
మేడమ్.. మొన్న ఏదో హిందీ సినిమాలో ఓ మాట విన్నాను. ‘‘హైమన్’ రీ స్టిచ్ చేయించుకున్నప్పటి నుంచి అనుభూతిలేకుండా పోయింది’ అని. అసలు ఇలాంటి ఓ ప్రక్రియ ఉంటుందా? నా అజ్ఞానానికి మన్నించగలరు.
– ప్రసన్న లక్ష్మి, సూరత్
యోనిని కప్పి ఉంచే హైమన్ పొర ఒక మెత్తని రబ్బర్ లాగా ఉండి అందులో చిన్న రంధ్రం ఉండి, దాని ద్వారా మ్యూకస్ స్రావాలు, బ్లీడింగ్ (పీరియడ్) బయటకు వస్తాయి. చాలా మందికి కలయిక తర్వాత, కొంత మందిలో అతిగా సైక్లింగ్, వ్యాయామాలు, హస్తప్రయోగం వంటి వాటివల్ల యోనిని కప్పి ఉంచే హైమన్ పొర చిరుగుతుంది. ఈ కాలంలో చాలా మంది లివింగ్ ఇన్ (సహజీవనం) రిలేషన్‌లో ఉంటున్నారు. తర్వాత వేరే వాళ్లను పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకొని మళ్లీ పెళ్లి చేసుకోవడం, కొంత మంది వింత కోరికలతో యోనిపైన మళ్లీ హైమన్ పొరను ఏర్పరచుకొని కొత్తదనాన్ని ఆస్వాదించాలని ఆశపడతారు. దీని కోసం వచ్చిందే హైమన్ రీస్టిచ్. ఈ మధ్య కాలంలో దీనికి బాగా ప్రాచుర్యం పెరిగింది. చాలా మంది దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పద్ధతిలో మత్తు ఇచ్చి, యోని భాగంలో చిరిగిన హైమన్ పొరని మరలా దగ్గరకు తీసి కుట్టడం జరుగుతుంది. అలా కుదరకపోతే, వారి శరీరంలో ఎక్కడ నుంచి అయినా మ్యూకస్ పొరను తీసుకొని, యోని భాగంలో అమర్చడం జరుగుతుంది. అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. (కొన్ని మతాల్లో, కొందరి సంప్రదాయాల్లో హైమన్ పొరను ఆడవారి కన్యత్వానికి ముడి పెట్టడం జరుగుతుంది.) చాలా మందికి సైక్లింగ్, ఎక్కువ వ్యాయామాలు, టాంపూన్స్ వాడకం వంటి వాటివల్ల హైమన్‌పొర చిరగడం జరుగుతుంది. అలాంటప్పుడు దానిని వేరేగా ఆలోచించడం, అనుమానించడం జరుగుతుంది. కొందరు ఈ సమస్య వల్ల కూడా భయంతో హైమన్ రీస్టిచ్ చేయించుకుంటారు. చాలా అరుదుగా కొందరిలో హైమన్ పొర ఉండకపోవచ్చు.
మా అత్తమ్మ వయసు 60 ఏళ్లు. ఆమెకు 42వ ఏటనే మెనోపాజ్ వచ్చింది. తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు. అయితే ఎనిమిది నెలల కిందట హఠాత్తుగా వైట్ డిశ్చార్జ్ అవడం మొదలుపెట్టింది వాసన, దురదతో. హిస్ట్రెక్టమీ చేశారు. బయాప్సీ కూడా పంపారు. అంతా నార్మలే అని చెప్పారు. మెనోపాజ్ వచ్చాక పద్దెనిమిదేళ్లకు అలాంటి సమస్యలు తలెత్తుతాయా? మెనోపాజ్ అంటే అలాంటి వాటన్నిటి నుంచీ విముక్తి చెందినట్టే కదా?
– సింధుజాత, మంత్రాలయం
అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ఆడవారిలో 40 సంవత్సరాలు దాటిన తర్వాత మెల్లగా తగ్గిపోతూ వచ్చి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొన్ని సంవత్సరాలకు పూర్తిగా తగ్గిపోతుంది. ఆ సమయంలో పీరియడ్స్ రాకపోతే, ఆ దశను మెనోపాజ్ దశ అంటారు. మెనోపాజ్ వచ్చినంత మాత్రాన, తెల్లబట్ట అవ్వదు అని ఏమీలేదు. యోనిలో ఇన్‌ఫెక్షన్స్, గర్భాశయ ముఖద్వారంలో పాలిప్స్, పుండ్లు, అరుదుగా క్యాన్సర్ వంటి ఎన్నో కారణాల వల్ల మెనోపాజ్ తర్వాత ఏ వయసులోనైనా ఈ సమస్యలు రావచ్చు. ఈ దశలో యోని పొడిగా మారి ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉంటే కూడా ఈ సమస్యలు రావచ్చు. కేవలం వాసన, దురదతో కూడిన వైట్ డిశ్చార్జ్ అయినంత మాత్రాన హిస్ట్రెక్టమీ అంటే గర్భాశయాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు, స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, ప్యాప్ స్మియర్ పరీక్ష ద్వారా, అది ఇన్‌ఫెక్షన్ వల్ల వస్తుందా, ఇంకా ఏదైనా కారణముందా, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా అని పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకొని, కేవలం ఇన్‌ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స తీసుకొని చూడవచ్చు. గర్భాశయంలో కంతులు, క్యాన్సర్ వంటివి నిర్ధారణ అయితేనే గర్భసంచి తొలగించవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment