cooling
-
డయాబెటిక్ రోగుల కోసం పోర్టబుల్ కూలింగ్ క్యారియర్!
డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఇన్సులిన్‌ను ఎప్పుడూ తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. కానీ ఇంట్లో ఫ్రిజ్ లేనివారికి ఇది కొంత ఇబ్బందికరమే. వాళ్ల విషయంలో దీనికి పరిష్కారమెలా? ఈ అంశంపైనే పరిశోధనలు చేసి ఓ కూలింగ్ క్యారియర్‌ను రూపొందించిన ఒడిశా అమ్మాయి కోమల్ పాండాకు జేమ్స్ డైసన్ అవార్డు వరించింది. స్థానికంగా లభ్యమయ్యే సులభమైన సాంకేతికతతో కొత్త ఉపకరణాలను రూపొందించేవారికి ఈ అవార్డును ప్రకటిస్తారు. మన దేశం నుంచి కోమల్ పాండాకు ఈ అవార్డుతోపాటు రూ. 5 లక్షలు బహూకరిస్తారు. కోమల్ రూపొందించిన ‘నోవోక్యారీస్’ అనే ఈ ఉపకరణంతో ఇన్సులిన్‌ను చాలాసేపు చల్లదనంలో ఉంచవచ్చు. అంతేకాదు దూరప్రయాణాల్లో, విద్యుత్ సౌకర్యాలూ, బ్యాటరీ సౌలభ్యాలు లేనిచోట్ల కూడా ఇన్సులిన్‌తోపాటు చల్లదనంలోనే ఉంచాల్సిన చాలా రకాల మందుల్ని సుదీర్ఘకాలంపాటు నిల్వ చేయవచ్చు. ‘నోవోక్యారీస్’ రూపకల్పనకు తన తండ్రి నుంచే కోమల్‌కు స్ఫూర్తి లభించింది. ఆయన ఓ డయాబెటిస్ బాధితుడు. ఆఫీసులో ఫ్రిజ్ లేదు. దూరప్రయాణాలప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ఆయన మాత్రమే కాదు... ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుల ప్రకారం దాదాపు 20 శాతం మందులు ఇలా దూర్రప్రాంతాలకు ప్రయాణం చేసేవారి విషయంలో, రిఫ్రిజిరేటర్ సౌకర్యం లేకపోవడం వల్ల చెడిపోతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటోంది. ఇలాంటి వారికి ఇదెంతో ప్రయోజనం. (చదవండి: కమ్మటి కబుర్ల కమ్యూనిటీ కిచెన్..! వంటరికి విస్తరి.. ) -
కరెంట్‌తో పనిలేకుండానే వాటర్‌ని కూల్ చేసుకునే సింపుల్ టెక్నిక్!
ఖరీదైన సౌకర్యాలు సమకూర్చుకునేంత సంవద పేదల దగ్గర లేకపోవచ్చు. అయితే ప్రత్యామ్నాయ ఐడియాలకు మాత్రం కొదవ లేదు అని చెప్పే వీడియో ఇది. ఒక మూరుమూల గ్రామంలో ఒక పేదింటి మహిళ ‘ఫ్రిడ్జ్ అవసరం లేకుండా వాటర్‌ను సింపుల్‌గా ఇలా కూల్ చేసుకోవచ్చు’ అంటూ ఒక వాటర్బాటిల్లో నీళ్లుపోసి దానికి తడి వస్త్రం చుట్టి చెట్టుకొమ్మలకు వేలాడదీసింది.పావు గంటలో ఆ నీళ్లు చల్లబడ్డాయి. ‘తడి వస్త్రం బాటిల్ లోపల ఉన్న వేడిని బయటికి లాగుతుంది. మా ఊళ్లో అందరం ఇలాగే చేస్తాం’ అంటుంది ఆ యువతి. నిజానికి గతంలోకి వెదుక్కుంటూ వెళితే, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలాంటి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఆర్గానిక్ ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఐడియాలన్నీ పర్యావరణానికి హాని కలిగించనివే. పాపులర్ కంటెంట్ క్రియేటర్ దివ్య సిన్హా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Divya Sinha (@divyasinha266)(చదవండి: కేన్స్‌లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!) -
హాయి హాయిగా... కూల్ కూల్‌గా!
ఎలాంటి క్యాప్షన్ లేకుండా రమీజ్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చెన్నై ఆటోడ్రైవర్ వీడియో 3 కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘ఏమిటీ ఆటోడ్రైవర్ స్పెషాలిటీ?’ అనే విషయానికి వస్తే... ఎండా కాలంలో చెన్నైలో వేడి అంతా ఇంతా కాదు. ఈ వేడిని తట్టుకోవడానికి సదరు ఆటోడ్రైవర్ ఎకో ఫ్రెండ్లీ ఏసీ ఫ్యాన్‌ను తయారుచేసి తన ఆటోలో బిగించాడు. ఆటోడ్రైవరే కాదు ప్రయాణికులు కూడా హాయి హాయిగా కూల్ కూల్‌గా ప్రయాణిస్తున్నారు. -
వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!
వేసవిలో బాడీని చల్లగా చేసే గోండ్ కటీరా గురించి విన్నారా? ఇది ఎడిబుల్ గమ్. దీని వలన ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలను బలంగా ఉంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శక్తిని పెంచుతుంది. గోండ్ కటీరా మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..! గోండ్ కటీరా అనేది తినగలిగే గమ్. ఇది కిరాణా షాపుల్లో, ఆన్లైన్లో కూడా దొరుకు తుంది. వేసవిలో చల్లదనం కోసం దీన్ని తాగితే, చాలా లాభాలున్నాయి. గోధుమ బంక లేదా బాదాం బంక అనే పేర్లతో ప్రసిద్ధి. దీన్ని ఆస్ట్రాగాలస్ ప్రొపింకస్ అనే నాచు రకం మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. ఇది పౌడర్ లేదా క్యాండీ రూపంలో లభిస్తుంది. గోండ్ కటీరా జ్యూస్ ముందుగా ఈ గమ్‌ను కొద్దిగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. దీంతో ఇది ఒక జెల్లాగా తయారవుతుంది. దీన్ని ఒక గ్లాస్లో తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా తరగిన పుదీనా వేసుకోండి. ఇక చివరగా కాస్తంత నిమ్మరసం కలుపుకొని, గ్లాసు నిండా నీళ్లు పోసుకొని చక్కగా తాగెయ్యడమే. కావాలంటే ఒకటి రెండు ఐస్‌క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీని పౌడర్‌ను పాలలో కలుపుకొని తాగటం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. గోండ్ కటీరా ఆరోగ్య ప్రయోజనాలు: ఆయుర్వేద వైద్యంలో దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జిగురు లాంటి పదార్ధమైన గోండ్ కటిరా రుచికరమైంది ఇది అనేక పోషకాలతో నిండి ఉంది. అందుకే పంజాబ్‌లో రుచికరమైన గోండ్కే లడ్డూ, పిన్నియాన్ బాగా పాపులర్. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువ. అందుకే ప్రేగు కదలికలను సులభంచేసి మలబద్ధకానికి మంచి ఉపశమనంగా పని చేస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో ప్రయోజనకరమైన సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. తల్లి, పిండం ఇద్దరికీ ఆరోగ్యకర మైన ఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాదు గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పోషకాలు అధికం కాబట్టి బాలింతల్లో పాలను వృద్ధి చేస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మిశ్రమమైన ఇది శక్తిని పెంచుతుంది పునరుత్పత్తి ఆరోగ్యానికి మంచిది. పురుషులలో కొన్ని పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళల్లో పీరియడ్ సమస్యలకూ మంచింది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇందులోని కరిగే ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. -
ఏం టెక్నాలజీ గురూ.. సంచిలో పడేస్తే చల్లగా ఉంటాయట
కూల్‌డ్రింక్స్, వైన్, బీరు వంటివి చల్లగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఇవన్నీ చల్లగా దొరకాలంటే కుదిరే పని కాదు. వాటి కోసం పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను లేదా ఐస్‌మేకర్లను తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే, పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఈ సంచి వెంట ఉంటే చాలు. పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను, ఐస్‌మేకర్లను మోసుకుపోనవసరం ఉండదు. ముందుగానే ఇంట్లోని ఫ్రిజ్‌లో చల్లబరచిన పానీయాల సీసాలు,క్యాన్లను ఇందులో పడేసుకుని తీసుకుపోతే చాలు. ఇందులో భద్రపరచిన సీసాలు, క్యాన్లు ఇరవైనాలుగు గంటలసేపు ఏమాత్రం చల్లదనం కోల్పోకుండా, అప్పుడే ఫ్రిజ్‌లోంచి బయటకు తీసినట్లుగా ఉంటాయి. కట్టుదిట్టమైన ఇన్సులేషన్‌తో రూపొందించిన ఈ బ్యాగ్ లోపల ఎంత చల్లని వస్తువులను ఉంచినా, బయటకు ఏమాత్రం నీరు చిమ్మదు. కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘కూలీ’ పేరుతో ఈ బ్యాక్‌ప్యాక్ కూలర్ బ్యాగును ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరు రంగుల్లో దొరికే ఈ బ్యాగు ధర 50 డాలర్లు (రూ.4,131) మాత్రమే! -
అంతరిక్ష యుద్ధంలో చల్లగా చావు దెబ్బ
అంతరిక్ష యుద్ధంలో చైనా నానాటికీ దూసుకుపోతోంది. ఇంధన ఆయుధ పరిజ్ఞానంలో అతి గొప్ప పురోగతి సాధించినట్లు చైనా సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. కనీ వినీ ఎరుగని అత్యాధునిక కూలింగ్ సిస్టం ఒకదాన్ని కనిపెట్టినట్టు చంగ్ షాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. అత్యంత హెచ్చు ఇంధన సామర్థ్యంతో కూడిన లేజర్లను పెద్దగా వేడెక్కనేయకుండా, నిరంతరం శక్తివంతంగా, ఎంతటి పెను దాడికైనా నిత్యం సిద్ధంగా ఉంచేందుకు ఈ విధానం దోహదపడుతుందని వర్సిటీ వర్గాలను ఉటంకిస్తూ సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ వార్తా సంస్థ ఒక కథనం వెలువరించింది. ఈ విధానం సఫలమైందన్న వార్త నిజమైతే చైనా అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలు అతి శక్తివంతమైన లేజర్ కిరణాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విచ్చలవిడిగా ప్రయోగించగలవు. అప్పుడిక యుద్ధం తీరు తెన్నులే సమూలంగా మారిపోతాయని సంబంధిత వర్గాలు విశ్లేíÙంచాయి. పరిశోధన వివరాలను చైనీస్ జర్నల్ ఆక్టా ఆప్టికా సైనికాలో ప్రచురితమయ్యాయి. వేడే అసలు శత్రువు ఇలాంటి అతి శక్తివంతమైన లేజర్ ఆయుధాలను ప్రయోగించే క్రమంలో భరించలేనంత వేడి ఉద్భవిస్తుంది. ఇది సదరు ఆయుధాలకే తీవ్రంగా నష్టం చేస్తుంది. దీంతో ఆయుధం పాడవకుండా ఉండేందుకు ఆ వేడిని సంపూర్ణంగా తట్టుకునే కూలింగ్ వ్యవస్థను కనిపెట్టినట్టు చైనా చెబుతోంది. లేజర్ ఆయుధాల అభివృద్ధిలో ఇలా వాటిని చల్లబరచడమే అతి పెద్ద సాంకేతిక సవాలు. అమెరికా అప్పట్లోనే తయారు చేసినా... అమెరికా అప్పట్లోనే తయారు చేసినా... ఇలాంటి అత్యాధునిక లేజర్ ఆయుధ వ్యవస్థల తయారీలో అమెరికా చాలాకాలంగా ఎంతో ముందుంది. నేవీ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫ్రా రెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్డ్ లేజర్ వంటివెన్నో ఇందులో ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రయోగించినప్పుడు అద్భుతాలు చేశాయి. శబ్ద వేగాన్ని మించి దూసుకుపోగల సూపర్ సానిక్ క్షిపణులను సైతం ధ్వంసం చేసి చూపించాయి. అయితే భారీ పరిమాణం, బరువు కారణంగా వాటిని అటకెక్కించారు. పైగా వాటి పరిధి మహా అయితే కొన్ని కిలోమీటర్లు మాత్రమే. కానీ లేజర్ కాంతి పుంజం విధ్వంసక శక్తిని ఎన్నో రెట్లు పెంచినట్లు లేజర్ కాంతిపుంజ ఆయుధాల శాస్త్రవేత్త యువాన్ బృందం చెబుతోంది. స్పేస్ ఎక్స్ పైకీ ప్రయోగం? కూలింగ్ సిస్టమ్ సాయంతో పనిచేసే ఈ అధునాతన లేజర్ క్షిపణి వ్యవస్థ సంప్రదాయ వ్యవస్థలతో పోలిస్తే చాలా చవకైనది. ఎంతో ప్రభావవంతమైనది కూడా. పైగా దీన్ని రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే స్పేస్ ఎక్స్ తాలూకు స్టార్ లింక్ వంటి ఉపగ్రహ వ్యవస్థల పైకి ఈ లేజర్ ఆయుధాలను ప్రయోగించే యోచనలో చైనా ఉన్నట్టు చెబుతున్నారు. హెచ్ యు ఇంధన సామర్థ్యంతో కూడిన లేజర్ ఆయుధాల ప్రయోగం విషయంలో ఇది నిజంగా ఒక గొప్ప ముందడుగు –లేజర్ కాంతి పుంజ ఆయుధాల శాస్త్రవేత్త యువాన్ షెంగ్ ఫు –సాక్షి, నేషనల్ డెస్క్ -
రెక్కల్లేని ఫ్యాన్.. ధర తక్కువ & నిమిషాల్లో చల్లదనం
ఈ ఫొటోలో గది మధ్య స్తంభంలా కనిపిస్తున్నది 36 అంగుళాల టవర్ ఫ్యాన్. దీనికి రెక్కలు లేకపోయినా, దీన్ని ఆన్ చేసుకుంటే గదిలో గాలికి లోటుండదు. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘వెసింక్’కు అనుబంధ సంస్థ అయిన ‘లెవోయిట్’ ఈ స్తంభంలాంటి టవర్ ఫ్యాన్‌ను ఇటీవల విడుదల చేసింది. మిగిలిన ఫ్యాన్ల మాదిరిగానే దీనిలోనూ గాలి వేగాన్ని అదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, మామూలు ఫ్యాన్ల మాదిరిగా ఇది శబ్దం చేయదు. (ఇదీ చదవండి: సమయం ఆదా చేసే 'అల్ట్రాస్పీడ్ త్రీడీ ప్రింటర్' - ధర ఎంతంటే?) తొంభై డిగ్రీల కోసం అటూ ఇటూ తిరుగుతూ గాలిని కోరుకున్న వేగంలో ప్రసరిస్తుంది. అంతేకాదు, ఇందులో ఇంకో విశేషమూ ఉంది. ఇది ‘టెంపరేచర్ రెస్పాన్సివ్ ఫ్యాన్’. అంటే, ఈ ఫ్యాన్ గదిలోని ఉషోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. లోపల బాగా వేడిగా ఉంటే, ఇందులోని సెన్సర్లు ఉషోగ్రతను గుర్తించి, నిమిషాల్లోనే గదిని చల్లబరుస్తాయి. ఇది దాదాపుగా ఏసీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీని ధర 69.99 డాలర్లు (రూ. 5,743) మాత్రమే! -
వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!
చాలా రోజులుగా ఊరిస్తున్న వన్ ప్లస్ 11 (OnePlus 11) కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్‌ను తాజాగా ఆవిష్కరించింది. గతంలో ఎప్పుడూ చూడని ఓ సరికొత్త ఫీచర్‌ను ఇందులో తీసుకొచ్చింది. అదే యాక్టివ్ క్రియోఫ్లక్స్ కూలింగ్ సొల్యూషన్. ఈ యాక్టివ్ క్రియోఫ్లక్స్ అనేది సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఉండే క్లోజ్డ్-లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌కి మరో పేరు. కానీ దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనువుగా రూపొందించారు. ఫోన్ మధ్యలో ఒక సిరామిక్ పైజోఎలెక్ట్రిక్ మైక్రోపంప్ ఉంటుంది. ఇది చిన్నచిన్న గొట్టాల ద్వారా కూలింగ్ ద్రవాన్ని ఫోన్ అంతటికీ పంపుతుంది. ఇది రేడియేటర్‌గా పనిచేసి ఫోన్ హీట్‌ను గ్రహించి చల్లబరుస్తుంది. ఈ యాక్టివ్ క్రయోఫ్లక్స్ కూలింగ్ సిస్టమ్ ఫోన్ ఉష్ణోగ్రతలను 2.1 డిగ్రీల వరకు తగ్గించగలదని వన్ ప్లస్ పేర్కొంది. ఇది ఛార్జింగ్ సమయంలోనే ఉష్ణోగ్రతను 1.6 డిగ్రీలకు తగ్గిస్తుంది. దీంతో ఛార్జింగ్ సమయం కూడా ఆదా అవుతుంది. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) ఇక మిగిలినవి ఫోన్ డిజైన్ ఇతర ఆకృతులకు సంబంధించినవి. ఫోన్ వెనుక కవర్ కోసం వంపు తిరిగిన, పారదర్శక గాజును ఉపయోగించారు. దీంతో వెనుకవైపు కూలింగ్ ద్రవం ప్రవహించే ప్రకాశవంతమైన గొట్టాలను చూడవచ్చు. అలాగే కెమెరా చుట్టూ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే వన్ ప్లస్ ఈ కాన్సెప్ట్ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని ఎప్పుడు మొదటు పెడుతుందో స్పష్టత లేదు. ఇలాగే 2020లో వన్‌ప్లస్ ఆసక్తికరమైన సెల్ఫ్-టింటింగ్ కెమెరా కవర్ క్లాస్‌ను ఆవిష్కరించింది. కానీ వాటిని ఉత్పత్తి చేయలేదు. -
గ్లోబల్ వార్మింగ్‌కు... చంద్రధూళితో చెక్.. తవ్వి తీసి వెదజల్లడమే!
చంద్రుడంటేనే చల్లదనానికి చక్కని ప్రతీక. అందుకే చల్లని రాజా అంటూ చందమామపై సినీ కవులు ఎన్నో పాటలు కూడా కట్టారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నానాటికీ ప్రమాదకరంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట వేసి భూమిని చల్లబరిచేందుకు కూడా చంద్రుడు ఎంతో సాయపడగలడట. అమెరికా సైంటిస్టుల బృందమొకటి ఈ దిశగా వినూత్నమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. చంద్రధూళిని అంతరిక్షంలోకి వెదజల్లడం! తద్వారా భూమిపై పడే సూర్యరశ్మిని కొద్దిగా మళ్లించడం!! ఆ మేరకు భూమిని చల్లబరచడం..!!! ఏమిటీ ప్రతిపాదన...? చంద్రునిపై ఉన్న ధూళిని భారీ పరిమాణంలో తవ్వి తీయాలి. దాన్ని సూర్యునికేసి వెదజల్లాలి. అది భారీ ధూళి మేఘాల రూపంలో కనీసం ఓ వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో నిలిచి ఉండేలా చూడాలి. అది చెదిరిపోయాక చంద్రునిపై మరో దఫా తవ్వకం. మరో వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో మరిన్ని ధూళి మేఘాలు. ఇలా మొత్తమ్మీద ఏటా ఏకంగా కోటి టన్నుల చంద్ర ధూళిని భూమికి, సూర్యునికి మధ్య మేఘాల రూపంలో వెదజల్లాలన్నది ప్రతిపాదన. ఏమిటి సమస్య? ► చంద్ర ధూళిని అంతరిక్షంలో వెదజల్లడం వినడానికి బానే ఉన్నా అందుకు చాలా సాంకేతికత అవసరం. అంతేగాక సాంకేతిత, రాజకీయ సవాళ్లతోనూ, అంతకుమించి భారీ వ్యయ ప్రయాసలతోనూ కూడిన పని కూడా. ఎందుకంటే... ► అన్నింటికంటే ముందుగా చంద్రునిపై భారీ సైజులో ఓ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధూళిని తవ్వి పోసే పరికరాలు తదితరాలను అక్కడికి చేరేసుకోవాలి. ► గత 50 ఏళ్లలో మనిషి చంద్రునిపై కాలు పెట్టలేదన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా ఎంత కష్టమో అర్థమవుతుంది. ► రాజకీయంగా చూస్తే ఈ మొత్తం ప్రయోగానికి ఎవరు సారథ్యం వహించాలి, ఇందులో ఏ దేశం పాత్ర ఎంతమేరకు, ఎలా ఉండాలన్నది మరో పెద్ద ప్రశ్న. అంతరిక్షంపై ఆధిపత్యం కోసం ఇప్పటికే పెద్ద దేశాల మధ్య పోటీ ఉద్రిక్తతలకు దారితీస్తున్న వేళ కేవలం ఓ పర్యావరణ లక్ష్యసాధన కోసం ఆభిజాత్యాలను పక్కన పెట్టి అవన్నీ ఏ మేరకు కలిసొస్తాయన్నది అనుమానమే. ► అంతరిక్షంలో భూమికి, సూర్యునికి మధ్య ప్రాంతమంతా పలు దేశాలు ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహాలతో నిండిపోయి ఉంది! ► ఇన్ని కష్టాలూ పడి ఒకవేళ విజయవంతమైనా ధూళిని వెదజల్లే ఉపాయం తాత్కాలిక ఫలితాలే ఇస్తుంది తప్ప గ్లోబల్ వార్మింగ్‌కు శాశ్వతంగా అడ్డుకట్టు వేసే స్థాయిలో దీర్ఘకాలికంగా పెద్దగా ప్రయోజనం కన్పించకపోవచ్చని కొందరు సైంటిస్టులు పెదవి విరుస్తున్నారు. చంద్రధూళే ఎందుకు? ► భూమిపై పడే సూర్యరశ్మి పరిమాణాన్ని కొంత మేరకు తగ్గించడం ద్వారా భూమిని చల్లబరచాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా ఉన్నవే. దీన్ని సోలార్ జియో ఇంజనీరింగ్, సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్‌గా పిలుస్తున్నారు. ► భూ వాతావరణపు పై పొరలోకి వాయు కణాలతో కూడిన సన్నని లేయర్‌ను పంపి భూమిపైకి వచ్చే సూర్యరశ్మిని కొద్దిమేరకు అడ్డుకోవాలన్న ప్రతిపాదనపై విస్తృతంగా చర్చ జరిగింది. కానీ ఇది ఆచరణసాధ్యం కాదని, ఇలా వాతావరణపు పొరలతో చెలగాటమాడితే భూమిపై పలు ప్రాంతాల్లో వర్షపాతం తదితరాలు తీవ్రంగా ప్రభావితం కావచ్చన్న భయాల నేపథ్యంలో దానిపై ముందడుగు పడలేదు. ► మరికొందరు అంతరిక్షంలో భారీ అద్దాలు, లేదా ఫిల్టర్లను ఉంచాలని సూచించినా అవేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ► అదే చంద్రధూళిని వాడుకోగలిగితే ఇలాంటి సమస్యలేవీ లేకుండానే దిగ్విజయంగా పని పూర్తవుతుందన్నది తాజా యోచన. ► ఎందుకంటే చంద్రుని ఉపరితలంపై అది అపారంగా అందుబాటులో ఉంది. ► గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే చంద్రుని పై నుంచి ధూళి మేఘాలను అంతేగాక భూమి పై నుంచి జరిపే ఏ ప్రయోగంతో పోల్చినా అత్యంత తక్కువ వ్యయ ప్రయాసలతో సులువుగా అంతరిక్షంలోకి తరలించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిప్‌ల వేడికి చిప్‌తోనే చెక్.. కంప్యూటర్లలో వేడి పెరిగితే సమస్య ఏమిటి?
మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉన్నట్టుండి ఆగిపోతోందా? విపరీతంగా వేడెక్కి సక్రమంగా పనిచేయడం లేదా? లోపలున్న ఫ్యాన్లు, హీట్ సింక్లతో ప్రయోజనం ఉండట్లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ మీరు అవునని జవాబు చెబుతుంటే ఈ కథనం మీ కోసమే. ఎందుకంటే.. ఫ్యాన్ల అవసరమే లేకుండా ఓ భారతీయ అమెరికన్... పీసీ, ల్యాప్‌టాప్‌లను చల్లబరిచేందుకు ఓ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించాడు కాబట్టి! కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకూ.. వేడికి అవినాభావ సంబంధం ఉంది. అవి పనిచేస్తుంటే ప్రాసెసర్ వేడెక్కుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ వేడిని తొలగించకపోతే పీసీ, ల్యాప్‌టాప్‌ల పని సామర్థ్యం తగ్గడమే కాకుండా కొన్ని సందర్భాల్లో లోపలి సర్క్యూట్లు కాలిపోవచ్చు. ఈ సమస్యలను అధిగమించేందుకు తొలినాళ్ల నుంచి ఫ్యాన్లు ఉపయోగిస్తుండగా ఇటీవలి కాలంలో హీట్ సింకు ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాటితో ప్రయోజనం అంతంతగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా స్టార్టప్ సంస్థ ఫ్రోర్ సిస్టమ్స్ గత నెలలో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించిన ఎయిర్‌జెట్ టెక్నాలజీ ఆధారిత పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కూడా ఒక చిప్లాంటిదే. కాకపోతే వేడిని తొలగించేందుకే ఉపయోగపడుతుంది. కొన్ని ఎయిర్‌జెట్ చిప్‌లను కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లలో ఏర్పాటు చేసుకుంటే అత్యంత సమర్థంగా వేడిని తొలగించుకోవచ్చని ఇండియన్–అమెరికన్, ఫ్రోర్ సంస్థ సీఈవో డాక్టర్ మాధవపెద్ది శేషు చెబుతున్నారు. డాక్టర్ సూర్య పి. గంటితో కలసి ఆయన ఫ్రోర్ సిస్టమ్స్‌ను స్థాపించారు. వేడి పెరిగితే సమస్య ఏమిటి? వేడిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే కంప్యూటర్ల సామర్థ్యం తగ్గిపోతుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ మైక్రోప్రాసెసర్లు ఉపయోగిస్తున్నాం. వాటి వేగం పెరిగిన ప్రతిసారీ అవి ఉత్పత్తి చేసే వేడి కూడా ఎక్కువ అవుతుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఇది గరిష్టంగా 70 శాతం వరకూ ఉండవచ్చు. పైగా 13 అంగుళాల సైజుండే అత్యాధునిక 4.8 గిగాహెర్ట్ ్జప్రాసెసర్ నోట్‌బుక్ 56 వాట్ల విద్యు త్ ఖర్చు చేస్తుంది. దీనివల్ల ఎక్కువవుతున్న వేడిని ఫ్యాన్లు, హీట్‌సింక్, పైపుల్లాంటివి తొలగించలేవు. ఫలితంగా ప్రాసెసర్లు కాలిపోకుండా వాటి వేగాన్ని తగ్గించేలా కంపెనీలు ఏర్పాట్లు చేశాయి. ప్రత్యేకతలెన్నో.. ఎయిర్‌జెట్ టెక్నాలజీతో ఇప్పుడు రెండు చిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌జెట్ మినీ కేవలం 270 మిల్లీమీటర్ల వెడల్పు, 41.5 మిల్లీమీటర్ల పొడవు, 2.8 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది. కానీ ఒకే ఒక్క వాట్ విద్యుత్‌ను వాడుకుంటూ ఇది 5.25 వాట్లకు సరిపడా వేడిని తొలగించగలదు. కొంచెం పెద్దదైన ఎయిర్‌జెట్ ప్రో 31.5 మి.మీ. వెడల్పు, 71.5 మి.మీ. పొడవు ఉంటుంది. ఇది వాడే విద్యుత్ 1.75 వాట్లు కాగా.. తొలగించగల వేడి 10.75 వాట్లకు సరిపడా ఉంటుంది. ఈ రెండు చిప్‌ల నుంచి వెలువడే శబ్దం దాదాపుగా శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే ఇవి గరిష్టంగా 24 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దం చేస్తాయి. వీటి బరువు 13 నుంచి 22 గ్రాముల మధ్యే ఉండటం విశేషం. 13 అంగుళాల నోట్‌బుక్‌లో 4 ఎయిర్‌జెట్ మినీలను ఉపయోగిస్తే మైక్రోప్రాసెసర్ సామర్థ్యం 100 %వరకూ పెరుగుతుందని, 15 అంగుళాల నోట్‌బుక్‌లో 3 ఎయిర్‌జెట్ ప్రోలను వాడటం ద్వారా సామర్థ్యం 50% పెంచవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ పరికరాలు డస్ట్ ప్రూఫ్ కావడం వీటి ప్రత్యేకత. క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు.. ఫ్రోర్ సిస్టమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మైక్రోపాసెసర్ల తయారీ సంస్థ ఇంటెల్... భవిష్యత్తులో తాము తయారు చేయబోయే ల్యాప్‌టాప్‌లలో ఎయిర్‌జెట్ సాంకేతికతను ఉపయోగిస్తామని ప్రకటించింది. క్వాల్‌కాం... ఫ్రోర్ సిస్టమ్స్‌లో పెట్టుబడులు పెట్టింది. ప్రపంచంలోని 10 చిప్ తయారీ సంస్థల్లో ఐదు సంస్థలు ఇప్పటికే ఫ్రోర్ సిస్టమ్స్‌తో జట్టుకట్టాయి. అయితే ఎయిర్‌జెట్ మినీ, ప్రో ఇంకా ఉత్పత్తి దశలోనే ఉన్నందున వాటి ధరల వివరాలు తెలియరాలేదు. – సాక్షి, హైదరాబాద్ ప్రపంచంలోనే తొలిసారి వినూత్న పరిష్కారం వేడి సమస్యను ఎదుర్కొనేందుకు ఫ్రోర్ సిస్టమ్స్ సిద్ధం చేసిన ఎయిర్‌జెట్ టెక్నాలజీ ప్రపంచంలోనే తొలి సాలిడ్ స్టేట్ కూలింగ్ టెక్నాలజీ. ఇందులో రెండు పొరలుంటాయి. పైనున్న పొరలో సూక్ష్మ రంధ్రాలు ఏర్పాటు చేశారు. కింద రాగితో చేసిన పొర ఉంటుంది. రెండింటికీ మధ్యలో కంపించే త్వచాల్లాంటివి ఉంటాయి. ఈ వైబ్రేటింగ్ మెంబ్రేన్స్ వేడిని గ్రహించినప్పుడు వేగంగా కంపిస్తాయి. ఫలితంగా అక్కడున్న వేడిగాలి ఒత్తిడికి గురై కిందనున్న రాగిపొర వద్దకు చేరుకుంటుంది. కొంత వేడిని ఈ రాగిపొర గ్రహిస్తుంది...మిగిలిన వేడిగాలి చిప్‌కు గొట్టంలాంటి ఏర్పాటు ద్వారా బయటకు ప్రయాణిస్తుంది. ఫ్యాన్లు చేసే పనే ఇక్కడ మెమ్స్ మెంబ్రేన్స్ చేస్తున్నాయన్నమాట. -
AP: పేదల ఇళ్లు చల్లగా.. నిర్మాణాల్లో ప్రపంచశ్రేణి సాంకేతికత
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణాల్లో ప్రపంచశ్రేణి సాంకేతికతను వినియోగించడం ద్వారా గాలి, వెలుతురు బాగా వచ్చేలా.. ఇళ్లలో శీతలీకరణ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యుత్ బిల్లులను ఆదా చేసే ఈ సాంకేతికతను ‘ఎకో–నివాస్ సంహిత’ పేరిట అమలు చేయాలని నిర్ణయించింది. గృహ నిర్మాణ శాఖ ద్వారా చేపడుతున్న 28.3 లక్షల ఇళ్లలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో లబ్ధిదారుల అంగీకారంతో దీనిని అమలు చేస్తారు. ఇంధన సామర్థ్య బిల్డింగ్ డిజైన్ల ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించే విధంగా ఇళ్ల నిర్మాణాలు జరుపుతారు. ప్రజాహితం.. పర్యావరణ పరిరక్షణ దేశంలో మొత్తం విద్యుత్ వినియోగంలో భవనాల వాటా 38 శాతం కాగా.. 20 ఏళ్ల నుంచి ఇప్పటివరకు ఈ రంగంలో విద్యుత్ వినియోగం మూడు రెట్లు కంటే ఎక్కువగా పెరిగింది. భవిష్యత్‌లో ఇది మరింత పెరగనుంది. ఎకో నివాస్ పథకం ద్వారా ప్రపంచ శ్రేణి ‘ఇండో స్విస్ ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్ టెక్నాలజీ’ని అమలు చేస్తారు. దీనివల్ల శీతలీకరణ జరిగి ఇళ్లలో ఉష్ణోగ్రతలు కనీసం 2 డిగ్రీల వరకు తగ్గుతాయి. ఈ టెక్నాలజీ వల్ల సహజ వెలుతురు పెరగడంతో పాటు 20 శాతం విద్యుత్ బిల్లులు కూడా ఆదా అవుతాయి. గ్రీన్హౌస్ వాయువులు (కర్బన ఉద్గారాలు) కూడా తగ్గుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, భవిష్యత్‌లో ఇంధన డిమాండ్‌ను అరికట్టడానికి, ఇంధన పొదుపు చేయడానికి ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లోనూ.. వెయ్యి చదరపు మీటర్ల ప్లాట్ లేదా 2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల కమర్షియల్, నాన్ రెసిడెన్షియల్ భవనాల నిర్మాణ అనుమతులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఏపీ ఈసీబీసీ)ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలోనూ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మొదటి దశలో రూ.28 వేల కోట్ల అంచనా వ్యయంతో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే 10,055 లేఅవుట్లలో 10.7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటన్నిటితో పాటు మొత్తం 28.3 లక్షల ఇళ్లలోనూ ఈసీబీసీని అమలు చేయనుంది. ‘ఎకో–నివాస్’ ఇలా.. ►పగటిపూట సహజ సిద్ధ వెలుతురు (సూర్యరశ్మి) ఇంటిలోకి వచ్చే విధంగా డిజైన్ ఉంటుంది. ►రేడియంట్ కూలింగ్ విధానం ద్వారా ఇంట్లో ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండేలా సీలింగ్, గోడలకు ప్రత్యేక ఫోమ్‌ని, పెయింట్స్ వినియోగిస్తారు. ►ఫ్లోర్పైనా ఇంటిని చల్లబరిచే ప్రత్యేక టైల్స్ అమర్చుతారు. హార్డ్ ఉడ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. ►కిటికీలకు అమర్చే అద్దాలు కూడా ప్రత్యేకంగా రూపొందించినవే ఉంటాయి. ►అత్యంత మన్నిక కలిగిన ఇన్సులేటెడ్ తలుపులను అమర్చుతారు. ఇవి ఫైబర్ గ్లాస్‌తో తయారైనప్పటికీ కలపతో చేసినవిగానే కనిపిస్తాయి. ►వాటర్ పైపులు కూడా ప్రత్యేకమైనవే ఉంటాయి. ఇవి వేడి నీటిని త్వరగా చల్లారనివ్వవు. ►ఇంటి ఆవరణలో మొక్కలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తారు. ఇంటి లోపల విద్యుత్‌ను ఆదా చేసే ఎల్ఈడీ బల్బులు, ట్యూబులైట్లు, ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యాన్లు అమర్చుతారు. ►వంట గది, బాత్రూమ్, టాయిలెట్.. ఇలా ప్రతి నిర్మాణంలోనూ ఇంధన ఆదాను దృష్టిలో ఉంచుకుంటారు. -
ఈ 'కూలింగ్ పేపర్' ఉంటే చాలు ఇంట్లో ఏసీ అక్కర్లేదు!
భూమి మీద రోజు రోజుకి భారీగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. వేసవి కాలంలో ఈ ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏసీ, కూలర్లు వారి ఇంట్లో వాడుతున్నారు. వీటి వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో దీని ప్రభావం వాతావరణం మీద పడుతుంది. ఇలా ఏసీలు, కూలర్ల వల్ల డబ్బు వృదా కావడంతో పాటు వాతావరణం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, ఈ సమస్యకు చైనాకు చెందిన ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న యీ జెంగ్(Yi Zheng) పరిష్కారం కనుగొన్నారు. సంప్రదాయ కూలింగ్ వ్యవస్థలపై ఆధారపడకుండా భవనాలు, ఇతర వస్తువులను చల్లగా ఉంచడానికి ఉపయోగించే ఒక స్థిరమైన మెటీరియల్ ను రూపొందించారు. దీనిని యి జెంగ్ తన మెటీరియల్ ను "కూలింగ్ పేపర్" అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఏదో ఒక రోజు ఈ కూలింగ్ పేపర్ అమార్చుకోవాలని తను ఆశిస్తున్నారు. ఈ "కూలింగ్ పేపర్" సూర్యుని నుంచి వచ్చే వేడిని గ్రహించుకొని తిరిగి పరావర్తనం చేస్తుంది. దీని వల్ల గది ఉష్ణోగ్రతలను 10 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు తగ్గించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. "కూలింగ్ పేపర్"కు ఎలాంటి విద్యుత్ అవసరం లేదు, దీనిని 100శాతం రీసైకిల్ చేయవచ్చు. ఈ కూలింగ్ పేపర్ రీసైకిల్ పేపర్ నుంచి తయారుచేశారు. ఇది మీ ఇంటిపై ఉన్నంతసేపు ఇంట్లోని ఉష్ణోగ్రతలు లాగేసుకుని ఎప్పుడూ చల్లగా ఉంచుతుంది. "కూలింగ్ పేపర్" ఎలా తయారు చేయాలి? ముందుగా న్యూస్‌ప్రింట్‌ను నానబెట్టాలి, బ్లెండర్లో ముక్కలు ముక్కలు చేసి తర్వాత నీటిని తీసేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో టెఫ్లాన్ తయారు చేసే పదార్థంను కలపాలి. కూలింగ్ పేపర్ లోపల ఉండే "సహజ ఫైబర్ల రంధ్రాల సూక్ష్మ నిర్మాణం" వేడిని శోషించుకొని ఇంటి నుంచి దూరంగా బదిలీ చేస్తుంది. ఆ తర్వాత అవసరం లేనప్పుడు కూలింగ్ పేపర్ తీసెసీ తర్వాత జెంగ్ కూలింగ్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయడానికి కొత్త షీట్ ను రీమేక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ప్రక్రియలో అది ఎటువంటి శీతలీకరణ శక్తిని కోల్పోలేదని కనుగొన్నాడు. "తను వచ్చిన ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు" జెంగ్ చెప్పాడు. బహుశా రీసైక్లింగ్ తర్వాత 10 శాతం, 20 శాతం నష్టం జరుగుతుందని అనుకున్నాడు, కానీ అలా ఏమి జరగలేదు. -
కొవ్వులతో భూమికి చల్లదనం!
లండన్: వంట వండేటప్పుడు విడుదలయ్యే కొవ్వు కణాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి మేఘాలు ఏర్పడేందుకు తోడ్పడతాయని, దీంతో భూమి చల్లబడే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. వేపుళ్లు చేసే సమయంలో కొవ్వు పదార్థాలు వెలువడటంతో పాటు ఏరోసాల్ తుంపరల్లో సంక్లిష్ట త్రీడీ నిర్మాణాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. ఈ త్రీడీ నిర్మాణాలు ఏర్పడటం వల్ల మేఘాల ఏర్పాటును ప్రభావితం చేసే కొవ్వు కణాల జీవిత కాలం పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏరోసాల్ తుంపరలపై కొవ్వు కణాలు పొరలాగా ఏర్పడి మేఘాలు ఏర్పడే విధానాన్ని ప్రభావితం చేస్తాయని తమ పరిశోధనల్లో తెలిసిందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన క్రిస్టియన్ ఫ్రాంగ్ వివరించారు. తుంపరల లోపల ఈ కొవ్వు కణాలు ఏం చేస్తాయో గుర్తించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఈ కొవ్వు కణాలన్నీ క్రమపద్ధతిలో ఒక చోటుకు చేరి ఓ సిలిండర్ మాదిరిగా ఏర్పడి మేఘాలు ఏర్పడటంలో భాగమైన నీటిని పీల్చుకునే తత్వాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు ఓజోన్ రసాయనానికి ఈ కొవ్వు కణాలు నిరోధకతను కలిగి ఉంటాయని, దీంతో అవి ఎక్కువ కాలం మనగలుగుతాయని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. -
జస్ట్ ఛిల్!
కొత్తకొత్తగా డ్రింక్ కూల్‌గా ఉంటేనే అందరికీ ఇష్టం. అందుకే డ్రింక్‌ను ఫ్రిజ్‌లో పెట్టడమో లేక ఐస్ ముక్కలను అందులో వేసుకోవడమో చేస్తాం. కానీ ఒక్కోసారి సగం తాగేసరికి డ్రింక్ కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది. దానిపై ఇష్టం పోతుంది. ఇకపై అలాంటి బాధ లేదు. ఎందుకంటే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన గ్లాసులు ఈ సమస్యను తీర్చేస్తాయి. ఈ గ్లాసుల్లో డ్రింక్‌ను పోసుకుంటే చాలు.. అదే కూల్ అవుతుంది. ఎలా అంటే.. ఆ గ్లాసులో రీయూజబుల్ చిల్లర్స్ (అందులో జెల్ లాంటి ద్రవం ఉంటుంది) ఉంటాయి. ఒక గ్లాసు కొనుగోలు చేస్తే రెండు చిల్లర్స్‌ను ఇస్తారు. వీటిని ముందుగా మనం ఫ్రిజ్‌లో అరగంట పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే అందులోని ద్రవం వల్ల అది ఐస్‌గా మారుతుంది. చిల్లర్లోని ఐస్ త్వరగా కరగకుండా సిలికాన్ గ్రిప్‌ను ఉపయోగిస్తారు. ఈ చిల్లర్సను గ్లాసులకు అమర్చుకుని, ఆపైన గ్లాసుల్లో డ్రింక్ పోయాలి. ఇక ఆఖరి చుక్క వరకు డ్రింక్ కూల్‌గానే ఉంటుంది. మూత ఉండే గ్లాసులు కూడా ఉన్నాయి. అవి కొనుక్కుంటే బైటికెళ్లినప్పుడు చక్కగా బ్యాగ్‌లో వేసుకుని తీసుకెళ్లొచ్చు! -
నైస్ క్రీమ్స్
పెదగంట్యాడ: హట్ సమ్మర్ ఎఫెక్ట్ మార్చి నుంచే మూర్చపోయే రేంజ్లో స్టార్ట్ అయింది. 40 డిగ్రీస్‌లో శరీరం ఉక్కపోతతో ఆపసోపాలు పడే చిరుద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్ల వరకూ సేదతీరే ప్రాంతాల కోసం ఆరాటంగా ఎదురు చూస్తుంటారు. కూలింగ్ రీఫ్రెష్మెంట్ అందరికీ అవసరమే. రేంజ్‌ను బట్టి సర్వీస్.. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్. నగరంలో కొన్ని రీఫ్రెష్.. లేటెస్ట్ ఐటెమ్స్ మనకోసం ఎదురు చూస్తున్నాయి. ఫ్రైడ్ ఐస్‌క్రీమ్ వేయించిన ఐస్‌క్రీమ్ కొత్తగా ఉన్నా.. ఇది నిజంగానే వైజాగ్‌లో అందుబాటులో ఉంది. మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్క్రీంను కొన్ని ప్రత్యేక పౌడర్లు, పదార్థాలతో కలిపి నూనెలో అలా వేసి ఇలా తీసేస్తారు. దీన్ని టేస్ట్ చేయాలనుకుంటే ద్వారకానగర్‌లోని కొక్కొరోకో రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. ఓ సారి ట్రై చేస్తే పోలే.. వెనిల్లా ఐస్‌క్రీమ్‌తో కోకోకోలా డ్రింక్ మిక్స్ చేసి డిఫరెంట్ టేస్ట్ కావాలంటే వీఐపీ రోడ్‌లోని చిలౌట్ ఐస్‌క్రీమ్ షాపుకు వెళ్లండి. ఫ్రెష్ ఫ్రూట్స్ ఐస్‌క్రీమ్ కేక్‌లాగా మార్చి తినాలనుకుంటే డైమండ్ పార్క్ దగ్గరున్న స్నోడ్యూన్స్కి వెళ్లండి. ఇంకా రకరకాల వెరైటీ ఫుడ్స్ సమ్మర్లో చాలానే ఉన్నాయి. కోల్డ్ కాఫీ కూడా చాలా ఎక్కువ మంది యూత్ ప్రిఫర్ చేస్తున్నారు. బీచ్‌రోడ్‌లో చాక్లెట్ రూమ్‌లో బ్లాక్ చాక్లెట్‌తో చేసే వెరైటీ ఐటెమ్స్‌కు గిరాకీ ఎక్కువ. రోడ్ సైడ్‌లో ఉండే చిన్న చిన్న ఐస్‌క్రీమ్ షాప్‌లు, జ్యూస్ పాయింట్ల సైతం సమ్మర్ స్పెషల్ ఐటెమ్స్‌తో ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరల్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి రకరకాల షాప్‌లు రెడీగా ఉన్నాయి. -
తండ్రీకొడుకుల మృతదేహాలు లభ్యం
పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలింపు కేసు దర్యాప్తు ప్రారంభం జుజ్జూరులో విషాదం ఇబ్రహీంపట్నం : స్థానిక ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో గురువారం దూకి గల్లంతైన తండ్రీకొడుకుల మృతదేహాలను ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన మహేశ్వర హనుమాన్‌ప్రసాద్ (35)కు భార్య శ్రీలక్ష్మితో విభేదా లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కుమారులు శివభార్గవ్(9), గోపీచంద్(7)తో కలిసి గురువారం ఇబ్రహీంపట్నం వచ్చి కూలింగ్ కెనాల్లో దూకి గల్లంతయ్యారు. వీరితో పాటు దూకిన హనుమాన్‌ప్రసాద్ అమ్మమ్మ పులిపాటి పుష్పావతి (70)ని స్థానికులు కాపాడి 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె కోలుకుం టోంది. శివభార్గవ్, గోపిచంద్‌ల మృతదేహాలు గురువారం అర్ధరాత్రి ఎన్టీటీపీఎస్‌లోకి కొట్టుకు రాగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఉద యం హనుమాన్ ప్రసాద్ మృతదేహం కూడా అక్కడ కనిపించింది. ఎన్టీటీపీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ సిబ్బందితో వచ్చి ముగ్గురి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకుని, విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతులకు స్వగ్రామంలో అంత్యక్రియలు జుజ్జూరు(వీరులపాడు) : కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకు న్న మహేశ్వర వెంకట్ హనుమాన్ ప్రసాద్, కుమారులు శివభార్గవ్, గోపిచంద్ మృతదేహాను శుక్రవారం స్వగ్రామం జుజ్జూరు తీసుకువచ్చారు. మృతదేహాలను ఇంటి కి తీసుకురాగానే బంధువులు తీవ్రంగా రో దిం చారు. హనుమాన్ ప్రసాద్‌తోపాటు ఇద్దరు పిల్లలను కడసారి చూసేందుకు గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హనుమాన్ ప్రసాద్ తండ్రి వెంకటరత్నం ముగ్గురి మృతదేహాలకు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రీకొడుకుల ఆత్మహత్య ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఘటన జరిగిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.