
లండన్: వంట వండేటప్పుడు విడుదలయ్యే కొవ్వు కణాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి మేఘాలు ఏర్పడేందుకు తోడ్పడతాయని, దీంతో భూమి చల్లబడే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. వేపుళ్లు చేసే సమయంలో కొవ్వు పదార్థాలు వెలువడటంతో పాటు ఏరోసాల్ తుంపరల్లో సంక్లిష్ట త్రీడీ నిర్మాణాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. ఈ త్రీడీ నిర్మాణాలు ఏర్పడటం వల్ల మేఘాల ఏర్పాటును ప్రభావితం చేసే కొవ్వు కణాల జీవిత కాలం పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఏరోసాల్ తుంపరలపై కొవ్వు కణాలు పొరలాగా ఏర్పడి మేఘాలు ఏర్పడే విధానాన్ని ప్రభావితం చేస్తాయని తమ పరిశోధనల్లో తెలిసిందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన క్రిస్టియన్ ఫ్రాంగ్ వివరించారు. తుంపరల లోపల ఈ కొవ్వు కణాలు ఏం చేస్తాయో గుర్తించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఈ కొవ్వు కణాలన్నీ క్రమపద్ధతిలో ఒక చోటుకు చేరి ఓ సిలిండర్ మాదిరిగా ఏర్పడి మేఘాలు ఏర్పడటంలో భాగమైన నీటిని పీల్చుకునే తత్వాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు ఓజోన్ రసాయనానికి ఈ కొవ్వు కణాలు నిరోధకతను కలిగి ఉంటాయని, దీంతో అవి ఎక్కువ కాలం మనగలుగుతాయని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment