గృహాలంకరణలో వీటిది ప్రత్యేక స్థానం
మిరుమిట్లు గొలిపే విద్యుత్తు వెలుగు
అందుబాటులో స్మార్ట్ లైటింగ్ టెక్నాలజీ
సాక్షి, సిటీబ్యూరో: ఇళ్లయినా, స్టార్ హోటలైనా.. మిరుమిట్లుగొలిపే షాండ్లియర్స్ వినియోగం తప్పనిసరి. పైకప్పు నుంచి వేలాడే ఈ దీపాలంకరణ చూపర్లను మంత్రముగ్ధుల్ని చేసేస్తుంది. వెలుగుతో పాటూ వినసొంపైన సంగీతాన్ని వినిపించడమే షాండ్లియర్స్ ప్రత్యేకత. గృహాలంకరణలో దీనికి ప్రాధాన్యం పెరిగిపోయింది. షాండ్లియర్స్ వినియోగం కొత్తమీ కాదు.. నిజాం నవాబుల కాలం నుంచే దీనికి ప్రాధాన్యత ఉంది. కానీ, తాజాగా స్మార్ట్ టెక్నాలజీతో వినూత్న రీతిలో, ఫీచర్లతో మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
కలల గృహాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు నగరవాసులు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. ఈక్రమంలో ఇంట్లో విద్యుత్తు వెలుగులకు ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కళ్లు మిరిమిట్లుగొలిపే షాండ్లియర్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో 5 అడుగుల నుంచి 7 అడుగుల ఎత్తు గల షాండ్లియర్స్ ఎక్కువ అమ్ముడవుతున్నాయి. షాండ్లియర్స్ రూ.5 వేల నుంచ రూ.50 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని విద్యుత్తు దీపాలను రిమోట్, సెన్సార్ సిస్టం, మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, మాన్యువల్‌గాను ఆపరేట్ చేయవచ్చు.
వినియోగం పెరిగింది..
డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటున్న ప్రతి కుటుంబం షాండ్లియర్స్‌ను వినియోగిస్తున్నారు. ఉన్నత స్థాయి కుటుంబాలు, స్టార్ హోటల్స్, లగ్జరీ లైఫ్‌లో షాండ్లియర్ తప్పనిసరి అయ్యింది. కొత్తకొత్త మోడల్స్ కోరుకుంటున్నారు. రూ.లక్ష నుంచి షాండ్లియర్స్ అందుబాటులో ఉంటాయి. కె9 క్రిస్టల్, ఏక్రలిక్, సిరామిక్, వంటివి ఎక్కువ మంది అడుగుతున్నారు. ఇప్పుడు నెలకు కనీసం 100 వరకు సరఫరా చేస్తున్నాం. అత్యాధునిక కలెక్షన్స్, వస్తువులో నాణ్యత, వినియోగదారుడికి సమస్య వచ్చినప్పుడు మేం అందించే సేవలు మాకంటూ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. జీవితకాలం సరీ్వస్ ఇస్తున్నాం.
– రిషబ్ తివారీ, లైట్స్ లైబ్రరీ, మాదాపూర్
విదేశాల నుంచి దిగుమతి..
షాండ్లియర్స్ తయారీలో వినియోగించే ముడిసరుకును మలేషియా, ఇటలీ, చైనా, సింగపూర్, ఈజిప్టు, మన దేశంలోని ఢిల్లీ, ముంబై తదితర ప్రదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ప్రధానంగా మాదాపూర్, బేగంబజార్, కోటి, ఉస్మాన్‌గంజ్ తదితర ప్రాంతాలు షాండ్లియర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా కనిపిస్తున్నాయి. మొరాకిన్, ఇండియన్, యాంటిక్, నిజాంలు వినియోగించిన రస్టిక్ తదితర మోడల్స్‌కు ఇక్కడ మంచి ఆదరణ ఉంది.
మనసు ప్రశాంతంగా..
క్రిస్టల్ మేడ్ షాండ్లియర్ తీసుకున్నాను. రూ.7 లక్షలు అయ్యింది. ఎన్నో పనులపై బయట తిరిగి ఇంటికి చేరుకున్నాక సోఫాలో కూర్చుని షాండ్లియర్ నుంచి వచ్చే డిఫరెంట్ లైటింగ్, మనసుకు నచ్చిన పాటలు చిన్నగా సౌండ్ పెట్టుకుని వింటాను. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఒకరకంగా షాండ్లియర్ ఒత్తిడిని తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
– టి.ప్రణీత్‌రెడ్డి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment