డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఇన్సులిన్‌ను ఎప్పుడూ తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. కానీ ఇంట్లో ఫ్రిజ్ లేనివారికి ఇది కొంత ఇబ్బందికరమే. వాళ్ల విషయంలో దీనికి పరిష్కారమెలా?
ఈ అంశంపైనే పరిశోధనలు చేసి ఓ కూలింగ్ క్యారియర్‌ను రూపొందించిన ఒడిశా అమ్మాయి కోమల్ పాండాకు జేమ్స్ డైసన్ అవార్డు వరించింది. స్థానికంగా లభ్యమయ్యే సులభమైన సాంకేతికతతో కొత్త ఉపకరణాలను రూపొందించేవారికి ఈ అవార్డును ప్రకటిస్తారు. మన దేశం నుంచి కోమల్ పాండాకు ఈ అవార్డుతోపాటు రూ. 5 లక్షలు బహూకరిస్తారు. కోమల్ రూపొందించిన ‘నోవోక్యారీస్’ అనే ఈ ఉపకరణంతో ఇన్సులిన్‌ను చాలాసేపు చల్లదనంలో ఉంచవచ్చు.
అంతేకాదు దూరప్రయాణాల్లో, విద్యుత్ సౌకర్యాలూ, బ్యాటరీ సౌలభ్యాలు లేనిచోట్ల కూడా ఇన్సులిన్‌తోపాటు చల్లదనంలోనే ఉంచాల్సిన చాలా రకాల మందుల్ని సుదీర్ఘకాలంపాటు నిల్వ చేయవచ్చు. ‘నోవోక్యారీస్’ రూపకల్పనకు తన తండ్రి నుంచే కోమల్‌కు స్ఫూర్తి లభించింది. ఆయన ఓ డయాబెటిస్ బాధితుడు.
ఆఫీసులో ఫ్రిజ్ లేదు. దూరప్రయాణాలప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ఆయన మాత్రమే కాదు... ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుల ప్రకారం దాదాపు 20 శాతం మందులు ఇలా దూర్రప్రాంతాలకు ప్రయాణం చేసేవారి విషయంలో, రిఫ్రిజిరేటర్ సౌకర్యం లేకపోవడం వల్ల చెడిపోతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంటోంది. ఇలాంటి వారికి ఇదెంతో ప్రయోజనం.
(చదవండి: కమ్మటి కబుర్ల కమ్యూనిటీ కిచెన్..! వంటరికి విస్తరి.. )
Comments
Please login to add a commentAdd a comment