నేను గర్భసంచిని.. | Hysterectomies special story and health tips | Sakshi
Sakshi News home page

నేను గర్భసంచిని..

Published Wed, Mar 30 2016 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

నేను గర్భసంచిని..

నేను గర్భసంచిని..

గులాబి రంగులో ఉండే కండర సంచిని నేను. పొత్తికడుపు లోపల లిగమెంట్ల మధ్య ముడుచుకుని ఉంటాను. చూడటానికి పియర్ పండు ఆకారంలో ఉంటాను. నా బరువు దాదాపు 60 గ్రాములు ఉంటుంది. కొన్ని కణా సముదాయాన్ని లక్షల కోట్ల సంక్లిష్ట కణాలతో కూడిన కొత్త శిశువుగా మారేంత వరకు పోషిస్తాను. నేను ఆనంద్ భార్య లలిత గర్భసంచిని.

  బోలుగా ఉండే కండరాన్ని
నేను బోలుగా ఉండే కండర నిర్మిత అవయవాన్ని. నా లోపలి భాగం దాదాపు ఒక టీస్పూన్ ద్రవపదార్థాన్ని ఇముడ్చుకునేందుకు అనువుగా ఉంటుంది. నా కండరాలు తరచు ముడుచుకుంటూ ఉంటాయి. అయితే, ఫలదీకరణ చెందిన అండానికి ఈ కండర సంకోచాలు ప్రమాదకరంగా ఉంటాయి. అలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు నా కండరాలను రిలాక్స్ చేసేందుకు లలిత అండాశయం ప్రొజెస్టిరాన్ హార్మోన్‌ను స్రవించడం ప్రారంభిస్తుంది. కొత్త జీవికి ఆస్కారమిచ్చేలా ప్రొజెస్టిరాన్ నన్ను సన్నద్ధం చేస్తుంది. ఫలదీకరణ చెందిన అండం ఎదుగుదలకు తగిన పోషకాలను స్రవించేలా నాలోని గ్రంథులను ప్రేరేపిస్తుంది.

  బిడ్డ పుట్టిన వేళ
లలితకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు నేనెంతగానో సంతోషించాను. నా ఘనతను ప్రదర్శించే అవకాశం దక్కినందుకు గర్వంతో పొంగిపోయాను. లలిత అండాశయం విడుదల చేసిన అండం ఎట్టకేలకు ఫలదీకరణ చెందింది. కణ విభజన మొదలైంది. కణాల సంఖ్య ఒకవైపు పెరుగుతూ ఉంటే, ఫాలోపియన్ ట్యూబ్ నుంచి తాపీగా వాటికి ఆహారం అందేది. అండం నాలోకి చేరే సరికి దానిలోని సొన మాయమవుతుంది. ఆ సమయానికి దానికి ఆధారపడదగ్గ పోషణ వెంటనే అందాల్సిందే. లేకుంటే, కొత్త ప్రాణి మనుగడ సాగించే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అలాంటి పరిస్థితులను నేను చాలాసార్లే ఎదుర్కొన్నాను. అండం నాలోకి చేరేటప్పుడు నాలోని ఎండోమెట్రియమ్‌ను అంటిపెట్టికోవాలంటూ సంకేతాలిస్తుంది. ఇక అప్పుడు దానికి నిరంతరం ఆహారం సరఫరా చేసే ఒక సురక్షితమైన, వెచ్చని గూడు ఏర్పడుతుంది.

  బొడ్డుతాడే ఆధారం.
నాలోకి కొత్తగా చేరిన అతిథికి తొమ్మిది నెలల పాటు ఇరవై నాలుగు గంటలూ పోషణ అందించాల్సిందే. ఇందుకు నాలో ఏర్పడే ప్లాసెంటా ఎంతగానో సాయం చేస్తుంది. ఫలదీకరణ చెందిన అండం నుంచి ముందుగా మెడ భాగం మొలకెత్తుతుంది. క్రమంగా ఇది దాదాపు కిలో బరువుతో ఎర్రని పిండం ఏర్పడుతుంది. దీని చుట్టుకొలత దాదాపు 18 సెంటీమీటర్లు ఉంటుంది. చూడటానికి ఇదేమంత అందంగా కనిపించదు. ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు, జీర్ణాశయం... వేటికవే పనిచేస్తూ ఉంటాయి. పిండానికి అంటిపెట్టుకుని ఏర్పడే బొడ్డుతాడే శిశువుకు ఆధారంగా ఉంటుంది. బాహ్యప్రపంచంలోకి వచ్చేంత వరకు దానికి ఆహారాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. బొడ్డుతాడులో రెండు ధమనులు, ఒక సిర ఉంటాయి. ఇందులోని ధమనులు శిశువుకు చెందిన వ్యర్థాలను ప్లాసెంటాలోకి చేరుస్తాయి. అక్కడ ఇవి విచ్ఛిన్నమై లలిత రక్తంలో కలుస్తాయి. ఆ తర్వాత ఆమె లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తుల ద్వారా బయటకు పోతాయి. బొడ్డుతాడుకు ఉండే సిర ద్వారా లలిత రక్తం నుంచి శిశువుకు నిరంతరం పోషకాలు అందుతూ ఉంటాయి.

  నొప్పులతో నవ శిశూదయం
ఒకరోజు నొప్పులు మొదలయ్యాయి. నాలోని శిశువు బయటి ప్రపంచంలోకి వచ్చేయాలని ఆత్రపడుతోంది. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోగానే నేను ప్రసవానికి సిద్ధపడ్డాను. వెన్నులోంచి నొప్పి తన్నుకొస్తుంటే, వేలుమొన అంత పరిమాణంలో ఉండే నా సెర్విక్స్ పన్నెండు సెంటీమీటర్ల వ్యాసానికి వ్యాకోచించి, శిశువు తల బయటకు రావడానికి అనువుగా మారింది. క్రమంగా నాలోని కండర సంకోచాలను పెంచుకుంటూ పోయి, శిశువును బయటకు నెట్టడానికి ప్రయత్నించాను. లలిత పొట్ట కండరాలు, డయాఫ్రమ్ కూడా నా ప్రయత్నానికి సహకరించాయి. ఎట్టకేలకు శిశువు ఈ లోకంలోకి అడుగుపెట్టింది.  ఇక నా ప్లాసెంటాతో పనిలేదు. దానిని కూడా బయటకు నెట్టేశాను. ఇక రక్తస్రావాన్ని అరికట్టడానికి వీలుగా తెరుచుకున్న నా రక్తనాళాలపై ఒత్తిడి పెంచాను.

  నాతో ఇబ్బందులివే
లలిత జీవితంలో నేను తనకు రకరకాల ఇబ్బందులు కలిగించాను. ఆమె శరీరంలోని సమస్యాత్మక అవయవాల్లో నేనే మొదటి స్థానంలో ఉంటాను. నాతో లలితకు తరచు ఎదురయ్యే ఇబ్బంది ‘డిస్మెనోరియా’... రుతుక్రమం సమయంలో ఒక్కోసారి ఆమెకు నా వల్ల విపరీతమైన నొప్పి కలిగేది. నా కండర గోడలపై ఒక్కోసారి తెల్లని గడ్డలు (ఫైబ్రాయిడ్స్) పెరుగుతాయి. ఇవి కేన్సర్ కావచ్చేమోనని లలిత తెగ భయపడేది. అయితే, రెండువందల మందిలో ఒకరికి మాత్రమే ఈ గడ్డలు కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి నాలోని లైనింగ్ సక్రమంగా పెరగకుంటే, రుతుక్రమంలో అతిగా రక్తస్రావం కావడం, వేళ తప్పి రుతుక్రమం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ‘డైలేషన్ అండ్ క్యూరెటేజ్’ అనే చిన్నపాటి శస్త్రచికిత్సతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

 ప్రాణం పోస్తాను
కొత్త జీవికి ప్రాణం పోయడంలో నాలో జరిగే ప్రక్రియ చాలా తేలికైనదని అనుకుంటారు. అయితే, అదంతా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఒక్కోసారి ఇది నన్ను తీవ్ర నిరాశకు కూడా గురిచేస్తుంది. నేను యుక్తవయసుకు వచ్చినప్పటి నుంచి మెనోపాజ్ దశ వరకు ప్రతినెలా రుతుక్రమాన్ని ఎదుర్కొంటూనే ఉంటాను. జీవితకాలంలో దాదాపు 400 సార్లు ఇలా జరుగుతుంది. నెలనెలా జరిగే ఈ ప్రక్రియ గొప్ప రసాయనిక చర్యతో కూడి ఉంటుంది. నాలో కొత్త రక్తనాళాలు, కొత్త గ్రంథులు, కొత్త కణజాలాలు తయారవుతూ ఉంటాయి. లలిత అండాశయంలో తయారయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంతో ఇదంతా జరుగుతుంది. కొత్త ప్రాణికి తగిన పోషణ అందించేందుకు వీలుగా నాలోని లైనింగ్ ఎరుపుగా మారుతుంది. సుతిమెత్తగా ఉండే ఎండోమెట్రియమ్ దళసరిగా మారుతుంది. గర్భధారణకు సిద్ధమయ్యే ఈ ప్రక్రియలో ప్రతిసారీ గర్భం దాల్చలేకపోవచ్చు. లలితకు ఇప్పటి వరకు మూడుసార్లు గర్భధారణ జరిగింది.

 నాలో మూడు మార్గాలు
నాలో మూడు మార్గాలు ఉంటాయి. రెండు ఫాలోపియన్ ట్యూబులు ప్రతినెలా లలిత అండాశయం ఒక అండాన్ని విడుదల చేసేలా నా ఎగువ భాగానికి పోషణనిస్తుంటాయి. నాలోని మూడో మార్గం బోలుగా ఉండే గడ్డిపరకలాంటి నాళం. ఇది నా సెర్విక్స్ గుండా వ్యాపించి ఉంటుంది. పురుషుడి వీర్యం నాలోకి చేరడానికైనా, నాలో ప్రాణం పోసుకున్న శిశువు బయటకు రావడానికైనా ఇదే మార్గం. అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమయంలో నా సెర్విక్స్‌లోని మ్యూకస్ గ్రంథులు ఒక ప్రవాహాన్ని సృష్టిస్తాయి. పురుషుడి వీర్యం దీనిలోంచి ఈదుకుంటూ అండాన్ని చేరుకుంటుంది. పురుషుడి వీర్యం అండాన్ని చేరుకున్నాక నేను కొత్త ప్రాణికి రూపునిచ్చే పనిలో పడతాను. అయితే, అన్నిసార్లూ అండం ఫలదీకరణ చెందలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ ప్రక్రియ కోసం సిద్ధమైన నాలోని కొత్త కణజాలం, గ్రంథులు, రక్తనాళాలను నేను వెలుపలకు పంపేయాల్సిందే. లలితకు రుతుక్రమం రాగానే నాలో జరిగే ప్రక్రియ మళ్లీ మొదటికొస్తుంది.

 శిశువుతో పాటేనేనూ పెరుగుతాను
ఫలదీకరణ చెందిన అండం నాలోకి చేరిన మొదటి నెలలోనే శిశువు నెమ్మదిగా ఆకారం సంతరించుకోవడం మొదలుపెడుతుంది. నాలో రోజురోజుకు పెరుగుతున్న శిశువుతో పాటే నేనూ పెరుగుతాను. అలా నా అసలు పరిమాణానికి 500 రెట్ల వరకు పెరుగుతాను. ఇలా పెరగడంలో బాగా బలాన్ని సంతరించుకుంటాను. నాలోని కండరాల పరిమాణమే కాదు, బరువు కూడా పెరుగుతాయి. పియర్ పండులాంటి నా ఆకారం క్రమంగా గోళాకారాన్ని సంతరించుకుంటుంది. ఏడోనెల వరకు శిశువు తరచు ఇటూ అటూ తిరుగుతూనే ఉంటుంది. ఏడో నెల తర్వాత గురుత్వాకర్షణ ప్రభావానికి లోనవుతుంది. శరీరంలోని మిగిలిన అవయవాల కంటే బరువుగా ఉన్న తల కింది వైపు పెట్టుకుని ఉంటుంది. గర్భస్థ స్థితిలో దాదాపు 96 శాతం శిశువులు ఇలాగే ఉంటారు. తొమ్మిదో నెల నిండే సరికి నేను బాగా పెరగడంతో పొట్టలోని చాలాభాగాన్ని ఆక్రమించేసుకుంటాను. అప్పటికి నా పని దాదాపు పూర్తయ్యే దశకు వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement