
హైడ్రేషన్.. వేసవిలో ఈ పదం మన ఆరోగ్యానికే కాదు, మన జీవితానికీ కీలకంగా మారుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లాంటి మెట్రో నగరాల్లో వేడి ఉష్ణోగ్రతలు, ట్రాఫిక్ కష్టాలు, ఎయిర్ కండిషనర్ల నీడలో గడిచే జీవితాలు.. ఇలాంటి కారణాలతో మన శరీరంలోని నీటి శాతం గణనీయంగా తగ్గుతుంది. దాదాపు 70 శాతం పైగా నీరుండే మానవ శరీరం డీహైడ్రేషన్‌తో తాత్కాలిక ఆరోగ్య సమస్యలు మొదలు ప్రాణాపాయ పరిస్థితులకూ చేరుకుంటుంది. ప్రధానంగా చిన్నారుల్లో, వృద్ధుల్లో ఈ సమస్య జటిలంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పళ్లరసాలు వేసవి తాపానికి, దాహానికి, దేహానికి సహజమైన పరిష్కారాలను అందిస్తున్నాయి. హైడ్రేషన్ కోసం సహజమైన, రుచికరమైన, ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం అందిస్తున్నాయి.
వేసవిలో సైతం పండే పండ్లలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల.. ఇవి తక్షణ హైడ్రేషన్‌ను కలిగిస్తాయి. ద్రాక్ష, మామిడి, కర్భూజ, పుచ్చకాయ, నేరేడు, నారింజ వంటి పండ్లు పోషక సమ్మేళనంగా రసాలతో పాటు విటమిన్స్, మినరల్స్‌ను అందిస్తాయి. వీటిలో ముఖ్యంగా విటమిన్–సీ, పొటాషియం, ఫైటో న్యూట్రియంట్స్ వంటి పోషకాలుంటాయి. ఇవి శరీరానికి జలాభిషేకం చేయడమే కాదు, హీట్ స్ట్రోక్, చెమట వల్ల వచ్చే అలసట, నీరసం వంటి వాటిని కూడా తగ్గిస్తాయి.
డీహైడ్రేషన్‌ను ఎలా తగ్గిస్తాయి?
వేసవి కాలంలో చెమట ద్వారా శరీరం నుంచి నీరు, లవణాలు (ఎలక్ట్రోలైట్స్) కోల్పోవడం సర్వసాధారణం. పళ్లరసాల్లో ఉండే సహజ పొటాషియం, సోడియం లాంటి ఖనిజాల వల్ల ఈ లోపాలను భర్తీ చేయడం సాధ్యపడుతుంది. ముఖ్యంగా నారింజ రసం శరీరానికి తక్షణ శక్తిని అందించగలవని ఆరోగ్య నిపుణుల సూచన. ముఖ్యంగా పుచ్చకాయ రసంలో 90 శాతానికి పైగా నీరు ఉండటంతో ఇది సహజ కూలెంట్‌గానూ పనిచేస్తుంది.
కూల్ డ్రింక్స్ ఎందుకు మంచివి కావు?
హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో అధికంగా వినియోగించే కూల్ డ్రింక్స్‌లో అధిక చక్కెర, కృత్రిమ రంగులు, కార్బన్‌డయాక్సైడ్ ఉంటాయి. ఇవి తాత్కాలికంగా శరీరానికి చల్లదనాన్ని కలిగించినట్టు అనిపించినా, అసలైన హైడ్రేషన్‌ను కలిగించవు. పైగా.. అధికంగా తీసుకుంటే మధుమేహం, దంత సమస్యలు, శరీర బరువు పెరగడం వంటి దీర్ఘకాలిక ప్రమాదాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఉదయం కార్యాలయానికి లేదా ఇతర పనుల మీద బయలుదేరేముందు ఓ గ్లాసు తాజా పళ్ల రసం తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. ఈ పండ్ల రసాలు రోడ్ల మీద దొరికేవి కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం శ్రేయస్కరం. షుగర్ లేని, ప్లాస్టిక్ ఫ్రీ, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మార్గం ఇదేనని వెల్‌నెస్ ట్రైనర్ల అభిప్రాయం. వేసవిలో శరీరాన్ని చల్లబరచాలంటే.. చల్లని నీళ్లు కాకుండా, ఆరోగ్యవంతమైన పళ్లరసాలు ఎంచుకోవడం ఉత్తమం.
ఎండదెబ్బ నుంచి రక్షణనిచ్చే పళ్ల రసాలు
మామిడి పానకం : సహజ చక్కెరతో, తేనెతో తయారు చేస్తే శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.
నారింజ/మోసంబి రసం : విటమిన్–సీ అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
పుచ్చకాయ రసం : శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో ఉత్తమమైనది.
ద్రాక్ష రసం : హైడ్రేషన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
తాజా కొబ్బరి నీరు : సహజమైన ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది.
(చదవండి: ఖరీదైన పండ్లకు కేరాఫ్‌గా భాగ్యనగరం..! ఏకంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, చిలీ..)