గర్భసంచి తీసేస్తే... చికాకులన్నీ పోతాయా?
గర్భసంచి తొలగిస్తే వచ్చే నష్టమేమిటి?!
‘ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సెస్, జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ’కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్ ద్వారా ఓ విషయాన్ని వెల్లడించారు. దేశంలోని 25 నుంచి 49 ఏళ్ల మధ్య వ్యవసాయ కూలీలుగా ఉన్న గ్రామీణ మహిళల్లో 32 శాతం గర్భసంచి తొలగింపు (హిస్టరెక్టమీ...Hysterectomy) శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారని, ఈ శస్త్ర చికిత్సలు ప్రభుత్వ బీమా పథకాల ద్వారానే జరుగు తున్నాయని వెల్లడైంది. గర్భసంచి(Uterus) తొలగింపు శస్త్ర చికిత్సలవైపు గ్రామీణ మహిళలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?! ఏ అంశాలు వీరిని ప్రేరేపిస్తున్నాయి?! గర్భసంచి తొలగిస్తే వచ్చే నష్టమేమిటి?! అవగాహన అవసరం...
దేశంలో బిహార్, ఛత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రాష్ట్రాల్లోని గ్రామాల్లో హిస్టరెక్టమీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అవగాహన లోపమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు స్త్రీ వైద్య నిపుణులు. వారు చెబుతున్న విషయాలేంటంటే..
ఖర్చుకు భయపడి...
వ్యవసాయ కూలీలుగా ఉన్న మహిళల్లో వ్యక్తిగత శుభ్రత తక్కువ. దీనివల్ల గర్భసంచికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పోషకాహార లోపం వల్ల రక్తహీనత, అధిక రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, రుతు సమయంలో వచ్చే నొప్పులను ఇంటిలో పనుల కారణంగా భరిస్తున్నారు. అయితే గర్భసంచి వాపు, సిస్టులు అనగానే క్యాన్సర్ అని భయపడుతున్నారు.
సమస్య తీవ్రం అయినప్పుడు హాస్పిటల్‌కు రావడం, త్వరగా నయం కాకపోవడంతో పదే పదే డాక్టర్ దగ్గరకు వెళ్లవలసి వస్తుందని, దీనివల్ల ఇంటి పనులు, కూలి పనులకు ఇబ్బందులు వస్తాయని, తమ వెంట వచ్చేవారి పని కూడా పోతుందని, టెస్టులకు, మందులకు అదనపు ఖర్చు అని.. ‘గర్భసంచి తొలగించు కుంటే’ ఈ చికాకులన్నీ పోతాయనే ఆలోచనకు వస్తున్నారు.
శస్త్ర చికిత్సకు ప్రభుత్వం అందించే ఉచిత పథకాల కోసం వెతుకుతున్నారు.
గర్భసంచి సమస్యలను వాయిదా వేసుకుంటూ కూలి పనులు ఎక్కువ ఉండని వేసవి కాలాన్ని ఆపరేషన్‌కు కేటాయించుకుంటున్నారు.
త్వరగా పెళ్ళిళ్లు అవడం, పిల్లలు పుట్టడం, త్వరగా గర్భసంచి తొలగించుకోవడం అనేది గ్రామాల్లో కూలి పనులకు వెళ్లే వారిలో తరచూ కనిపిస్తోంది.
అత్యవసర అవగాహన
శుభ్రతకు సంబంధించిన అవగాహన అత్యవసరం.
అధిక రక్తస్రావం సమస్యలకు కూడా పరిష్కారాలు ఉన్నాయి. హార్మోన్లకు, బలానికి వాడే మందులను అందజేయాలి.
తప్పనిసరై గర్భసంచి తొలగించుకున్నా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల ఇతర సమస్యలు తలెత్తుతాయి. దీంతో మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
మధుమేహం, బలహీనత, ఎముకల సమస్యలు... వీటన్నింటి పైనా అవగాహన కల్పించాలి.
ఆర్థికంగానే కాదు ఆరోగ్యంగా ఉండటమూ దేశ భవిష్యత్తుకు కొలమానమే.
వ్యవసాయ కార్మికులుగా ఉన్న మహిళలు తరచూ పురుగు మందులకు గురి కావడం వల్ల కూడా అధిక రుతుస్రావాలు, ఫైబ్రాయిడ్లు, గర్భాసంచి లోపాలు, జననేంద్రియ సమస్యలకు కూడా గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఏడాదికోసారి పాప్‌స్మియర్ టెస్ట్
గర్భసంచి తొలగించడం వల్ల అండాలు విడుదల కాక హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల ఎముకలపై ప్రభావం పడి, త్వరగా కీళ్ల సమస్యలు వస్తాయి. చాలా మందిలో రకరకాల ఇన్ఫెక్షన్ల వల్ల గర్భసంచి వాపు వస్తుంది. ఫైబ్రాయిడ్స్, సిస్టులు వస్తుంటాయి. అయితే అవగాహన లేక క్యాన్సర్ వస్తుందేమో అనే భయంతో గర్భసంచి తీసేయమని కోరుతున్నారు.
పాప్‌స్మియర్ స్క్రీనింగ్‌తో గర్భసంచి సమస్య ఏంటో ముందే తెలుసుకోవచ్చు. దానికి తగిన మందులు వాడితే సరిపోతుంది. 40 ఏళ్ల లోపు మహిళలకు గర్భసంచి తొలగించకపోవడమే మంచిది. హెల్త్ అవేర్‌నెస్ క్యాంప్స్, ఏడాదికోసారి పాప్‌స్మియర్ టెస్టులు, కుటుంబం మొత్తానికి స్త్రీ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. – డాక్టర్ భానుప్రియ, గైనకాలజిస్ట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్, నిజామాబాద్
అడ్డంకిగా భావిస్తున్నారు
గ్రామీణ మహిళలు ఓవర్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో మా దగ్గరకు వస్తుంటారు. ఇలాంటప్పుడు టెస్టులు చేయించుకోవడం మందులు వాడటం, పదే పదే వైద్యులను సంప్రదించడం వారికి కష్టంగా మారుతుంది. అందుకు గర్భసంచి తొలగించుకోవడం మేలేమో అనే ఆలోచన చేస్తున్నారు. సాధారణంగా 50 ఏళ్లలో మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తాయి. సర్జికల్‌గా వచ్చే మెనోపాజ్ వల్ల చెమటలు పట్టడం, అలసిపోవడం, చిరాకు, హాట్ ప్లషెస్.. అన్నీ ముప్పైల్లోనే కనిపిస్తాయి. – డాక్టర్ మనోరమ, మధిర, ఖమ్మం జిల్లా
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment