మేడం.. నాకు 32 సంవత్సారాలు. ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ. తొలి కాన్పులో బాబు. వాడికిప్పుడు ఏడేళ్లు. ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ఏదో ఇన్‌ఫెక్షన్ రావడం, మందులు వాడడంతో సెకండ్ ప్రెగ్నెన్సీ లేట్ అయింది. అయితే ఈ టైమ్‌లోనే నాకు హైపోథైరాయిడ్, డయాబెటీస్ కూడా వచ్చాయి. బీపీ నార్మల్‌గానే ఉంది ప్రస్తుతానికైతే. కాని కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీ కాదు అంటున్నారు డాక్టర్. పుట్టబోయే బిడ్డకు అవయవలోపాలు, మెదడు ఎదగకపోవడం వంటి సమస్యలైతే రావు కదా మేడం.. భయంగా ఉంది.
– అనుపమ, నిర్మల్
ఈ మధ్యకాలంలో చాలా మంది 30–35 సంవత్సరాల మధ్యలోనే రెండోసారి గర్భం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంత మంది ఒక బిడ్డ చాలు అనుకొని, రెండో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయరు. వీరిలో ఆ బిడ్డ 6–7 సంవత్సరాల తర్వాత పెద్దగా అయ్యి ఒక తోడు కోసం తమ్ముడో, చెల్లెలో కావాలని మా ఫ్రెండ్స్‌కున్నారు, నాకు ఎందుకులేరు అని ఒంటరిగా బాధపడుతూ తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కొందరు బిడ్డకోసం 35 సంవత్సరాల తర్వాత గర్భం ప్లాన్ చేయడం మొదలుపెడతారు. ఈ వయసులో అండాల నాణ్యత తగ్గడం, తల్లిలో బీపీ, షుగర్ పెరగడం వంటి సమస్యల వల్ల ఈ బిడ్డలో మామూలు వారికంటే అవయవ లోపాలు, బుద్ధిమాంద్యంతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటివి ఏర్పడే అవకాశాలు రెట్టింపు అవుతాయి. ఈ సమస్యలు అందరిలో రావాలని ఏమి లేదు. మీకు 32 సంవత్సరాలు, హైపోథైరాయిడ్, డయాబెటిస్ ఉన్నాయి. వీటికి సక్రమంగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుతూ, అదుపులో ఉంచుకుంటే బిడ్డ మీద పెద్ద ప్రభావం పడదు. కాన్పు సమయం వరకు బీపీ పెరగకుండా థైరాయిడ్, షుగర్ కంట్రోల్‌లో ఉండి, బిడ్డ బరువు మరీ ఎక్కువ లేకుండా ఉంటే, మొదటి కాన్పు నార్మల్‌గా అయ్యి ఉంటే ఈసారి కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.
దాని గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ థైరాయిడ్, షుగర్ సమస్యలు అదుపులో లేకపోతే బిడ్డ మెదడు ఎదుగుదలలో లోపాలు, అవయవ లోపాలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అలాగే వయస్సుని బట్టి బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు మామూలు వారికంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. మీరు 12 వారాల సమయంలో ఎన్‌టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకోపోతే 5వ నెల మధ్యలో అంటే 18–20 వారాల సమయంలో టిఫా స్కానింగ్‌తోపాటు క్వాడ్రుపుల్ టెస్ట్ అనే రక్త పరీక్ష కూడా చేయించుకోవడం మంచిది. టిఫా స్కానింగ్‌లో బిడ్డ లోపల అవయవాలు అన్నీ ఉండవలసినట్లే ఉన్నాయా, లేదా అనేది 95 శాతం తెలుస్తుంది. గుండెలో రంధ్రాలు వంటివి సరిగా తెలియాలి అంటే ఫీటల్ 2డీ ఈకో స్కానింగ్ చేయించుకోవడం మంచిది.
అలాగే క్వాడ్రుపుల్ రక్త పరీక్షలో బిడ్డలో డౌన్స్‌సిండ్రోమ్ వంటి కొన్ని జన్యుపరమైన సమస్యలు ఉండే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిస్తే, సమస్య కచ్చితంగా ఉందా లేదా అని నిర్ధారించుకొని దానికి ఆమినియోసెంటిసిస్ అనే ఉమ్మనీరుని తీసి పరీక్ష చేయడం జరుగుతుంది. లేదా 99 శాతం ఎన్‌ఐపీటీ అనే రక్తపరీక్ష చేయించుకోవచ్చు. కాబట్టి మీరు ఆందోళన పడకుండా పైన చెప్పిన మీ డాక్టర్ సలహామేరకు చేయించుకొని, సరైన మోతాదులో ఆహార నియమాలను పాటిస్తూ, మందులు వాడుకుంటూ, సక్రమంగా చెకప్‌లకు వెళుతూ ఉంటే ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు.
లేటు వయసులో పిల్లల్ని కంటే మానసిక లోపాలతో పుట్టే ప్రమాదం ఉన్నట్టే చిన్న వయసులో కంటే కూడా అలాంటి రిస్క్ ఉంటుందా? ఎందుకంటే నాకు పదహారేళ్లకే పెళ్లయింది. ఇప్పుడు నాకు పందొమ్మిదేళ్లు. పిల్లల కోసం మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. నేనేమో చదువు మీద దృష్టిపెట్టాను. మీ సమాధానం మీద నా భవిష్యత్ ఆధారపడి ఉంది.
– దీపికా వత్సల, చెన్నూరు
సాధారణంగా అమ్మాయి గర్భధారణకు శారీరకంగా మానసికంగా సిద్ధం అవ్వడానికి 21 సంవత్సరాలు నిండితే ప్రెగ్నెన్సీ సమయంలో కాంప్లికేషన్స్ ఎక్కువగా లేకుండా తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో అమ్మాయి తన కాళ్ల మీద తను నిలబడటానికి, లోకం జ్ఞానం తెలియడానికి చదువు కూడా చాలా ముఖ్యం. 21 సం.లకు డిగ్రీ పూర్తవుతుంది. పెళ్లి తర్వాత పిల్లలను కని, పెంచడానికి, చదివించుకోవడానికి, కుటుంబం సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ సామాజిక పరమైన ఉపయోగాలు. తల్లీ, బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే, అమ్మాయి శారీరకంగా పెరగడాని, పెల్విక్ ఎముకలు దృఢంగా తయారు కావడానికి, హర్మోన్స్ సక్రమంగా పనిచేయడానికి 20 సం.రాలు అవసరం. అంతకంటే ముందు గర్భధారణ వల్ల గర్భం సమయంలో రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, పెల్విక్ ఎముకలు ధృఢంగా లేకపోవడం వల్ల సాధారణ కాన్పుకి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి మామూలు వయసు వారి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.
తల్లిలో పోషకాల లోపం వల్ల కూడా బిడ్డలో మానసిక శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఎలాగైతే 35 సం.రాలు దాటాక పుట్టబోయే పిల్లల్లో మానసిక లోపాలతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో, అలాగే మరీ చిన్న వయసులో గర్భం దాలిస్తే కూడా పుట్టబోయే పిల్లల్లో ఈ సమస్యలు ఉండే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. మీ ఇంట్లో వాళ్లకి పెళ్లయి మూడు నాలుగు సంవత్సరాలు దాటింది కనిపిస్తుంది కాని, నీ వయసు కనిపించట్లేదు. అందుకే వాళ్లు కంగారుపడుతున్నారు. ఇంతకు ముందు కాలంలో అయితే 15–20 సం.రాల లోపలే పిల్లలను కనేవాళ్లు.
అప్పటి కాలం పరిస్థితులు, వారి శరీరతత్వాలు, ఆహారపు అలవాట్లు, పనులు చేయడం వంటివి ఇప్పటి పిల్లలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. కాబట్టి అప్పటి వారిలో, ఇప్పడు ఉన్నంత సమస్యలు ఉండేవి కావు. అలాగే తరాలు మారే కొద్దీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జన్యువులలో కూడా మెల్లగా మార్పులు వచ్చి, తద్వారా పుట్టబోయే పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు మీ వారికి అర్థం అయ్యేటట్లు వివరించి, నీ చదువు పూర్తి చేసుకొని 21 సం.రాలకు పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చు.
-డా.వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment