మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉన్నట్టుండి ఆగిపోతోందా? విపరీతంగా వేడెక్కి సక్రమంగా పనిచేయడం లేదా? లోపలున్న ఫ్యాన్లు, హీట్ సింక్‌లతో ప్రయోజనం ఉండట్లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ మీరు అవునని జవాబు చెబుతుంటే ఈ కథనం మీ కోసమే. ఎందుకంటే.. ఫ్యాన్ల అవసరమే లేకుండా ఓ భారతీయ అమెరికన్... పీసీ, ల్యాప్‌టాప్‌లను చల్లబరిచేందుకు ఓ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించాడు కాబట్టి!
కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకూ.. వేడికి అవినాభావ సంబంధం ఉంది. అవి పనిచేస్తుంటే ప్రాసెసర్ వేడెక్కుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ వేడిని తొలగించకపోతే పీసీ, ల్యాప్‌టాప్‌ల పని సామర్థ్యం తగ్గడమే కాకుండా కొన్ని సందర్భాల్లో లోపలి సర్క్యూట్లు కాలిపోవచ్చు. ఈ సమస్యలను అధిగమించేందుకు తొలినాళ్ల నుంచి ఫ్యాన్లు ఉపయోగిస్తుండగా ఇటీవలి కాలంలో హీట్ సింకు ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు.
కానీ వాటితో ప్రయోజనం అంతంతగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా స్టార్టప్ సంస్థ ఫ్రోర్ సిస్టమ్స్ గత నెలలో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించిన ఎయిర్‌జెట్ టెక్నాలజీ ఆధారిత పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కూడా ఒక చిప్‌లాంటిదే. కాకపోతే వేడిని తొలగించేందుకే ఉపయోగపడుతుంది. కొన్ని ఎయిర్‌జెట్ చిప్‌లను కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లలో ఏర్పాటు చేసుకుంటే అత్యంత సమర్థంగా వేడిని తొలగించుకోవచ్చని ఇండియన్–అమెరికన్, ఫ్రోర్ సంస్థ సీఈవో డాక్టర్ మాధవపెద్ది శేషు చెబుతున్నారు. డాక్టర్ సూర్య పి. గంటితో కలసి ఆయన ఫ్రోర్ సిస్టమ్స్‌ను స్థాపించారు.
వేడి పెరిగితే సమస్య ఏమిటి?
వేడిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే కంప్యూటర్ల సామర్థ్యం తగ్గిపోతుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ మైక్రోప్రాసెసర్లు ఉపయోగిస్తున్నాం. వాటి వేగం పెరిగిన ప్రతిసారీ అవి ఉత్పత్తి చేసే వేడి కూడా ఎక్కువ అవుతుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఇది గరిష్టంగా 70 శాతం వరకూ ఉండవచ్చు. పైగా 13 అంగుళాల సైజుండే అత్యాధునిక 4.8 గిగాహెర్ట్ ్జప్రాసెసర్ నోట్‌బుక్ 56 వాట్ల విద్యు త్ ఖర్చు చేస్తుంది. దీనివల్ల ఎక్కువవుతున్న వేడిని ఫ్యాన్లు, హీట్‌సింక్, పైపుల్లాంటివి తొలగించలేవు. ఫలితంగా ప్రాసెసర్లు కాలిపోకుండా వాటి వేగాన్ని తగ్గించేలా కంపెనీలు ఏర్పాట్లు చేశాయి.
ప్రత్యేకతలెన్నో..
ఎయిర్‌జెట్ టెక్నాలజీతో ఇప్పుడు రెండు చిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌జెట్ మినీ కేవలం 270 మిల్లీమీటర్ల వెడల్పు, 41.5 మిల్లీమీటర్ల పొడవు, 2.8 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది. కానీ ఒకే ఒక్క వాట్ విద్యుత్‌ను వాడుకుంటూ ఇది 5.25 వాట్లకు సరిపడా వేడిని తొలగించగలదు. కొంచెం పెద్దదైన ఎయిర్‌జెట్ ప్రో 31.5 మి.మీ. వెడల్పు, 71.5 మి.మీ. పొడవు ఉంటుంది.
ఇది వాడే విద్యుత్ 1.75 వాట్లు కాగా.. తొలగించగల వేడి 10.75 వాట్లకు సరిపడా ఉంటుంది. ఈ రెండు చిప్‌ల నుంచి వెలువడే శబ్దం దాదాపుగా శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే ఇవి గరిష్టంగా 24 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దం చేస్తాయి. వీటి బరువు 13 నుంచి 22 గ్రాముల మధ్యే ఉండటం విశేషం. 13 అంగుళాల నోట్‌బుక్‌లో 4 ఎయిర్‌జెట్ మినీలను ఉపయోగిస్తే మైక్రోప్రాసెసర్ సామర్థ్యం 100 %వరకూ పెరుగుతుందని, 15 అంగుళాల నోట్‌బుక్‌లో 3 ఎయిర్‌జెట్ ప్రోలను వాడటం ద్వారా సామర్థ్యం 50% పెంచవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ పరికరాలు డస్ట్ ప్రూఫ్ కావడం వీటి ప్రత్యేకత.
క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు..
ఫ్రోర్ సిస్టమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మైక్రోపాసెసర్ల తయారీ సంస్థ ఇంటెల్... భవిష్యత్తులో తాము తయారు చేయబోయే ల్యాప్‌టాప్‌లలో ఎయిర్‌జెట్ సాంకేతికతను ఉపయోగిస్తామని ప్రకటించింది. క్వాల్‌కాం... ఫ్రోర్ సిస్టమ్స్‌లో పెట్టుబడులు పెట్టింది. ప్రపంచంలోని 10 చిప్ తయారీ సంస్థల్లో ఐదు సంస్థలు ఇప్పటికే ఫ్రోర్ సిస్టమ్స్‌తో జట్టుకట్టాయి. అయితే ఎయిర్‌జెట్ మినీ, ప్రో ఇంకా ఉత్పత్తి దశలోనే ఉన్నందున వాటి ధరల వివరాలు తెలియరాలేదు.
– సాక్షి, హైదరాబాద్
ప్రపంచంలోనే తొలిసారి వినూత్న పరిష్కారం
వేడి సమస్యను ఎదుర్కొనేందుకు ఫ్రోర్ సిస్టమ్స్ సిద్ధం చేసిన ఎయిర్‌జెట్ టెక్నాలజీ ప్రపంచంలోనే తొలి సాలిడ్ స్టేట్ కూలింగ్ టెక్నాలజీ. ఇందులో రెండు పొరలుంటాయి. పైనున్న పొరలో సూక్ష్మ రంధ్రాలు ఏర్పాటు చేశారు. కింద రాగితో చేసిన పొర ఉంటుంది. రెండింటికీ మధ్యలో కంపించే త్వచాల్లాంటివి ఉంటాయి.
ఈ వైబ్రేటింగ్ మెంబ్రేన్స్ వేడిని గ్రహించినప్పుడు వేగంగా కంపిస్తాయి. ఫలితంగా అక్కడున్న వేడిగాలి ఒత్తిడికి గురై కిందనున్న రాగిపొర వద్దకు చేరుకుంటుంది. కొంత వేడిని ఈ రాగిపొర గ్రహిస్తుంది...మిగిలిన వేడిగాలి చిప్‌కు గొట్టంలాంటి ఏర్పాటు ద్వారా బయటకు ప్రయాణిస్తుంది. ఫ్యాన్లు చేసే పనే ఇక్కడ మెమ్స్ మెంబ్రేన్స్ చేస్తున్నాయన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment