ప్రతీకాత్మక చిత్రం
Pregnancy Tips: మేడమ్.. నాకిప్పుడు రెండో నెల. తొలి చూలప్పుడు అయిదో నెల వరకు వేవిళ్లతో బాధపడ్డాను. నాలుగు సార్లు ఆసుపత్రిలో జాయిన్ కావాల్సివచ్చింది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా? చాలా భయంగా ఉంది.
– ఎస్. మధులిక, బళ్లారి
ప్రెగ్నెన్సీలో మూడవ నెలలోపు వాంతులుండడం సర్వసాధారణం. కానీ వందలో ఒకరికి మాత్రం వాంతులు ఎక్కువై ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. దీనిని హైపర్‌మెసిస్ అంటారు. ఇది గర్భం దాల్చినప్పుడల్లా రిపీట్ అవ్వాలని ఏమీ లేదు. కొంచెం వాంతులు ఉన్నప్పుడే సరైన చికిత్స తీసుకుంటే ఇబ్బంది ఉండదు. డీహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్‌ఫెక్షన్స్ వస్తుంటాయి.
కొంతమందిలో 20వ వారం వరకూ వాంతులు అవుతుంటాయి ఎక్కువగా. మందులు వేసుకునే మందు, ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకుంటూండడం, వాంతి వచ్చేట్టుగా అనిపించే, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం, వాసనలకు దూరంగా ఉండడం, ఎండు ఉసిరి, శొంఠి ముక్కలను చప్పరించడం వంటివాటి వల్ల వాంతుల నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు.
మీరు డాక్టర్‌ను కలసినప్పుడు మీకు థైరాయిడ్ , ఎలక్ట్రోలైట్స్, లివర్ టెస్ట్‌లు, హీమోగ్లోబిన్ పరీక్షలు చేస్తారు. వీటిలో ఏదైనా అబ్‌నార్మల్‌గా ఉంటే ఆసుపత్రిలో చేరాల్సివస్తుంది. లేదంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్, మాత్రలతో మేనేజ్ చేయవచ్చు. ఐరన్, కాల్షియం మాత్రలను అయిదవ నెలలో మొదలుపెడతారు. వాటితో ఎసిడిటీ, వాంతులు ఎక్కువవుతాయి. చాలామందికి మాత్రలతోనే కంట్రోల్ అవుతుంది.
నాకు 65 ఏళ్లండి. దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది. చాలా అసౌకర్యంగా ఉంటోంది. పదిమంది మాట దేవుడెరుగు.. కుటుంబ సభ్యులతో కలసి కూర్చొని సరదాగా గడపాలన్నా ఇబ్బందిపడుతున్నాను. దీనికి ట్రీట్‌మెంట్ ఏమైనా ఉందా? దయచేసి చెప్పగలరు.
– శ్రీదేవి కొప్పుల, అవిడి, తూర్పుగోదావరి జిల్లా
మీ సమస్యను యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటారు. వందలో యాభైమంది సిగ్గుగా ఫీలై డాక్టర్‌కు చూపించుకోవడానికి వెనకాడుతారు. కానీ త్వరగా చికిత్స తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఈ సమస్యలో పొట్ట మీద కొంచెం ఒత్తిడి పడితే చాలు మూత్రం పడుతుంది. దగ్గినా, తుమ్మినా, మలబద్ధకం ఉన్నా, వ్యాయామం చేసినా, వేగంగా నడిచినా నియంత్రణ తప్పి మూత్రం పడుతుంది.
పెల్విక్ ఫ్లోర్‌లోని కండరాలు వదులైపోయి నప్పుడు ఇలా అవుతూంటుంది. చాలా మందికి సుఖ ప్రసవం తర్వాత ఈ సమస్య వస్తుంది. కెజెల్స్ ఎక్సర్‌సైజెస్ అని పొత్తి కడుపులో, పెల్విక్ ఫ్లోర్‌లోని కండరాలను బిగుతు చేసే వ్యాయామాన్ని ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే.. మిమ్మల్ని పరీక్షించి.. తన పర్యవేక్షణలో ఆ వ్యాయామాలను మీకు నేర్పిస్తారు.
వెజైనల్ పెసరీ అనే రింగ్‌ను యోనిలో పెడతారు. దీనితో అలా నియంత్రణ లేకుండా మూత్రం పడడం తగ్గుతుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. పైన చెప్పినవేవీ పనిచేయనప్పుడు సర్జరీ అవసరం పడుతుంది.
యూరిన్ కల్చర్, సుగర్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలి. యూరోడైనమిక్ స్టడీస్ అని యూరినరీ ఫ్లో ఎలా ఉందని చెప్పే అడ్వాన్స్‌డ్ టెస్ట్స్ కొంతమందికి అసవరం పడొచ్చు. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే యోనిలో అల్సర్స్, యూరినరీ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. కనుక ఆసల్యం చేయకుండా మీరు డాక్టర్‌ను సంప్రదించండి.
నాకు పెళ్లయి సంవత్సరం అవుతోంది. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయాలనుకుంటున్నాం. దీనికి ముందుగా ఏమైనా టెస్ట్స్ చేయించుకోవాలా?
– సీహెచ్‌వీకే సత్య, మచిలీపట్టణం
ప్రికన్సెప్షన్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే కొన్ని నెలల ముందు నుంచి తీసుకునే జాగ్రత్తలని అర్థం. ఈరోజుల్లో పెళ్లయిన వెంటనే చాలామంది గైనకాలజిస్ట్‌ను సంప్రదించి ప్రెగ్నెన్సీని వాళ్లు ఎప్పుడు, ఎలా ప్లాన్ చేయాలో కనుక్కుంటున్నారు. తగిన జాగ్రత్తలను ముందే తీసుకుంటే ఆరోగ్యకరమైన గర్భధారణ, పండంటి బిడ్డను కనే అవకాశాలు పెరుగుతాయి.
ఫోలిక్ యాసిడ్ 5ఎమ్‌జీ డోస్‌ను కనీసం గర్భధారణకు నెల ముందు నుంచి తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు స్పైన్, బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. మీకు కానీ, మీ కుటుంబంలో ఎవరికయినా బీపీ, సుగర్, థైరాయిడ్, ఆస్తమా, ఫిట్స్ వంటివి ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పరీక్షలు మీకు చేస్తారు. అవి సరిగ్గా నియంత్రణలో ఉండేట్టు మందులు ఇస్తారు.
కొన్ని వ్యాక్సిన్స్‌ను ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు. ముందే తీసుకోవాలి. రుబెల్లా, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్స్‌ను ప్రెగ్నెన్సీకి కనీసం ఒకటి నుంచి మూడు నెలల ముందు తీసుకుంటే.. ఈ కండిషన్ వల్ల పొట్టలో బిడ్డ మీద దుష్ప్రభావం ఉండదు. మీరు ఏవైనా పెయిన్ కిల్లర్స్, హెర్బల్ మెడిసిన్స్ తీసుకుంటున్నట్లయితే డాక్టర్‌కు ముందే చెప్పాలి. కొన్నిటిని ప్రెగ్నెన్సీ కన్నా ముందే ఆపేయాల్సి ఉంటుంది.
ఆహారంలో కొన్ని రకాల చేపలను తీసుకోకూడదు. ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో డాక్టర్ సూచిస్తారు. మీ బరువును బీఎమ్‌ఐ ద్వారా గణించి ఎక్కువ బరువు ఉంటే దానికి అనుగుణమైన డైట్‌ను, వ్యాయామాన్ని సూచిస్తారు. అధిక బరువు వల్ల ప్రెగ్నెన్సీ సమస్యలు, పుట్టబోయే బిడ్డకూ సమస్యలు ఎక్కువ. బీఎమ్‌ఐ 25లోపు ఉంటే మంచిది. మీ భర్త తరపు కుటుంబంలో, మీ కుటుంబంలో ఏవైనా జన్యుపరమైన సమస్యలు ఉంటే జెనెటిక్ కౌన్సెలర్‌ను తప్పకుండా సంప్రదించాలి.
ప్రెగ్నెన్సీలో రిస్క్ కేటగరీ గురించి కౌన్సెలింగ్ చేస్తారు. మీరు ఏమైనా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నట్టయితే వాటిని ఎప్పుడు ఆపేయాలో చెప్తారు. ఇంతకు ముందు మీకు ఏమైనా యూరిన్, వెజైనల్ ఇన్‌ఫెక్షన్స్ ఉంటే ఆ విషయాన్ని డాక్టర్‌తో చెప్పాలి. అవసరమైతే స్కానింగ్ చేస్తారు. మీరు, మీ భర్త ప్రికన్సెప్షన్ కేర్ కౌన్సెలింగ్ అటెండ్ అయితే ఈ విధమైన జాగ్రత్తలు చెప్తారు.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
చదవండి: Gynecology: నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్.. ఇదేమైనా ప్రమాదమా?
Comments
Please login to add a commentAdd a comment