ఇదీ.. లగ్గం లాగిన్‌! | A New Study With Technical Expertise On Marriage Matching | Sakshi
Sakshi News home page

ఇదీ.. లగ్గం లాగిన్‌!

Published Mon, Aug 5 2024 8:35 AM | Last Updated on Mon, Aug 5 2024 8:35 AM

A New Study With Technical Expertise On Marriage Matching

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం విద్యార్థుల లగ్గంప్రాజెక్టు

ఒకే క్లిక్‌తో కావాల్సిన సంబంధం

బి–డిజైన్‌ విద్యార్థుల ప్రయోగం

సాంకేతిక నైపుణ్యంతో సరికొత్త అధ్యయనం

నాంపల్లి: పెళ్లి కార్డుతో వివాహ వేడుక ఆరంభమై.. మూడు ముళ్ల బంధంతో ముడివేసుకుని సంపూర్ణ దాంపత్యంతో ముగుస్తుంది. ఈ మధ్యలో జరిగే తంతువునే ‘లగ్గం’ అని పిలుస్తారు. ఒక లగ్గం జరగాలంటే వధువు, వరుడు ఇద్దరూ ఉండాలి. ఒకప్పుడు వివాహం చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడంతా సీన్‌ రివర్స్‌. ప్రపంచీకరణ నేపథ్యంలో తరాలు చూడటానికి ముందే ఆన్‌లైన్‌లోనే పరిచయమైపోతున్నారు. ఒకరికొకరు నచ్చితే అందులోనే పెళ్లికి ఒప్పేసుకుంటున్నారు..

ఆస్తులు, అంతస్తుల కంటే మనసులు నచ్చితే చాలంటూ పెద్దలను ఒప్పిస్తున్నారు. ఒకప్పుడు ఒక పెళ్లి చేయాలంటే మంచి సంబంధం దొరకాలనే వారు. అందుకోసం ఏళ్ళకు ఏళ్లు వేచి చూసేవారు. ఇందుకోసం పెళ్లిళ్ల పేరయ్యలను ఆశ్రయించేవారు. ప్రస్తుతం వారి స్థానంలో మ్యాట్రిమోనీ సంస్థలు పుట్టుకొచ్చాయి. కులాలు, మతాలు, గోత్రాలతో పాటు వధువు వరుల చిత్రాలను మ్యాట్రిమోనీ సంస్థల్లోనే వెతుకుతున్నారు. మార్కెట్లో మ్యాట్రిమోనీ సంస్థలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు ‘లగ్గం’ అనే ప్రాజెక్టును రూపొందించారు.

బి–డిజైన్‌ విద్యార్థుల ప్రాజెక్టు..
బి–డిజైన్‌లో నాలుగు సంవత్సరాల కాల వ్యవధి కలిగిన విజువల్‌ కమ్యూనికేషన్‌ కోర్సును అభ్యసించే మూడో సంవత్సరం విద్యార్థులు తమ ప్రాయోగిక పరీక్షల్లో భాగంగా పెళ్లికి సంబంధించిన పలు అంశాలపై లోతైన అధ్యయనం చేసి మార్కెట్‌కు సరికొత్త ప్రాజెక్టును పరిచయం చేస్తున్నారు. లగ్గం పేరిట లాగిన్‌ అంటూ సరికొత్త మ్యాట్రిమోనీ ప్రాజెక్టు ద్వారా వధువరుల ముందుకు వచ్చేశారు.

సంబంధాలను కుదర్చడంతో పాటు, మార్కెట్‌లో హోదాకు తగ్గట్టు పెళ్లి వేడుకకు రూపకల్పన చేయడం, పెళ్లికి అవసరమైన సౌకర్యాలను సమకూర్చడం చేస్తున్నారు. ప్రాయోగిక పరీక్షల్లో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకుని తమ ఉపాధికి కూడా బాటలు వేసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. బి–డిజైన్‌ కోర్సులో ఫ్యాకల్టీ నేరి్పంచే సాంకేతిక నైపుణ్యాలను పుణికి పుచ్చుకుని కార్పొరేట్‌ సంస్థలకు తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు. అక్కడా ఉద్యోగాలు దక్కకుంటే సొంతంగా మ్యాట్రిమోనీ సంస్థను ఏర్పాటు చేసుకుంటామనే స్థాయిలో స్కిల్స్‌ను నేర్చుకుంటున్నారు.

తొందరగా ప్లేస్‌మెంట్స్‌..
బి–డిజైన్‌లోని విజువల్‌ కమ్యూనికేషన్‌ కోర్సులో చేరితే తొందరగా ప్లేస్‌మెంట్‌ దొరుకుతుందని చేరాను. ప్లేస్‌మెంట్‌ లేకున్నా ఉపాధి కల్పనకు ఈ కోర్సు ఎంతగానో దోహదపడుతుంది. మంచి ఫ్యాకలీ్టతో బోధనలు జరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని ఒక టాస్‌్కలాగా తీసుకుని చదువుతున్నాం. కోర్సు పూర్తయితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం. – క్యూటీ, మూడో సంవత్సరం విద్యార్థి, సూర్యాపేట

ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ కావడమే లక్ష్యం.. 
విజువల్‌ కమ్యూనికేషన్‌ కోర్సును అభ్యసించేందుకు కామారెడ్డి నుంచి వచ్చాను. తెలుగు వర్శిటీలో మూడో సంవత్సరం చదువుతున్నాను. ఈ కోర్సు ద్వారా ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ అవుతాను. ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని ఉంది. లేదంటే మంచి స్టూడియోను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతాను. – శ్రీధర్, మూడో సంవత్సరం విద్యార్థి, కామారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement