
నేను ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాను. పెరిమెనోపాజ్ స్టేజ్‌లో ఉన్నాను. దాంతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. ఆ సమయంలో చికాకుగా, ఆందోళనగా... ఎవరైనా ఏమైనా అంటే కొట్టాలన్నంత కోపంగా ఉంటుంది. మొదటి రెండు రోజులూ ఈ లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటాయి. దాంతో నావల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలని నేను డేట్ రాగానే లీవ్ పెడుతుంటాను. అయితే ఈ విషయమై కొందరు నా గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. కొందరైతే ఆ డేట్స్ గుర్తు పెట్టుకుని మొహం మీదే నువ్వు ఇంకా సెలవు పెట్టలేదేంటి అని వెకిలిగా అడుగుతుంటారు. నాకు చాలా బాధగా ఉంది. దీని గురించి నేను ఏమీ చేయలేనా? సలహా ఇవ్వగలరు.
– ఒక సోదరి, హైదరాబాద్
2013 పీఓఎస్‌హెచ్ చట్టం ప్రకారం, ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకటి లేదా అనేక అవాంఛనీయ(అంగీకార యోగ్యం కాని) చర్యలు లేదా ప్రవర్తన/వైఖరి ‘‘లైంగిక వేధింపు’’గా పరిగణించబడుతుంది:
1. శారీరక సంప్రదింపు (కొరకు) పురోగతి,
2. లైంగిక ప్రయోజనాలు కోరటం/అభ్యర్థించడం లేదా డిమాండ్ చేయటం, లేదా
3. లైంగిక స్వభావం కలిగిన వ్యాఖ్యలు చేయటం, లేదా
4. అశ్లీల చిత్రాలను చూపించటం లేదా
5. మరే ఇతర లైంగిక స్వభావం కలిగిన అవాంఛనీయ (ఆమోదయోగ్యం కాని) శారీరక, మౌఖిక లేదా సైగల ద్వారా ప్రదర్శించటం.
ఒక స్త్రీ తన మెనోపాజ్ దశలో ఎదుర్కొనే అనేక శారీరక – మానసిక మార్పులు, మూడ్ స్వింగ్స్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఆ కారణంగా స్త్రీ పట్ల వివక్ష లేదా శిక్షపూరిత చర్యలు తీసుకోవటం, అనుచితంగా (ఇన్‌సెన్సిబుల్) వ్యవహరించడాన్ని కూడా లైంగిక వేధింపుగానే పరిగణించాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 స్ఫూర్తి కూడా ఇదే! మీరు ఏం భయపడకుండా దీనిమీద మీ బాస్‌కి చెప్పి చూడండి. ఒకవేళ మీ పై అధికారులే మిమ్మల్ని కామెంట్ చేస్తూ బాధపెడుతుంటే మీరు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comMకు మెయిల్ చేయవచ్చు. )
(చదవండి: Japanese Tradition: ‘ఉచిమిజు’..మండు వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదించొచ్చు..!)