సేఫ్‌ మెథడ్స్‌ ఏమిటి? | Venati Shobha Gynecology Health Tips In Sakshi Family | Sakshi
Sakshi News home page

సేఫ్‌ మెథడ్స్‌ ఏమిటి?

Published Sun, Jul 19 2020 7:47 AM | Last Updated on Sun, Jul 19 2020 7:47 AM

Venati Shobha Gynecology Health Tips In Sakshi Family

లాస్ట్‌ డిసెంబర్‌లో మా పెళ్లయింది. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. ఫ్యామిలీ ప్లానింగ్‌కి మా ఇద్దరికీ ఉన్న సేఫ్‌ మెథడ్స్‌ చెప్తారా? వాటి వల్ల ఏమైనా దుష్ప్రభావాలుంటే కూడా చెప్పండి ప్లీజ్‌.. – గ్రీష్మ, కదిరి

కొత్తగా పెళ్లయ్యి ఇప్పుడే పిల్లలు వద్దనకున్నప్పుడు, అనేక పద్ధతులు ఉంటాయి. ఏ పద్ధతి పాటించినా కూడా అది వందశాంతం ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటుంది అని చెప్పలేం. ఒక్కొక్క పద్ధతిని బట్ట 5 శాతం నుంచి 30 శాతం వరకు ఫెయిలయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన పద్ధతిలో పాటిస్తే ఫెయిలయ్యే అవకాశాలు కొద్దిగా తగ్గుతాయి. కలయిక సమయంలో మగవారు కండోమ్స్‌ వాడటం ఒక గర్భ నిరోధక పద్ధతి. ఇవి వాడటం వల్ల గర్భం రాకుండా ఉండటంతో పాటు, కొన్ని లైంగిక వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్‌లు ఒకరి నుంచి ఒకరి రాకుండా చాలా వరకు అడ్డుకుంటుంది. కొన్నిసార్లు కండోమ్స్‌ జారిపోవడం, చిరగడం లాంటి సమస్యల వల్ల ప్నెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి.

కొందరిలో కండోమ్స్‌ తయారీలో వాడే ల్యాటెక్స్‌ పడకపోవడం అలర్జీ వల్ల జనేంద్రియాల దగ్గర మంట, రాష్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి.  నెల నెలా పీరియడ్స్‌ సక్రమంగా వచ్చే వారిలో పీరియడ్‌ మొదలయిన 10వ రోజు నుంచి 16 రోజుల లోపల అండం విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి 9వ రోజు నుంచి 18వ రోజు వరకు కలవకుండా ఉండాలి. లేదా ఈ రోజులలో జాగ్రత్తగా కండోమ్స్‌ వాడుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనినే సేఫ్‌ పీరియడ్‌ మెథడ్‌ అంటారు. ఈ పద్ధతిలో కూడా ఫెయిలయ్చే అవకాశాలు ఉంటాయి. పీరియడ్స్‌ సక్రమంగా రాని వారిలో ఈ పద్ధతిని అనుసరించడం కుదరదు. ఎందుకంటే వీరిలో అండం విడుదల ఎప్పుడు అవుతుందో చెప్పడం కష్టం. సాధారణంగా గర్భం రాకుండా ఉండటానికి గర్భనిరోధక మాత్రలు వాడుతూ ఉంటారు. వీటినే ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ అంటారు.

వీటిలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌ హర్మోన్‌లు అనేక మోతాదుల్లో ఉంటాయి. వీటిని ప్రతినెలా మూడోవ రోజు నుంచి మొదలు పెట్టి రోజుకు ఒకటి చొప్పున 21వ రోజు వరకు మింగవలసి ఉంటుంది. వీటిని సరిగా గుర్తుంచుకొని అదే పనిగా, రోజు ఒకే సమయానికి మర్చిపోకుండా వేసుకోవాలి. మొదలు పెట్టిన తర్వాత రోజు కలయిక ఉన్నా లేకపోయినా పూర్తిగా మాత్రల ప్యాకెట్‌ అయిపోయేవరకు వేసుకోవలసి ఉంటుంది. కొందరిలో వీటి వల్ల వికారంగా, తల తిరుగుడు, వాంతులు, తలనొప్పి, బరువు పెరగడం లాంటి సమస్యలు ఉండవచ్చు. అలాంటి వారు డాక్టర్‌ పర్యవేక్షణలో పిల్స్‌ వాడి చూడవచ్చు. అతి తక్కువ మందిలో వారి శరీరతత్వాన్ని బట్టి, ఫ్యామిలీ హిస్టరీని బట్టి దీర్ఘకాలం వాడటం వల్ల, రక్తం గడ్డకట్టడం, లివర్‌సమస్యల లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంక హార్మోన్‌ ఇంజెక్షన్‌లు, కాపర్‌టీ లాంటివి ఎక్కువ మటుకు ఒక కాన్పు తర్వాత ఇంకొక బిడ్డ ఇప్పుడే వద్దు అనుకున్నప్పుడు వాడమని సలహా ఇస్తారు. ఒకసారి మీరిద్దరూ గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే వారు మీ శరీరతత్వాన్ని బట్టి పీరియడ్స్‌ ఎలా ఉన్నాయి, ఇంకా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని, సలహా ఇస్తారు.            

మా పెళ్లయి పదేళ్లవుతోంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ను. నాలగవ నెల. అయితే ఆర్థికంగా నిలదొక్కుకొనేదాకా పిల్లలు వద్దని ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నాం ఇన్నాళ్లు. కొన్నాళ్లు నేను కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ వాడాను, కొన్నాళ్లు మావారు కండోమ్‌ వాడారు. నేను కన్సీవ్‌ అయ్యే వరకు కూడా నాకు ఎలాంటి హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ లేవు. ఇప్పుడు కూడా లోపల బిడ్డ బాగానే ఉందని చెప్పారు డాక్టర్‌. అయితే నెలలు పెరిగే కొద్ది ఏమైనా సమస్యలు రావచ్చా .. చెప్పండి ప్లీజ్‌.. – మైథిలి, హైదరాబాద్‌ 
మీ వయసు, బరువు ఎంత ఉందో రాయలేదు. ముందు కాంట్రాసెప్టివ్‌ పిల్స్, కండోమ్స్‌ వాడటం వల్ల బిడ్డకు, మీకు ఇప్పుడు సమస్యలేవీ రావు. మీ వయస్సు ఎక్కువగా ఉంటే, కొన్నిసార్లు బిడ్డలో అవయవ లోపాలు ఉండే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. గర్భం పెరిగేకొద్దీ 7 నెలల తర్వాత బీపీ, షుగర్‌ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఐదవ నెల చివరిలో టిఫా స్కాన్‌ చెయించుకోండి. అందులో బిడ్డలో ఏమైనా అవయలోపాలు ఉన్నాయా లేదా, బిడ్డ అంతా బాగానే  ఉందా అనే విషయాలు తెలుస్తాయి.

మీరు కూడా నెలనెలా డాక్టర్‌ దగ్గర చెకప్‌లకు వెళ్లండి. వారు రాసిన ఐరన్, కాల్షియం మందులు వాడుతూ, సరైన పోషకాహారం తీసుకుంటూ, డాక్టర్‌ సలహా మేరకు నడక లాంటి వ్యాయమాలు చేస్తూ ఉండటం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. నెలలు పెరిగే కొద్దీ, మీకే కాదు ఎవరికైనా కూడా కాన్పు అయ్యేవరకు వాళ్లవాళ్ల శరీరతత్వాన్ని బట్టి ఏదైనా సమస్య వస్తుందా రాదా అని ముందే కచ్చితంగా చెప్పడం కష్టం.
డా. వేనాటి శోభ
హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement