నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్‌లో కూడా ఏ పనిమీదా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా?
– పల్లవి, మచిలీపట్నం
మీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందికి నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి.
పీఎంఎస్‌కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్‌స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్‌స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి.
చదవండి: (వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులు...)
ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్‌ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది. అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.
నా వయసు 67 సంవత్సరాలు. పదిహేను రోజులుగా నాకు మళ్లీ నెలసరి కనిపిస్తోంది. దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా? నేను హాస్పిటల్‌కి వెళ్లి, డాక్టర్‌కు చూపించుకోవలసి ఉంటుందా?
– శ్యామల, భీమవరం
నెలసరి నిలిచిపోయిన తర్వాత మళ్లీ స్పాటింగ్, బ్లీడింగ్ కనిపించడం ప్రమాదకరం. మీరు వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి. దీనిని ‘పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. నెలసరి ఆగిపోయిన తర్వాత యోని లోపలిపొర పల్చగా మారడం వల్ల బ్లీడింగ్ కావచ్చు. చాలా అరుదుగా పదిమందిలో ఒకరికి క్యాన్సర్ మార్పులు చోటు చేసుకోవచ్చు. మీరు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదిస్తే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, పాప్‌స్మియర్, బయాప్సీ వంటి అవసరమైన పరీక్షలు చేసి, సమస్యకు గల కారణాన్ని కనిపెడతారు. ఈ పరీక్షలన్నీ ఔట్‌పేషెంట్‌గానే చేయించుకోవచ్చు. చాలాసందర్భాల్లో ‘ఈస్ట్రోజన్ వజైనల్ క్రీమ్’లాంటివి సూచిస్తారు. అంతకుమించి చికిత్స అవసరం ఉండదు. అరుదుగా మాత్రమే, క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలు ఉంటే, పరిస్థితిని బట్టి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.
డా. భావన కాసు
గైనకాలజిస్ట్ & అబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment