Hysterectomies
-
పోలీసుల అదుపులో కి‘లేడి’?
విజయనగరం టౌన్: గర్భసంచి అమ్మకాలకు సంబంధించిన ముఠాలో కీలక నిందితురాలు జ్యోతిని, ఆమెతో పాటూ మరో వ్యక్తిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గర్భసంచిని ఇస్తే మనిషికి రూ.8 లక్షల వరకూ ఇస్తానంటూ సుమారు ఎనిమిది మంది మహిళలను మభ్యపెట్టి, వారి నుంచి పరీక్షల నిమిత్తం రూ. 3లక్షలకు పైగా వసూలు చేసిన కిలేడీపై బాధితుల పిర్యాదు మేరకు కొద్దిరోజుల కిందట టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ గర్భసంచి అమ్మకాల ముఠా వెనుక ఎవరెవరూ ఉన్నారు. రాజకీయ నాయకులు ప్రమేయమేమైనా ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
గర్భశోకం
విజయనగరం టౌన్: గర్భసంచి ఇస్తే లక్షల రూపాయాలు ఇస్తామని ఆశ చూపి బాధితులను బుట్టలో వేసుకునే విష సంస్కృతి జిల్లాకు పాకింది. ఒక్కో మహిళకు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి టెస్ట్‌ల పేరిట ముందస్తుగా కొంత సొమ్ము తీసుకుని ఓ ముఠా పరారైంది. కొన్నాళ్లుగా ఎంతో సీక్రెట్‌గా జరుగుతున్న ఈ తంతును స్థానికుల సమాచారంతో పోలీసులు ఛేదించారు. ఇందులో ప్రధానసూత్రధారిగా భావిస్తున్న జ్యోతి అనే మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. పోలీసులు ఇద్దరు బాధితులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అసలు జరిగే పనేనా..? కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు అయిపోయిన తర్వాత కూడా మహిళల వద్ద నుంచి గర్భసంచి తీసుకుని వేరే మహిళకు అమర్చి సంతాన ప్రాప్తి కల్పిస్తామని ముఠా సభ్యులు చెబుతున్న వాదన. అయితే ఈ విధానం సరైనది కాదని వైద్యులు చెబుతున్నారు. యూట్ర స్ మార్పిడి చాలా క్లిస్టతరమైనదని.. ఎక్కడో ఒకచోట సక్సెస్ సాధించి ఉండవచ్చు గాని విజయావకాశాలు బాగా తక్కువని తెలిపారు. కి‘లేడీ’పై కేసు నమోదు గర్భసంచి ఇస్తే రూ. 8 లక్షలు ఇస్తామని ఆశ జూపి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ ఎస్సై వి. అశోక్‌కుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో కమ్మవీధి, బూడివీధి, తదితర ప్రాంతాలకు చెందిన పలువురు మహిళలను విశాఖ జిల్లా భీమిలి పట్నానికి చెందిన ఆదిలక్ష్మి అలియాస్ జ్యోతి అనే మహిళ మచ్చిక చేసుకుని గర్భసంచి ఇస్తే రూ. 8 లక్షలు ఇస్తానని నమ్మబలికింది. దీంతో కానూరి రాజేశ్వరి, బుజ్జి అనే మహిళ ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.750లు, ఆధార్ కార్డు, మూడు ఫొటోలు నిందితురాలు తీసుకుంది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వారిని కలిసి పరీక్షల పేరుతో రూ. 50 వేల నుంచి 80 వేల రూపాయల వరకు తీసుకుంది. ఈ క్రమంలో మరికొంతమంది బాధితులు రూప, భూదేవి, రమ, సంతోషి, రాజీ, తదితరులు డబ్బులు సమర్పించుకున్నారు. అయితే జ్యోతి పరారుకావడంతో బాధితల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో లేదు.. యూట్రస్ (గర్భసంచి) మార్పిడి సౌకర్యం మనదేశంలోనే లేదు. ఇతర దేశాల్లో చేసినట్లు కూడా కచ్ఛితంగా తెలియదు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (ట్యూబెక్టీమీ) జరిగిన తర్వాత గర్భం రావడం అసాధ్యం. – డాక్టర్ రాజ్యలక్ష్మి, గైనికాలజిస్టు, కేంద్రాస్పత్రి -
హిస్టరెక్టమీ ఎప్పుడు అవసరమంటే!
సృష్టికి ప్రతి స్పష్టి చేయడానికి ప్రకృతికీ కొన్ని పనిముట్లు కావాలి. అందులో ముఖ్యమైనది గర్భసంచి (యుటెరస్). పుట్టబోయే బిడ్డను కాబోయే అమ్మ ఓ సంచిలో పెట్టుకొని కాపాడుతుంది. ఆ సంచి పేరే గర్భసంచి. చాలా మంది మహిళలు చివరి కాన్పు తర్వాత యుటిరస్‌ను ఓ పనికిరాని అవయవంగా పరిగణిస్తారు. దాని అవసరం ఇక లేదని అపోహ పడతారు. కొన్ని నొప్పులు, రక్తస్రావాలు, తెలుపు కావడం (వైట్ డిశ్చార్జీ) వంటి వాటికి కారణాలనీ, అందుకే దాన్ని తొలగించుకోవడమే మంచిదనే భావన వారిలో ఉంటుంది. తమంతట తామే తొలగించమని కోరేవారూ ఉంటారు. కానీ... బిడ్డలు పుట్టే అవసరం తీరిపోయాక కూడా ‘గర్భసంచి అవసరమే’ అని గుర్తించాలి. హిస్టరెక్టమీ అంటే... ఆపరేషన్ ద్వారా గర్భసంచిని తొలగించే ప్రక్రియనే వైద్యపరిభాషలో హిస్టరెక్టమీ అంటారు. గర్భసంచిని తొలగించడం ఎందుకు...? అందుకు చాలా కారణాలు ఉండవచ్చు. వాటిని రెండు విభాగాలుగా విభజించవచ్చు. అవి... లైఫ్ సేవింగ్ (నాన్ ఎలక్టివ్) ►మహిళ ప్రాణాలను కాపాడటానికి గర్భసంచి తొలగింపు తప్ప మరో మార్గం లేనప్పుడు... ఉదాహరణకు గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్‌లో క్యాన్సర్లు వచ్చినప్పుడు ఆ గడ్డను తొలగించడానికి గర్భసంచిని తొలగించడం తప్ప మరో మార్గం ఉండదు. అలాగే కాన్పు సమయంలో గర్భసంచి పగిలిపోయినప్పుడు (రప్చర్), గర్భసంచికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, నియంత్రణకు ఏమాత్రం వీలుకానంతగా రక్తస్రావం (అన్‌కంట్రోల్డ్ బ్లీడింగ్), కాన్పు తర్వాత వచ్చే అధిక రక్తస్రావం (అన్‌కంట్రోల్డ్ పోస్ట్ పార్టమ్ హేమరేజ్) అవుతుంటే గర్భసంచిని తొలగిస్తారు. జీవన నాణ్యత కోసం (ఎలక్టివ్ సర్జరీ)... ► జీవన నాణ్యతను మెరుగుపరచేందుకు రోగి తన విచక్షణతో తొలగించుకోవడం. తీవ్రమైన రక్తస్రావం, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, దీర్ఘకాలికంగా పొత్తికడుపు నొప్పి, డిస్ఫంక్షనల్ యుటిరైన్ బ్లీడింగ్ వంటి సమస్యలకు గర్భసంచి తీసేయడం ఒక పరిష్కారం. ఇప్పుడు హిస్టరెక్టమీయే పరిష్కారం కాదు... ►ఫైబ్రాయిడ్స్: సాధారణంగా గర్భసంచి తొలగింపునకు ఒక ప్రధాన కారణంగా చూపేవి ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు. ఇవి క్యాన్సర్ గడ్డలు కావు. ముఫ్ఫైఅయిదేళ్లు నిండిన చాలామంది మహిళల్లో ఇవి కనిపిస్తుంటాయి. వాటి సైజ్ చిన్నదిగా ఉండి, వాటి వల్ల ఎలాంటి లక్షణాలూ కనిపించకపోతే వాటికి చికిత్స కూడా అవసరం లేదు. అయితే వాటి సైజ్ బాగా ఎక్కువగా ఉన్నా, వాటి కారణంగా తీవ్రమైన రక్తస్రావం అవుతున్నా, నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా వాటికి చికిత్స అవసరం. కొన్ని సందర్భాల్లో ఈ గడ్డలు ఉన్నప్పుడు పూర్తిగా గర్భసంచిని తొలగించకుండా కేవలం గడ్డ వరకు తొలగించడం కూడా ఒక చికిత్స ప్రక్రియ. దీన్నే మయోమెక్టమీ అంటారు. ఇక చాలాకాలంగా రక్తస్రావం అవుతున్న మహిళల్లో పూర్తిగా గర్భసంచి తొలగించడానికి బదులుగా దానిలోని లోపలిపొర ఎండోమెట్రియం వరకు తొలగించవచ్చు. దీన్నే ఎండోమెట్రియల్ అబ్లేషన్ అని అంటారు. ►ఎండోమెట్రియాసిస్: ఎండోమెట్రియమ్ అనే పొర గర్భసంచి లోపల ఉంటుంది. అయితే ఏదైనా కారణాల వల్ల ఆ కణాలు కేవలం గర్భసంచి లోపలి భాగానికే పరిమితం కాకుండా గర్భసంచి బయట... అంటే.. ఓవరీస్ వద్ద, ఫెలోపియన్ ట్యూబ్స్ వద్ద, మూత్రం విసర్జనకు తోడ్పడే బ్లాడర్ వద్ద, కడుపులో కనిపించవచ్చు. ఫలితంగా తీవ్రమైన నొప్పి రావచ్చు. కొందరిలో నొప్పి లేకపోయినా అది గర్భధారణకు ఆటంకం కావచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దానికి ఎండోమెట్రియల్ అబ్లేషన్, జీన్ఆర్హెచ్ యాంటగనిస్ట్ అనే గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్‌ను తగ్గించే లేదా దాన్ని ప్రభావాన్ని తగ్గించే మందులు, డెనెజాల్, టామోక్సిఫెన్ వంటి మందులతో ఉపశమనం సాధించవచ్చు. అయితే ఎండోమెట్రియాసిస్ తీవ్రత ఎక్కువగా ఉంటే గర్భసంచిని తొలగించకుండానే ఆపరేషన్ ద్వారా తగ్గించవచ్చు. ►ప్రొలాప్స్: కొందరు మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ పొత్తికడుపు కండరాలు బలహీనపడతాయి. దాంతో వారిలో గర్భసంచి, దానికి తగ్గరగా ఉన్న బ్లాడర్, రెక్టమ్ వంటివి కిందికి జారడం జరగవచ్చు. దీనికి చికిత్సగా కెగెల్స్ ఎక్సర్సైజెస్ (పొత్తికడుపు కండరాలను బలపరచడం కోసం డాక్టర్ ఆర్నాల్డ్ కెగెల్స్ పేరిట రూపొందించిన ఎక్సర్సైజ్లు చేస్తారు. అయితే గర్భసంచి పూర్తిగా బయటకు వచ్చిన సందర్భాల్లో మాత్రం వెజినల్ హిస్టరెక్టమీ తప్పదు. ►డీయూబీ (డిస్ఫంక్షనల్ యుటిరైన్ బ్లీడింగ్): ఏ కారణం లేకుండా జరిగే అధిక రక్తస్రావాన్ని ‘డీయూబీ’గా అభివర్ణిస్తుంటారు. ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, డెనజాల్ మందులు వాడటం వల్ల ఈ కండిషన్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో చిన్న ఆపరేషన్‌గా అభివర్ణించే డీఅండ్‌సీ కూడా ఈ కండిషన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక గర్భసంచిలోనే అమర్చే లెవోనోజెస్టెరాల్ అనే హార్మోన్‌ను స్రవింపజేసే ఓ సాధనాన్ని గర్భసంచిలోకి ప్రవేశపెట్టడం వల్ల కూడా డీయూబీ సమస్యను 80 శాతం కేసుల్లో సమర్థంగా తగ్గించవచ్చు. ఎండోమెట్రియల్ అబ్లేషన్ వల్ల కూడా ఈ సమస్యకు ఫలితం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలన్నీ విఫలం అయితేనే గర్భసంచిని తొలగించడం అవసరం. ► వైట్ డిశ్చార్జీ: మనదేశంలో ఫైబ్రాయిడ్ సమస్య తర్వాత వైట్ డిశ్చార్జీ కేసుల్లో ఎక్కువగా హిస్టరెక్టమీ చేయించుకుంటున్నారు. మహిళల్లో వైట్ డిశ్చార్జీ అవుతుందంటే అది తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ వల్లనే కాదు. సాధారణంగా రుతుస్రావానికి ముందు రెండుమూడు రోజులు వైట్ డిశ్చార్జీ అవుతుంది. ఆ తర్వాత రక్తస్రావం తగ్గిన తర్వాత మరో రెండుమూడు రోజులు వైట్ డిశ్చార్జీ అవుతుంది. ఇది చాలా సర్వసాధారణం. దీనికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. కాని మంట, దురద ఎక్కువగా ఉండి వైట్ డిశ్చార్జీ అవుతుంటే దాన్ని ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన సమస్యగా గుర్తించవచ్చు. ఎన్నో రకాల బాక్టీరియా, వైరస్లు దీనికి కారణం కావచ్చు. సరైన సమయంలో తగిన చికిత్స దీన్ని తగ్గించుకోవచ్చు. అయితే... హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్‌సీవీ), హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనే వైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భాశయకంఠం (సెర్విక్స్)లో కొన్ని మార్పులు జరిగి అవి దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది.వైట్డిశ్చార్జ్తో అందువల్ల మంట, దురద, వాసన ఉన్న సందర్భాల్లో ఆకుపచ్చ, పసుపచ్చ రంగుల్లో స్రావాలు కనిపిస్తే చికిత్స తీసుకోవాలి. భయంలేదు...: ఇలా ఈ వైరస్ల వల్ల సెర్విక్స్‌లో దీర్ఘకాలంలో మార్పులు వచ్చి క్యాన్సర్‌కు దారితీస్తాయన్న విషయం ఆందోళన కలిగించినా... పాజిటివ్ అంశం ఏమిటంటే... సెర్విక్స్ క్యాన్సర్ ముందుగా వచ్చే ప్రీ–క్యాన్సర్ దశ చాలా కాలం (దాదాపు ఎనిమిది నుంచి పదేళ్లు) కొనసాగుతుంది. అంటే అది పూర్తి క్యాన్సర్‌గా రూపొందడానికి సాగే ముందస్తు దశ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి అక్కడ వచ్చే మార్పులను ముందుగానే పసిగడితే అది క్యాన్సర్ కాకముందే చికిత్స చేయడం సాధ్యపడుతుంది. అపోహలు... వాస్తవాలు! అపోహ: చివరి కాన్పు తర్వాత గర్భసంచి అక్కర్లేదు. వాస్తవం: అది తప్పు. యుటెరస్ తొలగిస్తే మెనోపాజ్‌లో వచ్చే కాంప్లికేషన్స్ మరింత త్వరితంగా, తీవ్రంగా రావచ్చు. అపోహ: మెనోపాజ్‌కు ముందూ, తర్వాత బ్లీడింగ్ ఒకింత ఎక్కువగా కావడం మామూలే. వాస్తవం: ఇది సరికాదు. మెనోపాజ్‌కు ముందూ, తర్వాత బ్లీడింగ్ కనిపిస్తే డాక్టర్ చేత పరీక్షలు చేయించుకోవడం అవసరం. అపోహ: మెనోపాజ్ దశకు చేరిన ప్రతి మహిళకూ హార్మోన్ రీ–ప్లేస్మెంట్ చికిత్స అవసరం. వాస్తవం: అలాంటిదేమీ లేదు. మెనోపాజ్ తర్వాత కనిపించే లక్షణాలను బట్టి మాత్రమే అవసరమైతే హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్స చేస్తారు. అపోహ: వైట్ డిశ్చార్జీ క్యాన్సర్‌కు దారితీస్తుంది. వాస్తవం: ఇది నిజం కాదు. ఇన్ఫెక్షన్ ఉండి అది హెచ్‌పీవీ వంటి వాటిల్లో అయితేనే అది క్యాన్సర్‌కు దారితీయవచ్చు. గర్భాశయం అనేది మాతృత్వం, స్త్రీత్వానికి ప్రతీక. గర్భాశయం తీసివేయడం అనేది... తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయం. అంతేతప్ప... మన చిన్న చిన్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని గర్బసంచిని తొలగించుకోవడం సమంజసం కాదు. దేహ నిర్మాణంలో, ఇతర కార్యకలాపాలు సక్రమంగా జరగడంలో గర్ఛసంచి పాత్ర కీలకం. గర్భసంచి క్యాన్సర్ కనుక్కోవడం ఎలా... 1) పాప్ స్మియర్... ఎంతో సులువుగా, ఎంతో తక్కువ ఖర్చుతో చిన్న టెక్నిక్లలోనే చేయగల పరీక్ష ఇది. దీంతో సెర్విక్స్ క్యాన్సర్‌ను ప్రీ క్యాన్సర్ దశలోనే గమనించి సమర్థంగా చికిత్స చేయడం సాధ్యమవుతుంది 2) కాల్పోస్కోపీ... మాగ్నిఫికేషన్ ప్రక్రియ ద్వారా సెర్విక్స్లోని పుండు, వాపు, ఒరుపు, క్యాన్సర్ ముందు దశను కనుగొనడం జరుగుతుంది 3) సెర్వికల్ బయాప్సీ... క్యాన్సర్ అని అనుమానం వచ్చినప్పుడు సర్విక్స్‌లోని కొంత భాగాన్ని పరీక్ష చేయడం ద్వారా కనుగొనవచ్చు. పాప్‌స్మియర్ ఎప్పుడు చేయించుకోవాలి... ఇరవై నుంచి నలభై ఏళ్ల వయసులో ఉన్న మహిళలంతా తప్పనిసరిగా కనీసం ఏడాదికి ఒకసారి మూడేళ్లపాటు చేయించుకోవడం అవసరం. ఈ మూడేళ్ల రిపోర్ట్స్ మామూలుగా ఉన్నట్లయితే తర్వాత మూడేళ్లకు ఒకసారి, మెనోపాజ్ దశ చేరేవరకు, మెనోపాజ్ దశ తర్వాత ఐదేళ్లకు ఒకసారి 60 ఏళ్లు వరకు పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గర్భసంచి ఉపయోగాలు ఓవరీ నుంచి (అండాశయంలో) విడుదలైన అండం, పురుషుడి వీర్యకణంతో కలిసి, ఫెలోపియన్ ట్యూబ్స్‌లో పిండంగా ఏర్పడి గర్భసంచిలోకి ప్రవేశిస్తుంది. గర్భధారణ జరిగాక గర్భసంచిలోని ఎండోమెట్రియమ్ పొర మందంగా మారుతుంది. ఆ పొరలోకి పిండం ఒదిగిపోతుంది. పిండానికి అవసరమైన పోషకాలు అందించడం, తొమ్మిది నెలలు పిండం ఎదిగేలా తోడ్పడటం గర్భసంచిలోనే జరుగుతాయి. పిండం పూర్తిగా ఎదిగాక ప్రసవానికి కూడా తోడ్పడుతుంది. అలాగే మహిళల్లో ప్రతి నెలా వచ్చే రుతుక్రమానికి కూడా యుటెరస్ కారణమవుతుంది. ఓవరీస్ నుంచి విడుదలయ్యే అండం హార్మోన్లు, రుతుక్రమాన్ని, గర్భాన్ని నియంత్రిస్తుంది. ఇలా ఎన్నెన్నో జీవక్రియలకు కీలకం గర్భసంచి. డాక్టర్ కోటేశ్వరి గంటా కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అపోలో డీఆర్డీఓ హాస్పిటల్స్ హైదరాబాద్ -
నేను గర్భసంచిని..
గులాబి రంగులో ఉండే కండర సంచిని నేను. పొత్తికడుపు లోపల లిగమెంట్ల మధ్య ముడుచుకుని ఉంటాను. చూడటానికి పియర్ పండు ఆకారంలో ఉంటాను. నా బరువు దాదాపు 60 గ్రాములు ఉంటుంది. కొన్ని కణా సముదాయాన్ని లక్షల కోట్ల సంక్లిష్ట కణాలతో కూడిన కొత్త శిశువుగా మారేంత వరకు పోషిస్తాను. నేను ఆనంద్ భార్య లలిత గర్భసంచిని. బోలుగా ఉండే కండరాన్ని నేను బోలుగా ఉండే కండర నిర్మిత అవయవాన్ని. నా లోపలి భాగం దాదాపు ఒక టీస్పూన్ ద్రవపదార్థాన్ని ఇముడ్చుకునేందుకు అనువుగా ఉంటుంది. నా కండరాలు తరచు ముడుచుకుంటూ ఉంటాయి. అయితే, ఫలదీకరణ చెందిన అండానికి ఈ కండర సంకోచాలు ప్రమాదకరంగా ఉంటాయి. అలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు నా కండరాలను రిలాక్స్ చేసేందుకు లలిత అండాశయం ప్రొజెస్టిరాన్ హార్మోన్‌ను స్రవించడం ప్రారంభిస్తుంది. కొత్త జీవికి ఆస్కారమిచ్చేలా ప్రొజెస్టిరాన్ నన్ను సన్నద్ధం చేస్తుంది. ఫలదీకరణ చెందిన అండం ఎదుగుదలకు తగిన పోషకాలను స్రవించేలా నాలోని గ్రంథులను ప్రేరేపిస్తుంది. బిడ్డ పుట్టిన వేళ లలితకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు నేనెంతగానో సంతోషించాను. నా ఘనతను ప్రదర్శించే అవకాశం దక్కినందుకు గర్వంతో పొంగిపోయాను. లలిత అండాశయం విడుదల చేసిన అండం ఎట్టకేలకు ఫలదీకరణ చెందింది. కణ విభజన మొదలైంది. కణాల సంఖ్య ఒకవైపు పెరుగుతూ ఉంటే, ఫాలోపియన్ ట్యూబ్ నుంచి తాపీగా వాటికి ఆహారం అందేది. అండం నాలోకి చేరే సరికి దానిలోని సొన మాయమవుతుంది. ఆ సమయానికి దానికి ఆధారపడదగ్గ పోషణ వెంటనే అందాల్సిందే. లేకుంటే, కొత్త ప్రాణి మనుగడ సాగించే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అలాంటి పరిస్థితులను నేను చాలాసార్లే ఎదుర్కొన్నాను. అండం నాలోకి చేరేటప్పుడు నాలోని ఎండోమెట్రియమ్ను అంటిపెట్టికోవాలంటూ సంకేతాలిస్తుంది. ఇక అప్పుడు దానికి నిరంతరం ఆహారం సరఫరా చేసే ఒక సురక్షితమైన, వెచ్చని గూడు ఏర్పడుతుంది. బొడ్డుతాడే ఆధారం. నాలోకి కొత్తగా చేరిన అతిథికి తొమ్మిది నెలల పాటు ఇరవై నాలుగు గంటలూ పోషణ అందించాల్సిందే. ఇందుకు నాలో ఏర్పడే ప్లాసెంటా ఎంతగానో సాయం చేస్తుంది. ఫలదీకరణ చెందిన అండం నుంచి ముందుగా మెడ భాగం మొలకెత్తుతుంది. క్రమంగా ఇది దాదాపు కిలో బరువుతో ఎర్రని పిండం ఏర్పడుతుంది. దీని చుట్టుకొలత దాదాపు 18 సెంటీమీటర్లు ఉంటుంది. చూడటానికి ఇదేమంత అందంగా కనిపించదు. ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు, జీర్ణాశయం... వేటికవే పనిచేస్తూ ఉంటాయి. పిండానికి అంటిపెట్టుకుని ఏర్పడే బొడ్డుతాడే శిశువుకు ఆధారంగా ఉంటుంది. బాహ్యప్రపంచంలోకి వచ్చేంత వరకు దానికి ఆహారాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. బొడ్డుతాడులో రెండు ధమనులు, ఒక సిర ఉంటాయి. ఇందులోని ధమనులు శిశువుకు చెందిన వ్యర్థాలను ప్లాసెంటాలోకి చేరుస్తాయి. అక్కడ ఇవి విచ్ఛిన్నమై లలిత రక్తంలో కలుస్తాయి. ఆ తర్వాత ఆమె లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తుల ద్వారా బయటకు పోతాయి. బొడ్డుతాడుకు ఉండే సిర ద్వారా లలిత రక్తం నుంచి శిశువుకు నిరంతరం పోషకాలు అందుతూ ఉంటాయి. నొప్పులతో నవ శిశూదయం ఒకరోజు నొప్పులు మొదలయ్యాయి. నాలోని శిశువు బయటి ప్రపంచంలోకి వచ్చేయాలని ఆత్రపడుతోంది. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోగానే నేను ప్రసవానికి సిద్ధపడ్డాను. వెన్నులోంచి నొప్పి తన్నుకొస్తుంటే, వేలుమొన అంత పరిమాణంలో ఉండే నా సెర్విక్స్ పన్నెండు సెంటీమీటర్ల వ్యాసానికి వ్యాకోచించి, శిశువు తల బయటకు రావడానికి అనువుగా మారింది. క్రమంగా నాలోని కండర సంకోచాలను పెంచుకుంటూ పోయి, శిశువును బయటకు నెట్టడానికి ప్రయత్నించాను. లలిత పొట్ట కండరాలు, డయాఫ్రమ్ కూడా నా ప్రయత్నానికి సహకరించాయి. ఎట్టకేలకు శిశువు ఈ లోకంలోకి అడుగుపెట్టింది. ఇక నా ప్లాసెంటాతో పనిలేదు. దానిని కూడా బయటకు నెట్టేశాను. ఇక రక్తస్రావాన్ని అరికట్టడానికి వీలుగా తెరుచుకున్న నా రక్తనాళాలపై ఒత్తిడి పెంచాను. నాతో ఇబ్బందులివే లలిత జీవితంలో నేను తనకు రకరకాల ఇబ్బందులు కలిగించాను. ఆమె శరీరంలోని సమస్యాత్మక అవయవాల్లో నేనే మొదటి స్థానంలో ఉంటాను. నాతో లలితకు తరచు ఎదురయ్యే ఇబ్బంది ‘డిస్మెనోరియా’... రుతుక్రమం సమయంలో ఒక్కోసారి ఆమెకు నా వల్ల విపరీతమైన నొప్పి కలిగేది. నా కండర గోడలపై ఒక్కోసారి తెల్లని గడ్డలు (ఫైబ్రాయిడ్స్) పెరుగుతాయి. ఇవి కేన్సర్ కావచ్చేమోనని లలిత తెగ భయపడేది. అయితే, రెండువందల మందిలో ఒకరికి మాత్రమే ఈ గడ్డలు కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి నాలోని లైనింగ్ సక్రమంగా పెరగకుంటే, రుతుక్రమంలో అతిగా రక్తస్రావం కావడం, వేళ తప్పి రుతుక్రమం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ‘డైలేషన్ అండ్ క్యూరెటేజ్’ అనే చిన్నపాటి శస్త్రచికిత్సతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ప్రాణం పోస్తాను కొత్త జీవికి ప్రాణం పోయడంలో నాలో జరిగే ప్రక్రియ చాలా తేలికైనదని అనుకుంటారు. అయితే, అదంతా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఒక్కోసారి ఇది నన్ను తీవ్ర నిరాశకు కూడా గురిచేస్తుంది. నేను యుక్తవయసుకు వచ్చినప్పటి నుంచి మెనోపాజ్ దశ వరకు ప్రతినెలా రుతుక్రమాన్ని ఎదుర్కొంటూనే ఉంటాను. జీవితకాలంలో దాదాపు 400 సార్లు ఇలా జరుగుతుంది. నెలనెలా జరిగే ఈ ప్రక్రియ గొప్ప రసాయనిక చర్యతో కూడి ఉంటుంది. నాలో కొత్త రక్తనాళాలు, కొత్త గ్రంథులు, కొత్త కణజాలాలు తయారవుతూ ఉంటాయి. లలిత అండాశయంలో తయారయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంతో ఇదంతా జరుగుతుంది. కొత్త ప్రాణికి తగిన పోషణ అందించేందుకు వీలుగా నాలోని లైనింగ్ ఎరుపుగా మారుతుంది. సుతిమెత్తగా ఉండే ఎండోమెట్రియమ్ దళసరిగా మారుతుంది. గర్భధారణకు సిద్ధమయ్యే ఈ ప్రక్రియలో ప్రతిసారీ గర్భం దాల్చలేకపోవచ్చు. లలితకు ఇప్పటి వరకు మూడుసార్లు గర్భధారణ జరిగింది. నాలో మూడు మార్గాలు నాలో మూడు మార్గాలు ఉంటాయి. రెండు ఫాలోపియన్ ట్యూబులు ప్రతినెలా లలిత అండాశయం ఒక అండాన్ని విడుదల చేసేలా నా ఎగువ భాగానికి పోషణనిస్తుంటాయి. నాలోని మూడో మార్గం బోలుగా ఉండే గడ్డిపరకలాంటి నాళం. ఇది నా సెర్విక్స్ గుండా వ్యాపించి ఉంటుంది. పురుషుడి వీర్యం నాలోకి చేరడానికైనా, నాలో ప్రాణం పోసుకున్న శిశువు బయటకు రావడానికైనా ఇదే మార్గం. అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమయంలో నా సెర్విక్స్లోని మ్యూకస్ గ్రంథులు ఒక ప్రవాహాన్ని సృష్టిస్తాయి. పురుషుడి వీర్యం దీనిలోంచి ఈదుకుంటూ అండాన్ని చేరుకుంటుంది. పురుషుడి వీర్యం అండాన్ని చేరుకున్నాక నేను కొత్త ప్రాణికి రూపునిచ్చే పనిలో పడతాను. అయితే, అన్నిసార్లూ అండం ఫలదీకరణ చెందలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ ప్రక్రియ కోసం సిద్ధమైన నాలోని కొత్త కణజాలం, గ్రంథులు, రక్తనాళాలను నేను వెలుపలకు పంపేయాల్సిందే. లలితకు రుతుక్రమం రాగానే నాలో జరిగే ప్రక్రియ మళ్లీ మొదటికొస్తుంది. శిశువుతో పాటేనేనూ పెరుగుతాను ఫలదీకరణ చెందిన అండం నాలోకి చేరిన మొదటి నెలలోనే శిశువు నెమ్మదిగా ఆకారం సంతరించుకోవడం మొదలుపెడుతుంది. నాలో రోజురోజుకు పెరుగుతున్న శిశువుతో పాటే నేనూ పెరుగుతాను. అలా నా అసలు పరిమాణానికి 500 రెట్ల వరకు పెరుగుతాను. ఇలా పెరగడంలో బాగా బలాన్ని సంతరించుకుంటాను. నాలోని కండరాల పరిమాణమే కాదు, బరువు కూడా పెరుగుతాయి. పియర్ పండులాంటి నా ఆకారం క్రమంగా గోళాకారాన్ని సంతరించుకుంటుంది. ఏడోనెల వరకు శిశువు తరచు ఇటూ అటూ తిరుగుతూనే ఉంటుంది. ఏడో నెల తర్వాత గురుత్వాకర్షణ ప్రభావానికి లోనవుతుంది. శరీరంలోని మిగిలిన అవయవాల కంటే బరువుగా ఉన్న తల కింది వైపు పెట్టుకుని ఉంటుంది. గర్భస్థ స్థితిలో దాదాపు 96 శాతం శిశువులు ఇలాగే ఉంటారు. తొమ్మిదో నెల నిండే సరికి నేను బాగా పెరగడంతో పొట్టలోని చాలాభాగాన్ని ఆక్రమించేసుకుంటాను. అప్పటికి నా పని దాదాపు పూర్తయ్యే దశకు వస్తుంది.