
జపనీయులు సాంకేతికంగా ఎంత ముందు ఉన్నా సంప్రదాయ పద్ధతులకు మాత్రం వీడ్కోలు చెప్పలేదు. అందులో ఒకటి... ఉచిమిజు. ‘ఉచి’ అంటే కొట్టడం లేదా తాకడం. ‘మిజు’ అంటే నీరు. ‘ఉచిమిజు’ అంటే నీటితో భూమిని తాకడం.
వేడి వేసవి నెలల్లో ‘ఉచిమిజు’ అనేది సాధారణ దృశ్యం. వీధులు, బహిరంగ ప్రదేశాలలో నీటిని చల్లుతారు. ‘ఉచిమిజు’తో నీటి బాష్పీభవనం ద్వారా చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లబరుస్తారు. ఈ పద్ధతి గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది.
గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ‘ఉచిమిజు’ను ప్రోత్సహించడానికి ప్రభుత్వంతో పాటు పర్యావరణ సంస్థలు నడుం బిగించాయి. వేసవిలో సామూహిక ఉచిమిజు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
యుకాటా, జీన్బీ అనేవి జపనీస్ వేసవి దుస్తులు. కంఫర్ట్, వెంటిలేషన్ వీటి ప్రత్యేకత. కాటన్‌తో తయారు చేసే ఈ సంప్రదాయ దుస్తులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.
సంప్రదాయ సుడేర్ స్క్రీన్‌లు శతాబ్దాలుగా జపనీస్ గృహాలలో అంతర్భాగం అయ్యాయి. వెదురు పలకలు, నాచులతో కలిపి అల్లిన స్క్రీన్‌లు ఇవి. వేసవి నెలల్లో తీవ్రమైన వేడి ప్రభావం ఇంటి లోపలి భాగాలపై పడకుండా సుడేర్ స్క్రీన్‌లు ఉపయోగిస్తారు. ఇవి వేడి నుంచి ఉపశమనం ఇవ్వడమే కాదు కళాకృతులుగా కూడా ఆకట్టుకుంటాయి.