
మా అమ్మాయికి పదహేడేళ్లు. పదహారు నిండినా ఇంకా పెద్దమనిషి కాలేదని డాక్టర్ గారికి చూపిస్తే స్కానింగ్ చేయించమన్నారు. రిపోర్ట్‌లో మా అమ్మాయికి పుట్టుకతోనే గర్భసంచి లేదని వచ్చింది. మేం షాక్ అయ్యాం. మా కుటుంబంలో ఇలాంటి హెల్త్ హిస్టరీ లేదు. గర్భసంచి లేకుండా పుడ్తారా? మా పాప భవిష్యత్ తలచుకుంటే భయంగా ఉంది. పరిష్కారం చెప్పగలరు. – టి. లలిత, చెన్నై
కొంత మందిలో జన్యుపరమైన సమస్యల వల్ల పుట్టుకతోనే గర్భాశయం లేకుండా జన్మిస్తారు. కొందరిలో గర్భాశయం లేకుండా, అండాశయాలు మాత్రం ఉంటాయి. అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వీరిలో 12 సంవత్సరాల సమయంలో రొమ్ములు పెరగడం, చంకల్లో, జనేంద్రియాల దగ్గర వెంట్రుకలు పెరగడం వంటి అమ్మాయి లక్షణాలు ఉంటాయి కాని గర్భాశయం ఉండదు కాబట్టి పీరియడ్స్ మాత్రం రావు. వీరిలో జన్యువులు అందరి అమ్మాయిలలానే 46్ఠ్ఠ ఉంటాయి. కొందరిలో అమ్మాయి లక్షణాలు ఉంటాయి కాని, గర్భాశయం, అండాశయం రెండూ ఉండవు. వారిలో జన్యువులు అబ్బాయిలలో లాగా 46xx ఉంటాయి. వీరిలో ఆండ్రోజన్ హార్మోన్ పనితీరులో లోపాల వల్ల మగలక్షణాలు లేకుండా ఉంటారు. మీ అమ్మాయికి క్వారియోటైపింగ్ చెయ్యించండి. అది 46xy అయితే, కొందరిలో యోని భాగం చిన్నగా ఉండవచ్చు. కొందరిలో ఉండకపోవచ్చు.
ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో వేరొకరి గర్భాశయాన్ని తీసి, గర్భాశయం లేని వారికి అమర్చడం (యుటిరైన్ ట్రాన్స్‌ప్లాంట్ (మన దేశంలో కూడా)) జరుగుతుంది. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అని చెప్పడం కష్టం. ఆమె శరీరం దానిని రిజెక్ట్ చెయ్యకుండా తీసుకోగలుగుతుందా అనేది చెప్పలేము. అందులో నుంచి నెలనెలా పీరియడ్స్ వస్తాయా, పిల్లలు పుడుతారా అనేది కచ్చితంగా చెప్పలేము. ఖర్చుతో కూడుకున్నది. కొందరిలో పెళ్లి తర్వాత కేవలం వైవాహిక జీవితం కోసం, యోని భాగాన్ని వెజైనోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా వెడల్పు చేయడం జరుగుతుంది. వారిలో అండాశయాలు ఉంటే వాటి నుంచి అండాలను సేకరించి, సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలను కనవచ్చు. క్వారియో టైపింగ్‌లో 46xy అని వస్తే, వీరిలో పుట్టినప్పటి నుంచి అమ్మాయిలానే పెరిగి ఉంటారు కాబట్టి, వీరిలో పొత్తి కడుపులో ఉండే టెస్టిస్‌లను తొలగించి, యోని భాగాన్ని తయారు చెయ్యడానికి వెజైనోప్లాస్టీ ఆపరేషన్ చెయ్యడం జరుగుతుంది. సమస్య నిర్ధారణ అయిన తర్వాత, మొదట మీ పాపకు కౌన్సెలింగ్ ఇప్పించి, ఆమె మనో ధైర్యాన్ని పెంచాలి, అలాగే మీ సహకారం, మద్దతును ఆమెకు ఎల్లవేళలా ఉండేటట్లు చూసుకోవాలి.
డాక్టర్‌గారూ... నాది చిత్రమైన సమస్య. డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గరకు వెళ్లలేక మీకు ఇలా రాస్తున్నాను. నాకు 52 ఏళ్లు. అయిదేళ్ల కిందటే మెనోపాజ్ వచ్చింది. అప్పటి నుంచి నా బ్రెస్ట్స్ చుట్టూ వెంట్రుకలు వచ్చాయి మొగవాళ్లలాగా. చాలా సిగ్గుగా ఉంది, కాన్సరేమోనని భయంగా ఉంది. నొప్పి దురద వంటివేమీ లేవు.
– పేరు రాయలేదు, వినుకొండ.
ఆడవారిలో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల వారిలో స్త్రీ లక్షణాలు ఉంటాయి. అలాగే అడ్రినల్ గ్రంథి నుంచి టెస్టోస్టిరాన్ అనే పురుష హార్మోన్ కొద్దిగా విడుదలవుతుంది. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. అప్పటి వరకు తగ్గి ఉన్న టెస్టోస్టిరాన్ హర్మోన్ ప్రభావం పెరుగుతుంది. దీని వల్ల మెనోపాజ్ దశలో 50 శాతం ఆడవారిలో ముఖం మీద, పై పెదవి పైన, గడ్డంపైన అలాగే రొమ్ముల మొన అంటే నిపుల్ చుట్టూ వెంట్రుకలు చిక్కగా, పొడవుగా పెరుగుతాయి. దాని వల్ల ఎలాంటి ప్రభావం లేదు.
కాకపోతే ఈ సమస్యవల్ల సిగ్గు, మొహమాటం, ఆందోళన, ఇబ్బంది, ఆత్మనూన్యతా భావం వంటివి ఏర్పడవచ్చు. కావాలనుకుంటే రొమ్ముపైన వెంట్రుకలను ట్రిమ్మింగ్, షేవింగ్, కత్తిరించడం వంటి పద్ధతులను పాటించవచ్చు. ఈ వయసులో వెంట్రుకలు మరీ ఎక్కువగా, త్వరగా పెరుగుతుంటే, టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే సమస్యలు అంటే అడ్రినల్ గ్రంథి, ఓవేరియన్ ట్యూమర్లు, కుషింగ్స్ సిండ్రోమ్ వంటివి ఉన్నాయా అని డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయ్యించుకొని, సమస్య ఉంటే దానికి చికిత్స తీసుకోవడం మంచిది.
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment