నా వయసు 31 సంవత్సరాలు. పెళ్లయి ఏడేళ్లయినా, ఇంతవరకు మాకు పిల్లల్లేరు. మాది మూడోతరం మేనరికం. ఇద్దరమూ పరీక్షలు చేయించుకుంటే, నార్మల్‌గానే ఉన్నట్లు తేలింది. డాక్టర్ల సలహాలపై ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. మాకు పిల్లలు పుట్టకపోవడానికి మేనరికమే కారణమా? మా సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందా?
– నాగమణి, శ్రీకాకుళం
మేనరికం వల్ల గర్భంరాకపోవడం అంటూ ఏమీ ఉండదు. మేనరికం వల్ల అబార్షన్లు అవ్వడం, పిల్లలలో అవయవ లోపాలు, జన్యుపరమైన లోపాలు, మామూలు వారితో పోలిస్తే రెట్టింపు అవుతాయి. అంతే కానీ గర్భం రాకపోవటానికి ఏమీ సంబంధం ఉండదు. మీ భార్యాభర్తలు ఇద్దరి పరీక్షల రిపోర్టులలో ఏమి సమస్యలు లేకపోయినా గర్భం రాకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుని ఉన్నయా?, తెరచుకుని ఉన్నాయా? అని తెలుసుకోవటానికి చేసే HSG test చేయించుకునే ఉంటారు. ఒకవేళ చేయించుకోకుండా ఉండి ఉంటే చేయించుకుని తెలుసుకోవటం మంచిది.
రిపోర్ట్‌లు అన్నీ సాధారణంగానే ఉన్నా కానీ కొంతమందిలో వీర్యకణాలు గర్భాశయం లోపలికి వెళ్లలేకపోవడం, వెళ్లినా గర్భాశయం ముఖద్వారం దగ్గర ఉండే యాంటీస్పెర్మ్ యాంటీబాడీలు వీర్యకణాలను నిర్వీర్యం చెయ్యడం వల్ల అవి ఫెలోపియన్ ట్యూబ్ వరకు ప్రయాణించలేకపోవడం, అండంలోకి వెళ్లి ఫలదీకరణ చెయ్యలేకపోవడం(Fertilization)ఫలదీకరణ చెందినా పిండం, గర్భాశయంలోకి చేరి అక్కడ అతుక్కోకపోవడం (implantation)వంటి సమస్యల వల్ల గర్భం రాకపోవచ్చు. ఈ సమస్యలు తెలుసుకోవడానికి పెద్దగా నిర్ధారణ పరీక్షలు ఏమీ ఉండవు.
దీనినే అన్‌ఎక్స్‌ప్లైన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. మీరు మందులు వాడినా గర్భం రాలేదు కాబట్టి, వయసు కూడా 31 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి సమయం వృథా చేసుకోకుండా ఐయుఐ పద్ధతి ద్వారా మీ వారి వీర్యకణాలను శుద్ధి చేసి, మంచి నాణ్యత గల వీర్యకణాలను మీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా సాధారణంగా కంటే 10 నుంచి 20 శాతం వరకు గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీనిని 3 నుంచి 6 సార్ల వరకు ప్రయత్నించవచ్చు. అయినా గర్భం రాకుంటే ఐవిఎఫ్ పద్ధతి అంటే టెస్ట్‌ట్యూబ్ బేబి పద్ధతిని ప్రయత్నించవచ్చు. దీని ద్వారా 40 శాతం వరకు గర్భం నిలిచే అవకాశాలు ఉన్నాయి.
నా వయసు 22 ఏళ్లు. ఎత్తు 4.9 అడుగులు, బరువు 73 కిలోలు. రెండువారాల కిందట కడుపులో కుడివైపు తీవ్రమైన నొప్పి వస్తే, డాక్టర్‌కి చూపించుకున్నాను. స్కానింగ్‌లో ఇంటర్నల్ టోర్షన్, ఎన్‌లార్జ్‌డ్ రైట్ ఓవరీ (69 x 33 ఎంఎం), స్మాల్ హేమరేజిక్ సిస్ట్ (7 ఎంఎం) అని వచ్చింది. యాంటీబయోటిక్స్ వాడితే నొప్పి తగ్గింది. ఇప్పుడు ఈ సమస్యకు సర్జరీ అంత అవసరమంటారా? నేను ఇంకా స్టూడెంట్‌ని. పెళ్లి కాలేదు. సర్జరీ చేయించుకుంటే భవిష్యత్తులో కాంప్లికేషన్స్ ఏవైనా వస్తాయా? వివరించగలరు.
– అనూష, ఈ–మెయిల్
మీ ఎత్తుకి దగ్గర దగ్గర 20 కేజీల అధిక బరువు ఉన్నారు. మీ కుడి అండాశయం ఓవరీలో నీరు, రక్తం చేరడం వల్ల అది పెద్దగా అయి ఎన్‌లార్జ్‌డ్ ఓవరీ అవ్వడం, లేదా అండాశయం పెద్దగా ఉండటం వల్ల అండాశయం టోర్షన్ అవ్వడం అంటే అది మెలికపడి, అండాశయానికి రక్తప్రసరణ తగ్గి దాని వల్ల.. అండాశయంలో నీరు చేరడం, బ్లీడింగ్ అవ్వడం వల్ల అండాశయం పెద్దగా అయ్యి, విపరీతమైన నొప్పి, వాంతులు అవ్వడం జరుగుతుంది.
మందులతో నొప్పి తగ్గినా, కొంతమందిలో మెలికపడిన అండాశయానికి పూర్తిగా రక్తప్రసరణ తగ్గిపోయి ఆలస్యం చేస్తే అండాశయం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అండాశయం ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. అది తొలగించవలసి ఉంటుంది. కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, మరలా ఒకసారి డాప్లర్ స్కానింగ్ చేయించుకుని, అండాశయం పరిమాణాన్ని బట్టి చూడవలసి ఉంటే, మెలికను తొలగించి (Detorsion) చూడవలసి ఉంటుంది.
ఒకవేళ తర్వాత అండాశయం మామూలుగా ఉంటే, అండాశయాన్ని తొలగించనవసరం లేదు. ఒకవేళ సర్జరీ చేసి అండాశయం మొత్తం తొలగించవలసి ఉంటుందా, కొద్దిభాగం తొలగించవలసి ఉంటుందా అనేదాన్ని బట్టి తర్వాత ఏమి చెయ్యాలి అనేది ఉంటుంది. ఒక అండాశయం తొలగించినా, ఇంకొక అండాశయం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో పెద్దగా కాంప్లికేషన్స్ రాకపోవచ్చు.
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment