
పదిహేనేళ్లకే పెళ్లయి, ఇరవైఏళ్ల కల్లా బిడ్డలు పుట్టి, ట్యూబెక్టమీ అయిపోతే గర్భసంచి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా?
– కె. రాధ, మంచిర్యాల్
మీరు చెప్పే గర్భసంచి కేన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అనేది 80 శాతం మందిలో హ్యూమన్ పాపిలోమాలోని కొన్ని రకాల వైరస్ జాతుల వల్ల వస్తుంది. హెచ్‌పీవీ వైరస్ కలయిక వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ హెచ్‌పీవీ లో కొన్ని హైరిస్క్ జాతులు (హెచ్‌పీవీ 16, 18 వంటివి) ఎక్కువ కాలం పాటు గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉన్నప్పుడు అవి సెర్విక్స్‌లోని కణాల్లో అనేక మార్పులను కలుగజేయడం వల్ల అధికంగా వృద్ధి చెందుతూ చాలా సంవత్సరాలకు (10 సం. పైన) క్యాన్సర్ కణాలుగా మారడం జరుగుతాయి. ఈ వైరస్ చాలా మందిలో ఉన్నా వారి రోగనిరోధక శక్తిని బట్టి, వారి జన్యువులను బట్టి కేవలం ఇన్‌ఫెక్షన్ లేదా కొద్దిపాటి మార్పులతో నశించిపోతాయి. కాని కొందరిలో అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో, 15 సంవత్సరాలకే కలయికలో పాల్గొనడం వల్ల, అలాగే చిన్న వయసుకే పిల్లలు పుట్టడం వల్ల, ఎక్కువ మంది పిల్లలను కనడం వల్ల, పొగతాగడం వంటి అనేక అంశాల వల్ల, వీరిలో సెర్వైకల్ కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వీరిలో హైరిస్క్ హెచ్‌పీవీ వైరస్ సెర్వెకల్ కణాల్లో క్యాన్సర్ మార్పులను ఎక్కువగా కలుగజేయడం జరుగుతుంది. ఈ కణాల్లో మార్పులను ముందుగా తెలుసుకోవడానికి ప్యాప్‌స్మియర్ అనే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షను చేయించుకోవడం మంచిది. ఇందులో సెర్విక్స్ దగ్గర కణాలను (ద్రవాలను) చిన్న బ్రష్ ద్వారా తీయడం జరుగుతుంది. మొదటి కలయిక తర్వాత నుంచి ప్యాప్‌స్మియర్ పరీక్షను 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలో సెర్వైకల్ క్యాన్సర్ వచ్చే పది సంవత్సరాల ముందు నుంచే సర్వైకల్ కణాల్లో మార్పులను తెలుసుకోవచ్చు.
నాకు ఇరవైరెండేళ్లు. రెండేళ్ల కిందట పెళ్లయింది. ఈ మధ్యే నెల తప్పాను. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకొని అబార్షన్ మాత్రలు వాడాను. దాదాపు నలభై రోజుల దాకా బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ ఆగిపోయే దశలో రక్తస్రావం నల్లగా అయింది. ఇప్పుడు అంతా మామూలైపోయి.. ఎప్పటిలాగే మళ్లీ పీరియడ్స్ కూడా వచ్చాయి. అయితే మేడం.. ఇప్పుడు నాకు పూర్తిగా అబార్షన్ అయిపోయినట్టే కదా? ప్రెగ్నెన్సీ నిలబడే చాన్స్ లేదు కదా? ఇంటర్‌కోర్స్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే చాన్స్ అయితే ఉండదు కదా? ఒకవేళ భవిష్యత్‌లో నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఈ అబార్షన్ వల్ల పుట్టబోయే బిడ్డకు, నాకు ఏమైనా సైడ్ ఎఫెక్టŠస్ ఉంటాయా? రక్తస్రావం నల్లగా ఎందుకైందంటారు? హిమోగ్లోబిన్ కూడా నాకు 10.5 వరకూ ఉంది మేడమ్.. దయచేసి నా సందేహాలకు జవాబు చెప్పగలరు.
– ఇ– మెయిల్ ద్వారా అందిన ప్రశ్న.
గర్భం దాల్చిన తర్వాత, గర్భం వద్దని అబార్షన్ అవ్వడం కోసం అనేక పద్ధతులు ఉంటాయి. మందుల ద్వారా లేదా డి అండ్ సి ద్వారా మత్తు ఇచ్చి గర్భాశయం నుంచి గర్భాన్ని తీసివేయడం. ఒకటి గర్భం 7 వారాల లోపల ఉంటే (చివరగా పీరియడ్ వచ్చినప్పటి నుంచి లెక్కపెట్టాలి) అబార్షన్ మందులయిన మిషిప్రిస్టోన్, మిసోప్రొస్టాల్ ద్వారా ప్రయత్నించడం. ఇందులో 95 శాతం బ్లీడింగ్ ద్వారా అబార్షన్, కొంచెం కడుపులో నొప్పితో అయిపోతుంది. 45 శాతం మందిలో కొన్ని ముక్కలు ఉండి పోవచ్చు. 1 శాతంలో బ్లీడింగ్ అయినా ప్రెగ్నెన్సీ (గర్భంలో శిశువు) పెరగవచ్చు. కాబట్టి గర్భ నిర్ధారణ అయిన తర్వాత గర్భం వద్దనుకుంటే మొదట గర్భం గర్భాశయంలో ఉందా లేదా, ట్యూబ్‌లో ఉందా, ఉంటే ఎన్ని వారాలు ఉంది అని డాక్టర్‌ను సంప్రదించి స్కానింగ్ ద్వారా నిర్ధారణ చేసుకొని గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో అబార్షన్ మందులు వాడటం అన్ని విధాలా మంచిది.
మందులు వాడిన పది పదిహేను రోజులకు గర్భాశయంలో ముక్కలేవీ మిగలకుండా పూర్తిగా అబార్షన్ అయిపోయిందా లేదా అని మరలా స్కానింగ్ చేయించుకోవడం మంచిది. చాలా మంది సొంతంగా అబార్షన్ మందులు మెడికల్ షాపులో తీసుకొని వాడుకొని, ముందు, తర్వాత స్కానింగ్ చేయించుకోకుండా, ఎక్కువ నొప్పి, బ్లీడింగ్‌తో ఇబ్బంది పడటం, రక్తహీనత ఏర్పడటం, కొంత మందిలో ముక్కలు ఉండిపోయి ఇన్‌ఫెక్షన్‌లు రావడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ఇబ్బందికరమైన పరిస్థితులతో ప్రాణాలపైకి తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమందిలో బ్లీడింగ్ అయినా కాని అబార్షన్ సరిగా అవ్వకుండా శిశువు పెరిగే అవకాశం ఉంటుంది. మీకు 40 రోజులు బ్లీడింగ్ అయ్యింది. రక్తం లోపల చాలా రోజులు ఉండిపోయి చివరలో రంగు మారి నల్లగా రావుచ్చు. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి స్కానింగ్ చేయించుకొని గర్భాశయంలో ఏమైనా ముక్కలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. ఈ అబార్షన్ మొత్తంగా అయిపోయి, ఏ ఇన్‌ఫెక్షన్ లేకుండా ఉంటే, మళ్లీ పుట్టబోయే బిడ్డకు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
-డా.వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment