సాక్షి, హైదరాబాద్: నిండు చూలాలి దయనీయతను ప్రభుత్వాస్పత్రుల్లో చూడాలి! పురిటినొప్పులతో వస్తున్న గర్భిణులకు ఎంత కష్టం.. ఎంత నష్టం! కడుపు పండిందని వస్తే.. వైద్యుల వైఖరి చూస్తే వారికి కడుపుమండుతోంది!. ప్రసవ వేదన తప్పడం లేదు. ప్రతిష్టాత్మక పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిసహా మలక్‌పేట్, కొండాపూర్, సూరజ్‌భాను ఏరియా ఆస్పత్రుల్లో ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆయా ఆస్పత్రులకు వచ్చినవారిని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే వారికి చేదు అనుభవమే ఎదురవుతోంది. వైద్యుల నిష్పత్తికి మించి గర్భిణులు వస్తుండటంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. తాజాగా శుక్రవారం పలువురు గర్భిణులు ఇదే అంశంపై ఆందోళనకు దిగడం గమనార్హం. గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో ఆరు యూనిట్లు ఉండగా, కోవిడ్ బారిన పడిన గర్భిణులకు చికిత్స అందించేందుకు రెండు యూనిట్లను కేటాయించారు. మిగిలిన నాలుగు యూనిట్లను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి సెంటర్‌కు మార్చారు. కింగ్ కోఠిలోని గైనకాలజీ విభాగాన్ని కూడా ఇక్కడికే మార్చారు. పేట్లబురుజు ఆస్పత్రిలోని సీనియర్ వైద్యులు సహా పీజీలు, ఇతర పారామెడికల్ స్టాఫ్ ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆ ఆస్పత్రిలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు సహా పలు సేవలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో గర్భిణులు సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి క్యూ కట్టారు. (కరోనా కేళి.. జేబులు ఖాళీ!)
గర్భిణులను చేర్చుకోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి
నగర శివారు ప్రాంతాల్లో కాకుండా జిల్లాల నుంచి వచ్చే గర్భిణులు, వారి సంబంధీకులు శుక్రవారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. కొత్తగా వచ్చే గర్భిణులకు వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరిస్తుండడంతో వైద్యులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం తెలుసుకున్న స్థానిక సుల్తాన్‌బజార్ పోలీసులు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. వివిధ ఆసుపత్రుల నుంచి వందల సంఖ్యల్లో కేసులు వస్తుండడంతో తమపై పనిభారం అధికమవుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 9 నెలలు నిండిన గర్భిణులకు మాత్రమే ఇక్కడ వైద్యం చేస్తున్నారు. కొత్తగా వచ్చినవారికి మాతా శిశు సంరక్షణ కార్డు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో ఆందోళన మొదలైంది.
ఏ ప్రసూతి ఆస్పత్రిలో ఎంతమంది?
పాతబస్తీ శాలిబండ ప్రభుత్వ సూరజ్‌భాను ప్రసూతి ఆస్పత్రిలో ఇప్పటి వరకు 17 మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. ఇక్కడ రోజుకు సగటున రెండు, మూడు ప్రసవాలు జరుగుతుంటాయి. సిబ్బంది అంతా వైరస్ బారిన పడటంతో సాధారణ చెకప్‌లకు వచ్చే కొత్త గర్భిణులకు సేవలు నిలిపివేశారు. ఇప్పటికే కార్డు ఉన్నవారికి మాత్రమే ఇక్కడ చికిత్సలు అందిస్తున్నారు.
పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇప్పటి వరకు 32 మంది వైద్యులు, పీజీలు, ఇతర సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అక్కడ కొత్త ఓపీ రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. గతంలో రోజుకు సగటున 50 నుంచి 60 ప్రసవాలు జరిగేవి. ప్రస్తుతం ఇక్కడ 10 నుంచి 15 ప్రసవాలే జరుగుతున్నాయి.
మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో సుమారు పదిహేను మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. ఆస్పత్రిలో ఏడుగురు గైనకాలజిస్టులు ఉండగా వీరిలో నలుగురు వైరస్‌తో బాధపడుతున్నారు. దీంతో గైనికి ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఇప్పటికే డెలివరీకి డేట్ ఇచ్చిన గర్భిణులను మాత్రమే చేర్చుకుంటున్నారు.
కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో పదిహేను మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకడంతో ఓపీ సేవలను నిలిపివేసి సుల్తాన్ బజార్ ప్రసూతి కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు.
సరూర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యురాలు ఇప్పటికే కోవిడ్ బారిన పడ్డారు. ఇక్కడ గర్భిణులకే కాదు సాధారణ రోగులకు కూడా చికిత్స అందని దుస్థితి నెలకొంది.
చిన్న, చిన్న సాకులు చెప్పి పంపించి వేస్తున్నారు
నగర శివారు ప్రాంతమైన కొంగర కలాన్ నుంచి ఎంతో అవస్థలు పడి సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చాను. వైద్యులు నాకు రక్తం లేదని చిన్న చిన్న కారణాలు చెప్పి పంపించి వేస్తున్నారు. కొత్త కార్డులు సైతం ఇవ్వడం లేదు. ఆసుపత్రి వైద్యులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలి.
– దివ్య (కొంగర కలాన్)
ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు చేసుకోలేం
మాది చాలా పేద కుటుంబం కాన్పు కోసం లక్షల రూపాయలు పెట్టి ప్రవేటు ఆసుపత్రుల్లో కాన్పు చేసుకునే స్తోమత లేదు. అందుకని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వస్తే ఇక్కడి వైద్యులు సైతం వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వైద్యులపై చర్యలు తీసుకోవాలి.
–యాదమ్మ (వనస్థలిపురం)
Comments
Please login to add a commentAdd a comment