస్యా?
నా వయసు 31 సంవత్సరాలు. పెళ్లయి ఏడేళ్లయినా, ఇంతవరకు మాకు పిల్లల్లేరు. మాది మూడోతరం మేనరికం. ఇద్దరమూ పరీక్షలు చేయించుకుంటే, నార్మల్‌గానే ఉన్నట్లు తేలింది. డాక్టర్ల సలహాలపై ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. మాకు పిల్లలు పుట్టకపోవడానికి మేనరికమే కారణమా? మా సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందా? – నాగమణి, శ్రీకాకుళం మేనరికం వల్ల గర్భంరాకపోవడం అంటూ ఏమీ ఉండదు. మేనరికం వల్ల అబార్షన్లు అవ్వడం, పిల్లలలో అవయవ లోపాలు, జన్యుపరమైన లోపాలు, మామూలు వారితో పోలిస్తే రెట్టింపు అవుతాయి. అంతే కానీ గర్భం రాకపోవటానికి ఏమీ సంబంధం ఉండదు. మీ భార్యాభర్తలు ఇద్దరి పరీక్షల రిపోర్టులలో ఏమి సమస్యలు లేకపోయినా గర్భం రాకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుని ఉన్నయా?, తెరచుకుని ఉన్నాయా? అని తెలుసుకోవటానికి చేసే HSG test చేయించుకునే ఉంటారు. ఒకవేళ చేయించుకోకుండా ఉండి ఉంటే చేయించుకుని తెలుసుకోవటం మంచిది. రిపోర్ట్లు అన్నీ సాధారణంగానే ఉన్నా కానీ కొంతమందిలో వీర్యకణాలు గర్భాశయం లోపలికి వెళ్లలేకపోవడం, వెళ్లినా గర్భాశయం ముఖద్వారం దగ్గర ఉండే యాంటీస్పెర్మ్ యాంటీబాడీలు వీర్యకణాలను నిర్వీర్యం చెయ్యడం వల్ల అవి ఫెలోపియన్ ట్యూబ్ వరకు ప్రయాణించలేకపోవడం, అండంలోకి వెళ్లి ఫలదీకరణ చెయ్యలేకపోవడం(Fertilization)ఫలదీకరణ చెందినా పిండం, గర్భాశయంలోకి చేరి అక్కడ అతుక్కోకపోవడం (implantation)వంటి సమస్యల వల్ల గర్భం రాకపోవచ్చు. ఈ సమస్యలు తెలుసుకోవడానికి పెద్దగా నిర్ధారణ పరీక్షలు ఏమీ ఉండవు. దీనినే అన్ఎక్స్ప్లైన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటారు. మీరు మందులు వాడినా గర్భం రాలేదు కాబట్టి, వయసు కూడా 31 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి సమయం వృథా చేసుకోకుండా ఐయుఐ పద్ధతి ద్వారా మీ వారి వీర్యకణాలను శుద్ధి చేసి, మంచి నాణ్యత గల వీర్యకణాలను మీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా సాధారణంగా కంటే 10 నుంచి 20 శాతం వరకు గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీనిని 3 నుంచి 6 సార్ల వరకు ప్రయత్నించవచ్చు. అయినా గర్భం రాకుంటే ఐవిఎఫ్ పద్ధతి అంటే టెస్ట్‌ట్యూబ్ బేబి పద్ధతిని ప్రయత్నించవచ్చు. దీని ద్వారా 40 శాతం వరకు గర్భం నిలిచే అవకాశాలు ఉన్నాయి. నా వయసు 22 ఏళ్లు. ఎత్తు 4.9 అడుగులు, బరువు 73 కిలోలు. రెండువారాల కిందట కడుపులో కుడివైపు తీవ్రమైన నొప్పి వస్తే, డాక్టర్‌కి చూపించుకున్నాను. స్కానింగ్‌లో ఇంటర్నల్ టోర్షన్, ఎన్లార్జ్డ్ రైట్ ఓవరీ (69 x 33 ఎంఎం), స్మాల్ హేమరేజిక్ సిస్ట్ (7 ఎంఎం) అని వచ్చింది. యాంటీబయోటిక్స్ వాడితే నొప్పి తగ్గింది. ఇప్పుడు ఈ సమస్యకు సర్జరీ అంత అవసరమంటారా? నేను ఇంకా స్టూడెంట్‌ని. పెళ్లి కాలేదు. సర్జరీ చేయించుకుంటే భవిష్యత్తులో కాంప్లికేషన్స్ ఏవైనా వస్తాయా? వివరించగలరు. – అనూష, ఈ–మెయిల్ మీ ఎత్తుకి దగ్గర దగ్గర 20 కేజీల అధిక బరువు ఉన్నారు. మీ కుడి అండాశయం ఓవరీలో నీరు, రక్తం చేరడం వల్ల అది పెద్దగా అయి ఎన్లార్జ్డ్ ఓవరీ అవ్వడం, లేదా అండాశయం పెద్దగా ఉండటం వల్ల అండాశయం టోర్షన్ అవ్వడం అంటే అది మెలికపడి, అండాశయానికి రక్తప్రసరణ తగ్గి దాని వల్ల.. అండాశయంలో నీరు చేరడం, బ్లీడింగ్ అవ్వడం వల్ల అండాశయం పెద్దగా అయ్యి, విపరీతమైన నొప్పి, వాంతులు అవ్వడం జరుగుతుంది. మందులతో నొప్పి తగ్గినా, కొంతమందిలో మెలికపడిన అండాశయానికి పూర్తిగా రక్తప్రసరణ తగ్గిపోయి ఆలస్యం చేస్తే అండాశయం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అండాశయం ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. అది తొలగించవలసి ఉంటుంది. కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, మరలా ఒకసారి డాప్లర్ స్కానింగ్ చేయించుకుని, అండాశయం పరిమాణాన్ని బట్టి చూడవలసి ఉంటే, మెలికను తొలగించి (Detorsion) చూడవలసి ఉంటుంది. ఒకవేళ తర్వాత అండాశయం మామూలుగా ఉంటే, అండాశయాన్ని తొలగించనవసరం లేదు. ఒకవేళ సర్జరీ చేసి అండాశయం మొత్తం తొలగించవలసి ఉంటుందా, కొద్దిభాగం తొలగించవలసి ఉంటుందా అనేదాన్ని బట్టి తర్వాత ఏమి చెయ్యాలి అనేది ఉంటుంది. ఒక అండాశయం తొలగించినా, ఇంకొక అండాశయం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో పెద్దగా కాంప్లికేషన్స్ రాకపోవచ్చు. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ప్రసవానికి వస్తే మృత శిశువును చేతిలో పెట్టారు.. న్యాయం చేయండి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే, మృత శిశువును చేతిలో పెట్టారంటూ బుధవారం బాధితురాలి బంధువులు పాత ప్రభుత్వాస్పత్రి మాతా శిశు విభాగం ఎదుట ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం నందిగామకు చెందిన జి.మమతకు పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం ఈ నెల 13వ తేదీ సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. ఆమె నార్మల్ డెలివరీ అవుతుందని భావించిన వైద్యులు అబ్జర్వేషన్ రూమ్‌లో ఉంచారు. ఆమె బుధవారం ఉదయం నార్మల్ డెలివరీ అయింది. అయితే పుట్టిన శిశువు మృతి చెంది ఉండటంతో విషయాన్ని బంధువులకు తెలిపారు. ఇప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న శిశువు పుట్టగానే ఎలా మృతి చెందుతుందని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందంటూ మృతశిశువును పెట్టుకుని ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ పాత ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో మృతశిశువు ప్రసవంపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ కమిటీలో గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి.హిమబిందు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యశ్రీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి.సుధీర్‌బాబు, సివిల్‌సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ ఎ.హనుమంతరావు, ఏఆర్ఎం డాక్టర్ ఎస్.మాధవీలతతో కూడిన కమిటీ అన్ని అంశాలపై విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. వైద్యుల తప్పులేదు శిశువు మృతి విషయంలో వైద్యుల తప్పిదం లేదు. శిశువు మెడకు మూడుసార్లు పేగు చుట్టుకుని ఉండటంతో ఊపిరి ఆడక మృతి చెంది ఉండవచ్చు. సాధారణంగా కొందరికి ఒక మెలిక పేగు మెడకు చుట్టుకుని ఉంటుంది. కానీ ఈ శిశువుకు మూడు మెలికలు చుట్టుకుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే, విచారణ చేస్తాం. –డాక్టర్ నాగేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్, పాత ఆస్పత్రి చదవండి: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు -
మూత్రానికి వెళ్లేటప్పుడు రక్తస్రావం.. ప్రమాదకర లక్షణమా?
నా వయసు 20 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 77 కిలోలు. పీసీఓడీ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. టాబ్లెట్లు వేసుకుంటే తప్ప పీరియడ్స్ రావడం లేదు. గడ్డంపై, పైపెదవి మీద వెంట్రుకలు వస్తున్నాయి. నా సమస్యకు తగిన చికిత్స సూచించగలరు. – మౌనిక, పిడుగురాళ్ల మీ ఎత్తు 5.4 అడుగులు. ఈ ఎత్తుకు గరిష్ఠంగా 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కానీ మీరు 77 కిలోలు ఉన్నారు. అంటే, 17 కిలోలు అధిక బరువుతో ఉన్నారు. అధిక బరువుతో పాటు పీసీఓడీ సమస్య కూడా ఉందంటున్నారు. పీసీఓడీ సమస్యలో గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాలలో నీటిబుడగలు ఏర్పడటం, మగవారిలో ఎక్కువగా ఉండే ఆండ్రోజన్ హార్మోన్లు వీరిలో ఎక్కువగా విడుదలవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడటం, వాటి ప్రభావం వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, ముఖంపై అవాంఛిత రోమాలు, జుట్టు అధికంగా ఊడిపోవడం, మొటిమలు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. మీ సమస్యకు చికిత్సలో ముఖ్యమైన భాగం బరువు తగ్గడమే! రోజూ కనీసం అరగంటైనా వాకింగ్, యోగా, ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేస్తూ, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, మితంగా పోషకాహారం తీసుకుంటూ బరువు తగ్గడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆండ్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, హార్మోన్లు సక్రమంగా పనిచేసి, పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరీ మందులు వాడితేనే పీరియడ్స్ వచ్చే పరిస్థితి కాకుండా, కనీసం రెండు నెలలకైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గడంతో పాటు డాక్టర్‌ను సంప్రదిస్తే, హార్మోన్ల అసమతుల్యతను బట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడం ద్వారా ఆండ్రోజన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గించడానికి అవసరమైన మందులతో పాటు అవసరమైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కలిసి ఉండే కొన్ని రకాల కాంట్రాసెప్టివ్ పిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బరువు తగ్గుతూ, మందులు వాడుతూ ఇప్పటికే ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి డెర్మటాలజిస్టును సంప్రదించి లేజర్ వంటి చికిత్సలు తీసుకోవచ్చు. కొందరిలో కేవలం బరువు తగ్గడం వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా వచ్చి, అవాంఛిత రోమాలు ఇంకా ఎక్కువగా పెరగకుండా ఉంటాయి. నా వయసు 60 ఏళ్లు. రుతుక్రమం ఆగిపోయి దాదాపు పదేళ్లవుతోంది. ఆరునెలలుగా మూత్రానికి వెళ్లేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తోంది. ఇదేమైనా ప్రమాదకర లక్షణమా? నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – ప్రభావతి, ఒంగోలు మూత్రానికి వెళ్లేటప్పుడు రక్తస్రావం మూత్రంలో పడుతోందా లేక యోనిభాగం నుంచి వస్తోందా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మూత్రాశయంలో కంతులు, రాళ్లు, కిడ్నీ సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల మూత్రంలో రక్తం పడవచ్చు. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మళ్లీ రక్తస్రావం అవడాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొందరిలో ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోయి, యోనిభాగం పూర్తిగా పొడిబారిపోయి, ఇన్ఫెక్షన్స్ ఏర్పడి కొద్దిగా బ్లీడింగ్ కనిపించవచ్చు. కొందరిలో గర్భాశయంలో కంతులు, గర్భాశయ పొర మందంగా ఏర్పడటం, గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వారం దగ్గర పుండ్లు, కండ పెరగడం (సర్వైకల్ పాలిప్స్), సర్వైకల్ క్యాన్సర్, అండాశయాలలో కంతులు వంటి అనేక కారణాల వల్ల పోస్ట్‌మెనోపాజల్ బ్లీడింగ్ రావచ్చు. మీకు రక్తస్రావం ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి, చికిత్సలు తీసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదిస్తే, వారు అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వజైనల్ స్కానింగ్, ప్యాప్‌స్మియర్ వంటి పరీక్షలు చేయించి, సమస్యను బట్టి గర్భాశయ పొర మందంగా ఉండటం లేదా పాలిప్ వంటివి ఉండటం గుర్తిస్తే, దానికి డీ అండ్ సీ చేసి, గర్భాశయాన్ని శుభ్రపరచి తీసిన ముక్కలను బయాప్సీకి పంపించి, ఆ రిపోర్టును బట్టి క్యాన్సరా కాదా అనేది నిర్ణయించి, గర్భాశయం తొలగించడం అవసరమా లేదా అనేది నిర్ణయించి, తగిన చికిత్స అందిస్తారు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం దగ్గర కండపెరగడం వల్ల బ్లీడింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు అదనంగా పెరిగిన కండను తొలగిస్తే సరిపోతుంది. కొందరిలో ఇన్ఫెక్షన్ల వల్ల, గర్భాశయంలో నీరు చేరడం వల్ల బ్లీడింగ్ కావచ్చు. వాటికి యాంటీబయోటిక్స్ ఇస్తే సరిపోతుంది. కొందరికి ఎండోమెట్రియమ్ పొరలో కండ పెరగడం వల్ల ఏర్పడే పాలిప్స్‌ను హిస్టరోస్కోపీ అనే పద్ధతి ద్వారా గర్భాశయం లోపలికి చూస్తూ, పాలిప్‌ను తొలగించి, బయాప్సీకి పంపడం జరుగుతుంది. అది సాధారణ పాలిప్ అని బయాప్సీలో తేలితే వేరే చికిత్స అవసరం ఉండదు. ఒకవేళ క్యాన్సర్‌కు సంబంధించినదని తేలితే, గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఆ సమయంలో ఆందోళన, కోపం, చిరాకు బాగా ఇబ్బందిపెడుతున్నాయి.. సలహాఇవ్వండి..
మాకు పెళ్లయి ఆరేళ్లయింది. ఇంకా పిల్లల్లేరు. మా వారికి స్పెర్మ్ కౌంట్, మొబిలిటీ బాగానే ఉంది గాని, మార్ఫాలజీ తక్కువ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. మా సమస్యకు పరిష్కారం తెలపండి. – సత్యవతి, ఈ–మెయిల్ పిల్లలు కలగకపోవడానికి 35 శాతం ఆడవారిలో లోపాలు, 35 శాతం మగవారిలో లోపాలు, మిగిలిన 30 శాతం ఇద్దరిలో లోపాలు కారణమవుతాయి. మగవారి లోపాలలో ముఖ్యమైన కారణం వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యతలో లోపాలు. మీ వారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక బాగానే ఉన్నా, వాటి నాణ్యత (మార్ఫాలజీ) సరిగా లేకపోవడం వల్ల అవి అండంలోనికి చొచ్చుకు పోలేవు. దానివల్ల అండం ఫలదీకరణ సరిగా జరగకపోవచ్చు. నాణ్యతలేని వీర్యకణాల వల్ల పిండం సరిగా ఏర్పడకపోవచ్చు. దానిల్ల గర్భం సరిగా నిలబడకపోవడం, అబార్షన్లు కావడం, బిడ్డలో అవయవ లోపాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వీర్యకణాలలో తల, మెడ, తోక అనే మూడు భాగాలు ఉంటాయి. వీటిలో ఏదో ఒక భాగంలో లేదా అన్ని భాగాలలో లోపాలు ఉండవచ్చు. సాధారణంగా వీర్యకణాలలో 4 శాతం కంటే ఎక్కువ వీర్యకణాలు నాణ్యత కలిగి ఉంటే, గర్భం రావడానికి అవకాశాలు బాగా ఉంటాయి. పొగతాగడం, మద్యం తాగడం వంటి అలవాట్లు ఉన్నా, సుగర్, అధిక బరువు, మానసిక ఒత్తిడి, వేరికోసిల్, ఇన్ఫెక్షన్లు ఇంకా ఇతర సమస్యలు ఉన్నట్లయితే వీర్యకణాల నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. ఇన్ఫెక్షన్లు ఉంటే సరైన కోర్సు యాంటీబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు వాడటం, దురలవాట్లు, జంక్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్ వంటివి మానుకోవడం, సుగర్ అదుపులో పెట్టుకోవడం, మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, యోగా, ధ్యానం వంటివి అలవరచుకోవడం వంటివి డాక్టర్ సలహా మేరకు పాటించాలి. అలాగే, అవసరమైన పరీక్షలు చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం వల్ల కూడా వీర్యకణాల నాణ్యత పెరిగే అవకాశాలు బాగా ఉంటాయి. చదవండి: ఇలా చేస్తే .. ఎప్పటినుంచో వెంటాడుతున్న చుండ్రు సమస్య పరార్!! నా వయసు 23 ఏళ్లు. నాకు ఏడాది కిందట పెళ్లయింది. నెలసరి సమయంలో ఆందోళన, చిరాకు, కోపం బాగా ఇబ్బందిపెడుతున్నాయి. పుట్టింట్లో ఉన్నప్పుడు కోపంతో అరిచినా, చిరాకు పడినా ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఇప్పుడు నా భర్తపై చిరాకు చూపిస్తుండటంతో ఇద్దరికీ తరచు గొడవలు జరుగుతున్నాయి. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. – మానస, ఏలూరు కొందరిలో పీరియడ్స్ మొదలయ్యే పది పదిహేను రోజుల ముందే ప్రొజెస్టిరాన్ హార్మోన్లో మార్పుల వల్ల, కొన్ని మినరల్స్ లోపం వల్ల, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల కోపం, చిరాకు, ఆందోళన, శరీరం బరువెక్కినట్లు ఉండటం, రొమ్ముల్లో నీరు చేరి రొమ్ములు నొప్పిగా బరువుగా ఉండటం వంటి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. దీనినే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. దీనికి చికిత్సలో భాగంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, నడక వంటివి చేస్తూ, డాక్టర్ పర్యవేక్షణలో ప్రైమ్రోజ్ ఆయిల్, మినరల్స్, విటమిన్స్‌తో కూడిన మందులు, ఇంకా ఇతర అవసరమైన మందులు మూడు నెలల పాటు వాడి చూడవచ్చు. జీవనశైలిలో మార్పులు, ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవడం, వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే మీ వారికి ఈ సమస్య గురించి వివరించి చెబితే ఆయన మీ పరిస్థితిని అర్థం చేసుకుని, సర్దుకుపోవడం జరుగుతుంది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. మా అమ్మాయి వయసు 13 ఏళ్లు. ఆరు నెలల కిందటే రజస్వల అయింది. రెండు నెలలుగా తనకు విపరీతంగా తెల్లబట్ట అవుతోంది. దుర్వాసన వస్తోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – వందన, నరసన్నపేట సాధారణంగా అమ్మాయిలలో వాసన, దురద లేని తీగలలాగ, నీరులాగ కొద్దిగా వచ్చే తెల్లబట్ట సాధారణం. ఇది యోనిలోని గ్రంథుల నుంచి ఊరుతుంది. ఈ తెల్లబట్ట పీరియడ్ వచ్చే ముందు పీరియడ్ మధ్యలో ఎక్కువగా ఉండటం సహజం. కొందరిలో కడుపులో నులిపురుగులు ఉన్నా, మలబద్ధకం వల్ల కూడా తెల్లబట్ట ఎక్కువగా కావచ్చు. శారీరక శుభ్రత, జననావయవాల వద్ద వ్యక్తిగత శుభ్రత సరిగా లేకపోయినా, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు ఉన్నా, వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ అమ్మాయికి పాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పులతో కూడిన మితమైన పోషకాహారం ఇవ్వండి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనక్కు శుభ్రపరచుకోవాలి. వెనుక నుంచి ముందు వైపుకి శుభ్రపరచుకోవడం ద్వారా మలద్వారం దగ్గర బ్యాక్టీరియా ముందువైపు పాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గైనకాలజిస్టును సంప్రదించి, ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకుని, దానిని బట్టి సరైన మందులు వాడుకోవడం మంచిది. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
కర్నూలు: మహిళ అండాశయంలో 10 కిలోల క్యాన్సర్ కణితి
కర్నూలు(హాస్పిటల్): ఓ మహిళ అండాశయంలో ఏర్పడిన 10 కిలోల క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా తొలగించారు. వివరాలను శుక్రవారం గైనకాలజి విభాగంలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సాయిప్రణీత్ తెలిపారు. ఎమ్మిగనూరుకు చెందిన మదనమ్మ(65) అనే మహిళ ఐదు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి తీవ్రం కావడంతో ఈ నెల 7వ తేదిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనకాలజి విభాగంలో చేరింది. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఆమె అండాశయంలో 10 కిలోల క్యాన్సర్ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 23వ తేదిన ఆమెకు వైద్యులు సర్జరీ చేసి కణితి తొలగించారు. శుక్రవారం ఆమె ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జ్ చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన వారిలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సి. సాయిప్రణీత్, గైనకాలజి ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్యరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. పద్మజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుముద, పీజీ వైద్యురాలు డాక్టర్ సోనాలి, అనెస్తెటిస్ట్ డాక్టర్ కొండారెడ్డి, డాక్టర్ వి. శ్రీలత, డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్‌గౌడ్, డాక్టర్ ఎం. స్నేహవల్లి ఉన్నారు. -
అధిక బరువుంటే పిల్లలు కలగడం కష్టవుతుందా?
నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 87 కిలోలు. నాకు త్వరలోనే పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు భావిస్తున్నారు. డైటింగ్ చేసినా ఫలితం కనిపించట్లేదు. అధిక బరువు కారణంగా పెళ్లి తర్వాత ఇబ్బందులు తప్పవని, పిల్లలు కలగడం కూడా కష్టమవుతుందని, త్వరగా బరువు తగ్గాలంటే సర్జరీ ఒక్కటే మార్గమని ఫ్రెండ్స్ చెబుతున్నారు. సర్జరీలో రిస్క్ ఏమైనా ఉంటుందా? – నీరజ, మిర్యాలగూడ 5.4 అడుగుల ఎత్తుకి గరిష్ఠంగా 60 కేజీల బరువు ఉండవచ్చు. మీరు 87 కేజీల బరువు ఉన్నారు. అంటే, 27 కేజీలు అధిక బరువు. 23 సంవత్సరాల వయసులోనే ఇంత అధిక బరువు వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, పీసీఓడీ సమస్య, థైరాయిడ్ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, ఆయాసం, చిన్న వయసులోనే బీపీ పెరగడం, సుగర్ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి అండం విడుదల సరిగా లేకపోవడం, దాని వల్ల పెళ్లయిన తర్వాత కలయికలో ఇబ్బంది, గర్భం నిలబడటానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. కొన్నిసార్లు గర్భం వచ్చినా అబార్షన్లు అయ్యే అవకాశాలు, గర్భంతో ఉన్నప్పుడు బీపీ పెరగడం, సుగర్ పెరగడం, కాన్పులో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి డైటింగ్ ఒక్కటే సరిపోదు. ఆహార నియమాలతో పాటు వాకింగ్, యోగా, జిమ్, ఏరోబిక్స్, డాన్స్, జుంబా వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. అలాంటప్పుడే మెల్లగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. అయినా తగ్గనప్పుడు మాత్రమే బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లవలసి ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీలో ఆహారం ఎక్కువగా తినకుండా ఉండటానికి, కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లు ఉండటానికి, తిన్న ఆహారంలో కొలెస్ట్రాల్ రక్తంలో కలవకుండా మలంలో వెళ్లిపోవడానికి దోహదపడేట్లు చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ వల్ల బరువు బాగానే తగ్గుతారు కానీ, పోషక పదార్థ లోపాలు ఉంటాయి. దీనికోసం ఆపరేషన్ తర్వాత విటమిన్ మాత్రలు వాడవలసి ఉంటుంది. ఎటువంటి సర్జరీ అయినా వందలో ఒకరికి, మత్తు ఇవ్వడంలో ఇంకా సర్జరీలో, సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్ ఉండవచ్చు. కాబట్టి మీరు మొదట డైటీషియన్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు ఆహార నియమాలను పాటించడం, అలాగే వ్యాయామాలు క్రమంగా చేయడం వల్ల మెల్లగా కొన్ని నెలలలో కొద్దిగా బరువు తగ్గే అవకాశాలు బాగానే ఉంటాయి. -
Gynecology:పీరియడ్స్ సరిగా రావడం లేదు.. రిష్కారం చెప్పగలరు..
నా వయసు 19 ఏళ్లు. నేను స్టూడెంట్‌ని. ఎత్తు 5.2, బరువు 40 కిలోలు. నాకు పీరియడ్స్ సరిగా రావడం లేదు. గత జూన్‌లో పీరియడ్స్ వచ్చాక, మళ్లీ ఇంతవరకు రాలేదు. పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ చాలా కొద్దిగా మాత్రమే ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. –వందన, మేడ్చల్ మీ ఎత్తు 5.2 అడుగులకు కనీసం 50 కేజీల బరువు ఉండాలి. మీరు కేవలం 40 కిలోల బరువే ఉన్నారు. తక్కువ బరువు ఉన్నారు కాబట్టి, మీలో పోషకాహార లోపం ఉండే అవకాశాలు ఎక్కువ. అలాగే రక్తహీనత, థైరాయిడ్ వంటి హార్మోన్ల అసమతుల్యత వంటి ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఉండవచ్చు. కొందరిలో సన్నగా ఉన్నా, జన్యుపరమైన కారణాల వల్ల, పీసీఓడీ సమస్య కూడా కొద్దిగా ఉండవచ్చు. దీనివల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సీబీపీ, థైరాయిడ్ ప్రొఫైల్ వంటి రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ పెల్విస్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. అలానే ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, డ్రైఫ్రూట్స్‌తో కూడిన పోషకాహారం తీసుకోవడం మంచిది. నాకు పెళ్లయి ఎనిమిది నెలలైంది. పెళ్లికి ముందు నాకు ఎలాంటి సమస్యలూ లేవు గాని, పెళ్లి తర్వాత నుంచి తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. మందులు వాడితే తగ్గినా, కొద్దిరోజుల్లోనే సమస్య మళ్లీ మొదలవుతోంది. నా సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా? – రాగిణి, మెంటాడ ఫంగల్ ఇన్ఫెక్షన్ కాండిడా వంటి ఫంగస్ రోగక్రిముల వల్ల వస్తుంది. ఇది సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా, రక్తహీనత వల్ల, సుగర్ వ్యాధి ఉన్నా తరచుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భర్త నుంచి భార్యకు, భార్య నుంచి భర్తకు కలయిక ద్వారా సంక్రమించవచ్చు. అలాంటప్పుడు మందులు ఒక్కరే కాకుండా, దంపతులు ఇద్దరూ సరైన కోర్సు యాంటీఫంగల్ మందులు ఒకేసారి వాడుతూ, ఆ సమయంలో దూరంగా ఉండటం మంచిది. చికిత్సలో భాగంగా నోటి ద్వారా మాత్రలతో పాటు దురద, తెల్లబట్ట వంటి లక్షణాలను బట్టి యాంటీ ఫంగల్ క్రీములు, పౌడర్, సోపు, యోనిలో పెట్టుకునే సపోసిటరీస్ ఇవ్వడం జరుగుతుంది. లక్షణాల తీవ్రతను బట్టి మందులు ఎంతకాలం వాడాలనేది డాక్టర్ సూచించడం జరుగుతుంది. సీబీపీ, ఆర్బీఎస్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, రక్తహీనత ఉంటే దానికి తగ్గ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, ఐరన్ మాత్రలు వాడుకోవాలి. అలాగే సుగర్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉంటే, దానిని అదుపులో ఉంచుకోవాలి. శారీరక, వ్యక్తిగత శుభ్రత పాటించడం ముఖ్యం. మీ వారికి సుగర్ ఉన్నా, లక్షణాలు ఏవీ లేకపోయినా కూడా తన నుంచి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీవారికి కూడా రక్తపరీక్షలు చేయించడం మంచిది. డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
మా ఆయనకు స్పెర్మ్‌కౌంట్ నిల్.. డోనర్ స్పెర్మ్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
►నా వయసు 26 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. ఇంతవరకు పిల్లల్లేరు. ఇటీవల పరీక్షలు చేయించుకుంటే, నాకు అంతా నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. మా ఆయనకు స్పెర్మ్‌కౌంట్ నిల్ అని వచ్చింది. డోనర్ స్పెర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందవచ్చని డాక్టర్ చెప్పారు. దీనివల్ల సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? – వందన, చోడవరం స్పెర్మ్‌కౌంట్ నిల్ అంటే వీర్యంలో వీర్యకణాలు అసలు లేవు అని అర్థం. దీనినే అజోస్పెర్మియా అంటారు. ఆయనకు అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డాక్టర్ కౌంట్ నిల్ అని నిర్థారించారని అనుకుంటున్నాను. కొందరిలో వృషణాలలో తయారయ్యే వీర్యకణాలు,అక్కడి నుంచి యురెత్రా ద్వారా బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా అడ్డంకులు ఉండటం వల్ల వీర్యంలో వీర్యకణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వృషణాల నుంచే వీర్యకణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వృషణాల నుంచే టీసా, మీసా వంటి పద్ధతి ద్వారా టెస్టిక్యులార్ బయాప్సీ చేసి అసలు వీర్యకణాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా అనేది నిర్ధారిస్తారు. ఒకవేళ కొన్ని అయినా వీర్యకణాలు ఉంటే, వాటిని ఐసీఎస్ఐ, ఐవీఎఫ్ టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. కానీ ఇది ఖర్చుతో కూడిన చికిత్స. అన్ని విధాల స్పెర్మ్‌కౌంట్ నిల్ ఉన్నప్పుడు, డోనర్ స్పెర్మ్ ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. ఇందులో స్పెర్మ్ బ్యాంక్ నుంచి డోనర్ నుంచి సేకరించిన వీర్యకణాలను శుభ్రపరచి, వేరుచేసి, భద్రపరచిన వాటిని తెప్పించుకుని, ఆడవారిలో అండం విడుదలయ్యే సమయంలో యోని భాగంలో నుంచి గర్భాశయంలోకి ఈ డోనర్ వీర్యకణాలను చిన్న ప్లాస్టిక్ కెన్యూలాలో ఐయూఐ పద్ధతి ద్వారా ప్రవేశింపబడుతాయి. అలా ప్రవేశించిన వీర్యకణాల ఫెలోషియన్ ట్యూబ్‌లోకి ఈదుకుంటూ వెళ్లి అక్కడ అండాశయం నుంచి విడుదలైన అండంలోకి చొచ్చుకుపోయి దానిని ఫలదీకరణ చెయ్యడం వల్ల పిండం ఏర్పడుతుంది. ఆ పిండం ట్యూబ్‌లో నుంచి గర్భాశయంలోకి చేరి అక్కడ అడ్డుకుని నిలబడటం ద్వారా గర్భం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు జరిగితే గర్భం రాదు. డోనర్ స్పెర్మ్‌ని తీసుకునేటప్పుడు, స్పెర్మ్ బ్యాంకులో డోనర్‌కు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని హెచ్ఐవీ, వీడీఎఫ్సీ, హెచ్‌సీవీ వంటి అనేక పరీక్షలు చేయడం జరుగుతుంది. కాబట్టి డోనర్ ఐయూఐ పద్ధతి ద్వారా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ►గత ఏడాది చివర్లో నాకు లెప్ట్ సైడ్ ట్యూబ్ ప్రెగ్నెన్సీ లాపరోటమీ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ జరిగిన మూడు నెలల తర్వాత ఎడమవైపు– అంటే ఎడమ కంటి నుంచి ఎడమ కాలి వరకు విపరీతంగా నొప్పి, మంట సెగలుగా వస్తే గైనకాలజిస్టుకి చూపించుకున్నాను. అన్ని పరీక్షలూ చేసి, ఇది గైనిక్ సమస్య కాదన్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా, తర్వాత పీరియడ్స్‌లో సమస్యలు మొదలయ్యాయి. పదిరోజులు వరుసగా బ్లీడింగ్, మళ్లీ పదిహేను రోజులకు పీరియడ్స్ రావడం జరుగుతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – రమణి, చిత్తూరు మీ లాపరోటమీ ఆపరేషన్‌కు మీ లక్షణాలకు ఏ సంబంధం లేదు. పదిరోజులు వరుసగా బ్లీడింగ్ అవ్వటానికీ అండాశయంలో నీటి కంతులు, నీటి బుడగలు, ఇన్ఫెక్షన్, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, థైరాయిడ్ వంటి హోర్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు కావచ్చు. పదిరోజుల బ్లీడింగ్ తర్వాత పదిహేను రోజులకు పీరియడ్స్ రావటం అంటే 25 రోజులకొకసారి పీరియడ్స్ వస్తున్నాయి అన్నమాట. మీ ఎత్తు, బరువు రాయలేదు. కొన్నిసార్లు ఆపరేషన్ తర్వాత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి కారణాల వల్ల బరువు పెరగవచ్చు. బరువు పెరగటం వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్‌లో సమస్యలు రావచ్చు. కాబట్టి బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి, యోగా, వాకింగ్, వ్యాయామాలు చేయడం, ఆహార నియమాలను పాటించడం మంచిది. అలాగే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, సలహా మేరకు థైరాయిడ్ వంటి రక్తపరీక్షలు, పెల్విక్ అల్ట్రాసౌండ్ చెయ్యించుకుని గర్భాశయంలో అండాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని.. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. ►నా వయసు 23ఏళ్లు. ఎత్తు 5.3 అడుగులు, బరువు 76 కిలోలు. నాకు థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు ఉన్నాయి. విపరీతంగా జుట్టు ఊడిపోతోంది. డాక్టర్ సలహా మేరకు థైరాయిడ్ మందులు వాడుతున్నాను. థైరాయిడ్ మందులతో పాటు హెయిర్‌ఫాల్ తగ్గడానికి మందులు వాడొచ్చా? హోమియో మందులు వాడొచ్చా? – అనుపమ, బలిజిపల్లి థైరాయిడ్ సమస్య వల్ల, పీసీఓడీ సమస్య వల్ల, ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల, రక్తహీనత వల్ల, పోషకాహార లోపాలు, మానసిక ఒత్తిడి, జన్యుసమస్యలు వంటి అనేక కారణాల వల్ల విపరీతంగా జుట్టు ఊడిపోవచ్చు. థైరాయిడ్ మాత్రలు వాడుతున్నారు కాబట్టి, దానివల్ల సమస్య లేదు. మీకు పీసీఓడీ ఉండటం వల్ల మగవారిలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ పీసీఓడీ ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక హార్మోన్ ప్రభావం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, మొటిమలు రావడం, అవాంఛిత రోమాలు ఉండటం జరుగుతుంది. మీ ఎత్తు 5.3 అడుగులకు గరిష్ఠంగా 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కానీ మీరు 76 కిలోల బరువు ఉన్నారు. పీసీఓడీ వల్ల జుట్టు ఊడుతుంటే, వాకింగ్, వ్యాయామాలతో పాటు మితమైన పోషకాహారం తీసుకుంటూ, జంక్‌ఫుడ్ తీసుకోకుండా, సరైన ఆహార నియమాలు పాటిస్తూ, బరువు తగ్గడం వల్ల పీసీఓడీ వల్ల జరిగే హార్మోన్ల అసమతుల్యత సరిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్య కూడా అదుపులో ఉంటుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. బరువు తగ్గడంతో పాటు గైనకాలజిస్టు, డెర్మటాలజిస్టుల పర్యవేక్షణలో మందులు వాడుకుంటూ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, అవసరమైతే బయోటిన్‌తో కూడిన మల్టీవిటమిన్ మాత్రలు వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మొదట బరువు తగ్గే ప్రయత్నం చేస్తూ, పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ , హోమియో మందులు వాడుకోవచ్చు. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్. చదవండి: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి.. -
ఒక ఓవరీ తీసేశారు.. నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా?
నా వయసు 36 ఏళ్లు. కొన్నాళ్లుగా కడుపు ఉబ్బరం, విపరీతమైన నడుము నొప్పితో పాటు బరువు కూడా తగ్గిపోయాను. డాక్టర్ సలహాపై పరీక్షలు జరిపించుకుంటే, ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఇది పూర్తిగా నయమవుతుందా? – వరలక్ష్మి, కర్నూలు Gynecologist Answers: అండాశయంలో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు కనిపించేటప్పటికే చాలామందిలో అది 2, 3, 4 దశలకు చేరి ఉంటుంది. మొదటి దశలో ఒవేరియన్ క్యాన్సర్‌లో పెద్దగా లక్షణాలేవీ కనిపించవు. మీ క్యాన్సర్ ఏ స్టేజిలో ఉందనే దాన్నిబట్టి పూర్తిగా నయమవుతుందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, క్యాన్సర్ ఇతర అవయవాలకు కూడా సోకినట్లు అనిపిస్తోంది. 36 సంవత్సరాలకే ఒవేరియన్ క్యాన్సర్ రావడం దురదృష్టకరం. క్యాన్సర్ స్టేజిని బట్టి మొదట ఆపరేషన్ చేసి, క్యాన్సర్ గడ్డను తొలగించి, తర్వాత కీమో థెరపీ ఇవ్వాలా లేక మొదట కీమో థెరపీ ఇచ్చి, తర్వాత ఆపరేషన్ చేయాలా అనేది క్యాన్సర్ డాక్టర్ (ఆంకాలజిస్ట్) నిర్ణయిస్తారు. చికిత్స తర్వాత స్టేజిని బట్టి కొందరు కొన్ని సంవత్సరాల వరకు బాగానే ఉంటారు. కొందరిలో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత డాక్టర్ పర్యవేక్షణలో క్రమంగా స్కానింగ్, రక్తపరీక్షలు వంటివి చేయించుకుంటూ, సమస్యను బట్టి చికిత్సలు తీసుకుంటూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఆనందంగా ఉండవలసి ఉంటుంది. ►నా వయసు 49 ఏళ్లు. ఎత్తు 5.1 అడుగులు, బరువు 72 కిలోలు. ఇటీవల నాకు నెలసరి క్రమం తప్పి వస్తోంది. వచ్చినప్పుడల్లా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటోంది. ఒంట్లోంచి వేడి ఆవిర్లు వచ్చినట్లుగా అవుతోంది. రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – సుమతి, కోదాడ ఆడవారిలో చాలావరకు 45 సంవత్సరాల నుంచి అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ మెల్లగా తగ్గిపోవడం మొదలవుతుంది. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకుండా, కొన్ని నెలలూ రాకుండా ఉండి అయినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవడం, కొందరిలో నెలకు రెండుసార్లు అవడం, లేకపోతే బ్లీడింగ్ కొద్దిగానే అవడం వంటి సమస్యలు ఏర్పడి, తర్వాత కొంతకాలానికి పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశకు చేరుకుంటారు. ఈ సమయంలో ఈస్ట్రోజన్ లోపం వల్ల ఒళ్లు వేడిగా జ్వరం వచ్చినట్లుగా ఉండి, వేడి ఆవిర్లులాగ వచ్చి అంతలోనే చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. వీటినే ‘హాట్ ఫ్లషెస్’ అంటారు. వీటి వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం, పగలంతా నీరసంగా అనిపించడం, డిప్రెషన్ వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. మీ బ్లీడింగ్ సమస్య చాలావరకు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఉండవచ్చు. అలాగని ఊరికే ఉండకూడదు. ఈ వయసులోనే గర్భాశయంలో, అండాశయంలో గడ్డలు, కంతులు, క్యాన్సర్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి అల్ట్రాసౌండ్ పెల్విస్ స్కానింగ్, ప్యాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకుని, ఏమైనా సమస్య ఉంటే దాన్నిబట్టి చికిత్స తీసుకోవచ్చు. సమస్య ఏమీ లేకపోతే బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు అది తగ్గడానికి మందులు వాడుకుంటూ కొంతకాలం ఓపిక పట్టవలసి ఉంటుంది. రక్తహీనత ఉంటే ఐరన్, విటమిన్ మాత్రలు వాడుకోవడం మంచిది. మీ ఎత్తు 5.1కి గరిష్ఠంగా 53–60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కాని, మీరు 72 కిలోలు ఉన్నారు. బరువు ఎక్కువ ఉండటం వల్ల కూడా హార్మోన్ సమస్యలు ఏర్పడి పీరియడ్స్‌లో బ్లీడింగ్ సమస్యలు ఏర్పడవచ్చు. నడక, యోగా, ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు వేడి ఆవిర్ల సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు ఈస్ట్రోజన్ హార్మోన్లా పనిచేసే ఐసోఫ్లోవోన్ పదార్థాలు ఎక్కువగా ఉండే సోయాబీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతవరకు వేడి ఆవిర్ల సమస్య తగ్గుతుంది. ఎక్కువ సమయం గాలి ఆడే ప్రదేశాలలో, ఫ్యాన్ కింద ఉండటం వల్ల కూడా వేడి ఆవిర్ల నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ►నాకు రెండేళ్ల కిందట పెళ్లయింది. ప్రస్తుతం నా వయసు 31ఏళ్లు. ఓవేరియన్ సిస్ట్ ఏర్పడటంతో పెళ్ళికి కొద్ది నెలల ముందు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఒక ఓవరీని తీసేశారు. ఇప్పటివరకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయా? – సత్యవతి, భీమవరం సాధారణంగా గర్భాశయం రెండు పక్కలా ఉండే ఒక్కొక్క అండాశయం నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లతో పాటు అండం విడుదలవుతూ ఉంటుంది. ఒకనెల ఒకవైపు అండాశయం నుంచి మరోనెల మరోవైపు అండాశయం నుంచి ప్రతినెలా అండం విడుదలవుతూ ఉంటుంది. మీకు ఒక అండాశయం తీసివేసినా, వేరే హార్మోన్ల సమస్యలేవీ లేకపోతే, ఉన్న ఇంకొక అండాశయం నుంచి ప్రతినెలా అండం విడుదలై, గర్భం వచ్చే అవకాశాలు బాగానే ఉంటాయి. ప్రెగ్నెన్సీ రావడానికి సరిగా అండం విడుదల కావడం, ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోకుండా తెరుచుకుని ఉండటం, భర్తలో వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత సరిగా ఉండటం అవసరం. మీకు పెళ్లయి రెండు సంవత్సరాలు అయినా గర్భం రావట్లేదు, వయసు కూడా 31. కాబట్టి, మీకు నెలసరి సరిగా వస్తుంటే, పీరియడ్ మొదలైన మొదటి రోజు నుంచి లెక్కబెట్టి 11వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదల ఏ రోజుల్లో అవుతుంది, అసలు అండం పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీ స్కానింగ్ చేయించుకోవాలి. అలాగే గర్భాశయం లోపలి ఎండోమెట్రియాసిస్ పొర సరిగా పెరుగుతుందా లేదా అని స్కానింగ్‌లో తెలుసుకోవాలి. అండాశయం ఉన్నవైపు ఉన్న ఫెలోపియన్ ట్యూబ్ తెరుచుకుని ఉందా లేదా తెలుసుకోవడానికి హెచ్ఎస్జీ అనే ఎక్స్‌రే తీసుకోవాలి. రక్తంలో హార్మోన్ సమస్యలు, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్బీఎస్, ఎస్ఆర్.టీఎస్‌హెచ్, ఎస్ఆర్.ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే మీ భర్తకు వీర్యకణాల పరీక్ష చేయించి, ఆయనకు వీర్యకణాలు సరిగా ఉన్నాయా, లేదా నిర్ధారణ చేసుకోవాలి. ఈ పరీక్షలలో సమస్య ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి. సమస్యను బట్టి చికిత్స తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి అధైర్యపడకుండా, గైనకాలజిస్టును సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్. చదవండి: Beauty Tips In Telugu: నల్లని కురులకు.. బ్లాక్ జీరా ప్యాక్! -
పెళ్లయిన ఎన్నాళ్లకు గర్భం రావడం సాధారణం?
నా వయసు 30 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. గత నాలుగు నెలలుగా నాకు పీరియడ్స్‌లో బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతోంది. పొత్తికడుపులో నొప్పిగా ఉంటోంది. ఆ సమయంలో చాలా చిరాకుగా ఉంటోంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. – ప్రమీల, మచిలీపట్నం పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పితో పాటు బ్లీడింగ్ ఎక్కువగా అవడానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఫైబ్రాయిడ్ గడ్డలు, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, అండాశయంలో కంతులు, ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి గైనకాలజిస్టును సంప్రదించి, అల్ట్రాసౌండ్ పెల్విక్ స్కానింగ్ సహా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. కారణాలను బట్టి మందులతో చికిత్స సరిపోతుందా లేదా ఆపరేషన్ ద్వారా చికిత్స చేయాలా అనే విషయాలను డాక్టర్ మీతో చర్చించడం జరుగుతుంది. ఈ లోపల మూడు నాలుగు రోజులు అధిక బ్లీడింగ్, నొప్పి నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి ట్రైనక్సమిక్ యాసిడ్, మెఫినమిక్ యాసిడ్ కాంబినేషన్లో ఉన్న మాత్రలు రోజుకు రెండు లేదా మూడు చొప్పున రెండు మూడు రోజులు వేసుకోవచ్చు. అలాగే యోగా, మెడిటేషన్, వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం వల్ల కూడా ఈ లక్షణాల తీవ్రత నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. నా వయసు 52 ఏళ్లు. ఎడమ రొమ్ములో నొప్పిగా అనిపించడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. డాక్టర్ సలహాపై మామోగ్రాఫ్ పరీక్ష చేయించుకుంటే, బ్రెస్ట్ కేన్సర్ ఉందని, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు. కేన్సర్ అంటే భయంగా ఉంది. ఆపరేషన్ వల్ల ప్రాణాపాయం తొలగిపోతుందా? – సువర్చల, ఆదోని ఇప్పటి ఆధునిక కాలంలో క్యాన్సర్‌ను జయించడానికి అనేక రకాల అధునాతన యంత్రాంగం, మందులు, స్పెషలిస్టుల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈమధ్య కాలంలో అనేక కారణాల వల్ల, ముఖ్యంగా మారుతున్న జీవనశైలి కారణంగా క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది కాబట్టి, మొదట ఆపరేషన్ ద్వారా ఆ క్యాన్సర్ గడ్డను తొలగించి, దానిని బయాప్సీ పరీక్షకు పంపితే అది ఎలాంటి క్యాన్సర్, ఏ స్టేజిలో ఉంది, ఎంత పరిమాణం చుట్టూ వ్యాప్తిచెంది ఉంది, తర్వాతి కాలంలో తిరగబెట్టకుండా ఉండటానికి కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలేవైనా తీసుకోవాలా అనే అంశాలు తెలుస్తాయి. బయాప్సీ రిపోర్టు బట్టి అది మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఎంత శాతం మేరకు ఉన్నాయో కూడా తెలుస్తాయి. దానిబట్టి ఆపరేషన్ తర్వాత డాక్టర్ దగ్గరకు మళ్లీ చెకప్‌లకు ఎంతకాలానికి ఒకసారి వెళ్లాలి, మళ్లీ మామోగ్రఫీ వంటి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి వంటి విషయాలను క్యాన్సర్ స్పెషలిస్ట్ వివరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అధైర్యపడకుండా ఆపరేషన్ చేయించుకోండి. తర్వాత డాక్టర్ చెప్పిన ప్రకారం క్రమంగా చెకప్‌లకు వెళుతూ, సరైన పరీక్షలు చేయించుకుంటూ వారి పర్యవేక్షణలో ఉంటే ఎక్కువకాలం ప్రాణాపాయం లేకుండా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ క్యాన్సర్ ప్రారంభ దశలోనే ఉండి, చుట్టుపక్కల విస్తరించకుండా ఉండి, తక్కువ తీవ్రత ఉన్న రకం అయితే ఆపరేషన్ తర్వాత ఏ సమస్యా ఉండదు. మీరు భయపడుతూ ఆపరేషన్ చేయించుకోకుండా ఆలస్యం చేస్తూ ఉంటే క్యాన్సర్ మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాంతో సమస్యలు ఇంకా పెరిగి, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి గాని, భయపడుతూ ఉంటే అది ఇంకా పెద్దదవుతుంది. ఇప్పటికాలంలో ప్రాణాపాయం ఎవరికైనా ఏదో ఒక సమస్య తెలిసీ తెలియక ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి భయపడకుండా ఆపరేషన్ చేయించుకోండి. ఉన్నంతకాలం సంతోషంగా జీవితం గడపండి. నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.2, అడుగులు, బరువు 46 కిలోలు. ఏడాది కిందట పెళ్లయింది. ఇంతవరకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఏడాదైనా నెలతప్పకపోవడంపై మా అత్తవారింట్లో విపరీతంగా ఒత్తిడి తెస్తున్నారు. పెళ్లయిన ఎన్నాళ్లకు గర్భం రావడం సాధారణం? – వందన, జగిత్యాల ఎత్తు 5.2 అడుగులకు కనీసం 49 కిలోల బరువు ఉండాలి. నువ్వు కేవలం 46 కిలోలే ఉన్నావు. ఉండాల్సిన దానికన్నా బరువు తక్కువ ఉన్నవారిలో రక్తహీనత, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి గర్భం రావడానికి ఆలస్యం కావచ్చు. నీకు పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా అనేది రాయలేదు. సాధారణంగా భార్యాభార్తల్లో ఏ సమస్యా లేకుండా ఉంటే 80 శాతం మంది ఒక ఏడాదిలోనే గర్భం ధరించడం జరుగుతుంది. మిగిలిన 20 శాతం మందిలో 10–15 శాతం మందికి రెండేళ్లు పడుతుంది. దాదాపు 5–10 శాతం మందికి కొన్ని సమస్యలు ఉండి, గర్భధారణ కోసం చికిత్స అవసరం పడుతుంది. నీ వయసు 23 సంవత్సరాలే కాబట్టి, ఒత్తిడికి గురికాకుండా, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, గర్భంకోసం ప్రయత్నిస్తూ, ఇంకో సంవత్సరం ఆగి చూడవచ్చు. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే, ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, భార్యాభర్తలిద్దరిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి భర్తకు వీర్యపరీక్ష, నీకు అండం విడుదల సక్రమంగా అవుతుందా లేదా, అవుతుంటే ఏ రోజుల్లో అవుతోందో తెలుసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీ స్కానింగ్ చేయించుకోవాలి. ఇందులో గర్భాశయంలో, అండాశయంలో సమస్యలు ఉంటే తెలుసుకోవచ్చు. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి అవసరమైన సీబీపీ, ఎస్ఆర్. టీఎస్‌హెచ్ వంటి రక్తపరీక్షలు చేయించుకుని, సమస్య ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు. పరీక్షలలో సమస్యలేవీ లేకపోతే ఇంకో సంవత్సరం పాటు అండం విడుదలయ్యే రోజుల్లో తప్పకుండా కలయికలో పాల్గొంటూ గర్భం కోసం వేచి చూడవచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు అన్న తర్వాత వాళ్ల ఆతృత కొద్ది ఏదో ఒకటి అంటుంటారు. అవన్నీ పట్టించుకుని మనసు పాడు చేసుకోకుండా, భర్తతో ఆనందంగా ఉంటే, సమస్య ఏదీ లేకపోతే గర్భం అదే వస్తుంది. మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురైతే, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, గర్భం రావడం ఇంకా ఆలస్యమవుతుంది. డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఇప్పటికి రెండుసార్లు గర్భం పోయింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నా వయసు 27 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లయింది. ఇప్పటికి రెండుసార్లు గర్భం పోయింది. ఇప్పుడు నాకు మూడో నెల. ఇటీవలే ‘కోవిడ్’ వచ్చింది. దానికి చికిత్స తీసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో గర్భం నిలుస్తుందా లేదా అని భయంగా ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పద్మజ, పొందూరు మీరు మొదట భయపడటం మానేసి, ఏమైతే అది కానీ అని ధైర్యంగా ఉండటం మంచిది. భయపడటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, హార్మోన్లలో మార్పులు తలెత్తి, దానివల్ల కూడా అబార్షన్లు అయ్యే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల అందరికీ అబార్షన్లు అవ్వాలని ఏమీ లేదు. గర్భంలోని పిండం నాణ్యత కలిగినదైతే అది ఎలాగైనా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ గర్భిణులలో తల్లి నుంచి బిడ్డకు వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ అని నిర్ధారణ అయింది. కాబట్టి కరోనా వైరస్ ప్రభావం బిడ్డపై నేరుగా అంత ఏమీ ఉండదు. తల్లి రోగనిరోధక శక్తి బాగా ఉంటే, డాక్టర్ సంరక్షణలో వారి సలహా మేరకు సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే తల్లి కూడా దీనిపై పోరాడి బయటకు రాగలుగుతుంది. చదవండి: కోవిడ్ వచ్చి తగ్గింది.. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా? ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో కోవిడ్ వల్ల అధికజ్వరం కారణంగా కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా పారాసెటమాల్ మాత్రలు వేసుకోవడం, తడి బట్టతో శరీరాన్ని చల్లగా ఉంచేలా తుడుచుకోవడం చేయాలి. జలుబు, దగ్గు ఉంటే దానికి మందులు వాడుకుంటూ, ఆయాసం లేకుండా ఊపిరి సరిగా ఆడేలా చూసుకోవాలి. గోరువెచ్చని ఉప్పునీటితో నోరు పుక్కిలించడం, ఆవిరి పట్టుకోవడం వంటివి చేసుకోవచ్చు. డాక్టర్ సలహా మేరకు కోవిడ్ వల్ల రక్తంలో జరిగే మార్పులను తెలుసుకోవడానికి సీబీపీ, సీఆర్పీ, డీ–డైమర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ, ఆయాసం ఎక్కువై, ఆక్సిజన్ తగ్గిపోయి మరీ తప్పదు అనుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఆక్సిజన్, మిగిలిన అవసరమైన మందులతో చికిత్స తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకుంటూ జాగ్రత్తగా ఉండవచ్చు. కోవిడ్ చికిత్సతో పాటు ప్రెగ్నెన్సీకి వాడే విటమిన్స్ వంటి మందులు కూడా తీసుకోవాలి. అలాగే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు, మాంసాహారులైతే గుడ్లు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకుంటూ, మంచినీళ్లు బాగా తాగుతూ, విశ్రాంతి తీసుకోవాలి. పదిహేను– ఇరవై రోజుల తర్వాత గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లి, బిడ్డ ఎలా ఉందో చెకప్ చేయించుకోవాలి. కరోనా లక్షణాలు మీకు తీవ్రంగా ఉండి, చాలా సమస్యలకు గురైతే తప్ప మామూలుగా కొంచెం లక్షణాలకు గర్భంలోని బిడ్డకు ఏమీ కాదు. కాబట్టి కంగారు పడకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నా వయసు 30 ఏళ్లు. నాలుగేళ్ల కిందట థైరాయిడ్ సమస్య వచ్చింది. దీనివల్ల 85 కిలోలకు బరువు పెరిగాను. ఇప్పుడు మా ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఈ సమస్య పెళ్లి తర్వాత సమస్యలేవైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? దయచేసి వివరించగలరు. – రాధిక, గుంతకల్ థైరాయిడ్ సమస్య ఉన్నా, దానికి తగిన మోతాదులో మందులు వాడుకుంటూ, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకుంటే, అందరూ బరువు పెరగాలనేమీ లేదు. థైరాయిడ్ అదుపులో లేకపోతేనే బరువు పెరుగుతారు. మీకు పెళ్లి తర్వాత థైరాయిడ్ లెవెల్స్ అదుపులో ఉంటే, థైరాయిడ్ వల్ల సమస్య ఉండదు. కాకపోతే మీ బరువు 85 కిలోలు. అంటే అధిక బరువు. దీనివల్ల హార్మోన్ అసమతుల్యతలు ఏర్పడి, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల సాధారణంగా గర్భం నిలవడానికి ఇబ్బంది, ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. చదవండి: నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి? అలాగే అధిక బరువు వల్ల గర్భం దాల్చిన తర్వాత బీపీ, సుగర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి ఎండోక్రైనాలజిస్టును సంప్రదించి, థైరాయిడ్ లెవెల్స్ అదుపులో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేయించుకుని, అదుపులో ఉంటే అదే మోతాదులో థైరాయిడ్ మందులు వాడుతూ, బరువు తగ్గడానికి ఆహార నియమాలను పాటిస్తూ, నడక, యోగా వంటి వ్యాయామాలను ఇప్పటి నుంచే చేస్తూ ఉన్నట్లయితే, పెళ్లి తర్వాత పెద్దగా సమస్యలు లేకుండా ఉంటాయి. ఒకవేళ థైరాయిడ్ అదుపులో లేకపోతే, ఎండోక్రైనాలజిస్టు సూచన మేరకు థైరాయిడ్ మాత్రల మోతాదును పెంచి వాడవలసి ఉంటుంది. చదవండి: అది ఫాలో అవ్వొచ్చా? అలాగే బరువు తగ్గవలసి ఉంటుంది. థైరాయిడ్ లెవెల్స్ అదుపులో లేకపోతే, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా పెరగకపోవడం, గర్భం వచ్చినా నిలవకుండా, అబార్షన్లు అయ్యే అవకాశాలు కొంతమేరకు ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే థైరాయిడ్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకుంటూ, బరువు తగ్గడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి, పెళ్లికి ముందే బరువు తగ్గడం మంచిది. డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి?
నా వయసు 25 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 6వ నెల. స్కానింగ్ రిపోర్ట్‌లో మాయ కిందకు ఉందని, సర్విక్స్ ఇంటర్నల్ ఆస్ 2.7 సెం.మీ దూరంలో ఉందని, అలాగే, ఉమ్మనీరు కొద్దిగా ఎక్కువగా ఉందని, బిడ్డ అవయవాలు సరిగానే ఉన్నాయని చెప్పారు. ఇలాంటప్పుడు నేను పూర్తిగా బెడ్‌రెస్ట్‌లోనే ఉండాలా? ఇంట్లో నుంచే ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చా? దయచేసి సలహా ఇవ్వండి? – సౌజన్య, తాడికొండ గర్భాశయంలో గర్భం మొదలయ్యేటప్పుడు పిండం అందులో గర్భాశయం పొరను అతుక్కుని, దాని నుంచి రక్తసరఫరా దక్కించుకునే ప్రయత్నంలో జెస్టేషనల్ స్యాక్, అందులో ఉమ్మనీరు, మాయ ఏర్పడుతుంది. మొదటి మూడు నెలల్లో మాయ మొత్తం పిండాన్ని కప్పి ఉంచి, తర్వాత కుదించుకుని ఒక ముద్దలాగా ఏర్పడుతుంది. ఇలా జరిగే క్రమంలో మొదట గర్భాశయంలో కిందకు ఉండి, బిడ్డ పెరిగే కొద్ది మాయ మెల్లగా పైకి జరుగుతుంది. కొందరిలో పిండం గర్భాశయం కిందభాగం అంటే గర్భాశయ ముఖద్వారం అయిన సర్విక్స్‌కు పైన లేదా దానికి దగ్గరలో ఉండిపోతుంది. దీనినే ‘ప్లాసెంటా ప్రీవియా’ అంటారు. అది సర్విక్స్ గర్భాశయంలోకి మొదలయ్యే ప్రాంతం అయిన ఇంటర్నల్ ఆస్కు ఎంత దగ్గరలో ఉంది అనే కొలతను బట్టి కంప్లీట్ ప్లాసెంటా ప్రీవియా, మార్జినల్ ప్లాసెంటా ప్రీవియా, లో లైయింగ్ ప్లాసెంటా వంటివిగా స్కానింగ్ రిపోర్టులో పేర్కొనడం జరుగుతుంది. సాధారణంగా సెకండ్ ట్రెమిస్టర్‌లో చాలామందికి మాయ కిందనే ఉన్నా, థర్డ్ ట్రెమిస్టర్లోకి వచ్చేటప్పటికి అది పైకి జరిగిపోతుంది. కొందరిలో మాత్రం కాన్పు సమయం వరకు కిందకే ఉండిపోతుంది. అది కిందకు ఉన్నంత వరకు ఎక్కువ శారీర ఒత్తిడి వంటి వాటి వల్ల అప్పుడప్పుడు కొద్దికొద్దిగా బ్లీడింగ్ అవడం, కొందరిలో ఆగకుండా అయ్యి తల్లికి బిడ్డకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ రిపోర్టులో మాయ సర్విక్స్ ఇంటర్నల్ ఆస్ నుంచి 2.7 సెం.మీ. దూరంలో ఉంది. కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్మనీరు కొద్దిగా ఎక్కువగా ఉంది. మీ పరిస్థితికి మొత్తం బెడ్‌రెస్ట్ అవసరం లేదు. కొందరిలో సుగర్ లెవల్స్ పెరిగే ముందు ఉమ్మనీరు ఎక్కువగా ఉండవచ్చు. ఒకసారి జీటీటీ సుగర్ టెస్ట్ చేయించుకోండి. ఇంట్లో నుంచి ఆఫీసు పని చేసుకోవచ్చు. దానికేమీ ఇబ్బంది లేదు. మా అమ్మాయి వయసు 20 ఏళ్లు. ఎత్తు 5.1 అడుగులు, బరువు 65 కిలోలు. ఆరునెలలుగా నెలసరి రావడం లేదు. ఇదివరకు నెలసరి సక్రమంగానే వచ్చేది. డాక్టర్‌కు చూపిస్తే పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉందని చెప్పారు. మా అమ్మాయికి నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి? – సరిత, గజపతినగరం ఎత్తు 5.1 అడుగులు ఉన్నప్పుడు బరువు గరిష్టంగా 55 కిలోల వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే దానిని అధిక బరువు కింద పరిగణించాల్సి ఉంటుంది. మీ అమ్మాయి 65 కిలోల బరువు ఉంది. అంటే 10 కిలోల అధిక బరువు ఉంది. అమ్మాయిలకు బరువు పెరిగే కొద్ది మొదట కొవ్వు పొట్ట చుట్టూ చేరి, పొట్ట లావు పెరగడం జరుగుతుంది. తర్వాత పిరుదుల దగ్గర, తర్వాత చేతులు లావు కావడం జరుగుతుంది. అధిక బరువు వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం జరగవచ్చు. కొందరిలో అధిక బరువు వల్ల అండాశయంలో నీటిబుడగల సమస్య (పీసీఓడీ) వంటివి ఏర్పడటం వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కొందరిలో థైరాయిడ్ సమస్య వల్ల కూడా బరువు పెరగడం, దానివల్ల పీరియడ్స్ సరిగా రాకపోవచ్చు. కాబట్టి మీ అమ్మాయికి పీరియడ్స్ సక్రమంగా రావాలంటే బరువు తగ్గడం ఒక్కటే మార్గం. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే తర్వాతికాలంలో వివాహం అయిన తర్వాత పిల్లలు కనడానికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువ. బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా ఆహార నియమాలతో పాటు వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆహారంలో జంక్‌ఫుడ్, నూనె వస్తువులు, తీపి పదార్థాలు, బేకరీ ఐటమ్స్, కొవ్వు పదార్థాలు తీసుకోకుండా, ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటివి తీసుకోవడం మంచిది. వాకింగ్, యోగా, స్కిప్పింగ్, ఏరోబిక్స్, డ్యాన్స్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
కోవిడ్ వచ్చి తగ్గింది.. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా?
నా వయసు 32 ఏళ్లు. ప్రస్తుతం నేను నాలుగో నెల గర్భిణిని. ఇటీవల చేయించిన రక్తపరీక్షలో డయాబెటిస్ ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితిలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది? దయచేసి చెప్పగలరు. – శ్రీలక్ష్మి, గూడూరు గర్భిణిగా ఉన్నప్పుడు డయాబెటిస్ రావడాన్ని ‘జెస్టేషనల్ డయాబెటిస్ మెలైటస్’ (జీడీఎం) అంటారు. సాధారణంగా చాలావరకు ప్రెగ్నెన్సీ 5–6 నెలల తర్వాత జీడీఎం రావడం జరుగుతుంది. మీకు నాలుగు నెలలకే నిర్ధారణ అయింది. అంటే ఇది గర్భంలోనే వచ్చిందా, లేక గర్భం రాకముందు నుంచే ఉందా, అంతకుముందు ఎప్పుడూ సుగర్ పరీక్ష చేయించుకోకపోవడం వల్ల తెలియలేదా అనే అనుమానం కూడా వస్తుంది. ‘హెచ్‌బీఏ1సీ’ రక్తపరీక్ష చేయించడం వల్ల సుగర్ లెవల్స్ గత మూడు నెలలుగా ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. కాబట్టి ఒక అవగాహనకు రావచ్చు. మీ వయసు రాశారు కాని, ఎంత బరువు ఉన్నారు, మీ అమ్మకు గాని, నాన్నకు గాని సుగర్ ఉందా అనే విషయాలు తెలియవలసి ఉంది. ఏది ఏమైనా మీరు గైనకాలజిస్టుతో పాటు డయాబెటిక్ డాక్టర్ పర్యవేక్షణలో కాన్పు అయ్యే వరకు ఉండవలసి ఉంటుంది. వారి సలహా మేరకు ఆహార నియమాలతో పాటు రక్తంలో సుగర్ లెవల్స్ అంటే చక్కెర శాతం పూర్తిగా అదుపులో ఉండేటట్లు వారు ఇచ్చే సుగర్మాత్రలు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా వారు సూచించిన మోతాదులో క్రమం తప్పకుండా తీసుకుంటూ, క్రమంగా సుగర్ టెస్టులు చేయించుకుంటూ ఉండటం వల్ల చాలావరకు ఇబ్బందులు లేకుండా కాన్పు జరిగి తల్లీబిడ్డా క్షేమంగా ఉండే అవకాశాలు బాగా ఉంటాయి. ఆహారంలో పిండి పదార్థాలు– అంటే అన్నం, చపాతీలు, తీపి పదార్థాలు వీలైనంత తక్కువగా తీసుకుంటూ రాగిజావ, జొన్నరొట్టెలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పాలు, పెరుగు, చక్కెర శాతం తక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిది. ఒకవేళ అధికబరువు ఉంటే, బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. గైనకాలజిస్టు సలహా మేరకు వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల బరువు ఎక్కువగా పెరగకుండా శరీరం ఫిట్‌గా ఉండటంతో పాటు సుగర్ అదుపులో ఉంటుంది. మీకు నాలుగో నెలలోనే సుగర్ నిర్ధారణ అయింది కాబట్టి, బిడ్డలో అవయవ లోపాలు ఉన్నాయా, గుండె సమస్యలు ఏవైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి 18 వారాలకు ‘టిఫా’ స్కానింగ్, 22 వారాలకు ఫీటల్ 2డీ ఎకో స్కానింగ్ చేయించుకోండి. అలాగే మీ వయసు 32 సంవత్సరాలు కాబట్టి మూడో నెలలో డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకుని ఉండకపోతే బిడ్డలో డౌన్ సిండ్రోమ్ వంటి జన్యు సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకోవడానికి ‘క్వాడ్రుపుల్ టెస్ట్’ అనే రక్తపరీక్ష చేయించుకోవడం మంచిది. గర్భంలో డయాబెటిస్తో ఉన్నప్పుడు కొందరిలో బిడ్డ పెరుగుదల మరీ ఎక్కువగా ఉండటం, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, కొందరిలో బిడ్డ సరిగా పెరగకపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం, నెలలు నిండకుండా కాన్పు జరగడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొందరిలో ఏడో నెల లేదా ఎనిమిదో నెలలో బీపీ పెరగవచ్చు. బిడ్డ పెరుగుదల తెలుసుకోవడానికి ఎనిమిదో నెలలో ‘గ్రోత్ స్కానింగ్’, బిడ్డకు రక్తప్రసరణ ఎలా ఉందో తెలుసుకోవడానికి తొమ్మిదో నెలలో డాప్లర్ స్కానింగ్ చేయించుకుని, గైనకాలజిస్టు సలహా మేరకు కాన్పును ప్లాన్ చేసుకోవచ్చు. నా వయసు 24ఏళ్లు. నాకు పెళ్లయి ఏడాదవుతోంది. నెల్లాళ్ల కిందట కోవిడ్ వచ్చి తగ్గింది. ప్రస్తుతం ఎలాంటి సమస్యలూ లేవు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా? – సుమతి నర్సీపట్నం కొంతమందిలో ‘కోవిడ్’ తగ్గిపోయిన తర్వాత కూడా రెండు నెలల వరకు నీరసం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి. మీకు ఎలాంటి సమస్యలూ లేవంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్ర రోజుకొకటి చొప్పున వేసుకుంటూ, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చు. మా అమ్మాయి వయసు 16ఏళ్లు. రెండేళ్ల కిందట రజస్వల అయింది. రజస్వల అయినప్పటి నుంచి కూడా ఆమెకు నెలసరి సక్రమంగా రావడం లేదు. మందులు వాడితేనే అవుతోంది. మందులు ఆపేస్తే కావడం లేదు. ఈ సమస్య తగ్గడానికి ఎన్నాళ్లు పడుతుంది? దీనికి ఏమైనా ప్రత్యేక చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందా? – శ్రావణి, కడియం సాధారణంగా రజస్వల అయిన తర్వాత మెదడు నుంచి జీఎన్ఆర్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్ హార్మోన్లు సక్రమంగా విడుదలై వాటి ప్రభావం థైరాయిడ్ గ్రంథి, అండాశయాల మీద సక్రమంగా పనిచేసి హార్మోన్లన్నీ ఒకే తాటిపైకి రావడానికి, ఇంకా వేరే సమస్యలేవీ లేకపోయినట్లయితే పీరియడ్స్ సక్రమంగా రావడానికి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి రెండు సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటి వరకు చాలామందిలో పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ అమ్మాయికి రెండు సంవత్సరాలు దాటినా పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. మీ అమ్మాయి ఎత్తు, బరువు ఎంత ఉందో తెలియలేదు. ఒకవేళ బరువు మరీ ఎక్కువగా ఉన్నా, మరీ తక్కువగా ఉన్నా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కొందరిలో థైరాయిడ్ సమస్య వల్ల, కొందరిలో అండాశయంలో నీటి బుడగలు (పీసీఓడీ) సమస్య వల్ల, అధిక మానసిక ఒత్తిడి, ఇంకా ఇతర హార్మోన్ల సమస్యల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కాబట్టి ఒకసారి గైనకాలజిస్టుకి చూపించి, వారి సలహా మేరకు స్కానింగ్, రక్త పరీక్షలు చేయించి, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకుంటూ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకుంటే, చాలామందిలో పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
నెలలు పెరిగేకొద్దీ.. తగ్గే అవకాశం ఉందా?
12 వారాలకు స్కానింగ్ చేస్తే సర్విక్స్ లెంగ్త్ 3.4 సెంటీమీటర్లు ఉంది. ఇప్పుడు 20 వారాలకు టిఫా స్కాన్‌లో అది 3.0 సెంటీమీటర్లు ఉంది.. ఇది నెలలు పెరిగే కొద్ది ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – లక్ష్మి, గుంటూరు గర్భాశయ ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు. ఇది యోని భాగంలోకి చొచ్చుకుని ఉంటుంది. సర్విక్స్ బయటి ద్వారాన్ని ‘ఎక్స్టర్నల్ ఆస్’, లోపలి ద్వారాన్ని ‘ఇంటర్నల్ ఆస్’ అంటారు. ఇంటర్నల్ ఆస్కి, ఎక్స్టర్నల్ ఆస్కి మధ్య ఉన్న భాగాన్ని కొలిస్తే సర్వైకల్ లెంగ్త్ వస్తుంది. సర్వికల్ లెంగ్త్ ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో 2.8 సెం.మీ–4.0 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. 2.8 సెం.మీ కంటే తక్కువ ఉన్నప్పుడు దానిని షార్ట్ సర్విక్స్ అంటారు. సాధారణంగా ఇంటర్నల్ ఆస్ మూసుకుని ఉంటుంది. కాన్పు సమయంలో అది మెల్లగా తెరుచుకోవడం జరుగుతుంది. కొందరిలో కాన్పు సమయం కాకముందే అది కొద్దిగా తెరుచుకోవడం జరుగుతుంది. దానిని సెర్వికల్ ఇన్‌కాంపిటెన్స్ అంటారు. కొందరిలో గర్భాశయంలో లోపాలు, ఇన్ఫెక్షన్లు, శారీరక ఒత్తిడి, ఇంకా తెలియని అనేక కారణాల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి సర్విక్స్ లెంగ్త్ తగ్గుతూ వచ్చి, గర్భాశయంలో బిడ్డ పెరిగే కొద్దీ బరువును పట్టుకోలేక, ఇంటర్నల్ ఆస్ తెరుచుకుపోయి నెలలు నిండకుండానే కాన్పు జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు మూడవ నెలలో సర్విక్స్ లెంగ్త్ 3.4 సెం.మీ. ఉంది. ఇప్పుడు ఐదవ నెలలో అది 3.0 సెం.మీ. ఉంది. ఇక్కడ సెర్విక్స్ లెంగ్త్ పొట్టపై నుంచి చేసే అబ్డామినల్ స్కానింగ్ ద్వారా కాకుండా, యోని ద్వారా చేసే వజైనల్ స్కానింగ్ ద్వారా చూడటం వల్ల సర్విక్స్ లెంగ్త్ సరిగా తెలుస్తుంది. కొందరిలో పొట్టపై కొవ్వు ఎక్కువగా ఉండటం వంటి సమస్యల వల్ల అబ్డామినల్ స్కానింగ్‌లో సర్విక్స్ లెంగ్త్ తక్కువగా కనిపించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ట్రాన్స్ వజైనల్ స్కానింగ్ ద్వారా నిర్ధారణ చేసుకోవడం మంచిది. ఒకవేళ అందులో కూడా 3.0 సెం.మీ ఉంటే, బిడ్డ బరువు పెరిగే కొద్ది గర్భాశయ కండరాల పటిష్టతను బట్టి కొందరిలో సమస్యేమీ ఉండదు. కొందరిలో మెల్లగా తగ్గి, నెలలు నిండకుండా కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి రెండు వారాల తర్వాత మళ్లీ సర్వైకల్ స్కానింగ్ చేయించుకుని, సర్వైకల్ లెంగ్త్ తగ్గకపోతే కంగారు పడాల్సిన పనిలేదు. కాకపోతే బరువు పనులు చేయకుండా, కూర్చుని చేసుకునే పనులు చేసుకుంటూ, పొత్తికడుపు మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవడం, మలబద్ధకం లేకుండా ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, కలయికకు దూరంగా ఉండటం, మూత్రంలో, యోనిలో ఏమైనా ఇన్ఫెక్షన్ కనిపిస్తే, డాక్టర్ సలహా మేరకు దానికి తగిన చికిత్స తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. సర్వైకల్ లెంగ్త్ ఇంకా తగ్గుతూ ఉంటే గైనకాలజిస్టు సలహా మేరకు బెడ్‌రెస్ట్, ప్రొజెస్టిరాన్ మాత్రలు, ఇంజెక్షన్లు, అవసరమైతే గర్భాశయ ముఖద్వారానికి కుట్లువెయ్యడం వంటి చికిత్సలు తీసుకోవచ్చు. నాకు తామర రింగ్‌వర్మ్ ఇన్ఫెక్షన్ ఉంది. మా పాపకు రెండు నెలలు. పాపకు నా పాలు పట్టవచ్చా? దానివల్ల పాపకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుందా? – లక్ష్మీశాంతి, విఖాఖపట్నం తామర లేదా రింగ్‌వర్మ్ అనేది శరీరంపై ట్రైకియాసిస్ అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది చర్మంపై ఎక్కడైనా గుండ్రంగా, కొంచెం ఎర్రగా కొంచెం కొంచెం పాకుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఉపయోగించే సబ్బులు, టవల్స్ వాడటం వల్ల, తాకడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఈ ఇన్ఫెక్షన్ పాకుతుంది. ఇది తల్లి పాల ద్వారా పాపకు సోకదు. కాబట్టి పాపకు పాలు ఇవ్వవచ్చు. దీనికి ఇంట్లో అందరూ యాంటీఫంగల్ సోప్, క్రీములు, మందులు వాడవలసి ఉంటుంది. ఇంట్లో ఎవరి టవల్స్ , వస్తువులు వారు విడి విడిగా పెట్టుకుని, వాడుకోవడం మంచిది. ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దీనికి సరైన మందుల కోర్సు వాడటం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, శారీరక శుభ్రత పాటించడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి. డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
పెళ్లయి ఏడు నెలలు అవుతోంది.. ప్రెగ్నెంట్ కాగలనా?
నా వయసు 23 సంవత్సరాలు. బరువు 47 కిలోలు. నాకు పెళ్లయి ఏడు నెలలు అవుతోంది. ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి విపరీతంగా వస్తోంది. ఈ మధ్య నెలసరి కూడా సరిగా సమయానికి రాకుండా, వారం లేదా పదిహేను రోజుల ముందుగానే వస్తోంది. నేను ప్రెగ్నెంట్ కాగలనా? నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – శిరీష, ఈ–మెయిల్ సాధారణంగా సమస్యలేవీ లేకపోతే పెళ్లయిన సంవత్సరంలో 80 శాతం మందికి గర్భధారణ జరుగుతుంది. మిగిలిన వారిలో 15 శాతం మందికి రెండేళ్లకు గర్భధారణ జరుగుతుంది. మిగిలిన ఐదు శాతం మందికి మాత్రమే గర్భధారణ కోసం చికిత్స అవసరమవుతుంది. కాబట్టి ఏడు నెలలైనా గర్భం రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ సమయంలో కొందరిలో ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్ ప్రభావం వల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుంది. కొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్ గడ్డలు, ఇన్ఫెక్షన్లు, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో విపరీతమైన నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ నెల కంటే ముందుగా వారం పదిహేను రోజులు ముందే రావడం జరుగుతుంది. కొందరిలో అండాశయంలో నీటిగడ్డలు, చాక్లెట్ సిస్ట్లు వంటి సమస్యలు, థైరాయిడ్ సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఈ సమస్యలు ఉన్నప్పుడు గర్భం రావడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి మీరు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి థైరాయిడ్ వంటి అవసరమైన రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ పెల్విక్ స్కానింగ్ వంటివి చేయిండం వల్ల సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుంది. దానిని బట్టి తగిన చికిత్స తీసుకోవచ్చు. నా వయసు ఇరవయ్యేళ్లు. ఇటీవల గైనకాలజిస్ట్ దగ్గరకు చెకప్‌కు వెళితే నాకు వజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. వజైల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ వజైనాసిస్ అంత డేంజరస్ కాదని విన్నాను. ఇది ఎంతవరకు నిజం. దీనికి పరిష్కారం ఏమిటి? చెప్పగలరు. – శ్రుతి, సోంపేట మీకు పెళ్లయినదీ కానిదీ రాయలేదు. సాధారణంగా యోని భాగంలో అనేక రకాల మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల మంచి బ్యాక్టీరియా అయిన ల్యాక్టో బాసిలై నుంచి విడుదలయ్యే ల్యాక్టిక్ యాసిడ్ వంటి పదార్థాలు యోని స్రావాలకు ఆసిడిక్ పీహెచ్ (ఆమ్లగుణం) ఉండేలా చేస్తాయి. ఈ ఆమ్లగుణం చెడు బ్యాక్టీరియా, ఇంకా ఇతర ఫంగల్, ప్రోటోజోవల్ రోగ క్రిములు ఎక్కువగా వృద్ధి చెందకుండా కాపాడతాయి. కొన్ని సందర్భాల్లో యోని స్రావాల్లోని పీహెచ్ బ్యాలెన్స్ మార్పు చెందిన ఆమ్లగుణం తగ్గిపోతే ఇతర రోగక్రిములు పెరిగి అభివృద్ధి చెంది యోనిలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లను అశ్రద్ధ చేసి, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే రోగ క్రిములు గర్భాశయంలోకి, దాని నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి పొత్తికడుపులోకి పాకి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (పీఐడీ) వంటి సమస్యలు తలెత్తి, పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, ట్యూబ్స్ మూసుకుపోవడం, దానివల్ల గర్భధారణలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. వజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ క్యాండిడ్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఇది రక్తహీనత, డయాబెటిస్ ఉన్నవారిలో, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువగా వాడే వారిలో, దీర్ఘకాలం యాంటీబయోటిక్స్, స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో కలయిక వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్లో తెల్లబట్ట చిక్కగా పెరుగులాగ ముక్కలు ముక్కలుగా రావడం, యోనిలో, జననేంద్రియాలలో మంట, దురద వంటి లక్షణాలు ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారణ అయిన తర్వాత గైనకాలజిస్ట్‌ని సంప్రదించి, వారి సలహా మేరకు ఫ్లుకనొజోల్, ఇట్రకెనజోల్ వంటి యాంటీ ఫంగల్ నోటి మాత్రలతో పాటు యోనిలో పెట్టుకునే యాంటీ ఫంగల్ క్రీములు వాడవలసి ఉంటుంది. అలాగే రక్తహీనత రాకుండా ఉండేందుకు సరైన పోషకాహారం తీసుకోవడం, పెరుగు ఎక్కువగా తీసుకోవడం, తగినన్ని మంచినీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ యోనిలోని ఆసిడిక్ పీహెచ్‌ను బ్యాలెన్స్ చేయడానికి దోహదపడుతాయి. దానివల్ల రోగ క్రిములు పెరగకుండా ఉంటాయి. అవసరమైతే ల్యాక్టిక్ యాసిడ్ కలిగిన ఇంటిమేట్ వాష్‌తో జననేంద్రియాలను శుభ్రపరచుకోవచ్చు. డెటాల్, సావలాన్ వంటి యాంటీసెప్టిక్ లోషన్లను జననేంద్రియాల వద్ద వాడకపోవడం మంచిది. వీటి వల్ల మంచి బ్యాక్టీరియా నశించి, వజైనల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనకవైపు శుభ్రపరచుకోవాలి. వెనుక నుంచి ముందుకు శుభ్రపరచుకుంటే మలద్వారం వద్ద ఉండే క్రిములు యోనిభాగంలోకి చేరి, అక్కడ ఇన్ఫెక్షన్లను కలిగించవచ్చు. యోనిలో ఆమ్లగుణం తగ్గినప్పుడు అక్కడ గార్డినెల్లా వంటి చెడు బ్యాక్టీరియా పెరిగి, తద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ను బ్యాక్టీరియల్ వజైనాసిస్ అంటారు. ఇందులో తెల్లబట్ట, బురద రంగులో పసుపు లేదా ఆకుపచ్చ రంగులో వచ్చి చేపవాసన, మురుగు వాసనతో ఉండి మూత్రం పోసేటప్పుడు మంట, దురద వంటి లక్షణాలు ఉండవచ్చు. దీనిపైన క్లామిడియా, గనేరియా వంటి ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉండి, పీఐడీ సమస్యలు ఎక్కువగా రావచ్చు. ఈ సమస్యకు గైనకాలజిస్ట్ సలహా మేరకు యాంటీబయోటిక్ కోర్సు దీర్ఘకాలం వాడవలసి ఉంటుంది. అవసరమైతే భార్యాభర్తలిద్దరూ వాడవలసి ఉంటుంది. బ్యాక్టీరియల్ వజైనాసిస్ కంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ పెద్ద ప్రమాదమేమీ కాదు. ఏదేమైనా పైన చెప్పిన చికిత్సతో పాటు జాగ్రత్తుల తీసుకుంటున్నట్లయితే తరచు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. -డా‘‘ వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
Hemophilia: నా నిర్ణయం సరైనదేనా?
మేడం.. నాకు పెళ్లి సెటిలైంది. నిజానికి ఈ పాటికి పెళ్లి కూడా అయిపోవాల్సింది. కరోనా వల్ల వాయిదా వేసుకున్నాం. అదీ నా మంచికే అయిందేమో అనిపిస్తోంది. ఈ మధ్యనే తెలిసింది అబ్బాయి వైపు వాళ్లకు హీమోఫీలియా ఉందని. అది తెలిసినప్పటి నుంచి ఈ సంబంధం బ్రేక్ చేసుకోవాలనుకుంటు న్నాను. నా నిర్ణయం సరైనదేనా? ఆ విషయం తప్ప ఇంకే కారణం లేదు బ్రేక్ చేసుకోవడానికి. మీ రిప్లయ్ మీదే నా భవిష్యత్ ఆధారపడి ఉంది. – ఎల్. అక్షయ, బెంగళూరు కొందరిలో జన్యు లోపాల వల్ల రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ఫ్యాక్టర్–8, ఫ్యాక్టర్–9 వంటివి సరిగా తయారు కాకపోవడంతో వారిలో చిన్న దెబ్బ తగిలినా, ఏదైనా ఆపరేషన్ జరిగినా, కాన్పు సమయంలో బ్లీడింగ్ అయినప్పుడు రక్తం గడ్డకట్టకుండా బ్లీడింగ్ ఆగకుండా ఎక్కువైపోయి ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధిని హీమోఫీలియా అంటారు. ఈ ఫ్యాక్టర్లకు సంబంధించిన జన్యువులు ‘ఎక్స్’ క్రోమోజోమ్పైన ఉంటాయి. ఈ జన్యువులలో మార్పులు జరిగి, లోపాలు ఏర్పడినప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ఫ్యాక్టర్–8, ఫ్యాక్టర్–9 వంటి పదార్థాలు సరిగా తయారు కాకపోవడం వల్ల బ్లీడింగ్ సమస్యలు ఏర్పడతాయి. ఇది ‘ఎక్స్–లింక్డ్ రెసిసివ్ డిజార్డర్’. హీమోఫీలియా సమస్య ఉన్న కుటుంబంలో పెళ్లి జరిగినప్పుడు, వారికి పుట్టే పిల్లల్లో హీమోఫీలియా సంక్రమించే అవకాశాలు తల్లిదండ్రుల్లో వ్యాధి తీవ్రతను బట్టి, పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అనే అంశాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి మీ పెద్దవాళ్లను అబ్బాయి కుటుంబంలో ఎవరికైనా హీమోఫీలియా ఉందా, అబ్బాయికి కూడా ఉందా అనే వివరాలు సరిగా తెలుసుకోవలసి ఉంటుంది. ఒకవేళ అబ్బాయికి హీమోఫీలియా లేకపోతే, పుట్టబోయే పిల్లలకు హీమోఫీలియా వచ్చే అవకాశాలు దాదాపుగా ఉండవు. కాబట్టి సమస్య ఏమీ ఉండదు. ఒకవేళ అబ్బాయికి హీమోఫీలియా ఉంటే సంబంధం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అబ్బాయికి చిన్న దెబ్బ తగిలినా, ప్రమాదాలు జరిగినప్పుడు బ్లీడింగ్ సమస్యలు ఏర్పడి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి. పుట్టబోయే పిల్లల్లో మగపిల్లలు అయితే మామూలుగానే పుడతారు. వీరికి హీమోఫీలియా సంక్రమించదు. అమ్మాయిలకైతే, వారికి హీమోఫీలియా జన్యువు ఉండే ‘ఎక్స్’ క్రోమోజోమ్ తండ్రి నుంచి సంక్రమిస్తుంది. తల్లి నుంచి సాధారణంగా ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ సంక్రమిస్తుంది కాబట్టి అమ్మాయిలు హీమోఫీలియా క్యారియర్స్‌గా ఉంటారు. కాబట్టి వారి కుటుంబంలో హీమోఫీలియా ఎవరికి ఉంది, కచ్చితంగా అబ్బాయికి ఉందా లేదా అనే విషయం స్పష్టంగా తెలుసుకుని, సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. సరోగసీ ద్వారా బిడ్డను కంటే వూంబ్ అద్దెకిచ్చే వాళ్లకు ఏమైనా జబ్బులుంటే పుట్టబోయే బిడ్డకు సోకుతాయా? అంటే వాళ్లకు వంశపారంపర్యంగా వచ్చే జబ్బులేమైనా అని. నా అజ్ఞానానికి మన్నించి జవాబివ్వగలరు. – కూన మాధవరావు, బళ్లారి మానవ శరీరంలోని ప్రతి ఒక్క కణం, కణజాలం, అవయవాల పనితీరు వంటివి జన్యువులు, క్రోమోజోమ్స్పై ఆధారపడి ఉంటాయి. మన శరీరంలో ఉండే 46 క్రోమోజోమ్స్ (23 జతలు) పైన అనేక జన్యువులు ఉంటాయి. ఒక్కొక్క జన్యువు ఒక్కొక్క బాధ్యతను నిర్దేశిస్తుంది. ఉదాహరణకు: రంగు, రూపు, అవయవాల పనితీరు, హార్మోన్లు, ఎంజైమ్స్ ప్రక్రియలు వంటివి. తల్లి అండంతో తండ్రి శుక్రకణం ఫలదీకరణ చెందిన తర్వాత పిండం ఏర్పడుతుంది. ఈ పిండంలోకి తల్లి అండం నుంచి 23 క్రోమోజోమ్స్, తండ్రి శుక్రకణం నుంచి 23 క్రోమోజోమ్స్ సంక్రమిస్తాయి. అలా 46 క్రోమోజోమ్స్ (23 జతలు) పిండానికి చేరి, మెల్లగా తొమ్మిది నెలలు శిశువుగా రూపాంతరం చెందుతూ, బిడ్డ బయటకు వస్తుంది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 46 క్రోమోజోమ్స్ వల్ల వారిలోని లక్షణాలు పిల్లలకు వస్తాయి. అలాగే వారికి ఉండే వంశపారంపర్య జబ్బులు కూడా రావచ్చు. తల్లి గర్భాశయంలో సమస్యలు ఉండి, ఆమె తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసే పరిస్థితి లేనప్పుడు, ల్యాబ్‌లో తల్లి నుంచి తీసిన అండాన్ని, తండ్రి నుంచి సేకరించిన శుక్రకణాలతో ఫలదీకరణ చేయగా వచ్చిన పిండాన్ని వేరే మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం (ఎంబ్రియో ట్రాన్స్ఫర్) జరుగుతుంది. అలా చేరిన పిండం వారి గర్భంలో పెరిగి పెద్దదవుతుంది. దీనినే ‘సరోగసీ’ పద్ధతి అంటారు. బిడ్డను తన గర్భంలో పెంచే తల్లిని ‘సరోగేట్ మదర్’ అంటారు. ‘సరోగసీ’ పద్ధతిలో బిడ్డకు అసలు తల్లిదండ్రుల నుంచే జన్యువులు సంక్రమిస్తాయి కాబట్టి, వారి రంగు, రూపు, మిగతా జన్యుపరమైన లక్షణాలు బిడ్డకు సంక్రమిస్తాయి. కాని ‘సరోగేట్ మదర్’ లక్షణాలు ఏమీ సంక్రమించవు. అలాగే ‘సరోగేట్ మదర్’లో ఉండే వంశపారంపర్య వ్యాధులేవీ బిడ్డకు సంక్రమించవు. -డాక్టర్. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
పిల్లల కోసం మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది..
మేడం.. నాకు 32 సంవత్సారాలు. ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ. తొలి కాన్పులో బాబు. వాడికిప్పుడు ఏడేళ్లు. ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ఏదో ఇన్ఫెక్షన్ రావడం, మందులు వాడడంతో సెకండ్ ప్రెగ్నెన్సీ లేట్ అయింది. అయితే ఈ టైమ్‌లోనే నాకు హైపోథైరాయిడ్, డయాబెటీస్ కూడా వచ్చాయి. బీపీ నార్మల్‌గానే ఉంది ప్రస్తుతానికైతే. కాని కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీ కాదు అంటున్నారు డాక్టర్. పుట్టబోయే బిడ్డకు అవయవలోపాలు, మెదడు ఎదగకపోవడం వంటి సమస్యలైతే రావు కదా మేడం.. భయంగా ఉంది. – అనుపమ, నిర్మల్ ఈ మధ్యకాలంలో చాలా మంది 30–35 సంవత్సరాల మధ్యలోనే రెండోసారి గర్భం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంత మంది ఒక బిడ్డ చాలు అనుకొని, రెండో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయరు. వీరిలో ఆ బిడ్డ 6–7 సంవత్సరాల తర్వాత పెద్దగా అయ్యి ఒక తోడు కోసం తమ్ముడో, చెల్లెలో కావాలని మా ఫ్రెండ్స్‌కున్నారు, నాకు ఎందుకులేరు అని ఒంటరిగా బాధపడుతూ తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కొందరు బిడ్డకోసం 35 సంవత్సరాల తర్వాత గర్భం ప్లాన్ చేయడం మొదలుపెడతారు. ఈ వయసులో అండాల నాణ్యత తగ్గడం, తల్లిలో బీపీ, షుగర్ పెరగడం వంటి సమస్యల వల్ల ఈ బిడ్డలో మామూలు వారికంటే అవయవ లోపాలు, బుద్ధిమాంద్యంతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటివి ఏర్పడే అవకాశాలు రెట్టింపు అవుతాయి. ఈ సమస్యలు అందరిలో రావాలని ఏమి లేదు. మీకు 32 సంవత్సరాలు, హైపోథైరాయిడ్, డయాబెటిస్ ఉన్నాయి. వీటికి సక్రమంగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుతూ, అదుపులో ఉంచుకుంటే బిడ్డ మీద పెద్ద ప్రభావం పడదు. కాన్పు సమయం వరకు బీపీ పెరగకుండా థైరాయిడ్, షుగర్ కంట్రోల్లో ఉండి, బిడ్డ బరువు మరీ ఎక్కువ లేకుండా ఉంటే, మొదటి కాన్పు నార్మల్‌గా అయ్యి ఉంటే ఈసారి కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. దాని గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ థైరాయిడ్, షుగర్ సమస్యలు అదుపులో లేకపోతే బిడ్డ మెదడు ఎదుగుదలలో లోపాలు, అవయవ లోపాలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అలాగే వయస్సుని బట్టి బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు మామూలు వారికంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. మీరు 12 వారాల సమయంలో ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకోపోతే 5వ నెల మధ్యలో అంటే 18–20 వారాల సమయంలో టిఫా స్కానింగ్‌తోపాటు క్వాడ్రుపుల్ టెస్ట్ అనే రక్త పరీక్ష కూడా చేయించుకోవడం మంచిది. టిఫా స్కానింగ్‌లో బిడ్డ లోపల అవయవాలు అన్నీ ఉండవలసినట్లే ఉన్నాయా, లేదా అనేది 95 శాతం తెలుస్తుంది. గుండెలో రంధ్రాలు వంటివి సరిగా తెలియాలి అంటే ఫీటల్ 2డీ ఈకో స్కానింగ్ చేయించుకోవడం మంచిది. అలాగే క్వాడ్రుపుల్ రక్త పరీక్షలో బిడ్డలో డౌన్స్‌సిండ్రోమ్ వంటి కొన్ని జన్యుపరమైన సమస్యలు ఉండే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిస్తే, సమస్య కచ్చితంగా ఉందా లేదా అని నిర్ధారించుకొని దానికి ఆమినియోసెంటిసిస్ అనే ఉమ్మనీరుని తీసి పరీక్ష చేయడం జరుగుతుంది. లేదా 99 శాతం ఎన్ఐపీటీ అనే రక్తపరీక్ష చేయించుకోవచ్చు. కాబట్టి మీరు ఆందోళన పడకుండా పైన చెప్పిన మీ డాక్టర్ సలహామేరకు చేయించుకొని, సరైన మోతాదులో ఆహార నియమాలను పాటిస్తూ, మందులు వాడుకుంటూ, సక్రమంగా చెకప్‌లకు వెళుతూ ఉంటే ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. లేటు వయసులో పిల్లల్ని కంటే మానసిక లోపాలతో పుట్టే ప్రమాదం ఉన్నట్టే చిన్న వయసులో కంటే కూడా అలాంటి రిస్క్ ఉంటుందా? ఎందుకంటే నాకు పదహారేళ్లకే పెళ్లయింది. ఇప్పుడు నాకు పందొమ్మిదేళ్లు. పిల్లల కోసం మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. నేనేమో చదువు మీద దృష్టిపెట్టాను. మీ సమాధానం మీద నా భవిష్యత్ ఆధారపడి ఉంది. – దీపికా వత్సల, చెన్నూరు సాధారణంగా అమ్మాయి గర్భధారణకు శారీరకంగా మానసికంగా సిద్ధం అవ్వడానికి 21 సంవత్సరాలు నిండితే ప్రెగ్నెన్సీ సమయంలో కాంప్లికేషన్స్ ఎక్కువగా లేకుండా తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో అమ్మాయి తన కాళ్ల మీద తను నిలబడటానికి, లోకం జ్ఞానం తెలియడానికి చదువు కూడా చాలా ముఖ్యం. 21 సం.లకు డిగ్రీ పూర్తవుతుంది. పెళ్లి తర్వాత పిల్లలను కని, పెంచడానికి, చదివించుకోవడానికి, కుటుంబం సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ సామాజిక పరమైన ఉపయోగాలు. తల్లీ, బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే, అమ్మాయి శారీరకంగా పెరగడాని, పెల్విక్ ఎముకలు దృఢంగా తయారు కావడానికి, హర్మోన్స్ సక్రమంగా పనిచేయడానికి 20 సం.రాలు అవసరం. అంతకంటే ముందు గర్భధారణ వల్ల గర్భం సమయంలో రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, పెల్విక్ ఎముకలు ధృఢంగా లేకపోవడం వల్ల సాధారణ కాన్పుకి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి మామూలు వయసు వారి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. తల్లిలో పోషకాల లోపం వల్ల కూడా బిడ్డలో మానసిక శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఎలాగైతే 35 సం.రాలు దాటాక పుట్టబోయే పిల్లల్లో మానసిక లోపాలతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో, అలాగే మరీ చిన్న వయసులో గర్భం దాలిస్తే కూడా పుట్టబోయే పిల్లల్లో ఈ సమస్యలు ఉండే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. మీ ఇంట్లో వాళ్లకి పెళ్లయి మూడు నాలుగు సంవత్సరాలు దాటింది కనిపిస్తుంది కాని, నీ వయసు కనిపించట్లేదు. అందుకే వాళ్లు కంగారుపడుతున్నారు. ఇంతకు ముందు కాలంలో అయితే 15–20 సం.రాల లోపలే పిల్లలను కనేవాళ్లు. అప్పటి కాలం పరిస్థితులు, వారి శరీరతత్వాలు, ఆహారపు అలవాట్లు, పనులు చేయడం వంటివి ఇప్పటి పిల్లలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. కాబట్టి అప్పటి వారిలో, ఇప్పడు ఉన్నంత సమస్యలు ఉండేవి కావు. అలాగే తరాలు మారే కొద్దీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జన్యువులలో కూడా మెల్లగా మార్పులు వచ్చి, తద్వారా పుట్టబోయే పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు మీ వారికి అర్థం అయ్యేటట్లు వివరించి, నీ చదువు పూర్తి చేసుకొని 21 సం.రాలకు పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చు. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
అది ఫాలో అవ్వొచ్చా?
నాకు ఈ మధ్యే పెళ్లయింది. నేను కేరీర్ ఓరియెంటెడ్. కెరీర్ పరంగా ఎంతోకొంత ఎచీవ్ చేశాకే పిల్లలు అనుకుంటున్నాను. నా హజ్బెండ్ కూడా ఒప్పుకున్నాడు. ఫ్రోజెన్ ఎగ్ మెథడ్ చాలా వినపడుతోంది కదా.. అది ఫాలో అవ్వొచ్చా? అలా దాచుకున్న ఎగ్స్ వల్ల పిల్లలు ఆరోగ్యంగానే పుడతారా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం..– అశ్విని, బెంగళూరు అశ్విని నీ వయసు ఎంతో రాయలేదు. సాధారణంగా అయితే గరిష్టంగా 32, 33 సంవత్సరాల వరకు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అండాల సంఖ్య వాటి నాణ్యత చాలా వరకు బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. 34, 35 సంవత్సరాలు దాటే కొద్దీ అండాల సంఖ్య, వాటి నాణ్యత క్రమంగా తగ్గుతూ రావడం వల్ల, ఈ సమయంలో గర్భం కోసం ప్రయత్నం చేసినప్పుడు గర్భం వచ్చే అవకాశాలు తగ్గడం, వచ్చినా జన్యుపరమైన లోపాల వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం, బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నీకు నీ కెరీర్లో నిలదొక్కుకోవడానికి ఇంతకంటే ఎక్కువ సమయం పడుతుందనుకుంటే, నీ అండాలను ముందుగానే ఎగ్ ఫ్రోజన్ మెథడ్ ద్వారా దాచుకొని, గర్భానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఈ లోపల మీవారి వయసు కూడా పెరిగే కొద్దీ ఆయనకు కూడా వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు, అండాలను ఫ్రీజ్ చేసి భద్రపరుచుకునే బదులు, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా అండాల్లోకి వీర్యకణాలను పంపి, ఫలదీకరణ జరిపి, తద్వారా తయారైన పిండాలను ఫ్రీజ్ చేసి భద్రపరుచుకోవడం మంచిది. అండాలను ఫ్రీజ్ చేయడం అంటే oocyte cryopreservation పద్ధతి. ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం చెందుతుంది. ఈ పద్ధతిలో పీరియడ్స్ వచ్చిన రెండో రోజు నుంచి అనేక అండాలు తయారు కావడానికి హెచ్ఎమ్జీ, ఎఫ్ఎస్హెచ్ వంటి హార్మోన్ ఇంజెక్షన్లను ఎక్కువ మోతాదులో 8–10 రోజులపైన ఇవ్వడం జరుగుతుంది. అండాల పరిమాణం 18–20 మి.మీ. పెరిగిన తర్వాత వాటిని వెజైనా (యోని భాగం) నుంచి స్కానింగ్‌లో చూస్తూ బయటకు తీయడం జరుగుతుంది. అలా తీసిన అండాల్లో మంచి అండాలను (మంచి నాణ్యత) విట్రిఫికేషన్ పద్ధతి ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతలో ఫ్రీజ్ చేసి నైట్రోజన్ లిక్విడ్‌లో భద్రపరచడం జరుగుతుంది. వీటిని 10 సంవత్సరాలపైన నిల్వ చేయవచ్చు. వీటిని ఏ వయసులో బయటకు తీయడం జరిగిందో కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని వాడేటప్పుడు వాటి వయసు అలానే ఉంటుంది. కొన్ని సంవత్సరాల గర్భం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఫ్రీజ్ చేసిన అండాలను థాయింగ్ పద్ధతి ద్వారా సాధారణ పరిస్థితికి తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని అండాలు పాడయిపోవడం వల్ల 10 శాతం అండాలు నాణ్యత కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 90 శాతం అండాలు బాగానే ఉండవచ్చు. ఈ అండాల్లోకి వీర్యకణాలను ఐసీఎస్ఐ పద్ధతి ద్వారా ప్రవేశపెట్టి ఫలదీకరణ చేయడం జరుగుతుంది. వాటిని 3–5 రోజులు ఇంక్యుబేటర్‌లో పెట్టిన తర్వాత, ఎన్ని పిండాలు ఏర్పడ్డాయి, వాటి నాణ్యత ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అలా ఏర్పడిన అండాలను, అప్పటికే ఉన్న మహిళ గర్భాశయంలోకి సన్న కె«థడర్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మహిళ గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొర మందం సరిగా ఉండి, దానికి రక్తప్రసరణ సరిగా ఉండి, హార్మోన్స్ పనితీరు సరిపడా ఉండి, గర్భాశయంలోకి అండాలు సరిగా హత్తుకుంటే, అప్పుడు గర్భం నిలుస్తుంది. వీటిలో ఏ ప్రక్రియ సరిగా లేకపోయినా గర్భాశయం పిండాలను స్వీకరించదు. అప్పుడు గర్భం నిలబడకుండా పీరియడ్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు చేసిన పరిశోధనల్లో ఫ్రోజెన్ ఎగ్ మెథడ్ ద్వారా పుట్టిన పిల్లలు, మామూలుగా పుట్టిన పిల్లలు లేదా సాధారణ వయసులో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పుట్టిన పిల్లల లాగానే ఉంటారని, కాంప్లికేషన్స్ కూడా వారిలో లాగానే ఉంటాయని తేల్చడం జరిగింది. కాకపోతే తల్లి వయసు 35–40 సంవత్సరాలు దాటే కొద్దీ తల్లిలో బీపీ, షుగర్ వంటి ఇతర మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఫ్రోజెన్ ఎగ్ మెథడ్ వల్ల ప్రెగ్నెన్సీ కచ్చితంగా వస్తుందని కాని, సమస్యలు ఏమీ ఉండవు అని కాని చెప్పడం కష్టం. ఈ పద్ధతిని మొదట్లో చిన్న వయసులో క్యాన్సర్ వచ్చి వాటికి చికిత్స తీసుకొనే వాళ్లకోసం, దీర్ఘకాల మెడికల్ సమస్యలు ఉండి, వాటి చికిత్స తీసుకొనే సమయంలో అండాల నాణ్యత తగ్గిపోకుండా ఉండటాని కనుగొనడం, వాడటం జరిగింది. క్రమేణా దీనిని మీకు లాగా పిల్లలు ఇప్పుడే వద్దనుకొని కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉన్నవాళ్లు, పెళ్లి వాయిదా వేసేవాళ్లు, తగిన పార్టనర్ దొరకని వాళ్లు. వాడటం మొదలు పెట్టారు. ఈ కారణాల కోసం అండాలను క్రయోప్రిజర్వ్ చేయడాన్ని social freezing అంటారు. ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ ఉంది కదా అని, అదో ఫ్యాన్సీలాగా వాడేసుకోవడం మంచిది కాదు. అది ఎంతవరకు అవసరమో అంత వరకే వాడుకోవాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. కెరియర్ అని, ఇంకా అనేక కారణాల వల్ల లేటు వయసులో పిల్లలను కనడం వల్ల, వారిని పెంచి, చదివించి పెద్ద చేసే వరకు, మీ వయసు పెరిగి, మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఒకసారి ఆలోచించి చూసి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. కొద్దిగా ఓపికతోని, సరైన సమయంలో పిల్లలు కని, (పెద్దవాళ్ల సహాయ సహకారంతో) కష్టపడి కెరియర్ కూడా చూసుకుంటూ ఎన్నో సాధించిన మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి నువ్వు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వెజైనల్ స్కానింగ్ చేయించుకొని, అందులో అండాశయం పరిమాణం, అందులో అండాల సంఖ్య ఎలా ఉంది తెలుసుకొని, హార్మోన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఎఎమ్హెచ్ వంటి రక్త పరీక్షలు చేయించుకొని తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా?
పదిహేనేళ్లకే పెళ్లయి, ఇరవైఏళ్ల కల్లా బిడ్డలు పుట్టి, ట్యూబెక్టమీ అయిపోతే గర్భసంచి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – కె. రాధ, మంచిర్యాల్ మీరు చెప్పే గర్భసంచి కేన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అనేది 80 శాతం మందిలో హ్యూమన్ పాపిలోమాలోని కొన్ని రకాల వైరస్ జాతుల వల్ల వస్తుంది. హెచ్‌పీవీ వైరస్ కలయిక వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ హెచ్‌పీవీ లో కొన్ని హైరిస్క్ జాతులు (హెచ్‌పీవీ 16, 18 వంటివి) ఎక్కువ కాలం పాటు గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉన్నప్పుడు అవి సెర్విక్స్లోని కణాల్లో అనేక మార్పులను కలుగజేయడం వల్ల అధికంగా వృద్ధి చెందుతూ చాలా సంవత్సరాలకు (10 సం. పైన) క్యాన్సర్ కణాలుగా మారడం జరుగుతాయి. ఈ వైరస్ చాలా మందిలో ఉన్నా వారి రోగనిరోధక శక్తిని బట్టి, వారి జన్యువులను బట్టి కేవలం ఇన్ఫెక్షన్ లేదా కొద్దిపాటి మార్పులతో నశించిపోతాయి. కాని కొందరిలో అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో, 15 సంవత్సరాలకే కలయికలో పాల్గొనడం వల్ల, అలాగే చిన్న వయసుకే పిల్లలు పుట్టడం వల్ల, ఎక్కువ మంది పిల్లలను కనడం వల్ల, పొగతాగడం వంటి అనేక అంశాల వల్ల, వీరిలో సెర్వైకల్ కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో హైరిస్క్ హెచ్‌పీవీ వైరస్ సెర్వెకల్ కణాల్లో క్యాన్సర్ మార్పులను ఎక్కువగా కలుగజేయడం జరుగుతుంది. ఈ కణాల్లో మార్పులను ముందుగా తెలుసుకోవడానికి ప్యాప్‌స్మియర్ అనే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షను చేయించుకోవడం మంచిది. ఇందులో సెర్విక్స్ దగ్గర కణాలను (ద్రవాలను) చిన్న బ్రష్ ద్వారా తీయడం జరుగుతుంది. మొదటి కలయిక తర్వాత నుంచి ప్యాప్‌స్మియర్ పరీక్షను 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలో సెర్వైకల్ క్యాన్సర్ వచ్చే పది సంవత్సరాల ముందు నుంచే సర్వైకల్ కణాల్లో మార్పులను తెలుసుకోవచ్చు. నాకు ఇరవైరెండేళ్లు. రెండేళ్ల కిందట పెళ్లయింది. ఈ మధ్యే నెల తప్పాను. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకొని అబార్షన్ మాత్రలు వాడాను. దాదాపు నలభై రోజుల దాకా బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ ఆగిపోయే దశలో రక్తస్రావం నల్లగా అయింది. ఇప్పుడు అంతా మామూలైపోయి.. ఎప్పటిలాగే మళ్లీ పీరియడ్స్ కూడా వచ్చాయి. అయితే మేడం.. ఇప్పుడు నాకు పూర్తిగా అబార్షన్ అయిపోయినట్టే కదా? ప్రెగ్నెన్సీ నిలబడే చాన్స్ లేదు కదా? ఇంటర్‌కోర్స్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే చాన్స్ అయితే ఉండదు కదా? ఒకవేళ భవిష్యత్‌లో నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఈ అబార్షన్ వల్ల పుట్టబోయే బిడ్డకు, నాకు ఏమైనా సైడ్ ఎఫెక్టŠస్ ఉంటాయా? రక్తస్రావం నల్లగా ఎందుకైందంటారు? హిమోగ్లోబిన్ కూడా నాకు 10.5 వరకూ ఉంది మేడమ్.. దయచేసి నా సందేహాలకు జవాబు చెప్పగలరు. – ఇ– మెయిల్ ద్వారా అందిన ప్రశ్న. గర్భం దాల్చిన తర్వాత, గర్భం వద్దని అబార్షన్ అవ్వడం కోసం అనేక పద్ధతులు ఉంటాయి. మందుల ద్వారా లేదా డి అండ్ సి ద్వారా మత్తు ఇచ్చి గర్భాశయం నుంచి గర్భాన్ని తీసివేయడం. ఒకటి గర్భం 7 వారాల లోపల ఉంటే (చివరగా పీరియడ్ వచ్చినప్పటి నుంచి లెక్కపెట్టాలి) అబార్షన్ మందులయిన మిషిప్రిస్టోన్, మిసోప్రొస్టాల్ ద్వారా ప్రయత్నించడం. ఇందులో 95 శాతం బ్లీడింగ్ ద్వారా అబార్షన్, కొంచెం కడుపులో నొప్పితో అయిపోతుంది. 45 శాతం మందిలో కొన్ని ముక్కలు ఉండి పోవచ్చు. 1 శాతంలో బ్లీడింగ్ అయినా ప్రెగ్నెన్సీ (గర్భంలో శిశువు) పెరగవచ్చు. కాబట్టి గర్భ నిర్ధారణ అయిన తర్వాత గర్భం వద్దనుకుంటే మొదట గర్భం గర్భాశయంలో ఉందా లేదా, ట్యూబ్‌లో ఉందా, ఉంటే ఎన్ని వారాలు ఉంది అని డాక్టర్‌ను సంప్రదించి స్కానింగ్ ద్వారా నిర్ధారణ చేసుకొని గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో అబార్షన్ మందులు వాడటం అన్ని విధాలా మంచిది. మందులు వాడిన పది పదిహేను రోజులకు గర్భాశయంలో ముక్కలేవీ మిగలకుండా పూర్తిగా అబార్షన్ అయిపోయిందా లేదా అని మరలా స్కానింగ్ చేయించుకోవడం మంచిది. చాలా మంది సొంతంగా అబార్షన్ మందులు మెడికల్ షాపులో తీసుకొని వాడుకొని, ముందు, తర్వాత స్కానింగ్ చేయించుకోకుండా, ఎక్కువ నొప్పి, బ్లీడింగ్‌తో ఇబ్బంది పడటం, రక్తహీనత ఏర్పడటం, కొంత మందిలో ముక్కలు ఉండిపోయి ఇన్ఫెక్షన్లు రావడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ఇబ్బందికరమైన పరిస్థితులతో ప్రాణాలపైకి తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమందిలో బ్లీడింగ్ అయినా కాని అబార్షన్ సరిగా అవ్వకుండా శిశువు పెరిగే అవకాశం ఉంటుంది. మీకు 40 రోజులు బ్లీడింగ్ అయ్యింది. రక్తం లోపల చాలా రోజులు ఉండిపోయి చివరలో రంగు మారి నల్లగా రావుచ్చు. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి స్కానింగ్ చేయించుకొని గర్భాశయంలో ఏమైనా ముక్కలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. ఈ అబార్షన్ మొత్తంగా అయిపోయి, ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే, మళ్లీ పుట్టబోయే బిడ్డకు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఇంత చిన్న వయసులో...
మేడమ్.. మా పాప పదేళ్లు నిండగానే పెద్దమనిషి అయింది. మాకు షాకింగ్‌గా ఉంది. అంత చిన్న వయసులో ఏంటీ అని? నేను పదమూడేళ్లు నిండడంతో అయ్యాను. మా అక్కచెల్లెళ్లంతా ఇంచుమించు అదే వయసులో రజస్వల అయ్యారు. ఇప్పుడు మా అమ్మాయి, మా ఆడపడచు వాళ్ల అమ్మాయీ అంతే పదకొండేళ్లకు అయింది. ఎందుకలా? ఫుడ్ ప్రభావమా? – వి. సమీరజ, నిజామాబాద్ ఆధునిక కాలంలో మారుతున్న జీవన శైలి వల్ల, జంక్‌ఫుడ్, మారిన ఆహారపు అలవాట్లు, ఆహారంలో, పర్యావరణంలో మార్పులు, అధిక బరువు, వ్యాయామాలు లేక పోవడం, ఇంటర్నెట్, మీడియా, సెల్ఫోన్ల వల్ల అనేక విషయాలు లోతుగా తెలుసుకోవడం, హార్మోన్లు త్వరగా ఉత్తేజం చెందడం, వంటి అనేక కారణాల వల్ల ఇప్పుడు పిల్లలు 10–11 సంవత్సరాల నుంచే రజస్వల అవుతున్నారు. ఇంతకు ముందు కాలంలో 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల రజస్వల అయ్యేవారు. 10–11 సంవత్సరాల ఆడపిల్లలంటే అల్లారు ముద్దుగా పెరిగే వయస్సులో ఉన్నవారు. వీరికి ఈ పీరియడ్ సమయంలో న్యాప్కిన్స్ సరిగా పెట్టుకోవడం, వాటిని సరిగా పడవేయడం, జనేంద్రియాలు శుభ్రపరుచుకోవడం, శారీరక శుభ్రత వంటి పనులు చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉంటాయి. వీరితో తల్లిదండ్రులు చాలా సంయమనంతో ఉండవలసి ఉంటుంది. అన్ని విషయాలు చాలా ఓపికతో వివరించవలసి ఉంటుంది. కొందరు పిల్లల్లో మెదడులో కంతులు, ఇన్ఫెక్షన్స్, అండాశయాల్లో కంతులు, వంటి అనేక సమస్యల వల్ల 8–9 సంవత్సరాలకే రజస్వల అవ్వడం జరుగుతుంది. దీనిని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు. అలాంటప్పుడు ఒకసారి ఎండొక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు, సలహాలు తీసుకోవడం మంచిది. మేడమ్.. నాకు 22 ఏళ్లు. పెళ్లయి ఆరునెలలు అవుతోంది. నా సమస్య వల్ల నా వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడింది. నాకు కుడి బ్రెస్ట్ పెద్దదిగా, ఎడమ బ్రెస్ట్ చిన్నదిగా ఉంది. నేను మెచ్యూర్ అయినప్పుడే ఈ సమస్యను పసిగట్టి మా అమ్మ మా ఊరిలోని గైనకాలజిస్ట్ దగ్గరకు నన్ను తీసుకెళ్లింది. అదేం జబ్బు కాదని, ప్రమాదం అంతకంటే కాదని, చాలా సాధారణమైన విషయమని తేల్చారావిడ. ఏవో వ్యాయామాలు చెప్పి చేయమన్నారు. కొన్నాళ్లు చేశాను. కాని చదువు, ఇతరత్రా వ్యాపకాల్లో పడి ఎక్సర్సైజ్ మీద శ్రద్ధ పెట్టలేదు. నా సమస్యనూ పట్టించుకోలేదు. కాని ఇప్పుడదే నా కాపురాన్ని చెడగొడుతోంది. ఏం చేయమంటారు? – వినీత చీమకంటి ( ఈ మెయిల్ ద్వారా) తల్లి గర్భంలో బిడ్డ పిండంగా మొదలయ్యి అందులో అనేక అవయవాలు ఏర్పడుతూ శిశువుగా మారుతుంది. ఈ అవయవాలు ఏర్పడే సమయంలో, కొందరిలో జన్యుపరమైన కారణాలు, పర్యావరణ మార్పులు, తల్లిలో ఆహార లోపాలు, కొన్ని రకాల మందులు వాడటం వంటి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అవకతవకలు జరిగి, శిశువు శరీర నిర్మాణంలో లోపాలు జరిగి, ఒక్కొక్కరిలో ఒక్కోలాగా కొన్ని అవయవాలు సరిగా తయారు కాకపోవడం, పని తీరులో లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందులో మెదడు, గుండె లోపాలు, కాళ్లు చేతులు లేకపోవడం వంటి ఎన్నో పెద్దపెద్ద లోపాలతో పాటు చిన్న చిన్న లోపాలూ ఉండవచ్చు. అలాగే నీకు కూడా ఒక రొమ్ము పెద్దగా, ఒక రొమ్ము చిన్నగా ఏర్పడింది. వాటితో పోలిస్తే, డాక్టర్ చెప్పినట్లు నీది అసలు సమస్యే కాదు. రొమ్ముల పరిమాణంలో తేడా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి చేయగలిగింది కూడా ఏమీ లేదు (ప్లాస్టిక్ సర్జరీ తప్ప). ఇదేమీ కాపురాన్ని చెడగొట్టే సమస్య కాదు. అది అవతల మనిషి ఆలోచనా తీరులో ఉంటుంది. నీకు నువ్వు అది సమస్య అనుకుంటూ, అదేదో లోపం అని బాధపడుతుంటే, నీ భర్త దానిని నిజమే అనుకొని నిన్ను విసుక్కుంటూ, హేళన చేస్తూనే ఉంటాడు. కాబట్టి మొదట నిన్ను నువ్వు ఇదేం సమస్య కాదు, నా తప్పు కాదు అని సమర్థించుకొని తర్వాత నీ భర్తతో ప్రేమతో ఓపికతో నచ్చజెప్పడానికి ప్రయత్నించు. లేదు అంటే అతడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి డాక్టర్‌తో మాట్లాడించడం మంచిది. చిన్నగా ఉన్న రొమ్ముని, రోజూ మెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల, దానికి రక్త ప్రసరణ పెరిగి కొద్దిగా పరిమాణం పెరిగే అవకాశాలు ఉంటాయి. మాది కొత్త పెళ్లి జంట. కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు. సెక్సువల్ ఇంటిమసీ పట్ల చాలా భయపడ్తున్నాం. ఇంకా చెప్పాలంటే లిప్‌లాక్ అంటే కూడా భయంగా ఉంటోంది. కరోనా సమయంలో ఎలా ఉండాలో సలహా ఇవ్వండి ప్లీజ్... – పేరు రాయలేదు. కరోనా వైరస్ నోటి నుంచి, ముక్కు నుంచి వచ్చే ద్రవాలు. ఇంకొకరికి పాకడం వల్ల వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా కూడా ఈ వైరస్ ఒకే గదిలో ఎక్కువ సేపు ఉన్నా ఇద్దరు మనుషుల్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి చాలా వరకు వ్యాప్తి చెందుతుంది. అలాంటప్పుడు భార్యభర్తల్లో ఒకరికి కరోనా ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇంకొకరికి కచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇద్దరు బయట వాతావరణం నుంచి కరోనాకు గురికాకుండా చూసుకోడానికి ప్రయత్నాలు, జాగ్రత్తలు తీసుకోవాలి (మాస్క్, సానిటైజర్, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం వంటివి). ఈ వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టీ, మీరు ఇద్దరూ భయపడుతూ ఎంతకాలం ఉంటారు. ఒక వేళ ఒకరికి వచ్చి, లక్షణాలు తెలిసేటప్పటికే ఇంకొకరికి వైరస్ సోకి ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కలవడం అంటూ ఏమి ఉండదు, మొత్తానికే దూరంగా ఉండటం తప్ప, భయపడకుండా, ఒక వేళ కరోనా వచ్చినా, ఎక్కువగా కాంప్లికేషన్స్ లేకుండా, తగ్గిపోవడానికి మీ రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సరైన పోషక పదార్థాలు తీసుకుంటూ తగిన వ్యాయమాలు చేస్తూ సంతోషంగా ఉండండి. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
నా కాపురాన్ని నిలబెట్టండి మేడమ్
నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లవుతోంది. పెళ్లికి ఏడాది ముందు ఒవేరియన్ సిస్ట్ ఆపరేషన్ అయింది. ఈ విషయం బయటకు చెబితే పెళ్లి చెడిపోతుందేమోనని దాచిపెట్టి పెళ్లి చేశారు మావాళ్లు. పెళ్లయి ఆరేళ్లయినా పిల్లలు పుట్టకపోయేసరికి గైనకాలజిస్ట్‌కు చూపించుకోవాల్సి వచ్చింది. అక్కడ అసలు విషయం చెప్పాల్సి వచ్చింది. ఆ నిజం విన్న మా అత్తింటి వాళ్లు నాకు అందువల్లే పిల్లలు పుట్టట్లేదని, మేం వాళ్లను మోసం చేశామని నన్ను మా పుట్టింటికి పంపించేశారు. ఇది జరిగి ఎనిమిది నెలలవుతోంది. ఎంత చెప్పినా మా వారు కూడా వినట్లేదు. దయచేసి వాళ్ల సందేహానికి పత్రికాముఖంగా జవాబిచ్చి నా కాపురాన్ని నిలబెట్టండి మేడమ్. – సుచిత్ర ( ఈ మెయిల్ ద్వారా వచ్చిన ప్రశ్న). నీకు ఓవేరియన్ సిస్ట్కు ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం ఓవరీ (అండాశయం) తీసివేశారా లేదా కేవలం సిస్ట్ ఒక్కటే తొలగించి మిగతా అండాశయం ఉంచారా అనే విషయాలు తెలియవలసి ఉంది. గర్భాశయం రెండు వైపుల ఒకటి చొప్పున రెండు అండాశయాలు ఉంటాయి. ప్రతి నెలా 11–16వ రోజు లోపల ఒక అండాశయం నుంచి ఒక అండం విడుదల అవుతుంది. సాధారణంగా ఒక నెల కుడివైపు నుంచి ఒక నెల ఎడమవైపు నుంచి విడుదల అవుతాయి. ఈ అండం అండవాహికలోకి ప్రవేశిస్తుంది. ఈ అండం విడుదలయ్యే సమయంలో కలయిక వల్ల వీర్యకణాలు యోని నుంచి గర్భాశయంలోకి ప్రవేశించి దాని నుంచి ట్యూబ్‌లో ఉన్న అండంలోకి చొచ్చుకొని వెళ్లి దానిని ఫలదీకరణ చేయడం వల్ల పిండం ఏర్పడుతుంది. ఆ పిండం మరలా గర్భాశయంలోకి ప్రవేశించి, అక్కడ ఎండోమెట్రియమ్ పొరలో దానికి సరిపడా రక్త ప్రసరణ, హార్మోన్స్ ఉన్నప్పుడు, పిండం అంటుకొని గర్భం పెరగడం మొదలయ్యి మెల్లగా శిశువుగా మారుతుంది. ఇక్కడ గమనించవలసింది. అండాశయం నుంచి అండం విడుదల, ట్యూబ్స్ తెరుచుకొని ఉండటం, గర్బాశయం లోపలి పొర సరిగా పెరగడం, హార్మోన్స్ సక్రమంగా పనిచేయడం, అలాగే మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక నాణ్యత అన్నీ సరిగ్గా ఉంటేనే గర్భం వస్తుంది. నీకు ఓవేరియన్ సిస్ట్ వల్ల ఒక అండాశయం తొలగించి ఉంటే కూడా, ఇంకొక అండాశయం ఉంది కాబట్టి దాని నుంచి ప్రతి నెలా అండం విడుదలవుతుంది. మిగతా పైన చెప్పిన సమస్యలు ఏమీ లేకపోతే ఒక అండాశయం లేకపోవడం వల్ల గర్భం రాకపోవడం ఏమి ఉండదు. గర్భం రాకపోవడానికి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, ట్యూబ్ టెస్ట్ (హెచ్ఎస్జీ) అండం సాధారణంగా విడుదల అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, హార్మోన్స్ సక్రమంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయించుకొని సమస్యను బట్టి చికిత్స తీసుకుంటే గర్భం వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. అన్నింటికంటే ముందు, ఈ కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, తాగుడు, పొగ తాగుడు, వ్యసనాలు, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల మగవారిలో కూడా చాలా మందిలో శుక్రకణాల (వీర్య కణాలు) సంఖ్య బాగా తగ్గిపోవడం, కదలిక నాణ్యత సరిగా లేకపోవడం పరిశీలనకి వచ్చిన విషయం కాబట్టి ఒకసారి మీ వారికి కూడా సీమెన్ అనాలసిస్ పరీక్ష చేయించడం మంచిది. అందులో సమస్య ఉంటే దానికి తగ్గ చికిత్స తీసుకొని, గర్భం కోసం ప్రయత్నించడం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గర్భం సాధారణంగా రాకపోవడానికి ఆడవారిలో 50 శాతం కారణం అయితే, మగవారిలో లోపాలు కూడా 50 శాతం కారణం అవుతాయి. పెళ్లయిన తరువాత ఒవేరియన్ సిస్ట్ బయటపడుంటే అప్పుడైనా ఆపరేషన్ చేయించుకొని చికిత్స తీసుకునే వాళ్లు కదా. ఆరు సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు కాదంటే ఎలా? సమస్యను వాళ్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీ పెద్దవారిని, మీ అత్త తరపు వాళ్లని కూర్చోబెట్టి మాట్లాడుకొని, సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. డాక్టర్‌ను సంప్రదించి భార్య భర్త ఇద్దరు పరీక్షలు చేయించుకొని, సమస్యను బట్టి చికిత్స తీసుకొని మందుల ద్వారా, లేదా ఐయూఐ పద్ధతి, మరీ కాకుంటే ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఒకే నెలలో రెండుసార్లు!
మా అమ్మాయి వయసు పదిహేను సంవత్సరాలు. గత ఏడాది మెచ్యూర్ అయింది. పదహారు రోజుల తర్వాత రెండోసారి మెన్సస్ అయింది. అలా ఒకేనెలలో రెండుసార్లు పీరియడ్స్ వచ్చాయి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. తర్వాత మూడు నెలలకు వచ్చింది. ఆ తర్వాత బాగానే వచ్చేవి. మళ్లీ ఒకనెల రాలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాక, రెండు నెలలకు వచ్చింది. తర్వాత బాగానే వచ్చేవి. ఇప్పుడు అక్టోబర్‌లో రాలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లాలా లేదా? మా అమ్మాయి వెయిట్ 58 కేజీలు, ఎత్తు 5.3. పీరియడ్స్ సరిగా వచ్చేలా తగిన డైట్, వెయిట్ తగ్గాలా లేదా తెలియజేయండి. – ప్రసన్న పులిదిండి (ఈ మెయిల్ ద్వారా) సాధారణంగా అమ్మాయిలలో 11 నుంచి 16 సంవత్సరాల లోపల ఒక క్రమ పద్ధతిలో మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి ఊ ఏ, ఔఏ అనే హార్మోన్స్ విడుదలై అవి అండాశయాల మీద ప్రభావం చూపి, వాటి నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ విడుదలని ఉత్తేజపరచడం వల్ల గర్భాశయం నుంచి బ్లీడింగ్ అవ్వడం వల్ల పీరియడ్స్ మొదలవుతాయి. ఈ హార్మోన్స్ అన్నీ సక్రమంగా పని చేయడానికి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ఒకటి, రెండు సంవత్సరాలు పడుతుంది. అంతవరకు పీరియడ్స్ కొందరిలో సక్రమంగా రాకుండా, రెండు మూడు నెలలకొకసారి రావడం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, లేదా నెలలో రెండు సార్లు రావడం, తొందరగా రావడం వంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడున్న ఆధునిక కాలంలో మారిన ఆహారపు అలవాట్లు (జంక్ ఫుడ్), శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన మార్పుల వంటి వాటి వల్ల కూడా, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలు వంటివి ఏర్పడి హార్మోన్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా పీరియడ్స్ నెలనెలా రాకపోవచ్చు. మీ అమ్మాయి 5.3 ఎత్తుకి 47–57 కేజీల వరకు బరువు ఉండవచ్చు. తను 58 కేజీలు అంటే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి, ఆమెకు మితమైన పౌష్టికాహారం ఇవ్వవచ్చు. ఆహారంలో నూనె వస్తువులు, జంక్‌ఫుడ్ వంటివి నివారించండి. అలాగే బరువును అదుపులో ఉంచడానికి వాకింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, యోగా వంటి వ్యాయమాలు చేయించడం మంచిది. దీనివల్ల తనకి హార్మోన్లు సక్రమంగా పనిచేయడం మొదలవుతుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కొన్ని నెలలు ఆగి చూసి అయినా పీరియడ్స్ అలానే ఉంటే, తనకి ఒకసారి థైరాయిడ్ పరీక్ష, అల్ట్రాసౌండ్ పెల్విక్ స్కానింగ్ చేయించండి. వీటిలో ఏదైనా సమస్య ఉంటే దానిని బట్టి చికిత్స తీసుకోవచ్చు. డాక్టర్ గారూ మా పాపకు పదకొండేళ్లు. పాప పుట్టినప్పుడు క్లిటోరస్ బయటకు వచ్చి ఉండింది. తర్వాత అది మామూలు అయిపోతుంది అన్నారు. అయిపోయింది కూడా. కాని ఇప్పుడు మళ్లీ బయటకు పొడుచుకొచ్చింది. గైనకాలజిస్ట్‌కు చూపిస్తే సర్జరీ చేయాలన్నారు. మాకు భయంగా ఉంది. అసలు ఇదేం సమస్యో మాకు అర్థంకావట్లేదు. – పేరు, ఊరు వివరాలు ఇవ్వలేదు. జనేంద్రియాల బయట భాగంలో పైకి చిన్న బొడిపిలాగా ఉండే అవయవాన్ని క్లిటోరిస్ అంటారు. ఇందులో కండరంతో పాటు, స్పాంజ్ వంటి కణజాలం, నాడులు, రక్త నాళాలు ఎక్కువగా ఉంటాయి. దీని పెరుగుదల ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఆడవారిలో క్లిటోరిస్, మగవారిలో పెనిస్ (పురుషాంగం)లాంటి అవయవమే. అలాగే దాని పనితీరు ఉంటుంది. సాధారణంగా కూడా రజస్వల సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల పెరుగుతుంది. దాని ప్రభావం వల్ల క్లిటోరిస్ కొద్దిగా పెరిగి ముందుకు వస్తుంది. కాని మీరు చెప్పినదాన్ని బట్టి అది ఎక్కువగా పెరిగినట్లుంది. కొందరిలో పీసీఓడీ, అడ్రినల్ గ్రంథిలో ట్యూమర్లు, కుషింగ్ సిండ్రోమ్ వంటి అనేక కారణాల వల్ల టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్స్ వంటి మగవారిలో ఎక్కువగా ఉండే హార్మోన్లు, ఆడవారిలో ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల క్లిటోరిస్ పరిమాణం పెరుగుతుంది. దీనినే క్లిటోరోమెగాలి అంటారు. కొందరిలో అరుదుగా జన్యుపరమైన సమస్య వల్ల కూడా ఇలా ఉండవచ్చు. చాలా అరుదుగా బిడ్డలో ్ఠy క్రోమోజోమ్స్ ఉండి, వాటిలో జన్యుపరమైన లోపాలు ఉండి, టెస్టోస్టిరాన్ హార్మోన్ల తయారీ, పనితీరులో లోపాలు ఉంటే కూడా జనేంద్రియాలు సరిగా పెరగకుండా, బయటకు ఆడబిడ్డలాగా కనిపించి, వయసు పెరిగే కొద్ది హార్మోన్ల ప్రభావం వల్ల కూడా క్లిటోరిస్ పెద్దగా కనిపించవచ్చు. కాబట్టి మళ్లీ ఒకసారి ఎండొక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి వివరంగా అవసరమైన రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ అబ్టామిన్ స్కానింగ్, హార్మోన్ పరీక్షలు వంటి పరీక్షలు చేయించుకొని, పైన చెప్పుకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అని నిర్ధారించుకొని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. కారణాలు ఏమీ కనపడకపోతే, క్లిటోరిస్ పెద్దగా ఉండటం వల్ల, ఇబ్బంది చాలా అనిపిస్తే ఆపరేషన్‌కు వెళ్లడం మంచిది. ఈ వయసులో ఆపరేషన్ చేసినా వయసు పెరిగే కొద్ది హార్మోన్స్ ప్రభావం వల్ల మళ్లీ పెరగవచ్చు. ఇబ్బంది లేకపోతే ఇంకా కొంత కాలం ఆగి చూసి, తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
గర్భసంచి లేకుండా పిల్లలు పుడతారా?
మా అమ్మాయికి పదహేడేళ్లు. పదహారు నిండినా ఇంకా పెద్దమనిషి కాలేదని డాక్టర్ గారికి చూపిస్తే స్కానింగ్ చేయించమన్నారు. రిపోర్ట్‌లో మా అమ్మాయికి పుట్టుకతోనే గర్భసంచి లేదని వచ్చింది. మేం షాక్ అయ్యాం. మా కుటుంబంలో ఇలాంటి హెల్త్ హిస్టరీ లేదు. గర్భసంచి లేకుండా పుడ్తారా? మా పాప భవిష్యత్ తలచుకుంటే భయంగా ఉంది. పరిష్కారం చెప్పగలరు. – టి. లలిత, చెన్నై కొంత మందిలో జన్యుపరమైన సమస్యల వల్ల పుట్టుకతోనే గర్భాశయం లేకుండా జన్మిస్తారు. కొందరిలో గర్భాశయం లేకుండా, అండాశయాలు మాత్రం ఉంటాయి. అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వీరిలో 12 సంవత్సరాల సమయంలో రొమ్ములు పెరగడం, చంకల్లో, జనేంద్రియాల దగ్గర వెంట్రుకలు పెరగడం వంటి అమ్మాయి లక్షణాలు ఉంటాయి కాని గర్భాశయం ఉండదు కాబట్టి పీరియడ్స్ మాత్రం రావు. వీరిలో జన్యువులు అందరి అమ్మాయిలలానే 46్ఠ్ఠ ఉంటాయి. కొందరిలో అమ్మాయి లక్షణాలు ఉంటాయి కాని, గర్భాశయం, అండాశయం రెండూ ఉండవు. వారిలో జన్యువులు అబ్బాయిలలో లాగా 46xx ఉంటాయి. వీరిలో ఆండ్రోజన్ హార్మోన్ పనితీరులో లోపాల వల్ల మగలక్షణాలు లేకుండా ఉంటారు. మీ అమ్మాయికి క్వారియోటైపింగ్ చెయ్యించండి. అది 46xy అయితే, కొందరిలో యోని భాగం చిన్నగా ఉండవచ్చు. కొందరిలో ఉండకపోవచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో వేరొకరి గర్భాశయాన్ని తీసి, గర్భాశయం లేని వారికి అమర్చడం (యుటిరైన్ ట్రాన్స్‌ప్లాంట్ (మన దేశంలో కూడా)) జరుగుతుంది. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అని చెప్పడం కష్టం. ఆమె శరీరం దానిని రిజెక్ట్ చెయ్యకుండా తీసుకోగలుగుతుందా అనేది చెప్పలేము. అందులో నుంచి నెలనెలా పీరియడ్స్ వస్తాయా, పిల్లలు పుడుతారా అనేది కచ్చితంగా చెప్పలేము. ఖర్చుతో కూడుకున్నది. కొందరిలో పెళ్లి తర్వాత కేవలం వైవాహిక జీవితం కోసం, యోని భాగాన్ని వెజైనోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా వెడల్పు చేయడం జరుగుతుంది. వారిలో అండాశయాలు ఉంటే వాటి నుంచి అండాలను సేకరించి, సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలను కనవచ్చు. క్వారియో టైపింగ్‌లో 46xy అని వస్తే, వీరిలో పుట్టినప్పటి నుంచి అమ్మాయిలానే పెరిగి ఉంటారు కాబట్టి, వీరిలో పొత్తి కడుపులో ఉండే టెస్టిస్లను తొలగించి, యోని భాగాన్ని తయారు చెయ్యడానికి వెజైనోప్లాస్టీ ఆపరేషన్ చెయ్యడం జరుగుతుంది. సమస్య నిర్ధారణ అయిన తర్వాత, మొదట మీ పాపకు కౌన్సెలింగ్ ఇప్పించి, ఆమె మనో ధైర్యాన్ని పెంచాలి, అలాగే మీ సహకారం, మద్దతును ఆమెకు ఎల్లవేళలా ఉండేటట్లు చూసుకోవాలి. డాక్టర్‌గారూ... నాది చిత్రమైన సమస్య. డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గరకు వెళ్లలేక మీకు ఇలా రాస్తున్నాను. నాకు 52 ఏళ్లు. అయిదేళ్ల కిందటే మెనోపాజ్ వచ్చింది. అప్పటి నుంచి నా బ్రెస్ట్స్ చుట్టూ వెంట్రుకలు వచ్చాయి మొగవాళ్లలాగా. చాలా సిగ్గుగా ఉంది, కాన్సరేమోనని భయంగా ఉంది. నొప్పి దురద వంటివేమీ లేవు. – పేరు రాయలేదు, వినుకొండ. ఆడవారిలో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల వారిలో స్త్రీ లక్షణాలు ఉంటాయి. అలాగే అడ్రినల్ గ్రంథి నుంచి టెస్టోస్టిరాన్ అనే పురుష హార్మోన్ కొద్దిగా విడుదలవుతుంది. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. అప్పటి వరకు తగ్గి ఉన్న టెస్టోస్టిరాన్ హర్మోన్ ప్రభావం పెరుగుతుంది. దీని వల్ల మెనోపాజ్ దశలో 50 శాతం ఆడవారిలో ముఖం మీద, పై పెదవి పైన, గడ్డంపైన అలాగే రొమ్ముల మొన అంటే నిపుల్ చుట్టూ వెంట్రుకలు చిక్కగా, పొడవుగా పెరుగుతాయి. దాని వల్ల ఎలాంటి ప్రభావం లేదు. కాకపోతే ఈ సమస్యవల్ల సిగ్గు, మొహమాటం, ఆందోళన, ఇబ్బంది, ఆత్మనూన్యతా భావం వంటివి ఏర్పడవచ్చు. కావాలనుకుంటే రొమ్ముపైన వెంట్రుకలను ట్రిమ్మింగ్, షేవింగ్, కత్తిరించడం వంటి పద్ధతులను పాటించవచ్చు. ఈ వయసులో వెంట్రుకలు మరీ ఎక్కువగా, త్వరగా పెరుగుతుంటే, టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే సమస్యలు అంటే అడ్రినల్ గ్రంథి, ఓవేరియన్ ట్యూమర్లు, కుషింగ్స్ సిండ్రోమ్ వంటివి ఉన్నాయా అని డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయ్యించుకొని, సమస్య ఉంటే దానికి చికిత్స తీసుకోవడం మంచిది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఇలాంటి ప్రక్రియ ఉంటుందా?
మేడమ్.. మొన్న ఏదో హిందీ సినిమాలో ఓ మాట విన్నాను. ‘‘హైమన్’ రీ స్టిచ్ చేయించుకున్నప్పటి నుంచి అనుభూతిలేకుండా పోయింది’ అని. అసలు ఇలాంటి ఓ ప్రక్రియ ఉంటుందా? నా అజ్ఞానానికి మన్నించగలరు. – ప్రసన్న లక్ష్మి, సూరత్ యోనిని కప్పి ఉంచే హైమన్ పొర ఒక మెత్తని రబ్బర్ లాగా ఉండి అందులో చిన్న రంధ్రం ఉండి, దాని ద్వారా మ్యూకస్ స్రావాలు, బ్లీడింగ్ (పీరియడ్) బయటకు వస్తాయి. చాలా మందికి కలయిక తర్వాత, కొంత మందిలో అతిగా సైక్లింగ్, వ్యాయామాలు, హస్తప్రయోగం వంటి వాటివల్ల యోనిని కప్పి ఉంచే హైమన్ పొర చిరుగుతుంది. ఈ కాలంలో చాలా మంది లివింగ్ ఇన్ (సహజీవనం) రిలేషన్లో ఉంటున్నారు. తర్వాత వేరే వాళ్లను పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకొని మళ్లీ పెళ్లి చేసుకోవడం, కొంత మంది వింత కోరికలతో యోనిపైన మళ్లీ హైమన్ పొరను ఏర్పరచుకొని కొత్తదనాన్ని ఆస్వాదించాలని ఆశపడతారు. దీని కోసం వచ్చిందే హైమన్ రీస్టిచ్. ఈ మధ్య కాలంలో దీనికి బాగా ప్రాచుర్యం పెరిగింది. చాలా మంది దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పద్ధతిలో మత్తు ఇచ్చి, యోని భాగంలో చిరిగిన హైమన్ పొరని మరలా దగ్గరకు తీసి కుట్టడం జరుగుతుంది. అలా కుదరకపోతే, వారి శరీరంలో ఎక్కడ నుంచి అయినా మ్యూకస్ పొరను తీసుకొని, యోని భాగంలో అమర్చడం జరుగుతుంది. అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. (కొన్ని మతాల్లో, కొందరి సంప్రదాయాల్లో హైమన్ పొరను ఆడవారి కన్యత్వానికి ముడి పెట్టడం జరుగుతుంది.) చాలా మందికి సైక్లింగ్, ఎక్కువ వ్యాయామాలు, టాంపూన్స్ వాడకం వంటి వాటివల్ల హైమన్పొర చిరగడం జరుగుతుంది. అలాంటప్పుడు దానిని వేరేగా ఆలోచించడం, అనుమానించడం జరుగుతుంది. కొందరు ఈ సమస్య వల్ల కూడా భయంతో హైమన్ రీస్టిచ్ చేయించుకుంటారు. చాలా అరుదుగా కొందరిలో హైమన్ పొర ఉండకపోవచ్చు. మా అత్తమ్మ వయసు 60 ఏళ్లు. ఆమెకు 42వ ఏటనే మెనోపాజ్ వచ్చింది. తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు. అయితే ఎనిమిది నెలల కిందట హఠాత్తుగా వైట్ డిశ్చార్జ్ అవడం మొదలుపెట్టింది వాసన, దురదతో. హిస్ట్రెక్టమీ చేశారు. బయాప్సీ కూడా పంపారు. అంతా నార్మలే అని చెప్పారు. మెనోపాజ్ వచ్చాక పద్దెనిమిదేళ్లకు అలాంటి సమస్యలు తలెత్తుతాయా? మెనోపాజ్ అంటే అలాంటి వాటన్నిటి నుంచీ విముక్తి చెందినట్టే కదా? – సింధుజాత, మంత్రాలయం అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ఆడవారిలో 40 సంవత్సరాలు దాటిన తర్వాత మెల్లగా తగ్గిపోతూ వచ్చి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొన్ని సంవత్సరాలకు పూర్తిగా తగ్గిపోతుంది. ఆ సమయంలో పీరియడ్స్ రాకపోతే, ఆ దశను మెనోపాజ్ దశ అంటారు. మెనోపాజ్ వచ్చినంత మాత్రాన, తెల్లబట్ట అవ్వదు అని ఏమీలేదు. యోనిలో ఇన్ఫెక్షన్స్, గర్భాశయ ముఖద్వారంలో పాలిప్స్, పుండ్లు, అరుదుగా క్యాన్సర్ వంటి ఎన్నో కారణాల వల్ల మెనోపాజ్ తర్వాత ఏ వయసులోనైనా ఈ సమస్యలు రావచ్చు. ఈ దశలో యోని పొడిగా మారి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉంటే కూడా ఈ సమస్యలు రావచ్చు. కేవలం వాసన, దురదతో కూడిన వైట్ డిశ్చార్జ్ అయినంత మాత్రాన హిస్ట్రెక్టమీ అంటే గర్భాశయాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు, స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, ప్యాప్ స్మియర్ పరీక్ష ద్వారా, అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, ఇంకా ఏదైనా కారణముందా, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా అని పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకొని, కేవలం ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స తీసుకొని చూడవచ్చు. గర్భాశయంలో కంతులు, క్యాన్సర్ వంటివి నిర్ధారణ అయితేనే గర్భసంచి తొలగించవలసి ఉంటుంది. -
చాలా నొప్పిగా ఉంటోంది...
నాకు 25 ఏళ్లు. పెళ్లయి రెండేళ్లవుతోంది. ఇంకా పిల్లల్లేరు. ఈ మధ్య వెజైనా చాలా నొప్పిగా.. లాగినట్టుగా ఉంటోంది. సెక్స్ తర్వాత ఈ బాధ మరీ ఎక్కువగా ఉంటోంది. ఎందుకో అర్థం కావట్లేదు. పిల్లల కోసం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. నొప్పిగా ఉన్నప్పుడు కూర్చోలేను.. నడవలేను. అప్పుడెప్పుడో నెట్లో చదివాను.. వెజైనా క్యాన్సర్ కూడా ఉంటుందని. నాది క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే కాదు కదా? భయంగా ఉంది. నాకు వచ్చిన సమస్య ఏంటో వివరించండి. – ఎన్. పరిమళ, మందమర్రి, తెలంగాణ యోనిలో ఇన్ఫెక్షన్ వల్ల కాని, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ సమస్య ఉన్నప్పుడు గర్భాశయం కింద భాగంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నా, యోనిలో కంతులు, అరుదుగా క్యాన్సర్ ఇంకా ఎన్నో కారణాల వల్ల వెజైనాలో నొప్పి రావచ్చు. నెట్లో ఒక లక్షణం కోసం వెతికితే సవాలక్ష సమాధానాలు దొరుకుతాయి. అంతమాత్రాన అవన్నీ మనకే ఉన్నట్లు కాదు. నీకు నువ్వు అంత భయపడుతూ, ఇబ్బంది పడుతూ ఉండే దానికంటే ఒకసారి గైనకాలిజిస్ట్ను సంప్రదించి నీ సమస్యను వారికి వివరిస్తే, వారు నీకు స్పెక్యులమ్ పరీక్ష, బైమాన్యువల్ పెల్విక్ పరీక్ష చేసి, ఇంకా అవసరమనుకుంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్, ప్యాప్ స్మియర్ వంటి పరీక్షలు చేసి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని దానిని బట్టి చికిత్సను సూచిస్తారు. అలాగే పిల్లలు కలగకపోవడానికి గల కారణాలను కూడా తెలుసుకొని, దానికి కూడా సలహాలను అందజేస్తారు. సాధారణంగా యోనిలో క్యాన్సర్ ఉన్నప్పుడు తెల్లబట్ట ఎక్కువ అవ్వడం, అలానే కొద్దికొద్దిగా బ్లీడింగ్ కనిపించడంతో పాటు నువ్వు చెప్పిన లక్షణాలు కూడా కనిపిస్తాయి. కాని ఇది సాధారణంగా 50–60 సంవత్సరాలు పైబడ్డ వారిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంత చిన్న వయసులో చాలా చాలా అరుదుగా మాత్రమే వస్తుంది. కాబట్టి కంగారు పడకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించు. డాక్టర్ గారూ.. మా అబ్బాయికి పదకొండేళ్లు. ఇంటి పని పట్లే ధ్యాస ఎక్కువ. ఆడపిల్లలతోనే స్నేహం చేస్తున్నట్లూ గమనించాం. అయితే అమ్మాయిల్లా ముస్తాబు కావడం వంటివి లేవు కాని.. వాడి చెల్లెలికి జెడ వేయడం, బొట్టు కాటుక పెట్టడం వంటివి చాలా ఇష్టంగా, శ్రద్ధగా చేస్తూంటాడు. వాడి తీరుతో మా కంటి మీద కునుకుండట్లేదు. ఇప్పుడే డాక్టర్‌కు చూపించమంటారా? దీన్నెలా అర్థం చేసుకోవాలో సలహా ఇవ్వగలరు. – కొంగర భూపతి, ఆదోని మీ అబ్బాయికి ఆడపిల్లలలో ఉండే ఆలోచనా ధోరణి, ఆసక్తి వంటివి ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇంట్లో, బయట చుట్టుపక్కల ఉండే మనుషులు, వాతావరణం, పెరిగిన తీరు వంటి వాటి వల్ల కూడా ప్రభావం అయ్యి అలా ప్రవర్తిస్తుండవచ్చు. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, హార్మోన్లలో మార్పుల వల్ల కూడా ప్రవర్తనలో తేడా ఉండవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ముందుగానే ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదిస్తే, ఈ మార్పులు కేవలం మానసిక ఆలోచనలో తేడా వల్లనా లేదా ఏమైనా హార్మోన్లలో లోపాలు, జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు చేసి, అతడికి కౌన్సెలింగ్ చేసి, సమస్య ఎక్కడ ఉందో నిర్ధారణ చేసుకొని అవసరమైన చికిత్సను అందజేస్తారు. మేడమ్.. మా అమ్మాయికి పదమూడేళ్లు. నాలుగు నెలల కిందటనే మెచ్యూర్ అయింది. అయితే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఆ అమ్మాయి గొంతు కూడా మారిపోయింది. బొంగురుగా, కాస్త అబ్బాయిల గొంతులా వినిపిస్తోంది. ఎందుకో తెలియట్లేదు. ఇదేమైనా సమస్యా? టెస్ట్లేమైనా చేయించాలా? మాకు ఆందోళనగా ఉంది. దయచేసి చెప్పగలరు. – అనంతరామకృష్ణ, వేములవాడ కొందరు అమ్మాయిలలో హార్మోన్లలో తేడా వల్ల గొంతులో ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్ సమస్య, అసిడిటీ సమస్య వంటి అనేక కారణాల వల్ల గొంతు బొంగురుగా మారడం జరుగుతుంది. కొందరిలో అనేక కారణాల వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగడం వల్ల కూడా గొంతు బొంగురుపోయి మగ గొంతులాగా ఉండవచ్చు. మీ అమ్మాయి బరువు ఎంత ఉన్నది అనేది రాయలేదు. కొందరిలో అధిక బరువు వల్ల, అండాశయాల్లో నీటి బుడగలు ఉండటం, దాని వల్ల మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే ఆండ్రోజన్ హార్మోన్స్ ఆడవారిలో ఎక్కువగా విడుదలవ్వడం, వాటి ప్రభావం వల్ల అబ్బాయి గొంతులా వినిపించవచ్చు. ఒకసారి ఈఎన్టీ డాక్టర్‌ను కలసి గొంతులో సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. తర్వాత ఎండొక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి ఏ హార్మోన్ తేడా ఉందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేసి, సమస్యను బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఇదేమైనా ట్యూమారా?
నా వయస్సు 19. ఎత్తు 5.6 బరువు 42. అయితే నాకూ 5 సంవత్సరాల నుండి రొమ్ములో కొంత బాగం గట్టిగా ఉంది కదులుతూ ఉంటుంది కూడా. నేను చాలా సన్నగా ఉంటాను. నాకు ఛాతీ చిన్నగా ఉంటుంది. పీరియడ్ రెగ్యులర్‌గానే వస్తుంది కానీ, కడుపు నొప్పి ఉంటుంది. తెలిసిన డాక్టర్ని అడిగితే పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులకు పోతుంది అన్నారు. కానీ కొన్ని నెలల నుండి నొప్పి ఎక్కువగా ఉంటుంది. మసాజ్ చేయడం వల్ల కొంతకాలం ఉపశమనం లభిస్తుంది. నేను హాస్టల్లో ఉండి చదువుతున్నా. అక్కడ ఫుడ్ బాగుండదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కడుపు నొప్పి కోసం హోమియోపతి మందులు 3 నెలలు వాడాను. నా సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ఏమయినా ట్యూమర్ అయ్యే అవకాశం ఉందా?? సమస్య ఏంటో దానికి కారణం, చికిత్స తెలియచేయాలని మనవి. – శ్రీ విద్య. కరీంనగర్. నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, నీకు రొమ్ములో ఫైబ్రోఎడినోమా అనే ప్రమాదం లేని గడ్డ ఉన్నట్లు అనుమానంగా ఉంది. ఇందులో గడ్డ చేతికి తగులుతూ, రొమ్మును తాకినప్పుడు అటు ఇటూ కదులుతూ ఉంటుంది. అందులో నువ్వు సన్నగా ఉండి, ఛాతీ చిన్నగా ఉండడం వల్ల ఇది బాగా తెలుస్తున్నట్లుంది. దీని గురించి నువ్వు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఒకసారి రొమ్ము అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే గడ్డ పరిమాణం, లక్షణాలు తెలుస్తాయి. గడ్డ పరిమాణం బట్టి కొందరికి కొన్ని మందుల ద్వారా గడ్డ కరిగి దాని సైజు తగ్గుతుంది. అంతేకాని పూర్తిగా కరిగిపోతుందని చెప్పడం కష్టం. మరీ బాగా పెద్దగా ఉంటే ఆపరేషన్ ద్వారా తొలగించవలసి ఉంటుంది. పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్లో మార్పుల వల్ల బ్లీడింగ్ బయటకు వచ్చేటప్పుడు గర్భాశయ కండరాలు కుదించుకున్నట్లయి పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. దీని తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. కొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్ గడ్డలు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఇన్ఫెక్షన్లు వంటి ఎన్నో సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో, నడుములో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన స్కానింగ్ లాంటి పరీక్షలు చేయించుకొని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. సమస్య ఏమి లేకపోతే నొప్పి ఎక్కువగా ఉన్న రోజులు రోజుకు రెండు సార్లు నొప్పి నివారణ మాత్రలు వేసుకోవచ్చు. పొత్తి కడుపు మీద కొద్దిగా వేడినీటితో కాపడం పెట్టుకోవడం, కొద్దిగా మసాజ్, ప్రాణాయామం వంటి చిట్కాలు పాటించవచ్చు. నా పెళ్లయి నాలుగేళ్లవుతోంది. నా వయసు 31, మా వారి వయసు 33. పిల్లల కోసం ప్లానింగ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతోంది. కన్సీవ్ కాకపోయే సరికి డాక్టర్‌ను సంప్రదించాం. పరీక్షల్లో నా ఎగ్ కౌంట్ తక్కువగా ఉందని తేలింది. మందులతో కౌంట్ పెరుగుతుందా? ఐవీఎఫ్‌కి వెళ్లాలా? ఆ ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్ అని విన్నాను. పరిష్కారం సూచించగలరు. – ప్రతిభ, భువనేశ్వర్ సాధారణంగా తల్లి గర్భంతో ఉన్నప్పుడు పరిపక్వం కాని అండాలు 7 లక్షలు ఉంటాయి. అవి కొన్ని నశించిపోతూ బిడ్డ పుట్టేటప్పటికి 4 లక్షలు మిగులుతాయి. వీటిలో కూడా రజస్వల అయ్యేటప్పటికి ఒక్కొక్కరి శరీరతత్వం, జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల ప్రభావం వల్ల చాలా నశించిపోయి లక్ష నుంచి 1.5 లక్షలవరకు మిగులుతాయి. వీటిలో రజస్వల అయినప్పటి నుంచి ప్రతి నెలా ఒక అండం పరిపక్వత చెంది, అది విడుదల అవుతుంది. ఒక అండం పెరిగి లోపల అనేక అండాలు పెరగడానికి ప్రయత్నించి ప్రతినెలా అవి నశించిపోతూ ఉంటాయి. అలా అనేక అండాలు ఉన్నా, జీవితకాలంలో దాదాపు 400 అండాలు మాత్రమే పరిపక్వత చెంది పెరిగి విడుదలయ్యి, పిల్లలు పుట్టడానికి ఉపయోగపడతాయి. 35 సంవత్సరాలు దాటేకొద్దీ అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోవడం మొదలవుతుంది. కొందరిలో శరీరతత్వం, ఇంకా అనేక కారణాల వల్ల 30 సంవత్సరాలకే, కొందరిలో ఇంకా చిన్న వయసుకే అండాల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. యోని నుంచి చేసే ట్రాన్స్ రీజియనల్ స్కానింగ్ ద్వారా గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాల్లో అండాల సంఖ్య ఎంత ఉంది (ఎంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్) అనేది నిర్ణయించడం జరుగుతుంది. అలాగే ఏఎమ్‌హెచ్ అనే రక్త పరీక్షద్వారా ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అనేది నిర్ణయిస్తారు. కొందరిలో ఎగ్కౌంట్ తక్కువ ఉన్నా, కొంత కాలం ప్రతి నెలా అండం విడుదలవుతుంది. కొందరిలో అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు హార్మోన్ మందులు, ఇంజెక్షన్ల ద్వారా ఉన్న ఎగ్కౌంట్లో అండం పెరుగుదలకు ప్రయత్నించడం జరుగుతుంది. 40–50 శాతం మందిలో ఈ మందుల ప్రభావం వల్ల అండాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలా ప్రయత్నించినా కాని పరిస్థితిలో అండాలు పెరగడానికి చాలా ఎక్కువ మోతాదులో హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి, ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) పద్ధతి ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ పద్ధతిలో కూడా అండాలు ఎక్కువ పెరగకపోవచ్చు. అలాంటప్పుడు వేరే దాతల నుంచి అండాలను సేకరించి భర్త వీర్యకణాలను వాటిలోకి పంపి ఫలదీకరణ చేసి, తద్వారా వచ్చిన పిండాలను మీ గర్భాశయంలోకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు కంగారుపడకుండా మూడు నెలలు మందులు, ఇంజెక్షన్ల ద్వారా ప్రయత్నించి, కాకపోతే పైన చెప్పిన పద్ధతులను అనుసరించవలసి ఉంటుంది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
విపరీతమైన కడుపునొప్పి..
మా పాపకు పదమూడేళ్లు. ఏడాది కిందటే పెద్దమనిషి అయింది. నెలనెలా విపరీతమైన బ్లీడింగ్‌తోపాటు కడుపునొప్పితోనూ బాధపడుతోంది. మాకు దగ్గర్లో ఉన్న గైనకాలజిస్ట్‌కు చూపిస్తే నీటి తిత్తులున్నాయి, పాప బరువు కూడా తగ్గాలి అని చెప్పారు. మా అమ్మాయి అయిదు అడుగుల రెండు అంగుళాలుంటుంది. 55 కేజీల బరువుంది. ఓవర్ వెయిట్ కిందకే వస్తుందా? ఈ నీటితిత్తుల వల్ల ప్రమాదమా? దయచేసి వివరించగలరు. – పి. రేణుక, జన్నారం సాధారణంగా పెద్దమనిషి అయిన తర్వాత వారి మెదడు, అండాశయాల నుంచి విడుదలయ్యే హార్మోన్స్ సక్రమంగా పనిచేయడానికి కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. ఆ సమయం వరకు పీరియడ్స్ నెలనెలా సక్రమంగా రాకపోవడం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం లాంటి ఇబ్బందులను ఎదుర్కొవలసి ఉంటుంది. కొందరిలో పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి కూడా ఉంటుంది. అండాశయంలో నీటి తిత్తులు ఉండటాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. సాధారణంగా ఈ వయసులో కూడా కొందరిలో హార్మోన్ల ప్రభావం వల్ల అండాశయంలో నీటి బుడగలలాగా ఉండే ఫాలికల్స్ ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి స్కానింగ్‌లో అవి పాలిసిస్టిక్ ఓవరీస్ లాగా కనిపిస్తాయి. క్రమేణా కొందరిలో అవి మామూలు స్థాయికి వచ్చే అవకాశాలు ఉంటాయి. నీటి తిత్తులు ఎక్కువగా ఉన్నప్పుడు టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవ్వడం తద్వారా బ్లీడింగ్‌లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అలాగే వదలి వేస్తే, అవి ఇంకా పెరిగితే, అవాంచిత రోమాలు, మొటిమల లాంటి సమస్యలు వస్తాయి. వీటికి ఈ వయసులో హార్మోన్ మందులు ఇవ్వడం మంచిది కాదు. మరీ బ్లీడింగ్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే తప్పితే... సాధారణంగా సమస్యను అధిగమించి పరిస్థితిని గాడిలో పెట్టడానికి మితమైన ఆహారం తీసుకుంటూ వాకింగ్, వ్యాయమాలు, స్కిప్పింగ్, డాన్స్ లాంటివి చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల 70 శాతానికి పైగా హార్మోన్ల అసమతుల్యత తగ్గి, బ్లీడింగ్ సమస్యలు తగ్గుతాయి. మీ అమ్మాయి ఎత్తుకు తగ్గ బరువే ఉంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 22 వస్తుంది. కాకపోతే పైన∙చెప్పినట్లు వ్యాయామాలు చేయడం వల్ల ఇంకా బరువు పెరగకుండా ఉండటం, అలాగే దానివల్ల నీటి తిత్తులు ఉన్న వారిలో ఉండే హార్మోన్ అసమతుల్యత తగ్గుతుంది. పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. నేను రెండో కాన్పులో ఉన్నాను. ఆగస్ట్‌లో డ్యూ డేట్ ఉంది. తొలి కాన్పు నార్మలే. ఈ కాన్పులోనే ట్యూబెక్టమీ కూడా చేయించుకుందామను కుంటున్నాను. చేయించుకోవచ్చా? ఒకవేళ సీ సెక్షన్ చేయాల్సి వచ్చినా ట్యూబెక్టమీకి వెళ్లొచ్చా? సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందా? చెప్పగలరు. – సత్యవేణి, కనిగిరి తొలి కాన్పు నార్మలే కాబట్టి, ఈసారి కూడా 95 శాతం మందిలో సాధారణ కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. 5 శాతం మందిలో అనేక కారణాల వల్ల సిజేరియన్ ఆపరేషన్ అవసరం పడవచ్చు. ఒకవేళ ఈసారి కూడా సాధారణ కాన్పే అయితే, కాన్పు తర్వాత రోజు నుంచి ఎప్పుడైనా పొట్ట మీద చిన్నగా కోసి, పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. లేదా ఒక నెల తర్వాత అయితే ల్యాపరోస్కోపి ఆపరేషన్ ద్వారా పెద్ద కొత లేకుండా రెండు చిన్న రంధ్రాలు చేసి ల్యాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ చేయించుకోవచ్చు. ఒక వేళ ‘సీ’ సెక్షన్ చేయావలసి వస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే, ఆ ఆపరేషన్లోనే ట్యూబెక్టమీ కూడా చేయించుకోవచ్చు. ఒకేసారి పని అయిపోతుంది. కొన్నిసార్లు కాన్పు తర్వాత బిడ్డ అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా పిల్లల డాక్టర్ ఆ సమయంలో పరీక్ష చేసి చెప్పినా, 5 శాతం పిల్లల్లో ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, ఇంకా కొన్ని సమస్యలు కొన్ని రోజుల తర్వాత బయటపడే అవకాశాలు ఉంటయి. కాబట్టి రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే, ఆరు నెలలు ఆగి ట్యూబెక్టమీ చేయించుకోవడం మంచిది. మళ్లీ విడిగా ట్యూబెక్టమీ చేయించుకోవాలంటే, మళ్లీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, మళ్లీ ఖర్చు లాంటి ఇతర ఇబ్బందులు ఉంటాయి, కాని పొరపాటున 5 శాతం రిస్క్‌లో బిడ్డకు ప్రమాదం అయితే ఇది శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ కాబట్టి మళ్లీ పిల్లల కోసం ఇబ్బంది పడవలసి ఉంటుంది. బాగా ఆలోచించుకోని సరైన నిర్ణయం తీసుకోవండం మంచిది. చాలా మంది ట్యూబెక్టమీ మళ్లీ చేయించుకుందామని అనుకొని, తర్వాత అనేక కారణాల వల్ల సమయం కుదరక వాయిదా వేసుకుంటూ ఉంటారు, ఆ సమయంలో అనుకోకుండా మళ్లీ గర్భం దాల్చడం, మళ్లీ దాన్ని అబార్షన్ చేయించుకోవడం హాస్పిటల్‌కు రావడం జరుగుతుంది. కొంత మంది అబార్షన్ ఇష్టం లేక, కొంత మంది అబార్షన్‌కు భయపడి గర్భం ఉంచేసుకొని మూడో బిడ్డకు సంసిద్ధమయ్యి ఇబ్బంది పడుతుంటారు. - డా. వేనాటి శోభ హైదరాబాద్ -
నా వైఫ్ ప్రాబ్లం అదేనా?
ఇష్టం లేని పెళ్లి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సరిగా ప్రేరణ లేకపోవడం, డిప్రెషన్, ఇంట్లో ఎక్కువ పని వల్ల అలసట, రక్త హీనత, హర్మోన్లు సరిగా లేకపోవటం లాంటి ఎన్నో కారణాల వల్ల కలయికపై ఆసక్తి చూపరు. ఆ సమయంలో బిగుసుకుపోయినట్లు అవుతారు. ఇందులో నుంచి బయటపడటానికి చాలా వరకు భర్త పాత్ర, నడవడిక చాలా ముఖ్యం. మా పెళ్లయి యేడాది అవుతోంది. సెక్స్ పట్ల నా వైఫ్ చాలా అనాసక్తంగా ఉంటోంది. నేను అంటే ఇష్టం లేక కాదు. మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. చాలా కోపరేటివ్. కాని ఈ ఒక్క విషయంలోనే. నెట్లో చదివాను.. అలా సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడాన్ని ఫ్రిజిడిటీ అంటారని. నా వైఫ్ ప్రాబ్లం అదేనా? సొల్యుషన్ చెప్పగలరు. – ప్రదీప్ ఆనంద్, నాందేండ్ ఆడవారిలో కాని మగవారిలో కాని ఎన్నో మానసిక శారీరక కారణాల వల్ల కలయికపై సరిగా ఆసక్తి చూపకపోవడాన్ని సెక్సువల్ ఫ్రిజిడిటీ అంటారు. కొందరిలో కలయికపైన అనేక అపోహలు ఉండటం, నొప్పి ఎక్కువగా ఉంటుందనే భయం, ప్రెగ్నెన్సీ వస్తుందనే భయం, ఇంతకు ముందు లైంగిక వేధింపులకు గురై ఉండటం, స్నేహితుల చెడ్డ అనుభవాలు విని, అందరికి అలానే ఉంటుందనే నిర్ణయంలో ఉండటం, ఇన్ఫెక్షన్స్ వస్తాయనే భయం, భార్య భర్తకి మధ్యలో సరైన అవగాహన లేకపోవడం, ఇష్టం లేని పెళ్లి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సరిగా ప్రేరణ లేకపోవడం, డిప్రెషన్, ఇంట్లో ఎక్కువ పని వల్ల అలసట, రక్త హీనత, హర్మోన్లు సరిగా లేకపోవటం లాంటి ఎన్నో కారణాల వల్ల కలయికపై ఆసక్తి చూపరు. ఆ సమయంలో బిగుసుకుపోయినట్లు అవుతారు. ఇందులో నుంచి బయటపడటానికి చాలా వరకు భర్త పాత్ర, నడవడిక చాలా ముఖ్యం. భర్త, భార్యతో ఒక స్నేహితుడిలాగా మెలుగుతూ, ఆమె పనులలో చేదోడు వాదోడుగా ఉండటం, నెగిటివ్‌గా మాట్లాడకుండా కొద్దిగా పొగడటం, ప్రేమగా ఉండటం, మనసు విప్పి మాట్లాడటం, కలిసి సినిమాలు చూడటంలాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల వారిలో చాలా మార్పులు వస్తాయి. తర్వాత మెల్లగా శారీరకంగా దగ్గరవడం వల్ల వారిలో చాలా వరకు ఫ్రిజిడిటీ నుంచి దూరంగా ఉంచవచ్చు. వారిని ప్రేమతో ప్రేరేపించడం వల్ల వారిలో ఆసక్తి కలుగుతుంది. ఇలా చేసినా ఉపయోగం లేనప్పుడు, డాక్టర్ దగ్గర కౌన్సెలింగ్ ఇప్పించడం మంచింది. డాక్టర్ కౌన్సెలింగ్‌లో వారి మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే శారీరకంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే, వాటికి దగ్గ పరిష్కారంతో పాటు, వారి సందేహాలను నివృత్తి చేసి, భయాలను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పౌష్టిక ఆహారం, కొద్దిగా వ్యాయామాలు చేయడం, శారీరక అలసట ఎక్కువగా లేకుండా చూసుకోవడంలాంటివి కూడా కొద్దిగా దోహదపడతాయి. మా అమ్మాయికిప్పుడు ఇరవై ఏళ్లు. ఆటిజం చైల్డ్. ఒక పెళ్లి సంబంధం వచ్చింది. చేయొచ్చా? ఒకవేళ పెళ్లి చేస్తే తనకూ అలాంటి సమస్యలున్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉందా? – కృష్ణకుమారి, నిర్మల్ ఆటిజం అనేది మానసిక వ్యాధి, పుట్టుకతోనే వస్తుంది. ఇందులో పిల్లలు చూడటాని మామూలుగానే ఉంటారు. కానీ వీరి మానసిక పెరుగుదల సరిగా ఉండదు. వినికిడి లోపాలు, మాట్లాడే విధానంలో లోపాలు, ఏకాగ్రత లేకపోవడంలాంటి అనేక సమస్యలు ఉండవచ్చు. కొందరిలో కొద్దిగా ఉంటాయి, కొందరిలో ఎక్కువగా ఉండొచ్చు. చాలా మందిలో జన్యుపరమైన కారణాల వల్ల, కొందరిలో కాన్పులో ఇబ్బందుల వల్ల, తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్, పౌష్టికాహారా లోపం, రక్త ప్రసరణలో లోపాల వల్ల ఆటిజమ్ సమస్య రావచ్చు. మీ అమ్మాయికి ఆటిజమ్ ఏ కారణాల వల్ల వచ్చింది అనేదానిపైన అంచనా వెయ్యవచ్చు. ఒక వేళ జన్యుపరమైన కారణాల వల్ల వచ్చి ఉంటే, పుట్టబోయే బిడ్డలో కూడా ఆటిజమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పనిసరిగా రావాలని ఏమీలేదు. ఒకసారి మీ అమ్మాయికి జెనిటిక్ కౌన్సిలింగ్ చేయించండి. వీరికి పెళ్లి చేయకూడదు అని ఏమీలేదు. పెళ్లి తర్వాత ఎక్కువ సమస్యలు రాకుండా ఉండాలంటే, చేసుకునేవారికి, వారి కుటుంబ సభ్యులకు ఆటిజమ్ ఉన్న విషయం దాచిపెట్టకుండా చెప్పాలి. వారు దానిని అర్థం చేసుకుని, ఓపికతో మీ అమ్మాయితో మెలగవలసి ఉంటుంది. డా.వేనాటి శోభ, హైదరాబాద్ -
సేఫ్ మెథడ్స్ ఏమిటి?
లాస్ట్ డిసెంబర్లో మా పెళ్లయింది. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. ఫ్యామిలీ ప్లానింగ్‌కి మా ఇద్దరికీ ఉన్న సేఫ్ మెథడ్స్ చెప్తారా? వాటి వల్ల ఏమైనా దుష్ప్రభావాలుంటే కూడా చెప్పండి ప్లీజ్.. – గ్రీష్మ, కదిరి కొత్తగా పెళ్లయ్యి ఇప్పుడే పిల్లలు వద్దనకున్నప్పుడు, అనేక పద్ధతులు ఉంటాయి. ఏ పద్ధతి పాటించినా కూడా అది వందశాంతం ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటుంది అని చెప్పలేం. ఒక్కొక్క పద్ధతిని బట్ట 5 శాతం నుంచి 30 శాతం వరకు ఫెయిలయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన పద్ధతిలో పాటిస్తే ఫెయిలయ్యే అవకాశాలు కొద్దిగా తగ్గుతాయి. కలయిక సమయంలో మగవారు కండోమ్స్ వాడటం ఒక గర్భ నిరోధక పద్ధతి. ఇవి వాడటం వల్ల గర్భం రాకుండా ఉండటంతో పాటు, కొన్ని లైంగిక వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరి రాకుండా చాలా వరకు అడ్డుకుంటుంది. కొన్నిసార్లు కండోమ్స్ జారిపోవడం, చిరగడం లాంటి సమస్యల వల్ల ప్నెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరిలో కండోమ్స్ తయారీలో వాడే ల్యాటెక్స్ పడకపోవడం అలర్జీ వల్ల జనేంద్రియాల దగ్గర మంట, రాష్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెల నెలా పీరియడ్స్ సక్రమంగా వచ్చే వారిలో పీరియడ్ మొదలయిన 10వ రోజు నుంచి 16 రోజుల లోపల అండం విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి 9వ రోజు నుంచి 18వ రోజు వరకు కలవకుండా ఉండాలి. లేదా ఈ రోజులలో జాగ్రత్తగా కండోమ్స్ వాడుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనినే సేఫ్ పీరియడ్ మెథడ్ అంటారు. ఈ పద్ధతిలో కూడా ఫెయిలయ్చే అవకాశాలు ఉంటాయి. పీరియడ్స్ సక్రమంగా రాని వారిలో ఈ పద్ధతిని అనుసరించడం కుదరదు. ఎందుకంటే వీరిలో అండం విడుదల ఎప్పుడు అవుతుందో చెప్పడం కష్టం. సాధారణంగా గర్భం రాకుండా ఉండటానికి గర్భనిరోధక మాత్రలు వాడుతూ ఉంటారు. వీటినే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారు. వీటిలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హర్మోన్లు అనేక మోతాదుల్లో ఉంటాయి. వీటిని ప్రతినెలా మూడోవ రోజు నుంచి మొదలు పెట్టి రోజుకు ఒకటి చొప్పున 21వ రోజు వరకు మింగవలసి ఉంటుంది. వీటిని సరిగా గుర్తుంచుకొని అదే పనిగా, రోజు ఒకే సమయానికి మర్చిపోకుండా వేసుకోవాలి. మొదలు పెట్టిన తర్వాత రోజు కలయిక ఉన్నా లేకపోయినా పూర్తిగా మాత్రల ప్యాకెట్ అయిపోయేవరకు వేసుకోవలసి ఉంటుంది. కొందరిలో వీటి వల్ల వికారంగా, తల తిరుగుడు, వాంతులు, తలనొప్పి, బరువు పెరగడం లాంటి సమస్యలు ఉండవచ్చు. అలాంటి వారు డాక్టర్ పర్యవేక్షణలో పిల్స్ వాడి చూడవచ్చు. అతి తక్కువ మందిలో వారి శరీరతత్వాన్ని బట్టి, ఫ్యామిలీ హిస్టరీని బట్టి దీర్ఘకాలం వాడటం వల్ల, రక్తం గడ్డకట్టడం, లివర్సమస్యల లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంక హార్మోన్ ఇంజెక్షన్లు, కాపర్టీ లాంటివి ఎక్కువ మటుకు ఒక కాన్పు తర్వాత ఇంకొక బిడ్డ ఇప్పుడే వద్దు అనుకున్నప్పుడు వాడమని సలహా ఇస్తారు. ఒకసారి మీరిద్దరూ గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే వారు మీ శరీరతత్వాన్ని బట్టి పీరియడ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని, సలహా ఇస్తారు. మా పెళ్లయి పదేళ్లవుతోంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ను. నాలగవ నెల. అయితే ఆర్థికంగా నిలదొక్కుకొనేదాకా పిల్లలు వద్దని ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నాం ఇన్నాళ్లు. కొన్నాళ్లు నేను కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడాను, కొన్నాళ్లు మావారు కండోమ్ వాడారు. నేను కన్సీవ్ అయ్యే వరకు కూడా నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు కూడా లోపల బిడ్డ బాగానే ఉందని చెప్పారు డాక్టర్. అయితే నెలలు పెరిగే కొద్ది ఏమైనా సమస్యలు రావచ్చా .. చెప్పండి ప్లీజ్.. – మైథిలి, హైదరాబాద్ మీ వయసు, బరువు ఎంత ఉందో రాయలేదు. ముందు కాంట్రాసెప్టివ్ పిల్స్, కండోమ్స్ వాడటం వల్ల బిడ్డకు, మీకు ఇప్పుడు సమస్యలేవీ రావు. మీ వయస్సు ఎక్కువగా ఉంటే, కొన్నిసార్లు బిడ్డలో అవయవ లోపాలు ఉండే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. గర్భం పెరిగేకొద్దీ 7 నెలల తర్వాత బీపీ, షుగర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఐదవ నెల చివరిలో టిఫా స్కాన్ చెయించుకోండి. అందులో బిడ్డలో ఏమైనా అవయలోపాలు ఉన్నాయా లేదా, బిడ్డ అంతా బాగానే ఉందా అనే విషయాలు తెలుస్తాయి. మీరు కూడా నెలనెలా డాక్టర్ దగ్గర చెకప్‌లకు వెళ్లండి. వారు రాసిన ఐరన్, కాల్షియం మందులు వాడుతూ, సరైన పోషకాహారం తీసుకుంటూ, డాక్టర్ సలహా మేరకు నడక లాంటి వ్యాయమాలు చేస్తూ ఉండటం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. నెలలు పెరిగే కొద్దీ, మీకే కాదు ఎవరికైనా కూడా కాన్పు అయ్యేవరకు వాళ్లవాళ్ల శరీరతత్వాన్ని బట్టి ఏదైనా సమస్య వస్తుందా రాదా అని ముందే కచ్చితంగా చెప్పడం కష్టం. - డా. వేనాటి శోభ హైదరాబాద్ -
కాన్పూ కష్టమే!
సాక్షి, హైదరాబాద్: నిండు చూలాలి దయనీయతను ప్రభుత్వాస్పత్రుల్లో చూడాలి! పురిటినొప్పులతో వస్తున్న గర్భిణులకు ఎంత కష్టం.. ఎంత నష్టం! కడుపు పండిందని వస్తే.. వైద్యుల వైఖరి చూస్తే వారికి కడుపుమండుతోంది!. ప్రసవ వేదన తప్పడం లేదు. ప్రతిష్టాత్మక పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిసహా మలక్‌పేట్, కొండాపూర్, సూరజ్‌భాను ఏరియా ఆస్పత్రుల్లో ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆయా ఆస్పత్రులకు వచ్చినవారిని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే వారికి చేదు అనుభవమే ఎదురవుతోంది. వైద్యుల నిష్పత్తికి మించి గర్భిణులు వస్తుండటంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. తాజాగా శుక్రవారం పలువురు గర్భిణులు ఇదే అంశంపై ఆందోళనకు దిగడం గమనార్హం. గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో ఆరు యూనిట్లు ఉండగా, కోవిడ్ బారిన పడిన గర్భిణులకు చికిత్స అందించేందుకు రెండు యూనిట్లను కేటాయించారు. మిగిలిన నాలుగు యూనిట్లను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి సెంటర్‌కు మార్చారు. కింగ్ కోఠిలోని గైనకాలజీ విభాగాన్ని కూడా ఇక్కడికే మార్చారు. పేట్లబురుజు ఆస్పత్రిలోని సీనియర్ వైద్యులు సహా పీజీలు, ఇతర పారామెడికల్ స్టాఫ్ ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆ ఆస్పత్రిలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు సహా పలు సేవలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో గర్భిణులు సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి క్యూ కట్టారు. (కరోనా కేళి.. జేబులు ఖాళీ!) గర్భిణులను చేర్చుకోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి నగర శివారు ప్రాంతాల్లో కాకుండా జిల్లాల నుంచి వచ్చే గర్భిణులు, వారి సంబంధీకులు శుక్రవారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. కొత్తగా వచ్చే గర్భిణులకు వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరిస్తుండడంతో వైద్యులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం తెలుసుకున్న స్థానిక సుల్తాన్‌బజార్ పోలీసులు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. వివిధ ఆసుపత్రుల నుంచి వందల సంఖ్యల్లో కేసులు వస్తుండడంతో తమపై పనిభారం అధికమవుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 9 నెలలు నిండిన గర్భిణులకు మాత్రమే ఇక్కడ వైద్యం చేస్తున్నారు. కొత్తగా వచ్చినవారికి మాతా శిశు సంరక్షణ కార్డు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో ఆందోళన మొదలైంది. ఏ ప్రసూతి ఆస్పత్రిలో ఎంతమంది? పాతబస్తీ శాలిబండ ప్రభుత్వ సూరజ్‌భాను ప్రసూతి ఆస్పత్రిలో ఇప్పటి వరకు 17 మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. ఇక్కడ రోజుకు సగటున రెండు, మూడు ప్రసవాలు జరుగుతుంటాయి. సిబ్బంది అంతా వైరస్ బారిన పడటంతో సాధారణ చెకప్‌లకు వచ్చే కొత్త గర్భిణులకు సేవలు నిలిపివేశారు. ఇప్పటికే కార్డు ఉన్నవారికి మాత్రమే ఇక్కడ చికిత్సలు అందిస్తున్నారు. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇప్పటి వరకు 32 మంది వైద్యులు, పీజీలు, ఇతర సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అక్కడ కొత్త ఓపీ రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. గతంలో రోజుకు సగటున 50 నుంచి 60 ప్రసవాలు జరిగేవి. ప్రస్తుతం ఇక్కడ 10 నుంచి 15 ప్రసవాలే జరుగుతున్నాయి. మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో సుమారు పదిహేను మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. ఆస్పత్రిలో ఏడుగురు గైనకాలజిస్టులు ఉండగా వీరిలో నలుగురు వైరస్‌తో బాధపడుతున్నారు. దీంతో గైనికి ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఇప్పటికే డెలివరీకి డేట్ ఇచ్చిన గర్భిణులను మాత్రమే చేర్చుకుంటున్నారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో పదిహేను మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకడంతో ఓపీ సేవలను నిలిపివేసి సుల్తాన్ బజార్ ప్రసూతి కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు. సరూర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యురాలు ఇప్పటికే కోవిడ్ బారిన పడ్డారు. ఇక్కడ గర్భిణులకే కాదు సాధారణ రోగులకు కూడా చికిత్స అందని దుస్థితి నెలకొంది. చిన్న, చిన్న సాకులు చెప్పి పంపించి వేస్తున్నారు నగర శివారు ప్రాంతమైన కొంగర కలాన్ నుంచి ఎంతో అవస్థలు పడి సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చాను. వైద్యులు నాకు రక్తం లేదని చిన్న చిన్న కారణాలు చెప్పి పంపించి వేస్తున్నారు. కొత్త కార్డులు సైతం ఇవ్వడం లేదు. ఆసుపత్రి వైద్యులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలి. – దివ్య (కొంగర కలాన్) ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు చేసుకోలేం మాది చాలా పేద కుటుంబం కాన్పు కోసం లక్షల రూపాయలు పెట్టి ప్రవేటు ఆసుపత్రుల్లో కాన్పు చేసుకునే స్తోమత లేదు. అందుకని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వస్తే ఇక్కడి వైద్యులు సైతం వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వైద్యులపై చర్యలు తీసుకోవాలి. –యాదమ్మ (వనస్థలిపురం) -
పిండ గండాలు దాటేద్దాం
గర్భధారణ, ప్రసవాలకు సంబంధించి ఆబ్స్టెట్రిక్స్; స్త్రీ వ్యాధులకు సంబంధించి గైనకాలజీ విభాగాలు వైద్యశాస్త్రంలో అందరికీ తెలుసు. గర్భిణులకు, గర్భస్థ శిశువులకు సంబంధించి రాబోయే ఎలాంటి ముప్పులనైనా గర్భస్థ స్థాయిలోనే పరిశోధించి, వైద్యం అందించగల అత్యాధునిక వైద్య విభాగంగా ‘‘మెటర్నల్ ఫీటల్ మెడిసిన్’’ ఇటీవల బాగా అభివృద్ధి చెందుతోంది.దీనికి సంబంధించిన ‘ఫీటల్ మెడిసిన్ ఫౌండేషన్’ అనే సంస్థ లండన్‌లో కైపోస్ నికొలాయిడ్స్ అధ్యక్షతన పరిశోధనలు జరుపుతోంది. క్రోమోజోముల నిర్మాణాత్మక అసాధారణతల స్క్రీనింగ్ తదితర ఆధునిక ఫీటల్ సర్జరీలను వీరు ప్రవేశపెట్టారు.ఇదే విభాగంలో ‘ఎన్యుప్లోయిడీస్’ అంటే క్రోమోజోముల సంఖ్యలో మార్పులు తెలుసుకోవడం కోసం చేసే స్క్రీనింగ్ పరీక్షలతోపాటు అధునాతన పరిశోధనల్లో ఎలాంటి విశ్లేషణ చేయాలనే అంశంపై ఈ వ్యాస రచయిత్రి / డాక్టర్ ప్రప్రథమంగా భారతదేశంలో చేసిన పరిశోధనలను ఫీటల్ మెడిసిన్ ఫౌండేషన్, లండన్ అంగీకరించింది. గర్భిణులు ముఖ్యంగా చేయించుకోవలసిన టెస్ట్‌లు మౌలికమైన స్కానింగ్‌ల గురించిన అవగాహన కోసం ఈ వ్యాసం. ♦ గర్భిణులకు చేయాల్సిన ముఖ్య పరీక్షలేమిటి? గర్భం ధరించిన 6 నుంచి 8 వారాల మధ్య మొట్టమొదట పిండపరిమాణం, గుండె కొట్టుకోవడం, గర్భం వయస్సు వంటివి నిర్ధారణ చేయడానికి మొదటి స్కాన్ నిర్వహిస్తారు. తరవాత చెయ్యవలసినవి ఎన్.టి స్కాన్, ఎనోమలి స్కాన్, పెరుగుదల స్కాన్. ♦ ఎన్.టి స్కాన్ అంటే ఏమిటి? గర్భస్థ శిశువులో ఎదుగుదలతో పాటు క్రోమోజోముల అసాధారణత వల్ల వచ్చే ప్రమాదమేదైనా ఉందేమో పరిశీలించడానికి చేసే ప్రత్యేక స్కాన్ ఈ ఎన్.టి. స్కాన్. ఇది గర్భస్థ శిశువు వయస్సు 11 నుంచి 13.6 వారాల సమయంలో లేదా శిశువు 45 నుంచి 84 మిల్లి మీటర్ల పొడవు ఉండే సమయంలో నిర్వహిస్తారు. ‘ఎన్యుప్లోయిడీస్’ అంటే క్రోమోజోముల సంఖ్యలోని మార్పులు, అవయవలోపాలు ప్రాథమికంగా పరిశీలించడానికి అందరు గర్భిణులు చేయించుకోవలసిన స్కానింగ్ ఇది. ♦ ఎన్యూప్లాయిడ్ అంటే ఏమిటి? గర్భస్థ శిశువులో క్రోమోజోముల సంఖ్య ఉండాల్సిన దాని కన్నా అసాధారణంగా ఉండడమే ఎన్యూప్లాయిడ్. శిశువుకు తల్లిదండ్రుల లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయి. తల్లినుంచి 23, తండ్రినుంచి 23, క్రోమోజోముల చొప్పున మొత్తం 46 క్రోమోజోములు బిడ్డకు జన్యుపరంగా బదిలీ అవుతాయి. ఈ విధంగా మానవకణంలో 23 జతలు అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. సాధారణంగా బిడ్డ పెరుగుదల బాగానే ఉంటుంది. కానీ తక్కువ సందర్భాలలో చెప్పకోదగ్గ సమస్యలు ఉంటాయి. ఇవి నిర్మాణాత్మక లోపాలు గానీ, జన్యువులు, క్రోమోజోములలోని అసాధారణత వల్ల కానీ కావచ్చు. అవయవ లోపాలు స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ క్రోమోజోములు, జన్యుపరమైన సమస్యలు మామూలు స్కానింగ్ ద్వారా మాత్రమే తెలియవు. ఎనోప్లాయిడీస్ లోని ఎక్కువ, తక్కువ ప్రమాద సూచికలు స్క్రీనింగ్ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. అలా తెలిసేవానిలో ఒకటి ‘డౌన్స్ సిండ్రోవ్‌ు’. ♦ డౌన్స్ సిండ్రోవ్‌ు అంటే ఏమిటి? డౌన్స్ సిండ్రోమ్‌నే ట్రైసోమి 21 అని అంటారు. ఇది క్రోమోజోముల అసాధారణతకు సంబంధించినది. దీనిలో 21వ నెంబరు క్రోమోజోవ్ుపైన ఒక అదనపు క్రోమోజోవ్‌ు ఉంటుంది. దీని వల్ల పిల్లలు ఏ విషయాన్నీ నేర్చుకోలేని మానసిక బలహీనతకు తీవ్రంగా గురవుతారు. ఈ డౌన్స్ సిండ్రోవ్‌ు వ్యాధికి చికిత్సలేదు. ఈ డౌన్స్ సిండ్రోవ్ుతో బిడ్డ పుట్టే ముప్పు తల్లి వయస్సు పెరిగే కొద్ది ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు: 20 సంవత్సరాల వయస్సు స్త్రీలో ఈ అవకాశం 1140 మందిలో ఒకరికి, 30 ఏళ్ళ స్త్రీలలో 720 మందిలో ఒకరికి, 40 ఏళ్ళ వారిలో 65 మందిలో ఒకరికి ఈ ముప్పు ఉంటుంది. ∙డౌన్స్ సిండ్రోవ్‌ు ముందుగానే తెలుసుకోవటానికి స్క్రీనింగ్ పరీక్షలు, రోగ నిర్ధారణ పరిక్షలు ఏమిటి? గర్భస్థ శిశువులో డౌన్స్ సిండ్రోవ్‌ు, ఇతర క్రోమోజోముల సమస్యలు తెలుసుకునేందుకు, గర్భ ప్రారంభ దశలోనే రెండు రకాల పరీక్షలు చేయవచ్చు. అవి తల్లి రక్తపరీక్ష, స్కానింగ్. అందరు గర్భిణులకు ఏదైనా అధికముప్పు (రిస్క్) తెలుసుకోవటానికి చేసేది స్క్రీనింగ్ పరిక్ష. ఈ స్క్రీనింగ్ పరీక్షలో అధిక ముప్పు కనబడితే తదుపరి ఆమ్నియో సెంటసిన్, కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ వంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ♦ కంబైండ్ పరీక్ష లేదా మొదటి త్రైమాసిక స్క్రీనింగ్ అంటే ఏమిటి? కంబైండ్ పరీక్ష అనే స్క్రీనింగ్ పరీక్ష క్రోమోజోవ్ుల అసాధారణత ఉంటే చాల వరకు నిర్ధారిస్తుంది. ఎన్.టి పరీక్ష చేసే రోజే గర్భవతి రక్తనమూనాలు తీసుకొని అందరు గర్భిణులలోను వుండే పిఎపిపి/ఎ, బేటా.హెచ్.సి.జీ అనే రెండు పదార్ధాల పరిశీలన చేయాలి. వీటిలో అసాధారణ స్థాయి కనిపిస్తే బిడ్డలో క్రోమోజోముల సమస్య, ముప్పు వున్నట్టు గుర్తించవచ్చు. ఈ రెండు పరీక్షల ఫలితాలను తల్లి వయస్సుతో సహా కంప్యూటర్‌కు అందజేస్తారు. దాని విశ్లేషణలో బిడ్డకు డౌన్స్ సిండ్రోవ్‌ు, ఇతర అసాధారణ ముప్పులైన ట్రైజోమీ 18,13 వంటివి వుంటే తెలుస్తాయి. ఈ టెస్ట్‌ల ఫలితాలు తదుపరి ఎటువంటి పరీక్షలు చెయ్యాలో నిర్ణయించటానికి ఉపయోగపడతాయి. గర్భస్థ దశ ప్రారంభంలో చేసే ఈ కంబైండ్ పరీక్ష వలన కడుపులోని బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేకుండా క్రోమోజోముల సమస్య, వాటి వలన ముప్పు గుర్తించవచ్చు. ♦ ఒకవేళ పరీక్షలో హైరిస్క్ ఉన్నట్టు తెలిస్తే ఏం చేయాలి? స్క్రీనింగ్ టెస్ట్‌లో హైరిస్క్ ఉన్నట్లు తెలిస్తే అది క్రోమోజోముల సమస్య బిడ్డకు ఉందని తెలియ చేసే సూచన మాత్రమే. బిడ్డ మామూలు గానే ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. ♦ దీనిని ఎలా నిర్ధారణ చేయగలం? ఆమ్నియోసెంటసిస్, కోరియోనిక్ విల్లస్శాంప్లింగ్ అనే రెండు పరీక్షల ద్వారా బిడ్డ డి.ఎన్.ఎ. ని క్రోమోజోముల సమస్య కోసం పరీక్షించి నిర్ధారించ వచ్చు. ♦ ఆమ్నియోసెంటసిస్ అంటే ఏమిటి? బిడ్డ చుట్టూ ద్రవంగా వుండే ఉమ్మనీరులో (ఆమ్నియోటిక్ ప్లూయిడ్) డి.ఎన్.ఎ. వుంటుంది. అల్ట్రా సౌండ్ ద్వారా గమనిస్తూ కడుపు పైనుంచి గర్భంలోకి సూదిని ప్రవేశపెట్టి తద్వారా కొద్దిపాటి ఉమ్మనీరు, సిరెంజ్ద్వారా తీసుకుంటారు. దానిని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపుతారు. ఈ పరీక్ష గర్భధారణ తరువాత 15 నుంచి 24 వారాల మధ్య చేయవచ్చు. ఈ పరీక్ష కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. పరగడుపుతో ఉండనక్కరలేదు. రోజులో ఎప్పుడైనా చేయవచ్చు. పరీక్ష అయ్యాక కొన్ని గంటలు పరిశీలనలో ఉంచి ఇంటికి పంపివేస్తారు. దీనివలన ఇన్ఫెక్షన్, గర్భస్రావాలకు అవకాశం ఉండచ్చు ఇదివరకు గర్భస్రావ అవకాశం ఒకశాతం ఉండేది, కాని ఇప్పుడు అది కూడా 0.1% కి తగ్గిపోయింది. (అంటే ప్రతి వందమందిలో ఒకరి నుంచి ప్రతి 1000 మందిలో ఒకరికి తగ్గిపోయింది). ♦ కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ (సి.వి.ఎస్.) అంటే ఏమిటి? కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్‌లో పరీక్ష కోసం మాయ (ప్లాసెంటా) నుంచి చిన్న శాంపిల్‌ని తీసుకుంటారు. గర్భధారణ అనంతరం 11 నుండి 14 వారాల మధ్య ఇది చేయవచ్చు. ఆమ్నియోసెంటసిస్లో లానే కొంచెం పెద్దసూది వాడుతూ అల్ట్రాసౌండ్ సహాయంతో గర్భంలోని మాయ (ప్లాసెంటా) నుంచి చిన్న శాంపిల్ తీసుకొని దానిని పరీక్షకోసం లేబ్‌కు పంపుతారు. గర్భస్ధ దశ ప్రారంభంలోనే ఈ పరీక్ష చేయగలగడం ఇందులోని ఒక ఉపయోగం. కానీ ఆమ్నియోసెంటసిస్తో పోలిస్తే ఇది కొంచెం కష్టం. దానితోపాటు గర్భస్రావ ప్రమాదం కేవలం 0.2% ఉంటుంది. ♦ ఒకవేళ ఈ కంబైండ్ పరీక్షలు చేయించక పోతే ఎలా? ఒకవేళ ఎన్.టి స్కాన్ కానీ, కంబైండ్ పరీక్ష కానీ చేయించకుంటే వాటి తదుపరి స్థాయిలో ‘క్వాడ్రుపుల్’ పరీక్ష చేయించవచ్చు. ఇది సాధారణంగా 16 నుంచి 22 వారాల వయస్సులో అంటే బిడ్డ తల కొలత (బై పెరైటల్ డయామీటర్) స్కానింగ్‌లో 30 నుంచి 52 మి.మీ వున్నట్టు నిర్ధారించుకున్న తర్వాత చేస్తారు. ♦ ‘ట్రిపుల్ మార్కర్’ పరీక్ష అంటే ఏమిటి? కంబైండ్ పరీక్ష, క్వాడ్రుపుల్ పరీక్షలతో పోలిస్తే ఈ ట్రిపుల్ మార్కర్ పరీక్షలో నిర్ధారణ రేటు సరిగా లేనందున దీనిని ప్రస్తుతం చేయడం లేదు. ఈ రెండు పరీక్షలతో పోలిస్తే పాత పరీక్షలలో తప్పుడు పాజిటివ్ ఫలితాలు కూడా ఎక్కువ. ♦ ‘ఫాల్స్ పాజిటివ్’ అంటే ఏమిటి? బిడ్డలో ఎలాంటి క్రోమోజోముల సమస్య లేకుండా అంతా సవ్యంగా ఉన్నప్పుడు పరీక్షలలో లోపాలు ఉన్నట్లు ఫలితాలు వస్తే దానిని ‘‘ఫాల్స్ పాజిటివ్’’ అని అంటారు. సాధారణంగా అన్ని స్క్రీనింగ్ టెస్ట్‌లలోను తప్పుడు పాజిటివ్ ఫలితాలు అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అవి 5% లోపే ఉండాలి. కాని ప్రస్తుతం ఈ రచయిత్రి / డాక్టర్ చేసిన పరిశోధనలలో తప్పుడు పాజిటివ్ ఫలితాల రేటు చాలా ఎక్కువగా వున్నట్టు, చాలా మందికి అధిక ముప్పు ఉన్న రిపోర్ట్లు వచ్చినట్లు నమోదయ్యింది. కానీ ఆమ్నియోసెంటసిస్, కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ పరీక్షల తర్వాత అంతా సవ్యంగానే ఉన్నట్టు తెలిసింది. ఉదాహరణకు ఈ పరిశోధనలో స్క్రీనింగ్ పరీక్షలలో 101 మంది గర్భిణులకు అధిక రిస్క్ ఉన్నట్టు వస్తే నిర్ధారణ కోసం చేసిన ఆమ్నియో సెంటసిస్లో అన్ని రిపోర్ట్లు ఎలాంటి సమస్య లేనట్టు వచ్చింది. వీటిలో సరిగ్గా చేస్తే 85% మంది తల్లులు ఆమ్నియో సెంటసిస్కు వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ♦ దీనిని ఏవిధంగా సరిచేయగలం? 6 నుంచి 8 వారాల మధ్య ప్రాధమికంగా, తొలి గర్భిణి (ఎర్లీప్రెగ్నెన్సీ) స్కానింగ్ చేయించాలి. ఎన్.టి స్కాన్ పరీక్ష చిత్రాల వివరాలను సోనోగ్రాఫర్ లేబ్‌కు సమర్పించినప్పుడే లేబ్లో వాటిని పరీక్షించి ముప్పు అవకాశాలను లెక్కకట్టాలి. లేబరేటరీలలో ఎప్పటికప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, అత్యుత్తమ ప్రమాణాలను పాటించాలి. లేబరేటరీలలో ‘ఫీటల్ మెడిసిన్ ఫౌండేషన్’ ఆమోదించిన సాఫ్ట్వేర్లనే వాడాలి. తప్పులు ఎక్కువగా వస్తున్న ‘ట్రిపుల్ మార్కర్’ పరీక్షలు వంటివి చేయకూడదు. స్కానింగ్ పరీక్షల కోసం ఇతర వైద్య అవసరాల కోసం గానీ గర్భిణులు, కొందరు ఆధార్ కార్డులో వున్నట్టు అధిక వయస్సు ఇవ్వడం వలన తప్పుడు రిపోర్ట్లు రావచ్చు. ♦ ‘‘ఎన్ ఐ ఫి టి’’ అంటే ఏమిటి? ఎన్ ఐ పిటి అంటే నాన్ఇన్వేజివ్ ప్రీనేటల్ పరీక్ష. ఇందులో ఆమ్నియోసెంటసిన్, కొరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ వంటి వాటి వల్ల ముప్పు లేకుండా కేవలం తల్లినుండి రక్తం మాత్రం తీసి పరీక్షించటం జరుగుతుంది. ఇది 9 వారాల గర్భం నుంచి తక్కువ ముప్పు (రిస్క్) గల స్త్రీలలో చేసి చక్కని నిర్ధారణ రేటుతో ఫలితం ఇవ్వవచ్చు. కంబైండ్ పరీక్ష, క్యాడ్రుపుల్ టెస్ట్‌లతో పోలిస్తే నిర్ధారణ ఖచ్చితత్వం 99.6%. అయితే ఇది చాలా ఖరీదైన పరీక్ష. అందుచేత ముప్పు ఎక్కువ ఉండే వయస్సు గల 35 ఏళ్ళ పైబడినవారికి చేస్తారు. అలాగే స్క్రీనింగ్ పరీక్షలో హైరిస్క్ కాకుండా లోరిస్క్ కాకుండా, మధ్యస్థమైన రిస్క్ రావచ్చు. వీళ్ళు కూడా ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవాలంటే అప్పుడు ఎన్.ఐ.పి.టి. చేయించుకోవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో అధిక ముప్పు వున్నట్లు తెలిస్తే అధిక నిర్ధారణ కోసం మళ్ళీ, ఆమ్నియో సెంటసిస్ లేదా సిబీఎస్ చేయించుకుంటారు. ♦ ఎన్.ఐ.పి.టి.లో ఫలితం లేకపోవడం అంటే అర్థం ఏమిటి? ఈ పరీక్షలో ఒక్కొక్కసారి ఫలితం లేదనే రిపోర్ట్ రావటం దీనిలోని ఒక ఇబ్బంది. తల్లి మరీ అధిక బరువు ఉన్నా, బిడ్డలో అసాధారణ డిఎన్ఎ పద్ధతి వున్నా ఎన్.ఐ.పి.టి. ఫలితం రాకపోవచ్చు. దీని తరువాత ఆమ్నియోసెంటసిస్ లేదా సీబీఎస్ కి వెళ్లాల్సివుంటుంది. ♦ ఎన్.ఐ.పి.టిలో ‘నో రిజల్ట్ ’ తరువాత నిర్ధారణ పరీక్షలకు ముందు టి.ఐ.ఎఫ్.ఎఫ్.ఎ. / ఎనోమలీ స్కాన్లకోసం వేచి ఉండాలా? అవసరం లేదు. సిబీఎస్, ఆమ్నియాసింటసిస్ పరీక్షలకు వెళ్ళవచ్చు. ఎందుకంటే స్కాన్ కేవలం నిర్మాణాత్మక తప్పులను మాత్రమే చూపిస్తుంది తప్ప జన్యుపరమైన అసాధారణతలను గమనించలేదు. ♦ ఎనామలీ/ టి.ఐ.ఎఫ్.ఎఫ్.ఎ. స్కాన్ అంటే ఏమిటి? ఎన్.టి. తరువాతది ఎనామలీ స్కాన్. ఎనామలీ/ టి.ఐ.ఎఫ్.ఎఫ్.ఎ. స్కాన్ చాలామందికి తెలుసు. ఇది 18 నుండి 20 వారాల మధ్యలో చేస్తారు. ఈ స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను అల్ట్రా సౌండ్‌లో చూసిన ఎన్యూఫ్లాయిడ్ మార్కర్స్‌తో సరిపోల్చి చూస్తారు. ♦ ఉదాహరణకు చాలామంది స్త్రీల స్కానింగ్‌లో శిశువులో కనుగొన్నదేమిటంటే గుండెలో ‘ఎకోజనిక్ ఇన్ట్రా కార్డియాక్ ఫోకస్’ డౌన్స్ సిండ్రోవ్ుకు ఒక చిన్న సూచికగా చూస్తారు. అప్పుడు స్క్రీనింగ్ పరీక్షలలో డౌన్స్ సిండ్రోవ్ుకు తక్కువ ముప్పు ఉన్నప్పుడు మిగతా పరీక్షల అవసరం వుండదు. ♦ అదేవిధంగా ‘కోరాయిడ్ ప్లక్సెస్ సిస్ట్గానీ’, ‘సింగిల్ అంబ్లికల్ ఆర్టరీ’ గానీ అల్టాస్రౌండ్లో కనిపిస్తే ట్రై సోమీ 18 కి అదొక గుర్తు. స్క్రీనింగ్ పరీక్షలలో ట్రైసోమీ 18కి తక్కువ ముప్పు సూచిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. బిడ్డ మెడ వెనుక వాపు ఎక్కువగా కనిపిస్తే డౌన్స్ సిండ్రోవ్ుకి ఒక సూచన. బిడ్డ క్రోమోజోవ్ులు సవ్యంగానే ఉన్నాయని నిర్ధారించుకోవటానికి ఆమ్నియోసెంటసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అవయవ లోపాలు ఏవైనా అల్ట్రాసౌండ్‌లో కనిపిస్తే, జన్యుపరమైన అసాధారణతలు ఉన్నాయేమో అని తెలుసుకోవటానికి ఆమ్నియోసెంటసిస్ చేయించాలి. ఒక వేళ జన్యుపరమైన అసాధారణతలు కనుగొంటే భవిష్యత్తులో గర్భధారణకు అవసరమైన సలహాలను ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. జన్యుపరమైన అసాధారణతలు ఏవీ లేకుండా తరువాత సరిచేయటానికి వీలైన నిర్మాణాత్మక లోపాలు ఉన్నా గర్భాన్ని కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చు. ♦ ఉదాహరణకు గ్రహణం మొర్రి (క్లెఫ్ట్ లిప్) వున్నట్లు ముందే స్కానింగ్‌లో తెలిసినా బిడ్డ పుట్టిన తరువాత ఆపరేషన్ ద్వారా సరిచేయవచ్చు. ఏది ఏమైనా జన్యుపరమైన లోపాలు లేవని నిర్ధారణ చేసుకోడానికి ఆమ్నియోసెంటసిస్ చేయించుకోవటం మంచిది. ♦ ఎనామలీ స్కాన్ తర్వాతి స్కాన్ ఏమిటి? 24 వారాలకు శిశువు గుండెను పరిశీలించటం మంచిది. కొన్నిసార్లు గుండె లోపాలు ఆలస్యంగా రావడం వల్ల వాటిని మొదట్లోనే కనిపెట్టడం కష్టం అవుతుంది. ♦ ఎదుగుదల, డాఫ్లర్ స్టడీ అంటే ఏమిటి? అన్నీ సవ్యంగా ఉంటే 32 వారాలకు ఎదుగుదల, డాఫ్లర్ స్కాన్ చేయాలి. దీనివల్ల శిశువు ఎదుగుదల, రక్త సరఫరా విషయాలు గమనించవచ్చు. ♦ ఐయుజిఆర్ అంటే ఏమిటి? ‘ఇంట్రా యుటెరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్’ అంటే బిడ్డ కావల్సిన సైజ్‌కి చేరకపోవటం. ఈ బిడ్డలను డాఫ్లర్ స్టడీ ద్వారా గమనిస్తూ ఉండాలి. ♦ ఐయుజిఆర్లో ప్రస్తుత పరిశోధనలు... ప్రపంచవ్యాప్తంగా ఐయుజిఆర్ను అధ్యయనం చేస్తూ ప్రతి రోజు కొత్త విషయాలు కనుగొంటున్నారు. ఐ.యు.జి.ఆర్. సంఘటనలు భారతదేశంలో చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడే పరిశోధనలు జరిగితే వాటిని మనకనుగుణంగా తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. దీనివల్ల మన దేశ సొంత విధానాలు (ప్రోటోకాల్స్) రూపొందించుకొని తదనుగుణంగా ఇక్కడి గర్భిణులకు సరిపడేట్టు వైద్యం చేసుకోవచ్చు. దాంతో ఈ వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. శిశుమరణాల రేటు తగ్గించే వీలు ఉంటుంది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2016లో 1000 జననాలకు 34 శిశు మరణాలు ఉన్నట్లు నమోదయ్యింది. ఇతర దక్షిణ భారత రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అందువల్ల ఐ.యు.జి.ఆర్. మీద పరిశోధన చెయ్యవలసిన అవసరం ఉంది.-డాక్టర్ సౌఖ్య కర్రి,ఎంబిబిఎస్, ఎంఎస్ (ఆబ్స్టెట్రిక్స్ అండ్గైనకాలజీ),ఫెలోషిప్ ఇన్ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ద టీమ్ హాస్పిటల్, కాకినాడ -
గుంటూరు ఘటనపై విచారణకు ఆదేశం
గుంటూరు బోధనాసుపత్రిలో బతికుండగానే మరణ ధృవీకరణ పత్రాన్ని అందచేసి, బిడ్డను ఇంటికి పంపిన ఘటనపై విచారణకు ఆదేశించినట్టు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎన్.సుబ్బారావు వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యురాలైన గైనకాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ బిడ్డ వైద్యానికి వచ్చిన సమయంలోనే గైనకాలజీ వైద్యురాలికి మరో రెండు కేసులకు ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చిందని, ఈ కేసును గైనకాలజీ పీజీ చదివే విద్యార్థిని చూసిందన్నారు. ఈ విద్యార్థినికి అవగాహన లేక బిడ్డ మృతి చెందినట్టు మరణ ధృవీకరణ ఇచ్చిందన్నారు. ఒక బిడ్డకు మరణ ధవీకరణ పత్రం పీజీ చదివే స్టూడెంట్ ఇవ్వకూడదని, తప్పకుండా అదే సమయంలో విధుల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఏదేమైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ బాధ్యురాలేనని అందుకే సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పీజీ విద్యార్థినులందరికీ వారం రోజుల పాటు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.